
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి నివారణకు ముందు జాగ్రత్తే మందని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ (ఆపి) ప్రెసిడెంట్ డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌కు మందు లేనందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలున్న వారు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లడాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలని చెప్పారు. లాక్‌డౌన్ విధింపు, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నాకే ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తికి ఎంతో కొంత అడ్డుకట్ట పడిందని బుధవారం ఆయన ‘సాక్షి’తో చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
► ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి.
► ఆహారంలో విటమిన్ సీ, డీ, జింక్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
► అమెరికాలోని భారతీయులు, ఇతర దేశాలవారిని కరోనా నుంచి రక్షించేందుకు ఆపి తరఫున అనేక చర్యలు చేపట్టాం.
► వైద్యపరమైన సాయం, సలహాలు, సూచనలు అందిస్తున్నాం.
► భారతీయ విద్యార్థులు, భారత సంతతి ప్రజలకు, వారి కుటుంబాలకు హెల్ప్‌లైన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నాం.
► హైడ్రాక్సిన్ క్లోరోక్విన్ ఔషధం కోవిడ్ –19 రోగులకు ఇవ్వడం ట్రీట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఆశాజనకంగా లేదని తమ సంస్థ వైద్యుల పరిశీలనలో తేలింది.
► రెమిడెస్విర్ వంటి యాంటీ వైరల్ మందులు పనిచేస్తున్నట్టుగా మా పరిశీలనలో తేలింది.
► కోవిడ్–19 బారినపడి కోలుకున్న రోగి నుంచి ప్లాస్మా మార్పిడి ఆశాజనకంగా ఉన్నట్టు తేలింది.