'తెలంగాణ ఉద్యోగులు వాటా అడుగుతున్నారు'
హైదరాబాద్: ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై త్వరలో సీఎం కేసీఆర్‌ని కలుస్తామని ఆంధ్రప్రదేశ్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీ ఎన్‌జీఓ) సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. ఎన్జీవోల భూముల్లో ఎందుకు కట్టడాలు కట్టలేదో సీఎం కేసీఆర్‌కు వివరిస్తామన్నారు. ఏపీఎన్జీవో ఆఫీసులో తెలంగాణ ఉద్యోగులు వాటా అడుగుతున్నారని, అది పూర్తిగా ప్రైవేటు ఆస్తి అని చెప్పారు.
గోపన్నపల్లిలో ఏపీ ఎన్జీవో మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన 189.11 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి (అసైన్‌మెంట్) బి.ఆర్.మీనా ఈ నెల 2న ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా యధాతథస్థితిని కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది