ఫన్‌చాయతీ | Major panchayats released Rs 2 crore | Sakshi
Sakshi News home page

ఫన్‌చాయతీ

Published Fri, Jul 31 2015 4:05 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

Major panchayats released Rs 2 crore

 కోడుమూరు: ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే పల్లెలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతాయనడంలో సందేహం లేదు. నాయకుల్లో స్వార్థం పెరిగిపోవడం.. అధికారులు చేయి తడిస్తే చాలనుకోవడం వల్ల గ్రామాల్లో దారిద్య్రం తాండవిస్తోంది. ఐదేళ్ల కాలంలో నాలుగు రాళ్లు వెనకేసుకుందామనుకునే ఆశ తప్పిస్తే.. అభివృద్ధిలో తమ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుదామనుకునే వాళ్లను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కోడుమూరు మండలంలోని పంచాయతీలకు వివిధ గ్రాంట్స్ రూపంలో దాదాపు రూ.6.50 కోట్లు మంజూరయ్యాయి. పంచాయతీ జనాభాను బట్టి రూ.10 లక్షల నుంచి రూ.45లక్షల వరకు కేటాయించారు. మేజర్ పంచాయతీలకు రూ.2కోట్లు విడుదలయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ నిధుల వినియోగం చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. ఉదాహరణకు మండల పరిధిలోని ప్యాలకుర్తి పంచాయతీని పరిశీలిస్తే.. గ్రామానికి రూ.42,09,597ల నిధులు మంజూరయ్యాయి. ఇక్కడ వీధి లైట్లు కూడా వెలగవు. కాల్వల్లో ఎక్కడికక్కడ సిల్టు పేరుకుపోయింది. ప్రజలు మురికినీటి కుంటల మధ్యే జీవనంసాగిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ ఎండిపోయాయి.
 
  రెండు ఓహెచ్‌ఆర్ ట్యాంకులు ఉన్నా.. మూడేళ్లుగా నీళ్లు ఎక్కంచని పరిస్థితి. 11 మినీ ట్యాంకుల్లో మూడు మాత్రమే పని చేస్తున్నాయి. 8వేల జనాభా కలిగిన ప్యాలకుర్తిలో అడుగడుగునా సమస్యలే. తాగునీటి ఇక్కట్లతో గ్రామస్తులు చుక్కలు చూస్తున్నారు. అయితే తాగునీటి సరఫరా, పైపులైన్ల నిర్వహణ, మోటార్ల మరమ్మతుకు రూ.8.34 లక్షలు ఖర్చు చేసినట్లు సర్పంచ్ లెక్కలు చూపారు. తాగునీటి కోసం ఒక్క ఏడాదిలో ఇన్ని లక్షలు ఖర్చు పెడితే ప్రజల గొంతు ఎందుకు ఎండుతుందో ఆ నేతకే ఎరుక. ఇదే కాదు.. పంచాయతీ భవన నిర్వహణకు రూ.8,750.. మురుగు కాల్వల శుభ్రానికి, చెత్త ఎత్తివేతకు రూ.6లక్షలు ఖర్చు చేశారట. ఇంకా ఈ పంచాయతీలో రూ.23.62 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ఆ మొత్తానికి ఎలాంటి లెక్కలు చూపుతారో వేచి చూడాలి. ఒక్క ప్యాలకుర్తిలోనే కాదు.. దాదాపు అన్ని పంచాయతీల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. సర్పంచ్‌లు నిధులను దుర్వినియోగం చేస్తుంటే.. అడ్డుకోవాల్సిన అధికారులు కమీషన్ల కక్కుర్తితో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.
 
 అనుగొండ గ్రామ సర్పంచ్‌గా సుజాత ఎన్నికయ్యారు. ఈమె రాజకీయాలకు కొత్త కావడంతో ఓ వ్యక్తి షాడో సర్పంచ్‌గా చక్రం తిప్పుతున్నాడు. రికార్డులతో పాటు చెక్ బుక్కు కూడా తన వద్దే ఉంచుకున్నాడు. రూపాయి ఖర్చు చేయాలన్నా సర్పంచ్ కూడా ఆయన అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు మార్చి చివరిలోపు ఖర్చు చేయకపోతే మురిగిపోతాయి. ఈ నేపథ్యంలో చిల్లబండ, పులకుర్తి గ్రామ పంచాయతీల్లో పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసుకునేందుకు వెళ్లగా ట్రెజరీ అధికారులు నిలుపుదల చేశారు.
 
 గూడూరు మండలంలోని జూలకల్ గ్రామ సర్పంచ్ గెలుపునకు రూ.7లక్షలు ఖర్చు చేశానని చెప్పుకుంటున్న ఓ నేత సర్పంచ్‌పై పెత్తనం చెలాయిస్తూ నిధులను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. గతంలో సర్పంచ్ సొంత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయగా.. ఆ వ్యక్తి తన డబ్బు తిరిగిచ్చిన తర్వాతే అలా చేయాలని బెదిరించినట్లు చర్చ జరుగుతోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement