సాక్షి, అమరావతి: ఫోర్జరీ విద్యార్హత సర్టిఫికెట్‌తో వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం పొంది ప్రభుత్వాన్ని మోసం చేసిన టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. రికార్డులను ట్యాంపర్ చేయడమే కాకుండా ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేస్తూ సమర్పించిన అఫిడవిట్‌లోనూ ఆయన తప్పుడు విద్యార్హతను పేర్కొన్నారు. ఈయన విద్యార్హతపై అభ్యంతరాలు తెలుపుతూ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటం చివరికి ఫలించింది. గతంలో సాక్ష్యాధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదులను టీడీపీ సర్కారు బుట్టదాఖలు చేసింది. అంతేకాదు.. అశోక్‌బాబును ఎమ్మెల్సీగా చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం ఇచ్చింది. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు బి. మెహర్‌కుమార్ లోకాయుక్తను ఆశ్రయించడంతో ఆయన బండారం బట్టబయలైంది. లోకాయుక్త ఆదేశాలతో అశోక్‌బాబుపై సెక్షన్–477ఎ, 465, 420 కింద సీఐడీ అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు.
సర్వీసు రిజిస్టర్‌లో ట్యాంపర్ చేసింది ఇలా..
నిజానికి.. వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీఓగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన అశోక్‌బాబు విద్యార్హత ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా ఉంది. లోకాయుక్తలో వేసిన కేసులోని వివరాల ప్రకారం.. అశోక్‌బాబు డి.కాం (డిప్లమో ఇన్ కంప్యూటర్స్) చేశారు. ఆ అర్హతతో వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి సీనియర్ అసిస్టెంట్ అయ్యారు. అనంతరం ఆయన కమిషనర్ కార్యాలయంలో పోస్టింగ్‌పై కన్నేశారు. కానీ, అక్కడ పోస్టింగ్ పొందాలంటే డిగ్రీ విద్యార్హత తప్పనిసరి. దాంతో తన సర్వీసు రిజిస్టర్‌లోని విద్యార్హత కాలమ్‌లో ఉన్న డీ.కాం.ను ట్యాంపర్ చేసి బీ.కాం.గా దిద్ది బురిడీ కొట్టించారు. ఇంగ్లీష్ అక్షరం ‘డీ’ని ట్యాంపర్ చేసి ‘బీ’గా మార్చారు. ఆ విధంగా తప్పుడు సమాచారంతో ఆయన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగం పొంది ప్రభుత్వాన్ని మోసం చేశారు. దీనిపై ఆ శాఖకు చెందిన పలువురు ఉద్యోగులు అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేశారు. కానీ, టీడీపీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. ఫలితంగా ఆ కేసులు సుదీర్ఘకాలం పెండింగ్‌లోనే ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద పదవీ విరమణ
ఉద్యోగ సంఘం నేతగా ఉన్న అశోక్‌బాబు సహచర ఉద్యోగుల ప్రయోజనాలకంటే టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారన్నది బహిరంగ రహస్యం. 2013–14లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడమే కాకుండా 2014 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే 2018లో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో టీడీపీ మద్ద్దతు ఇచ్చిన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఇక అదే ఏడాదిలో నాటి సీఎం చంద్రబాబు ఆయనకు టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో అశోక్‌బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. తనపై ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేవని ఆ దరఖాస్తులో పేర్కొన్నారు. కానీ, విద్యార్హత విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఫిర్యాదుకు సంబంధించిన కేసు అప్పటికే పెండింగ్‌లో ఉంది. దీనివల్ల స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ప్రభుత్వం అనుమతించకూడదు. కానీ, అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద అశోక్‌బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ఆమోదం తెలిపారు.
ఎమ్మెల్సీ అఫిడవిట్‌లోనూ అసత్యాలే..
ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేస్తూ సమర్పించిన అఫిడవిట్‌లోనూ అశోక్‌బాబు అసత్య సమాచారాన్నే పేర్కొన్నారు. తన విద్యార్హత బి.కాం.గా పేర్కొన్నారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సమయంలో తనపై కేసులు పెండింగ్‌లో లేవన్న ఆయన.. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు సమయంలో మాత్రం తనపై పెండింగ్‌లో ఉన్న కేసులను చెప్పడం గమనార్హం. దీంతో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆయన అఫిడవిట్ దాఖలు చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
లోకాయుక్త ఆదేశాలతో కదిలిన డొంక
ఈ నేపథ్యంలో.. బి. మెహర్‌కుమార్ ఫిర్యాదుతో వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం నుంచి లోకాయుక్త సమాచారం తెప్పించుకుని పరిశీలించింది. సమగ్రంగా విచారించేందుకు ఈ కేసును సీఐడీకి అప్పగించాలని 2021 ఆగస్టులోనే ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా అశోక్‌బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం కల్పించిన అధికారులపై కూడా విచారించాలని పేర్కొంది. ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు నివేదించాలని కోరింది. లోకాయుక్త ఆదేశాలతో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఆ శాఖ జాయింట్ కమిషనర్ గీతా మాధురి ఈ అంశంపై అధికారికంగా సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. లోకాయుక్త తీర్పును అనుసరించి పూర్తి సాక్ష్యాధారాలతో సీఐడీ కేసు నమోదు చేయడంతో ఈ కేసులో పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment