సాక్షి, ఖమ్మం: ఎన్నికల ప్రచారం పల్లెబాట పట్టింది. ప్రచారానికి ఇక ఏడు రోజులే మిగిలి ఉండడంతో అభ్యర్థులంతా గ్రామాలపై కన్నేశారు. పోటాపోటీగా ప్రచారం హోరెత్తిస్తుండడంతో పాటు ఎవరికివారు తమదైన శైలిలో.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే గ్రామాలు ఇప్పుడు అభ్యర్థులకు కీలకమయ్యాయి. అభ్యర్థులు పగలు బహిరంగంగా, రాత్రి తెరచాటు ప్రచారంతో ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ద్వితీయ శ్రేణి నేతలకు తాయిలాలు ప్రకటించడంతో వారంతా ఊత్సాహంతో పల్లెరాజ‘కీ’యంలో సమీకరణలను మార్చుతున్నారు.
అంతేకాకుండా అభ్యర్థులు పల్లె ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల అగ్రనేతలను ప్రచారానికి రప్పిస్తున్నారు. జిల్లాలోని మేజర్ పంచాయతీలపైనే అన్ని పార్టీలు దృష్టి పెట్టి.. ప్రచారాన్ని విసృ్తతం చేస్తున్నాయి. ఈ వారం రోజులు తమ భవిష్యత్తును నిర్ణయించే ముఖ్య ఘట్టాలుగా భావిస్తున్న అభ్యర్థులు.. అగ్రనేతలతో పల్లె ప్రచారంతో కదం తొక్కుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల జిల్లాలో వైఎస్సార్‌సీపీ, సీపీఎం అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా వైఎస్సార్‌సీపీ, సీపీఎం అభ్యర్థుల విజయం కోసం జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే టీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ అధినేత కేసీఆర్‌ను సభలకు రప్పించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఇంకా టీడీపీ తరఫున ప్రత్యేకంగా అగ్రనేతలు రాలేదు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నామా నాగేశ్వరారవు ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో టీడీపీ బరిలో ఉన్న అభ్యర్థులు ఎక్కడి వారు అక్కడ ప్రచారం చేస్తున్నా.. ఇతర నియోజకవర్గాల్లోకి మాత్రం వారు అడుగు పెట్టడం లేదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాత్రం తాను పోటీ చేస్తున్న ఖమ్మం పార్లమెంట్ పరిధిలోనే ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన పలు గ్రామాలు తిరిగి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. ఆ పార్టీ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి రావాలని కోరుతున్నా ఆయన బిజీగా ఉన్నానని అంటున్నట్లు సమాచారం.
హామీలే హామీలు..
గత ఎన్నికల్లో ఇది చేస్తాం.. అది చేస్తాం.. అని హామీలిచ్చిన నేతలు మళ్లీ అవే హామీలను వల్లేవేస్తుండడం గమనార్హం. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా మళ్లీ ప్రజల వద్దకు వెళ్తుండడంతో.. ఆయా అభ్యర్థులకు ప్రజల నుంచి గత హామీలు ఏమయ్యాయని నిలదీతలు, నిరసనలు ఎదురవుతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు తీర్చలేని హామీలు ఇస్తుండడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. అధికారంలో ఉండి ఏం చేశారని కాంగ్రెస్ అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. ‘నన్ను గెలిపిస్తే మీ గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా’ అని ఏ గ్రామానికి వెళ్లినా హామీల వర్షం గుప్పిస్తున్న నేతలపై.. గతంలో హామీలిచ్చి, అవి తీర్చలేదని ప్రజలు మండిపడుతున్నారు.
నజరానాలకు ఏర్పాట్లు..
పల్లె ఓటర్లను దృష్టిలో పెట్టుకొని అధికార, ప్రతిపక్ష పార్టీలు నజరానాలు ప్రకటించే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గాల పరిధిలోని పట్టణాల్లో తమ ప్రచార సరళితో ఓటర్లు ఎటు వైపు ఉన్నారో తేలిపోవడంతో.. ఇక అభ్యర్థులంతా పల్లె ఓటర్ల నాడి పట్టుకునే ప్రయత్నాల్లో మునిగారు. గ్రామాల్లో ఒక పార్టీలో ఉన్న నేతలకు మరో పార్టీ వారు గుట్టుచప్పుడు కాకుండా ఎరవేస్తూ తమ నజరానాలకు అంగీకరిస్తే, గెలిచిన తర్వాత ‘నీ భవిష్యత్ బంగారుమయం చేస్తా’మని నమ్మబలుకుతుండడంతో గ్రామాల్లో రాజకీయం రసకందాయంగా మారింది.
తమ ప్రచారం, అగ్రనేతల ప్రచారం ఎలా ఉన్నా.. ప్రధానంగా పోలింగ్‌కు రెండు రోజుల ముందే పల్లె రాజకీయం చక్రం తిప్పే యోచనలో అభ్యర్థులున్నారు. ఇప్పటికే పోటీ చేసి, ఓటమి చెందిన అభ్యర్థులు మాత్రం గతంలో పల్లెల్లో తాము ఎక్కడ దెబ్బతిన్నామో ఆ మూలాలు వెతికి.. ఆయా గ్రామాల్లో భారీ నజరానాలు ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదు. ఇలా అంతుపట్టని పల్లె ఓటర్ల నాడితో అభ్యర్థులు హైరానా పడుతున్నారు.
గ్రామాలే టార్గెట్
Published Mon, Apr 21 2014 2:09 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement