ప్రమాదకరంగా ఉన్న ట్యాంకు ఇదే...
సాక్షి, దొనకొండ: మండలంలోని ఇండ్లచెరువు గ్రామం ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఇళ్ల మధ్యలో మంచినీటి కోసం నిర్మించిన ఓహెచ్‌ఆర్ ట్యాంకు కూలేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉంది. సుమారు 34 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఓహెచ్‌ఆర్ ట్యాంకుకు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. నిత్యం విద్యార్థులు ట్యాంకు కింద ఆటలాడుకుంటుంటారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ట్యాంక్ పెచ్చులూడి దాని పక్కన గల ఇంట్లోని మహిళ తలపై పడి తీవ్రగాయాలయ్యాయి. తరచూ పెచ్చులూడటం, సిమెంట్ రాలుతుండటంతో అటుగా వెళ్లే గ్రామస్తులు ఆ ట్యాంకు ఎప్పుడు కూలుతుందోనని భయాందోళన చెందుతున్నారు. ట్యాంక్ వద్ద ఆటలాడుకోవద్దని విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎన్నోసార్లు చెప్పినా వారు వినిపించుకోకుండా ట్యాంక్ వద్దనే ఆడుకుంటున్నారు. ట్యాంకు నిర్మించి 33 సంవత్సరాలు అయినప్పటికీ మూడు చుక్కల నీరు కూడా ట్యాంకుకు ఎక్కించిన పాపాన పోలేదు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ట్యాంకును తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావును వివరణ కోరగా, ట్యాంకును పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
అధికారులు పట్టించుకోలేదు :
నేను సర్పంచిగా కొనసాగే సమయంలో ఎన్నోసార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. అధికారులు అధికార పార్టీకే తొత్తు అయ్యారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడంలేదు. ట్యాంకు తొలగించాలని గ్రామసభలలో స్థానికులు వినతిపత్రాలు అందజేశారు. కానీ, ఫలితం లేదు.
పాతకోట సునీతాకోటిరెడ్డి, మాజీ సర్పంచి, ఇండ్లచెరువు
పెచ్చులూడి తలపై పడ్డాయి :
ట్యాంకు పక్కనే ఇల్లు ఉండటం వలన ఇంట్లోకి వెళ్లాలంటే ట్యాంకు కింద నుంచే వెళ్లాలి. గతంలో రెండు సార్లు నా తలపై పెచ్చులూడి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. దయచేసి తొలగించండి.
ముతుకూరి కాళహస్తీ, ఇండ్లచెరువు
నిత్యం అక్కడే ఆటలాడుకుంటున్నాం :
మేము తరగతుల మధ్య ఖాళీ సమయంలో ఆడుకోవడానికి ట్యాంక్ దగ్గరకు వెళ్తాం. మా సారోళ్లు అక్కడికి వెళ్లవద్దు అంటున్నారు. మాకు ఆడుకోవడానికి స్థలంలేక అక్కడికే వెళ్తున్నాం.
టి.మణికంఠారెడ్డి,6వ తరగతి, ఇండ్లచెరువు
Comments
Please login to add a commentAdd a comment