పన్ను లక్ష్యం.. రూ.100 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నగర శివార్లు, మేజర్ పంచాయతీలకే పరిమితమైన ఆస్తి పన్నును మారు మూల పల్లెల్లో కూడా అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధుల్లేమి ప్రధాన కారణమవుతున్న నేపథ్యంలో ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని భావిం చింది. ఇందులో భాగంగా పన్నులను రాబట్టేదిశగా కార్యాచరణ రూపొందిం చింది.
ఈ క్రమంలోనే జిల్లా చరిత్రలో ఇప్పటివరకు ఆస్తిపన్ను వైపు కన్నెత్తి చూడని గ్రామాల్లో కూడా పన్ను వడ్డనకు సమాయత్తమైంది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. నామినేషన్లు దాఖలుచేసే అభ్యర్థులు మాత్రమే పన్ను చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకున్న పాలకులు ఆస్తిపన్ను రాబట్టేందుకు సాహసించలేదు. నిధుల కొరత పీడిస్తుండడం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కష్టంగా మారడంతో జిల్లా పంచాయతీ అధికారులు పన్నుల వడ్డనే శరణ్యమని భావించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పన్నుల మదింపుపై దృష్టి సారించారు.
టార్గెట్ పెద్ద మొత్తమే!
నగరీకరణతో శివారు పంచాయతీల్లో ఇబ్బడిముబ్బడిగా నిర్మాణాలు వెలిశాయి. బహుళ అంతస్తు భవనాలు పుట్టగొడుగులా పుట్టకొచ్చాయి. వీటిలో చాలా భవనాలు అండర్ అసెస్, అన్ అసెస్‌లో ఉండడంతో వీటన్నింటిపై తాజాగా జిల్లా యంత్రాంగం కన్నేసింది. ముఖ్యంగా మణికొండ, బాచుపల్లి, నిజాంపేట్, ఫీర్జాదిగూడ, చంగిచర్ల, బండ్లగూడ, శంషాబాద్, పర్వతాపూర్ తదితర గ్రామాలు భారీ జనావాసాలతో మోస్తరు మున్సిపాలిటీగా రూపాంతరం చెందాయి. ఈ పంచాయతీల్లో పన్నులను సక్రమంగా వసూలు చేస్తే అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడే అవకాశమేలేదని అధికారులు చెబుతున్నారు.
శివారు పంచాయతీలేకాకుండా ప్రతి పల్లెలోనూ పన్ను చెల్లించే విధానాన్ని అలవాటు చేయడం ద్వారా భవిష్యత్తులో నిధుల సమస్య ఉత్పన్నంకాదని భావిస్తున్నారు. ఆస్తి పన్నుసహా నల్లా, ట్రేడ్ లెసైన్సుల ఫీజులను వసూలు చేయడం ద్వారా సుమారు రూ.100 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీపీఓ పద్మజారాణి ‘సాక్షి’కి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుల రూపేణా రూ.18 కోట్లు మాత్రమే రాబట్టామని, వికారాబాద్ డివిజన్‌లో ఆస్తి పన్ను లెక్కించడంతో అదనంగా మరో రూ.12 కోట్లు పన్ను పరిధిలోకి వచ్చినట్లు తెలిపారు. మిగతా డివిజన్లలో కూడా పన్ను మదింపు ప్రక్రియ చకచకా సాగుతోందని, ఈ నెలాఖరులోపు దీన్ని పూర్తి చేస్తామని, వచ్చే నెల నుంచి కొత్త పన్నుల వసూలును ప్రారంభిస్తామని చెప్పారు. కేవలం కొత్తగా పన్నులేకాదు.. పాత బకాయిలను కూడా రాబట్టాలని భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
పంచాయతీల్లో పన్ను మోతకు రంగం సిద్ధమైంది. ఆస్తి పన్ను వడ్డించేందుకు పంచాయతీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కేవలం ఇంటిపన్నులేకాకుండా నల్లా, ట్రేడ్ లెసైన్సులను కూడా క్రమబద్ధీకరించే దిశగా కార్యాచరణ రూపొందించింది. ఇప్పటివరకు పన్ను పరిధిలోకి రాని ఆస్తులను మదింపు చేస్తున్న యంత్రాంగం.. వచ్చే నెల నుంచి పన్నుల మోత మోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వికారాబాద్ డివిజన్‌లో ఇప్పటికే టాక్సులను నిర్ధారించిన అధికారులు డిమాండ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నెలాఖరులోపు మిగతా డివిజన్లలో కూడా ఆస్తి, ఇతర పన్నుల గణన ను పూర్తి చేయాలని నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో పన్నుల వసూళ్లను నవంబర్ నుంచి చేపట్టేలా ప్రణాళిక తయారుచేసిన పంచాయతీ అధికారులు.. పన్నుల రూపేణా రూ.100 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి