నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు..! | Full cost of the neglect of their lives! | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు..!

Published Mon, Oct 5 2015 3:59 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 AM

నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు..!

నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు..!

♦ సూర్యలంక బీచ్‌పై అధికారుల నిర్లక్ష్య వైఖరి
♦ ఐదేళ్లలో 58 మంది యువకుల ప్రాణాలు బలి
♦ శాపంగా మారిన అధికారుల సమన్వయ లోపం
♦ బీచ్ పక్కనే బెల్టు దుకాణాలు.. యథేచ్ఛగా మద్యం అమ్మకాలు
 
 సాక్షి, గుంటూరు:  ప్రమాదం జరిగి ప్రాణాలు పోతేనే వీరిలో చలనం వస్తుంది.. అది కూడా కేవలం రెండు మూడు రోజులు హడావిడి చేస్తారు.. ఆ తరువాత  షరామామూలే.. అది మా తప్పు కాదంటే.. మాది కాదంటూ ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుని చేతులు దులిపేసుకుంటున్నారు..  వారం కిందట సూర్యలంక బీచ్ వద్ద సముద్రంలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటన తెలిసిందే.. అధికారుల నిర్లక్ష్యానికి ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి..? ఎంతమంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తారు..? అంటూ జిల్లా ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  జిల్లాలో ఉన్న ఒకేఒక్క బీచ్  సూర్యలంక కావడం, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట వంటి ప్రాంతాల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కళాశాలలు అధికంగా ఉండటంతో విద్యార్థులు సెలవురోజుల్లో ఆటవిడుపుగా ఇక్కడకు వస్తూ ఉంటారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క సూర్యలంక బీచ్‌లోనే 58 మంది విద్యార్థుల ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి.

 భద్రతా చర్యల్లో అధికారుల వైఫల్యం.. సముద్రంలో మునిగి ప్రాణాపాయంలో ఉన్నప్పటికీ సూర్యలంక బీచ్ సమీపంలో ఒక్క పీహెచ్‌సీ గానీ.. కనీసం అంబులెన్స్ సౌకర్యంగా అధికారులు ఏర్పాటు చేయలేదు. బెల్టు దుకాణాలు రద్దు చేస్తూ సీఎం తొలి సంతకం చేసినా సూర్యలంక బీచ్ వద్ద మాత్రం రెండు బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. ఇక్కడకు వచ్చిన విద్యార్థులు మద్యం తాగి సముద్రంలో దిగుతుండటంతో మత్తులో ఈదలేక ఊపిరాడక మృతి చెందుతున్నారు.  సముద్రంలో ఎంత దూరం వరకూ వెళ్లవచ్చు.. ఎక్కడ నుంచి లోతు, ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయని తెలిపే సూచికలు ఏమీ లేవు.

సముద్రంలో మునిగితే రక్షించే గజ ఈతగాళ్లను, లైఫ్‌జాకెట్‌లను ఏర్పాటు చేయకపోవడంలో మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సముద్రం ఏఏ సమయాల్లో ఉధృతంగా ఉంటుంది.. ఆయా సమయాల్లో సముద్రంలోకి దిగడం శ్రేయస్కరం కాదనే విషయాన్ని తెలియజేయడంలో వాతావరణ శాఖ, బెల్టు దుకాణాలు తొలగించడంలో ఎక్సైజ్ శాఖ, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడటంలో పోలీస్ శాఖ, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటికైనా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి విలువైన ప్రాణాలు సముద్రంపాలు కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement