జహీరాబాద్‌లో ఇండ్రస్టియల్‌ స్మార్ట్‌ సిటీ | Industrial Smart City in Zaheerabad | Sakshi
Sakshi News home page

జహీరాబాద్‌లో ఇండ్రస్టియల్‌ స్మార్ట్‌ సిటీ

Published Thu, Aug 29 2024 6:17 AM | Last Updated on Thu, Aug 29 2024 6:17 AM

Industrial Smart City in Zaheerabad

రూ.2,361 కోట్లతో ఏర్పాటు

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడి 

రెండు దశల్లో, దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం 

హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ప్రాజెక్టు 

వివిధ రంగాల్లో 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు 

హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ ఇండ్రస్టియల్‌ కారిడార్‌లో భాగంగా.. న్యాలకల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్‌ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా రూ.2,361 కోట్ల వ్యయంతో ఈ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ నిర్మాణం జరగనుంది. 

మొత్తం రెండు దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. నేషనల్‌ ఇండ్రస్టియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ – ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ ఫ్రేమ్‌ వర్క్‌లో భాగంగా..తొలిదశలో 3,245 ఎకరాల్లో పనులు ప్రారంభం అవుతాయి. ఇది జాతీయ రహదారి–65కు  2 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే జహీరాబాద్‌ రైల్వేస్టేషన్‌కు 19 కిలోమీటర్లు, మెటల్‌కుంట రైల్వేస్టేషన్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి 125 కిలోమీటర్ల దూరంలో, ముంబైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్టుకు 600 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టుకు 620 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

ఇప్పటికే పర్యావరణ అనుమతులు 
మొదటి దశకు అవసరమైన 3,245 ఎకరాల స్థలంలో 3,100 (దాదాపు 80%) ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది. రాష్ట్రానికి సంబంధించి షేర్‌ హోల్డర్స్‌ అగ్రిమెంట్, స్టేట్‌ సపోర్ట్‌ అగ్రిమెంట్‌ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ వస్తువులు, ఫుడ్‌ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్‌–మెటాలిక్‌ ఆధారిత పరిశ్రమలు, రవాణా తదితర రంగాలకు ఊతం లభిస్తుంది. 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 

దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ పర్యావరణ శాఖ నుంచి అందాయి. తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి మరింత వేగంగా ముందడుగు వేస్తుందని భావిస్తున్నారు. జహీరాబాద్‌కు ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీని కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌కు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.  

ఏపీలో రెండు ఇండ్రస్టియల్‌ స్మార్ట్‌ సిటీలు 
దేశంలో మొత్తం 12 ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగానే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లులో రూ.2,786 కోట్ల వ్యయంతో, కొప్పర్తిలో రూ.2,137 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలు ఏర్పాటు కానున్నాయి. 

తెలంగాణలో 31 ఎఫ్‌ఎం స్టేషన్లు 
తెలంగాణలో 31, ఆంధ్రప్రదేశ్‌లో 68 ప్రైవేట్‌ ఎఫ్‌ఎం స్టేషన్ల ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తెలంంగాణలోని ఆదిలాబాద్‌ (3), కరీంనగర్‌ (3), ఖమ్మం (3), కొత్తగూడెం (3), మహబూబ్‌నగర్‌ (3), మంచిర్యాల (3), నల్లగొండ (3), నిజామాబాద్‌ (4), రామగుండం (3), సూర్యాపేట (3)ల్లో కొత్త ప్రైవేట్‌ ఎఫ్‌ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement