Paruchuri ashok babu
-
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ట్యాంపరింగ్.. బీ'కామ్'గా మార్చేశాడు
సాక్షి, అమరావతి: ఫోర్జరీ విద్యార్హత సర్టిఫికెట్తో వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం పొంది ప్రభుత్వాన్ని మోసం చేసిన టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. రికార్డులను ట్యాంపర్ చేయడమే కాకుండా ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేస్తూ సమర్పించిన అఫిడవిట్లోనూ ఆయన తప్పుడు విద్యార్హతను పేర్కొన్నారు. ఈయన విద్యార్హతపై అభ్యంతరాలు తెలుపుతూ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటం చివరికి ఫలించింది. గతంలో సాక్ష్యాధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదులను టీడీపీ సర్కారు బుట్టదాఖలు చేసింది. అంతేకాదు.. అశోక్‌బాబును ఎమ్మెల్సీగా చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం ఇచ్చింది. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బి. మెహర్‌కుమార్ లోకాయుక్తను ఆశ్రయించడంతో ఆయన బండారం బట్టబయలైంది. లోకాయుక్త ఆదేశాలతో అశోక్‌బాబుపై సెక్షన్–477ఎ, 465, 420 కింద సీఐడీ అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు. సర్వీసు రిజిస్టర్లో ట్యాంపర్ చేసింది ఇలా.. నిజానికి.. వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీఓగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన అశోక్‌బాబు విద్యార్హత ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా ఉంది. లోకాయుక్తలో వేసిన కేసులోని వివరాల ప్రకారం.. అశోక్‌బాబు డి.కాం (డిప్లమో ఇన్ కంప్యూటర్స్) చేశారు. ఆ అర్హతతో వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి సీనియర్ అసిస్టెంట్ అయ్యారు. అనంతరం ఆయన కమిషనర్ కార్యాలయంలో పోస్టింగ్‌పై కన్నేశారు. కానీ, అక్కడ పోస్టింగ్ పొందాలంటే డిగ్రీ విద్యార్హత తప్పనిసరి. దాంతో తన సర్వీసు రిజిస్టర్‌లోని విద్యార్హత కాలమ్‌లో ఉన్న డీ.కాం.ను ట్యాంపర్ చేసి బీ.కాం.గా దిద్ది బురిడీ కొట్టించారు. ఇంగ్లీష్ అక్షరం ‘డీ’ని ట్యాంపర్ చేసి ‘బీ’గా మార్చారు. ఆ విధంగా తప్పుడు సమాచారంతో ఆయన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగం పొంది ప్రభుత్వాన్ని మోసం చేశారు. దీనిపై ఆ శాఖకు చెందిన పలువురు ఉద్యోగులు అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేశారు. కానీ, టీడీపీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. ఫలితంగా ఆ కేసులు సుదీర్ఘకాలం పెండింగ్‌లోనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద పదవీ విరమణ ఉద్యోగ సంఘం నేతగా ఉన్న అశోక్‌బాబు సహచర ఉద్యోగుల ప్రయోజనాలకంటే టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారన్నది బహిరంగ రహస్యం. 2013–14లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడమే కాకుండా 2014 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే 2018లో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో టీడీపీ మద్ద్దతు ఇచ్చిన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఇక అదే ఏడాదిలో నాటి సీఎం చంద్రబాబు ఆయనకు టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో అశోక్‌బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. తనపై ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేవని ఆ దరఖాస్తులో పేర్కొన్నారు. కానీ, విద్యార్హత విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఫిర్యాదుకు సంబంధించిన కేసు అప్పటికే పెండింగ్‌లో ఉంది. దీనివల్ల స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ప్రభుత్వం అనుమతించకూడదు. కానీ, అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద అశోక్‌బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ఆమోదం తెలిపారు. ఎమ్మెల్సీ అఫిడవిట్లోనూ అసత్యాలే.. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేస్తూ సమర్పించిన అఫిడవిట్లోనూ అశోక్‌బాబు అసత్య సమాచారాన్నే పేర్కొన్నారు. తన విద్యార్హత బి.కాం.గా పేర్కొన్నారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సమయంలో తనపై కేసులు పెండింగ్‌లో లేవన్న ఆయన.. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు సమయంలో మాత్రం తనపై పెండింగ్‌లో ఉన్న కేసులను చెప్పడం గమనార్హం. దీంతో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆయన అఫిడవిట్ దాఖలు చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. లోకాయుక్త ఆదేశాలతో కదిలిన డొంక ఈ నేపథ్యంలో.. బి. మెహర్‌కుమార్ ఫిర్యాదుతో వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం నుంచి లోకాయుక్త సమాచారం తెప్పించుకుని పరిశీలించింది. సమగ్రంగా విచారించేందుకు ఈ కేసును సీఐడీకి అప్పగించాలని 2021 ఆగస్టులోనే ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా అశోక్‌బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం కల్పించిన అధికారులపై కూడా విచారించాలని పేర్కొంది. ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు నివేదించాలని కోరింది. లోకాయుక్త ఆదేశాలతో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఆ శాఖ జాయింట్ కమిషనర్ గీతా మాధురి ఈ అంశంపై అధికారికంగా సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. లోకాయుక్త తీర్పును అనుసరించి పూర్తి సాక్ష్యాధారాలతో సీఐడీ కేసు నమోదు చేయడంతో ఈ కేసులో పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. -
ఉద్యోగుల కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలి
నగరంపాలెం(గుంటూరు) : రాష్ట్రంలో ఉద్యోగులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పరుచూరి ఆశోక్ బాబు డిమాండ్ చేశారు. గుంటూరులోని ఏపీఎన్జీఓ కల్యాణమండపంలో శుక్రవారం జరిగిన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్లు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.జనవరి 2015 నాటికి ఎరియర్స్ ఉన్న 3.1144 శాతం డీఏ ను వెంటనే చెల్లించాలన్నారు. గ్రాట్యుటీ, అర్ధసెలవు క్యాష్మెంట్ను వెంటనే అమలు చేయాలన్నారు. పెన్షనర్స్‌కు 10 సంత్సరాల అదనపు పెన్షన్ చెల్లించాలన్నారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర జేఏసీ జనరల్ సెక్రటరీ ఐవీరావు మాట్లాడుతూ దేశంలోకి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించే కారణంతో కార్మిక చట్టాలను సవరణ చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. సమావేశంలో పాల్గొన్న పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆధ్యక్షుడు సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం అమలు చేస్తున్న కాంట్రిబ్యూషన్ విధానాన్ని రద్దుచేసి, పాత పద్ధతిలో పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎన్జీవో సంఘ ఉపాధ్యక్షుడు బాసిత్, గుంటూరు జిల్లా జేఏసీ కార్యదర్శి దయానందరాజు, ఒంగోలు జేఏసీ చైర్మన్ బండి శ్రీను, నెల్లూరు జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్, సెక్రటరీ రమణారెడ్డి, కృష్ణాజిల్లా జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, మహిళల విభాగం కన్వీనర్ రోజ్‌రాణి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్స్ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. -
'తెలంగాణలో ఆంధ్ర ఉద్యోగులు ద్వితీయ శ్రేణి పౌరులు'
వైవీయూ(వైఎస్కార్ జిల్లా): తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా ఉద్యోగులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఏపీ ఎన్జీఓల అసోసియేషన్ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు అన్నారు. కడప ఎన్జీఓల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం, వారి ఉద్యోగులు సోదర భావంతో వ్యవహరించడం లేదన్నారు. ఏపీఎన్జీఓల కార్యాలయంపై దాడులు చేసిన సమయంలో అక్కడి ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. దీనిపై గవర్నర్‌ను కలిసినా ఫలితం లేదని తెలిపారు. ఏడు నెలలుగా కొందరు ఉద్యోగులకు వేతనాలు సైతం ఇవ్వకుండా ఆ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వీటిపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. శాంతిభద్రతల సమస్య అంటే కేవలం హత్యలు, మాన భంగాలేనా.. ఉద్యోగులపై వివక్ష శాంతిభద్రతల సమస్య కాదా అని ప్రశ్నించారు. అనివార్య కారణాల వల్ల పీఆర్సీ నూతన వేతనాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. -
రాజధాని ఎక్కడో తేలాకే విరాళాలివ్వండి
అనంతపురం: రాజధాని నిర్మాణానికి కొన్ని సంఘాలు విరాళాలు ఇస్తున్నాయని, అయితే రాజధాని ఎక్కడో నిర్ణయించిన తరువాత ఇస్తే బాగుంటుందని ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు సూచించారు. ఎన్జీవోల ఒకరోజు వేతనాన్ని రాజధాని కోసం ఇవ్వాలని తొలుత నిర్ణయించామని, అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న విషయం ఇంకా నిర్ధారణ కానందున ఆ మొత్తాన్ని లోటు బడ్జెట్ ఉన్న పింఛన్లు, ఆరోగ్యశ్రీ తదితర పథకాలకు వాడుకోవాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని కోరారు. ‘ఉద్యోగులకు వయోపరిమితి 60 ఏళ్లకు పొడిగించారు. అయితే.. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి అది వర్తించడం లేదు. రాష్ట్ర విభజన జరిగినా ఇంకా ప్రభుత్వరంగ సంస్థలు కలిసే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థలు విడిపోయేందుకు మరో ఏడాది పట్టేలా ఉంది. ప్రభుత్వం త్వరగా వారికి కూడా 60 ఏళ్లు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆర్థికంగా చితికిపోతూ, మానసిక వేదనతో ఉద్యోగం చేస్తున్నారని, వారికి కొంత టైం స్కేల్ ఇస్తే మనస్ఫూర్తిగా పనిచేస్తారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. ప్రస్తుతమున్న వారందరినీ రెగ్యులరైజ్ చేసి.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే 2/1994 చట్టాన్ని మార్చాలన్నారు. ఆగస్టు 15 కల్లా హెల్త్‌కార్డులు అందజేస్తామని ప్రభుత్వం చెబుతోందని, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చనిపోయేంతవరకు వర్తింపజేసేలా వాటిని ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్థిక మంత్రులను కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగులకు ఒకే పీఆర్సీ ఇస్తే బాగుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారంటూ ఆ రాష్ట్ర సీఎస్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించగా.. నక్కను చూసి పులి భయపడినట్లుందని ఎద్దేవా చేశారు. వారిని వేధిస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సీఎస్‌కు విన్నవించుకుంటే ఉపయోగంగానీ.. తెలంగాణ సీఎస్‌కు చెప్పుకోవడమేమిటని ప్రశ్నించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలన్నారు. ఉన్నపళంగా వారిని తొలగిస్తే కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
'తెలంగాణ ఉద్యోగులు వాటా అడుగుతున్నారు'
హైదరాబాద్: ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై త్వరలో సీఎం కేసీఆర్‌ని కలుస్తామని ఆంధ్రప్రదేశ్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీ ఎన్జీఓ) సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. ఎన్జీవోల భూముల్లో ఎందుకు కట్టడాలు కట్టలేదో సీఎం కేసీఆర్‌కు వివరిస్తామన్నారు. ఏపీఎన్జీవో ఆఫీసులో తెలంగాణ ఉద్యోగులు వాటా అడుగుతున్నారని, అది పూర్తిగా ప్రైవేటు ఆస్తి అని చెప్పారు. గోపన్నపల్లిలో ఏపీ ఎన్జీవో మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన 189.11 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి (అసైన్మెంట్) బి.ఆర్.మీనా ఈ నెల 2న ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా యధాతథస్థితిని కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది -
అశోక్‌బాబుకు ట్రిబ్యునల్‌లో చుక్కెదురు
* ఏపీ ఎన్జీఓ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగడానికి వీల్లేదని ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీ ఎన్జీఓ) సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబుకు సహకార ట్రిబ్యునల్‌లో చుక్కెదురైంది. ఏపీ ఎన్జీఓ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా, డెరైక్టర్‌గా అశోక్‌బాబు నియామకం.. నిబంధనలకు అనుగుణంగా లేదని సహకార ట్రిబ్యునల్ తేల్చింది. అందువల్ల ఆయన అధ్యక్షుడిగా, డెరైక్టర్‌గా కొనసాగడానికి వీల్లేదంటూ ట్రిబ్యునల్ చైర్పర్సన్ శ్రీసుధ, సభ్యుడు డి.కృష్ణారెడ్డిలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కిందట మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కాపీ గురువారం అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఏపీ ఎన్జీవో సంఘంలో అశోక్‌బాబు సభ్యత్వం కేసు తేలేం త వరకు ఆయన హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా, డెరైక్టర్‌గా కొనసాగడానికి వీల్లేదని తేల్చి చెప్తూ.. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. -
'కొత్త పార్టీ పెడుతున్నట్టు చెప్పలేదు'
హైదరాబాద్: కిరణ్‌కుమార్ రెడ్డితో ఎలాంటి రాజకీయాల గురించి చర్చించలేదని ఏపీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. మర్యాద పూర్వకంగానే కిరణ్‌ను కలిశామని చెప్పారు. ఈ సాయంత్రం కిరణ్‌కుమార్ రెడ్డితో సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త పార్టీ పెడుతున్నట్టు కిరణ్ తమతో చెప్పలేదని తెలిపారు. ఒకవేళ పార్టీ పెట్టి మద్దతు తెలపాలని కోరితే తామంతా చర్చించి నిర్ణయం తీసుకుంటామని అశోక్‌బాబు చెప్పారు. అత్యంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సీమాంధ్ర ప్రజలు క్షమించరని అంతకుముందు అన్నారు. జరిగిన అన్యాయం గురించి కలత చెంద కుండా, నష్టాన్ని పూడ్చుకోవడంపై దృష్టి పెడతామన్నారు. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నేతలు మోసం చేసినందున, వచ్చే ఎన్నికల్లో స్వార్థపరులైన నాయకులను దూరం పెట్టాలన్నారు. -
ఆ పాపం ప్రజలదే: అశోక్‌బాబు
న్యూఢిల్లీ: సోనియా గాంధీ తన పుట్టినరోజున తెలంగాణ బిల్లును ప్రకటించిందని, ఈ రోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్లమెంట్లో విభజన బిల్లుపై చర్చకు తావిస్తోందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. పుట్టినరోజుకు బహుమతులు ఇవ్వాలనుకుంటే ప్రాజెక్టులు ఇవ్వండి, రాష్ట్రాలను కాదు అని ఆయన డిమాండ్ చేశారు. రాంలీలా మైదానంలో ప్రారంభమైన ఏపీఎన్జీవోల మహాధర్నాలో అశోక్‌బాబు ప్రసంగించారు. విభజన కోరుకున్న నేతలను గెలిపిస్తే ఆ పాపం ప్రజలదే అవుతుందని వ్యాఖ్యానించారు. విభజనకు బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రాలను ముక్కలు చేసుకుంటూ పోతే దేశం నాశసనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగువాళ్ల సత్తా ఢిల్లీకి చాటాలని అశోక్‌బాబు పిలుపునిచ్చారు. -
విభజన బిల్లు ఆమోదం పొందదు: అశోక్‌బాబు
విజయవాడ: తెలంగాణ బిల్లును అడ్డుకోని సీమాంధ్ర కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా పోరాటం ఉదృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. సమైక్య పోరాటంలో నేటి నుంచి తొలి అడుగు వేశామని తెలిపారు. ఈనెల 11న ధియేటర్లు, పెట్రోల్ బంకుల బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. 17, 18న చలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్టు చెప్పారు. దీని కోసం 15న ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. తనకు తెలిసి విభజన జరగదని అశోక్‌బాబు అన్నారు. మహాయితే విభజన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారని చెప్పారు. లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదం పొందదని అన్నారు. పార్లమెంట్లో విభజన ఆపేవిధంగా సీమాంధ్ర నాయకుల చర్యలుండాలని సూచించారు. మన నేతలు ముందుంటే సమైక్యతకు జాతీయ నేతలు కలిసి వస్తారు. -
ప్రతిధ్వనించిన సమైక్యహోరు: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు సీమాంధ్ర జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా దాదాపు అన్ని ప్రభుత్వ డెరైక్టరేట్లలోనూ సమైక్య హోరు ప్రతిధ్వనించిందని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. శుక్రవారం ఏపీఎన్జీవో భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులు ప్రతిపాదించిన సవరణలకు వీసమెత్తు విలువ కూడా లేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు చెప్పారు. శని, ఆదివారాల్లో కేంద్రమంత్రుల దిష్టి బొమ్మల దహనం, ఎంపీల ఇళ్లముందు ధర్నాలు, 10న బ్యాంకులతో సహా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత, 11న సినిమా థియేటర్లు, వాణిజ్య సంస్థల మూసివేత, 12న జాతీయ రహదారుల దిగ్భంధం.. తదితర ఆందోళన కార్యక్రమాలు చేయాలని ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు. ఈనెల 17,18 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం రూ.వేలకోట్ల వేతనాలను త్యాగం చేసి ఉద్యోగులు నడిరోడ్డుపైకి వస్తుంటే, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు సకల సౌకర్యాలు అనుభవిస్తుండడం సిగ్గుపడాల్సిన విషయమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. పాఠశాల విద్యా డెరైక్టరేట్లో శుక్రవారం ఏపీఎన్జీవోలపై దాడి చేసిన టీఎన్జీవోలను వదిలి, ఏపీఎన్జీవోలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఫిబ్రవరి 21వరకు జరగనున్న సమైక్య సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
సమ్మెతో సీమాంధ్రలో స్తంభించిన పాలన: అశోక్‌బాబు
* రెండు, మూడు రోజుల్లో మున్సిపల్, ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి.. * టెన్త్, ఇంటర్ పరీక్షలకు మినహాయింపు * టెట్‌కు సహకరించం * బిల్లు రాజ్యసభకు వెళ్లిందంటే.. సీమాంధ్ర కేంద్రమంత్రుల చేతగానితనంగా భావిస్తాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యోగుల నిరవధిక సమ్మె విజయవంతంగా కొనసాగుతోందని సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయన్నారు. సమ్మె నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో పాలనా వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని చెప్పారు. అశోక్‌బాబు గురువారం ఏపీఎన్జీవో హోంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలివీ.. * ఉద్యోగ సంఘాలతోపాటు రాజకీయ పక్షాలూ సహకరిస్తుండడంతో రానున్న రోజుల్లో సమ్మె ఉధృతం కానుంది. * రెండు, మూడ్రోజుల్లో మున్సిపల్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెలోకి రానున్నారు. * విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చాం. అయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు మాత్రం సహకరించే ప్రసక్తి లేదని ఉన్నతాధికారులకు తేల్చిచెప్పాం. * రాష్ట్ర సమైక్యతకోసం అన్ని వ్యవస్థలు ఉద్యమిస్తోంటే సీమాంధ్ర కేంద్రమంత్రులు కొందరు ఇంకా.. హైదరాబాద్‌ను యూటీ చేయాలని, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని జీవోఎంకు విన్నవిస్తుండడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. సమైక్యాంధ్ర మినహా మరే డిమాండ్‌కూ ఒప్పుకునేది లేదు. * విభజన బిల్లును దొడ్డిదారిన రాజ్యసభలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్న కేంద్ర నిర్ణయాన్ని ఎంపీలు, కేంద్రమంత్రులు వ్యతిరేకించాలి. బిల్లు రాజ్యసభకు వెళ్లిందంటే.. కేంద్రమంత్రుల చేతగానితనంగా భావిస్తాం. * ఉద్యమంలో భాగంగా సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రుల ఇళ్ల వద్ద ధర్నాలు నిర్వహించి, వారిపై ఒత్తిడి పెంచుతాం. * రాజ్యసభ ఎన్నికల తర్వాత మరోమారు అఖిలపక్షం ఏర్పాటు చేసి.. రాజకీయ పక్షాల సహకారంతో రైల్‌రోకోలు, రహదారుల దిగ్బంధం, కేంద్రప్రభుత్వ కార్యాలయాల ముట్టడి వంటి కార్యక్రమాలు చేపడతాం. * 10న అమలాపురం, తర్వాత చిత్తూరు, గుంటూరులలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలు నిర్వహిస్తున్నాం. * విలేకరుల సమావేశంలో ఏపీఎన్జీవో నేతలు ఎన్.చంద్రశేఖరరెడ్డి, పీవీవీ సత్యనారాయణ, కృపావరం, సీవీ రమణ, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, డాక్టర్స్ జేఏసీ కన్వీనర్ కడియాల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
6 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె
-
6 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె
* నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు * 7న రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీ * 10న అమలాపురంలో బహిరంగ సభ * 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు మరోమారు సమ్మెబాట పట్టనున్నారు. ఎలాగైనా సరే టీ బిల్లును పార్లమెంటులో పెట్టాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 6వ తేదీ (5వ తేదీ అర్ధరాత్రి నుంచే) నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. సమ్మె ఒక్కరోజు ఆలస్యమైనా కేంద్రంలో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున అన్ని ఉద్యోగ సంఘాలు ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయన్నారు. సమైక్య ఉద్యమ కార్యాచరణ ఖరారు కోసం సోమవారం ఏపీఎన్జీవో హోంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక విస్తృతస్థాయి సమావేశం జరిగింది. 7 గంటలు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అశోక్‌బాబు మీడియాకు తెలిపారు. * కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో.. ఈనెల 7నుంచి కొన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు ఎన్నికల అధికారి పరిధిలోకి వెళ్లనున్నందున, ఈనెల 6నుంచే సమ్మె చేయాలని నిర్ణయించాం. * 7వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో మరోమారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ ఉధృతానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. * పరీక్షల సమయం అయినప్పటికీ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలి. * ఈనెల 16న బిల్లు పార్లమెంటుకు వచ్చే అవకాశం ఉన్నం దున 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతాం. * ఢిల్లీలో బలప్రదర్శన నిర్వహిస్తాం. అప్రజాస్వామికమైన బిల్లు గురించి బీజేపీ నేతలను కలిసి వివరిస్తాం. ళి ఈనెల 10న అమలాపురంలో భారీ బహిరంగ సభ. ఎంపీల భరతం పడతాం విభజనను వ్యతిరేకిస్తూ కొందరు ఎంపీలు ఈనెల 5న పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవే శపెడుతున్నారని, సీమాంధ్ర ఎంపీలెవరైనా అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకని పక్షంలో వారి భరతం పడతామని అశోక్‌బాబు హెచ్చరించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, జాతీయ రహదారుల దిగ్బంధం, విద్యుత్ నిలిపివేత, రైల్‌రోకో కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో సమైక్య పరుగు(రన్ ఫర్ యూనిటీ ) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు ఎన్.చంద్రశేఖరరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, పీవీవీ సత్యనారాయణ, చలసాని శ్రీనివాసరావు, ఫణిపేర్రాజు, రవీంద్రకుమార్, కుమార్ చౌదరి యాదవ్, కృష్ణయాదవ్, నిర్మలాకుమారి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమ్మెను వ్యతిరేకిస్తున్నాం సీమాంధ్ర జ్యుడీషియల్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటన సాక్షి, విజయవాడ: ఈ నెల ఆరు నుంచి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి. ఆశోక్‌బాబు ఇచ్చిన సమ్మె పిలుపును వ్యతిరేకిస్తున్నట్లు సీమాంధ్ర జ్యుడీషియల్ ఎంప్లాయీస్ జేఏసీ తెలిపింది. తాము సమ్మె విరమించే సమయంలో విభజన నిర్ణయాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యతను రాజకీయ నాయకులకి అప్పగించామని తెలిపింది. -
చివరి బంతి కొట్టాల్సింది నాయకులే: అశోక్‌బాబు
గిద్దలూరు(ప్రకాశం జిల్లా): రాష్ట్ర సమైక్యత విషయంలో కలికట్టుగా ఉంటామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. అందుకే తనపై పోటీ చేసిన బషీర్ సొంతూరులో భోగి మంటల్లో విభజన బిల్లు తగులబెట్టే కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. విభజనను అడ్డుకోవల్సిన బాధ్యత తమ కంటే ఎంపీ, ఎమ్మెల్యేలపైనే ఎక్కువ ఉందన్నారు. చివరి బంతి కొట్టాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని చెప్పారు. ఈ బాధ్యతను గుర్తు చేయడానికే మరోసారి ఆందోళలు చేపట్టామన్నారు. చట్టసభల్లో విభజన బిల్లును అడ్డుకుంటామని నేతలు హామీయివ్వాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. విభజనకు అనుకూలంగా వ్యవహరించిన నేతలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అశోక్‌బాబు పిలుపిచ్చారు. -
'జైపాల్ వ్యాఖ్యలను ఖండించిన అశోక్‌బాబు'
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు సీమాంధ్రుల పాలిట మరణశాసనమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు అన్నారు. విభజన బిల్లును రేపు భోగి మంటల్లో వేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రం ఎందుకు కలిసుండాలే పల్లె పల్లెకు వెళ్లి చెబుతామన్నారు. శాసనసభలో విభజన బిల్లును ఓడించేందుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేందుకు 17, 18న సీమాంధ్ర బంద్‌కు పిలుపిచ్చామని చెప్పారు. సీమాంధ్రులను కించపరిచేలా వున్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలను అశోక్‌బాబు ఖండించారు. సీనియర్ రాజకీయవేత్తగా ఆయన హోదాకు ఇవి తగవన్నారు. గాదె వెంకటరెడ్డిపై అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని కూడా ఆయన ఖండించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు శుంఠలు పుట్టారని తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
‘అశోక్‌బాబు సీఎం కిరణ్ అనుచరుడు’
తిరుపతి : సమైక్యం పేరుతో నాటకాలు ఆడుతున్న ఎన్జీవో నాయకుడు అశోక్‌బాబు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అనుచరుడని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన చిత్తూరు జిల్లా సదుంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్రలో మాట్లాడారు. సమైక్యం పేరుతో ఆందోళనలు చేసి, ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో చర్చ జరగకపోతే, ఎమ్మెల్యేల ఇంటి ముందు ఆందోళన చేయనున్నట్లు పేర్కొంటున్నారని అన్నారు. ఆయన కూడా జగన్మోహన్రెడ్డి లాంటి సమైక్యవాదిని విమర్శిస్తున్నారని అన్నారు. శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని, చేసిన తరువాతే చర్చ చేపట్టాలని కోరిన పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారన్నారు. రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చడానికే జగన్ వచ్చారని తెలిపారు. -
'తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగలబెడతాం'
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈనెల 17, 18 తేదీల్లో సీమాంధ్ర బంద్‌కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈనెల 20న అసెంబ్లీని ముట్టడిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 14 అన్ని సీమాంధ్ర జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగలబెట్టే కార్యక్రమం చేపడతామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలతో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సమైక్యం కోసం సీమాంధ్ర నాయకులు కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని నేతలు ప్రజల సమక్షంలో హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వాయిదా పడకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులదేనని అశోక్‌బాబు అన్నారు. సభలో బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. -
త్వరలో సమైక్య పొలిటికల్ జేఏసీ ఏర్పాటు: అశోక్‌బాబు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను ప్రజాసంఘాలకు ఇవ్వాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. తాము సాగిస్తున్న సమైక్య ఉద్యమానికి ఏపీఎన్జీవో రాష్ట్ర కమిటీ ఎన్నికలు అడ్డురావన్నారు. రాజకీయ పక్షాలు ఏపీఎన్జీవోను ప్రభావితం చేయలేవని దీమా వ్యక్తం చేశారు. త్వరలో సమైక్య పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. వైఎస్ జగన్‌ను కలిసి అఖిలపక్షానికి ఆహ్వానిస్తామని తెలిపారు. సమావేశానికి వచ్చేది, లేనిది.. వైఎస్ జగన్ ఇష్టమన్నారు. రాజకీయ లబ్ధికోసమే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చారని ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రణాళిక ప్రకారం అసెంబ్లీని ముట్టడిస్తామని అశోక్‌బాబు తెలిపారు. -
నోటీసులు ఇవ్వకుండా మెరుపు సమ్మె: అశోక్‌బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమ్మెను ఆఖరి అస్త్రంగా ఉపయోగిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. అసెంబ్లీకి విభజన బిల్లు వచ్చిన వెంటనే ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. రైల్‌రోకో, బంద్, చలోఅసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈసారి నోటీసులు ఇవ్వకుండా మెరుపు సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు. విభజనపై కేంద్రం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలైనా సమైక్యవాదాన్ని అసెంబ్లీలో బలంగా వినిపించాలని కోరారు. ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించేందుకు స్టీరింగ్ కమటీ ఏర్పాటు చేస్తున్నామని అశోక్‌బాబు తెలిపారు. కేంద్ర మంత్రులు సమైక్య ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని చలసాని శ్రీనివాస్ అన్నారు. -
ఏపీఎన్జీవోల సభలకు జాతీయ పార్టీల నేతలు
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని అన్ని జాతీయ పార్టీల నేతల దృష్టికీ తీసుకెళ్తాం. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని కోరతాం’’అని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. సమైక్యానికి మద్దతుగా తాము నిర్వహించబోయే సమావేశాలకు ఆయా పార్టీల నేతలను కూడా ఆహ్వానిస్తున్నట్టు శుక్రవారం వెల్లడించారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో శనివారం నిర్వహించే సభ ఏర్పాట్లను పరిశీలించాక విలేకరులతో మాట్లాడారు. సభకు ఉద్యోగులతోపాటు సమైక్యాన్ని కోరుతున్న సంఘాల సభ్యులు, పార్టీల నేతలు ఐదు వేల మంది వస్తారన్నారు. విభజన జరగాలంటే రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన తప్పదన్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర పార్టీల నేతలనూ పిలిచాం పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా సభకు హాజరు కావాల్సిందిగా కాంగ్రెస్ నేతలు మండలి బుద్ధప్రసాద్, తులసి రెడ్డి, దేశం నేతలు పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలతోపాటు మజ్లిస్, సీపీఎం నేతలను ఆహ్వానించినట్టు అశోక్‌బాబు వెల్లడించారు. కొద్దిరోజుల్లో తిరుపతి, మదనపల్లిల్లో కూడా ఈ తరహా సభలు నిర్వహించనున్నామని, వాటికి జాతీయ పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. విభజన తథ్యమన్నట్టుగా సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలు అంటున్నా తాము మాత్రం చివరికంటా పోరాటం చేస్తామని, అసెంబ్లీకి ముసాయిదా బిల్లు వచ్చిన వెంటనే మరోసారి సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించినా తమ ఉద్యమానికి వచ్చే నష్టమేదీ లేదని, ఆయన సమైక్యవాదిగా ఉన్నంతమాత్రాన తమకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. ఈ నెల 17న ఉయ్యూరు, ఏలూరులలో రైతు సభలు, 19న పాలకొల్లులో, 28న కడపలో సభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వచ్చే సమ్మెను గాంధేయమార్గంలో కాకుండా నేతాజీ పంథాలో నిర్వహించాలని ఉద్యోగ సంఘాలకు సూచించినట్టు సీమాంధ్ర మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
సింహం నిద్రపోతుంది కదా అని...
గుడివాడ: సింహం నిద్రపోతుంది కదా ఏమీ చేయలేదులే అని పిచ్చి పనులు చేస్తే ఒక్క పంజాతో చంపేస్తుంది.. ఇదేదో కొత్తగా వచ్చిన సినిమాలో డైలాగ్ కాదు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న ఎపీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు నోటి నుంచి వెలువడిన వ్యాఖ్యలివి. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆయన సింహంతో పోల్చారు. ఉద్యమంలో విశ్రాంతి మాత్రమే తీసుకున్నామని, విరమించలేదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలో శుక్రవారం రాత్రి జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్టు అశోక్‌బాబు పరోక్షంగా వెల్లడించారు. తనను రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు, అవకాశవాద నాయకులను చూస్తుంటే రాజకీయాల్లోకి రావాలన్న ప్రజల సూచనను మన్నించాల్సి వస్తుందేమోనని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరక్కుండా అడ్డుకోవాల్సిన ఎంపీలు, రాజకీయ పార్టీల చేతకానితనం వలనే రైతుల కోసం, ప్రజల కోసం ఉద్యోగులు ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందని చెప్పారు. విభజన ప్రక్రియను తాము 2014 వరకు ఆపగలమని, తర్వాత అడ్డుకోవాల్సింది ప్రజలేనని చెప్పారు. ఈ నెల 5 తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అశోక్‌బాబు తెలిపారు. -
హైదరాబాదులో మిలియన్ మార్చ్: అశోక్‌బాబు
విశాఖపట్టణం: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు నవంబర్ రెండవ వారంలో జాతీయ నేతలతో కలవనున్నట్టు సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక రాష్ర్ట అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు తెలిపారు. పార్లమెంటుకు విభజన బిల్లు వస్తే హైదరాబాదులో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. ఏపీఎన్జీవోల ఉద్యమం పట్ల ప్రజల్లో అపోహలు ఉన్నాయని, ఇవి తాత్కాలికం మాత్రమే అన్నారు. విశాఖపట్టణంలో ఎన్జీవో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. నవంబర్ 25 నుంచి ప్రజలతో కలిసి మళ్లీ ఉద్యమిస్తామని వెల్లడించారు. ఈనెల 23న అన్ని మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, 24న లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్లు, 25న రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులపై సమైక్య నినాదాలతో కూడిన పోస్టర్లు, స్టిక్కర్లు అతికించడం, 26న ప్రజలతో కలిసి ప్రదర్శనలు, 27ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ జాతీయ రహదారుల దిగ్బంధం, 28న రిలే దీక్షలు, 29న సైకిల్, మోటార్ సైకిల్ ర్యాలీలు, 30న మానవహారాలు, 31న లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్లు నిర్వహించనున్నామన్నారు. నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని, 2,3,4 తేదీల్లో రైతు సదస్సులు, 5న మళ్లీ లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
కలుపుమొక్కలను ఏరేయాలి: అశోక్‌బాబు
‘కృష్ణా’ రైతు మహాగర్జన పిలుపు రాజీనామా చేయని మంత్రులు, ఎంపీలు ద్రోహులే..: అశోక్‌బాబు సమైక్యాంధ్ర ద్రోహులకు 2014లో ఓటెయ్యొద్దు {పాణాలైనా అర్పించి కేంద్ర కేబినెట్ నోట్‌ను అడ్డుకుంటాం సమైక్యవాదం 19 జిల్లాలకు విస్తరించింది రాహుల్ చెబితే నేరచరిత్ర ఆర్డినెన్సును ఆపేశారు.. మరి కేబినెట్ నోట్కూడా కాని తెలంగాణ నిర్ణయం విరమించలేరా? సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో అవకాశవాద కలుపుమొక్కలుగా ఉండే నాయకులను ఏరిపారెయ్యాలని ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీఎన్జీవోల సంఘ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు రైతులకు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్లో బుధవారం జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రైతు మహాగర్జన సభలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయని కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ద్రోహులే అన్నారు. వీరు నిజంగా తెలుగు తల్లికి పుట్టి ఉంటే రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని హితవు పలికారు. సమైక్యాంధ్రకు ద్రోహం చేసే ఏ పార్టీ నాయకుడైనా ఓటెయ్యవద్దని, అటువంటి అవకాశ రాజకీయ నాయకులకు 2014 ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు అనే బుల్లెట్‌తో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు మారిన సంగతి గత ఎన్నికలు రుజువు చేశాయని, 2014 ఎన్నికల్లో అదే చరిత్ర పునారావృతం అవుతుందని హెచ్చరించారు. 2004లో తెలంగాణాపై రెండో ఎస్సార్సీ అన్న పార్టీకి పట్టం కట్టామని, 2009లో అసలు రాష్ట్ర విభజన ప్రాస్తవన లేని పార్టీని గెలిపించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. ఈసారి కూడా రాష్ట్ర విభజనను అడ్డుకునే నాయకులకే అండగా నిలుస్తామని అశోక్‌బాబు స్పష్టంచేశారు. తమ ప్రాణాలైనా అర్పించి తెలంగాణా బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదానికి రాకుండా అడ్డుకుంటామన్నారు. రాజకీయాల్లో నేర చరితులు అనే విషయంలో బిల్లు దశకు వచ్చి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లిన తరుణంలో కేవలం రాహుల్ గాంధీ అభ్యంతరం చెప్పారని బుట్టదాఖలు చేశారని, అలాంటింది కేబినెట్ నోట్‌గా కూడా రాని తెలంగాణా అంశాన్ని ఎందుకు ఆపలేరని ప్రశ్నించారు. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు 110 కోట్ల భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మా సహనానికి కేంద్రంలోని యూపీఏ సర్కార్ పరీక్ష పెడుతోందని, మా చేతల్లో, మాటల్లో గాంధీ ఉన్నా, గుండెల్లో మాత్రం అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాస్‌చంద్రబోస్ ఉన్నారన్న విషయం చాటిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. తాము సాగిస్తున్న సమైక్య ఉద్యమం కేవలం సీమాంధ్రలోని 13 జిల్లాలకే పరిమితం కాలేదని, ఇది ఖమ్మం, నల్గొండ, హైద్రాబాద్ వంటి ప్రాంతాలకూ విస్తరించిందన్నారు. అచ్చమైన రైతులే రోడ్డెక్కి గర్జించడం చూస్తే ఈ జిల్లా వాడిగా గర్వపడుతున్నానన్నారు. కలియుగ ‘హంస’ కేసీఆర్ పాలు, నీరును వేరుచేసే ప్రత్యేక లక్షణం హంసకు మాత్రమే ఉందని, అలాంటి పాలు, నీరులా కలిసి ఉన్న తెలంగాణా, సీమాంధ్రను వేరుచేసే హంసను తయారు చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీయేనని అశోక్‌బాబు విమర్శించారు. తెలంగాణ ఉద్యమం వాస్తవాలపై నిర్మించలేదని, మీడియా, సాహిత్యంవల్లే దానికి ఒక ఊపు వచ్చిందని, అటువంటి జోష్ మన ఉద్యమానికి కూడా అవసరమని అశోక్‌బాబు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవసరమైతే తెలంగాణ వాళ్లకే ఐదేళ్లపాటు నాయకత్వం అప్పగించేందుకు సిద్ధం కావాలని, అప్పుడైనా ఉద్యమాలు లేని ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటుందేమో ఆలోచించాలని అశోక్‌బాబు అన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ, మాదిగ దండోరా రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ తెలంగాణాకు మద్దతు పలికే మంద కృష్ణమాదిగ గుంటూరులో సభ పెడతానని ప్రకటించారని, ఆయన్ను ఇక్కడ కాలుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. ఈ రైతు గర్జనలో గజల్ శ్రీనివాస్ ఆలపించిన గీతలు ఆకట్టుకున్నాయి. -
ఇక యూపీఏ పతనమే ! : అశోక్‌బాబు
‘లేపాక్షి బసవన్న రంకె’లో గర్జించిన సమైక్యవాదులు ఢిల్లీలో సోనియా పాదపూజ ఇక చాలించండి 2014 వరకు తెలంగాణ ఏర్పడే ప్రసక్తే లేదు ఉద్యమంలోకి రాని నేతలకు రాజకీయ సమాధేనని హెచ్చరిక తెలంగాణ బిల్లు పెడితే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రకటన సాక్షి, అనంతపురం: ‘లేపాక్షి బసవన్న రంకె వేస్తే కలియుగం అంతం అవుతుందని నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు.. నేడు ‘లేపాక్షి బసవన్న రంకె’ పేరుతో సమైక్య వాదుల గర్జనతో యుపీఏ ప్రభుత్వం అంతమవ్వడం ఖాయమ’ని సమైక్య వాదులు ముక్తకంఠంతో నినదించారు. హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన లక్ష జనగళ సమైక్య గర్జనకు జనం పోటెత్తారు. శాంతి కపోతాలను ఎగుర వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ అధ్యక్షుడు పరుచూరిఅశోక్బాబు మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని, లేకుంటే వారికి ప్రజలే రాజకీయ సమాధి కడతారని హెచ్చరించారు. విభజన నోట్ తయారీకి ముందే.. సమైక్య ఉద్యమానికి మద్దతుగా పదవులకు, పార్టీలకు రాజీనామాలు చేసే ఎంపీలను, మంత్రులను తామే గెలిపించుకుంటామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ప్రసక్తే లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే కేంద్రప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం రోజుకో మాట.. పూటకో ప్రకటన చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజలు రోడ్లపై ఉద్యమాలు చేస్తుంటే.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పాద పూజ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఈనెల 24న సీమాంధ్రకు చెందిన ఏడుగురు ఎంపీలు రాజీనామా చేయనున్నారని, అదే జరిగితే కేంద్రంలో కీలకమార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ బిల్లును కేబినెట్ ఆమోదానికి పంపితే హైదారాబాద్ నడిబొడ్డున సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 10లక్షల మందితో మిలియన్‌మార్చ్ నిర్వహిస్తామని అశోక్‌బాబు పేర్కొన్నారు. గతం మరచిన తెలంగాణవాదులు.. 1956కు ముందు తెలంగాణ వాసులు నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోయారని, ఆప్పట్లో అందరూ కూలీలే తప్ప సెంటు భూమి ఉన్న రైతులు లేరని అశోక్‌బాబు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రాయలసీమ వాసులు కూడా పాల్గొని నిజాంపాలనను అంతమొందించి.. వారికి విముక్తి కల్పించారన్నారు.అప్పటి నుంచి సీమాంధ్ర ప్రాంత వాసులు ఇక్కడ సంపాదించి అక్కడ పెట్టుబడులు పెట్టడంతోనే హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న జిల్లాలు అన్ని విధాలా అభివృద్ధి చెందాయన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లిన సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు అడుగడుగునా అవమానాలు, దాడులు జరిగినా ఈ ప్రాంతానికి చెడ్డపేరు రాకూడదనే కారణంతోనే సంయమనం పాటించామని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలనూ కలుస్తాం.. సమైక్య రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలనూ కలసి విన్నవిస్తామని అశోక్‌బాబు తెలిపారు. రెవెన్యూ శాఖ రాష్ట్ర జేఏసీ నాయకుడు కొమ్మరాజు వెంకటేశ్వర్లు, ఏపీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, మునిసిపల్ శాఖ రాష్ట్ర జేఏసీ నాయకుడు కృష్ణమోహన్ తదితరులు మాట్లాడారు. సోనియాకూ తెలిసొచ్చింది తాము చేపట్టిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్, సమ్మె కారణంగా కేంద్రం ఆర్థికంగా ఎంత చితికిపోతోందో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంలకు తెలిసొచ్చిందని అశోక్‌బాబు అన్నారు. సభకు ముందు హిందూపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక్కరోజు బ్యాంకుల స్తంభన వల్ల జరిగిన ఆర్థిక నష్టం గురించి ప్రజలకు తెలియకపోయినా చిదంబరానికి మాత్రం తెలిసొచ్చిందన్నారు. నష్టానికి సంబంధించిన నివేదికలను తెప్పించుకున్న ఆయన.. బవాటిని చూసి నిర్ఘాంతపోయారన్నారు. ఉవ్వెత్తున ఉద్యమం సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలో తారస్థాయికి చేరుతోంది. సమ్మెకు సంఘీభావంగా సోమవారం నుంచి నిరవధికంగా ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ చేపట్టాయి. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, వినూత్న నిరసనలు, ఆందోళనలతో వరుసగా 55వరోజూ ఉద్యమం మిన్నంటింది. విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీలో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు 400మీటర్ల జాతీయ జెండా చేతపట్టుకుని మద్దిలపాలెం వరకు ర్యాలీగా వెళ్లి జాతీయరహదారిని దిగ్బంధించారు. గోపాలపట్నంలో ప్రాంతీయ మార్కెటింగ్‌శాఖకు చెందిన ఐదు జిల్లాల ఉద్యోగులు మహా ప్రదర్శన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రవాణాశాఖ ఆధ్వర్యంలో వందలాది వాహనాలతో మహార్యాలీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా లోని సుమారు 700 పంచాయతీలలో సమైక్యాంధ్రను కొనసాగించాలంటూ తీర్మానాలను ఆమోదించినట్టు పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘ నాయకుడు వీజీఎంఆర్ కృష్ణారావు తెలిపారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 12 గంటల పాటు నిర్విరామ ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఐకేపీ కార్యాలయానికి తాళం వేశారు. అనంతపురం జిల్లా కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, కూడేరు మండలాల్లోని గ్రామాల సర్పంచులు సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానాలు చేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో పదివేల మంది విద్యార్థులతో మహోద్యమ రిలే దీక్షలు చేపట్టారు. చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యురాలు ఆర్కే.రోజా ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా రుద్రవరంలో రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీ చేపట్టారు. గుంటూరులో క్రేన్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులోని నిమ్మకాయల రైతులు రోడ్డుపై వంటావార్పు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో బంగారు వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. నేడు సీమాంధ్ర బంద్ రహదారుల దిగ్బంధం చేయాలని జేఏసీ నిర్ణయం.. సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం సీమాం ధ్రలో బంద్ జరగనుంది. బంద్‌తోపాటు రహదారులను దిగ్బంధం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. కాగా, 25, 26 తేదీల్లో ప్రైవేటు ట్రావెల్స్ బంద్‌కు జేఏసీ పిలుపు ఇచ్చింది. అందువల్ల మంగళవారం బంద్‌తో కలిసి వరుసగా మూడు రోజులు ప్రైవేటు బస్సుల రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. తిరుమలకు వాహనాల బంద్: రహదారుల దిగ్బంధంలో భాగంగా తిరుమల రోడ్డుపై వాహనాలు అడ్డుకుంటామని జేఏసీ నాయకులు తెలిపారు. ‘తిరుమలకు వాహనాల రాకపోకలు ఉండవు. ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించే అవకాశం లేదని’ చెప్పారు. ఏపీ ఎన్జీవోలు ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు ప్రకటించిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డును కూడా దిగ్బంధించనున్నారు. -
విభజిస్తే కాంగ్రెస్ భూస్థాపితమే: అశోక్‌బాబు
విజయనగరం, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు హెచ్చరించారు. మంగళవారం విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం పట్టణాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్రకు మద్దతుగా హైదరాబాద్‌లో పదిలక్షల మందితో మహాసభ నిర్వహించనున్నట్టు తెలిపారు. తెలంగాణవాదులు రవాణాను అడ్డుకుంటే కాలినడకనైనా వస్తారని చెప్పారు. హైదరాబాద్‌లో రక్షణ కల్పించాల్సింది సీమాంధ్రులకు కాదని, స్వార్థపూరిత ఆలోచనలున్న తెలంగాణా రాజకీయ నిరుద్యోగులకు మాత్రమేనని చెప్పారు. తెలంగాణతో తమది అన్నదమ్ముల బంధం కాదని, నాటి ప్రధాని నెహ్రూ చెప్పినట్టు భార్యాభర్తల బంధమన్నారు. తెలంగాణ ఉద్యమం కంటే సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో నాయకులు చేపట్టిన ఉద్యమానికి ప్రజలు పూర్తిగా సహకరించలేదని, సీమాంధ్రలో ప్రజలే సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని చేపడుతున్నారన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు అధిష్ఠానం వద్ద సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించలేకపోతున్నారన్నారు. ఉద్యమంలో పాల్గొనని ప్రజాప్రతినిధులు చరిత్రహీనులుగా మిగిలి పోతారని తెలిపారు. జేఏసీ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుందన్నారు. ఎస్మా అస్త్రాన్ని ప్రయోగిస్తే నాలుగు లక్షల మంది ఉద్యమ ఊపిరిలో ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరించారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెలోకి దిగితే ఉద్యమం ఉధృతమవుతుందన్నారు. ఈనెల 30వతేదీ వరకు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగిస్తామని అనంతరం హైదరాబాద్‌లో సమైక్యవాదులతో సమావేశం నిర్వహించి, తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని అశోక్‌బాబు పార్వతీపురంలో విలేకరులకు తెలిపారు. జిల్లాలో జరిగిన సభల్లో ఆయనతో పాటు రాష్ట్ర జేఏసీ కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి సమైక్యాంధ్ర జిల్లా చైర్మన్ పెద్దింటి అప్పారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. వెంకటేశ్వరరెడ్డి, జేఏసీ మహిళా కన్వీనరు రత్నకుమారి, రాజ్యలక్ష్మి, జేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభూజి, డీజీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.