సికింద్రాబాద్ లోనే మిలియన్ మార్చ్: అశోక్బాబు | Will go for Million March if Center don't rethink on bifurcation, threatens Ashok babu | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ లోనే మిలియన్ మార్చ్: అశోక్బాబు

Published Sat, Sep 7 2013 8:30 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

సికింద్రాబాద్ లోనే మిలియన్ మార్చ్: అశోక్బాబు - Sakshi

సికింద్రాబాద్ లోనే మిలియన్ మార్చ్: అశోక్బాబు

రాష్ట్ర విభజనపై కేంద్రం పునరాలోచన చేయని పక్షంలో సికింద్రాబాద్ లోనే తాము మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు  హెచ్చరించారు. ఏపి ఎన్జీఓల ఆధ్వర్యంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఎల్బి స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. విభజన సమస్య రాజకీయ నాయకులకు మాత్రమే సంబంధించింది కాదని చెప్పారు.  రాష్ట్రం విడిపోతే విద్యార్థులు, ఉద్యోగులు, ఆర్టీసీ... ఇలా అన్ని వర్గాలకూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అత్యున్నత విద్యా అవకాశాలు ఉన్న హైదరాబాద్‌ను ఎలా వదులుకుంటామని ఆయన అడిగారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. 50 ఏళ్లు భార్యభర్తల్లా తెలంగాణ సీమాంధ్ర కలిసి ఉన్నాయి. వారిద్దరికి పుట్టిన కొడుకే హైదరాబాద్. ప్రతిఫలం చేతికందే సమయంలో కొడుకు నా వాడే అంటే తండ్రి పరిస్థితేంటీ? అని ప్రశ్నించారు.

రాష్ట్రం కలిసుండాలా? విడిపోవాలా? నిర్ణయించేది రాజకీయ నాయకులు కాదని,  ప్రజలేనన్నారు.  50ఏళ్లుగా హైదరాబాద్‌తో అనుబంధం పెంచుకొని ఇప్పుడు అర్థాంతరంగా వెళ్లమంటే ఎక్కడకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. సీడబ్లూసీ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాఅభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లిన పార్టీలకు మనుగడ ఉండదనే విషయం గతంలో ఎన్నో పరిణామాలు నిరూపించాయని ఆశోక్‌బాబు వివరించారు. సమ్మె ఎంతకాలం ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు.  జై ఆంధ్ర ఉద్యమ సమయంలో 108 రోజులు సమ్మె చేశామని గుర్తు చేశారు.

తాము ఢిల్లీ వెళ్లినప్పుడు ఎంపిలను ఎన్నో రకాలుగా వేడుకున్నట్లు తెలిపారు. పదవులకు రాజీనామా చేయండి, మిమ్మల్ని మేం గెలిపించుకుంటామని చెప్పామన్నారు. మీరు రాజీనామా చేయకపోతే ఉద్యమం ఉధృతమవుతుందని కూడా చెప్పినట్లు తెలిపారు.  ప్రజల అంగీకారంలేకుండా రాష్ట్రాన్ని ఎవరూ విడగొట్టలేరని కొన్ని జాతీయ పార్టీల నేతలు చెప్పారన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తి లేదన్నారు.

ప్రజలు ఎన్నుకొన్న నాయకులు పాలించడానికే తప్ప, విభజించడానికి కాదన్నారు. అయిదారు పార్టీల నిర్ణయంతో రాష్ట్రాన్ని విభజించలేరని పేర్కొన్నారు. సిడబ్ల్యూసి  నిర్ణయాన్ని ఉద్యోగులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. చరిత్రలో గొప్ప నేతలు చెప్పిన విషయాలను వక్రీకరిస్తున్నారన్నారు. ఇష్టం లేకుంటే విడిపోవచ్చంటూ కొత్త వాదన తెరమీదికి తెస్తున్నారని, ఇది నిజం కాదన్నారు.

స్టేడియం లోపల ఎంత మంది ఉన్నారో బయట కూడా అంతే సంఖ్యలో ఉన్నారని చెప్పారు. తాము తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదని అశోక్ బాబు స్సష్టం చేశారు. ఏడు లక్షల మంది ఉద్యోగులు ఉద్యమంలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని 50లక్షల మంది సెటిలర్లలో మూడు ప్రాంతాల వారున్నారని చెప్పారు. 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంకంటే ఎక్కువగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement