నిరుద్యోగులకు టోకరా
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
- నిందితుడు పరార్
- పోలీసులను ఆశ్రయించిన బాధితులు
పెదవాల్తేరు: విదేశాల్లో ఉద్యోగాలంటూ నమ్మించిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆశీల్‌మెట్ట రోడ్డులో ఈ ఏడాది మార్చిలో ఫ్లైస్ స్ప్యారో హ్యూమన్ రీసోర్స్ కన్సల్టెన్సీ సంస్థ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ప్రచారం చేశారు.
కేరళకు చెందిన సంతోష్, సాయిశ్రీధర్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. పాండ్యన్ అనే వ్యక్తి యజమాని. గోపాలపట్నానికి చెందిన పున్నంగి మోతిరామ్ నరేష్ ఇటీవల ఈ సంస్థను సంప్రదించాడు. మేనేజర్లతో మాట్లాడి ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో నరేష్ తన ముగ్గురు స్నేహితులకు తెలిపాడు. వారు కూడా సిద్ధపడి కన్సల్టెన్సీకి వెళ్లారు. ఒక్కొక్కరికి రూ.లక్ష 60 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు.
ముందుగా వైద్య పరీక్షలకు రూ.7.500 వంతున చెల్లించుకుని నలుగురిని చెన్నయ్ తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించి పాస్‌పోర్ట్‌లు, మిగతా వ్యవహరాలు పూర్తి చేశామని.. వీసా వచ్చిందని నలుగురికీ తెలిపారు. నకిలీ వీసాను మెయిల్ చేశారు. బాధితుల్లో ఇద్దరు చెరో రూ.1,60,000 ఇచ్చారు. మరో ఇద్దరు ఎన్.పాండ్య, ఖాతాలో రూ. 60వేలు చొప్పున జమ చేశారు. ఈ నేపథ్యంలో మేనేజర్ సంతోష్ సోమవారం ఉదయం తమ కార్యాలయంలో గిరిజ అనే యువతి సెల్‌ఫోన్‌కు ఒక సందేశాన్ని పంపించాడు.
‘పాండ్యన్ డబ్బుతో పరారయ్యాడు..మేం కూడా వెళ్లి పోతున్నాం. ఉద్యోగాల కోసం నగదు చెల్లించిన సిబ్బంది ఎవరు అందుబాటులో ఉండొద్దు’ అని సందేశం పంపించాడు. గిరిజ మిగతా సిబ్బందికి తెలిపింది. జూన్30న ఆస్ట్రేలియా పంపిస్తారని నరేష్, శ్రావణ్‌కుమార్, కోటీశ్వరరావు, సాయికిరణ్‌లు పాస్‌పోర్టులతో అప్పటికే కన్సల్టెన్సీకి వచ్చేశారు.
యజమాని పరారయ్యాడని తెలుసుకుని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫ్లైస్ స్ప్యారో హ్యూమన్ రీసోర్స్ కన్సల్టెన్సీకి వెళ్లి ఫైళ్లు, పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థ ఎక్కువ నిరుద్యోగులకు టోకరా వేసిందని బాధితులు చెబుతున్నారు. సీఐ అప్పలరాజు, ఎస్‌ఐ రామారావులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.