cid police attacks
-
పాత నేరస్తుల పని పడుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తులను, నిందితులను తెలంగాణ సీఐడీ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి తీసుకువస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పారిపోయిన మోసగాళ్లను సైతం కటకటాల వెనక్కి నెడుతున్నారు. గత 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ) అమలు కోసం తెలంగాణ సీఐడీ విభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ టీం సత్ఫలితాలిస్తోంది. 2023 ఫిబ్రవరిలో ఈ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొత్తం 212 నాన్‌బెయిలబుల్ వారెంట్లను పరిష్కరించారు. రూ.కోట్లలో అమాయకులను మోసగించి దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్రాష్ట్ర నేరస్తులపై ఎస్పీ రామ్‌రెడ్డి నేతృత్వంలోని ఈ ఎన్బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ బృందం ఫోకస్ పెట్టింది. ఫలితంగా పాత కేసులలోనూ చిక్కుముడులు వీడుతున్నాయి. మొత్తంగా ఏడాదికాలవ్యవధిలో 156 ఎన్‌బీడబ్ల్యూల సమాచారం ప్రత్యేక బృందం సేకరించింది. 56 మంది పాత నేరస్తులను అరెస్టు చేసింది. ఇటీవల అమలు చేసిన ఎన్బీడబ్ల్యూ కేసులు కొన్ని.. ► మంచిర్యాల టౌన్లో 1995 నమోదైన ఒక డెకాయిటీ కేసులో 29 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అప్పల సత్తయ్య అనే నేరస్తుడిని ఈ ఏడాది జనవరి 24న కరీంనగర్లో అరెస్టు చేసింది. ► ఆన్లైన్ ఓఎల్ఎక్స్ మోసం కేసులో ఎనిమిదేళ్లుగా సీఐడీ సైబర్‌క్రైం పోలీసులకు చిక్కకుండా ఉన్న సోహాల పొద్దార్ అనే పాత నిందితుడిని ముంబైలో ఈ ఏడాది జనవరి 29 ఎన్బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ టీం అరెస్టు చేసింది. ► కృషి బ్యాంకు కుంభకోణం కేసులో 22 ఏళ్లుగా పరారీలో ఉన్న ఆ బ్యాంకు డైరెక్టర్ కాగితాల శ్రీధర్‌ను గతేడాది సెప్టెంబర్ 25న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అరెస్టు చేసింది. సాంకేతికత వినియోగంతో సమాచారం కూపీ లాగుతారు.. మోసాలు చేయడంలో దిట్ట అయిన సదరు పాత నేరస్తులను గుర్తించేందుకు తెలంగాణ సీఐడీ ఎన్బీడబ్ల్యూ స్పెష ల్ ఎగ్జిక్యూషన్ టీం సాంకేతికతను వినియోగిస్తోంది. నేర స్తుల సీడీఆర్ (కాల్ డీటెయిల్డ్ రికార్డ్), బ్యాంకు ఖాతాల కు లింక్ అయిన ఉన్న మొబైల్ నంబర్ల ఆధారంగా, అదేవిధంగా స్విగ్గీ, ఓయో, ర్యాపిడో, అమెజాన్ డాటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. సైకాప్స్ అప్లికేషన్ ద్వారా కూడా వివరాలు విశ్లేíÙస్తున్నారు. గ్యాస్ కనెక్షన్, మొబైల్ నంబర్‌కు ఇచ్చే ఆధారాలు, సోషల్ మీడియా ఖాతాల్లో ఫో న్ నంబర్లు ఇలా...అన్ని కోణాల్లో సదరు నిందితుల సమాచారం సేకరిస్తున్నారు. ఎక్కడున్నాడనేది స్పష్టత వచి్చన తర్వాత క్షేత్రస్థాయిలో ఆపరేషన్ చేపడుతున్నారు. -
డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రలు సేకరించి..
సాక్షి, హైదరాబాద్: సిలికాన్ ఫింగర్‌ప్రింట్స్ (నకిలీ వేలిముద్రల)ను తయారు చేసి ఆన్లైన్లో డబ్బులు కొల్లగొడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను తెలంగాణ సీఐడీ పోలీస్ బృందం అరెస్టు చేసింది. ఈ ముఠాలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన రంజిత్‌షాను ఆ రాష్ట్రంలోని కిషన్‌గంజ్ జిల్లాలో ఈనెల 24న, మరో నిందితుడు సఫాత్ ఆలంను ఈనెల 14న బెంగళూరులో అరెస్టు చేసినట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ మంగళవారంనాడిక్కడ తెలిపారు. ఈ ముఠాలో కీలక నిందితుడు అక్మల్ ఆలంను సీఐడీ పోలీసులు గతేడాది డిసెంబర్లో బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలోని వేలిముద్రలతో... ఈ సైబర్ మోసంలో నిందితులు రిజిస్ట్రేషన్ , రెవెన్యూశాఖల వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. ఈ ముఠా ముందుగా రిజిసే్ట్రషన్, రెవెన్యూ శాఖల వెబ్సైట్లోకి వెళ్లి సేల్‌డీడ్, ఇతర డాక్యుమెంట్లలో వేలిముద్రలను, ఆధార్ నంబర్లను, బ్యాంక్ ఖాతాల్లో పేర్లను సేకరిస్తుంది. ఈ వేలిముద్రలను ఆధారంగా సిలికాన్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేస్తున్నారు. కస్టమర్ సర్వీస్ పాయింట్స్ (సీఎస్పీ)ల సిబ్బందితో కుమ్మక్కై ఆ సెంటర్లలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) విధానంలో వేలిముద్రలను పెట్టి, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి సదరు వ్యక్తులకు తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును డ్రా చేస్తున్నారు. ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలో పేరు, వేలిముద్ర ఉంటే ఏఈపీఎస్‌ల నుంచి డబ్బులు డ్రా చేసే అవకాశం ఉండటం సైబర్ నేరగాళ్లకు కలిసొచ్చే అంశంగా మారింది. ఇలా వెలుగులోకి వచ్చింది... హైదరాబాద్‌లోని సెయింట్ మేరిస్ రోడ్డులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలో ఖాతా ఉన్న ఓ రిటైర్డ్ ఉద్యోగి గతేడాది డిసెంబర్లో సీఐడీ పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 4, 5 తేదీల్లో తన బ్యాంకు ఖాతా నుంచి నాలుగు విడతల్లో మొత్తం రూ.24 వేలు తనకు తెలియకుండానే ఎవరో డ్రా చేసినట్టు ఫిర్యాదు చేశారు. దీనిపై దృష్టి పెట్టిన సీఐడీ అధికారులు నగదు విత్‌డ్రా చేసిన ప్రాంతంలో బ్యాంకు ఖాతాలు, అక్కడ నిందితులు వాడిన ఫోన్ నంబర్ల ఆధారంగా కీలక సమాచారం సేకరించారు. కేసు దర్యాప్తులో భాగంగా గతేడాది డిసెంబర్ 22న కీలక నిందితుడు అక్మల్ ఆలంను అరెస్టు చేశారు. అతడి నుంచి సేకరించిన సమాచారంతో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన సీఐడీ సైబర్‌క్రైం ఎస్పీ లావణ్య ఎన్జేపీ, మరో ఎస్పీ బి. రామ్‌రెడ్డిని మహేశ్‌భగవత్ అభినందించారు. -
‘అయ్యన్న’ అరెస్టు
నర్సీపట్నం/ఆరిలోవ (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి: ఫోర్జరీ కేసులో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన తనయుడు రాజేష్‌ను సీఐడీ పోలీసులు అరెస్టుచేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శివపురంలోని ఆయన నివాసానికి సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో సీఐడీ పోలీసులు, స్థానిక పోలీసులు గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చేరుకున్నారు. అయ్యన్నపాత్రుడు ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఆయన ఇద్దరు కుమారుల పేరుపై ఐదేళ్ల కిందట ఇళ్లు నిర్మించారు. అక్రమ నిర్మాణాన్ని గుర్తించిన అధికారులు గతంలో దానిని తొలగించే ప్రయత్నం చేశారు. అప్పట్లో రెవెన్యూ అధికారుల సమక్షంలో కూల్చేందుకు సిద్ధంకాగా అయ్యన్న కుటుంబం, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో.. అయ్యన్నపాత్రుడు ఆయన కుమారులు తప్పుడు ఎన్ఓసీ సర్టిఫికెట్ సృష్టించి ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించారని సంబంధిత అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సీఐడీ పోలీసులు గురువారం తెల్లవారుజామున అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్నారు. వెంటనే ఇంటి తలుపులు తీయకపోవడంతో కొద్దిసేపు పోలీసులు నిరీక్షించారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించారు. అదే సమయంలో అయ్యన్న తనయుడు రాజేష్ బయటకు రావడం.. కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కావడంతో ఆయనను ముందుగా అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. ఇంతలో అయ్యన్నపాత్రుడు బయటకొచ్చి.. నన్ను అరెస్టుచేసేందుకు ఇంతమంది రావటం అవసరమా అని ప్రశ్నించారు. అరెస్టుగల కారణాలు తెలియజేస్తూ నోటీసును అయ్యన్నపాత్రుడికి పోలీసులు అందజేశారు. దీనిపై అయ్యన్న, సీఐడీ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు అయ్యన్నపాత్రుడు నోటిసుపై సంతకం చేశారు. అరెస్టుచేసి ఇంట్లో నుండి బయటకు తీసుకువస్తుండగా నోటీసును తన చేతికిస్తేనే వస్తానని అయ్యన్నపాత్రుడు మెలిక పెట్టారు. పోలీసులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఆయన్ను వాహనంలోకి ఎక్కించి విశాఖకు తరలించారు. మరోవైపు.. శాంతియాత్ర పేరుతో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని అరెస్టుచేశారు. సీఐడీ కార్యాలయం వద్ద హైడ్రామా ఇక నర్సీపట్నంలో అరెస్టుచేసిన అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను పైనాపిల్ కాలనీలో ఉన్న సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇక్కడ విచారిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఇతర నాయకులు సీఐడీ కార్యాలయానికి చేరుకుని కొంతసేపు హైడ్రామా నడిపారు. కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ వారిని తోసుకుని వెళ్లడానికి ప్రయత్నించిన వెలగపూడి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌తో పాటు మరికొంతమంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్టుచేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఇక మధ్యాహ్నం వరకు అక్కడే విచారించిన సీఐడీ అధికారులు 2.30 గంటలకు అయ్యన్నతో పాటు కుమారుడు రాజేష్‌ను వైద్య పరీక్షలు నిమిత్తం సింహాచలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి సా.4.30 గంటలకు విశాఖ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించిన కోర్టు సా.5.40 గంటలకు ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు వారిని పోలీసులు హాజరుపరిచారు. అయ్యన్న, అతని కుమారుడు రాజేష్‌లపై రిమాండ్ రిపోర్టును ఏపీపీ ఆదినారాయణ ద్వారా సీడీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. దానిపై ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సీఐడీ అధికారులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పెట్టిన సెక్షన్లు, నమోదు చేసిన కేసుతో పొంతనలేదని జడ్జి రిమాండ్ రిపోర్టును తిరస్కరించారు. దీంతో పోలీసులు వారికి 41ఎ నోటీసులు అందజేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈఈ ఫిర్యాదుతో ‘ఫోర్జరీ’ వెలుగులోకి.. ఇక చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబీకులు 2017లో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి బిల్డింగ్ ప్లాన్ అనుమతి కోసం అదే ఏడాదిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో (సెటిల్మెంట్ డీడ్ నెం–3660 ఆఫ్ 2017) సర్వే నెంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరారు. దక్షిణం, పశ్చిమం వైపునకు పంట కాలువ ఉన్నట్లు ప్లాన్‌లో చూపించారు. అయితే, నిర్మాణ సమయంలో ఈ కాలువను ఆక్రమించి నిర్మాణాన్ని చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్ఓసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్ఓసీని జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మల్జికార్జునరావు సంతకంతో ఇచ్చినట్లుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన సదరు ఈఈ.. ఎన్ఓసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాక.. దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదన్న సంగతి ఆయనకు స్పష్టమైంది. అదే విధంగా కోర్టుకు సమర్పించిన ఎన్ఓసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాకపోవడంతో ఈ విషయాన్ని జలవనరుల శాఖ ఈఈ మల్జికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పారు. ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనే అని తెలిపారు. మరోవైపు.. కార్యాలయం సీల్ కూడా తమది కాదని స్పష్టంచేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెప్టెంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన విచారణ నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్ఓసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. ఫోర్జరీ కారణంగానే అరెస్టు చేశాం : సీఐడీ డీఐజీ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా అధికారుల సంతకాలను ఫోర్జరీచేసి నకిలీ ఎన్ఓసీలతో ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను గురువారం అరెస్టుచేసినట్లు సీఐడీ విభాగం డీఐజీ సునీల్‌నాయక్ వెల్లడించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ స్థలం కబ్జా, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారంటూ అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులు విజయ్, రాజేష్‌లపై నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ కె.మల్లికార్జునరావు ఫిర్యాదు చేశారని చెప్పారు. దాంతో సెక్షన్లు 464, 467, 471, 474, 120 (బి), 34 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఫోర్జరీ చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని సునీల్‌నాయక్ తెలిపారు. దీంతో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను అరెస్టుచేశామన్నారు. మిగిలిన నిందితులను గాలించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు. -
చంద్రబాబు టీడీపీ నేతలకు సొంత రాజ్యాంగం రాశాడు : మంత్రి జోగి రమేష్
-
చట్టప్రకారమే అయ్యన్నపాత్రుడు ని అరెస్ట్ చేశాం : ఏపీ సీఐడీ
-
అయ్యన్నపాత్రుడు అడ్డంగా దొరికిపోయారు : బూడి ముత్యాల నాయుడు
-
‘స్మార్ట్ విలేజ్’ సుధాకర్‌కు రిమాండ్
ఆరిలోవ(విశాఖ తూర్పు): స్మార్ట్ విలేజ్ అనే సంస్థ ఏర్పాటు చేసి.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ముంచేసిన ఇందుపూడి సుధాకర్‌కు కోర్టు రిమాండ్ విధించింది. ఈ వివరాలను సీఐడీ డీఎస్పీ చక్రవర్తి సోమవారం మీడియాకు వెల్లడించారు. అనకాపల్లికి చెందిన ఇందుపూడి సుధాకర్ 2018లో స్మార్ట్ విలేజ్ సంస్థ ఏర్పాటు చేసి క్రమంగా రాష్ట్రంలో సుమారు 7,000 మందిని ఉద్యోగాల్లో చేర్చుకున్నాడు. ఇందుకుగాను కేడర్‌ను బట్టి రూ.1.50 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు తీసుకున్నాడు. ఇలా రూ.300 కోట్ల వరకు వసూలుచేశాడు. అయితే డబ్బులిచ్చిన చాలా మందికి సుధాకర్ ఉద్యోగాలివ్వలేదు. ఉద్యోగాలిచ్చిన కొంతమందికేమో జీతాలు ఇవ్వట్లేదు. దీంతో వివిధ జిల్లాలకు చెందిన బాధితులంతా కొంతకాలం కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ ఆదివారం సుధాకర్‌ను అదుపులోకి తీసుకుంది. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐడీ డీఎస్పీ చక్రవర్తి తెలిపారు. బాధితులు విశాఖ సీఐడీ కార్యాలయంలోని సీఐ బుచ్చిరాజు 9441379913ను సంప్రదించి.. తమ వివరాలు చెప్పాలని సూచించారు. ఈ కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని చెప్పారు. కాగా, సుధాకర్‌ను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న బాధితులు సోమవారం విశాఖ సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సుధాకర్ బీజేపీ నాయకుల పేర్లు చెప్పి మోసం చేశాడని.. తమకు న్యాయం చేయాలంటూ కోరారు. -
అతడి అవినీతికి 2,320 ఎకరాలు హాంఫట్
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో భారీ భూ కుంభకోణాన్ని సీఐడీ పోలీసులు ఛేదించారు. నకిలీ పత్రాలతో 2,320 ఎకరాల ప్రభుత్వ భూములను తన తండ్రి పేరుతో ఆన్లైన్ చేయించిన మాజీ వీఆర్వో బాగోతాన్ని బట్టబయలు చేశారు. 13 మండలాల్లోని 18 గ్రామాల్లో భూములను దర్జాగా స్వాహా చేసిన వైనాన్ని బయటపెట్టారు. అక్రమాలకు పాల్పడిన 184 గొల్లపల్లికి చెందిన మాజీ వీఆర్వో మోహన్ గణేష్ పిళ్లైని, మరో నలుగురిని అరెస్టు చేశారు. సీఐడీ డీఎస్పీ జి.రవికుమార్ ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. యాదమరి మండలం 184 గొల్లపల్లికి చెందిన మోహన్ గణేష్ పిళ్లై వారసత్వ రీత్యా 1977లో 184 గొల్లపల్లి కరణంగా విధుల్లో చేరాడు. 1984లో గ్రామాధికారుల వ్యవస్థ రద్దు కావడంతో ఉద్యోగం కోల్పోయాడు. తిరిగి 1992లో అదే గ్రామంలో వీఏవోగా ఉద్యోగం సంపాదించిన ఆయన అక్కడే 2010లో వీఆర్వోగా ఉద్యోగ విరమణ చేశాడు. ఎన్నెన్ని నకిలీ పత్రాలో.. ఈ భూముల స్వాహాకు మోహన్ గణేష్ పిళ్లై ఎన్నో నకిలీ పత్రాలు సృష్టించాడు. పుంగనూరు, బంగారుపాళెం, గుర్రంకొండ, సత్యవేడు, ఏర్పేడు, చంద్రగిరి, చిత్తూరు, సోమల, పెద్దపంజాణి, యాదమరి, కేవీపల్లె, రామచంద్రాపురం, తంబళ్లపల్లి మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో 2,320 ఎకరాల ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలను సృష్టించి కాజేశాడు. నిందితులు అక్రమంగా తయారు చేసిన రబ్బరు స్టాంప్, నకిలీ దస్తావేజులు ► తన తల్లి అమృతవల్లి యావదాస్తిని మరణానంతరం మనుమలు, మనమరాళ్లకు చెందేలా 1985 ఆగస్టు 16న వీలునామా రాసి చనిపోయినట్లు బంగారుపాళెం సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిస్టర్ చేయించాడు. ► 2005 నుంచి 2010 వరకు గ్రామ అడంగళ్లను కంప్యూటరీకరణ చేసే సమయంలో చిత్తూరు కలెక్టరేట్ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్) ద్వారా 18 గ్రామాలకు సంబంధించిన అడంగళ్లలోని భూముల వివరాలను ఎల్‌ఆర్‌ఎంఐఎస్ (ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)లో నమోదు చేయించాడు. 13 మండలాల్లోని 18 గ్రామాల పరిధిలో తన తండ్రి శ్రీనివాస పిళ్లైకి 2,320 ఎకరాల భూములు ఉన్నట్లు తన కుమారుడు మధుసూదన్ సహకారంతో 2009 జూలై 1న ఆన్లైన్ చేయించాడు. ► ఆ భూ హక్కులను ఆయన తల్లి అమృతవల్లి పేరిట 1981లో బదిలీ చేస్తున్నట్లుగా ఒక హక్కు విడుదల పత్రం సృష్టించాడు. ► ఆ పత్రం అసలైనదేనని నమ్మించేందుకు పుంగనూరు జమీందారు నుంచి ఖాళీగా ఉన్న పట్టా కాగితాన్ని సేకరించి అందులో తమ పూర్వీకుల పేర్లు నమోదు చేశాడు. ► ఆ భూములకు పన్ను చెల్లించినట్లు నకిలీ రసీదులు తయారు చేయించాడు. మండల రెవెన్యూ కార్యాలయంలో ఖాళీ రసీదులను సేకరించి, వాటిపై పన్ను చెల్లించినట్లు సృష్టించాడు. ► చిత్తూరు కలెక్టరేట్లోని రెవెన్యూ రికార్డులు (అడంగల్) తెప్పించి కంప్యూటరీకరణ చేయించుకున్నాడు. ► కొట్టేసిన భూములను విక్రయించేందుకు టీడీపీ నాయకుడు అడవి రమణ సహకారం తీసుకున్నాడు. ► మీ సేవ ద్వారా 1బి, అడంగల్‌ను తీసుకుని ఆయన పిల్లలు రాజన్, ధరణి, మధుసూదన్ సోమల తహసీల్దార్ శ్యాంప్రసాద్‌రెడ్డిని కలిశారు. సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి గ్రామ సర్వే నంబరు 459లో తమకు ఉన్న 160.09 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని దరఖాస్తు చేశారు. ► రికార్డులు పరిశీలించిన రెవెన్యూ అధికారులు 459 సర్వే నంబర్లో 45.42 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఉందని గుర్తించారు. 160.09 ఎకరాల భూమి ఆన్‌లైన్‌లోకి ఎలా వచ్చిందని కూలంకషంగా పరిశీలించడంతో అడ్డగోలు రికార్డులు బయటపడ్డాయి. ► దీనిపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు గత ఏడాది మే 29న సోమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తుండటంతో కేసును సీఐడీకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ డీఎస్పీ జి.రవికుమార్ విచారణ కోసం ఎస్ఐ అన్సర్ బాషా, ప్రభాకర్, పుష్పలత, రవిచంద్రలను నియమించారు. సీఐడీ దర్యాప్తులో మాజీ వీఆర్వో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితులైన మోహన్ గణేశ్ పిళ్లై, మధుసూదన్, రాజన్, కోమల, అడవి రమణలను అరెస్టు చేశారు. -
రిమాండ్‌కు ‘ఈబిడ్’ సూత్రధారి సునీల్
అనంతపురం క్రైం: అనంతపురం జిల్లాలో సంచలనం రేకెత్తించిన ఈబీఐడీడీ (ఈబిడ్) స్కామ్ సూత్రధారి కడియాల సునీల్ అలియాస్ మాథ్యూ అలియాస్ తినువత్తా సునీల్ కడియాల కటకటాలపాలయ్యాడు. ఇతన్ని మంగళవారం సీఐడీ డీఎస్పీ పూజిత ఆధ్వర్యంలో పోలీసులు కర్నూలు నుంచి అనంతపురం తీసుకువచ్చారు. రూరల్ పోలీసుస్టేషన్ నుంచి బ్లూజీన్ యాప్ ద్వారా వర్చువల్ విధానంలో జిల్లా జడ్జి అరుణ సారిక ముందు హాజరుపరిచారు. ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. అంతకుముందు సునీల్‌కు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదీ నేపథ్యం.. ఈబిడ్ నిర్వాహకులు అధిక వడ్డీ ఇస్తామని ఆశచూపి రూ.28 లక్షలు కట్టించుకుని మోసం చేశారని ధర్మవరం మండలం వసంతపురానికి చెందిన ఎం. బాబుల్‌రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 14న ధర్మవరం రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కడియాల సునీల్, జాస్తి సుధాకర్, మహేంద్ర చౌదరిలపై పోలీసులు ఐపీసీ సెక్షన్–420, 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే, ఈ ఏడాది మహారాష్ట్రలోని నాగ్‌పూర్ బజాజ్‌నగర్ పీఎస్‌లో నమోదైన ఓ చీటింగ్ కేసులో అక్కడి కోర్టు సునీల్‌కు రిమాండ్ విధించింది. ఈబిడ్ కేసు సీఐడీకి బదిలీ కావడంతో పోలీసులు గత నెల 27న జిల్లా కోర్టులో పీటీ వారెంట్ తీసుకుని ఈ నెల 6న నాగ్‌పూర్ జైలు నుంచి సునీల్‌ను కర్నూలుకు తీసుకువచ్చి మంగళవారం అనంతపురం జిల్లా జడ్జి ముందు హాజరుపర్చారు. ఇదే కేసులో మహేంద్ర చౌదరి ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నాడు. కడియాలపై మరో 15 కేసులు? కడియాల సునీల్‌పై జిల్లాలో మరో 15 కేసులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక కేసులో మాత్రమే కోర్టు రిమాండ్ విధించింది. మిగిలిన కేసులకు సంబంధించి కూడా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. అలాగే, రిమాండ్‌లో ఉన్న కడియాల సునీల్‌ను విచారణ నిమిత్తం సీఐడీ పోలీసులు బుధవారం కస్టడీకి కోరనున్నట్లు తెలిసింది. ఈ విచారణలో ఈబిడ్ అక్రమాలు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉంది. ఈ స్కామ్‌లో సునీల్ వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టనున్నారు. -
పెదకాకానిలో అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ విచారణ
పెదకాకాని : పెదకాకాని మండలంలోని అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారు. నంబూరు గ్రామ శివార్లలో అగ్రిగోల్డ్ ప్రతినిధులు 2010లో భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సీఐడీ డీఎస్పీ రామారావు సిబ్బందితో శనివారం పెదకాకాని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అగ్రిగోల్డ్ ప్రతినిధులు నంబూరులో సర్వే నంబర్ 175బీలో 2.10 ఎకరాలు, 178లో ఎకరం చొప్పున మొత్తం 3.10 ఎకరాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆ భూమిలో 1.60 ఎకరాలను 2014లో వెర్టెక్స్ వెంచర్ నిర్వాహకులు కొనుగోలు చేశారని, అలానే 1.50 ఎకరాలను బొంతు శ్రీనివాసరెడ్డికి అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేశారని గుర్తించారు. అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారులకు డిపాజిట్లు చెల్లించకుండా వివాదాల్లో ఉన్నప్పుడు కొనుగోళ్లు, అమ్మకాలు ఎలా చెల్లుతాయన్న అంశంపై చర్చించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఖాతాదారులకు డిపాజిట్లు చెల్లించకుండా మోసం చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులు గుర్తించి బహిరంగ వేలం వేస్తామని సీఐడీ డీఎస్పీ రామారావు చెప్పారు. -
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి
హైదరాబాద్: మహారాష్ట్ర లోని చంద్రాపూర్ లో వ్యభిచార గృహాలపై తెలంగాణ సీఐడీ పోలీసులు దాడి చేశారు. అక్కడ వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు యువతులను రక్షించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 30 మంది మహిళలకు విముక్తి కలిగించారు. బుధవారం తెలంగాణకు చెందిన సీఐడీ బృందం ఈ దాడులు నిర్వహించింది. మహిళలను సాయంత్రం స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నట్టు పోలీసులు తెలిపారు. గురువారం 30 మంది యువతులను హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.