జనరంజక పాలన
స్మార్ట్ విలేజ్‌పై దృష్టిసారించని అధికారులు
ఇంటికే పింఛన్ల పంపిణీకి ఐరిస్ టెక్నాలజీ
జిల్లాలో 100 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమలు
మరిన్ని ఇసుక క్వారీలు తెరిపిస్తాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ బాబు.ఎ
మచిలీపట్నం : జిల్లా పరిస్థితులను అవగతం చేసుకుని జనరంజక పాలన అందించనున్నట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బుధవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇటీవలే బాధ్యతలు తీసుకున్న తాను జిల్లాలో పరిస్థితులపై అవలోకనం చేసుకుంటున్నట్లు చెప్పారు. పారదర్శక పాలన అందించటంతో పాటు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ విలేజ్/వార్డు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విజయవాడ, మచిలీపట్నం నుంచి పాలన సాగించాల్సి వస్తోందని, ఇది కొంత ఇబ్బంది అయినా సానుకూల దృక్పథంతో ముందుకు వెళుతున్నానని చెప్పారు.
సాక్షి : ఇప్పటివరకు ఎన్ని స్మార్‌ట విలేజీలు గుర్తించారు?
కలెక్టర్ : స్మార్ట్ విలేజ్, వార్డుల గుర్తింపులో రాష్ట్రం మొత్తంమీద జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఏ జిల్లాలో లేనివిధంగా 119 గ్రామాలను ఈ పథకం కింద అభివృద్ధి చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించాం. అందులో గ్రామం, అక్కడి ప్రజల అవసరాలు, పాఠశాలలు తదితర వివరాలు పొందుపరిచాం. వాటిని ఆన్‌లైన్‌లో చూసుకుని వారే ఏ పనిచేయాలో నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది. ప్రత్యేకాధికారులు అక్కడి అవసరాలను తీర్చేందుకు దృష్టిసారించాల్సిందే. ఏదైనా అత్యవసర పని ఉండి గురువారం ఆ గ్రామానికి వెళ్లలేకుంటే మరుసటిరోజైనా వెళ్లాల్సిందే. గ్రామానికి అలా వెళ్లి, ఇలా తిరిగి వచ్చే అధికారుల సేవలు అవసరం లేదు. వారిని ఇంటికి పంపేందుకు వెనుకాడం.
సాక్షి : జిల్లాలో 25 వేల మందికి పింఛన్లు అందటం లేదు. వారి పరిస్థితి ఏమిటి?
కలెక్టర్ : పింఛన్లు అందకపోవటం వాస్తవం. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతినెలా ఒకటి నుంచి ఏడో తేదీ వరకు పింఛన్లు ఇస్తున్నాం. మంచంలో నుంచి లేవలేని వారికి ఈ వారం రోజుల వ్యవధిలో రెండు రోజులు ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించాను. పింఛన్ల పంపిణీకి ఐరీస్
సాక్షి : ఇసుక క్వారీల ద్వారా ఎంత వ్యాపారం చేశారు?
కలెక్టర్ : శనగపాడు, అల్లూరుపాడు, ఇబ్రహీంపట్నం, భవానీపురం, సూరాయపాలెం, గుంటుపల్లి రీచ్‌ల ద్వారా రూ.21 కోట్ల వ్యాపారం చేశాం. సీనరేజ్‌లో 40 శాతం నిధులు స్థానిక సంస్థలకు ఇవ్వాల్సి ఉంది. ఇటీవలే రూ.50 లక్షలు స్థానిక సంస్థల వాటాగా విడుదల చేశాం. వేదాద్రి, కాసరబాద, హొక్కునూరు, కంచల, చెవిటికల్లు, కునికిపాడు ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు వచ్చాయి. వీటితో పాటు మరో 32 ఇసుక క్వారీలకు సంబంధించి సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాం. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు క్వారీకి అప్రోచ్ రోడ్డు నిర్మించేందుకు రూ.17.50 లక్షలతో అనుమతులు వచ్చాయి. నాలుగైదు రోజుల్లో ఈ పనులు ప్రారంభిస్తాం.
సాక్షి : రుణమాఫీ రెండో జాబితా
ఎప్పటిలోగా పూర్తి చేస్తారు?
కలెక్టర్ : జన్మభూమి కార్యక్రమం అనంతరం రుణమాఫీకి సంబంధించి 80 వేల దరఖాస్తులు వచ్చాయి. నేను బాధ్యతలు చేపట్టే నాటికి 12 శాతం దరఖాస్తులను పరిశీలించి ఆన్‌లైన్ చేశారు. ప్రస్తుతం 80 శాతం మేర రెండో విడత రుణమాఫీకి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ చేశాం. నాలుగైదు రోజుల్లో మిగిలినవి పూర్తవుతాయి. అన్ని అర్హతలూ ఉంటే రైతులు రుణమాఫీ జరుగుతుంది. ప్రతి శనివారం అన్ని బ్యాంకుల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. రుణమాఫీ పైనే కాకుండా ఇతర అంశాలపైనా బ్యాంకు అధికారులతో మాట్లాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నాం.