హైదరాబాదులో మిలియన్ మార్చ్: అశోక్బాబు
విశాఖపట్టణం: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు నవంబర్ రెండవ వారంలో జాతీయ నేతలతో కలవనున్నట్టు సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక రాష్ర్ట అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు తెలిపారు. పార్లమెంటుకు విభజన బిల్లు వస్తే హైదరాబాదులో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. ఏపీఎన్జీవోల ఉద్యమం పట్ల ప్రజల్లో అపోహలు ఉన్నాయని, ఇవి తాత్కాలికం మాత్రమే అన్నారు. విశాఖపట్టణంలో ఎన్జీవో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. నవంబర్ 25 నుంచి ప్రజలతో కలిసి మళ్లీ ఉద్యమిస్తామని వెల్లడించారు.
ఈనెల 23న అన్ని మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, 24న లంచ్ అవర్ డిమాన్‌స్ట్రేషన్లు, 25న రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులపై సమైక్య నినాదాలతో కూడిన పోస్టర్లు, స్టిక్కర్లు అతికించడం, 26న ప్రజలతో కలిసి ప్రదర్శనలు, 27ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ జాతీయ రహదారుల దిగ్బంధం, 28న రిలే దీక్షలు, 29న సైకిల్, మోటార్ సైకిల్ ర్యాలీలు, 30న మానవహారాలు, 31న లంచ్ అవర్ డిమాన్‌స్ట్రేషన్లు నిర్వహించనున్నామన్నారు. నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని, 2,3,4 తేదీల్లో రైతు సదస్సులు, 5న మళ్లీ లంచ్ అవర్ డిమాన్‌స్ట్రేషన్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.