Major panchayat
-
ఫన్‌చాయతీ
కోడుమూరు: ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే పల్లెలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతాయనడంలో సందేహం లేదు. నాయకుల్లో స్వార్థం పెరిగిపోవడం.. అధికారులు చేయి తడిస్తే చాలనుకోవడం వల్ల గ్రామాల్లో దారిద్య్రం తాండవిస్తోంది. ఐదేళ్ల కాలంలో నాలుగు రాళ్లు వెనకేసుకుందామనుకునే ఆశ తప్పిస్తే.. అభివృద్ధిలో తమ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుదామనుకునే వాళ్లను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కోడుమూరు మండలంలోని పంచాయతీలకు వివిధ గ్రాంట్స్ రూపంలో దాదాపు రూ.6.50 కోట్లు మంజూరయ్యాయి. పంచాయతీ జనాభాను బట్టి రూ.10 లక్షల నుంచి రూ.45లక్షల వరకు కేటాయించారు. మేజర్ పంచాయతీలకు రూ.2కోట్లు విడుదలయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ నిధుల వినియోగం చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. ఉదాహరణకు మండల పరిధిలోని ప్యాలకుర్తి పంచాయతీని పరిశీలిస్తే.. గ్రామానికి రూ.42,09,597ల నిధులు మంజూరయ్యాయి. ఇక్కడ వీధి లైట్లు కూడా వెలగవు. కాల్వల్లో ఎక్కడికక్కడ సిల్టు పేరుకుపోయింది. ప్రజలు మురికినీటి కుంటల మధ్యే జీవనంసాగిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ ఎండిపోయాయి. రెండు ఓహెచ్‌ఆర్ ట్యాంకులు ఉన్నా.. మూడేళ్లుగా నీళ్లు ఎక్కంచని పరిస్థితి. 11 మినీ ట్యాంకుల్లో మూడు మాత్రమే పని చేస్తున్నాయి. 8వేల జనాభా కలిగిన ప్యాలకుర్తిలో అడుగడుగునా సమస్యలే. తాగునీటి ఇక్కట్లతో గ్రామస్తులు చుక్కలు చూస్తున్నారు. అయితే తాగునీటి సరఫరా, పైపులైన్ల నిర్వహణ, మోటార్ల మరమ్మతుకు రూ.8.34 లక్షలు ఖర్చు చేసినట్లు సర్పంచ్ లెక్కలు చూపారు. తాగునీటి కోసం ఒక్క ఏడాదిలో ఇన్ని లక్షలు ఖర్చు పెడితే ప్రజల గొంతు ఎందుకు ఎండుతుందో ఆ నేతకే ఎరుక. ఇదే కాదు.. పంచాయతీ భవన నిర్వహణకు రూ.8,750.. మురుగు కాల్వల శుభ్రానికి, చెత్త ఎత్తివేతకు రూ.6లక్షలు ఖర్చు చేశారట. ఇంకా ఈ పంచాయతీలో రూ.23.62 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ఆ మొత్తానికి ఎలాంటి లెక్కలు చూపుతారో వేచి చూడాలి. ఒక్క ప్యాలకుర్తిలోనే కాదు.. దాదాపు అన్ని పంచాయతీల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. సర్పంచ్‌లు నిధులను దుర్వినియోగం చేస్తుంటే.. అడ్డుకోవాల్సిన అధికారులు కమీషన్ల కక్కుర్తితో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అనుగొండ గ్రామ సర్పంచ్‌గా సుజాత ఎన్నికయ్యారు. ఈమె రాజకీయాలకు కొత్త కావడంతో ఓ వ్యక్తి షాడో సర్పంచ్‌గా చక్రం తిప్పుతున్నాడు. రికార్డులతో పాటు చెక్ బుక్కు కూడా తన వద్దే ఉంచుకున్నాడు. రూపాయి ఖర్చు చేయాలన్నా సర్పంచ్ కూడా ఆయన అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు మార్చి చివరిలోపు ఖర్చు చేయకపోతే మురిగిపోతాయి. ఈ నేపథ్యంలో చిల్లబండ, పులకుర్తి గ్రామ పంచాయతీల్లో పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసుకునేందుకు వెళ్లగా ట్రెజరీ అధికారులు నిలుపుదల చేశారు. గూడూరు మండలంలోని జూలకల్ గ్రామ సర్పంచ్ గెలుపునకు రూ.7లక్షలు ఖర్చు చేశానని చెప్పుకుంటున్న ఓ నేత సర్పంచ్‌పై పెత్తనం చెలాయిస్తూ నిధులను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. గతంలో సర్పంచ్ సొంత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయగా.. ఆ వ్యక్తి తన డబ్బు తిరిగిచ్చిన తర్వాతే అలా చేయాలని బెదిరించినట్లు చర్చ జరుగుతోంది. -
పల్లెల్నీ పిండేద్దాం
గ్రామాల్లో ఆదాయ వనరులపై సర్వేకు సర్కారు ఆదేశం అన్ని గ్రామాల్లో పన్నుల సవరణకు కసరత్తు ఏప్రిల్ 1 నాటికి కొలిక్కి వచ్చే అవకాశం ఏలూరు :పల్లె ప్రజలపైనా పన్నుల భారం పెంచేం దుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం గ్రామీణ ఆదాయ వనరులపై దృష్టి సారిస్తోంది. జిల్లాలోని 48 మండలాల్లో ఒక్కొక్క గ్రామంలో రెండునెలల క్రితమే ఆదాయ వనరులు ఏ మేరకు ఉన్నాయనే అంశంపై ప్రయోగాత్మకంగా సర్వే జరిపిం చింది. మిగిలిన 883 పంచాయతీల్లో పన్నుల పరిస్థితి ఏమిటి, ఇంకా ఏయే ఆదాయ వనరులు ఉన్నాయనే విషయాలపై సర్వే చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రతి ఊరిని స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన సర్కారు అందుకు అవసరమైన నిధులిచ్చేందుకు సిద్ధంగా లేదు. ఇందుకు అవసరమైన సొమ్మును ఆయా పంచాయతీలు స్థానికంగానే సమకూర్చుకునే విధంగా చర్యలు చేపట్టనుంది. పనిలో పనిగా గ్రామాల్లో వసూలు చేసే పన్నులను సవరించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అంశంపై సర్కారు దృష్టి సారించనుంది. మరోవైపు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు దాతల నుంచి విరాళాలు సేకరించే యోచనలో ఉంది. స్మార్ట విలేజ్‌లుగా తీర్చిదిద్దేందుకు గ్రామాలను దత్తత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునివ్వగా, కలెక్టర్ కె భాస్కర్ పలు సమావేశాల్లో గ్రామాల దత్తత విషయంలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం ఉండేలా చూడాలని, ఇదేమంత పెద్ద కష్టం కాదని అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. అయితే, దత్తతకు ఆశించిన స్పందన రావడం లేదు. వీటిపైనే దృష్టి పల్లెల్లోనూ పట్టణాలతో దీటుగా ప్రచార హోర్డింగ్‌లు ఏర్పాటవుతున్నాయి. భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు సైతం పెద్దఎత్తున సాగుతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా కేబుల్ టీవీ కనెక్షన్లు సైతం పెరిగాయి. వీటిపై దృష్టి సారించడం ద్వారా పంచాయతీల ఆదాయాలను భారీగా పెంచుకోవచ్చనే అభిప్రాయ అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. మైనర్, మేజర్ పంచాయతీల్లో ఈ తరహా పన్నులు విధించి సక్రమంగా వసూలు చేయగలిగితే ఆదాయం పెరుగుతుందంటున్నారు. పల్లెల్లో ఖాళీస్థలాలపై పన్నులు విధించడం లేదని, ఆయా స్థలాల మార్కెట్ విలువపై 25 పైసల చొప్పున వార్షిక పన్ను విధిస్తే ఆదాయం పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఆక్రమణల పన్నులు, సంతలు, ఇతర ఆదాయాలపై దృష్టి సారించాలనే యోచన ఉంది. కుళాయి కనెక్షన్లు ఇబ్బడిముబ్బడిగా ఇస్తున్నా డిపాజిట్లు వసూలు కావడం లేదు. అక్రమంగా కుళాయి కనెక్షన్లు కూడా అధికంగానే ఉంటున్నాయనేది అధికారుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఆదాయ వనరులతోపాటు కొత్తగా ఏయే పన్నులు విధించవచ్చు, చార్జీలు రూపంలో వసూలు చేయడానికి అవకాశాలేమిటనే అంశాలపై సర్వే చేయించేందుకు రంగం సిద్ధమవుతోంది. -
వెలుగుల వ్యయం.. ప్రగతికి ప్రతిబంధకం
అమలాపురం : మేజర్ పంచాయతీలకే కాదు.. మైనర్ పంచాయతీలకూ విద్యుత్ బకాయి లు అభివృద్ధికి ఆటంకంగా మారనున్నాయి. ప్రభుత్వం తనపై భారం తగ్గించుకునేందుకు మైనర్ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపునకు 13వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవాలని ఇటీవల చెప్పడంతో మూడేళ్లకు పైగా ఉన్న బకాయిల వసూలుకు విద్యుత్‌శాఖ సిద్ధమవుతోంది. జిల్లాలో 1,006 వరకు పంచాయతీలుండగా, విలీన మండలాల్లో మరో 60 వరకు ఉన్నాయి. వీటిలో 125కు పైగా మేజర్ పంచాయతీలు కాగా, 941 వరకు మైనర్ పంచాయతీలు. ఇప్పటి వరకు మేజర్ పంచాయతీలు సొంతంగానే విద్యుత్ బిల్లులు చెల్లించుకుంటుంటుండగా, మైనర్ పంచాయతీల బిల్లులు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తోంది. ఇందుకు అభ్యంతరం తెలిపిన అకౌంట్స్, ఆడిట్ జనరల్ మైనర్ పంచాయతీలు బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం నిధులు ఇచ్చి వాటితో కట్టించాలని సూచించింది. దీనిని సాకుగా చూపి పంచాయతీరాజ్ కమిషనర్ 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కనీసం 30 శాతం విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో విద్యుత్‌శాఖ మూడేళ్లుగా బకాయి పడ్డ సుమారు రూ.20 కోట్ల వసూలుకు సిద్ధమవుతోంది. మైనర్ పంచాయతీలు ఒక్కొక్కటీ రూ.లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల వరకు బకాయి పడ్డట్టు అంచనా. 13వ ఆర్థిక సంఘం నిధులు ఆయా పంచాయితీల్లో జనాభాను బట్టి రూ.50 వేల నుంచి రూ.ఐదు లక్షల వరకు వచ్చే అవకాశముంది. దీనిలో 30 శాతం విద్యుత్ బిల్లుగా చెల్లిస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేయలేమని ఆయా పంచాయతీల కార్యదర్శులు చెబుతున్నారు. నిధుల మళ్లింపు రివాజై పోతుంది.. ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల విషయంలో గట్టిగా ఉందని, ఎంత ఇబ్బంది అయినా పంచాయతీల నుంచి బకాయిలు వసూలు చేయాలని, నిర్దేశిత లక్ష్యాల ప్రకారం బిల్లులు వసూలు చేయకుంటే ఉద్యోగాలు కోల్పోతారని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. మేజర్ పంచాయతీలతో పోల్చుకుంటే మైనర్ పంచాయతీల్లో ఆదాయ వనరులు అంతంత మాత్రమే. చిన్న పనికైనా ప్రభుత్వ గ్రాంటులే దిక్కు. రహదారులు, డ్రైన్లు, తాగునీటి వసతికి నోచుకోని; కనీసం పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు లేని పంచాయతీలు ఉన్నాయి. ఇలాంటి పంచాయతీలకు వచ్చే కొద్దిపాటి గ్రాంటులో విద్యుత్ బిల్లులంటూ కోతలు పెట్టడం ప్రభుత్వానికి భావ్యం కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడిస్తున్న గ్రాంట్‌లో కేవలం 30 శాతం మాత్రమే బిల్లులు కట్టమంటున్నామని, మిగిలిన నిధులతో అభివృద్ధి చేసుకోవచ్చని ఉన్నతాధికారులంటున్నారు. 30 శాతం నిధులతో మొత్తం విద్యుత్ బకాయిలు తీరకపోయినా.. ఒకసారి విద్యుత్ బిల్లు కట్టడం మొదలు పెడితే మిగిలిన బకాయిలను సైతం ముందు ముందు వచ్చే గ్రాంట్ల నుంచే చెల్లించాల్సి వస్తోందని పాలకులు, సిబ్బంది వాపోతున్నారు. అసలే ఎన్నికలు ఆలస్యమై మూడేళ్లుగా గ్రాంట్లు లేక పడకేసిన పంచాయతీ పాలన గత ఏడాది నుంచే పట్టాలెక్కుతోంది. ఈ సమయంలో ప్రభుత్వ నిర్ణయాలతో పంచాయతీల అభివృద్ధి గాడి తప్పుతోందని తప్పు పడుతున్నారు. -
బిల్లు కట్టకపోతే.. కరెంటు కట్
* మేజర్ పంచాయతీల్లో పెరుగుతున్న మొండి బకాయిలు * సర్పంచ్‌లకు నోటీసులు ఇస్తున్న ఈపీడీసీఎల్ అధికారులు * తక్షణం చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక సాక్షి, రాజమండ్రి : జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో రూ.కోట్లలో పేరుకుపోతున్న మొండి బకాయిలను వసూలు చేసేందుకు ఈపీడీసీఎల్ సన్నద్ధమవుతోంది. నాలుగు రోజులుగా వివిధ మేజర్ పంచాయతీలకు నోటీసులు జారీ చేస్తూ, బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. జిల్లాలోని పంచాయతీల్లో రోజుకు సుమారు 10 లక్షల యూనిట్ల వరకూ చెల్లింపులు లేకుండా వినియోగిస్తున్నారు. నష్టాలను తగ్గించుకోవడంపై దృష్టి సారించిన ఈపీడీసీఎల్‌కు ఈ బకాయిలు గుదిబండలుగా మారుతున్నాయి. దీంతో ఎలాగైనా వీటిని రాబట్టేందుకు ఆ సంస్థ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. బకాయిల తీరిలా.. జిల్లాలో 1100 పైగా పంచాయతీలుండగా, వాటిల్లో సుమారు 1200 సర్వీసులున్నాయి. వీటిలో 120 వరకూ మేజర్ పంచాయతీల్లోనే ఉన్నాయి. మొత్తం జిల్లాలోని పంచాయతీల్లో వీధిదీపాలు, మంచి నీటి పథకాలకు వినియోగించే విద్యుత్తు బిల్లు నెలకు సుమారు రూ.2 కోట్లు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా మైనర్ పంచాయతీలు బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తున్నాయి. 2009 నుంచి మొత్తం పంచాయతీల నుంచి వీధిలైట్లు, మంచి నీటి పథకాలకు కలిపి ఇప్పటివరకూ సుమారు రూ.70 కోట్లు పైగా విద్యుత్తు శాఖకు రావాల్సి ఉంది. వీటిలో మేజర్ పంచాయతీల వాటా రూ.12 కోట్లు పైమాటేనని అధికారులు చెబుతున్నారు. ఒక్క అమలాపురం డివిజన్‌లోనే మేజర్ పంచాయతీల విద్యుత్ బకాయిలు సుమారు రూ.6 కోట్లు ఉండడంతో, వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కోనసీమలోని పంచాయతీల సర్పంచ్‌లకు ఆయా ప్రాంతాల రెవిన్యూ విభాగం అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. బకాయిలు చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామని అందులో స్పష్టం చేస్తున్నారు. -
సెస్సు.. లెస్సు!
బి.కొత్తకోట: జిల్లాలో సెస్సు సొమ్ము గ్రంథాలయ సంస్థకు చేరడం లేదు. స్థానిక సంస్థలు రూ.3.50 కోట్ల వరకు బకాయిపడ్డాయి. ఇందులో చిత్తూరు మున్సిపాలిటీ అత్యధికంగా రూ.1.19 కోట్లు చెల్లించాలి. వసూలు కాకపోవడంతో అధికారులు ఆయా సంస్థలు, మున్సిపాలిటీలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో 1,363 మైనర్, మేజర్ పంచాయతీలు, ఆరు మున్సి పాలిటీలు, రెండు కార్పొరేషన్లున్నాయి. ఇందులో మొత్తం 71 గ్రంథాలయాలు నడుస్తున్నాయి. వీటిలో 12 గ్రంథాలయాలు మున్సిపాలిటీల్లో ఉండగా, మిగిలినవి మండల కేంద్రాల్లో ఉన్నాయి. 7 మండలాల్లో గ్రంథాయాలులేవు. పంచాయతీలు 2007-08 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు సెస్సు రూపంలో కోట్ల సొమ్ము బకాయిపడ్డాయి. స్థానిక సంస్థలు ఇంటి పన్ను, కొళాయి పన్నులతో వసూలయ్యే సొమ్ములో 8 శాతం నిధులు గ్రంథాలయ సంస్థకు చెల్లించాలి. ఇది ఏ ఏడాదికి ఆ ఏడాది చెల్లింపులు చేయడంలేదు. దీంతో బకాయిలు పేరుకుపోయాయి. గ్రంథాలయ సంస్థ అధికారుల సమాచారం మేరకు పంచాయతీల నుంచి రూ.1.22 కోట్ల సెస్సు అందాల్సి ఉంది. ఇది గతంలోనిది. ఈ ఆర్థిక సంవత్సరంలో పంచాయతీల పన్నుల డిమాండ్ రూ.17,07,80, 000. ఇందులో 8 శాతం సెస్సుగా రూ.1.36 కోట్లు చెల్లించాలి. పన్నులు ప్రస్తుతానికి రూ.8,94,23,000 వసూలు చేశారు. ఇందులో సెస్సుగా రూ.72 లక్షలు చెల్లించాలి. గత ఆర్థిక సంవత్సరాల్లో వసూలుచేసిన పన్నుల్లో 8 శాతం చెల్లింపు విషయంలో పంచాయతీ కార్యదర్శుల నుంచి స్పందన లేకపోవడంతో నోటీసులు జారీ చేస్తున్నారు. వసూలైన సొమ్ములో సెస్సును చెల్లించాలని కోరుతున్నారు. పంచాయతీల పరిస్థితి ఇలావుంటే మున్సిపాలిటీలు దీనికి మరింత భిన్నంగా ఉన్నాయి. చిత్తూరు, పుత్తూరు, నగిరి, మదనపల్లె మున్సిపాలిటీలు రూ.2.04 కోట్లు చెల్లించాలి. ఇందులో చి త్తూరు మున్సిపాలిటీ రూ.1.19 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తం సొమ్ము వసూలుగాక గ్రంథాలయ సంస్థ అధికారులు తంటాలు పడుతున్నారు. సెస్సుతో ఏం చేస్తారంటే సెస్సు సొమ్ముతో గ్రంథాలయాలకు వసతులు సమకూర్చాలి. పాఠకులకు పుస్తకాలు, దినపత్రికలు ఇలా అవసరమైన వాటిని ఏర్పాటు చేయాలి. భవనాలకు అద్దె, కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలి. అయితే నిధుల కొరత కారణంగా ఉద్యోగులకు వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారు. నోటీసులిస్తున్నాం సంస్థకు రావాల్సిన సెస్సు కోసం పంచాయతీలకు నోటీసులిస్తున్నాం. ఇప్పటికే పలుమార్లు అధికారులను కలిసి విన్నవించాం. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యదర్శులు తమకు సంబంధంలేదని అంటున్నారు. కోట్లలో పేరుకుపోయిన బకాయిలు అందితే గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయి. -పీ.రమ, జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి, చిత్తూరు సగం ఇచ్చాం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.8.94 కోట్ల పన్నులు వసూలయ్యాయి. ఇందులో 8 శాతం గా చెల్లించాల్సిన రూ.72 లక్షల్లో రూ.35 లక్షలు చెల్లించాం. పాత బకాయిలు రూ.90 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. దీనిపైనా చర్యలు తీసుకొంటాం. -ప్రభాకర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి -
పన్ను లక్ష్యం.. రూ.100 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నగర శివార్లు, మేజర్ పంచాయతీలకే పరిమితమైన ఆస్తి పన్నును మారు మూల పల్లెల్లో కూడా అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధుల్లేమి ప్రధాన కారణమవుతున్న నేపథ్యంలో ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని భావిం చింది. ఇందులో భాగంగా పన్నులను రాబట్టేదిశగా కార్యాచరణ రూపొందిం చింది. ఈ క్రమంలోనే జిల్లా చరిత్రలో ఇప్పటివరకు ఆస్తిపన్ను వైపు కన్నెత్తి చూడని గ్రామాల్లో కూడా పన్ను వడ్డనకు సమాయత్తమైంది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. నామినేషన్లు దాఖలుచేసే అభ్యర్థులు మాత్రమే పన్ను చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకున్న పాలకులు ఆస్తిపన్ను రాబట్టేందుకు సాహసించలేదు. నిధుల కొరత పీడిస్తుండడం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కష్టంగా మారడంతో జిల్లా పంచాయతీ అధికారులు పన్నుల వడ్డనే శరణ్యమని భావించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పన్నుల మదింపుపై దృష్టి సారించారు. టార్గెట్ పెద్ద మొత్తమే! నగరీకరణతో శివారు పంచాయతీల్లో ఇబ్బడిముబ్బడిగా నిర్మాణాలు వెలిశాయి. బహుళ అంతస్తు భవనాలు పుట్టగొడుగులా పుట్టకొచ్చాయి. వీటిలో చాలా భవనాలు అండర్ అసెస్, అన్ అసెస్లో ఉండడంతో వీటన్నింటిపై తాజాగా జిల్లా యంత్రాంగం కన్నేసింది. ముఖ్యంగా మణికొండ, బాచుపల్లి, నిజాంపేట్, ఫీర్జాదిగూడ, చంగిచర్ల, బండ్లగూడ, శంషాబాద్, పర్వతాపూర్ తదితర గ్రామాలు భారీ జనావాసాలతో మోస్తరు మున్సిపాలిటీగా రూపాంతరం చెందాయి. ఈ పంచాయతీల్లో పన్నులను సక్రమంగా వసూలు చేస్తే అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడే అవకాశమేలేదని అధికారులు చెబుతున్నారు. శివారు పంచాయతీలేకాకుండా ప్రతి పల్లెలోనూ పన్ను చెల్లించే విధానాన్ని అలవాటు చేయడం ద్వారా భవిష్యత్తులో నిధుల సమస్య ఉత్పన్నంకాదని భావిస్తున్నారు. ఆస్తి పన్నుసహా నల్లా, ట్రేడ్ లెసైన్సుల ఫీజులను వసూలు చేయడం ద్వారా సుమారు రూ.100 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీపీఓ పద్మజారాణి ‘సాక్షి’కి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుల రూపేణా రూ.18 కోట్లు మాత్రమే రాబట్టామని, వికారాబాద్ డివిజన్లో ఆస్తి పన్ను లెక్కించడంతో అదనంగా మరో రూ.12 కోట్లు పన్ను పరిధిలోకి వచ్చినట్లు తెలిపారు. మిగతా డివిజన్లలో కూడా పన్ను మదింపు ప్రక్రియ చకచకా సాగుతోందని, ఈ నెలాఖరులోపు దీన్ని పూర్తి చేస్తామని, వచ్చే నెల నుంచి కొత్త పన్నుల వసూలును ప్రారంభిస్తామని చెప్పారు. కేవలం కొత్తగా పన్నులేకాదు.. పాత బకాయిలను కూడా రాబట్టాలని భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పంచాయతీల్లో పన్ను మోతకు రంగం సిద్ధమైంది. ఆస్తి పన్ను వడ్డించేందుకు పంచాయతీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కేవలం ఇంటిపన్నులేకాకుండా నల్లా, ట్రేడ్ లెసైన్సులను కూడా క్రమబద్ధీకరించే దిశగా కార్యాచరణ రూపొందించింది. ఇప్పటివరకు పన్ను పరిధిలోకి రాని ఆస్తులను మదింపు చేస్తున్న యంత్రాంగం.. వచ్చే నెల నుంచి పన్నుల మోత మోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వికారాబాద్ డివిజన్లో ఇప్పటికే టాక్సులను నిర్ధారించిన అధికారులు డిమాండ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నెలాఖరులోపు మిగతా డివిజన్లలో కూడా ఆస్తి, ఇతర పన్నుల గణన ను పూర్తి చేయాలని నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో పన్నుల వసూళ్లను నవంబర్ నుంచి చేపట్టేలా ప్రణాళిక తయారుచేసిన పంచాయతీ అధికారులు.. పన్నుల రూపేణా రూ.100 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి -
ఆదర్శానికి అడ్డంకులు!
- ‘మేజర్ పంచాయతీ’ నిర్ణయాలతో ఇరకాటం - ఇష్టానుసారంగా రోడ్ల కుదింపు - ఇళ్ల నిర్మాణాల అనుమతుల్లోనూ ఇదే దుస్థితి - గజ్వేల్ నగర పంచాయతీ అభివృద్ధికి కొత్త సవాళ్లు గజ్వేల్: మేజర్ పంచాయతీ ఉన్న సమయంలో చోటుచేసుకున్న అక్రమాలు.. ప్రస్తుత నగర పంచాయతీకి గుదిబండగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సదాశయానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా భవిష్యత్తు అవసరాలను పట్టించుకోకుండా తీర్మానాలు చేయడం.. రోడ్లను కుదించడం, నిబంధనలు లేకుండా సాగిన ఇళ్ల నిర్మాణాలు పట్టకపోవడం, అంతర్గత రోడ్లు సైతం కుంచించుకుపోతున్నా కన్నెత్తి చూడకపోవడం వంటి అంశాలు.. ప్రస్తుత నగర పంచాయతీకి కొత్త సవాళ్లను తెచ్చిపెడుతున్నాయి. కొత్త పాలకవర్గం చర్యలకు ఉపక్రమిస్తేనే దిద్దుబాటుకు అవకాశం కలగనుంది. గజ్వేల్ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తోంది. భవిష్యత్తు అవసరాలకనుగుణంగా సౌకర్యాల కల్పనలో దశాబ్దాలుగా అధికార యుంత్రాంగం, ప్రజాప్రతినిధులు విఫలవువుతూ వచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నగర పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు మొదలయ్యాయి. నగర పంచాయతీ పరిధిలోని గజ్వేల్‌తోపాటు ప్రజ్ఞాపూర్, క్యాసారం, ముట్రాజ్‌పల్లి గ్రామాల ప్రగతికి సీఎం వద్దకు రూ.423 కోట్ల ప్రతిపాదనలు వెళ్లిన సంగతి తెల్సిందే. ఇలాంటి నగర పంచాయతీని అందమైన పట్టణంగా తీర్చిదిద్దే యత్నాల్లో భాగంగా.. మొదటగా రోడ్లను విస్తరించాలని కొత్త పాలకవర్గం భావిస్తోంది. కానీ ఈ వ్యవహారంపై తెరపైకి రాగానే కొత్త సవాళ్లు ముందుకువచ్చాయి. గతంలో బైపాస్ రహదారులను కుదించడం కొత్తగా ఆవిర్భవించిన నగరపంచాయతీకి శాపంగా మారింది. ముఖ్యంగా గతంలో పంచాయతీ పాలకవర్గం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు గుదిబండగా మారాయి. పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు ఉదంతమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. గత పాలకవర్గం 80 ఫీట్ల రోడ్డును 60కి కుదించి నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై తీర్మానం చేయడం ద్వారా అక్రమానికి రాజముద్ర వేశారనే చెప్పాలి. దీని ద్వారా ఈ రహదారి పక్కన కిలోమీటర్ మేర నిర్మాణాలు జరిగాయి. సుమారుగా 20 గజాల అత్యంత విలువైన స్థలం కలిసొచ్చేలా నిర్ణయం తీసుకున్నందుకు భారీగా ముడుపులు అందాయని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతర్గత రోడ్ల పరిస్థితి కూడా అంతే... అంతర్గత రోడ్ల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా కొత్త కాలనీలు నిర్మాణం చేపడితే అంతర్గత రోడ్ల కోసం తప్పనిసరిగా 30నుంచి 33 ఫీట్ల స్థలం వదిలివేయూల్సి వుంది. గతంలో నిర్మాణమై వున్న కాలనీల్లో కనీసం 21 ఫీట్ల వెడల్పు ఉండాలి. పట్టణంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా వుంది. కొత్తగా నిర్మించిన కాలనీల్లోనూ, గతంలో నిర్మాణమైన కాలనీల్లోనూ ఎక్కడా కూడా టౌన్‌ప్లానింగ్ అవులుకాలేదు. ఫలితంగా ఎక్కడ చూసినా ఇరుకైన రోడ్లే దర్శనమిస్తున్నాయి. వురికొన్నిచోట్ల కాలనీలు ఎగుడుదిగుడుగా ఉండటం సవుస్యలను సృష్టిస్తోంది.మరోవైపు మేజర్ పంచాయతీ పాలకవర్గం తీరు వల్ల నిబంధనలతో ప్రమేయం లేకుండా నిర్మాణాలు సాగుతూ వస్తున్నాయి. అదే పరంపర నేడు నగర పంచాయతీలోనూ కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. -
చీకట్లో కోడుమూరు
- కరెంట్ బకాయి చెల్లించలేదని పట్టణానికి విద్యుత్ సరఫరా నిలిపివేత - అప్పుల్లో మేజర్ పంచాయతీ - జీతాలు చెల్లించలేని దుస్థితి - భారమైన నిర్వహణ కోడుమూరు: పట్టణంలో వీధిలైట్లు వెలగక ప్రజలు చీకట్లో మగ్గిపోతున్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించలేదని ఈ నెల 23న ట్రాక్స్‌కో అధికారులు పంచాయతీ కార్యాలయానికి, వీధిలైట్లకు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. దీంతో రెండు రోజులుగా కోడుమూరు పట్టణం చీకటిమయమైంది. రాత్రి గాడాంధకారంలో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం సర్పంచ్ సిబి.లత ట్రాక్స్‌కో ఎస్ఈని సంప్రదించినప్పటికి ఫలితం లేకపోయింది. బకాయి పడ్డ రూ.80 లక్షలు చెల్లిస్తేగానీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించమని అధికారులు తేల్చి చెప్పారు. పంచాయతీ పరిధిలో ఐదేళ్లుగా విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ మొత్తానికి నెలనెలా ట్రాక్‌కో అధికారులు వడ్డీ వేస్తున్నారు. పంచాయతీకి వివిధ పన్నుల రూపంలో ఏటా రూ.60 లక్షలు ఆదాయం లభిస్తోంది. ట్రాక్టర్ నిర్వహణ, శానిటేషన్ సిబ్బంది, వాటర్ వర్కర్లు, వీధిలైట్లు వేసే సిబ్బంది జీతాలు ఏడాదికి రూ.28 లక్షలు అవసరమవుతోంది. విద్యుత్ బిల్లు నెలకు రూ.4.5 లక్షల ప్రకారం సంవత్సరానికి రూ.54 లక్షలు విద్యుత్ చార్జీలే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఏటా జీతాలు, విద్యుత్ బిల్లుల కోసం రూ.82 లక్షలు ఖర్చవుతోంది. ఆదాయం రూ.60 లక్షలు కాగా ఇంకా దాదాపు రూ.22 లక్షలు ప్రతి ఏటా పంచాయతీకి లోటు బడ్జెట్ ఏర్పడుతోంది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని బకాయి ఉన్న రూ.80 లక్షలు మాఫీ చేస్తే తప్పా కోడుమూరు గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు జరుగవని సర్పంచ్ సిబి.లత కోరారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తాగునీటికి సమస్య తలెత్తింది. -
గ్రామాలే టార్గెట్
సాక్షి, ఖమ్మం: ఎన్నికల ప్రచారం పల్లెబాట పట్టింది. ప్రచారానికి ఇక ఏడు రోజులే మిగిలి ఉండడంతో అభ్యర్థులంతా గ్రామాలపై కన్నేశారు. పోటాపోటీగా ప్రచారం హోరెత్తిస్తుండడంతో పాటు ఎవరికివారు తమదైన శైలిలో.