* మేజర్ పంచాయతీల్లో పెరుగుతున్న మొండి బకాయిలు
* సర్పంచ్‌లకు నోటీసులు ఇస్తున్న ఈపీడీసీఎల్ అధికారులు
* తక్షణం చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక
సాక్షి, రాజమండ్రి : జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో రూ.కోట్లలో పేరుకుపోతున్న మొండి బకాయిలను వసూలు చేసేందుకు ఈపీడీసీఎల్ సన్నద్ధమవుతోంది. నాలుగు రోజులుగా వివిధ మేజర్ పంచాయతీలకు నోటీసులు జారీ చేస్తూ, బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. జిల్లాలోని పంచాయతీల్లో రోజుకు సుమారు 10 లక్షల యూనిట్ల వరకూ చెల్లింపులు లేకుండా వినియోగిస్తున్నారు. నష్టాలను తగ్గించుకోవడంపై దృష్టి సారించిన ఈపీడీసీఎల్‌కు ఈ బకాయిలు గుదిబండలుగా మారుతున్నాయి. దీంతో ఎలాగైనా వీటిని రాబట్టేందుకు ఆ సంస్థ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.
బకాయిల తీరిలా..
జిల్లాలో 1100 పైగా పంచాయతీలుండగా, వాటిల్లో సుమారు 1200 సర్వీసులున్నాయి. వీటిలో 120 వరకూ మేజర్ పంచాయతీల్లోనే ఉన్నాయి. మొత్తం జిల్లాలోని పంచాయతీల్లో వీధిదీపాలు, మంచి నీటి పథకాలకు వినియోగించే విద్యుత్తు బిల్లు నెలకు సుమారు రూ.2 కోట్లు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా మైనర్ పంచాయతీలు బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తున్నాయి. 2009 నుంచి మొత్తం పంచాయతీల నుంచి వీధిలైట్లు, మంచి నీటి పథకాలకు కలిపి ఇప్పటివరకూ సుమారు రూ.70 కోట్లు పైగా విద్యుత్తు శాఖకు రావాల్సి ఉంది.
వీటిలో మేజర్ పంచాయతీల వాటా రూ.12 కోట్లు పైమాటేనని అధికారులు చెబుతున్నారు. ఒక్క అమలాపురం డివిజన్‌లోనే మేజర్ పంచాయతీల విద్యుత్ బకాయిలు సుమారు రూ.6 కోట్లు ఉండడంతో, వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కోనసీమలోని పంచాయతీల సర్పంచ్‌లకు ఆయా ప్రాంతాల రెవిన్యూ విభాగం అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. బకాయిలు చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామని అందులో స్పష్టం చేస్తున్నారు.
బిల్లు కట్టకపోతే.. కరెంటు కట్
Published Wed, Nov 12 2014 2:11 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement