రెపరెపలాడిన వైఎస్సార్‌సీపీ జెండా | Telanagana ysr congress party inaugurated party office at Khammam | Sakshi
Sakshi News home page

రెపరెపలాడిన వైఎస్సార్‌సీపీ జెండా

Published Sat, Apr 22 2017 10:17 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

Telanagana ysr congress party inaugurated party office at Khammam

ఖమ్మం : ‘ఖమ్మం జిల్లాలో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడింది.. మిట్ట మద్యాహ్నం 44 డిగ్రీల ఉష్ణోగ్రత్తలను సైతం లెక్క చేయక వైఎస్సార్‌సీపీ సైన్యం కవాత్తులా కదలింది.. పార్టీ జెండాలతో కార్యకర్తలు నాయకులు కోదాడ క్రాస్‌ రోడ్‌ నుంచి ఇల్లెందు క్రాస్‌ రోడ్‌ వరకు కదం తొక్కారు..’ వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి రావడంతో పార్టీ శ్రేణులు జిల్లా అధ్యక్షులు లక్కినేని సుదీర్‌బాబు నేతృత్వంలో స్థానిక కోదాడ్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి ఇల్లెందు క్రాస్‌ రోడ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

తొలుత కార్యకర్తలు స్థానిక మామిళ్లగూడెంలోని లక్కినేని సుదీర్‌బాబు క్యాంప్‌ కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు కోదాడ క్రాస్‌ రోడ్‌వరకు ర్యాలీగా తరలివెళ్లారు. కొమ్ముడప్పు నృత్యాలతో, టపాసుల పేల్చుకుంటూ తరలివెళ్లారు. అక్కడకు చేరుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షులు లక్కినేని సుదీర్‌బాబు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం పెద్దతండా వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ్నుంచి కాల్వొడ్డు, మయూరిసెంటర్, బస్టాండ్‌ సెంటర్‌ల మీదుగా ఇల్లందు క్రాస్‌ రోడ్‌ వరకు సాగింది. కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకావడంతో ఈ ర్యాలీ సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. కార్యకర్తలు నూతనోత్సహాంతో బైక్‌లు, ట్రాక్టర్లపై ర్యాలీ నిర్వహించారు. ఓపెన్‌టాప్‌పై ఎక్కిన నాయకులు ప్రజలకు అభివాదం చేసుకుంటూ సాగారు. భారీగా కార్యకర్తలు తరలిరావడంతో ఖమ్మం ప్రధాన రహదారి వైఎస్సార్‌సీపీ జెండాలతో నిండింది.

జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభం..
స్థానిక ఇల్లందు క్రాస్‌ రోడ్‌సమీపంలో ఏర్పాటు చేసిన పార్టీ నూతన జిల్లా కార్యాలయంను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు లక్కినేని సుదీర్‌బాబుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ్నుంచి ప్రారంభమైన ర్యాలీ బైపాస్‌ రోడ్‌లోని రాజ్‌పథ్‌ పంక్షన్‌ హాల్‌ వరకు సాగింది. పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంబోత్సవానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు నేతలను జిల్లా నాయకులు సన్మానించారు. రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి ఘన సన్మానం చేయడంతో ఆయనకు కరవాలం బహుకరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు కేరింతలు చేశారు. నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ సందర్భంగా బాణా సంచా పేల్చుతూ నూతనోత్సాహాన్ని చూపించారు.

వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం..
గత కొద్ది కాలంగా స్తబ్దుగా ఉన్న వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. పార్టీ జిల్లా కార్యాలయం సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి రావడం, నగరంలో భారీ ర్యాలీ నిర్వహించడంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే జిల్లాలోని మండల కమిటీలను పూర్తి చేయడంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు లక్కినేని సుదీర్‌బాబు కీలకంగా వ్యవహరించారు. దీంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంబోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు. కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొల్పేలా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తన సందేశాన్ని ఇవ్వడంతో తిరిగి జిల్లాలో వైఎస్సార్‌సీపీ కీలకంగా మారేలా కార్యకర్తలు తమ ఉత్సాహాన్ని చూపించారు. ఏది ఏమైనా జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంబోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కార్యక్రమాలు ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement