పల్లెల్నీ పిండేద్దాం
గ్రామాల్లో ఆదాయ వనరులపై సర్వేకు సర్కారు ఆదేశం
అన్ని గ్రామాల్లో పన్నుల సవరణకు కసరత్తు
ఏప్రిల్ 1 నాటికి కొలిక్కి వచ్చే అవకాశం
ఏలూరు :పల్లె ప్రజలపైనా పన్నుల భారం పెంచేం దుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం గ్రామీణ ఆదాయ వనరులపై దృష్టి సారిస్తోంది. జిల్లాలోని 48 మండలాల్లో ఒక్కొక్క గ్రామంలో రెండునెలల క్రితమే ఆదాయ వనరులు ఏ మేరకు ఉన్నాయనే అంశంపై ప్రయోగాత్మకంగా సర్వే జరిపిం చింది. మిగిలిన 883 పంచాయతీల్లో పన్నుల పరిస్థితి ఏమిటి, ఇంకా ఏయే ఆదాయ వనరులు ఉన్నాయనే విషయాలపై సర్వే చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రతి ఊరిని స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన సర్కారు అందుకు అవసరమైన నిధులిచ్చేందుకు సిద్ధంగా లేదు.
ఇందుకు అవసరమైన సొమ్మును ఆయా పంచాయతీలు స్థానికంగానే సమకూర్చుకునే విధంగా చర్యలు చేపట్టనుంది. పనిలో పనిగా గ్రామాల్లో వసూలు చేసే పన్నులను సవరించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అంశంపై సర్కారు దృష్టి సారించనుంది. మరోవైపు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు దాతల నుంచి విరాళాలు సేకరించే యోచనలో ఉంది. స్మార్‌ట విలేజ్‌లుగా తీర్చిదిద్దేందుకు గ్రామాలను దత్తత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునివ్వగా, కలెక్టర్ కె భాస్కర్ పలు సమావేశాల్లో గ్రామాల దత్తత విషయంలో ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యం ఉండేలా చూడాలని, ఇదేమంత పెద్ద కష్టం కాదని అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. అయితే, దత్తతకు ఆశించిన స్పందన రావడం లేదు.
వీటిపైనే దృష్టి
పల్లెల్లోనూ పట్టణాలతో దీటుగా ప్రచార హోర్డింగ్‌లు ఏర్పాటవుతున్నాయి. భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు సైతం పెద్దఎత్తున సాగుతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా కేబుల్ టీవీ కనెక్షన్లు సైతం పెరిగాయి. వీటిపై దృష్టి సారించడం ద్వారా పంచాయతీల ఆదాయాలను భారీగా పెంచుకోవచ్చనే అభిప్రాయ అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. మైనర్, మేజర్ పంచాయతీల్లో ఈ తరహా పన్నులు విధించి సక్రమంగా వసూలు చేయగలిగితే ఆదాయం పెరుగుతుందంటున్నారు.
పల్లెల్లో ఖాళీస్థలాలపై పన్నులు విధించడం లేదని, ఆయా స్థలాల మార్కెట్ విలువపై 25 పైసల చొప్పున వార్షిక పన్ను విధిస్తే ఆదాయం పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఆక్రమణల పన్నులు, సంతలు, ఇతర ఆదాయాలపై దృష్టి సారించాలనే యోచన ఉంది. కుళాయి కనెక్షన్లు ఇబ్బడిముబ్బడిగా ఇస్తున్నా డిపాజిట్లు వసూలు కావడం లేదు. అక్రమంగా కుళాయి కనెక్షన్లు కూడా అధికంగానే ఉంటున్నాయనేది అధికారుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఆదాయ వనరులతోపాటు కొత్తగా ఏయే పన్నులు విధించవచ్చు, చార్జీలు రూపంలో వసూలు చేయడానికి అవకాశాలేమిటనే అంశాలపై సర్వే చేయించేందుకు రంగం సిద్ధమవుతోంది.