చంద్రబాబు జాతీయ నాయకుడు కాదు.. | Massive Rally In Anatapur For Supporting To Three Capitals | Sakshi
Sakshi News home page

మూడు రాజధానులకు మద్దతుగా అనంతలో భారీ ర్యాలీ

Published Fri, Jan 17 2020 7:03 PM | Last Updated on Fri, Jan 17 2020 8:16 PM

Massive Rally In Anatapur For Supporting To Three Capitals - Sakshi

సాక్షి, అనంతపురం : లక్ష కోట్ల రాజధాని వద్దు-ఇరిగేషన్ ప్రాజెక్టులు ముద్దు పేరుతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ దాకా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్‌, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి,  కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, ఎమ్మెల్సీ ఇక్భాల్, డీసీసీబీ ఛైర్మన్ పామిడి వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ నేతలు నదీం అహ్మద్, గంగుల భానుమతి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే. అమరావతి కోసం చంద్రబాబు జోలె పట్టడం హాస్యాస్పదంగా ఉందని  విమర్శించారు. రాయలసీమలో ఆకలి చావులు జరిగినప్పుడు చంద్రబాబు ఎందుకు జోలి పట్టలేదని ప్రశ్నించారు. సీమ వెనుకబాటుకు చంద్రబాబే కారణమని విమర్శించారు. చంద్రబాబు జాతీయ నాయకుడు కాదని, ఒక జాతి నాయకుడని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ ప్రారంభించిన ఇరిగేషన్‌ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ కరువుపై మానవతా దృక్పథంతో స్పందించి.. సీమ ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అధికార వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలని తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి తెలిపారు. 

చంద్రబాబు జోలె పట్టడం హాస్యాస్పదం
అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డ్రామాలు అడుతున్నాడని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ దుయ్యబట్టారు. అమరావతిలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, ఇన్ సైడర్ ట్రెడింగ్ ద్వారా 4000 ఎకరాలు టీడీపీ నేతలు కొన్నారని పేర్కొన్నారు. బినామీ ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు పాకులాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు జోలె పట్టడం హాస్యాస్పదమని, ఏపీ లోని 13 జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందితే చంద్రబాబుకు ఎందుకు బాధ అని నిలదీశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమా.. కాదో చెప్పాలని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ డిమాండ్‌ చేశారు. 

రాయలసీమ కష్టాలు బాబుకు కనిపించవా
సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి పోరాటం చేస్తున్నారని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో చంద్రబాబు గ్రాఫిక్స్ మమాజాలం సృష్టించిందని, నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అమరావతిలో రాజధాని కట్టలేమని పేర్కొన్నారు. రాయలసీమ కష్టాలు చంద్రబాబుకు కనిపించవా అని ప్రశ్నించారు. వైఎస్సార్ కృషి ఫలితమే హంద్రీనీవా ప్రాజెక్టు అని తెలిపారు. చంద్రబాబు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, కనీసం రూ. 25000 కోట్లు సీమ కోసం ఎందుకు ఖర్చు పెట్టలేదని నిలదీశారు. తమకు లక్షల కోట్ల రూపాయల రాజధాని అక్కర్లేదని.. పుష్కలంగా తాగు, సాగు నీరు అందింతే చాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అండగా నిలుస్తామని, రాయలసీమలో జ్యూడిషియల్ క్యాపిటల్ ను స్వాగతిస్తున్నామని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement