అమలాపురం : మేజర్ పంచాయతీలకే కాదు.. మైనర్ పంచాయతీలకూ విద్యుత్ బకాయి లు అభివృద్ధికి ఆటంకంగా మారనున్నాయి. ప్రభుత్వం తనపై భారం తగ్గించుకునేందుకు మైనర్ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపునకు 13వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవాలని ఇటీవల చెప్పడంతో మూడేళ్లకు పైగా ఉన్న బకాయిల వసూలుకు విద్యుత్‌శాఖ సిద్ధమవుతోంది. జిల్లాలో 1,006 వరకు పంచాయతీలుండగా, విలీన మండలాల్లో మరో 60 వరకు ఉన్నాయి. వీటిలో 125కు పైగా మేజర్ పంచాయతీలు కాగా, 941 వరకు మైనర్ పంచాయతీలు. ఇప్పటి వరకు మేజర్ పంచాయతీలు సొంతంగానే విద్యుత్ బిల్లులు చెల్లించుకుంటుంటుండగా, మైనర్ పంచాయతీల బిల్లులు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తోంది. ఇందుకు అభ్యంతరం తెలిపిన అకౌంట్స్, ఆడిట్ జనరల్ మైనర్ పంచాయతీలు బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం నిధులు ఇచ్చి వాటితో కట్టించాలని సూచించింది.
దీనిని సాకుగా చూపి పంచాయతీరాజ్ కమిషనర్ 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కనీసం 30 శాతం విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో విద్యుత్‌శాఖ మూడేళ్లుగా బకాయి పడ్డ సుమారు రూ.20 కోట్ల వసూలుకు సిద్ధమవుతోంది. మైనర్ పంచాయతీలు ఒక్కొక్కటీ రూ.లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల వరకు బకాయి పడ్డట్టు అంచనా. 13వ ఆర్థిక సంఘం నిధులు ఆయా పంచాయితీల్లో జనాభాను బట్టి రూ.50 వేల నుంచి రూ.ఐదు లక్షల వరకు వచ్చే అవకాశముంది. దీనిలో 30 శాతం విద్యుత్ బిల్లుగా చెల్లిస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేయలేమని ఆయా పంచాయతీల కార్యదర్శులు చెబుతున్నారు.
నిధుల మళ్లింపు రివాజై పోతుంది..
ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల విషయంలో గట్టిగా ఉందని, ఎంత ఇబ్బంది అయినా పంచాయతీల నుంచి బకాయిలు వసూలు చేయాలని, నిర్దేశిత లక్ష్యాల ప్రకారం బిల్లులు వసూలు చేయకుంటే ఉద్యోగాలు కోల్పోతారని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. మేజర్ పంచాయతీలతో పోల్చుకుంటే మైనర్ పంచాయతీల్లో ఆదాయ వనరులు అంతంత మాత్రమే. చిన్న పనికైనా ప్రభుత్వ గ్రాంటులే దిక్కు. రహదారులు, డ్రైన్లు, తాగునీటి వసతికి నోచుకోని; కనీసం పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు లేని పంచాయతీలు ఉన్నాయి. ఇలాంటి పంచాయతీలకు వచ్చే కొద్దిపాటి గ్రాంటులో విద్యుత్ బిల్లులంటూ కోతలు పెట్టడం ప్రభుత్వానికి భావ్యం కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఇప్పుడిస్తున్న గ్రాంట్‌లో కేవలం 30 శాతం మాత్రమే బిల్లులు కట్టమంటున్నామని, మిగిలిన నిధులతో అభివృద్ధి చేసుకోవచ్చని ఉన్నతాధికారులంటున్నారు. 30 శాతం నిధులతో మొత్తం విద్యుత్ బకాయిలు తీరకపోయినా.. ఒకసారి విద్యుత్ బిల్లు కట్టడం మొదలు పెడితే మిగిలిన బకాయిలను సైతం ముందు ముందు వచ్చే గ్రాంట్‌ల నుంచే చెల్లించాల్సి వస్తోందని పాలకులు, సిబ్బంది వాపోతున్నారు. అసలే ఎన్నికలు ఆలస్యమై మూడేళ్లుగా గ్రాంట్‌లు లేక పడకేసిన పంచాయతీ పాలన గత ఏడాది నుంచే పట్టాలెక్కుతోంది. ఈ సమయంలో ప్రభుత్వ నిర్ణయాలతో పంచాయతీల అభివృద్ధి గాడి తప్పుతోందని తప్పు పడుతున్నారు.
వెలుగుల వ్యయం.. ప్రగతికి ప్రతిబంధకం
Published Sat, Dec 6 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement