‘అయ్యన్న’ అరెస్టు | Chintakayala Ayyannapatrudu and his son Rajesh arrested by CID police | Sakshi
Sakshi News home page

‘అయ్యన్న’ అరెస్టు

Published Fri, Nov 4 2022 3:36 AM | Last Updated on Fri, Nov 4 2022 3:36 AM

Chintakayala Ayyannapatrudu and his son Rajesh arrested by CID police - Sakshi

అయ్యన్నకు అరెస్టు నోటీసు అందజేస్తున్న సీఐడీ అడిషనల్‌ ఎస్పీ, పోలీసులు

నర్సీపట్నం/ఆరిలోవ (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి: ఫోర్జరీ కేసులో మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన తనయుడు రాజేష్‌ను సీఐడీ పోలీసులు  అరెస్టుచేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శివపురంలోని ఆయన నివాసానికి సీఐడీ అడిషనల్‌ ఎస్పీ ఆధ్వర్యంలో సీఐడీ పోలీసులు, స్థానిక పోలీసులు గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చేరుకున్నారు.

అయ్యన్నపాత్రుడు ఇరిగేషన్‌ స్థలాన్ని ఆక్రమించి ఆయన ఇద్దరు కుమారుల పేరుపై ఐదేళ్ల కిందట ఇళ్లు నిర్మించారు. అక్రమ నిర్మాణాన్ని గుర్తించిన అధికారులు గతంలో దానిని తొలగించే ప్రయత్నం చేశారు. అప్పట్లో రెవెన్యూ అధికారుల సమక్షంలో కూల్చేందుకు సిద్ధంకాగా అయ్యన్న కుటుంబం, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో.. అయ్యన్నపాత్రుడు ఆయన కుమారులు తప్పుడు ఎన్‌ఓసీ సర్టిఫికెట్‌ సృష్టించి ఇరిగేషన్‌ స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించారని సంబంధిత అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సీఐడీ పోలీసులు గురువారం తెల్లవారుజామున అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్నారు. వెంటనే ఇంటి తలుపులు తీయకపోవడంతో కొద్దిసేపు పోలీసులు నిరీక్షించారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించారు.

అదే సమయంలో అయ్యన్న తనయుడు రాజేష్‌ బయటకు రావడం.. కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కావడంతో ఆయనను ముందుగా అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. ఇంతలో అయ్యన్నపాత్రుడు బయటకొచ్చి.. నన్ను అరెస్టుచేసేందుకు ఇంతమంది రావటం అవసరమా అని ప్రశ్నించారు. అరెస్టుగల కారణాలు తెలియజేస్తూ నోటీసును అయ్యన్నపాత్రుడికి పోలీసులు అందజేశారు. దీనిపై అయ్యన్న, సీఐడీ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది.

ఎట్టకేలకు అయ్యన్నపాత్రుడు నోటిసుపై సంతకం చేశారు. అరెస్టుచేసి ఇంట్లో నుండి బయటకు తీసుకువస్తుండగా నోటీసును తన చేతికిస్తేనే వస్తానని అయ్యన్నపాత్రుడు మెలిక పెట్టారు. పోలీసులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఆయన్ను వాహనంలోకి ఎక్కించి విశాఖకు తరలించారు. మరోవైపు.. శాంతియాత్ర పేరుతో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని అరెస్టుచేశారు. 

సీఐడీ కార్యాలయం వద్ద హైడ్రామా
ఇక నర్సీపట్నంలో అరెస్టుచేసిన అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను పైనాపిల్‌ కాలనీలో ఉన్న సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇక్కడ విచారిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఇతర నాయకులు సీఐడీ కార్యాలయానికి చేరుకుని కొంతసేపు హైడ్రామా నడిపారు. కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

అయినప్పటికీ వారిని తోసుకుని వెళ్లడానికి ప్రయత్నించిన వెలగపూడి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌తో పాటు మరికొంతమంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్టుచేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఇక మధ్యాహ్నం వరకు అక్కడే విచారించిన సీఐడీ అధికారులు 2.30 గంటలకు అయ్యన్నతో పాటు కుమారుడు రాజేష్‌ను వైద్య పరీక్షలు నిమిత్తం సింహాచలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి సా.4.30 గంటలకు విశాఖ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు.

రిమాండ్‌ రిపోర్ట్‌ తిరస్కరించిన కోర్టు
సా.5.40 గంటలకు ప్రధాన మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందు వారిని పోలీసులు హాజరుపరిచారు. అయ్యన్న, అతని కుమారుడు రాజేష్‌లపై రిమాండ్‌ రిపోర్టును ఏపీపీ ఆదినారాయణ ద్వారా సీడీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. దానిపై ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సీఐడీ అధికారులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పెట్టిన సెక్షన్లు, నమోదు చేసిన కేసుతో పొంతనలేదని జడ్జి రిమాండ్‌ రిపోర్టును తిరస్కరించారు. దీంతో పోలీసులు వారికి 41ఎ నోటీసులు అందజేసి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు.

ఈఈ ఫిర్యాదుతో ‘ఫోర్జరీ’  వెలుగులోకి..
ఇక చింతకాయల విజయ్‌ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబీకులు 2017లో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి బిల్డింగ్‌ ప్లాన్‌ అనుమతి కోసం అదే ఏడాదిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో (సెటిల్‌మెంట్‌ డీడ్‌ నెం–3660 ఆఫ్‌ 2017) సర్వే నెంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరారు. దక్షిణం, పశ్చిమం వైపునకు పంట కాలువ ఉన్నట్లు ప్లాన్‌లో చూపించారు. అయితే, నిర్మాణ సమయంలో ఈ కాలువను ఆక్రమించి  నిర్మాణాన్ని చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు.

2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్‌ఓసీని జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు మల్జికార్జునరావు సంతకంతో ఇచ్చినట్లుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన సదరు ఈఈ.. ఎన్‌ఓసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాక.. దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదన్న సంగతి ఆయనకు స్పష్టమైంది. అదే విధంగా కోర్టుకు సమర్పించిన ఎన్‌ఓసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాకపోవడంతో ఈ విషయాన్ని జలవనరుల శాఖ ఈఈ మల్జికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పారు.

ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్‌లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనే అని తెలిపారు. మరోవైపు.. కార్యాలయం సీల్‌ కూడా తమది కాదని స్పష్టంచేశారు. ఈ మేరకు  సీఐడీకి 30 సెప్టెంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత ఇన్‌స్పెక్టర్‌ పైడిరాజు విచారణ అధికారిగా తన విచారణ నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్‌ఓసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. 

ఫోర్జరీ కారణంగానే అరెస్టు చేశాం : సీఐడీ డీఐజీ
ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా అధికారుల సంతకాలను ఫోర్జరీచేసి నకిలీ ఎన్‌ఓసీలతో ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను గురువారం అరెస్టుచేసినట్లు సీఐడీ విభాగం డీఐజీ సునీల్‌నాయక్‌ వెల్లడించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ స్థలం కబ్జా, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారంటూ అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులు విజయ్, రాజేష్‌లపై నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్‌ కె.మల్లికార్జునరావు ఫిర్యాదు చేశారని చెప్పారు.

దాంతో సెక్షన్లు 464, 467, 471, 474, 120 (బి), 34 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఫోర్జరీ చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని సునీల్‌నాయక్‌ తెలిపారు. దీంతో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను అరెస్టుచేశామన్నారు. మిగిలిన నిందితులను గాలించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement