కర్నూలు(హాస్పిటల్): సంజామల మండలం నొస్సం గ్రామంలో నివాసముండే రాజస్థాన్‌కు చెందిన యువకునికి ఈ ఏడాది మార్చి 28న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఇదే తొలి కేసు. ఇది వెలుగు చూసిన వారం రోజుల తర్వాత నుంచి కేసులు క్రమంగా పెరగడం ప్రారంభమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కరోనా కట్టడి చర్యలు చేపట్టారు. అయితే.. జూన్ ఒకటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ప్రజలు సాధారణ జీవితానికి తిరిగి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో కొందరు మాస్క్‌లు ధరించకపోవడం, చేతులను శుభ్రం చేసుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో కేసుల సంఖ్య మళీ పెరుగుతోంది. జిల్లాలోనే కాదు.. దేశవ్యాప్తంగానూ ఇదే ధోరణి కన్పిస్తోంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా జిల్లాలో రికవరీ అయ్యే బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం గమనార్హం.
కరోనా మహమ్మారిని ఆత్మస్థైర్యంతో జయించానని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తెలిపారు. 21 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండి కరోనాను జయించిన ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘నాకు కరోనా పాజిటివ్‌గా జూన్ 25న నిర్ధారణ అయ్యింది. మొదట్లో భయపడ్డా. కుటుంబం, పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు కళ్లముందు మెదిలారు. మొదట్లో కరోనాను జయిస్తానా అన్న ప్రశ్న తలెత్తింది. కానీ మంచి ఆహారం, ప్రాణాయామం, సరైన నిద్ర, డాక్టర్ల సూచనలు పాటించడం ద్వారా హోం క్వారంటైన్‌లోనే ఉండి వైరస్‌ను జయించా. స్పెషలిస్ట్ డాక్టర్ల నుంచి ఫోన్‌లో ఎప్పటికప్పుడు వైద్య సహాయం తీసుకున్నా. ఆహారం విషయంలోనూ శ్రద్ధ చూపా. ఉదయం నూనె లేకుండా టిఫిన్, రెండు గుడ్లు, అల్లం టీ, మధ్యాహ్నం చికెన్, అన్నం, సాయంత్రం తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్, నిమ్మకాయ నీళ్లు, రాత్రి అల్పాహారం, పసుపు, మిరియాలు కలిపిన పాలు తీసుకున్నా. వేడినీళ్లు ఆవిరి పట్టా. ప్రతిరోజూ వేడినీళ్లు మాత్రమే తాగేవాడిని. శ్వాసకు సంబంధించిన 15 రకాల వ్యాయామాలు చేశా. ఒంటరితనం నుంచి బయటపడడానికి వీలుగా వైఎస్సార్, అంబేడ్కర్ జీవిత చరిత్రలు చదివా. ఇలా క్రమశిక్షణ, మనోధైర్యంతో మహమ్మారిని జయించా. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా. కరోనా వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం.’
Comments
Please login to add a commentAdd a comment