Authorities carefree attitude
-
కూలేందుకు సిద్ధంగా ఓహెచ్‌ఆర్ ట్యాంకు
సాక్షి, దొనకొండ: మండలంలోని ఇండ్లచెరువు గ్రామం ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఇళ్ల మధ్యలో మంచినీటి కోసం నిర్మించిన ఓహెచ్‌ఆర్ ట్యాంకు కూలేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉంది. సుమారు 34 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఓహెచ్‌ఆర్ ట్యాంకుకు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. నిత్యం విద్యార్థులు ట్యాంకు కింద ఆటలాడుకుంటుంటారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ట్యాంక్ పెచ్చులూడి దాని పక్కన గల ఇంట్లోని మహిళ తలపై పడి తీవ్రగాయాలయ్యాయి. తరచూ పెచ్చులూడటం, సిమెంట్ రాలుతుండటంతో అటుగా వెళ్లే గ్రామస్తులు ఆ ట్యాంకు ఎప్పుడు కూలుతుందోనని భయాందోళన చెందుతున్నారు. ట్యాంక్ వద్ద ఆటలాడుకోవద్దని విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎన్నోసార్లు చెప్పినా వారు వినిపించుకోకుండా ట్యాంక్ వద్దనే ఆడుకుంటున్నారు. ట్యాంకు నిర్మించి 33 సంవత్సరాలు అయినప్పటికీ మూడు చుక్కల నీరు కూడా ట్యాంకుకు ఎక్కించిన పాపాన పోలేదు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ట్యాంకును తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావును వివరణ కోరగా, ట్యాంకును పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అధికారులు పట్టించుకోలేదు : నేను సర్పంచిగా కొనసాగే సమయంలో ఎన్నోసార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. అధికారులు అధికార పార్టీకే తొత్తు అయ్యారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడంలేదు. ట్యాంకు తొలగించాలని గ్రామసభలలో స్థానికులు వినతిపత్రాలు అందజేశారు. కానీ, ఫలితం లేదు. పాతకోట సునీతాకోటిరెడ్డి, మాజీ సర్పంచి, ఇండ్లచెరువు పెచ్చులూడి తలపై పడ్డాయి : ట్యాంకు పక్కనే ఇల్లు ఉండటం వలన ఇంట్లోకి వెళ్లాలంటే ట్యాంకు కింద నుంచే వెళ్లాలి. గతంలో రెండు సార్లు నా తలపై పెచ్చులూడి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. దయచేసి తొలగించండి. ముతుకూరి కాళహస్తీ, ఇండ్లచెరువు నిత్యం అక్కడే ఆటలాడుకుంటున్నాం : మేము తరగతుల మధ్య ఖాళీ సమయంలో ఆడుకోవడానికి ట్యాంక్ దగ్గరకు వెళ్తాం. మా సారోళ్లు అక్కడికి వెళ్లవద్దు అంటున్నారు. మాకు ఆడుకోవడానికి స్థలంలేక అక్కడికే వెళ్తున్నాం. టి.మణికంఠారెడ్డి,6వ తరగతి, ఇండ్లచెరువు -
నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు..!
♦ సూర్యలంక బీచ్‌పై అధికారుల నిర్లక్ష్య వైఖరి ♦ ఐదేళ్లలో 58 మంది యువకుల ప్రాణాలు బలి ♦ శాపంగా మారిన అధికారుల సమన్వయ లోపం ♦ బీచ్ పక్కనే బెల్టు దుకాణాలు.. యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాక్షి, గుంటూరు: ప్రమాదం జరిగి ప్రాణాలు పోతేనే వీరిలో చలనం వస్తుంది.. అది కూడా కేవలం రెండు మూడు రోజులు హడావిడి చేస్తారు.. ఆ తరువాత షరామామూలే.. అది మా తప్పు కాదంటే.. మాది కాదంటూ ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుని చేతులు దులిపేసుకుంటున్నారు.. వారం కిందట సూర్యలంక బీచ్ వద్ద సముద్రంలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటన తెలిసిందే.. అధికారుల నిర్లక్ష్యానికి ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి..? ఎంతమంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తారు..? అంటూ జిల్లా ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఒకేఒక్క బీచ్ సూర్యలంక కావడం, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట వంటి ప్రాంతాల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కళాశాలలు అధికంగా ఉండటంతో విద్యార్థులు సెలవురోజుల్లో ఆటవిడుపుగా ఇక్కడకు వస్తూ ఉంటారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క సూర్యలంక బీచ్‌లోనే 58 మంది విద్యార్థుల ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. భద్రతా చర్యల్లో అధికారుల వైఫల్యం.. సముద్రంలో మునిగి ప్రాణాపాయంలో ఉన్నప్పటికీ సూర్యలంక బీచ్ సమీపంలో ఒక్క పీహెచ్సీ గానీ.. కనీసం అంబులెన్స్ సౌకర్యంగా అధికారులు ఏర్పాటు చేయలేదు. బెల్టు దుకాణాలు రద్దు చేస్తూ సీఎం తొలి సంతకం చేసినా సూర్యలంక బీచ్ వద్ద మాత్రం రెండు బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. ఇక్కడకు వచ్చిన విద్యార్థులు మద్యం తాగి సముద్రంలో దిగుతుండటంతో మత్తులో ఈదలేక ఊపిరాడక మృతి చెందుతున్నారు. సముద్రంలో ఎంత దూరం వరకూ వెళ్లవచ్చు.. ఎక్కడ నుంచి లోతు, ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయని తెలిపే సూచికలు ఏమీ లేవు. సముద్రంలో మునిగితే రక్షించే గజ ఈతగాళ్లను, లైఫ్జాకెట్లను ఏర్పాటు చేయకపోవడంలో మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సముద్రం ఏఏ సమయాల్లో ఉధృతంగా ఉంటుంది.. ఆయా సమయాల్లో సముద్రంలోకి దిగడం శ్రేయస్కరం కాదనే విషయాన్ని తెలియజేయడంలో వాతావరణ శాఖ, బెల్టు దుకాణాలు తొలగించడంలో ఎక్సైజ్ శాఖ, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడటంలో పోలీస్ శాఖ, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటికైనా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి విలువైన ప్రాణాలు సముద్రంపాలు కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.