Smart Village
-
‘స్మార్ట్ విలేజ్’ సుధాకర్‌కు రిమాండ్
ఆరిలోవ(విశాఖ తూర్పు): స్మార్ట్ విలేజ్ అనే సంస్థ ఏర్పాటు చేసి.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ముంచేసిన ఇందుపూడి సుధాకర్‌కు కోర్టు రిమాండ్ విధించింది. ఈ వివరాలను సీఐడీ డీఎస్పీ చక్రవర్తి సోమవారం మీడియాకు వెల్లడించారు. అనకాపల్లికి చెందిన ఇందుపూడి సుధాకర్ 2018లో స్మార్ట్ విలేజ్ సంస్థ ఏర్పాటు చేసి క్రమంగా రాష్ట్రంలో సుమారు 7,000 మందిని ఉద్యోగాల్లో చేర్చుకున్నాడు. ఇందుకుగాను కేడర్‌ను బట్టి రూ.1.50 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు తీసుకున్నాడు. ఇలా రూ.300 కోట్ల వరకు వసూలుచేశాడు. అయితే డబ్బులిచ్చిన చాలా మందికి సుధాకర్ ఉద్యోగాలివ్వలేదు. ఉద్యోగాలిచ్చిన కొంతమందికేమో జీతాలు ఇవ్వట్లేదు. దీంతో వివిధ జిల్లాలకు చెందిన బాధితులంతా కొంతకాలం కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ ఆదివారం సుధాకర్‌ను అదుపులోకి తీసుకుంది. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐడీ డీఎస్పీ చక్రవర్తి తెలిపారు. బాధితులు విశాఖ సీఐడీ కార్యాలయంలోని సీఐ బుచ్చిరాజు 9441379913ను సంప్రదించి.. తమ వివరాలు చెప్పాలని సూచించారు. ఈ కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని చెప్పారు. కాగా, సుధాకర్‌ను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న బాధితులు సోమవారం విశాఖ సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సుధాకర్ బీజేపీ నాయకుల పేర్లు చెప్పి మోసం చేశాడని.. తమకు న్యాయం చేయాలంటూ కోరారు. -
మోరి..వట్టి మోళీ..
సఖినేటిపల్లి (రాజోలు): అది 2016 డిసెంబర్ 29వ తేదీ. మండలంలోని మోరి గ్రామంలో చంద్రబాబునాయుడు పర్యటించారు. భారీ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మోరి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్‌గా ప్రకటించారు. ఈ గ్రామాన్ని ఫైబర్ గ్రిడ్‌తో అనుసంధానం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలి పూర్తి నగదు రహిత లావాదేవీలు జరిగే గ్రామమని, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామమని ఆర్భాటంగా ప్రకటించారు. తదనంతర కాలంలో మోరికి శివారుగా ఉన్న మోరిపోడు గ్రామాన్ని కూడా ప్రభుత్వం స్మార్ట్ విలేజ్ జాబితాలోకి చేర్చింది. ఇంకేముంది..! సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటన చేయడంతో ఇక మోరి గ్రామ స్వరూపమే మారిపోతుందని అందరూ అనుకున్నా రు. అయితే, చంద్రబాబు ప్రకటనలు ఆర్భాటానికే పరిమితమయ్యాయి. సు మారు ఏడాదిన్నర అవుతున్నా ఆచరణ అందుకు అనుగుణంగా లేదు. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు పని చేయకపోగా.. నగదు రహితం పేరుకే మిగిలింది. మరుగుదొడ్ల లక్ష్యం కూడా పూర్తి కాకపోవడంతో గ్రామంలో ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన కొనసాగుతోంది. అరకొరగా ఫైబర్ గ్రిడ్ స్మార్ట్ విలేజ్ ప్రోగ్రాంలో భాగంగా మోరి, మోరిపోడు గ్రామాల్లో 1,500 ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటన్నింటినీ స్థానిక కేబుల్ ఆపరేటర్లు ఫైబర్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. వీటిల్లో 300 కనెక్షన్లకు టీవీకి, ఫోన్‌కు పవర్ సప్లై చేసే ఐపీటీవీ బాక్సులలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. అవి ఇన్స్టాల్ కాకపోవడంతో రిప్లేస్మెంట్ నిమిత్తం వెనక్కి ఇచ్చేశారు. వీటిని రిప్లేస్ చేయనున్నట్లు స్థానిక కేబుల్ ఆపరేటర్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ 150 రిప్లేస్ చేసినా, మరో 150 కనెక్షన్లకు రిప్లేస్మెంట్ పూర్తి కావాల్సి ఉంది. గ్రామ శివార్లలో ఫైబర్ గ్రిడ్‌తో అనుసంధానం చేస్తూ ఇచ్చిన సుమారు 300 కనెక్షన్లు వారంలో మూడు రోజులు సాంకేతిక, ఇతర సమస్యలతో పని చేయడం లేదు. టెరాసాఫ్ట్‌కు చెందిన పరికరాలు దెబ్బతిని, ఎక్కడైనా కేబుల్ తెగిపోతున్న సందర్భాల్లో ఆ వీధిలో ప్రసారాలు నిలిచిపోతున్నాయి. దీంతో గ్రామస్తులు కేబుల్ ప్రసారాలకే పరిమితమైపోయారు. సాంకేతిక కారణాలతో ఇప్పటికీ ఫైబర్ గ్రిడ్ సేవలకు నోచుకోని కొన్ని టీవీలకు నో ఇంటర్నెట్ యాక్సెస్ వస్తోంది. దీంతో ఆ ఇంటి యజమానులు ఏం చేయాలో పాలుపోక, కేబుల్ ప్రసారాలతో సరిపెట్టుకుంటున్నారు. పాటలకే పరిమితమైన స్మార్ట్ఫోన్లు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు మోరి గ్రామంలో 600 మందికి స్మార్ట్ఫోన్లు అందజేశారు. అవి నాణ్యమైనవి కాకపోవడంతో కొద్ది కాలానికే సమస్యలు తలెత్తాయి. ఫోన్ ఆన్ చేసిన వెంటనే బ్యాటరీ పని చేయక స్విచ్ ఆఫ్ అవడం, ఫోన్లలోని బ్యాటరీలు ఉబ్బిపోవడం తదితర సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ ఫోన్లు పనికిరాకుండా పోయాయి. మరోపక్క సిగ్నల్ సమస్యలతో ఇంటర్నెట్ సక్రమంగా పని చేయక అవి నిర్దేశించిన లక్ష్యానికి దూరంగా మిగిలిపోయాయి. చివరకు సినిమా పాటలను వినడానికి మాత్రమే డ్వాక్రా మహిళలు వాటిని ఉపయోగించుకుంటున్నారు. నగదుతోనే వ్యాపారం గ్రామాన్ని నగదు రహితంగా సీఎం ప్రకటించగా.. ఇప్పటికీ ఇక్కడ నగదు లావాదేవీలే జరుగుతున్నాయి. గ్రామంలో మెడికల్, కిరాణా, కూరగాయలు, పాన్‌షాప్.. ఇలా అన్నీ కలిపి సుమారు 40 వరకూ ఉన్నాయి. ప్రస్తుతం అన్ని దుకాణాల్లోనూ నగదు లావాదేవీలే జరుపుతున్నారు. కొందరికి స్వైపింగ్ మెషీన్లు ఇచ్చినా సక్రమంగా పని చేయకపోవడంతో నగదు రహిత లావాదేవీలకు స్వస్తి పలికారు.మరికొంతమందికి స్వైపింగ్ మెషీన్లు చేరలేదు.కాగా, మోరి గ్రామానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిన జీడిపప్పు, చేనేత పరిశ్రమల్లో కార్మికులకు నగదు లేనిదే అడుగు ముందుకు పడడం లేదు. ఓడీఎఫ్.. ఉఫ్.. మోరి, మోరిపోడు గ్రామాలను సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహితంగా (ఓడీఎఫ్) తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి అప్పట్లో ప్రకటించారు. కానీ, సీఎం చెప్పిన ఈ మాట కూడా ఆర్భాటంగానే మిగిలింది. ఓడీఎఫ్ గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన నిషిద్ధం. నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరగాలి. కానీ, ఆచరణ అలా లేదు. కొన్నిచోట్ల మరుగుదొడ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్లకు అప్పగించడంతో వారు అరకొరగా నిర్మించి వదిలేశారు. అవి నిరుపయోగంగా మారాయి. స్మార్ట్ విలేజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ రెండు గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఇప్పటికీ మంజూరు చేయలేదు. వీటిని వచ్చే ఆగస్ట్‌లో ఆన్లైన్ చేస్తామని, అప్పటివరకూ ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఈ గ్రామాల్లో ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన కొనసాగుతోంది.మరోపక్క ఈ గ్రామాల్లో పారిశుధ్యం పరమ అధ్వానంగా ఉంది. గ్రామంలో చెత్త వేసేందుకు కనీసం డంపింగ్ యార్డు కూడా లేదు. ఇటీవల చెత్త రీ సైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసినా అది వినియోగంలోకి రాలేదు. -
ఆదర్శ గ్రామానికి ఎంపీ వైవీ రాక నేడు
ఒంగోలు అర్బన్ : ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కడప జిల్లా ఇడుపలపాయ నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జిల్లాలోని ఆదర్శ గ్రామం దద్దవాడకు చేరుకుంటారని ఎంపీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. దద్దవాడలో అధికారులతో గ్రామాభివృద్ధిపై చర్చిస్తారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు గిద్దలూరులో జరగనున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొంటారు. 3న సీపీఓ కాన్ఫరెన్స్ హాలు జరిగే దిశా మీటింగ్‌లో పాల్గొంటారు. 4వ తేదీ యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటిస్తారు. వికలాంగులకు స్క్రీనింగ్ క్యాంప్ ఎంపీ నిధులు.. అలిమ్కో సంస్థ తరుఫున వికలాంగులకు స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించనున్నారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లు, వీల్ చైర్స్, చెవిటి మిషన్లు, కృత్రిమ అవయవాలు అందించేందుకు ఈ క్యాంప్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 8న గిద్దలూరు నియోజకవర్గంలోని కభంలో జూనియర్ కళాశాల ప్రాంగణంలో, 9వ తేదీ కనిగిరి పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణాల్లో క్యాంప్‌లు జరుగుతాయి. అర్హులైన సద్వినియోగం చేసుకోవచ్చు. -
ఊరికేమిచ్చారు?
స్మార్ట్ విలేజ్.. స్మార్ట్ వార్డు... టీడీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కొత్తలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన పథకం. ఆచరణకు నోచుకోకుండానే అటకెక్కేసింది. దత్తత తీసుకున్న పెద్దలంతా పత్తా లేకుండా పోయారు. కోట్లు కుమ్మరిస్తామన్న ఈ శ్రీమంతులు కాస్తా ఉత్తచేతులు చూపారు. ఆదిలో హడావుడి చేసిన సర్కార్ సైతం ఆ తర్వాత మిన్నకుండిపోయింది. ఆర్నెల్లుగా ఈ వెబ్సైట్ మూగబోవడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి మొదలు గ్రామ సర్పంచ్ వరకు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల మొదలు మండల స్థాయి అధికారుల వరకు ఏ ఒక్కరూ వారు దత్తత తీసుకున్న గ్రామాలలో అడుగు పెట్టిన దాఖలాలే లేవు. జేబులో రూపాయి ఖర్చు పెట్టేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగు పెట్టకున్నప్పటికీ తాను దత్తత తీసుకున్న గ్రామంలో రెండేళ్ల తర్వాత ఇటీవలే కొన్ని పనులు చేపట్టారు. -
దరికిరాని శ్రీమంతుడు
జిల్లాలో ప్రతిగ్రామాన్ని ఆకర్షణీయ(స్మార్టు) గ్రామంగా తీర్చి దిద్దాలి. ప్రతివార్డు అందంగా రూపు మార్చుకోవాలి. అందమైన గ్రామాలు, నగరాలుగా వృద్ది చెందాలి. స్వచ్ఛభారత్ ట్రస్టు నిర్థేశించిన ప్రకారం 20 సూత్రాలు ఆచరణ సాధ్యం కావాలి. దత్తత స్వీకరించిన వారి సహకారాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో నడవాలి. ఇదీ స్మార్ట్ లక్ష్యం. ఈ లక్ష్యంతోనే జిల్లా కలెక్టరు, జారుుంట్ కలెక్టరు, దిగువస్థాయి అధికారుల వరకు ఒక్కోగ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అక్కడ వసతుల కల్పనతోపాటు మార్పు తీసుకు రావడానికి ప్రయత్నం మొదలు పెట్టారు. ప్రజా ప్రతినిధులు కూడా తాము ఉన్నామంటూ మరి కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. కానీ ఈ గ్రామాల్లో స్టార్టు ప్రయత్నాలు కనిపించడం లేదు. శ్రీకాకుళం : గత ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామాలను..పట్టణాలను స్మార్టుగా మార్చుతామంటూ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులూ, ఎమ్మెల్యేలు,మండల స్థాయి ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏడాది గడిచినా లక్ష్యం దిశగా ఒక్కఅడుగూ ముందుకు కదలలేదు. గ్రామాల దత్తత వరకు ఎవరికివారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రకటించినా తర్వాత విస్మరించారు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్-1 అధికారులు,ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు కూడా స్పందించారు. గ్రామాలు, వార్డులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ముందుకొచ్చారు. ఆరంభంలో ఆర్భాటంగానే ఈప్రక్రియ సాగింది. అందరూ సంతోషించారు. ఈ ఆనందం ఎక్కువ కాలం నిడబడలేదు. భాగస్వాములుగా కొందరు ముందుకు వచ్చినా సూక్ష్మస్థాయి ప్రణాళికలు లోపించడంతో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. ఎంపిక చేసిన గ్రామాలు, వార్డుల్లో చేపట్టాల్సిన అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించలేని స్థితిలో అధికార యంత్రాంగం ఉంది. స్మార్టు అంటే.. స్మార్టు గ్రామం అంటే సామాన్యులకు సోషల్స్కిల్స్, ఆధునిక సాంకేతిక ఆలోచనల వైపునకు గ్రామీణులను నడిపించడం, దత్తతపై అవగాహన, సామాజిక బాధ్యతకు సిద్ధం చేయడం, సాంకేతికత ద్వారా పారదర్శకంగా ఉం డేందుకు గ్రామాలను తయారు చేయడమే స్మార్ట్ లక్ష్యం. జిల్లాలో 1246 గ్రామాలను దత్తత గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశారు. వాటిని దత్తత తీసుకునేందుకు 933 దరఖాస్తులు వచ్చాయి. 79 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 683 మంది పూర్తి దత్తతకు దరఖాస్తు చేసుకోగా 161 మంది సెక్టార్ల వారీగా దత్తత స్వీకరించారు. సమావేశాలతోనే సరి.. దత్తత స్వీకరించిన గ్రామాల్లో మార్పు తీసుకు రావాలన్న తొలిప్రయత్నంలో సమావేశాలు నిర్వహించారు. సమావేశాలలో హాజరైన వారే సమస్యలను గుర్తు చేస్తూ ప్రసంగాలు ఊదరగొట్టారు. ఇది ఆరంభ శూరత్వంగానే మిగిలిపోరుుంది. దత్తత తీసుకుని ఏడాది గడచినా ఇంతవరకు ఆగ్రామాల్లో నామమాత్రపు లక్ష్యాలను సాధించలేకపోయారు. శతశాతం అక్షరాస్యత, బహిరంగ మలవిసర్జన, పారిశుధ్య నిర్వహణవైపు దృష్టి సారించలేదు. ఏడాది గడిచినా ఆ గ్రామాలను సమస్యలు వీడలేదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పారిశుధ్యం ప్రాధాన్యతాంశం. శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా పరిసరాల పరిశుభ్రత , ఆరోగ్యం వంటి సౌకర్యాలు కుదుటపడతాయి. శతశాతం అక్షరాస్యత సాధించడానికి సాంకేతిక విద్య ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార, వాణిజ్య విషయాలతోపాటు విద్య, ఇతర విషయాలు అవగాహన పెంచుకోవచ్చు. రోడ్లు, కాల్వలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుకునేందుకు వీలుకలుగుతుంది. శంభాంలో నెలకొకరోజు.. కలెక్టరు డా.లక్ష్మీనృసింహం సీతంపేట మండలం శంభాం గిరిజన గ్రామాన్ని దత్తత స్వీకరించారు. నెలరోజుల కొకమారు గ్రామాన్నిసందర్శిస్తున్నారు. సౌకర్యాలు మాత్రం వారికి అందనంత ఎత్తులోనే ఉన్నాయి. శతశాతం విద్య సాధించడానికి కృషి జరుగుతోందని కలెక్టరు చెబుతున్నారు. ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు సంతబొమ్మాళి మండల కేంద్రాన్ని దత్తత తీసుకున్నారు. ఆగ్రామానికి ఆయన సందర్శించడం తప్ప అక్కడ చేసిన అభివృధ్ధి కనిపించడం లేదు. మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి మండలం బన్నువాడ గ్రామాన్ని దత్తత స్వీకరించారు. ఇక్కడ తాగునీరు, పారిశుద్య సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దత్తత స్వీకరిం చిన నాటినుంచి గ్రామానికి రెండు సార్లు మంత్రి అచ్చెన్నాయుడువచ్చి వెళ్లారని, కాని సమస్యల పరిష్కారం మాత్రం ఇంతవరకు నోచుకోలేదని గ్రామస్థులు చెపుతున్నారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఆమదాలవలస మండలం చిట్టివలస గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈగ్రామాన్ని ఆయన మూడు సార్లు సందర్శించినా సమస్యల పరిష్కారం మొదలు కాలేదు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల సింగుపురం, వప్పంగి గ్రామాల్లో పాఠశాలలను దత్తత తీసుకుని సాంకేతిక విద్యను అందిస్తున్నారు. రాజాం పట్టణాన్ని జీఎంఆర్ సంస్థ దత్తత స్వీకరించింది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరించినా ఇంతవరకు మార్పు దిశగా అడుగులు మొదలు కాలేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా దత్తత తీసుకున్న వారు 553మంది ఉన్నారు. వీరంతా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని గ్రామాలను దత్తత స్వీకరించడానికి ముందుకొచ్చారు. అయితే ఆస్థాయిలో పల్లెల్లో మార్పు కనిపించడం లేదు. అచ్చెన్నా..మరిచేనా.. టెక్కలి: టెక్కలి మండలంలో బన్నువాడ గ్రామాన్ని మంత్రి కె.అచ్చెన్నాయుడు దత్తత తీసుకున్నారు. ఏడాది గడుస్తున్నప్పటికీ గ్రామంలో అభివృద్ధి చర్యలు కానరావడం లేదు. సుమారు 1700 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో పూర్తి స్థాయిలో మురుగు కాలువలు లేవు. వినియోగించిన నీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. కాలువలు అసంపూర్తిగా నిర్మించారు. దీంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఉనికి కోల్పోయూరుు. గ్రామంలో పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు కూడా లేవు. గ్రామంలో వంశధార కాలువకు ఆనుకుని ప్రమాదకర పరిస్థితుల్లో అంగన్వాడీ భవనం నిర్మిస్తున్నారు. ఈవిషయంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. విప్ గారూ ..ఒకసారి రండి జనాభాః758, నివాస గృహాలుః 217, ఆమదాలవలస : ప్రభుత్వ విప్ కూన రవికుమార్ చిట్టివలస గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దుతానని ఆ గ్రామంలో ప్రతిజ్ఞ కూడా చేశారు. ఆ హడావిడి సర్వే, సమీక్షలకే పరిమితమైంది. కనీస వసతులు కూడా కల్పించలేదని ప్రజలు వాపోతున్నారు. రూ. 9లక్షల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మిస్తానన్నారు. శివార్లలో బోరు తవ్వించి ట్యాంకు నిర్మించకుండా నేరుగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి కుళాయిలు బిగించారు. ఇప్పటికీ అది ప్రారంభం కాలేదు. ఏడాదిగా ప్రభుత్వ విప్ గ్రామం వైపు కన్నెత్తి చూసిన దాఖలా కూడా లేదు. -
'త్వరలో మహేష్‌బాబు వస్తారు'
గుంటూరు : బుర్రిపాలెంను స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత ఆ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గురువారం నమ్రత గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించారు. అనంతరం స్థానిక కళ్యాణ మండపంలో గ్రామస్తులతో నమ్రత సమావేశమయ్యారు. గ్రామంలో సమస్యలను ఈ సందర్భంగా నమ్రత అడిగి తెలుసుకున్నారు. త్వరలో బుర్రిపాలెంలో ప్రిన్స్ మహేష్ బాబు పర్యటిస్తారని నమ్రత గ్రామస్తులకు తెలిపారు. నమ్రత వెంట మహేష్ బాబు సోదరి గల్లా పద్మావతి ఉన్నారు. -
నీరసంగా నిర్మల్
⇒ నిర్మల్ గ్రామాల్లో కానరాని పారిశుధ్యం ⇒ ఎంపికచేసి చేతులుదులుపుకున్న వైనం ⇒ పూర్తికాని వ్యక్తిగత మరుగుదొడ్లు స్మార్ట్ సిటీ.. స్మార్ట్ విలేజ్ అంటూ ఊహాలోకాల్లో విహరిస్తున్న పాలకులు దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల్లో అభివృద్ధిని మాత్రం గాలికొదిలేస్తున్నారు. నిర్మల్ పురస్కారాల ఎంపిక సమయంలో చేస్తున్న హడావుడి ఆ తర్వాత కనిపించడం లేదు. ఎంపిక సందర్భంగా ఇచ్చే నిధులతో హడావుడిగా పనులు చేసి అందిన కాడికి బొక్కేయడం తప్ప గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు పట్టించుకున్న పాపానపోవడం లేదు.పేరుకు నిర్మల్ పురస్కార గ్రామాలే అయినప్పటికీ అపారిశుధ్యంలో ఇతర పంచాయతీలకు తామేమీ తీసిపోమన్నట్టుగా తయారవుతున్నాయి. విశాఖపట్నం: నిర్మల్ గ్రామాలంటే చాలా అందంగా ఉంటాయని, పారిశుధ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుందని, అందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు ఉంటాయని అనుకుంటాం. కాని చాలా నిర్మల్ గ్రామాల్లో కనీస పారిశుధ్య పరిస్థితులు కూడా కనిపించడం లేదు. జిల్లాలో 925 పంచాయతీలున్నాయి. 2008-09 నుంచి ఇప్పటివరకు 25 పంచాయతీలు నిర్మల్ పురస్కారాలకు ఎంపికయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం కింద గతేడాది ఒక్క విశాఖ జిల్లాలోనే అత్యధికంగా 8 పంచాయతీలు నిర్మల్ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ఇందుకోసం గతేడాది ఆగస్టు 22న విశాఖలో జరిగిన రాష్ర్ట స్థాయి నిర్మల్ పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఆయా పంచాయతీలకు రూ.22 లక్షలు అందజేశారు. మార్చి-31నాటికి కనీసం వంద పంచాయతీలను బహిరంగ మల మూత్ర విసర్జన రహితం (ఓడీఎఫ్)గా ప్రకటించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ పంచాయతీల్లో 30 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేయాలని నిర్దేశించారు. కానీ ఇప్పటివరకు 12 పంచాయతీల్లో మాత్రమే నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి ఓడీఎఫ్ పంచాయతీలుగా ప్రకటించారు. ఈ పంచాయతీల పరిధిలో ఉన్న కుటుంబాల ఆధారంగా సుమారు 5 వేల వ్యక్తిగత మరుగు దొడ్లను నిర్మించగలిగారు. దీంతో ఈ పంచాయతీలకు మాత్రమే 2015 -16 ఆర్థిక సంవత్సరం కింద నిర్మల్ పురస్కారాలు దక్కనున్నాయి. మిగిలిన స్వచ్ఛ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. స్థలా భావం వల్ల చాలా మంది మరుగుదొడ్ల నిర్మాణానికి దూరంగా ఉంటే.. లబ్ధిదారుల ఎంపికలో..బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడం వలన మరుగుదొడ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. పాత పరిస్థితులే పునరావృతం ఇప్పటివరకు ప్రకటించిన 25 నిర్మల్ పురస్కార గ్రామాల్లో కూడా పాత పరిస్థితులే పునరావృతమవుతున్నాయి. పురస్కారాలకు ఎంపికైన గ్రామాలతో ఇక మా పనైపోయిందన్నట్టుగా ఉంది అధికారులు తీరు. నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి.. బహిరంగ మల మూత్రవిసర్జన కు తావు లేని విధంగా పారిశుధ్యాన్ని మెరుగుపర్చిన పంచాయతీలను నిర్మల్ పురస్కారాలకు ఎంపిక చేస్తారు. గ్రామాల్లో సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఆయా పంచాయతీలు చేస్తున్న కృషిని కూడా పరిగణన లోకి తీసుకుంటారు. ఎంపిక సమయంలో అధికారులు చూపిస్తున్న శ్రద్ధ ఆ తర్వాత ఆ పంచాయతీలపై చూపించడం లేదు. ఎంపిక సమయంలో పాటించే ప్రామాణికాలు ఆ తర్వాత అమలవుతున్నది లేనిది పట్టించుకునే నాధుడు లేడు. నిర్మల్ పురస్కారాలకు ఎంపికైన గ్రామాల్లోనే కాదు.. ఈ ఏడాది స్వచ్ఛ గ్రామాలుగా ఎంపికచేసిన పంచాయతీల్లో కూడా పారిశుధ్య పరిస్థితులు అంతంతమాత్రం గానే ఉన్నాయి. ఇవన్నీ పేరుకే బహిరంగ మల మూత్ర విసర్జన రహిత గ్రామాలు. నూరు శాతం మరుగుదొడ్లు కలిగి ఉండాలన్న ప్రాథమిక నిబంధన కూడా ఎంపిక తర్వాత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారవుతోంది. గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్మల్ పురస్కా రాలకు ఎంపికైన, స్వచ్ఛ గ్రామాలుగాప్రకటించిన గ్రామాల్లో సాక్షి బృందం పర్యటిస్తే ఏ గ్రామం చూసినా ఏమూన్నది గర్వకారణం అన్నట్టు అక్కడ పరిస్థితులు దర్శనమిచ్చాయి. లక్ష్యానికి దూరంగా మరుగుదొడ్ల నిర్మాణం ఉదాహరణకు పాయకరావుపేట మండలంలో 2012-13 ఆర్థిక సంవత్సరం కింద గతేడాది నిర్మల్ పురస్కారానికి ఎంపికైన కొత్తూరు పంచాయతీలో 119 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 62 మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేశారు. సీసీరోడ్లు నిర్మాణం, తాగునీటి పథకాలకు రూ.2 లక్షలు, పారిశుధ్య నిర్వహణకు కేటాయించారు. నేటికీ గ్రామంలో సరైన డ్రైనేజి వ్యవస్థలేక పోవడంతో పాటుగ్రామస్తుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక పంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. రాజగోపాలపురం పంచాయతీలో 157 వ్యక్తిగత మరుగుదొడ్లు లక్ష్యం కాగా కేవలం 84 నిర్మాణం జరిగాయి. ఇక్కడ డ్రైనేజీల నిర్మాణం జరగ లేదు. కేశవరంలో నూరుశాతం మరుగు దొడ్ల నిర్మాణం జరిగినా తాగునీటి పథకాలు, పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. అచ్యుతాపురం మండలంలో నిర్మల్ పురస్కా రాలకు ఎంపికైన ఇరువాడ, జంగులూరు, దొప్పెర్ల, చీమలాపల్లి, ఎర్రవరం, ఆవసోమవరం పంచాయతీల్లో ఎంపిక సమయంలో చూపినంత చిత్తశుద్ధి ప్రస్తుతం కన్పించడం లేదు. ఆవసోమవరంలో రోడ్డు , కమ్యూనిటీ భవనం, పంచాయతీ భవనం శిథిలమయ్యాయి. చెత్తబండి పాడైపోయింది. చీమలాపల్లిలో గ్రామానికి సమీపంలోనే చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ డ్రైనేజీసమస్య ఉంది. జంగులూరు, దొప్పెర్ల, ఎర్రవరం పంచాయతీలలో పారిశుధ్యం కార్మికులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేక ఇబ్బందిపడుతున్నారు. వీటికి భిన్నంగా మునగపాక మండలంలో నిర్మల్ పురస్కారానికి ఎంపికైన అరబుపాలెంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి.13వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో రైతుల ప్రయోజనార్థం రెండు కల్వర్టులు, 27 కొళాయిల దిమ్మలు, బట్టలు ఉతుక్కునేందుకు వీలుగా దిమ్మలు, తాగునీటి ఇబ్బందులు లే కుండా నూతనంగా పైప్‌లైన్ ఎక్స్‌టెన్సన్ పనులు చేపట్టారు. రూ 2లక్షల వ్యయంతో దళితవాడలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. -
ప్రతి గ్రామం సింగపూర్‌లా ఉండాలి
గుంటూరు వెస్ట్ : రానున్న నాలుగేళ్లలో జిల్లాలోని ప్రతిగ్రామాన్ని స్మార్ట్సిటీలా తయారు చేయాలని, ఆ గ్రామాలు సింగపూర్‌లా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు ఆదేశించారు. అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలుచేయాలని సూచించారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాలులో శుక్రవారం స్మార్ట్ విలేజ్‌లు, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, పారిశుధ్యం, ఎన్ఆర్ఇజిఎస్ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్విలేజ్లు అంటే గ్రామాల్లోని అన్నివర్గాల వారి జీవనవిధానాలు మెరుగుపడాలని, ప్రతిఒక్కరూ అందమైన గ్రామంలో నివసిస్తున్నామనే భావన కలిగేలా స్మార్ట్విలేజ్లను తీర్చిదిద్దాలన్నారు. గ్రామాలలో అందమైన రోడ్లు, పరిశుభ్రమైన నీరు తదితర సౌకర్యాలను కల్పించాలని, గ్రామాలను గ్రీనరీగా మార్చాలని కోరారు. ప్రతి అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, తన సొంతగ్రామంగా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. కొంతమంది అధికారులలో అలసత్వం కనిపిస్తున్నదని, అలసత్వాన్ని వీడి ప్రభుత్వ పథకాలను సమర్ధంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఉపాధి హామీలో పనిదినాలు పెంచాలి... ఎన్ఆర్ఇజిఎస్ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జాబ్‌కార్డుదారులకు పనులు కల్పించాలన్నారు. నిరుద్యోగులు, గర్భిణులు, వికలాంగులతో పనులు చేయించాలని సూచించారు. వారు పనులు చేయలేని పరిస్థితులు ఉంటే వారి తరపువారు పనులు చేసినా సదరు గర్భిణుల ఖాతాలోకి నగదును జమ చేయాలని, పనిదినాలను పెంచాలని ఆదేశించారు. ఇప్పటివరకు కమర్షియల్ భవనాలకు ఇంకుడు గుంతలు తీసుకునే అవకాశం ఉందని, ఇళ్లలో కూడా ఇంకుడుగుంతలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెనాలి ఎంపీడీవో సమావేశం దృష్టికి తీసుకురాగా కమిషనర్ అందుకు అనుమతులు జారీచేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో డిసెంబర్ నెలాఖరు నాటికి 188 గ్రామాలను బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా రూపొందించాలని రామాంజనేయులు సూచించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ జిల్లాలో రూ.70 కోట్లతో 838 గ్రామాలలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీతో నిర్మించేలా పంచాయతీల నుంచి తీర్మానాలు అందాయని తెలిపారు. ఆయా గ్రామాలలో వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. జెడ్పీ సీఈఓ బి.సుబ్బారావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఇ గోపాలకృష్ణ, పీఆర్ ఎస్ఈ జయరాజ్, డీపీవో వీరయ్య, డ్వామా పీడీ కె.బాలాజీనాయక్, వివిధ మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలో, ఆర్‌డబ్య్లూఎస్ ఏఈలు పాల్గొన్నారు. -
‘స్మార్ట్’ అంతంతే
గ్రామాల దత్తతకు స్పందన కరువు అభివృద్ధి చేసే విషయంలో దూరం ఏలూరు :గ్రామాల అభివృద్ధిపై సర్కారు శీతకన్ను వేస్తోంది. ‘స్మార్ట్ విలేజ్’ పేరిట గ్రామాలను దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆచరణలో మాత్రం చతికిలపడుతోంది. గ్రామాల దత్తతకు ప్రవాస భారతీయులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రాకపోవడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో మొత్తం 902 గ్రామాలున్నాయి. గడచిన నాలుగు నెలల్లో 425 గ్రామాలను దత్తత తీసుకోవడానికి ప్రవాస భారతీయులు, దాతలతోపాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకువచ్చాయి. అయితే, అధికారికంగా 355 గ్రామాలను మాత్రమే దత్తత ఇచ్చారు. వీటిలోనూ ఇప్పటివరకూ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇదిలావుంటే, మిగిలిన 547 గ్రామాలను ఎవరికి దత్తత ఇవ్వాలో తెలియక అధికారులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాకు చెందిన 700 మంది విదేశాల్లో స్థిరపడినట్టు గుర్తిం చారు. వారిలో 45 మంది మాత్రమే గ్రామాల దత్తతకు ముందుకు వచ్చినట్టు సమాచారం. వీరంతా ఆయా గ్రామాల్లో గతంనుంచీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నవారే. స్వగ్రామాల్లో ఎంతోకొంత అభివృద్ధి చేస్తున్న ప్రవాస భారతీయులు తాము చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించేందుకు ఆ గ్రామాలను దత్తత తీసుకున్నట్టు చెబుతున్నారు. కొత్తగా గ్రామాల దత్తతకు ఎవరూ ముం దుకు రావడం లేదు. పట్టణాల్లో స్మార్ట్ వార్డుల విషయానికి వస్తే నిడదవోలు మిన హా జిల్లాలో ఎక్కడా ఆశాజనకమైన పరిస్థితి లేదు. గ్రామాల దత్తతపై జిల్లా స్థాయిలో కలెక్టర్, రాజధాని స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడి యో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలు నిర్వహించినా పురోగతి కనిపించడం లేదు. 20 అంశాల మాటేమిటి! గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. ఆర్థిక సంఘం నిధులే గ్రామాలను ఆదుకుంటున్నాయి. ఇందులో సగం విద్యుత్ బకాయిలకు పోతోంది. మిగిలిన సగం నిధులు మంచినీరు, పారిశుధ్య పనులకు సరిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ధేశించిన 20 అంశాల పురోగతి గాలిలో దీపంలా ఉంది. ప్రభుత్వం నిర్ధేశించిన 20 అంశాల్లో గృహ నిర్మాణం, శిశు సంక్షేమం, పిల్లలకు పౌష్టికాహారం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నిర్వహణ, పారిశుధ్యం, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల అభివృద్ధి, అక్షరాస్యత శాతం పెంపు వంటివి ఆచరణకు నోచుకోవడం లేదు. -
స్మార్ట్ యాచన
► జిల్లాలో ముందుకు సాగని స్మార్ట్ విలేజ్ ► దత్తత తీసుకోవాల్సిందేనంటూ కలెక్టర్ హుకుం ► వివిధ వర్గాలపై అధికారుల ఒత్తిడి సాక్షి, చిత్తూరు : జిల్లాలో ‘స్మార్ట్’ పేరుతో అధికారులు యాచనకు దిగారు. గ్రామాలను దత్తత తీసుకునేందుకు దాతలను వెతకాల్సిందేని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అధికారులకు హుకుం జారీచేస్తున్నారు. దీంతో అధికారులు వివిధ వర్గాలపై ఒత్తిడి పెంచారు. ఈ ఏడాది జనవరి 18న సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా గ్రామాల్లో అందరికీ గృహవసతి, మరుగుదొడ్లు, రక్షిత మంచినీరు, నిరంతర విద్యుత్ సదుపాయం కల్పించడం లక్ష్యం. దీంతోపాటు ప్రతి కుటుంబానికి జీవనోపాధి అవకాశాలు, స్వయం సహాయక సభ్యులకు శిక్షణ, బ్యాంకు, మార్కెటింగ్ అనుసంధానంతో గ్రామీణ సూక్ష్మ సంస్థల అభివృద్ధి, బాల్య వివాహాలను అరికట్టడం తదితర 20 అంశాలతో మొత్తంగా గ్రామాన్ని సుందరంగా మార్చాలి ఆయా గ్రామాల్లో పుట్టి ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులను భాగస్వాములను చేసి గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. దాతలు ముందుకు రాని పక్షంలో ప్రభుత్వమే నిధులిచ్చి స్మార్ట్ గ్రామాల అభివృద్ధికి నడుం బిగిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు రావడం లేదు. మరోవైపు ప్రభుత్వం కూడా పైసా వెచ్చించలేదు. ఇప్పుడు స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే బాధ్యత అధికారులపై పడింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే కార్యక్రమం విజయవంతం కాలేదన్న అపవాదు నుంచి బయటపడేందుకు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆధ్వర్యంలో అధికారులు యాచన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 1,363 పంచాయతీలున్నాయి. అన్ని పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల అభివృద్ధికి సైతం దాతలను వెతకాల్సి ఉంది. కార్యక్రమం ప్రారంభమై నాలుగు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు కేవలం 660 మంది దాతలను మాత్రమే వెతికినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇంకా 2వేల మందిని వెతికితే తప్ప స్మార్ట్ విలేజ్ విజయవంతమయ్యే పరిస్థితి కానరావడం లేదు. దీంతో మరింత సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ శ్రీకారం చుట్టారు. జిల్లాలో 1,363 పంచాయతీలున్నాయి. అన్ని పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల అభివృద్ధికి సైతం దాతలను వెతకాల్సి ఉంది. కార్యక్రమం ప్రారంభమై నాలుగు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు కేవలం 660 మంది దాతలను మాత్రమే వెతికినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇంకా 2వేల మందిని వెతికితే తప్ప స్మార్ట్ విలేజ్ విజయవంతమయ్యే పరిస్థితి కానరావడం లేదు. దీంతో మరింత సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ వారం రోజుల పాటు వరుసగా సమావేశాలు పెట్టి అధికారులను హడలెత్తిస్తున్నారు. దాతలను వెతకాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేశారు. దీంతో అధికారులు గ్రానైట్, క్వారీ, క్రషింగ్ యూనిట్లు, పరిశ్రమలు, సంస్థలకు చెందిన యజమానులను పిలిపించి ఇప్పటికే సమావేశాలు పెట్టారు. విద్యాసంస్థలు, చిరు వ్యాపారులు, చోటా మోటా నేతలను సైతం వదలడం లేదు. స్మార్ట్ విలేజ్‌లో భాగస్వాములు కావాల్సిందేనంటూ బలవంతంగా పేర్లు నమోదు చేయిస్తున్నట్లు సమాచారం. మరోవైపు దత్తతదారులను పట్టుకునే క్రమంలో అధికారులు సామ, భేద, దండోపాయాలను సైతం ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల బాధ భరించలేకున్నామని పలువురు ‘సాక్షి’తో వాపోయారు. గ్రామాలు, వార్డులను కూడా తమ సొంత డబ్బులతో అభివృద్ధి చేసేటప్పుడు అసలు ప్రభుత్వం ఎందుకు ఉన్నట్లు..? అంటూ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. తీరా సొంత డబ్బులు ఖర్చు చేసినా పేరు ప్రభుత్వం చేయించినట్లే వస్తుందని, సొమ్ము జనానిది.. సోకు ప్రభుత్వానిదన్నట్లు ఉంది తప్ప మరొకటి కాదని పలువురు విమర్శిస్తున్నారు. స్మార్ట్ విలేజ్‌కు దాతలను వెతకడం తలకు మించిన భారంగా మారిందని కొందరు అధికారులు వాపోయారు. ముఖ్యమంత్రి వరుస జిల్లా పర్యటనల ఖర్చుతో జిల్లా మొత్తం స్మార్ట్ జిల్లాగా మారిపోయి ఉండేదని కొందరు అధికారులు బాహాటంగా వ్యాఖ్యనించడం విశేషం. -
17లోగా స్మార్ట్ గ్రామాల దత్తతపై నివేదిక
తెనాలిఅర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో గ్రామాల అభివృద్ధికి ప్రతిపాదించిన స్మార్ట్ గ్రామాల దత్తతపై ఈనెల 17కు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. తెనాలి రెవెన్యూ డివిజన్లోని వివిధ శాఖల అధికారులతో మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని పొదుపు భవన్లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని ఏదో ఒక సంస్థగాని, ఎన్ఆర్ఐలుగాని, నాయకులు గాని దత్తత తీసుకునేలా అధికారులు కృషి చేయాలని, తహశీల్దార్, ఎంపీడీవోలు చొరవ చూపాలన్నారు. స్మార్ట్ విలేజ్ 20 అంశాలతో కూడిన అభివృద్ధి ప్రణాళికగా చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై మాట్లాడుతూ జిల్లాలో సంవత్సరానికి 1000 మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రమాదాల నివారణకు రవాణాశాఖ కఠినంగా వ్యవహరించాలని, వాహనచోదకులు ఈనెల 16 నుంచి విధిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. ఆటోల్లో అధికలోడు, మద్యం సేవించి వాహనాలు నడపటం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ట్రాక్టర్లు, ఆటోల్లో లౌడ్స్పీకర్లను నిషేదించాలని ఆదేశించారు. నీరు-చెట్టుపై మాట్లాడుతూ మన జిల్లాలో 33శాతం అడవుల విస్తీర్ణం ఉండాలని, అయితే కేవలం 14.5శాతం మాత్రమే ఉన్నాయన్నారు. ప్రతి గ్రామంలో 10 వేల నుంచి 15వేల మొక్కలు పెంచేందుకు జూన్ నాటికి సన్నాహాలు చేయాలన్నారు. డ్వాక్రా గ్రూపుల బ్యాంక్ లింకేజి డివిజన్లో 11 మండలాల్లో పురోగతి లేదన్నారు. ఎంపీడీవోలు, డీఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్లు, డీపీఎంలూ దీనిపై దృష్టిసారించాలని ఆదేశించారు. రుణాల రికవరీ కూడా మందగించిందని, దీనిని వేగవంతం చేసి బ్యాంకర్లకు సహకరించాలని కోరారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం మార్చి 31 నాటికి పూర్తికావాలన్నారు. పింఛన్ల పంపిణీకి పోస్టాఫీస్ అందుబాటులో లేని ప్రాంతాల్లో సమస్యలపై ఆరా తీశారు. గృహనిర్మాణానికి సంబంధించి 98 శాతం ఆధార్ అనుసంధానం, జియో ట్యాంగింగ్ 90 శాతం పూర్తయ్యిందన్నారు. అనంతరం మాతా శిశుమరణాలపై వైద్య ఆరోగ్య సిబ్బందితో సమీక్షించారు. శిశువుల మరణాలకు సంబంధించి సరైన కారణాలు దృవీకరించని అధికారులపై కఠినంగా వ్యవహరించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. శిశుమరణాలపై పరిశీలనకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వో పద్మజారాణిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏజేసీ ఎం. వెంకటేశ్వరరావు, సీపీవో శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ గోపాలకృష్ణ, మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా పీడీ ఎంజే నిర్మల, ఆర్డీవో జి.నరసింహులు, డీఎల్పీవో ఎంవీఎస్ సుబ్రహ్మణ్యం, ఆర్‌డబ్ల్యూస్ ఈఈ భానుప్రసాద్, ఆర్టీవో కేవీ రామారావు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్‌వైపు చూడని దాతలు!
నరసన్నపేట : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ ఆరంభశూరత్వంగానే మిలుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే కోవలో స్మార్ట్ విలేజి, స్మార్ట్ వార్డు కూడా చేరింది. ఈ కార్యక్రమం ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. దీన్ని ప్రభుత్వం ప్రకటించి రోజులు గడుస్తున్నా ఆశించినంతగా దాతలు ముందుకు రాలేదు. వివరాల్లోకి వెళితే.. దాతల సహకారంతో గ్రామాలను స్మార్ట్ విలేజిలుగా, మున్సిపాల్టీల్లో వార్డులను స్మార్ట్ వార్డులుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కార్యచరణ ప్రణాళిక రూపొందించింది. అవసరమైన గైడ్ లైన్లు కూడా మండల కేంద్రాలకు పంపింది. ఇంటర్ నెట్లో ఉంచింది. మారుమూల గ్రామాల్లో రోడ్ల నుంచి ఇంటర్ నెట్ వరకూ అన్ని రకాల కల్పించేందుకు స్మార్ట్ విలేజి, స్మార్ట్ వార్డు కార్యక్రమాన్ని గత నెల 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి జిల్లా అధికారులు, అధికార పార్టీ ప్రతినిధులు, మంత్రులు కసరత్తు చేసినప్పటికీ దాతలు మాత్రం ముందుకు రావడం లేదు. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో పరిస్థితి పరిశీలిస్తే మొత్తం 1098 పంచాతీలు ఉన్నాయి. వీటిలో కేవలం 304 పంచాయతీలనే దాతలు దత్తత తీసుకున్నారు. అలాగే మున్సిపాలిటీల్లో 187 వార్డులు ఉండగా కేవలం 37 వార్డులనే దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు వచ్చారు. ఇంకా 794 పంచాయతీలు, 150 వార్డుల్లో దాతలు కావాలి. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ అనుకున్న విధంగా ముందుకు వెళ్లడం లేదు. మంత్రులు, అధికారులు వత్తిడి చేస్తున్నా దాతల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండడంతో జిల్లా యంత్రాంగం కలవర పడుతోంది. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు నరసన్నపేట బహిరంగ సభలో అతని పక్కనే కూర్చున్న కలెక్టర్ లక్ష్మీనరసింహాన్ని స్మార్ట్ గ్రామాలపై ప్రస్తావించినట్లు సమాచారం. మరింతగా దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాలో రాజకీయ ప్రముఖులు కొందరు గ్రామాల దత్తత ప్రకటించినా మండలస్థాయిలో ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఇతర గజిటెడ్ అధికారులు అంతగా స్పందించడలేదు. దీనికి నరసన్నపేట మండలంలోని పరిస్థతితే ఉదాహరణ. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నరసన్నపేటను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మిగిలిన ప్రజా ప్రతినిధులు స్పందించడలేదు. ఇతర మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. దీని అమలుకు కమిటీలు వేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. ముందుగా మండలాల్లో కమిటీలు వేసిన అనంతరం జిల్లాస్థాయి కమిటీలు వేస్తారు. జిల్లా కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీలతో పాటు మరో ముగ్గురు జిల్లా అధికారులు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. రెవెన్యూ డివిజన్లలో సంబంధిత ఆర్డీవో సమన్వయ అధికారిగా పనిచేయాల్సి ఉంది. దాతల ఎంపిక ఇలా.. సాయం చేస్తామని ముందుకొచ్చిన దాతల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించి సమగ్రంగా పరిశీలిస్తారు. దాతల ఆసక్తి ఏమిటి, గ్రామానికి ఏమి చేయాలనుకుంటున్నారు, అతని గత అనుభవం ఏమిటనే అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. దత్తత గ్రామాల్లో 20 ప్రామాణికాలను ప్రభుత్వం నిర్దేశించింది. వాటిలో ప్రధానమైనవి ప్రతీ కుటుంబానికి జీవనోపాధి అవకాశాలు పెంచుట. అందరికీ గృహం, మరుగుదొడ్డి, రక్షత నీరు, విద్యుత్ సరఫరా. నూరు శాతం ఆస్పత్రి కాన్పులు పోషకాహార లోపాన్ని నివారించుట శత శాతం అక్షరాస్యత, రోడ్లు , మురుగు కాల్వలు నిర్మించుట, నూతన సాంకేతిక పద్ధతులు. సౌరశక్తి వినియోగం, ఎల్ఈడీ బల్బుల వాడకాన్ని ప్రోత్సహించడం ప్రతీ కుటుంబానికి బ్యాంకు అకౌంట్, కనీసం జన్‌ధన్ ఎకౌంట్ ఉండేలా చూడటం. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు ఒక వైపు స్మార్ట్ విలేజి, స్మార్ట్ వార్డుల కోసం ప్రభుత్వం కృషి చేస్తూ దాతల కోసం వెతుకుతుంటే.. మరో వైపు గ్రామాల్లో సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. ఏ ఒక్క సమస్య అయినా పరిష్కాం అవుతుందా అనే అనుమానం సర్వాత్రా వ్యక్తం అవుతుంది. మురుగు కాలువలు, రోడ్లు, మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. పారిశుద్ధ్యం కూడా అధ్వానంగా ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ దశలో స్మార్టు విలేజిల అభివృద్ధికి కోట్లాది రూపాయలు అవసరం. ఇటీవల నరసన్నపేట మేజర్ పంచాయతీలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాదయాత్ర ద్వారా పలు సమస్యలు తెలుసుకున్నారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కనీసం రూ. 5 కోట్లు కావాలి. ఒక్క నరసన్నపేటలోనే ఈ పరిస్థతి ఉంటే మిగిలిన గ్రామాలు, పట్టణాలు పరిస్థితి ఏమిటీ అనే సందేహం వ్యక్తమవుతోంది. -
పల్లెల్నీ పిండేద్దాం
గ్రామాల్లో ఆదాయ వనరులపై సర్వేకు సర్కారు ఆదేశం అన్ని గ్రామాల్లో పన్నుల సవరణకు కసరత్తు ఏప్రిల్ 1 నాటికి కొలిక్కి వచ్చే అవకాశం ఏలూరు :పల్లె ప్రజలపైనా పన్నుల భారం పెంచేం దుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం గ్రామీణ ఆదాయ వనరులపై దృష్టి సారిస్తోంది. జిల్లాలోని 48 మండలాల్లో ఒక్కొక్క గ్రామంలో రెండునెలల క్రితమే ఆదాయ వనరులు ఏ మేరకు ఉన్నాయనే అంశంపై ప్రయోగాత్మకంగా సర్వే జరిపిం చింది. మిగిలిన 883 పంచాయతీల్లో పన్నుల పరిస్థితి ఏమిటి, ఇంకా ఏయే ఆదాయ వనరులు ఉన్నాయనే విషయాలపై సర్వే చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రతి ఊరిని స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన సర్కారు అందుకు అవసరమైన నిధులిచ్చేందుకు సిద్ధంగా లేదు. ఇందుకు అవసరమైన సొమ్మును ఆయా పంచాయతీలు స్థానికంగానే సమకూర్చుకునే విధంగా చర్యలు చేపట్టనుంది. పనిలో పనిగా గ్రామాల్లో వసూలు చేసే పన్నులను సవరించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అంశంపై సర్కారు దృష్టి సారించనుంది. మరోవైపు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు దాతల నుంచి విరాళాలు సేకరించే యోచనలో ఉంది. స్మార్ట విలేజ్‌లుగా తీర్చిదిద్దేందుకు గ్రామాలను దత్తత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునివ్వగా, కలెక్టర్ కె భాస్కర్ పలు సమావేశాల్లో గ్రామాల దత్తత విషయంలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం ఉండేలా చూడాలని, ఇదేమంత పెద్ద కష్టం కాదని అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. అయితే, దత్తతకు ఆశించిన స్పందన రావడం లేదు. వీటిపైనే దృష్టి పల్లెల్లోనూ పట్టణాలతో దీటుగా ప్రచార హోర్డింగ్‌లు ఏర్పాటవుతున్నాయి. భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు సైతం పెద్దఎత్తున సాగుతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా కేబుల్ టీవీ కనెక్షన్లు సైతం పెరిగాయి. వీటిపై దృష్టి సారించడం ద్వారా పంచాయతీల ఆదాయాలను భారీగా పెంచుకోవచ్చనే అభిప్రాయ అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. మైనర్, మేజర్ పంచాయతీల్లో ఈ తరహా పన్నులు విధించి సక్రమంగా వసూలు చేయగలిగితే ఆదాయం పెరుగుతుందంటున్నారు. పల్లెల్లో ఖాళీస్థలాలపై పన్నులు విధించడం లేదని, ఆయా స్థలాల మార్కెట్ విలువపై 25 పైసల చొప్పున వార్షిక పన్ను విధిస్తే ఆదాయం పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఆక్రమణల పన్నులు, సంతలు, ఇతర ఆదాయాలపై దృష్టి సారించాలనే యోచన ఉంది. కుళాయి కనెక్షన్లు ఇబ్బడిముబ్బడిగా ఇస్తున్నా డిపాజిట్లు వసూలు కావడం లేదు. అక్రమంగా కుళాయి కనెక్షన్లు కూడా అధికంగానే ఉంటున్నాయనేది అధికారుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఆదాయ వనరులతోపాటు కొత్తగా ఏయే పన్నులు విధించవచ్చు, చార్జీలు రూపంలో వసూలు చేయడానికి అవకాశాలేమిటనే అంశాలపై సర్వే చేయించేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్మార్ట్కి దాతలు కావలెను
గురజాల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమం గురజాల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని అధికారులకు శాపంగా మారింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు మునిసిపాలిటీ వార్డుల్లో పుట్టి పెరిగి ఉద్యోగ వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రవాసాంధ్రుల నుంచి నిధులు సేకరించి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నదే స్మార్ట్ విలేజ్ లక్ష్యం. స్మార్ట్ విలేజ్ కార్యక్రమం నిర్వహణకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. వీరు స్థానిక ప్రజాప్రతినిధులు, ‘జన్మభూమి-మా ఊరు’ కమిటీ సభ్యులతో కలసి గ్రామాల్లో తిరిగి సమస్యలను గుర్తించాలి. ఆ తరువాత ఎన్ఆర్ఐల నుంచి నిధులు సమీకరించి సమస్యలను పరిష్కరించాలి. గత నెలలో స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమాలు నియోజకవర్గంలో మొక్కుబడిగా జరిగాయి. అధికారులు ఈ కార్యక్రమాన్ని నామ మాత్రంగానే నిర్వహించారు. కొందరు అధికారులు గ్రామాల్లో తిరిగి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. మరికొందరు స్మార్ట్ విలేజ్ కార్యక్రమం తమ చావుకు వచ్చిందని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. స్మార్ట్ విలేజ్ కార్యక్రమం ఆశాజనకంగా లేదనీ, దీని వ ల్ల పంచాయతీలకు ఒరిగేది ఏమీలేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసి ఈ విధమైన కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఐల నుంచి నిధులు వసూలు చేసి గ్రామాభివృద్ధి జరిగే పని కాదని పలువురు అధికారులు గుసగుసలాడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే అధికారులు, ప్రజాప్రతినిధులు తలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామాభివృద్ధితో పాటు మండలాభివృద్ధికి కృషి చేయాల్సి వుంది. దీనికి సంబంధించి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 59 గ్రామ పంచాయతీలకు గురజాల మండలం మాడుగుల గ్రామాన్ని స్థానిక శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అదే విధంగా తేలకుట్ల సర్పంచ్ తన గ్రామంలోని 10వ వార్డును దత్తత తీసుకున్నట్టు ప్రక టించారు. ఇంతకు మినహా గ్రామాలు లేదా వార్డుల దత్తతకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో స్మార్ట్ విలేజ్ సాధ్యమేనా అనే సందేహం కలుగుతోంది. -
కాపీ బాబు
కాపీ కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఏపీ సీఎం కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాల అనుకరణ సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్లపాటు సీఎంగా పనిచేశానని, మరో పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించానని, తన అనుభవం ముందు మిగతావారు దిగదుడుపేనని తరచూ చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడెందుకనో.. అనుకరణ మంత్రం పఠిస్తున్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన గడచిన ఎనిమిది నెలల పాలనలో కాపీ కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అటు కేంద్రపభుత్వం.. ఇటు తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలను ఒక్కొక్కటిగా అనుసరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వచ్ఛ భారత్’ అనగానే ఈయన స్వచ్ఛాంధ్ర అనడం.. కేంద్రం స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేస్తామనగానే ఈయన మరో అడుగు ముందుకేసి స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు అని చెప్పడం కాపీ కార్యక్రమాలకు ఉదాహరణలు. తాజాగా తెలంగాణ సర్కారు పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచగా ఆ తర్వాత నాలుగురోజులకే చంద్రబాబు ఏపీలోనూ వ్యాట్ పెంచి జనంపై భారం మోపారు. అయితే అనుకరణలోనూ చంద్రబాబు ఒకడుగు ముందుండాలని తెలంగాణ ప్రభుత్వం పెంచినదానికన్నా కొంచెం ఎక్కువగానే పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచారు. ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకున్న చంద్రబాబు ఇలా అనుకరణ ఎజెండాతో ముందుకెళుతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎనిమిది నెలల పాలనలో సొంత మార్కు అంటూ ఏదీ లేకుండా కాపీ సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకున్న ఆయన పాలన తీరుపై రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం ఆశ్చర్యపోతోంది. ఇలా అనుకరణ బా టలో పయనిస్తున్న అధినేతపై టీడీపీ వర్గాల్లోనూ సందేహాలు నెలకొన్నాయి. ఈ విధంగా ముందుకు పోదాం... 1- పధాని మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని చంద్రబాబు అనుకరించారు. గతేడాది అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించగా, చంద్రబాబు సెప్టెంబర్ 25 నుంచే స్వచ్ఛాంధ్ర పేరుతో రాష్ట్రంలో వారోత్సవాలు నిర్వహించారు. 2- దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీల పథకాన్ని కేంద్రం ప్రకటించిందో లేదో.. వెంటనే చంద్రబాబు అందుకున్నారు. రాష్ట్రంలోనూ స్మార్ట్ సిటీలతోపాటు స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు అంటూ మొదలుపెట్టారు. ఎంపీలు విధిగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రధాని నిర్దేశిస్తే, బాబు కొంత ముందుకెళ్లి రాష్ట్రంలోని గ్రామాలు, వార్డులూ అధికారులు దత్తత తీసుకోవాలన్నారు. 3- తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.పది కోట్లిచ్చింది. దీనిని చూసి చంద్రబాబు సంక్రాంతిని అధికారిక సంబరాలుగా ప్రకటించారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నాయని చెబుతున్న ఆయన ఈ ఉత్సవాలకోసం 13 జిల్లాలకు రూ.13 కోట్లు మంజూరు చేశారు. 4- తెలంగాణలో చెరువుల నిర్మాణం, వాటర్‌గ్రిడ్ అనగానే.. ఆంధ్రప్రదేశ్‌లోనూ వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. 5- తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తమ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వగానే.. రాష్ట్రంలోనూ అంతే మొత్తంలో అధికారులకు పీఆర్సీ ఇచ్చారు. 6- యోగాను ప్రభుత్వాధికారులకు అనుసంధానిస్తే సత్ఫలితాలు ఉంటాయని ప్రధాని మోదీ ఇటీవలే అన్నారు. ఇంకేముంది.. చంద్రబాబు జనవరి 29 నుంచి 31 వరకు మూడ్రోజులపాటు హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో రూ.3 కోట్ల ఖర్చుతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు, మంత్రులకు యోగా శిక్షణ నిర్వహించారు. 7- పేదలకోసం తమిళనాడులో అమలు చేస్తున్న ‘అమ్మ క్యాంటీన్ల’ను కాపీకొట్టి రాష్ట్రంలో ‘అన్న క్యాంటీన్లు’ పెడతామని చెప్పారు. ఇప్పుడదే తమిళనాడు తరహాలో మద్యం విక్రయాలు మొదలుపెట్టాలన్న యోచనలో ఉన్నారు. 8- తెలంగాణ శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా సీఎం కేసీఆర్ రూ.350 కోట్లతో గతేడాది ఆగస్టులో అధునాతన ఇన్నోవాలు, బొలేరో, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి పోలీసులకు అందించారు. దీనినీ సీఎం చంద్రబాబు ఫాలో అయ్యారు. గత డిసెంబర్లో రూ.106 కోట్లతో 2,400 వాహనాలను కొనుగోలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వాహనాలకు వాడిన రంగుల్నే వీటికి అనుకరించడం విశేషం. 9- కేంద్రం నదుల అనుసంధానంపై ప్రకటించగానే చంద్రబాబు రాష్ట్రంలో నదుల అనుసంధానం చేస్తామని పేర్కొనడం మరో ఉదాహరణ. 10- తెలంగాణ సీఎం కేసీఆర్ గతేడాది అక్టోబర్‌లో రాష్ట్రంలోని అసైన్డ్ భూములు, ఆక్రమిత స్థలాలను సర్వే చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. తాజాగా చంద్రబాబు కూడా రెవెన్యూపై సమీక్షించి ఏపీలోని మొత్తం అసైన్డ్, ఆక్రమిత భూములపై సర్వేకు ఆదేశాలిచ్చారు. 11- కొత్త రాజధాని నిర్మాణం విషయంలోనూ చంద్రబాబు అదే పంథాను అనుసరిస్తున్నారు. ఏకంగా సింగపూర్‌కు తీసిపోని ప్రపంచానికే తలమానికంగా ఉండే నదీముఖ రాజధానిని నిర్మిస్తామని ప్రకటించారు. -
‘స్మార్ట్’ కి దాతలు కావలెను
జిల్లాలో 1,200 మంది అవసరం ఇప్పటి వరకు ముందుకొచ్చింది కేవలం 124 మంది వితరణశీలురే దాతల అన్వేషణ, ఎంపిక కోసం గ్రామం నుంచి కమిటీలు కలెక్టర్ చైర్మన్‌గా రెండు రోజుల్లో జిల్లా కమిటీని ప్రకటించే అవకాశం రక్షణ లేని కల్వర్టులు.. కనిపించని డ్రైనేజీలు.. రోడ్లపైనే పారే మురుగునీరు.. కుళాయి నీటిని మురుగు నీటిలోనే పట్టుకునే దుస్థితి.. పసర్లు పట్టిన పంచాయతీ చెరువులు.. చాలీచాలని తరగతి గదులు.. సౌకర్యాలు లేని పాఠశాలలు.. అసౌకర్యాల నిలయాలుగా పీహెచ్సీ సెంటర్లు.. ఇలా ఒకటేమిటి.. ఎన్నో సమస్యలు గ్రామాల్లో పడకేశాయి. వాటిని పరిష్కరించేందుకు స్మార్ట్ విలేజ్, వార్డు పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దాతల కోసం వేట ప్రారంభించింది. సాక్షి, విజయవాడ : జిల్లాక ు ‘స్మార్ట్’ దాతలు కావాలి. వీరి కోసం ప్రభుత్వం కూడా అన్వేషిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా ఒక కమిటీ కూడా రెండు రోజుల్లో ఏర్పాటుకానుంది. దాతల సహకారంతో గ్రామాలను స్మార్ట్ విలేజీలుగా, మున్సిపాలిటీల్లో స్మార్ట్ వార్డులుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మారుమూల గ్రామాల్లో సైతం రోడ్ల నుంచి ఇంటర్నెట్ వరకు అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు ‘స్మార్ట్ విలేజి-స్మార్ట్ వార్డు’ కార్యక్రమాన్ని గత నెల 18న ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు ప్రణాళికా విభాగం అధికారులు జిల్లాలో స్మార్ట్ విలేజి కార్యక్రమం అమలు చేసేందుకు కసరత్తు సాగిస్తున్నారు. జిల్లాలో గ్రామాలను దత్తత తీసుకోవడానికి పలువురు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు, విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు ముందుకొస్తున్నారు. దాతల సమగ్ర వివరాలను జిల్లా కమిటీ పరిశీలించిన తర్వాత గ్రామాలను దత్తత ఇస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా కమిటీ.. గ్రామాల్లో సమస్యల గుర్తింపు, పరిష్కార మార్గాలను చూపేందుకు మండలం నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే మండల స్థాయి కమిటీలు పూర్తికాగా, జిల్లా స్థాయి కమిటీ రెండు రోజుల్లో ఏర్పాటుకానుంది. జిల్లా కమిటీకి అనుబంధంగా సపోర్ట్ కమిటీ మరొకటి ఏర్పాటుచేస్తారు. జిల్లా కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్ అహ్మద్‌బాబు కన్వీనర్‌గా ముఖ్య ప్రణాళికాధికారి డాక్టర్ శర్మ, సభ్యులుగా డీఆర్డీఏ, డ్వామా పీడీలు, మరో ముగ్గురు ఉంటారు. దాతల ఎంపికపై ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. దాతల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, గ్రామాల ఎంపిక ప్రక్రియ సాగుతుందని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి డాక్టర్ శర్మ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎంపిక చేసిన గ్రామాల్లో దాతల కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. నిమ్మకూరును దత్తత తీసుకున్న నారా బ్రాహ్మణి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జన్మస్థలమైన నిమ్మకూరు గ్రామాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, ఎన్టీఆర్ మనుమరాలు నారా బ్రాహ్మణి దత్తత తీసుకున్నారు. నిమ్మకూరును స్మార్ట్ విలేజీగా రూపొందించేందుకు తాను దత్తత తీసుకున్నట్లు ఆమె గత నెల 18న ప్రకటించారు. 950 గ్రామాలు... 277 వార్డులకు దాతలు కావాలి జిల్లాలోని 49 మండలాల్లో 950 గ్రామాలు ఉన్నాయి. ఆరు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో 218 వార్డులు, విజయవాడ నగరపాలక సంస్థలో 59 డివిజన్లు ఉన్నాయి. ఆయా గ్రామాలు, వార్డులు, డివిజన్లను దాతలకు అప్పగించి వారి నిధులు, ఇతర సేవా కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటుచేశారు. మండల స్థాయిలో తహశీల్దార్, ఆర్డీవోల నేతృత్వంలో నియమించిన కమిటీలు ప్రతి గురువారం గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులు, సమస్యలను అధ్యయనం చేసి ఆర్డీవో ద్వారా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని గత గురువారం జిల్లాలో ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లాలోని గ్రామాలను దత్తత తీసుకునేందుకు దాతలు కూడా ముందుకొస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పటికే మండలాలను దత్తత తీసుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా జిల్లాలోని గ్రామాలను దత్తత తీసుకుంటామని ఆన్లైన్లో 124 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు సమర్పించిన వారిలో ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఉండటం విశేషం. దాతల ఎంపిక ఇలా... - సాయం చేస్తామని ముందుకొచ్చిన దాతల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించి సమగ్రంగా పరిశీలిస్తారు. - దాత ఆసక్తి ఏమిటి.. గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారు.. అతని గత అనుభవం ఏమిటనే అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. - ఈ నెల రెండో వారంలోపు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి దాతల జాబితాను ప్రకటిస్తారు. - దాతల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
స్మార్ట్ విలేజ్‌లకు ప్రతిబంధకాలు
గుంటూరు సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామాలను స్మార్ట్ విలేజ్ల జాబితాలో చేర్చారు. అయితే రాత్రికి రాత్రే స్మార్ట్‌గా మారిపోవన్న వాస్తవాన్ని మాత్రం మరిచారు. జిల్లాలోని 1,111 గ్రామాల్లో కనీస వసతులు లేని కుగ్రామాలు కొన్నయితే, మౌలిక సదుపాయాలు మచ్చుకైనా కనిపించని మారుమూల పల్లెలు మరికొన్ని. వీటినలా ఉంచితే, ఒక గ్రామం స్మార్ట్‌గా కనిపించాలంటే ముందుగా అక్కడి వాతావరణం పరిశుభ్రంగా ఉండాలి. దానికి అనుగుణంగా పారిశుద్ధ్యం మెరుగుప డాలంటే ఆయా గ్రామాల్లో పోగుపడే చెత్తా చెదారాన్ని ఎప్పటి కప్పుడు ఎత్తి గ్రామంలోని ఏదో ఒక ఖాళీ ప్రాంతానికి తరలి ంచాలి. అక్కడ చెత్తను తడి-పొడిగా విడగొట్టి రీసైక్లింగ్ చేయాలి. ఇవన్నీ జరగాలంటే ప్రతి గ్రామానికీ ఓ డంపింగ్ యార్డు అవసరమనే విషయాని ప్రాథమికంగా గుర్తించాలి. జిల్లాలోని సగం గ్రామాల్లో డంపింగ్ యార్డులే లేవు. జిల్లా పంచాయతీ అధికారుల లెక్క ప్రకారం 138.68 ఎకరాల్లో డంపింగ్ యార్డులుండాలి. వీటిలో 105 మాత్రమే వెలుగుచూసి అంతో ఇంతో ఉపయోగపడుతున్నాయి. మిగిలినవి ఎక్కడున్నా యో కూడా అధికారులకూ తెలియదు. రికార్డుల్లో కనిపిస్తున్నా ఉనికి మాయమైంది. ప్రస్తుతం స్మార్ట్ విలేజ్ల హడావుడి నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా పంచాయతీ అధికారి వీరయ్య వాటి ఆచూకీ తీయడానికి తాజాగా ఉపక్రమించారు. అన్ని డంపింగ్‌యార్డులను వెలికితీయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. రికార్డుల్లో ఉన్న సర్వే నంబర్ల ఆధారంగా వాటి చిరునాఇఇమాను 10వ తేదీ లోగా గుర్తించి వాడకంలో పెట్టాలని గడువు విధించారు. గుర్తించిన వాటిని గ్రామ పంచాయతీ అడంగల్‌లో నమోదు చేసి విధిగా రెవెన్యూ రికాార్డుల్లో సైతం డంపింగ్‌యార్డు స్థలంగా మార్పుచేయాలని సూచించారు. అలా చేయడంలో విఫలమైతే శాఖాపరమైన చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. ఇది సవ్యంగా జరిగినా కూడా ఇంకా సగం గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని కోసం స్థల సేకరణ జరగాల్సి ఉంది. గ్రామ కంఠంలో దీనికి అవసరమైన జాగా ఉందా లేదా? అన్నది సరి చూసుకోవాల్సి ఉంది. అన్నీ కుదిరితే కానీ ప్రతి గ్రామానికీ ఒక డంపింగ్ యార్డు నెలకొల్పలేని పరిస్థితి. ఇక మేజర్ గ్రామ పంచాయతీలో రెండు యార్డులు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో స్థానిక అధికారులు హైరానా పడుతున్నారు. ఎన్ఆర్జీఎస్ కింద నిధులు ... జిల్లాలోని చాలా గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏ స్థితిలో ఉన్నాయో లెక్క తేలలేదు. 138.68 ఎకరాల్లో ఉండాల్సిన 577 డంపింగ్ యార్డులకు 105 మాత్రమే గుర్తింపునకు నోచుకున్నాయి. మిగిలినవి ఎలా ఉన్నాయో, ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలుసుకోవాల్సి ఉంది. అందుకే వీటిని తక్షణం గుర్తించమని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాను. గుర్తించిన తర్వాత వాటిని వాడకంలో పెట్టేందుకు వీలుగా మరమ్మతులు చేపట్టడానికి ఎన్ఆర్జీఎస్ కింద కేంద్రం ఒక్కొక్క డంపింగ్‌యార్డుకు రూ. 1.28లక్షలను మంజూరు చేసింది. వాటితో యార్డు చుట్టూ ఫెన్సింగ్, చెత్త వాహనాల రాకపోకలకు వీలుగా వసతులు కల్పిస్తాం. ముందుగా గుర్తించిన వాటిలో పని పూర్తయిన తర్వాత ఇక కొత్తగా ఏర్పాటు చేయాల్సిన డంపింగ్ యార్డులపై దృష్టి సారిస్తాం. - వీరయ్య, జిల్లా పంచాయతీ అధికారి. -
జనరంజక పాలన
స్మార్ట్ విలేజ్‌పై దృష్టిసారించని అధికారులు ఇంటికే పింఛన్ల పంపిణీకి ఐరిస్ టెక్నాలజీ జిల్లాలో 100 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమలు మరిన్ని ఇసుక క్వారీలు తెరిపిస్తాం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ బాబు.ఎ మచిలీపట్నం : జిల్లా పరిస్థితులను అవగతం చేసుకుని జనరంజక పాలన అందించనున్నట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇటీవలే బాధ్యతలు తీసుకున్న తాను జిల్లాలో పరిస్థితులపై అవలోకనం చేసుకుంటున్నట్లు చెప్పారు. పారదర్శక పాలన అందించటంతో పాటు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ విలేజ్/వార్డు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విజయవాడ, మచిలీపట్నం నుంచి పాలన సాగించాల్సి వస్తోందని, ఇది కొంత ఇబ్బంది అయినా సానుకూల దృక్పథంతో ముందుకు వెళుతున్నానని చెప్పారు. సాక్షి : ఇప్పటివరకు ఎన్ని స్మార్ట విలేజీలు గుర్తించారు? కలెక్టర్ : స్మార్ట్ విలేజ్, వార్డుల గుర్తింపులో రాష్ట్రం మొత్తంమీద జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఏ జిల్లాలో లేనివిధంగా 119 గ్రామాలను ఈ పథకం కింద అభివృద్ధి చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వెబ్సైట్ రూపొందించాం. అందులో గ్రామం, అక్కడి ప్రజల అవసరాలు, పాఠశాలలు తదితర వివరాలు పొందుపరిచాం. వాటిని ఆన్లైన్లో చూసుకుని వారే ఏ పనిచేయాలో నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది. ప్రత్యేకాధికారులు అక్కడి అవసరాలను తీర్చేందుకు దృష్టిసారించాల్సిందే. ఏదైనా అత్యవసర పని ఉండి గురువారం ఆ గ్రామానికి వెళ్లలేకుంటే మరుసటిరోజైనా వెళ్లాల్సిందే. గ్రామానికి అలా వెళ్లి, ఇలా తిరిగి వచ్చే అధికారుల సేవలు అవసరం లేదు. వారిని ఇంటికి పంపేందుకు వెనుకాడం. సాక్షి : జిల్లాలో 25 వేల మందికి పింఛన్లు అందటం లేదు. వారి పరిస్థితి ఏమిటి? కలెక్టర్ : పింఛన్లు అందకపోవటం వాస్తవం. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతినెలా ఒకటి నుంచి ఏడో తేదీ వరకు పింఛన్లు ఇస్తున్నాం. మంచంలో నుంచి లేవలేని వారికి ఈ వారం రోజుల వ్యవధిలో రెండు రోజులు ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించాను. పింఛన్ల పంపిణీకి ఐరీస్ సాక్షి : ఇసుక క్వారీల ద్వారా ఎంత వ్యాపారం చేశారు? కలెక్టర్ : శనగపాడు, అల్లూరుపాడు, ఇబ్రహీంపట్నం, భవానీపురం, సూరాయపాలెం, గుంటుపల్లి రీచ్‌ల ద్వారా రూ.21 కోట్ల వ్యాపారం చేశాం. సీనరేజ్‌లో 40 శాతం నిధులు స్థానిక సంస్థలకు ఇవ్వాల్సి ఉంది. ఇటీవలే రూ.50 లక్షలు స్థానిక సంస్థల వాటాగా విడుదల చేశాం. వేదాద్రి, కాసరబాద, హొక్కునూరు, కంచల, చెవిటికల్లు, కునికిపాడు ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు వచ్చాయి. వీటితో పాటు మరో 32 ఇసుక క్వారీలకు సంబంధించి సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాం. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు క్వారీకి అప్రోచ్ రోడ్డు నిర్మించేందుకు రూ.17.50 లక్షలతో అనుమతులు వచ్చాయి. నాలుగైదు రోజుల్లో ఈ పనులు ప్రారంభిస్తాం. సాక్షి : రుణమాఫీ రెండో జాబితా ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? కలెక్టర్ : జన్మభూమి కార్యక్రమం అనంతరం రుణమాఫీకి సంబంధించి 80 వేల దరఖాస్తులు వచ్చాయి. నేను బాధ్యతలు చేపట్టే నాటికి 12 శాతం దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ చేశారు. ప్రస్తుతం 80 శాతం మేర రెండో విడత రుణమాఫీకి సంబంధించిన వివరాలను ఆన్లైన్ చేశాం. నాలుగైదు రోజుల్లో మిగిలినవి పూర్తవుతాయి. అన్ని అర్హతలూ ఉంటే రైతులు రుణమాఫీ జరుగుతుంది. ప్రతి శనివారం అన్ని బ్యాంకుల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. రుణమాఫీ పైనే కాకుండా ఇతర అంశాలపైనా బ్యాంకు అధికారులతో మాట్లాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నాం. -
స్మార్ట్ విలేజ్‌లు...సాధ్యమయ్యేనా?
ప్రభుత్వం నుంచి నిధుల విడుదల లేదు ఎన్ఆర్ఐలు, గ్రామ ప్రముఖుల నుంచే విరాళాల సేకరణ పంచాయతీకో ప్రత్యేక అధికారి ప్రతి గురువారం సమీక్ష పనిభారంతో సతమతమవుతున్న కార్యదర్శులు ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేస్తేనే గ్రామాల అభివృద్ధి అంతంతమాత్రంగానే జరుగుతున్న తరుణంలో.. నూతనంగా తెరపైకి తెచ్చిన స్మార్ట్ విలేజ్‌లు, వార్డుల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు విడుదల లేకుండా విరాళాలు సేకరించి గ్రామాల్లో సౌకర్యాలు సమకూర్చడం సాధ్యమయ్యేనా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆదివారం ఆర్భాటంగా ప్రారంభించిన స్మార్ట్ విలేజ్ కార్యక్రమం ముందడుగు వేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మచిలీపట్నం : ప్రభుత్వం తాజాగా ప్రకటించిన స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల కోసం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు విడుదల చేయకపోగా స్థానికంగానే సమకూర్చుకోవాలని చెప్పడం, దీని కోసం పంచాయతీ, వార్డుకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించడం గమనార్హం. ఈ కార్యక్రమంపై ప్రతి గురువారం సమీక్ష నిర్వహిస్తామని, విరాళాలు ఇచ్చే ఎన్ఆర్ఐలు, స్థానికంగా ఉన్న గ్రామ ప్రముఖుల వివరాలు, వారి ఫోన్ నంబర్లు ముఖ్యమంత్రి మెయిల్ ఐడీకి ఆన్లైన్ ద్వారా పంపితే నేరుగా వారితో తానే మాట్లాడి నిధులు సమకూర్చుతానని ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత కొత్తగా ఒక్క గృహాన్నీ నిర్మించలేదు. స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో అందరికీ గృహాలు సమకూర్చడంతో పాటు మరుగుదొడ్లు, రక్షిత నీరు కల్పిస్తామని ప్రకటిస్తున్నారు. స్మార్ట్ విలేజ్, వార్డు కార్యక్రమంలో 20 లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. మరుగుదొడ్లు నిర్మిస్తే ఒక్కొక్క దానికి రూ.12 వేలు ఇస్తామని, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు స్థానికంగానే నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పడంతో నిధులు ఎక్కడి నుంచి సమకూర్చాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో అన్ని రోడ్లకు బ్రాడ్‌బ్యాండ్ వైర్లను వేసి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యాన్ని స్మార్ట్ విలేజీలో నిర్దేశించారు. ఇది సాధ్యమయ్యే పని కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. చాలా పాఠశాలల్లో తాగునీటి కుండీలు ఉన్నా నీరు అందుబాటులో లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. నిధుల సమీకరణ కోసం రెండు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఎన్ఆర్ఐలు, వారి ఫోన్ నంబర్లు సేకరించాలని ప్రభుత్వం అధికారులకు హుకుం జారీ చేయడం గమనార్హం. పని ఒత్తిడితో సతమతం ప్రస్తుతం పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు జరుగుతున్నాయి. ఏరోజు ఎంతమేర ఇంటి పన్ను వసూలు చేశారో ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైనా పంచాయతీ నుంచి ఇంటి పన్ను వసూళ్లకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో పొందుపరచకుంటే ఆరోజు సంబంధిత పంచాయతీ కార్యదర్శి పనిచేయనట్లుగా భావిస్తున్నారు. ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శి మూడు నుంచి నాలుగు పంచాయతీలను పర్యవేక్షించాల్సి వస్తోంది. వారంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వీడియోకాన్ఫరెన్స్‌లు, వివిధ రకాల సమావేశాలకే సమయం సరిపోతోంది. ఇలాంటి తరుణంలో స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఏ పనిచేయాలో తెలియక సతమతమవుతున్నామని పలువురు పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. పంచాయతీకి ఒక్కొక్క ప్రత్యేక అధికారిని నియమించగా ఆయనే ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లుగా పరిగణిస్తున్నారు. స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు, గ్రామ ప్రముఖుల నుంచి నిధులు సమకూరని నేపథ్యంలో సంబంధిత అధికారిని బాధ్యులుగా చేస్తారా అనే అనుమానాలు అధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
చిత్తశుద్ధి ఏదీ?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ప్రతి పల్లెనూ ‘స్మార్ట్ సిటీ’ తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. పల్లెసీమలను ‘స్మార్ట్ విలేజ్’ చేస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయమే అయినా.. అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తేలింది. కేవలం ప్రచారం కోసమే టీడీపీ సర్కారు రకరకాల జిమ్మిక్కులు చేస్తూ.. ప్రజలకు ‘అరచేతిలో వైకుంఠం’ చూపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో ‘స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డు’ కార్యక్రమం ఒకటి. ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాలో అధికార యంత్రాంగంతో పాటు.. మంత్రులు, శాసనసభ్యులు పాదయాత్ర చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు వారు అభివృద్ధి చేయబోయే దత్తత గ్రామాలను కూడా ప్రకటించాలని ఆదేశించారు. స్మార్ట్ విలేజ్ పాదయాత్ర ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి జిల్లాకూ రూ.కోటి విడుదల చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం బ్యానర్లకు మాత్రం ఖర్చుచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిధులు విడుదల కాకపోవడంతో కార్యక్రమం తూతూ మంత్రంగా నిర్వహించాల్సి వచ్చిందని అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు తాము దత్తత తీసుకుబోయే గ్రామాలను ప్రకటించాల్సి ఉంది. అందులో భాగంగా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మాత్రం తాను దత్తత తీసుకోబోయే గ్రామాన్ని ప్రకటించారు. కలిగిరి మండలం పెద్దపాడు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో వెల్లడించారు. వెంకటగిరి, కోవూరు ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తాము దత్తత తీసుకోబోయే గ్రామాల పేర్లు ప్రకటించకపోవడం గమనార్హం. స్మార్ట్ విలేజ్, వార్డు సాధ్యమేనా? గ్రామాల అభివృద్ధికి నిధులు ఏ మాత్రం విడుదల చేయకపోయినా... పల్లెలను స్మార్ట్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని అధికారయంత్రాంగానికి ఆదేశాలు అందాయి. జిల్లాలో మొత్తం 940 పంచాయతీలు, 1620 గ్రామాలతో పాటు, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వార్డులు ఉన్నాయి. గ్రామాలు, వార్డుల్లో పక్కా గృహాలు, మరుగుదొడ్లు, రక్షిత మంచినీరు, విద్యుత్ సౌకర్యం, 100 శాతం సంస్థాగత ప్రసవాలు, ప్రసూతి, శిశు మరణాల నివారణ, పౌష్టికాహారలోపాన్ని నివారించడం, పాఠశాలల్లో డ్రాపౌట్స్ లేకుండా చూడడం, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్యకేంద్రం, క్రమం తప్పకుండా గ్రామ, వార్డు సభల నిర్వహణ, ప్రతి కుటుంబానికీ బ్యాంక్ ఖాతా, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళిక, చెట్ల పెంపకం, నీటి సంరక్షణ- నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, సమాచార కేంద్రం, కంప్యూటర్ ల్యాబ్, మీ సేవా కేంద్రం, టెలికం, ఇంటర్నెట్ సౌకర్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్రతి కుటుంబానికీ జీవనోపాధి అవకాశాలు కల్పించడం వంటి 20 సౌకర్యాలను 100 శాతం ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడానికి ఆయా గ్రామాల నుంచి ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడిన వారిని గుర్తించి విరాళాలు సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలా సేకరించిన నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. అయితే విరాళాలు సేకరించే బాధ్యత ప్రభుత్వం తీసుకోలేదు. దత్తత బాధ్యతను అధికారులకు అప్పగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాలనా బాధ్యతలతో పాటు ఎన్ఆర్ఐలను గుర్తించేదెప్పుడు? అభివృద్ధి చేసేదెప్పుడు? అనే ప్రశ్నలు అధికారులను వేధిస్తున్నాయి. -
వేలివెన్నులో 18న స్మార్ట్ విలేజ్ ప్రారంభం
ఈ నెల 18 వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్నులో ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఈ పథకానికి మరింత ప్రచారం కోసం 18 కిలోమీటర్లు పాదయాత్ర చేపడతారని తెలిపారు. ఆయన యాత్రకు మద్దతుగా తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వారివారి నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పరకాల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చే దాతలకోసం ప్రత్యేక పోర్టల్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్ లో పర్యటిస్తారని ప్రకటించారు. -
హైటెక్ పల్లెలు
18న స్మార్ట్ విలేజ్, వార్డుల కార్యక్రమానికి సర్కారు శ్రీకారం దత్తతకు 12,918 గ్రామాలు, 3,465 వార్డులు అధికారులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్లు దత్తత తీసుకోవాలన్న ప్రభుత్వం ఐదేళ్లలో అన్నివిధాలా తీర్చిదిద్దితే స్మార్ట్ విలేజ్‌గా ప్రకటన కలెక్టర్లకు ప్రణాళికా శాఖ మెమో 18న పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్నులో బాబు పాదయాత్ర సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా రాష్ట్రంలోని పల్లెల్లో హైటెక్ హంగుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఆధునిక వసతులతో పాటు గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత కనీస సదుపాయాలు, సామాజిక వసతులు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీన ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందుకోసం జనాభా ఆధారంగా గ్రామ పంచాయతీలను, వార్డులను మూడు రకాలుగా వర్గీకరించింది. 5 వేల జనాభా గల గ్రామాలు, వార్డులను అధికారులు, దాతలు, వ్యక్తులు దత్తత తీసుకోవాలి. 10 వేల జనాభా గల గ్రామాలు, వార్డులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దత్తత తీసుకోవాలి. ఇక 10 వేలపైన జనాభా గల గ్రామాలు, వార్డులను కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని మొత్తం 12,918 గ్రామాలు, 3,465 వార్డులను దత్తత ఇవ్వనున్నారు. వచ్చే ఐదేళ్లలో ఆయా గ్రామాలు, వార్డులను 20 అంశాల్లో రాజీపడకుండా తీర్చిదిద్దాలి. అప్పుడు ఆ గ్రామాలను, వార్డులను స్మార్ట్ గ్రామాలు, వార్డులుగా ప్రకటిస్తారు. 18వ తేదీన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు ప్రజల్లో కార్యక్రమం గురించి తెలియజేయడానికి పాదయాత్ర కూడా చేస్తారని జిల్లా కలెక్టర్లకు పంపిన మెమోలో ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ పేర్కొన్నారు. జిల్లాల్లో మంత్రులు కార్యక్రమాన్ని ప్రారంభించి పాదయాత్రలు నిర్వహించాలని మెమోలో సూచించారు. పాదయాత్రల నిర్వహణకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమం ప్రారంభం అనంతరం స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, దత్తత తీసుకునే ఇతర ప్రతినిధులతో వర్క్‌షాపు నిర్వహించి వారి నుంచి వచ్చిన సూచనలు, సలహాలను వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా కలెక్టర్లను కోరారు. గ్రామాలను దత్తత తీసుకోవడానికి అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు ఎన్ఆర్ఐలు, కార్పొరేట్ సంస్థలు, సినీ రంగానికి చెందిన వారు, మీడియా, పేరు ప్రతిష్టలు గల స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఇలావుండగా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్ను గ్రామంలో పాదయాత్ర చేస్తారని సీఎం కార్యాలయవర్గాలు తెలిపాయి. స్మార్ట్ గ్రామాలు, వార్డుల్లో సాధించాల్సిన ముఖ్య లక్ష్యాలు.. # అందరికీ కనీసం ఒక పడక గది, వంటగ ది, మరుగుదొడ్డి, మంచినీరు, విద్యుత్ సౌకర్యంతో కూడిన ఇల్లు # పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల్లో మరుగుదొడ్డి, మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పన # గ్రామంలో సమాచార కేంద్రం, విలేజ్ కంప్యూటర్ ల్యాబ్, మీ సేవ కేంద్రంఏర్పాటు # టెలికం, ఇంటర్నెట్ కనెక్టివిటీ. కాన్పులన్నీ ఆరోగ్య కేంద్రాల్లో జరగాలి. కాన్పుల సమయంలో మాతా, శిశు మరణాలు ఉండకూడదు. # ఐదేళ్ల పిల్లలకు పౌష్టికాహారం అందుబాటులో ఉండాలి. 12వ తరగతి వరకు సూల్ డ్రాపవుట్స్ ఉండరాదు # బాల్య వివాహాలు ఉండరాదు. చిన్న తరహా పరిశ్రమల ద్వారా ప్రతి ఒక్కరికీ జీవనోపాధి అవకాశాలు కల్పించాలి. # ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ద్వారా ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలి. # గ్రామ సభ ఏడాదికి కచ్చితంగా నాలుగుసార్లు జరగాలి # సమస్యల పరిష్కార వ్యవస్థ, బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, సూక్ష్మ బ్యాంకు, ఏటీఎం ఉండాలి. # ప్రతి ఇంటికీ పైపుల ద్వారా కుళాయి మంచినీటి సౌకర్యం కల్పించాలి # అంతర్గత రహదారులు, డ్రేనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. # సౌర విద్యుత్‌తో వీధి దీపాలు, కమ్యూనిటీ హాల్, స్వయం సహాయ సంఘాలకు భవనం ఉండాలి. # క్రీడా పాంగణం-శ్మశాన వాటిక, మార్కెట్, ప్రజాపంపిణీ ఔట్లెట్, పోస్ట్ ఆఫీసు ఉండాలి. # ప్రతి కుటుంబం, జీవిత బీమా, వైద్య బీమా కలిగి ఉండాలి # ప్రతి ఒక్కరికీ ఏడాదిలో కనీసం వంద రోజులు ఉపాధి కల్పించాలి # జనన, మరణాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. # ఏదైనా గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, ప్రజా పంపిణీ షాపు, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూలు, గ్రామ పంచాయతీ భవనం ఉంటే ఆ గ్రామానిక ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. -
స్మార్ట్ ఏపీ.. మా విధానం-నినాదం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘స్మార్ట్ విలేజ్.. స్మార్ట్ టౌన్.. స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసి.. రాష్ట్రాన్ని స్మార్ట్ ఏపీగా తీర్చిదిద్దుతా.. స్మార్ట్ ఏపీనే ప్రభుత్వ విధానం.. నినాదం’ అని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తెలిపారు. తిరుపతిలో గురువారం దక్షిణ భారత ‘సీఐఐ సమ్ ఇన్ఫ్రా’ మూడు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సదస్సులో సీఎం మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రంగాల్లోనూ స్వయంసమృద్ధి సాధించేలా నగరాలను అభివృద్ధి చేయడానికే ప్రధాని నరేంద్రమోదీ స్మార్ట్ సిటీల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రచించామన్నారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి రాజధాని లేదనే సమస్య నుంచే అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నగరాన్ని నిర్మించడానికి ప్రణాళిక రూపొందించడానికి దారితీసిందన్నారు. పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతి, ల్యాండ్ పూలింగ్ వంటి విధానాలతో రాజధానిని నిర్మిస్తుండటం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోందన్నారు. మౌలిక సదుపాయాలకు పెద్దపీట దేశంలో 2050 నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెడతామన్నారు. రాష్ట్రంలో జల, వాయు, ఉపరితల రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఏ రాష్ట్రానికీ లేని రీతిలో రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల సముద్రతీరం ఉందన్నారు. రాష్ట్రంలో ఐదు పోర్టులే ఉన్నాయని.. మరో పది పోర్టులు నిర్మించి.. దేశానికి గేట్ వేగా మార్చుతామన్నారు. పోర్టులను కలుపుతూ తడ నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రతీరం వెంబడి బీచ్ రోడ్డును నిర్మిస్తామన్నారు. ఈ రోడ్డును ప్రతి పది కి.మీ.లకు ఒక చోట జాతీయ, రాష్ట్ర రహదారులను కలిపేలా లింక్ రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. కాకినాడ-పాండిచ్చేరి, కాకినాడ-శ్రీకాకుళం, బకింగ్‌హామ్ కెనాల్ వం టి జలమార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. విభజన బిల్లులో తిరుపతి, విశాఖ, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. వాటిని అనుసంధానం చేస్తూ శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు వంటి ప్రాంతాల్లోనూ విమానాశ్రయాలను ఏర్పాటుచేస్తామన్నారు. ప్రైవేటీకరిస్తే ప్రగతి... దేశంలో ఓఎన్జీసీ, సెయిల్, గెయిల్ వంటి నవరత్న సంస్థలు ప్రభుత్వం చేతిలో ఉండటం వల్లే అనుకున్న మేరకు ప్రగతి సాధించలేకపోతున్నాయన్నారు. వాటిని ప్రైవేటీకరిస్తే అద్భుతాలు సాధించడం ఖాయమన్నారు. రాబోయే యుగం సోలార్ విద్యుత్దేన్నారు. రాష్ట్రంలో పది వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి అవసరమైన అనుమతులు ఇప్పటికే పారి శ్రామికవేత్తలకు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 3 మెగా సిటీలు, 14 స్మార్ట్ సిటీలు, 13 మెగా పుడ్ పార్క్‌లు, 20 ఇండస్ట్రియల్ సిటీలను అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం నుంచి ఎంపీపీ వరకూ ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఎన్జీవోలు, ఇతర అధికార సిబ్బంది ప్రతి ఒక్కరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని.. అక్కడ ఉన్న వనరులను వినియోగించుకుని స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దే వరకూ వదిలేదిలేదన్నారు. సమావేశంలో గెయిల్ చైర్మన్ బీసీ త్రిపాఠీ మాట్లాడుతూ కాకినాడ-శ్రీకాకుళం, చెన్నై-నెల్లూరు, విజయవాడ-నెల్లూరు మధ్య గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణానికి ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి పట్టణానికీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయడానికి పీపీపీ పద్ధతిలో ప్రయత్నిస్తామన్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ఆర్పీ సింగ్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్‌ను అధికంగా ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు విద్యుత్‌రంగంలో దేశం స్వయంసమృద్ధి సాధిస్తుందన్నారు. ఈ సమావేశంలో సీఐఐ రాష్ట్ర చైర్మన్ చిట్టూరి సురేష్, సీఐఐ వైస్ చైర్మన్ రామచంద్ర గల్లా, కేపీఎంజీ పార్టనర్ ఆర్.నారాయణన్ తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ విలే జ్ నిర్మించండి
తెలుగు చిత్రసీమను కోరిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సాక్షి, హైదరాబాద్: ‘‘సినీ పరిశ్రమ యావత్తూ ఒక్క తాటిపై నిలిచి స్ఫూర్తి నింపేలా ఈ కార్యక్రమం చేపట్టింది. ‘మేము సైతం’ ద్వారా రూ.11,51,56,116 మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించారు. ఈ మొత్తాన్నీ మీకే ఇచ్చేస్తాను. దీనికి సమానంగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తాం. ఆ మొత్తం డబ్బుతో హుద్‌హుద్ తో దెబ్బతిన్న పల్లెటూళ్లలో ఏదో ఒక పల్లెని మీరే ఎంచుకోండి. దాన్ని స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దండి’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. వచ్చే అక్టోబర్ నాటికి తుపాను బీభత్సానికి ఏడాది పూర్తవుతుందని, ఆలోగా స్మార్ట్ విలేజ్‌ని పూర్తి చేయాలన్నారు. విరాళాలతో దాదాపు 8 వేల గృహాలను కట్టొచ్చని, తెలుగు సినీ పరిశ్రమ పేరు కలకాలం నిలిచిపోయేలా ఆ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు ఇందుకు చిత్రప్రముఖులు అంగీకారం తెలిపారు. హుద్‌హుద్ తుపానుతో దెబ్బతిన్న విశాఖకు పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా తెలుగు చిత్రసీమ ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ‘మేము సైతం’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ‘‘ఈ శోభ చూస్తోంటే... మహనీయుడు నందమూరి తారకరామారావు గారు ప్రజల కోసం జోలె పట్టిన నాటి రోజులు గుర్తొస్తున్నాయి. ఆ స్ఫూర్తి ఇప్పుడు మీలో కనిపిస్తోంది. తుపాను సైతం అసూయ పడేంత బ్రహ్మండంగా ఈ కార్యక్రమం చేశారు’’ అని కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లోనూ విశాఖ ప్రజలు చూపించిన చొరవ చాలా గొప్పదన్నారు. భవిష్యత్తులో ఏ విలయం కూడా ఏమీ చేయలేనంత గొప్పగా వైజాగ్‌ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ‘‘తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలుగువారు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి. తెలుగు చిత్రసీమ రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందాలి’’ అని పేర్కొన్నారు. సంక్షోభంలోనే అవకాశాలు.. కొత్త రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా వాటిని తాను భయపడనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సంక్షోభంలోనే అవకాశాలు ఉంటాయన్నారు. రాజధాని నిర్మాణం ఒకప్పుడు పెద్ద సమస్య అని, కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు. విజయవాడను తెలుగువారు గర్వపడేలా రాజధానిగా తీర్చిదిద్దాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ‘‘నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ మంచి ఫలితాలనిచ్చింది. దాని స్ఫూర్తిగా నేను ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’కి పిలుపునిచ్చాను. అది మంచి ఫలితాలను ఇస్తోంది. త్వరలో ‘స్మార్ట్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ముందుకెళ్తా. సింగపూర్, జపాన్ స్ఫూర్తితో ముందుకెళ్తే రానున్న 30, 40 ఏళ్లలో మనదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం ఖాయం’’ అని అన్నారు. ఈ సందర్భంగా జెమినీ టీవీతోపాటు పలు వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు చంద్రబాబుకు విరాళాల చెక్కులు అందించాయి. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ.5 లక్షల విరాళం ప్రకటించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్ అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగు చిత్రసీమ తరఫున చిరంజీవి ముగింపు ప్రసంగం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందర్నీ అభినందించారు.