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే గ్రామాలు ఇప్పుడు అభ్యర్థులకు కీలకమయ్యాయి. అభ్యర్థులు పగలు బహిరంగంగా, రాత్రి తెరచాటు ప్రచారంతో ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ద్వితీయ శ్రేణి నేతలకు తాయిలాలు ప్రకటించడంతో వారంతా ఊత్సాహంతో పల్లెరాజ‘కీ’యంలో సమీకరణలను మార్చుతున్నారు. అంతేకాకుండా అభ్యర్థులు పల్లె ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల అగ్రనేతలను ప్రచారానికి రప్పిస్తున్నారు. జిల్లాలోని మేజర్ పంచాయతీలపైనే అన్ని పార్టీలు దృష్టి పెట్టి.. ప్రచారాన్ని విసృ్తతం చేస్తున్నాయి. ఈ వారం రోజులు తమ భవిష్యత్తును నిర్ణయించే ముఖ్య ఘట్టాలుగా భావిస్తున్న అభ్యర్థులు.. అగ్రనేతలతో పల్లె ప్రచారంతో కదం తొక్కుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల జిల్లాలో వైఎస్సార్సీపీ, సీపీఎం అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా వైఎస్సార్సీపీ, సీపీఎం అభ్యర్థుల విజయం కోసం జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థులు తమ అధినేత కేసీఆర్‌ను సభలకు రప్పించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంకా టీడీపీ తరఫున ప్రత్యేకంగా అగ్రనేతలు రాలేదు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నామా నాగేశ్వరారవు ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో టీడీపీ బరిలో ఉన్న అభ్యర్థులు ఎక్కడి వారు అక్కడ ప్రచారం చేస్తున్నా.. ఇతర నియోజకవర్గాల్లోకి మాత్రం వారు అడుగు పెట్టడం లేదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాత్రం తాను పోటీ చేస్తున్న ఖమ్మం పార్లమెంట్ పరిధిలోనే ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన పలు గ్రామాలు తిరిగి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. ఆ పార్టీ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి రావాలని కోరుతున్నా ఆయన బిజీగా ఉన్నానని అంటున్నట్లు సమాచారం. హామీలే హామీలు.. గత ఎన్నికల్లో ఇది చేస్తాం.. అది చేస్తాం.. అని హామీలిచ్చిన నేతలు మళ్లీ అవే హామీలను వల్లేవేస్తుండడం గమనార్హం. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా మళ్లీ ప్రజల వద్దకు వెళ్తుండడంతో.. ఆయా అభ్యర్థులకు ప్రజల నుంచి గత హామీలు ఏమయ్యాయని నిలదీతలు, నిరసనలు ఎదురవుతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు తీర్చలేని హామీలు ఇస్తుండడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. అధికారంలో ఉండి ఏం చేశారని కాంగ్రెస్ అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. ‘నన్ను గెలిపిస్తే మీ గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా’ అని ఏ గ్రామానికి వెళ్లినా హామీల వర్షం గుప్పిస్తున్న నేతలపై.. గతంలో హామీలిచ్చి, అవి తీర్చలేదని ప్రజలు మండిపడుతున్నారు. నజరానాలకు ఏర్పాట్లు.. పల్లె ఓటర్లను దృష్టిలో పెట్టుకొని అధికార, ప్రతిపక్ష పార్టీలు నజరానాలు ప్రకటించే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గాల పరిధిలోని పట్టణాల్లో తమ ప్రచార సరళితో ఓటర్లు ఎటు వైపు ఉన్నారో తేలిపోవడంతో.. ఇక అభ్యర్థులంతా పల్లె ఓటర్ల నాడి పట్టుకునే ప్రయత్నాల్లో మునిగారు. గ్రామాల్లో ఒక పార్టీలో ఉన్న నేతలకు మరో పార్టీ వారు గుట్టుచప్పుడు కాకుండా ఎరవేస్తూ తమ నజరానాలకు అంగీకరిస్తే, గెలిచిన తర్వాత ‘నీ భవిష్యత్ బంగారుమయం చేస్తా’మని నమ్మబలుకుతుండడంతో గ్రామాల్లో రాజకీయం రసకందాయంగా మారింది. తమ ప్రచారం, అగ్రనేతల ప్రచారం ఎలా ఉన్నా.. ప్రధానంగా పోలింగ్‌కు రెండు రోజుల ముందే పల్లె రాజకీయం చక్రం తిప్పే యోచనలో అభ్యర్థులున్నారు. ఇప్పటికే పోటీ చేసి, ఓటమి చెందిన అభ్యర్థులు మాత్రం గతంలో పల్లెల్లో తాము ఎక్కడ దెబ్బతిన్నామో ఆ మూలాలు వెతికి.. ఆయా గ్రామాల్లో భారీ నజరానాలు ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదు. ఇలా అంతుపట్టని పల్లె ఓటర్ల నాడితో అభ్యర్థులు హైరానా పడుతున్నారు.