విశాఖలోని సీఐడీ రీజినల్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న బాధితులు
ఆరిలోవ(విశాఖ తూర్పు): స్మార్ట్ విలేజ్ అనే సంస్థ ఏర్పాటు చేసి.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ముంచేసిన ఇందుపూడి సుధాకర్‌కు కోర్టు రిమాండ్ విధించింది. ఈ వివరాలను సీఐడీ డీఎస్పీ చక్రవర్తి సోమవారం మీడియాకు వెల్లడించారు. అనకాపల్లికి చెందిన ఇందుపూడి సుధాకర్ 2018లో స్మార్ట్ విలేజ్ సంస్థ ఏర్పాటు చేసి క్రమంగా రాష్ట్రంలో సుమారు 7,000 మందిని ఉద్యోగాల్లో చేర్చుకున్నాడు. ఇందుకుగాను కేడర్‌ను బట్టి రూ.1.50 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు తీసుకున్నాడు.
ఇలా రూ.300 కోట్ల వరకు వసూలుచేశాడు. అయితే డబ్బులిచ్చిన చాలా మందికి సుధాకర్ ఉద్యోగాలివ్వలేదు. ఉద్యోగాలిచ్చిన కొంతమందికేమో జీతాలు ఇవ్వట్లేదు. దీంతో వివిధ జిల్లాలకు చెందిన బాధితులంతా కొంతకాలం కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ ఆదివారం సుధాకర్‌ను అదుపులోకి తీసుకుంది. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐడీ డీఎస్పీ చక్రవర్తి తెలిపారు.
బాధితులు విశాఖ సీఐడీ కార్యాలయంలోని సీఐ బుచ్చిరాజు 9441379913ను సంప్రదించి.. తమ వివరాలు చెప్పాలని సూచించారు. ఈ కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని చెప్పారు. కాగా, సుధాకర్‌ను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న బాధితులు సోమవారం విశాఖ సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సుధాకర్ బీజేపీ నాయకుల పేర్లు చెప్పి మోసం చేశాడని.. తమకు న్యాయం చేయాలంటూ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment