సెలవు రోజూ పింఛన్ల పండుగ | Pensions Distribution to home also On Regular holiday | Sakshi
Sakshi News home page

సెలవు రోజూ పింఛన్ల పండుగ

Published Mon, Feb 3 2020 3:23 AM | Last Updated on Mon, Feb 3 2020 8:13 AM

Pensions Distribution to home also On Regular holiday - Sakshi

మచిలీపట్నంలోని నారాయణపురంలో ఇంటి వద్దనే పింఛను సొమ్ము అందుకున్న ఆనందంలో వెంకటసుబ్బమ్మ

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: సంక్షేమ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ అవ్వాతాతలు, లబ్ధిదారులు ఎక్కడున్నా సరే వారి వద్దకే వలంటీర్లు వెళ్లి మరీ పింఛను డబ్బులు అందజేసే బృహత్తర కార్యక్రమం సెలవు రోజైన ఆదివారం నాడూ కొనసాగింది. ఇంట్లో ఉన్నా.. పొలంలో ఉన్నా.. ఎక్కడైనా పనిలో ఉన్నా.. ఆసుపత్రిలో ఉన్నా.. ఎవరెక్కడ ఉన్నారో తెలుసుకుని మరీ వెళ్లి వలంటీర్లు పింఛన్లు అందిస్తున్నారు. గతంలో దూరప్రాంతంలో ఉన్న బిడ్డలు పంపిన మనీ ఆర్డర్‌ను పోస్టుమ్యాన్‌ అందించినట్టు ప్రస్తుతం తమ మనవడిగా వైఎస్‌ జగన్‌ వలంటీర్లను పంపించి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని వృద్ధులు ఆనందంగా చెబుతున్నారు.  తమకు రావాల్సిన డబ్బుల కోసం ఊళ్లో పంచాయతీ ఆఫీసు ముందు గంటల తరబడి ఎండలో కూర్చొని ఎదురు చూసిన రోజులను లబ్ధిదారులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు తమ ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందజేస్తున్న వలంటీర్లను చూసి కొందరు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంటున్న ఉదంతాలు సాక్షాత్కరిస్తున్నాయి.  తమ కష్టాలు తీరడానికి కారణమైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ‘ఆ అయ్య.. చల్లగా ఉండాలయ్యా’ అంటూ అవ్వాతాతలు మనసారా దీవిస్తున్నారు. ‘మనవడా... నిండు నూరేళ్లూ వర్దిల్లు’ అని ఆశీర్వదిస్తున్నారు. 

సెలవు రోజూ ఆగని సేవ 
ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రంలో 1,019 మంది వలంటీర్లు రెండు రోజులుగా ఇళ్ల వద్దనే పింఛన్ల పంపిణీ అనే బృహత్తర కార్యక్రమాన్ని వడివడిగా నిర్వహిస్తున్నారు. ఆదివారం.. సెలవు రోజు అయినా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి, పింఛను డబ్బులను స్వయంగా అందజేశారు వలంటీర్లు. మొదటి రోజు శనివారం 42.81 లక్షల మంది దగ్గరకు వెళ్లి పింఛన్లు అందించారు. రెండోరోజు ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ప్రభుత్వం తన కర్తవ్య నిర్వహణకు విరామం ఇవ్వలేదు. ఆదివారం కూడా వలంటీర్లు దాదాపు 4 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. 

మిగిలిన వారికి నేడు పంపిణీ 
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం దాదాపు 4 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసినట్టు ‘సెర్ప్‌’ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి 46,90,837 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తయిందని చెప్పారు. ఇప్పటిదాకా 86 శాతం మేర పంపిణీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి సోమవారం పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటిదాకా పంచాయతీ కార్యదర్శులు నెలలో 10 రోజుల పాటు పింఛన్లు పంపిణీ చేసేవారు. ప్రతినెలా 94–95 శాతం మాత్రమే పింఛన్ల పంపిణీ జరిగేదని ‘సెర్ప్‌’ ఉన్నతాధికారి ఒకరు గుర్తుచేశారు. 

శ్రీకాకుళం జిల్లాలోని వంగర గ్రామానికి చెందిన పాతర్లపల్లి బుజ్జి ఒక ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. దివ్యాంగుల పింఛను అందుతోంది. గతంలో పింఛను డబ్బులు తీసుకోవాలంటే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు దాకా క్యూలో ఉండాల్సి వచ్చేదని చెప్పాడు. ఇప్పుడు గ్రామ వలంటీర్‌ తన ఇంటి వద్దకే వచ్చి పింఛను ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు. తమ కష్టాలను గుర్తించి, ఇళ్ల వద్దనే పింఛను డబ్బులు ఇప్పిస్తున్న జగనన్నకు రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. 

పడిగాపులకు ఇక చెల్లుచీటి 
గతంలో పింఛన్ల పంపిణీ ప్రహసనంగా సాగేది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు.. ఎవరైనా సరే పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సిందే. గంటల తరబడి ఎండలో నిలబడాల్సి వచ్చేది. వీల్‌చైర్‌లో ఉన్నా, మంచం మీద కదలలేని స్థితిలో ఉన్నా ఆ తిప్పలు తప్పేవి కావు. పడిగాపులు కాసినా ఆ రోజు పింఛనుడబ్బు చేతికి అందుతుందో లేదో తెలియని పరిస్థితి ఆందోళన కలిగించేంది. ఎదురుచూపుల్లోనే ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ దయనీయ పరిస్థితుల్ని మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంకణబద్ధులయ్యారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నారు. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులకు పింఛన్లు అందజేస్తున్నారు. ఉదయాన్నే తలుపుతట్టిన వలంటీర్లు పింఛను డబ్బులు చేతికి ఇస్తుంటే అందుకున్న వారి కళ్లల్లో కనిపించిన ఆనందం వర్ణనాతీతం. 

- ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడుకు చెందిన తమ్మినేని కాశమ్మ వయసు 81 ఏళ్లు. భర్త చిన్న హనుమంతారెడ్డి 25 ఏళ్ల క్రితం మృతి చెందాడు. పిల్లలు లేకపోవడంతో ఒంటరి జీవితం గడుపుతోంది. గతంలో పింఛను తీసుకోవాలంటే ఆటోలో పంచాయతీ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో మంచాన పడింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లను పంపిణీ చేస్తుండడంతో కాశమ్మ చెమ్మగిల్లిన కళ్లతో ఆనందం వ్యక్తం చేసింది. తన ఇబ్బందులు తీరాయని చెప్పింది. 

బెంగళూరు వెళ్లి పింఛన్‌ పంపిణీ!
అమరాపురం: ఇంటి వద్దకే పింఛన్‌ రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1వ తేదీనే వలంటీర్లు ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే అనంతపురం జిల్లా అమరాపురం మండలం నిద్రగట్ట పంచాయతీ యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్ప స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఆయనకు పింఛన్‌ పంపిణీ చేయలేకపోయారు. దీంతో వలంటీర్‌ వీరేష్‌ అతని కోసం వివరాలు ఆరా తీశాడు. గొంతు క్యాన్సర్‌తో ఈశ్వరప్ప 20 రోజుల కిందట బెంగళూరులోని కిద్వాయ్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్నాడు. ఆపదలో ఉన్న వ్యక్తికి పింఛన్‌ అందిస్తే ఉపయోగపడుతుందని భావించాడు. స్థానిక వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ మంజునాథ్‌ రవాణా ఖర్చులు ఇచ్చి సహకరించారు. దీంతో వలంటీర్‌ వీరేష్‌ ఆదివారం ఉదయమే 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరుకు వెళ్లి కిద్వాయ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరప్పకు పింఛన్‌ మొత్తం రూ. 2,250 అందించాడు. ఇది గమనించిన అక్కడి రోగులు విషయం తెలుసుకుని ఏపీ సీఎం గ్రేట్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇంటి వద్దకే వచ్చి పింఛన్‌ ఇవ్వడం ఒక ఎత్తయితే.. లబ్ధిదారుడు ఎక్కడున్నాడో కనుక్కుని మరీ అక్కడే పింఛన్‌ ఇవ్వడం అభినందనీయమంటూ మెచ్చుకున్నారు. 

‘ఓ వలంటీర్‌గా పింఛన్‌ పంపిణీ నా బాధ్యత. నా పరిధిలో ఉంటున్న వారికి ఏ కష్టం వచ్చినా దాన్ని ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లి పరిష్కారం చూపాల్సిన విధుల్లో నేను ఉన్నాను. అందుకే క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్న ఈశ్వరప్పకు బెంగళూరుకు వెళ్లి పింఛన్‌ మొత్తం ఇచ్చాను.  నేను పింఛన్‌ డబ్బు ఇవ్వగానే ఈశ్వరప్ప ముఖంలో చిరునవ్వులు కనిపించాయి’ అని వలంటీర్‌ పేర్కొన్నారు.

ఇలాంటి గొప్ప సీఎంను ఎప్పుడూ చూడలేదు
రెండు, మూడు సార్లు తిరిగితేనే పింఛన్‌ సక్రమంగా ఇవ్వరు. అల్లాంటిది ఇంటి వద్దకే వచ్చి పింఛన్‌ ఇవ్వడమే పెద్ద విషయం. దాన్ని మించి ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్న నా దగ్గరికి వచ్చి పింఛన్‌ అందించడం నిజంగా గ్రేట్‌. ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. వలంటీర్‌ వ్యవస్థ ఎందుకు తీసుకువచ్చారో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పింఛన్‌ మొత్తం రోజువారీ ఖర్చులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది.
 – ఈశ్వరప్ప, క్యాన్సర్‌ బాధితుడు, యర్రగుంటపల్లి, అనంతపురం జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement