కొత్తగా 6,960 మందికి ఇంటి వద్దే పింఛను
వారి బ్యాంకు ఖాతాల్లో ఇబ్బందులతో అధికారుల నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 98.89 శాతం మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ రకాల చేతి వృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెల పింఛన్ల పంపిణీ పూర్తయినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. డీబీటీ రూపంలో పింఛను డబ్బు బ్యాంకులో జమ చేసిన వారిలో 6,960 మంది బ్యాంకు ఖాతాల్లో ఇబ్బందులు రావడంతో వారికి బదిలీ చేసిన పింఛను డబ్బులు వెనక్కి వచ్చాయని, వీరందరికీ సోమవారం నుంచి ఇంటి వద్దే పింఛను డబ్బు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
ఈ నెల (జూన్) 1వ తేదీ నుంచి మొత్తం 65,30,838 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 1,939.35 కోట్లు విడుదల చేసింది. వీరిలో 47,67,773 మందికి పింఛను సొమ్మును డీబీటీ రూపంలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు చెప్పారు. 17,63,065 మందికి ఇంటి వద్ద పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీరిలో 16,90,945 మందికి పంపిణీ పూర్తయినట్టు వివరించారు. బ్యాంకులో డబ్బు జమ చేసిన లబ్ధిదారులతో కలిపి సోమవారం సాయంత్రం వరకు మొత్తం 64.58 లక్షల మందికి రూ. 1,919.07 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment