Distribution of pensions homes
-
98.89 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 98.89 శాతం మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ రకాల చేతి వృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెల పింఛన్ల పంపిణీ పూర్తయినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. డీబీటీ రూపంలో పింఛను డబ్బు బ్యాంకులో జమ చేసిన వారిలో 6,960 మంది బ్యాంకు ఖాతాల్లో ఇబ్బందులు రావడంతో వారికి బదిలీ చేసిన పింఛను డబ్బులు వెనక్కి వచ్చాయని, వీరందరికీ సోమవారం నుంచి ఇంటి వద్దే పింఛను డబ్బు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.ఈ నెల (జూన్) 1వ తేదీ నుంచి మొత్తం 65,30,838 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 1,939.35 కోట్లు విడుదల చేసింది. వీరిలో 47,67,773 మందికి పింఛను సొమ్మును డీబీటీ రూపంలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు చెప్పారు. 17,63,065 మందికి ఇంటి వద్ద పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీరిలో 16,90,945 మందికి పంపిణీ పూర్తయినట్టు వివరించారు. బ్యాంకులో డబ్బు జమ చేసిన లబ్ధిదారులతో కలిపి సోమవారం సాయంత్రం వరకు మొత్తం 64.58 లక్షల మందికి రూ. 1,919.07 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. -
1వ తేదీనే రూ. 1,404.03 కోట్లు పంపిణీ
సాక్షి, అమరావతి: ఠంచన్‌గా ఒకటవ తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ మొదలైంది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వలంటీర్లే వెళ్లి డబ్బులు అందజేశారు. మంగళవారం ఒక్క రోజునే 55,23,610 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.1,404.03 కోట్లు పంపిణీ చేశారు. ఈ నెలకు గాను 62,33,382 మంది పింఛన్‌దారులకు పంపిణీ చేసేందుకు రూ.1,585.60 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఒక్క రోజు ముందే ఆయా గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు పంపిణీ ప్రారంభించి తొలి రోజు 88.55 శాతం మందికి పంపిణీ పూర్తి చేసినట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. వలంటీర్ల ఆధ్వర్యంలో ఐదవ తేదీ వరకు పంపిణీ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. -
మండుటెండలోనూ ఠంచనుగా పింఛను
సాక్షి, అమరావతి: మండుటెండలు.. మేడే.. ఆదివారం సెలవు.. అయినా ఒకటో తేదీనే రాష్ట్రవ్యాప్తంగా 53,26,151 మంది లబ్ధిదారులకు పింఛను డబ్బులను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రామ, వార్డు వలంటీర్లు తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు అందజేశారు. తొలిరోజునే రూ.1353.14 కోట్లు లబ్ధిదారులకు అందాయి. మొత్తం 60,87,942 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ నెల పింఛన్లు మంజూరు చేయగా.. అందులో 87.49 శాతం మందికి ఆదివారమే పంపిణీ పూర్తయినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజులు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారని చెప్పారు. ఒంగోలులో దివ్యాంగుడు వెంకట తరుణ్‌కు పింఛన్ అందజేస్తున్న వలంటీర్ వెంకట రమణ -
పింఛన్ల పంపిణీ ఇక మూడురోజులు
సాక్షి, అమరావతి: పింఛనుదారులందరికీ ప్రతినెలా డబ్బు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క లబ్ధిదారు పింఛను అందక ఇబ్బంది పడకూడదని.. మూడురోజులపాటు పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ నిర్ణయం డిసెంబర్ నుంచే అమలుకానుంది. డిసెంబర్ పింఛన్లను 1, 2, 3 తేదీల్లో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీ వేతనాలు అందినట్లే అవ్వాతాతలకు ప్రతినెలా ఒకటో తేదీనే పింఛను డబ్బులు అందజేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికారులు ఈ ఏడాది జూలై నెల నుంచి పింఛన్ల పంపిణీని ఒకటో తేదీకే పరిమితం చేశారు. గిరిజన ప్రాంతాలు వంటి మారుమాల ప్రాంతాల్లో రెండురోజుల పాటు పంపిణీకి వీలు కల్పించారు. వలంటీర్లు పంపిణీ చేసేందుకు వెళ్లినప్పుడు ఊళ్లో లేకపోవడం వంటి కారణాలతో ఆ రోజు తీసుకోలేకపోయినవారికి తరువాత నెలలో బకాయితో సహా చెల్లిస్తున్నారు. లబ్ధిదారులెవరూ ఈ విధంగా ఇబ్బంది పడకూడదని, అందరికీ పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో డిసెంబర్ నుంచి ప్రతినెలా ఒకటి, రెండు, మూడు తేదీల్లో పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో అందరికీ పింఛను అందే అవకాశం ఉంది. ఏవైనా కారణాల వల్ల ఈ మూడు రోజుల్లో కూడా తీసుకోలేకపోయినవారికి ఆయా వార్డు, గ్రామ సచివాలయాల్లో ఇచ్చే ఏర్పాట్లు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. డిసెంబర్లో 61.69 లక్షల మందికి పంపిణీ డిసెంబర్ ఒకటి నుంచి మూడురోజులు 61,69,832 మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,510.90 కోట్లను రాష్ట్రంలోని అన్ని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాల్లో సోమవారం జమచేశారు. వరుసగా మూడునెలలు పింఛను తీసుకోని వారికి నిబంధనల ప్రకారం పింఛను తాత్కాలికంగా నిలిపేసి, మళ్లీ పరిశీలన అనంతరమే కొనసాగించాల్సి ఉంది. అలాంటి వారికీ ఊరట కలిగిస్తూ.. వరుసగా మూడునెలలు పింఛను తీసుకోని 7,462 మందికి మూడునెలల బకాయిలతో కలిపి ఈనెల డబ్బులను పంపిణీ చేయనున్నారు. . -
నేడు కూడా పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి : వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమం మంగళవారం కూడా కొనసాగనుంది. ప్రతినెలా మూడు పనిదినాలు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటో తేదీనే వాటి పంపిణీని ప్రారంభించిన వలంటీర్లు.. రెండో రోజు ఆదివారం సెలవు దినమైనప్పటికీ పింఛన్లు అందజేశారు. సోమవారం సాయంత్రం నాటికి 93 శాతం పూర్తికావడంతో మంగళవారం కూడా పింఛన్లను పంపిణీ చేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ రాజాబాబు ‘సాక్షి’కి తెలిపారు. ఫిబ్రవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేసిన వారితో కలిపి రాష్ట్రంలో మొత్తం 54,68,309 మంది పింఛనుదారులుండగా.. సోమవారం నాటికి 50,42,126 మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయిందని రాజాబాబు చెప్పారు. రూ.1,210 కోట్ల మొత్తం లబ్ధిదారులకు చేరిందన్నారు. వలంటీర్ల వల్ల ఎప్పుడూ లేని విధంగా ఈసారి 99 శాతం దాకా పింఛన్ల పంపిణీ జరిగే అవకాశం ఉందన్నారు. -
సెలవు రోజూ పింఛన్ల పండుగ
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: సంక్షేమ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ అవ్వాతాతలు, లబ్ధిదారులు ఎక్కడున్నా సరే వారి వద్దకే వలంటీర్లు వెళ్లి మరీ పింఛను డబ్బులు అందజేసే బృహత్తర కార్యక్రమం సెలవు రోజైన ఆదివారం నాడూ కొనసాగింది. ఇంట్లో ఉన్నా.. పొలంలో ఉన్నా.. ఎక్కడైనా పనిలో ఉన్నా.. ఆసుపత్రిలో ఉన్నా.. ఎవరెక్కడ ఉన్నారో తెలుసుకుని మరీ వెళ్లి వలంటీర్లు పింఛన్లు అందిస్తున్నారు. గతంలో దూరప్రాంతంలో ఉన్న బిడ్డలు పంపిన మనీ ఆర్డర్‌ను పోస్టుమ్యాన్ అందించినట్టు ప్రస్తుతం తమ మనవడిగా వైఎస్ జగన్ వలంటీర్లను పంపించి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని వృద్ధులు ఆనందంగా చెబుతున్నారు. తమకు రావాల్సిన డబ్బుల కోసం ఊళ్లో పంచాయతీ ఆఫీసు ముందు గంటల తరబడి ఎండలో కూర్చొని ఎదురు చూసిన రోజులను లబ్ధిదారులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు తమ ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందజేస్తున్న వలంటీర్లను చూసి కొందరు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంటున్న ఉదంతాలు సాక్షాత్కరిస్తున్నాయి. తమ కష్టాలు తీరడానికి కారణమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ‘ఆ అయ్య.. చల్లగా ఉండాలయ్యా’ అంటూ అవ్వాతాతలు మనసారా దీవిస్తున్నారు. ‘మనవడా... నిండు నూరేళ్లూ వర్దిల్లు’ అని ఆశీర్వదిస్తున్నారు. సెలవు రోజూ ఆగని సేవ ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రంలో 1,019 మంది వలంటీర్లు రెండు రోజులుగా ఇళ్ల వద్దనే పింఛన్ల పంపిణీ అనే బృహత్తర కార్యక్రమాన్ని వడివడిగా నిర్వహిస్తున్నారు. ఆదివారం.. సెలవు రోజు అయినా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి, పింఛను డబ్బులను స్వయంగా అందజేశారు వలంటీర్లు. మొదటి రోజు శనివారం 42.81 లక్షల మంది దగ్గరకు వెళ్లి పింఛన్లు అందించారు. రెండోరోజు ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ప్రభుత్వం తన కర్తవ్య నిర్వహణకు విరామం ఇవ్వలేదు. ఆదివారం కూడా వలంటీర్లు దాదాపు 4 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. మిగిలిన వారికి నేడు పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం దాదాపు 4 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసినట్టు ‘సెర్ప్’ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి 46,90,837 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తయిందని చెప్పారు. ఇప్పటిదాకా 86 శాతం మేర పంపిణీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి సోమవారం పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటిదాకా పంచాయతీ కార్యదర్శులు నెలలో 10 రోజుల పాటు పింఛన్లు పంపిణీ చేసేవారు. ప్రతినెలా 94–95 శాతం మాత్రమే పింఛన్ల పంపిణీ జరిగేదని ‘సెర్ప్’ ఉన్నతాధికారి ఒకరు గుర్తుచేశారు. శ్రీకాకుళం జిల్లాలోని వంగర గ్రామానికి చెందిన పాతర్లపల్లి బుజ్జి ఒక ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. దివ్యాంగుల పింఛను అందుతోంది. గతంలో పింఛను డబ్బులు తీసుకోవాలంటే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు దాకా క్యూలో ఉండాల్సి వచ్చేదని చెప్పాడు. ఇప్పుడు గ్రామ వలంటీర్ తన ఇంటి వద్దకే వచ్చి పింఛను ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు. తమ కష్టాలను గుర్తించి, ఇళ్ల వద్దనే పింఛను డబ్బులు ఇప్పిస్తున్న జగనన్నకు రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. పడిగాపులకు ఇక చెల్లుచీటి గతంలో పింఛన్ల పంపిణీ ప్రహసనంగా సాగేది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు.. ఎవరైనా సరే పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సిందే. గంటల తరబడి ఎండలో నిలబడాల్సి వచ్చేది. వీల్‌చైర్‌లో ఉన్నా, మంచం మీద కదలలేని స్థితిలో ఉన్నా ఆ తిప్పలు తప్పేవి కావు. పడిగాపులు కాసినా ఆ రోజు పింఛనుడబ్బు చేతికి అందుతుందో లేదో తెలియని పరిస్థితి ఆందోళన కలిగించేంది. ఎదురుచూపుల్లోనే ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ దయనీయ పరిస్థితుల్ని మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంకణబద్ధులయ్యారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నారు. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులకు పింఛన్లు అందజేస్తున్నారు. ఉదయాన్నే తలుపుతట్టిన వలంటీర్లు పింఛను డబ్బులు చేతికి ఇస్తుంటే అందుకున్న వారి కళ్లల్లో కనిపించిన ఆనందం వర్ణనాతీతం. - ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడుకు చెందిన తమ్మినేని కాశమ్మ వయసు 81 ఏళ్లు. భర్త చిన్న హనుమంతారెడ్డి 25 ఏళ్ల క్రితం మృతి చెందాడు. పిల్లలు లేకపోవడంతో ఒంటరి జీవితం గడుపుతోంది. గతంలో పింఛను తీసుకోవాలంటే ఆటోలో పంచాయతీ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో మంచాన పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లను పంపిణీ చేస్తుండడంతో కాశమ్మ చెమ్మగిల్లిన కళ్లతో ఆనందం వ్యక్తం చేసింది. తన ఇబ్బందులు తీరాయని చెప్పింది. బెంగళూరు వెళ్లి పింఛన్ పంపిణీ! అమరాపురం: ఇంటి వద్దకే పింఛన్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1వ తేదీనే వలంటీర్లు ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే అనంతపురం జిల్లా అమరాపురం మండలం నిద్రగట్ట పంచాయతీ యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్ప స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఆయనకు పింఛన్ పంపిణీ చేయలేకపోయారు. దీంతో వలంటీర్ వీరేష్ అతని కోసం వివరాలు ఆరా తీశాడు. గొంతు క్యాన్సర్‌తో ఈశ్వరప్ప 20 రోజుల కిందట బెంగళూరులోని కిద్వాయ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్నాడు. ఆపదలో ఉన్న వ్యక్తికి పింఛన్ అందిస్తే ఉపయోగపడుతుందని భావించాడు. స్థానిక వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మంజునాథ్ రవాణా ఖర్చులు ఇచ్చి సహకరించారు. దీంతో వలంటీర్ వీరేష్ ఆదివారం ఉదయమే 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరుకు వెళ్లి కిద్వాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరప్పకు పింఛన్ మొత్తం రూ. 2,250 అందించాడు. ఇది గమనించిన అక్కడి రోగులు విషయం తెలుసుకుని ఏపీ సీఎం గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇవ్వడం ఒక ఎత్తయితే.. లబ్ధిదారుడు ఎక్కడున్నాడో కనుక్కుని మరీ అక్కడే పింఛన్ ఇవ్వడం అభినందనీయమంటూ మెచ్చుకున్నారు. ‘ఓ వలంటీర్‌గా పింఛన్ పంపిణీ నా బాధ్యత. నా పరిధిలో ఉంటున్న వారికి ఏ కష్టం వచ్చినా దాన్ని ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లి పరిష్కారం చూపాల్సిన విధుల్లో నేను ఉన్నాను. అందుకే క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్న ఈశ్వరప్పకు బెంగళూరుకు వెళ్లి పింఛన్ మొత్తం ఇచ్చాను. నేను పింఛన్ డబ్బు ఇవ్వగానే ఈశ్వరప్ప ముఖంలో చిరునవ్వులు కనిపించాయి’ అని వలంటీర్ పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప సీఎంను ఎప్పుడూ చూడలేదు రెండు, మూడు సార్లు తిరిగితేనే పింఛన్ సక్రమంగా ఇవ్వరు. అల్లాంటిది ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇవ్వడమే పెద్ద విషయం. దాన్ని మించి ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్న నా దగ్గరికి వచ్చి పింఛన్ అందించడం నిజంగా గ్రేట్. ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. వలంటీర్ వ్యవస్థ ఎందుకు తీసుకువచ్చారో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పింఛన్ మొత్తం రోజువారీ ఖర్చులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. – ఈశ్వరప్ప, క్యాన్సర్ బాధితుడు, యర్రగుంటపల్లి, అనంతపురం జిల్లా -
జనరంజక పాలన
స్మార్ట్ విలేజ్‌పై దృష్టిసారించని అధికారులు ఇంటికే పింఛన్ల పంపిణీకి ఐరిస్ టెక్నాలజీ జిల్లాలో 100 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమలు మరిన్ని ఇసుక క్వారీలు తెరిపిస్తాం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ బాబు.ఎ మచిలీపట్నం : జిల్లా పరిస్థితులను అవగతం చేసుకుని జనరంజక పాలన అందించనున్నట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇటీవలే బాధ్యతలు తీసుకున్న తాను జిల్లాలో పరిస్థితులపై అవలోకనం చేసుకుంటున్నట్లు చెప్పారు. పారదర్శక పాలన అందించటంతో పాటు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ విలేజ్/వార్డు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విజయవాడ, మచిలీపట్నం నుంచి పాలన సాగించాల్సి వస్తోందని, ఇది కొంత ఇబ్బంది అయినా సానుకూల దృక్పథంతో ముందుకు వెళుతున్నానని చెప్పారు. సాక్షి : ఇప్పటివరకు ఎన్ని స్మార్ట విలేజీలు గుర్తించారు? కలెక్టర్ : స్మార్ట్ విలేజ్, వార్డుల గుర్తింపులో రాష్ట్రం మొత్తంమీద జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఏ జిల్లాలో లేనివిధంగా 119 గ్రామాలను ఈ పథకం కింద అభివృద్ధి చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వెబ్సైట్ రూపొందించాం. అందులో గ్రామం, అక్కడి ప్రజల అవసరాలు, పాఠశాలలు తదితర వివరాలు పొందుపరిచాం. వాటిని ఆన్లైన్లో చూసుకుని వారే ఏ పనిచేయాలో నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది. ప్రత్యేకాధికారులు అక్కడి అవసరాలను తీర్చేందుకు దృష్టిసారించాల్సిందే. ఏదైనా అత్యవసర పని ఉండి గురువారం ఆ గ్రామానికి వెళ్లలేకుంటే మరుసటిరోజైనా వెళ్లాల్సిందే. గ్రామానికి అలా వెళ్లి, ఇలా తిరిగి వచ్చే అధికారుల సేవలు అవసరం లేదు. వారిని ఇంటికి పంపేందుకు వెనుకాడం. సాక్షి : జిల్లాలో 25 వేల మందికి పింఛన్లు అందటం లేదు. వారి పరిస్థితి ఏమిటి? కలెక్టర్ : పింఛన్లు అందకపోవటం వాస్తవం. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతినెలా ఒకటి నుంచి ఏడో తేదీ వరకు పింఛన్లు ఇస్తున్నాం. మంచంలో నుంచి లేవలేని వారికి ఈ వారం రోజుల వ్యవధిలో రెండు రోజులు ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించాను. పింఛన్ల పంపిణీకి ఐరీస్ సాక్షి : ఇసుక క్వారీల ద్వారా ఎంత వ్యాపారం చేశారు? కలెక్టర్ : శనగపాడు, అల్లూరుపాడు, ఇబ్రహీంపట్నం, భవానీపురం, సూరాయపాలెం, గుంటుపల్లి రీచ్‌ల ద్వారా రూ.21 కోట్ల వ్యాపారం చేశాం. సీనరేజ్‌లో 40 శాతం నిధులు స్థానిక సంస్థలకు ఇవ్వాల్సి ఉంది. ఇటీవలే రూ.50 లక్షలు స్థానిక సంస్థల వాటాగా విడుదల చేశాం. వేదాద్రి, కాసరబాద, హొక్కునూరు, కంచల, చెవిటికల్లు, కునికిపాడు ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు వచ్చాయి. వీటితో పాటు మరో 32 ఇసుక క్వారీలకు సంబంధించి సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాం. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు క్వారీకి అప్రోచ్ రోడ్డు నిర్మించేందుకు రూ.17.50 లక్షలతో అనుమతులు వచ్చాయి. నాలుగైదు రోజుల్లో ఈ పనులు ప్రారంభిస్తాం. సాక్షి : రుణమాఫీ రెండో జాబితా ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? కలెక్టర్ : జన్మభూమి కార్యక్రమం అనంతరం రుణమాఫీకి సంబంధించి 80 వేల దరఖాస్తులు వచ్చాయి. నేను బాధ్యతలు చేపట్టే నాటికి 12 శాతం దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ చేశారు. ప్రస్తుతం 80 శాతం మేర రెండో విడత రుణమాఫీకి సంబంధించిన వివరాలను ఆన్లైన్ చేశాం. నాలుగైదు రోజుల్లో మిగిలినవి పూర్తవుతాయి. అన్ని అర్హతలూ ఉంటే రైతులు రుణమాఫీ జరుగుతుంది. ప్రతి శనివారం అన్ని బ్యాంకుల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. రుణమాఫీ పైనే కాకుండా ఇతర అంశాలపైనా బ్యాంకు అధికారులతో మాట్లాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నాం.