OHR Tanks
-
కూలేందుకు సిద్ధంగా ఓహెచ్‌ఆర్ ట్యాంకు
సాక్షి, దొనకొండ: మండలంలోని ఇండ్లచెరువు గ్రామం ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఇళ్ల మధ్యలో మంచినీటి కోసం నిర్మించిన ఓహెచ్‌ఆర్ ట్యాంకు కూలేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉంది. సుమారు 34 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఓహెచ్‌ఆర్ ట్యాంకుకు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. నిత్యం విద్యార్థులు ట్యాంకు కింద ఆటలాడుకుంటుంటారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ట్యాంక్ పెచ్చులూడి దాని పక్కన గల ఇంట్లోని మహిళ తలపై పడి తీవ్రగాయాలయ్యాయి. తరచూ పెచ్చులూడటం, సిమెంట్ రాలుతుండటంతో అటుగా వెళ్లే గ్రామస్తులు ఆ ట్యాంకు ఎప్పుడు కూలుతుందోనని భయాందోళన చెందుతున్నారు. ట్యాంక్ వద్ద ఆటలాడుకోవద్దని విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎన్నోసార్లు చెప్పినా వారు వినిపించుకోకుండా ట్యాంక్ వద్దనే ఆడుకుంటున్నారు. ట్యాంకు నిర్మించి 33 సంవత్సరాలు అయినప్పటికీ మూడు చుక్కల నీరు కూడా ట్యాంకుకు ఎక్కించిన పాపాన పోలేదు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ట్యాంకును తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావును వివరణ కోరగా, ట్యాంకును పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అధికారులు పట్టించుకోలేదు : నేను సర్పంచిగా కొనసాగే సమయంలో ఎన్నోసార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. అధికారులు అధికార పార్టీకే తొత్తు అయ్యారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడంలేదు. ట్యాంకు తొలగించాలని గ్రామసభలలో స్థానికులు వినతిపత్రాలు అందజేశారు. కానీ, ఫలితం లేదు. పాతకోట సునీతాకోటిరెడ్డి, మాజీ సర్పంచి, ఇండ్లచెరువు పెచ్చులూడి తలపై పడ్డాయి : ట్యాంకు పక్కనే ఇల్లు ఉండటం వలన ఇంట్లోకి వెళ్లాలంటే ట్యాంకు కింద నుంచే వెళ్లాలి. గతంలో రెండు సార్లు నా తలపై పెచ్చులూడి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. దయచేసి తొలగించండి. ముతుకూరి కాళహస్తీ, ఇండ్లచెరువు నిత్యం అక్కడే ఆటలాడుకుంటున్నాం : మేము తరగతుల మధ్య ఖాళీ సమయంలో ఆడుకోవడానికి ట్యాంక్ దగ్గరకు వెళ్తాం. మా సారోళ్లు అక్కడికి వెళ్లవద్దు అంటున్నారు. మాకు ఆడుకోవడానికి స్థలంలేక అక్కడికే వెళ్తున్నాం. టి.మణికంఠారెడ్డి,6వ తరగతి, ఇండ్లచెరువు -
ఫన్‌చాయతీ
కోడుమూరు: ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే పల్లెలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతాయనడంలో సందేహం లేదు. నాయకుల్లో స్వార్థం పెరిగిపోవడం.. అధికారులు చేయి తడిస్తే చాలనుకోవడం వల్ల గ్రామాల్లో దారిద్య్రం తాండవిస్తోంది. ఐదేళ్ల కాలంలో నాలుగు రాళ్లు వెనకేసుకుందామనుకునే ఆశ తప్పిస్తే.. అభివృద్ధిలో తమ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుదామనుకునే వాళ్లను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కోడుమూరు మండలంలోని పంచాయతీలకు వివిధ గ్రాంట్స్ రూపంలో దాదాపు రూ.6.50 కోట్లు మంజూరయ్యాయి. పంచాయతీ జనాభాను బట్టి రూ.10 లక్షల నుంచి రూ.45లక్షల వరకు కేటాయించారు. మేజర్ పంచాయతీలకు రూ.2కోట్లు విడుదలయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ నిధుల వినియోగం చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. ఉదాహరణకు మండల పరిధిలోని ప్యాలకుర్తి పంచాయతీని పరిశీలిస్తే.. గ్రామానికి రూ.42,09,597ల నిధులు మంజూరయ్యాయి. ఇక్కడ వీధి లైట్లు కూడా వెలగవు. కాల్వల్లో ఎక్కడికక్కడ సిల్టు పేరుకుపోయింది. ప్రజలు మురికినీటి కుంటల మధ్యే జీవనంసాగిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ ఎండిపోయాయి. రెండు ఓహెచ్‌ఆర్ ట్యాంకులు ఉన్నా.. మూడేళ్లుగా నీళ్లు ఎక్కంచని పరిస్థితి. 11 మినీ ట్యాంకుల్లో మూడు మాత్రమే పని చేస్తున్నాయి. 8వేల జనాభా కలిగిన ప్యాలకుర్తిలో అడుగడుగునా సమస్యలే. తాగునీటి ఇక్కట్లతో గ్రామస్తులు చుక్కలు చూస్తున్నారు. అయితే తాగునీటి సరఫరా, పైపులైన్ల నిర్వహణ, మోటార్ల మరమ్మతుకు రూ.8.34 లక్షలు ఖర్చు చేసినట్లు సర్పంచ్ లెక్కలు చూపారు. తాగునీటి కోసం ఒక్క ఏడాదిలో ఇన్ని లక్షలు ఖర్చు పెడితే ప్రజల గొంతు ఎందుకు ఎండుతుందో ఆ నేతకే ఎరుక. ఇదే కాదు.. పంచాయతీ భవన నిర్వహణకు రూ.8,750.. మురుగు కాల్వల శుభ్రానికి, చెత్త ఎత్తివేతకు రూ.6లక్షలు ఖర్చు చేశారట. ఇంకా ఈ పంచాయతీలో రూ.23.62 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ఆ మొత్తానికి ఎలాంటి లెక్కలు చూపుతారో వేచి చూడాలి. ఒక్క ప్యాలకుర్తిలోనే కాదు.. దాదాపు అన్ని పంచాయతీల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. సర్పంచ్‌లు నిధులను దుర్వినియోగం చేస్తుంటే.. అడ్డుకోవాల్సిన అధికారులు కమీషన్ల కక్కుర్తితో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అనుగొండ గ్రామ సర్పంచ్‌గా సుజాత ఎన్నికయ్యారు. ఈమె రాజకీయాలకు కొత్త కావడంతో ఓ వ్యక్తి షాడో సర్పంచ్‌గా చక్రం తిప్పుతున్నాడు. రికార్డులతో పాటు చెక్ బుక్కు కూడా తన వద్దే ఉంచుకున్నాడు. రూపాయి ఖర్చు చేయాలన్నా సర్పంచ్ కూడా ఆయన అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు మార్చి చివరిలోపు ఖర్చు చేయకపోతే మురిగిపోతాయి. ఈ నేపథ్యంలో చిల్లబండ, పులకుర్తి గ్రామ పంచాయతీల్లో పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసుకునేందుకు వెళ్లగా ట్రెజరీ అధికారులు నిలుపుదల చేశారు. గూడూరు మండలంలోని జూలకల్ గ్రామ సర్పంచ్ గెలుపునకు రూ.7లక్షలు ఖర్చు చేశానని చెప్పుకుంటున్న ఓ నేత సర్పంచ్‌పై పెత్తనం చెలాయిస్తూ నిధులను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. గతంలో సర్పంచ్ సొంత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయగా.. ఆ వ్యక్తి తన డబ్బు తిరిగిచ్చిన తర్వాతే అలా చేయాలని బెదిరించినట్లు చర్చ జరుగుతోంది.