Payment of electricity bills
-
వెలుగుల వ్యయం.. ప్రగతికి ప్రతిబంధకం
అమలాపురం : మేజర్ పంచాయతీలకే కాదు.. మైనర్ పంచాయతీలకూ విద్యుత్ బకాయి లు అభివృద్ధికి ఆటంకంగా మారనున్నాయి. ప్రభుత్వం తనపై భారం తగ్గించుకునేందుకు మైనర్ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపునకు 13వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవాలని ఇటీవల చెప్పడంతో మూడేళ్లకు పైగా ఉన్న బకాయిల వసూలుకు విద్యుత్‌శాఖ సిద్ధమవుతోంది. జిల్లాలో 1,006 వరకు పంచాయతీలుండగా, విలీన మండలాల్లో మరో 60 వరకు ఉన్నాయి. వీటిలో 125కు పైగా మేజర్ పంచాయతీలు కాగా, 941 వరకు మైనర్ పంచాయతీలు. ఇప్పటి వరకు మేజర్ పంచాయతీలు సొంతంగానే విద్యుత్ బిల్లులు చెల్లించుకుంటుంటుండగా, మైనర్ పంచాయతీల బిల్లులు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తోంది. ఇందుకు అభ్యంతరం తెలిపిన అకౌంట్స్, ఆడిట్ జనరల్ మైనర్ పంచాయతీలు బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం నిధులు ఇచ్చి వాటితో కట్టించాలని సూచించింది. దీనిని సాకుగా చూపి పంచాయతీరాజ్ కమిషనర్ 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కనీసం 30 శాతం విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో విద్యుత్‌శాఖ మూడేళ్లుగా బకాయి పడ్డ సుమారు రూ.20 కోట్ల వసూలుకు సిద్ధమవుతోంది. మైనర్ పంచాయతీలు ఒక్కొక్కటీ రూ.లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల వరకు బకాయి పడ్డట్టు అంచనా. 13వ ఆర్థిక సంఘం నిధులు ఆయా పంచాయితీల్లో జనాభాను బట్టి రూ.50 వేల నుంచి రూ.ఐదు లక్షల వరకు వచ్చే అవకాశముంది. దీనిలో 30 శాతం విద్యుత్ బిల్లుగా చెల్లిస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేయలేమని ఆయా పంచాయతీల కార్యదర్శులు చెబుతున్నారు. నిధుల మళ్లింపు రివాజై పోతుంది.. ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల విషయంలో గట్టిగా ఉందని, ఎంత ఇబ్బంది అయినా పంచాయతీల నుంచి బకాయిలు వసూలు చేయాలని, నిర్దేశిత లక్ష్యాల ప్రకారం బిల్లులు వసూలు చేయకుంటే ఉద్యోగాలు కోల్పోతారని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. మేజర్ పంచాయతీలతో పోల్చుకుంటే మైనర్ పంచాయతీల్లో ఆదాయ వనరులు అంతంత మాత్రమే. చిన్న పనికైనా ప్రభుత్వ గ్రాంటులే దిక్కు. రహదారులు, డ్రైన్లు, తాగునీటి వసతికి నోచుకోని; కనీసం పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు లేని పంచాయతీలు ఉన్నాయి. ఇలాంటి పంచాయతీలకు వచ్చే కొద్దిపాటి గ్రాంటులో విద్యుత్ బిల్లులంటూ కోతలు పెట్టడం ప్రభుత్వానికి భావ్యం కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడిస్తున్న గ్రాంట్‌లో కేవలం 30 శాతం మాత్రమే బిల్లులు కట్టమంటున్నామని, మిగిలిన నిధులతో అభివృద్ధి చేసుకోవచ్చని ఉన్నతాధికారులంటున్నారు. 30 శాతం నిధులతో మొత్తం విద్యుత్ బకాయిలు తీరకపోయినా.. ఒకసారి విద్యుత్ బిల్లు కట్టడం మొదలు పెడితే మిగిలిన బకాయిలను సైతం ముందు ముందు వచ్చే గ్రాంట్ల నుంచే చెల్లించాల్సి వస్తోందని పాలకులు, సిబ్బంది వాపోతున్నారు. అసలే ఎన్నికలు ఆలస్యమై మూడేళ్లుగా గ్రాంట్లు లేక పడకేసిన పంచాయతీ పాలన గత ఏడాది నుంచే పట్టాలెక్కుతోంది. ఈ సమయంలో ప్రభుత్వ నిర్ణయాలతో పంచాయతీల అభివృద్ధి గాడి తప్పుతోందని తప్పు పడుతున్నారు. -
సర్కారు బడులకు విద్యుత్ గుదిబండ?
ఘట్కేసర్ టౌన్: వాణిజ్య కేటగిరి కింద బిల్లులు రావడంతో సర్కారు బడులకు విద్యుత్ బిల్లుల చెల్లింపు భారంగా మారాయి. పాఠశాలల నిర్వహణకు ఏటా ప్రభుత్వమిచ్చే నిధుల్లో కోతలు విధించడంతో ఏమి చేయాలో తోచక ప్రధానోపాధ్యాయులు అయోమయంలో ఉన్నారు. మన టీవి, కంప్యూటర్ల ద్వారా సాంకేతిక విద్య, మీనా కార్యక్రమంతో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రేడియో ద్వారా విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలను అమలు చేయడానికి పాఠశాలల్లో విద్యుత్ కనెక్షన్ తప్పనిసరి. గతంలో సర్కారు బడుల విద్యుత్ బిల్లులన్నీ ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు చెల్లించేది. కొంత కాలంగా రాజీవ్ విద్యామిషన్ విడుదల చేస్తున్న నిధుల నుంచి విద్యుత్ బిల్లులను చెల్లిస్తున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంయుక్త బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోంది. మండలంలో 72 ప్రభుత్వ పాఠశాలలుండగా జిల్లాలో 2500లకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. సర్కారు చదువు వాణిజ్యమా? పాఠశాలల నిర్వహణ కు ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించే అరకొర నిధులు ఏ మూలకూ సరిపోవడం లేదని, సర్కారు బడులకు వాణిజ్య కేటగిరి కింద విద్యుత్ బిల్లును వేయడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా ఉందని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు నిర్వహణకు రూ. 5 వేలు, గ్రాంట్స్ రూపేణా గదుల సంఖ్యను బట్టి రూ.7 వేలు , అలాగే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా ఉన్నత పాఠశాలల నిర్వహణకు రూ.10 వేలు, గ్రాంట్స్ రూపేణా రూ. 7 వేల నిధులను ఏటా అందిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు మరుగుదొడ్లు, తాగునీరు, రేడియో, టీవీ, కంప్యూటర్ల వినియోగం ఎక్కువ కావడంతో చెల్లింపులు ఇబ్బందిగా మారింది. సర్కారు బడులకు వాణిజ్య కేటగిరి కింద విద్యుత్ బిల్లులు రావడంతో నెలకు సరాసరి రూ. 1000లకు పైగా బిల్లు రావడంతో వచ్చిన నిధులన్నీ విద్యుత్ బిల్లుల చెల్లింపులకే సరిపోతున్నాయంటున్నారు. పేదలు చదివే ప్రభుత్వ బడులకు వాణిజ్య కేటగిరిగా పరిగణించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గృహ కేటగిరి, వాణిజ్య కేటగిరి మధ్యన చాలా వ్యత్యాసం ఉందని గుర్తు చేస్తున్నారు. తక్షణమే సర్కారు బడుల కనెక్షన్లను గృహ విభాగంలోకి మార్చి ప్రభుత్వమే బిల్లులు చెల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని యాజమాన్య కమిటీలు కోరుతున్నాయి.