
రాజధాని ఎక్కడో తేలాకే విరాళాలివ్వండి
అనంతపురం: రాజధాని నిర్మాణానికి కొన్ని సంఘాలు విరాళాలు ఇస్తున్నాయని, అయితే రాజధాని ఎక్కడో నిర్ణయించిన తరువాత ఇస్తే బాగుంటుందని ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు సూచించారు. ఎన్‌జీవోల ఒకరోజు వేతనాన్ని రాజధాని కోసం ఇవ్వాలని తొలుత నిర్ణయించామని, అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న విషయం ఇంకా నిర్ధారణ కానందున ఆ మొత్తాన్ని లోటు బడ్జెట్ ఉన్న పింఛన్లు, ఆరోగ్యశ్రీ తదితర పథకాలకు వాడుకోవాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని కోరారు.
‘ఉద్యోగులకు వయోపరిమితి 60 ఏళ్లకు పొడిగించారు. అయితే.. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి అది వర్తించడం లేదు. రాష్ట్ర విభజన జరిగినా ఇంకా ప్రభుత్వరంగ సంస్థలు కలిసే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థలు విడిపోయేందుకు మరో ఏడాది పట్టేలా ఉంది. ప్రభుత్వం త్వరగా వారికి కూడా 60 ఏళ్లు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆర్థికంగా చితికిపోతూ, మానసిక వేదనతో ఉద్యోగం చేస్తున్నారని, వారికి కొంత టైం స్కేల్ ఇస్తే మనస్ఫూర్తిగా పనిచేస్తారని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. ప్రస్తుతమున్న వారందరినీ రెగ్యులరైజ్ చేసి.. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే 2/1994 చట్టాన్ని మార్చాలన్నారు. ఆగస్టు 15 కల్లా హెల్త్‌కార్డులు అందజేస్తామని ప్రభుత్వం చెబుతోందని, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చనిపోయేంతవరకు వర్తింపజేసేలా వాటిని ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్థిక మంత్రులను కోరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగులకు ఒకే పీఆర్‌సీ ఇస్తే బాగుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారంటూ ఆ రాష్ట్ర సీఎస్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించగా.. నక్కను చూసి పులి భయపడినట్లుందని ఎద్దేవా చేశారు. వారిని వేధిస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సీఎస్‌కు విన్నవించుకుంటే ఉపయోగంగానీ.. తెలంగాణ సీఎస్‌కు చెప్పుకోవడమేమిటని ప్రశ్నించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలన్నారు. ఉన్నపళంగా వారిని తొలగిస్తే కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.