ప్రతి గ్రామం సింగపూర్‌లా ఉండాలి | Each village should be like Singapore | Sakshi
Sakshi News home page

ప్రతి గ్రామం సింగపూర్‌లా ఉండాలి

Sep 12 2015 1:02 AM | Updated on Sep 3 2017 9:12 AM

రానున్న నాలుగేళ్లలో జిల్లాలోని ప్రతిగ్రామాన్ని స్మార్ట్‌సిటీలా తయారు చేయాలని, ఆ గ్రామాలు సింగపూర్‌లా ఉండాలని

గుంటూరు వెస్ట్ : రానున్న నాలుగేళ్లలో జిల్లాలోని ప్రతిగ్రామాన్ని స్మార్ట్‌సిటీలా తయారు చేయాలని, ఆ గ్రామాలు సింగపూర్‌లా ఉండాలని  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు ఆదేశించారు. అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలుచేయాలని సూచించారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాలులో శుక్రవారం స్మార్ట్ విలేజ్‌లు, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, పారిశుధ్యం, ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై కమిషనర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌విలేజ్‌లు అంటే గ్రామాల్లోని అన్నివర్గాల వారి జీవనవిధానాలు మెరుగుపడాలని, ప్రతిఒక్కరూ అందమైన గ్రామంలో నివసిస్తున్నామనే భావన కలిగేలా స్మార్ట్‌విలేజ్‌లను తీర్చిదిద్దాలన్నారు. గ్రామాలలో అందమైన రోడ్లు, పరిశుభ్రమైన నీరు తదితర సౌకర్యాలను కల్పించాలని, గ్రామాలను గ్రీనరీగా మార్చాలని కోరారు. ప్రతి అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, తన సొంతగ్రామంగా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. కొంతమంది అధికారులలో అలసత్వం కనిపిస్తున్నదని, అలసత్వాన్ని వీడి ప్రభుత్వ పథకాలను సమర్ధంగా అమలు చేయాలని పేర్కొన్నారు.

  ఉపాధి హామీలో పనిదినాలు పెంచాలి...
 ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జాబ్‌కార్డుదారులకు పనులు కల్పించాలన్నారు. నిరుద్యోగులు, గర్భిణులు, వికలాంగులతో పనులు చేయించాలని సూచించారు. వారు పనులు చేయలేని పరిస్థితులు ఉంటే వారి తరపువారు పనులు చేసినా సదరు గర్భిణుల ఖాతాలోకి నగదును జమ చేయాలని, పనిదినాలను పెంచాలని ఆదేశించారు. ఇప్పటివరకు కమర్షియల్ భవనాలకు ఇంకుడు గుంతలు తీసుకునే అవకాశం ఉందని, ఇళ్లలో కూడా ఇంకుడుగుంతలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెనాలి ఎంపీడీవో సమావేశం దృష్టికి తీసుకురాగా కమిషనర్ అందుకు అనుమతులు జారీచేస్తామని హామీ ఇచ్చారు.

జిల్లాలో డిసెంబర్ నెలాఖరు నాటికి 188 గ్రామాలను బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా రూపొందించాలని రామాంజనేయులు సూచించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ జిల్లాలో రూ.70 కోట్లతో 838 గ్రామాలలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీతో నిర్మించేలా పంచాయతీల నుంచి తీర్మానాలు అందాయని తెలిపారు. ఆయా గ్రామాలలో వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. జెడ్పీ సీఈఓ బి.సుబ్బారావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ గోపాలకృష్ణ, పీఆర్ ఎస్‌ఈ జయరాజ్, డీపీవో వీరయ్య, డ్వామా పీడీ కె.బాలాజీనాయక్, వివిధ మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీలో, ఆర్‌డబ్య్లూఎస్ ఏఈలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement