సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలపై ప్రధానంగా దృష్టి సారించాయి. ఎన్నికల నాటికి ఆయా పార్టీలు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడంతో పాటు తమ కు పట్టున్న ప్రాంతాల్లో మరింత బలపడేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్‌ఎస్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌లవారీగా కమిటీలు వేసే ప్రక్రియను ప్రారంభించగా.. ప్రతి కార్యకర్తను శక్తియాప్ ద్వారా పార్టీకి అనుసంధానం చేసే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. ఇక సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీడీపీ సైతం క్షేత్రస్థాయి పర్యటనలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. జిల్లాలో బీజేపీ సైతం తమ కార్యకలాపాలను వేగవంతం చేయడంతోపాటు జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను నియమించడంతో ఆ పార్టీ వర్గాల్లో నూతనోత్సాహం నెలకొంది.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించింది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు, పది శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా తమ సత్తా నిరూపించుకునేందుకు, జిల్లాలో వైఎస్ ప్రభంజనాన్ని మరోసారి చాటిచెప్పేందుకు కార్యాచరణ రూపొందించుకుంది. ఇటు ఖమ్మం.. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయడమే కాకుండా.. దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా జిల్లా ప్రజలకు కలిగిన ప్రయోజనం, వైఎస్ పట్ల వారికి గల అభిమానాన్ని పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది.
2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జిల్లాలో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన రాష్ట్రస్థాయి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు వేర్వేరుగా టీఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లాలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ ఇప్పటికే ఒకవైపు అభివృద్ధి పనుల మంజూరు.. చేసిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే విధంగా ప్రచారం నిర్వహించేందుకు బహుముఖ వ్యూహం రూపొందించుకుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించడం.. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో, మంత్రి తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయిలో విస్తృతంగా పర్యటించడం ద్వారా రాజకీయంగా పట్టు సాధించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇక టీడీపీ జిల్లాలో తన ఉనికి చాటుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నా.. ఆ పార్టీ ఎన్నికల పొత్తుపైనే ప్రధానంగా ఆధారపడినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. వచ్చే ఎన్నికల్లో తమ భవిష్యత్ ఏమిటనే అంశం ద్వితీయ శ్రేణి నాయకుల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఇక సీపీఎం, సీపీఐలు పలు అంశాలపై ఉద్యమాలు చేపట్టడం ద్వారా ప్రజల్లో నిలిచేం దుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
కాంగ్రెస్‌లో వర్గపోరు కారణంగా డీసీసీ అధ్యక్షుడి నియామకం దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తోంది. పార్టీలో నూతనోత్తేజం నింపడానికి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ జిల్లాలో పర్యటించి.. పార్టీ శ్రేణులను ఏకం చేసే ప్రయత్నం చేసినా వర్గపోరు మూడు గ్రూపులు.. ఆరు వర్గాలుగా విరాజిల్లుతూనే ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు మాత్రం నియోజకవర్గాలపై దృష్టి సారించి.. క్షేత్రస్థాయిలో రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
క్షేత్రస్థాయిలో వైఎస్సార్ సీపీ కార్యకలాపాలు..
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ప్రజా మద్దతు సమీకరించడం, పలు రూపాల్లో ఆందోళనలు చేయడం ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో వేగిరపరిచింది. దళితులకు మూడెకరాల భూమి, రైతులకు వ్యవసాయ ట్రాక్టర్ల మంజూరు.. డబుల్ బెడ్‌రూం ఇళ్లు అర్హులందరికీ అందకపోవడం వంటి అంశాలపై దీర్ఘకాలిక ఆందోళనలు నిర్వహించింది. ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం వైఎస్సార్ సీపీ వేర్వేరు జిల్లా కమిటీలను రాష్ట్ర పార్టీ ఇదివరకే నియమించింది. జిల్లా రాజకీయ కార్యకలాపాలపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ సమన్వయకర్తగా ఉన్న డాక్టర్ ప్రపుల్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలను పరిశీలించడం, కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేయడంతోపాటు రెండు జిల్లాల అధ్యక్షులతో కలిసి పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షుడిగా లక్కినేని సుధీర్‌బాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా కొల్లు వెంకటరెడ్డి ఆయా జిల్లాల్లో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలు చేపట్టడంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై పార్టీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకుని.. ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది.
జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలను, పార్టీ కోసం నిరంతరం శ్రమించే నాయకులను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అభిమానులు అన్ని పార్టీల్లో ఉండడం.. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు వైఎస్సార్ సీపీ పోటీ చేయడం వల్ల ఇబ్బంది తప్పదన్న రాజకీయ విశ్లేషణతో పార్టీ ముందుకెళ్తోంది. కొత్త ప్రాంతాల్లో పార్టీని విస్తరింపజేసేలా కృషి చేస్తోంది. ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టేందుకు పలు ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తోంది. ఖమ్మం జిల్లాలో రైతులకు పలు రకాలుగా జరిగిన అన్యాయం, నష్టాలపై గళమెత్తిన ఆ పార్టీ వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ఇతర పక్షాలతో కలిసి అఖిలపక్షంగా ఏర్పడి రైతు సమస్యలపై పోరాడటమే కాకుండా.. ప్రభుత్వం స్పందించేలా ఆందోళనలు చేపట్టింది. విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రత్యేక ఆందోళనలు నిర్వహించేం దుకు సమాయత్తమవుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో ఆందోళన నిర్వహించిన పార్టీ.. ఈనెల 8 నుంచి నిరుద్యోగ యువకుల నుంచి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి నిరుద్యోగుల గోడు వినిపించేలా కార్యాచరణ రూపొందించింది.
హామీల వైఫల్యాలే ఆయుధంగా పోరాడుతాం
ఎన్నికల ముందు కేసీఆర్ గుప్పించిన హామీలు నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైంది. ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇప్పటికే మం డల, జిల్లా స్థాయిల్లో ఉద్యమాలు చేశాం. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు బస్సుయాత్ర కూడా చేపట్టబోతున్నాం. వైఎస్‌ఆర్ పాలన, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో అభిమానం చెక్కు చెదరలేదు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు మండల, బూత్‌స్థాయిల్లో కమిటీలు వేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం.
-కొల్లు వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment