smart city
-
ఇప్పటికైతే ఇంతే 'స్మార్ట్'!
సాక్షిప్రతినిధి, వరంగల్: స్మార్ట్ సిటీ మిషన్ (ఎస్సీఎం) గడువు మార్చి 31తో ముగిసింది. సుందర నగరాల లక్ష్యం నెరవేరకపోవడంతో గతంలో రెండుసార్లు గడువు పొడిగించిన కేంద్రం.. ఈసారి స్పష్టత ఇవ్వలేదు. దీంతో స్మార్ట్ సిటీ మిషన్ ముగిసినట్లేనన్న చర్చ జరుగుతోంది. దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 100 నగరాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. 2015 ఆగస్టు 27న ప్రారంభించింది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని పెంచడం.. తద్వారా సందరనగరాలుగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యం. నిధుల వెసులుబాటు లేక ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో రెండుసార్లు గడువు పొడిగించిన ప్రభుత్వం.. ఈ ఏడాది మార్చి 31 వరకు మిషన్ పూర్తవుతుందని పేర్కొంది. అయినప్పటికీ 100 నగరాల్లో 25 మాత్రమే నూరుశాతం పూర్తి చేయగా, 37 నగరాల్లో 95 నుంచి 99 శాతంలో ఉన్నాయి. 38 నగరాల్లో ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. అయితే మరోసారి పొడిగింపుపై మంగళవారం వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఎస్సీఎం లక్ష్యం ఇదీ..25 నగరాల్లోనే నూరుశాతం... దేశంలోని వంద నగరాల్లో రూ.1,64,545 కోట్ల వ్యయంతో 8,062 ప్రాజెక్టులకు వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. సుమారు తొమ్మిదేళ్లలో రూ.1,50,306 కోట్లు ఖర్చు కాగా, 7,504 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కాగా, రూ.14,239 కోట్ల వ్యయం కాగల 558 పనులు పురోగతిలో ఉన్నాయి. స్మార్‌సిటీ మిషన్‌కు సంబంధించిన ఈ వివరాలను ఐదు రోజుల కిందట పార్లమెంట్లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి సుధాకర్‌సింగ్ వెల్లడించారు. ఈ గణాంకాల ప్రకారం 25 నగరాల్లో నూరుశాతం ఎస్సీఎం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇందులో జార్ఖండ్‌లోని రాంచి, కర్ణాటకలో మంగళూరు, శివమొగ్గ, తుమకూరు, దావణగెరెలు, మధ్యప్రదేశ్‌లో భూపాల్, ఇండోర్, జబల్పూర్, మహారాష్ట్రలో అమరావతి, నాగ్‌పూర్, నాసిక్, పుణె, సోలాపూర్, థానేలు, ఒడిస్సాలో రూర్కేలా, రాజస్తాన్‌లో అజ్మీర్, ఉదయ్‌పూర్, తమిళనాడులో కోయంబత్తూర్, మదురై, సేలంలు, ఉత్తరప్రదేశ్‌లో అగ్రా, ఝాన్సీ, లక్నో, వారణాసిలు ఉన్నాయి. కాగా 94 నుంచి 99 శాతం వరకు పనులు పూర్తి చేసిన నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, బిహార్‌లో భగల్పూర్, పాట్నా, గుజరాత్లో దాహద్, రాజ్‌కోట్, వడోదరలు, కేరళలో కొచ్చి, తిరువనంతపురంలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని 37 ఉన్నాయి. తెలంగాణలో 87.2 శాతం...లక్షద్వీప్‌లో 24.6 శాతమే... దేశంలోని 38 నగరాలను విశ్లేషిస్తే లక్షద్వీప్‌లోని కావరట్టి 24.6 శాతం, మిజోరాంలో 78.4, హరియాణాలోని ఫరీదాబాద్‌లో 84.1, కర్నల్‌లో 88.2 శాతంగా ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే వరంగల్, కరీంనగర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్సీఎం కింద రూ.2,918 కోట్ల వ్యయం కాగల 169 ప్రాజెక్టులు 87.2 శాతమే పూర్తయినట్లు పేర్కొన్నారు. ఇందులో వరంగల్ కార్పొరేషన్లో రూ.1,800 కోట్లతో చేపట్టిన 119 ప్రాజెక్టుల్లో 84.9 శాతం, కరీంనగర్లో రూ.1,117 కోట్లతో చేపట్టిన 50 ప్రాజెక్టులు 89 శాతం పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా స్మార్ట్‌సిటీ మిషన్ గడువు పెంచాలని తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శితో పాటు వెనుకబడిన ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు కేంద్రానికి లేఖ రాసినట్లు సమాచారం. అయితే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గతంలో చేసిన విజ్ఞప్తి మేరకే 2025 మార్చి 31 వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో ఈసారి ఆ అవకాశం లేదన్న చర్చ పురపాలకశాఖ వర్గాల్లో సాగుతోంది. -
జహీరాబాద్‌లో ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండ్రస్టియల్ కారిడార్‌లో భాగంగా.. న్యాలకల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా రూ.2,361 కోట్ల వ్యయంతో ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనుంది. మొత్తం రెండు దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ – ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా..తొలిదశలో 3,245 ఎకరాల్లో పనులు ప్రారంభం అవుతాయి. ఇది జాతీయ రహదారి–65కు 2 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే జహీరాబాద్ రైల్వేస్టేషన్‌కు 19 కిలోమీటర్లు, మెటల్‌కుంట రైల్వేస్టేషన్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 125 కిలోమీటర్ల దూరంలో, ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టుకు 600 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టుకు 620 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు మొదటి దశకు అవసరమైన 3,245 ఎకరాల స్థలంలో 3,100 (దాదాపు 80%) ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది. రాష్ట్రానికి సంబంధించి షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్, స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్–మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు, రవాణా తదితర రంగాలకు ఊతం లభిస్తుంది. 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ పర్యావరణ శాఖ నుంచి అందాయి. తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి మరింత వేగంగా ముందడుగు వేస్తుందని భావిస్తున్నారు. జహీరాబాద్‌కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌కు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో రెండు ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీలు దేశంలో మొత్తం 12 ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లులో రూ.2,786 కోట్ల వ్యయంతో, కొప్పర్తిలో రూ.2,137 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణలో 31 ఎఫ్ఎం స్టేషన్లు తెలంగాణలో 31, ఆంధ్రప్రదేశ్‌లో 68 ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్ల ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంంగాణలోని ఆదిలాబాద్ (3), కరీంనగర్ (3), ఖమ్మం (3), కొత్తగూడెం (3), మహబూబ్‌నగర్ (3), మంచిర్యాల (3), నల్లగొండ (3), నిజామాబాద్ (4), రామగుండం (3), సూర్యాపేట (3)ల్లో కొత్త ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు : 12 కొత్త స్మార్ట్ సిటీలు.. 10 లక్షల ఉద్యోగాలు..
ఢిల్లీ : దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.దేశంలో 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.28,602 కోట్ల నిధుల్ని కేటాయించింది.నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఏర్పాటు కానున్న 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్‌లో తెలంగాణకు 1, ఆంధ్రప్రదేశ్‌కు 2 కేటాయించింది. కడప జిల్లా కొప్పర్తిలో 2596 ఎకరాల్లో, కర్నూలు జిల్లా ఓర్వకల్లో 2,621 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక తెలంగాణ జహీరాబాద్‌లో 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేలా సమావేశంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. #WATCH | After the cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "...Cabinet today approved 12 Industrial Smart Cities under National Industrial Corridor Development Programme. The government will invest Rs 28,602 crore for this project..." pic.twitter.com/KxNYqNZ5dT— ANI (@ANI) August 28, 2024 -
ఇలా ఉంటే .. అవార్డులెలా వస్తాయి..
పేరుకు స్మార్ట్ సిటీ.. కానీ పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం. అందుకేనేమో.. ఇటీవల పారిశుద్ధ్య విభాగంలో ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డ్స్–2022లో వరంగల్ నగరం అడ్రస్ గల్లంతైంది. పారిశుద్ధ్య విభాగంలో చేపట్టిన సంస్కరణల్లో నగరం ఫెయిల్ కావడంతో అవార్డు దక్కకుండా పోయింది. ఇందుకు నిదర్శనమే ఇలాంటి దృశ్యాలు. వరంగల్ రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద మురుగు నీరు రోజుల తరబడి నిలిచి తీవ్ర దుర్గంధం వెలువడుతూ దోమలు, ఈగలు, పందులకు ఆవాసంగా మారింది. కమిషనర్ గారూ దీనివైపు కూడా ఒకసారి చూడండి అంటూ నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, వరంగల్ -
విశాఖ సిగలో కలికితురాయి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరానికి ఐకానిక్‌గా నిలిచే భవన నిర్మాణానికి గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ (జీవీఎస్సీసీఎల్) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే నగరంలో వివిధ ప్రాంతాల్లో సరికొత్తగా రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు సాంకేతిక సహాయంతో ప్రజలకు సేవలందిస్తున్న స్మార్ట్ సిటీ కార్పొరేషన్.. మరో అడుగు ముందుకేసింది. ఇందుకోసం సంపత్ వినాయక రోడ్డు మార్గంలో ఆశీలమెట్ట ప్రాంతంలో జీవీఎంసీకి చెందిన 2.7 ఎకరాలను నగర అభివృద్ధికి చిహ్నంగా(ఐకానిక్) మార్చేందుకు ప్రతిపాదనలు ఆహా్వనించింది. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయంపై ఈ నెల 12లోగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తుల(ఈవోఐ)ను కోరింది. మొత్తం 2.7 ఎకరాల్లో ఏకంగా 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్, హోటల్ టవర్‌తో పాటు రిక్రియేషన్ సెంటర్ అభివృద్ధి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తం రూ.265 కోట్లతో ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే విషయాన్ని పేర్కొంటూ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో.. ఆశీలమెట్ట.. నగరంలో వాణిజ్య ప్రాంతం. ఇక్కడ జీవీఎంసీకి చెందిన 2.7 ఎకరాల స్థలం ఉంది. ఈ ప్రాంతంలో 6.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అనువుగా ఉంది. 2.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో వాణిజ్య సముదాయంతో పాటు మాల్, మల్టీప్లెక్స్, హోటల్ టవర్, అర్బన్ రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలమని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే ప్రతిపాదనలతో సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను సమర్పించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత వచ్చే ఆదాయంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 33 ఏళ్ల పాటు లీజు పద్ధతిలో ఈ భూమిని కేటాయించేందుకు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిర్ణయించింది. దీనిని సబ్లీజుకు ఇవ్వడం కానీ, స్థలాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం కానీ కుదరదని స్పష్టం చేసింది. డీఎఫ్బీవోటీ పద్ధతిలో..! వాణిజ్యానికి అనువుగా ఉండే ఈ ప్రాంతంలో మొత్తం 2.7 ఎకరాల్లో వాణిజ్య భవనాలను నిర్మించాల్సి ఉంటుందని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ స్పష్టం చేస్తోంది. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే ఈ భూమిలో వాణిజ్య భవనాల ద్వారా వచ్చే ఆదాయంలో జీవీఎంసీకి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. వాటా ఇచ్చే శాతంతో పాటు ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకుని సంస్థ ఎంపిక ఉండనుంది. అంతేకాకుండా స్థలాన్ని కేవలం లీజు పద్ధతిలో 33 ఏళ్ల పాటు అప్పగించనున్నారు. డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీఎఫ్బీవోటీ) పద్ధతిలో చివరకు 33 ఏళ్ల తర్వాత తిరిగి స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు అప్పగించాల్సి ఉంటుంది. దీని అభివృద్దికి సుమారు రూ.265 కోట్ల మేర వ్యయం అవసరమవుతుందని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా తమ ప్రతిపాదనలతో ఆయా సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చేందుకు ఈ నెల 12వ తేదీ నాటికి ఈవోఐలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన అనంతరం.. ఒక మంచి ప్రతిపాదనను ఓకే చేసి సంస్థ ఎంపిక ప్రక్రియ తర్వాత నిర్మాణాలు చేపట్టనున్నారు. రెండేళ్లలోనే ఐకానిక్ భవనం అందుబాటులోకి తీసుకురావాలన్నదే అధికారుల లక్ష్యంగా కనిపిస్తోంది. -
ఎన్నెన్నో ‘ఏఐ’ సేవలు.. మనిషి జీవితంలో ఊహించని మార్పులు
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) సమాచార సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో మనిషి జీవితంలో ఊహించని మార్పులు వస్తున్నాయి. ఇన్నాళ్లూ మనకు అందని చందమామలు నట్టింట దిగుతున్నాయి. చక్రం కనిపెట్టడంతో జీవన గమనంలో పెరిగిన వేగం పారిశ్రామిక విప్లవంతో ఎన్నో సౌకర్యాలను అందించింది. ఊహల్లో మాత్రమే సాధ్యమయ్యే అంశాలు ఇప్పుడు మనిషికి చిటికెలో అమరుతున్నాయి. మన రోజువారీ జీవితాన్ని మలుపు తిప్పుతున్న సరికొత్త పరిజ్ఞానం ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’(ఐవోటీ) కాగా దానికి దన్నుగా నిలుస్తున్న శక్తి ‘కృత్రిమ మేధ’(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). మన ఫిట్నెస్ స్థాయిని చూపించడం మొదలు పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని తారస్థాయికి తీసుకెళ్లడం వరకు ఏఐ, ఐవోటీ మేలు కలయికతో మన కళ్లెదుటే ఆవిష్కృతమవుతున్నాయి. అద్భుత భవిష్యత్‌కు బాట ఎంతోదూరంలో లేదని అర్థమవుతోంది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 వేల కోట్ల ఉపకరణాలు (డివైస్) ఇంటర్నెట్కు అనుసంధానమై ఉంటాయని అంచనా. ఇవి మన ఆన్లైన్ కార్యకలాపాలను సేకరించడం, సమాచారం పరస్పరం మార్చుకోవడం, ఏఐ ద్వారా ఇచ్చే కమాండ్స్‌ను ప్రాసెస్ చేస్తాయి. ఇంటర్నెట్ అనుసంధానానికి శక్తిని, యుక్తిని ఏఐ అందిస్తోంది. వేరియబుల్స్ (ధరించే ఉపకరణాలు) స్మార్ట్‌వాచ్ లాంటి వేరియబుల్స్ నిరంతరాయంగా మనిషి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను ట్రాక్ చేయగలవు. హార్ట్‌బీట్, ఆక్సిజన్ లెవల్, వేస్తున్న అడుగులు, ఖర్చవుతున్న శక్తి, నిద్రలో నాణ్యత.. ఇవన్నీ రికార్డు చేయగలవు. మధుమేహాన్ని కచ్చితంగా అంచనా వేసే డివైస్‌లు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. గంట గంటకూ షుగర్ లెవల్‌ను రికార్డు చేస్తున్నాయి. వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఇది దోహదం చేస్తోంది. మన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు వ్యక్తిగత వైద్యులకు చేరవేయడంతో పాటు స్ట్రోక్ లాంటి ప్రమాదాలను ముందుగా హెచ్చరించే పరిజ్ఞానం త్వరలో సాకారం కానుంది. స్పోర్ట్స్, ఫిట్‌నెస్‌కు కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది. టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ ‘గాట్నర్’ అంచనా ప్రకారం ప్రపంచ వేరియబుల్ డివైస్ మార్కెట్ వచ్చే రెండేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుంది. స్మార్ట్ హోమ్ మనం ఇచ్చే వాయిస్ కమాండ్‌కు ఇంట్లో వస్తువులు ప్రతిస్పందించడం గతంలో సైన్స్ ఫిక్షన్‌కు పరిమితం. ఇప్పుడది వాస్తవం. ఇంటి యజమాని అవసరాలు, అలవాట్లను గుర్తెరిగి ప్రవ ర్తించే డివైస్లతో ఇంటిని నింపేయడం సమీప భవిష్యత్‌లో సాకారమయ్యే విషయమే. ‘అలెక్సా’ ఇప్పటికే మన నట్టింట్లోకి వచ్చేసి వాయిస్ కమాండ్‌కు ప్రతిస్పందిస్తుంది. మనుషుల వ్యక్తిగత రక్షణ, ఇంటి భద్రతకు హెచ్చరికలను సంబంధిత వ్యవస్థలు/వ్యక్తులకు చేరవేసే టెక్నాలజీ కూడా రానుంది. స్మార్ట్‌హోమ్ గ్లోబల్ మార్కెట్ వచ్చే రెండేళ్లలో 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని ‘గాట్నర్’ అంచనా. స్మార్ట్ సిటీ ఇది పట్టణీకరణ యుగం. నగరా లకు వలసలు పెద్ద ఎత్తున పెరుగు తున్నాయి. పట్టణాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన, భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ఇంధన సామర్థ్యం వృద్ధి.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల ముందున్న సవాళ్లు. ఢిల్లీలో ట్రాఫిక్ మెరుగైన నియంత్రణకు ‘ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా రియల్‌టైమ్‌లో నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. ఇందులో వాడుతున్నది కృత్రిమ మేధస్సే. స్మార్ట్ ఇండస్ట్రీ మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి మైనింగ్ వరకు.. ప్రతి పరిశ్రమలో సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచడానికి, మానవ తప్పిదాలను పూర్తిగా నివారించడానికి ఏఐ ఉపయోగపడుతుంది. పరిశ్రమల్లో డిజిటల్ రూపాంతరీకరణ ఇప్పటికే మొదలైంది. వచ్చే రెండు మూడేళ్లలో 80 శాతం పరిశ్రమల్లో ఏఐ వినియోగం మొదలవుతుందని అంచనా. రియల్ టైమ్ డేటా విశ్లేషణ నుంచి సప్లైచైన్ సెన్సార్ల వరకు పారిశ్రామిక రంగంలో ‘ఖరీదైన తప్పుల’ను నివారించడానికి ఏఐ దోహదం చేస్తుంది. రవాణా డ్రైవర్ అవసరంలేని వాహనాల రూపకల్పనకు పునాది వేసింది కృత్రిమ మేధ. మనిషి తరహాలో ఆలోచనను ప్రాసెస్ చేసి నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం చేస్తున్న పనులను ఏఐ ద్వారా ఉపకరణాలు చేసేస్తున్నాయి. అటానమస్ వాహనాలు మాత్రమే రోడ్డు మీద కనిపించే రోజు సమీప భవిష్యత్‌లో ఉంది. -
ఎడారిలో స్మార్ట్ సిటీ... ఊహకందని మాయం ప్రపంచం...
ఊహకందని మాయం ప్రపంచం వంటివి టీవీలోనూ లేదా కార్టూన్ ఛానల్స్‌లో చూస్తుంటాం. అందులో ఎగిరే కార్లు, ఆకాశంలోనే ఉండే ఎలివేటర్లు తదితర మాయలోకం కనిపిసిస్తుంది. ఐతే అదంతా గ్రాఫిక్స్ మాయాజాలమే తప్ప నిజజీవితంతో సాధ్యం కాదు. ఇది సాధ్యమే అంటూ చేసి చూపిస్తున్నారు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్. వివరాల్లోకెళ్తే....సౌదీ అరేబియాలో పర్వత పర్యాటకాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఉద్దేశించిన ఒక ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్లు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2017లోనే ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఊహకందని ఒక సరి కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం బెల్జియం పరిమాణంలో ఉన్న ఎడారిని ఒక అద్భుతమైన సిటీ లా మారుస్తుందన్నారు. అంతేకాదు నియోమ్ అని పిలిచే ఒక అత్యద్భుతమైన హైటెక్ సిటీని రూపొందిస్తుంది. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను మార్చే లక్ష్యంతో దాదాపు రూ.40 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తోంది. ఈ ఫ్యూచరిస్టిక్ మెగాసిటీ న్యూయార్క్ నగరం కంటే 33 రెట్లు ఎక్కువ అని చెబుతోంది. ఇది సౌదీలోని అకాబా గల్ఫ్, ఎర్ర సముద్ర తీరప్రాంతం వెంబడి 26 వేల కి.మీ చదరపు విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, జురాసిక్ పార్క్, ఉద్యానవనం, ఒక పెద్ద కృత్రిమ చంద్రుడు తదితరాలు ఆ నగరానికి ప్రతిష్టాత్మకమైన విషయాలు. అంతేకాదు ఇక్కడ ఆకాశంలో ఏదో విధంగా ఎగిరే ఎలివేటర్లు, అర్బన్ స్పేస్‌పోర్ట్, డబుల్ హెలిక్స్ ఆకారంలో ఉన్న భవంతులు, ఫాల్కన్ రెక్కలు వికసించిన పువ్వులు తదితరాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా క్లీన్ ఎనర్జీ డెస్టినేషన్(సరళ రేలో విస్తరరించిన నగరం)ను కూడా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం సుమారు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తోంది. అంతేకాదు పురాతన ట్రాయ్ నగరం, దాదాపు రెండు మైళ్ల మానవ నిర్మిత సరస్సు, అత్యాధునిక సాంకేతికత కూడిన వర్టికల్ గ్రామం, వినోదం, అతిథి సౌకర్యాలతో అత్యంత విలాసంగా ఉంటుందని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మా పేర్కొన్నారు. 20030 నాటికి సుమారు 7 లక్షల మంది సందర్శకులను 7 వేల మంది శాశ్వత నివాసితులను ఆకర్షిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. His Royal Highness Mohammed bin Salman, Crown Prince and Chairman of the NEOM Company Board of Directors, has announced the establishment of #TROJENA – the new global destination for mountain tourism, part of #NEOM's plan to support and develop the tourism sector in the region. pic.twitter.com/ZNa4JsamKy — NEOM (@NEOM) March 3, 2022 (చదవండి: ఆ తల్లులకు క్షమాపణలు చెప్పాల్సిందే : మానవహక్కుల ప్యానెల్) -
Chandrababu: ఒప్పందాలంటూ అమెరికన్లతో ఫొటోలు.. 20 సంస్థల్లో ఒక్కటొస్తే ఒట్టు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు తీరు గురివింద గింజను గుర్తుచేస్తోంది.. గత టీడీపీ పాలనలో పెట్టుబడుల సదస్సుల పేరుతో లక్షల కోట్లు తీసుకొచ్చామని బాకా కొట్టి బూటకపు ప్రచారం చేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వస్తున్న పరిశ్రమల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. విశాఖ వేదికగా నాలుగేళ్లపాటు నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల ద్వారా నగరాభివృద్ధికి 20 అమెరికా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు చంద్రబాబు ప్రకటించినా.. ఒక్క కంపెనీ సహకారం తప్ప.. మిగిలిన ఎంవోయూలన్నీ.. డొల్లవేనని స్పష్టమవుతున్నాయి. విశాఖపట్నం స్మార్ట్ సిటీ అభివృద్ధికి ఆయా కంపెనీలు పెట్టిన వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి వెళ్లిపోయాయన్నది హాస్యాస్పద ప్రశ్నగా మారిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన సమయంలో ఏటా విశాఖలో పెట్టుబడుల సదస్సు పేరుతో నాలుగేళ్ల పాటు అట్టహాసం చేశారు. రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అనేక సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని ప్రగల్భాలు పలికారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పిన కాకి లెక్కల ప్రకారం 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్లలో ఏడాదికి రూ.14 లక్షల చొప్పున గణిస్తే.. రమారమి రూ.60 లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల వరద ఆంధ్రప్రదేశ్‌ని ముంచెత్తి ఉండాలి. వాస్తవాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో అందరికీ తెలిసిందే. పైగా పెట్టుబడుల సదస్సుల పేరుతో రూ.120 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు. 20 అమెరికా సంస్థల్లో ఒక్కటైనా..? దేశంలోనే నంబర్ వన్ స్మార్ట్‌సిటీగా విశాఖను తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమంటూ 2016లో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు బీరాలు పలికారు. అమెరికా అందించే ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం, ఆలోచనలను సమర్థంగా అమలు చేసేందుకు భాగస్వామ్య సదస్సులకు హాజరైన అమెరికా బృందంతో చర్చించినట్టు ప్రకటించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా తన పిలుపు మేరకు వైజాగ్‌లో 4వ పారిశ్రామిక విప్లవం తీసుకొస్తోందని మీడియా సమక్షంలో హడావిడి చేశారు. విశాఖపట్నం స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు అమెరికాకు చెందిన 20 కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్లుగా అమెరికన్లతో ఫొటోలు దిగారు. ఇందులో ఒక్క సంస్థ కూడా ఇప్పటి వరకూ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకపోవడం శోచనీయం. చదవండి: (CM YS Jagan: శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఇలా..) అయికాం సంస్థది సహకారమే.. యూఎస్ ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీతో ఎంవోయూ చేస్తున్నట్లుగా చంద్రబాబు అండ్ కో సంతకాల కోసం ఫోజులిచ్చి.. మీడియాకు విడుదల చేశారు. అమెరికా ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ తరపున స్మార్ట్‌సిటీగా వైజాగ్‌ని అభివృద్ధి చేసేందుకు రూ.వేల కోట్లు నిధులు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. అమెరికాకు చెందిన అయికాం, కేపీఎంజీ, ఐబీఎం కంపెనీలు విశాఖ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రణాళికను రూపొందిస్తాయని సదస్సులో ప్రకటించారు. ఈ ప్రణాళికల్ని అదే ఏడాది(2016)లోనే అమల్లోకి తెస్తామంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. ఇ–గవర్నెస్, కాలుష్య నియంత్రణ, భద్రత, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాల్లో విశాఖను స్మార్ట్‌సిటీగా రూపుదిద్దే బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 2019 వరకూ ఒక్క రూపాయీ ఏ ఒక్క అమెరికా సంస్థ పెట్టుబడి పెట్టలేదు. ఎంవోయూ చేసుకున్న తర్వాత.. ఏ ఒక్క సంస్థతోనూ చర్చించినట్లు దాఖలాలు లేవు. ఒక్క అయికాం సంస్థ ప్రతినిధులు మాత్రం పలుమార్లు విశాఖ నగరానికి వచ్చి.. జీవీఎంసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. స్మార్ట్‌సిటీ అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలు అందించారే తప్ప.. ఒక్క రూపాయీ విదిలించలేదు. ఇలా.. 20 అమెరికా కంపెనీలు వైజాగ్‌ని వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాయంటూ చంద్రబాబు నమ్మించి మోసం చేశారని నగర ప్రజలతోపాటు రాజకీయ పార్టీలు కూడా ఎద్దేవా చేస్తున్నాయి. -
AP: ఆధ్యాత్మిక నగర అమ్ములపొదిలో మరో ఆణిముత్యం
ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న తిరుపతి నగరాన్ని అధికారులు స్మార్ట్‌సిటీగా పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో నగర రూపురేఖలు మార్చేలా పక్కా ప్రణాళికలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. తిరుపతిలోని వినాయకసాగర్ ఆధునీకరణతో సరికొత్త హంగులతో సందర్శన కేంద్రం అందుబాటులోకి రానుంది. కళ్లు జిగేల్మనిపించే అత్యాధునిక విద్యుత్ వెలుగులు, పచ్చదనం పరవశించే గార్డెన్లు, చుట్టూ నీటి అలల మధ్య అందమైన ఐర్లాండ్, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్‌జిమ్, యోగా సెంటర్లు, ఖరీదైన పూల మొక్కలతో గ్లో గార్డెన్, సాగర్‌లో చక్కర్లు కొట్టే బోటింగ్, ఘుమఘుమలాడే వంటకాలతో ప్రత్యేక రెస్టారెంట్, పిల్లలను ఆకట్టుకునే బొమ్మలతో వినాయకసాగర్ కొత్త రూపును సంతరించుకోనుంది. 2022 ఏప్రిల్ నాటికి లేక్ వ్యూను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శరవేగంగా ఆధునీకరణ పనులు సాగుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, తిరుపతి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న తిరుపతిలో సరైన విహార స్థలం లేకపోవడం నగర వాసుల్ని వేధించే అంశం. రోజుకు లక్షలాది మంది యాత్రికులు వచ్చే తిరుపతిలో పర్యాటక స్థలాలు లేకపోవడం వల్ల శ్రీవారి దర్శనానంతరం భక్తులు మరో ప్రత్యామ్నాయం లేక నేరుగా తిరుగు ప్రయాణమవుతున్నారు. యాత్రికులు తిరుపతిలో ఒకటిరెండు రోజులు పర్యటించే అవకాశం లేకపోవడం వల్ల వ్యాపార, వాణిజ్య పరంగా తీవ్ర నష్టమని గుర్తించారు. అలానే సెలవు రోజుల్లో స్థానికులు కుటుంబ సమేతంగా కొంతసేపు గడిపే సరైన సందర్శనా స్థలాలు లేకపోవడం శాపంగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష 2020 జూలై 4వ తేదీన వినాయకసాగర్ ట్యాంక్‌బండ్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. తిరుపతి నగర ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని వినాయకసాగర్‌ను అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శరవేగంగా చర్యలు చేపట్టారు. అత్యాధునిక డిజైన్లతో వినాయకసాగర్‌ను ప్రత్యేక సందర్శనా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దేశంలోని పలు లేక్‌వ్యూ డిజైన్లను పరిశీలించి అందులో అత్యుత్తమ్మ డిజైన్లను ఎంపిక చేశారు. వాటికి తుదిమెరుగులు దిద్ది మరింత మార్పులతో అభివృద్ధి పనులు చేపట్టారు. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో వివిధ ఆకృతులతో, సౌకర్యాలతో ట్యాంక్‌బండ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వినాయకసాగర్ ప్రాముఖ్యతను చాటేలా ముఖ ద్వారం వద్ద భారీ వినాయక ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. కట్ట పొడవునా కిడ్స్పార్కు, ఓపెన్ గ్యాలరీలు, యోగాసెంటర్, లాన్, గ్రీనరీ, గ్లో గార్డెన్‌ను వేర్వేరుగా అభివృద్ధి చేస్తున్నారు. సాయంత్రం వేళ ఆహ్లాదాన్ని పెంచే లా ఆధునిక హంగులతో కూడిన విద్యుత్ వెలుగులు వెదజిమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఐలాండ్ వినాయకసాగర్‌లో ఐలాండ్‌ను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నారు. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఐలాండ్ కొత్త లోకంలో సంచరిస్తున్న అనుభూతిని కలిగించేలా ఉండబోతోంది. ఇక్కడే బర్త్‌డే వంటి పార్టీలను జరుపుకునేందుకు అద్దెకు ఇవ్వనున్నారు. ఎల్ఈడీ భారీ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేస్తున్నారు. బోటింగ్ పాయింట్ సాగర్‌లో పడమట వైపు తక్కువ ఎత్తులో నీరు ఉన్న ప్రదేశంలో పది బోట్లు విహరించేలా కౌంటర్‌ను నిర్మిస్తున్నారు. కుటుంబ సమేతంగా బోటింగ్‌లో వెళ్లి సేద తీరేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. స్విమ్మింగ్‌ఫూల్, మూడు అంతస్తుల రెస్టారెంట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. వాకింగ్ ట్రాక్ వినాయకసాగర్ కట్టపై 2.5 కి.మీల పొడవుతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను వేర్వేరుగా నిర్మిస్తున్నారు. వాకింగ్ ట్రాక్ నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. నిపుణుల సలహా మేరకు వాకింగ్‌ట్రాక్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఒకసారి 60 మందికి యోగాను నేర్పించేలా ఓపెన్ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు. అత్యవసరమైతే మరో గేటు అందుబాటులో ఉండేలా నిర్మిస్తున్నారు. పిల్లల ప్లే గ్రౌండ్లో రబ్బర్ ప్లోరింగ్ నిర్మిస్తున్నారు. నిమజ్జనానికి వినాయక నిమజ్జనానికి ప్రత్యేకంగా ఒకకొలను తీర్చిదిద్దుతున్నారు. ఐదు అడుగుల లోపు ఉన్న వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఆ«ధునిక సదుపాయాలతో కొలను తీర్చిదిద్దుతున్నారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు అవసరమైన గ్యాలరీని నిర్మిస్తున్నారు. 200 మంది ఒకేసారి సాగర్ వ్యూ పాయింట్‌ను కట్ట మధ్యలో ఉండేలా శరవేగంగా నిర్మాణాలు సాగుతున్నాయి. తిరుపతికి ప్రత్యేక ఆకర్షణ వినాయకసాగర్ తిరుపతి నగరానికి తలమానికంగా నిలిచేలా తీర్చిదిద్దుతున్న స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేస్తున్న ఈ లేక్‌వ్యూ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్థానికులు, యాత్రికులు రోజంతా ఒకేచోట గడిపేంత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. పిల్లల ప్రత్యేక ఆటవిడుపు కేంద్రాలు, బోటింగ్, స్విమ్మింగ్, ఐలాండ్ వంటివి కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఏప్రిల్ నాటికి సందర్శకులను అనుమతించేలా శరవేగంగా పనులు చేపట్టాం. 80 శాతం పనులు పూర్తయ్యాయి. – పీఎస్ గిరీష, కమిషనర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాగర్ విస్తీర్ణం- 60 ఎకరాలు సాగర్ అభివృద్ధికి చేస్తున్న ఖర్చు- రూ. 21.26 కోట్లు ఐలాండ్ ఏర్పాటుకు ఖర్చు - రూ.89 లక్షలు స్విమ్మింగ్‌ఫూల్, రెస్టారెంట్‌కు రూ.4 కోట్లు మొత్తం ఖర్చు 26.15 కోట్లు -
కాకినాడ మళ్లీ కేక.. అరుదైన గుర్తింపు..
కాకినాడ(తూర్పుగోదావరి): స్మార్ట్‌సిటీ కాకినాడ మరో అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే కార్యకలాపాల నిర్వహణకు గాను ఈ గుర్తింపు దక్కింది. వివిధ వర్గాల ప్రజల మధ్య మంచి వాతావరణాన్ని కల్పించడం, పిల్లల్లో పోటీతత్వాన్నిపెంచడం, సామాజిక అంశాలపై యువతలో చైతన్యం పెంపొందించడం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి కాకినాడ స్మార్ట్‌సిటీకి మంగళవారం సమాచారం అందింది. చదవండి: మసాజ్ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. కళ్లు బైర్లుకమ్మే అంశాలు ఈ ప్రక్రియకు దేశంలోని పలు నగరాలను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క కాకినాడకు మాత్రమే చోటు లభించింది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల తినుబండారాలను హైజనిక్‌గా ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం, అజాదికా అమృత్ మహోత్సవ్ పేరుతో విద్యార్థుల మధ్యపోటీ పెట్టడం, సైకత శిల్పాల తయారీ, డ్రాయింగ్ పోటీలు సహా అనేక కార్యక్రమాల నిర్వహణ ద్వారా కాకినాడ స్మార్ట్‌సిటీ ప్రత్యేక గుర్తింపును సాధించగలిగింది. ఈ తరహా కార్యకలాపాలను నిర్వహించి అన్ని వర్గాల ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచేలా చేసిన కృషికి ఈ గౌరవాన్ని దక్కించుకోగలిగింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంమరోసారి కాకినాడ స్మార్ట్‌సిటీని మంచిస్థానంలో నిలబెట్టిందని కమిషనర్ స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్ చెప్పారు. -
దుబాయ్ దూకుడు.. సాహసోపేత అడుగులు
Dubai Sucessfully Deployed AI Tech In Govt Sectors: ఆయిల్ కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నగరం దుబాయ్.. గత ఏడాది కాలంగా అరుదైన ప్రయోగాలతో ప్రపంచాన్ని అచ్చెరువుకు గురి చేస్తోంది. ఆవిష్కరణల భాండాగారంగా ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోంది. విప్లవాత్మక సంస్కరణలతో దూసుకుపోతున్న దుబాయ్.. ఇప్పుడు సాహసోపేతమైన అడుగులకు సైతం వెనకాడడం లేదు. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ఈ టెక్నాలజీ అవసరం దాదాపు అన్ని రంగాల్లో అవసరం పడుతోంది. మనకు తెలియకుండానే వాడేస్తున్నాం కూడా!. ప్రైవేట్ రంగాల్లో దాదాపు ఏఐ సహకారం లేకుండా ముందుకు సాగడం లేదు. అయితే ప్రభుత్వ రంగాలు మాత్రం పూర్తిస్థాయిలో ఏఐని ఉపయోగించుకునేందుకు తటపటాయిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం.. భద్రత. ఈ తరుణంలో దుబాయ్ సర్కార్ ఏమాత్రం బెణుకు ప్రదర్శించకుండా ముందుకు సాగుతోంది. ప్రమాదం లేకపోలేదు AI టెక్నాలజీ వాడకం ఇప్పుడు ఎంత ఉధృతంగా నడుస్తోందో.. సమీప-కాలంలో అంతే ఆందోళనను రేకెత్తిస్తోంది. గోప్యత, పారదర్శకత, అసమానత, భద్రత.. ఈ అంశాలు పెను సవాల్‌గా మారాయి. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో పుట్టుకొస్తున్న బెదిరింపులు, ఇతర పోకడలను సైతం గుర్తించింది CSER పరిశోధన. అంతేకాదు AI, డిజిటలైజేషన్, న్యూక్లియర్ వెపన్స్ సిస్టమ్‌ల తరపున ఎదురయ్యే ముప్పును సైతం ప్రస్తావించింది. ప్రధానమైన అంశాలు కావడం వల్లే అమెరికా లాంటి అగ్రరాజ్యాలు సైతం ఏఐను రక్షణ రంగంలో అన్వయింపజేసేందుకు ముందు వెనకా ఆలోచిస్తుంటుంది. అయితే.. ఎలా అధిగమిస్తోందంటే.. వనరులను, మేధస్సును వాడుకోవడంలో దుబాయ్ నిజంగానే అద్భుతాలు చేస్తోంది. అసలే టెక్నాలజీ కొత్తైన ఈ సిటీ.. అవసరం మేర మాత్రమే ఏఐను ఉపయోగించుకోవడంపై ఫోకస్ చేసింది. ఆరోగ్యభద్రత, విద్య, రవాణా, ప్రజా భద్రత విషయంలో ఏఐ సంబంధిత టెక్నాలజీనే ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టింది. ప్రజల దైనందిన జీవితంలోకి జొప్పించి.. అలవాటు చేయిస్తోంది. స్మార్ట్దుబాయ్ ఆఫీస్‌ల సహకారంతో ఎన్నో వ్యూహాల నడుమ కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఏఐ, బ్లాక్కెయిన్ ద్వారా ప్రభుత్వ సేవల్ని అందించడమే కాకుండా.. జనాల ఫీడ్‌బ్యాక్‌ను సైతం తీసుకుంటోంది. తద్వారా ఎదురయ్యే పరిణామాల్ని ఎదుర్కొనేందుకు పటిష్ట వ్యవస్థను సిద్ధం చేసుకుంటోంది. వీటికి తోడు ఎథికల్ టూల్ కిట్స్ ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తోంది. హైలెవల్ సర్వీసులు కావడంతో ఏఐ అల్గారిథమ్ పొరపచ్చాలతో తప్పులు దొర్లే అవకాశమూ లేకపోలేదు. ఇందుకోసం భారీగా ఇంజినీర్లను నియమించుకుంటోంది కూడా. 2030 నాటికి ఏఐ సంబంధిత వ్యవస్థ కోసం 320 బిలియన్ డాలర్ల ఖర్చు పెట్టే యోచనలో ఉన్నాయి మిడిల్ ఈస్ట్ దేశాలు. ఈ అవకాశం అందిపుచ్చుకోవాలనే ఆలోచనలో ఉంది దుబాయ్ మహానగరం. దుబాయ్ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. కానీ, ఆనందం అంటే కేవలం ఎక్కువ డబ్బును కలిగి ఉండడం కాదు. గ్లోబలైజ్డ్ వరల్డ్‌లో కమ్యూనిటీతో ఎలా పొత్తు పెట్టుకోవాలి? సామాజిక అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎలా పని చేయాలి? అనే విషయాలపైనే దుబాయ్ ఫోకస్ పెట్టింది. అలా దుబాయ్.. ఈ భూమిపై అత్యంత సంతోషకరమైన నగరంగా స్థానం సంపాదించుకునే మార్గం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోందని ఆర్థిక మేధావులు ఒక అంచనాకి వేస్తున్నారు. క్లిక్ చేయండి: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్ -
స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్న విశాఖ
-
‘క్రిస్ సిటీ’ తొలి దశకు టెండర్లు
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (క్రిస్ సిటీ) తొలి దశ పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. పరిశ్రమల ఏర్పాటుతో పాటు నివాసయోగ్యంగా ఉండేలా నిర్మిస్తున్న క్రిస్ సిటీలో రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, మురుగు, వరద నీరు పారుదల, మురుగునీటి శుద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.1,190 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ 36 నెలల్లో పనులను పూర్తి చేయాలన్న నిబంధన విధించింది. అలాగే పనులు పూర్తయిన తర్వాత నాలుగేళ్ల పాటు క్రిస్ సిటీ నిర్వహణ బాధ్యతలను కూడా చూడాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు నవంబర్ 4 మధ్యాహ్నం 3 గంటల్లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. సీబీఐసీ కారిడార్‌లో భాగంగా మొత్తం 12,944 ఎకరాల్లో కృష్ణపట్నం నోడ్‌ను అభివృద్ధి చేయనుండగా తొలిదశ కింద 2,134 ఎకరాలను అభివృద్ధి చేయడానికి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్ డిట్) ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2,139.44 కోట్లను నిక్‌డిట్ కేటాయించింది. ఈ క్రిస్ సిటీ నిర్మాణం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని అంచనా. -
వరంగల్: గంటలపాటు పొట్ట ఉగ్గబట్టుకోవాల్సిన దుస్థితి
చారిత్రక, వారసత్వ సంపద, వైద్య, విద్య, సాంస్కృతిక రెండో రాజధాని.. ఘన కీర్తి కలిగిన ఓరుగల్లు స్మార్ట్‌సిటీలో చెబితే ఇంతేనా అనిపించినా వాస్తవంగా ఇదో పెద్ద సమస్య. ఆదేనండి కనీస సదుపాయమైన మూత్రశాలలు లేకపోవడం. మూత్ర విసర్జన కోసం పురుషులు రహదారుల వెంబడి అటు ఇటు తిరుగుతూ ఎక్కడ మరుగు దొరికితే అక్కడే కానిచ్చేస్తున్నారు. మహిళల పరిస్థితి దయనీయం. బయటికి వెళ్లిన వారు మరుగుదొడ్డి దొరికితేనో లేక తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు గంటలపాటు పొట్ట ఉగ్గబట్టుకోవాల్సిన పరిస్థితి. – వరంగల్ అర్బన్ చాటు దొరికితే చాలు.... పురుషులు మూత్రశాలలు దొరకక గత్యంతరం లేక చాటు దొరికితే చాలు కళ్లు మూసుకొని కానిచ్చేస్తున్నారు. ఆ సమయంలో మహిళలు సిగ్గుతో తలవంచుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. నగరంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోనూ చాలా వాటికి మరుగుదొడ్లు కనిపించడం లేదు. గ్రేటర్ వరంగల్ నిబంధనల ప్రకారం ప్రతి అంతస్తుకు సాముహిక మూత్రశాల ఉండాలి.. అలా ఉంటేనే అనుమతులు ఇస్తారు. కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు. రహదారుల్లో అక్కడక్కడ, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, కూరగాయల, పండ్ల, మార్కెట్లలో పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం. పది లక్షల యాబై వేల జనాభా ఉండగా, నిత్యం చుట్టుపక్కల జిల్లాలనుంచి 2లక్షల పైచిలుకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మహా నగరంలో కనీస సదుపాయాలు కల్పించడంలో గ్రేటర్ వరంగల్ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్‌లో భాగంగా వరంగల్ నగరం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధించింది. కానీ బహిరంగ మూత్ర విసర్జనను నివారించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బల్దియా బదిలీ కమిషనర్లు వీపీ గౌతమ్, పమేలా సత్పతిలు ప్రత్యేక చొరవ తీసుకొని నగరంలో ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డి ఉండే విధంగా చేపట్టిన చర్యల్లో ఇప్పటివరకు 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో 888 మంది మరుగుదొడ్డి ఉపయోగించుకునేలా ప్రజా, కమ్యూనిటీ, లగ్జరీలు, కేఫ్‌లను నిర్మించారు. కొన్ని మరుగుదొడ్లలోనే మూత్రశాలలు నిర్మించారు. పబ్లిక్ టాయిలెట్లు ప్రజలు రద్దీగా ఉన్న రహదారుల్లో లేవు. స్థల లేమితో బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, అక్కడక్కడ రహదారుల్లో నిర్మించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, కాలనీల్లో, ప్రధాన రహదారుల్లో మూత్రశాలలు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. మూత్రవిసర్జనకు డబ్బులు వసూలు మహా నగరంలో పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. వాటిలో చాలామేరకు మూత్రశాలలు లేవు. పబ్లిక్ టాయిలెట్లలో మూత్రశాల ఉంటే ఉపయోగించినందుకు ఒక్కరినుంచి రూ.3 నుంచి 5 చొప్పన చొప్పన వసూలు చేస్తున్నారు. వాస్తవానికి మూత్రశాల ఉపయోగించినందుకు డబ్బులు తీసుకోకూడదు. కానీ పబ్లిక్ టాయిలెట్ల నిర్వహకులు అడ్డంగా బాదేస్తున్నారు. దీంతో ప్రజలు వాటిలోకి వేళ్లేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఎక్కడైనా ఖాళీ స్థలం, సందు దొరికితే చాలు బహిరంగంగా మూత్ర విసర్జన అనివార్యమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల కిందట ఆస్కీ ఆధ్వర్యంలో మూత్రశాలలపై ప్రణాళికలు రూపొందించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇకనైనా పాలక వర్గం పెద్దలు, అధికారులు బహిరంగ మూత్ర విసర్జనపై కార్యచరణ ప్రణాళిక రూపొందించి విరివిగా మూత్రశాలలు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: ప్రేమించాలని ‘యువతి’ వేధింపులు.. -
యమహా నగరి.. విశాఖ పురి
సాక్షి, విశాఖపట్నం: స్మార్ట్ సిటీగా కొత్త రూపు దిద్దుకుంటున్న విశాఖ.. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడుతోంది. అవార్డులు, ర్యాంకింగ్‌లోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. క్లైమేట్ స్మార్ట్‌సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్‌వర్క్ 2.0 ర్యాకింగ్స్లో మొత్తం 123 నగరాలు పోటీపడగా.. 9 నగరాలకు మాత్రమే 4 స్టార్ రేటింగ్ దక్కగా.. అందులో విశాఖ స్థానం సంపాదించుకుంది. అర్బన్ ప్లానింగ్, గ్రీన్ కవర్ అండ్ బయోడైవర్సిటీ విభాగంతో పాటు వ్యర్థాల నిర్వహణలోనూ సత్తా చాటి ఏకంగా 5 స్టార్ రేటింగ్ సాధించింది. మురుగునీటి నిర్వహణలో వినూత్న పద్ధతుల్ని అవలంబిస్తున్న జీవీఎంసీ.. ఆ విభాగంలో 3 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ సంయుక్తంగా 2019–20 నుంచి స్మార్ట్‌సిటీ ర్యాంకింగ్స్ ప్రకటిస్తున్నారు. పట్టణ ప్రణాళిక, జీవవైవిధ్యం, ఎనర్జీ, గ్రీన్బిల్డింగ్, ఎయిర్‌క్వాలిటీ, వాటర్ మేనేజ్మెంట్, వ్యర్థాల నిర్వహణ మొదలైన అంశాలపై ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. గతేడాది 9వ ర్యాంకు సాధించిన విశాఖ నగరం.. 2020–21లో మాత్రం సత్తా చాటింది. క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్‌వర్క్ 2.0 ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో మొత్తం 9 నగరాలకు 4 స్టార్ రేటింగ్ ఇవ్వగా అందులో విశాఖపట్నం కూడా నిలిచింది. ఇక వివిధ విభాగాల్లో ప్రకటించిన ర్యాంకుల్లో విశాఖ నగరం సత్తా చాటింది. అర్బన్‌ప్లానింగ్, గ్రీన్ కవర్ అండ్ బయోడైవర్సిటీ విభాగంలో ఇండోర్, సూరత్‌తో కలిసి వైజాగ్ 5 స్టార్ రేటింగ్ పంచుకుంది. వ్యర్థాల నిర్వహణ విభాగంలో 5 స్టార్, ఎనర్జీ అండ్ గ్రీన్ బిల్డింగ్స్ విభాగంలో, మొబిలిటీ అండ్ ఎయిర్‌క్వాలిటీ విభాగంలో, మురుగునీటి నిర్వహణలోనూ 3 స్టార్ రేటింగ్ సాధించింది. రెండేళ్ల కాలంలో విశాఖ నగరంలో వచ్చిన వినూత్న మార్పులతో ‘స్టార్ సిటీ’గా రూపాంతరం చెందుతోంది. వ్యర్థాల నిర్వహణలోనూ స్టారే.. జీవీఎంసీ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2018–19లో 23వ ర్యాంక్‌కు పడిపోవడంతో.. పటిష్ట చర్యలకు అమలు చేసింది. బయోమైనింగ్, ఘన వ్యర్థాల నిర్వహణని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. కాపులుప్పాడ డంపింగ్ యార్డులో 20 ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాల్ని 25 ఎకరాల్లో ఆధునిక బయోమైనింగ్ పద్ధతు ల్లో తొలగిస్తున్నారు. అదేవిధంగా చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం చేపడుతోంది. అందుకే ఈ విభాగంలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. పర్యావరణహిత నగరంగా... నగరంలో రెండేళ్లుగా పర్యావరణ పరిరక్షణపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టిసారించింది. సీడ్‌బాల్స్ రూపంలో లక్షకు పైగా విత్తనాలు, 58,456 మొక్కలు నాటింది. దీనికితోడు మియావాకీ చిట్టడవులు, పార్కులు ఏర్పాటు చేయడంతో.. ఈ విభాగంలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. దీని ద్వారా జీవవైవిధ్యానికి జీవీఎంసీ పెద్దపీట వేసింది. ►జీవీఎంసీ విస్తీర్ణం-625.47 చ.కిమీ ►పచ్చదనం పరచుకున్న విస్తీర్ణం 222.53 చ.కిమీ మురుగు నీటిని శుద్ధి చేస్తూ.. నగరంలో ఉత్పన్నమవుతున్న మురుగునీటి వ్యర్థాల నిర్వహణలోనూ జీవీఎంసీ ప్రత్యేక చర్యలు అవలంబిస్తోంది. మురుగునీటిని శుద్ధి చేసేందుకు బయోరెమిడేషన్ పద్ధతుల్ని అవలంబిస్తోంది. ఈ కారణంగా ఈ విభాగంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. ►నగరంలో ఉత్పన్నమవుతున్న మురుగునీరు 78 ఎంఎల్డీ ►సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్(ఎస్టీపీ) 04 ►మినీ ఎస్టీపీలు 13 ►సివరేజ్లైన్ పొడవు 771 కి.మీ స్టార్ రేటింగ్ బాధ్యత పెంచింది స్మార్ట్ సిటీ స్టార్ రేటింగ్స్‌లో విశాఖ నగరం మంచి రేటింగ్ సాధించడం ఆనందంగా ఉంది. నగర ప్రజలకు ఆరోగ్యకరమైన, గౌరవ ప్రదమైన జీవనాన్ని అందించేందుకు జీవీఎంసీ నిరంతరం శ్రమిస్తోంది. వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై మరింత దృష్టిసారిస్తున్నాం. థీమ్‌పార్కులు, మియావాకీ అడవుల నిర్మాణం చేపడుతున్నాం. నరవలో 108 ఎంఎల్డీ ఎస్టీపీ సిద్ధం చేస్తున్నాం. స్టార్ రేటింగ్ జీవీఎంసీ అధికారులపై బాధ్యతని మరింత పెంచింది. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల విషయంలో జీవీఎంసీ రాజీపడటం లేదు. కమిషనర్ సూచనల్ని అనుసరించి.. ప్రాజెక్టుల్ని పూర్తి చేసే విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ప్రధాన దృష్టిసారించాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ గ్రీన్ సిటీగా విశాఖని తీర్చదిద్దుతున్నాం. – వినయ్‌కుమార్, జీవీఎంసీ స్మార్ట్‌సిటీ ఎస్ఈ -
ఫోర్ స్టార్ నగరాలుగా విశాఖ, బెజవాడ
సాక్షి, న్యూఢిల్లీ/విశాఖపట్నం/తిరుపతి తుడా: స్మార్ట్ సిటీల్లో విశాఖపట్నం, విజయవాడ నగరాలకు ఫోర్ స్టార్ రేటింగ్ దక్కింది. క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్‌వర్క్ 2.0 ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం నుంచి ఈ రెండు నగరాలు స్థానం సంపాదించుకున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 120 నగరాలు పోటీపడగా.. 9 నగరాలకు ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇందులో రాష్ట్రం నుంచి విశాఖపట్నం, విజయవాడ నగరాలకు ఫోర్ స్టార్ రేటింగ్ దక్కింది. పట్టణ ప్రణాళిక, జీవ వైవిధ్యం, ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్, ఎయిర్ క్వాలిటీ, వాటర్ మేనేజ్మెంట్, వ్యర్థాల నిర్వహణ మొదలైన అంశాలపై 2019–2020 నుంచి ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. తిరునగరికి ఐదు అవార్డులు స్మార్ట్ తిరుపతి జాతీయ స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్, లివింగ్ సిటీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో తిరుపతి నగరానికి జాతీయ గుర్తింపు లభించింది. సోషల్ యాస్పెక్ట్‌లో తిరుపతి తొలి స్థానం దక్కించుకుంది. అర్బన్ డెవలప్మెంట్లో మూడో స్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి విభాగంలో ఈ స్థానం దక్కింది. శానిటేషన్ విభాగంలో ఇండోర్‌తో కలిపి తిరుపతి తొలి స్థానంలో నిలిచింది. ఎకానమీ అంశంలో బూస్ట్ లోకల్ ఐడెంటిటీ, డిజైన్ స్టూడియోలో ఎకానమీ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. సిటీల విభాగంలో రెండో రౌండ్లో రెండో స్థానంలో నిలిచింది. తిరుపతి నగరం మొత్తం ఐదు జాతీయ అవార్డులను దక్కించుకున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ పి.ఎస్.గిరీష, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ వెల్లడించారు. కాకినాడ, అమరావతి ఇలా.. డాటా మెచ్యూరిటీ అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్ సైకిల్–2 డ్యాష్‌బోర్డు ఫలితాల ప్రకారం 80 పాయింట్లకు గానూ 56 పాయింట్లతో 14 వ స్థానంలో విశాఖపట్నం, 53 పాయింట్లతో కాకినాడ 19వ స్థానంలో, 41 పాయింట్లతో 27వ స్థానంలో అమరావతి, 14 పాయింట్లతో 84వ స్థానంలో తిరుపతి నిలిచాయి. అర్బన్ ప్లానింగ్, గ్రీన్ కవర్లో విశాఖకు ‘ఫైవ్‌స్టార్’ అర్బన్ ప్లానింగ్, గ్రీన్ కవర్ అండ్ బయో డైవర్సిటీ విభాగంలో దేశవ్యాప్తంగా కేవలం 3 నగరాలకు మాత్రమే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇందులోనూ విశాఖపట్నం సత్తా చాటింది. ఇండోర్, సూరత్‌తో కలిసి వైజాగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ పంచుకుంది. వ్యర్థాల నిర్వహణ విభాగంలోనూ విశాఖ సత్తా చాటింది. ఈ విభాగంలోనూ ఫైవ్ స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఎనర్జీ అండ్ గ్రీన్ బిల్డింగ్స్ విభాగంలో త్రీ స్టార్ రేటింగ్‌ని విశాఖ దక్కించుకుంది. మొబిలిటీ అండ్ ఎయిర్ క్వాలిటీ విభాగంలోనూ త్రీ స్టార్ రేటింగ్ సాధించింది. మురుగు నీటి నిర్వహణ విభాగంలో త్రీ స్టార్ రేటింగ్‌లో నిలిచింది. -
తిరుపతి నగరానికి 5 ప్రతిష్టాత్మక అవార్డులు
సాక్షి, తిరుపతి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే స్మార్ట్ సిటీ అవార్డుల కాంటెస్ట్‌లో తిరుపతి నగరానికి ఏకంగా ఐదు అవార్డులు లభించాయి. దేశంలో ఇండోర్, సూరత్ నగరాల తర్వాత ఐదు అవార్డులు దక్కించుకున్న ఏకైక నగరం తిరుపతి కావడం విశేషం. పారిశుద్ధ్యం, ఈ-హెల్త్ విభాగాల్లో ఈ నగరానికి దేశంలోనే మొదటి స్థానం లభించగా.. బెస్ట్ సిటీ, ఎకానమీ విభాగాల్లో రెండో స్థానం.. అర్బన్ ఎన్విరాన్మెంట్ విభాగంలో మూడో స్థానం దక్కింది. మొత్తంగా తిరుపతి నగరానికి ఐదు స్మార్ట్ సిటీ అవార్డులు లభించాయి. చదవండి: 6 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు: సీఎం జగన్ -
వారు మాతృమూర్తులతో సమానం..
సాక్షి, విశాఖ: పరిసారలను అనునిత్యం పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్నపారిశుధ్య కార్మికులపై మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్య నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. స్వచ్చభారత్ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు వారు పేరుపేరునా ధన్యవాదాలుతెలిపారు. పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా శుక్రవారం అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల సేవలు వెల కట్టలేనివని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి పాత్ర చాలా కీలకమని ప్రశంసించారు. పారిశుధ్య కార్మికులు మాతృ మూర్తులతో సమానమని, వారి సేవలకు గుర్తుంపుగా అవార్డులు ప్రధానం చేయడం చాలా సంతోషకరమన్నారు. స్మార్ట్ సిటీ విశాఖను మరింత సుందర నగరంగా తీర్చి దిద్దడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ.. పారిశుద్యం అంటే కేవలం శానిటైజేషన్ మాత్రమే కాదని, పరిసరాలను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచడమేని అభిప్రాయపడ్డారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి 25 మందికి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తీర్చిడిద్దడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. విశాఖను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని కోరారు. దేశంలో అత్యంత సుందర నగరాలలో విశాఖకు 9వ స్థానం లభించడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. కాపులుప్పాడ బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్‌కి నిధులు విడుదల చేసి మరింత స్వచ్చత సాధిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఆధారబాదరగా పనులు చేపట్టి మధ్యలో వదిలేసారని, తాము అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. -
విశాఖకు అంతర్జాతీయ ఘనత
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ అవార్డు రేసులో విశాఖ మహానగరం మూడో స్థానాన్ని దక్కించుకుంది. స్పెయిన్‌లో జరిగిన స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్–2020లో విశాఖ స్మార్ట్ సిటీ ప్రపంచ నగరాలతో పోటీ పడింది. ‘లివింగ్ అండ్ ఇన్‌క్లూజన్ అవార్డు’ కేటగిరీలో మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్టులతో ప్రపంచంలోని 20 నగరాలు పోటీ పడగా.. విశాఖ మూడో స్థానంలో నిలిచింది. బీచ్ రోడ్డులో రూ.3.50 కోట్లతో నిర్మించిన ‘ఆల్ ఎబిలిటీ పార్క్’ లివింగ్ అండ్ ఇన్‌క్లూజన్ అవార్డుకు పోటీ పడింది. ఏడు కేటగిరీల్లో ఈ అవార్డులు ప్రకటించారు. మొత్తం ఈ ఎక్స్‌పోలో ప్రపంచం నలుమూలల నుంచి 46 నగరాలు పాల్గొనగా.. భారత్ నుంచి కేవలం విశాఖపట్నం మాత్రమే అర్హత పొందడం విశేషం. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ఎక్స్‌పోలో బుధవారం ఆయా కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. తొలి స్థానంలో మురికివాడల అభివృద్ధి ప్రాజెక్టుతో బ్రెజిల్ విజేతగా నిలవగా, అంతర్జాతీయ విరాళాల ద్వారా పేదలకు సంబంధించిన వివిధ రకాల బిల్లుల్ని చెల్లించేప్రాజెక్టుతో టరీ్క దేశంలోని ఇస్తాంబుల్ సిటీ రెండో స్థానంలో నిలిచింది. దేశంలోనే తొలి ఎబిలిటీ పార్క్ బీచ్ రోడ్డులో వైఎంసీఏ ఎదురుగా రూ.3.50 కోట్లతో ఆల్ ఎబిలిటీ పార్క్ తీర్చిదిద్దారు. సాధారణ ప్రజలు, పిల్లలతో పాటు విభిన్న ప్రతిభావంతులు కూడా ఈ పార్కులో ఆటలాడుకొని ఎంజాయ్ చేసేలా పార్కు నిర్మించారు. పార్కులో క్లైంబింగ్ నెట్, పిల్లలు ఆటలాడుకునే ఎక్విప్మెంట్, షిప్ డెక్, మ్యూజికల్ పోల్స్, ప్లే గ్రౌండ్ డ్రమ్స్‌తో పాటు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణతో తీర్చిదిద్దే ల్యాండ్ స్కేప్‌లు ఉన్నాయి. విభిన్న ప్రతిభావంతుల కోసం మూడు సీట్ల మేరీ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు. దివ్యాంగులు కూడా ఎంజాయ్ చేసేలా దేశంలో రూపొందిన తొలి ఎబిలిటీ పార్క్ ఇదే కావడం విశేషం. ప్రజల ఆనందానికి, ఆహ్లాదానికి వినియోగించుకునేలా.. ముఖ్యంగా చిన్నారులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న ఈ పార్కుని యూకే అంబాసిడర్‌తో పాటు అమెరికన్ల ప్రశంసలందుకుంది. వచ్చే ఏడాది మొదటి స్థానం ఖాయం స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్–2020లో జీవీఎంసీ ప్రాజెక్ట్ మొదటి స్థానం సాధించలేకపోయినందుకు బాధగా ఉన్నా.. దేశం నుంచి ఎంపికైన ఏకైక ప్రాజెక్ట్ ఆల్ ఎబిలిటీ పార్క్ కావడం గమనార్హం. అవార్డు కోసం ప్రపంచంలోని అతి పెద్ద ప్రముఖ నగరాలతో విశాఖ పోటీ పడటం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది బార్సిలోనాలో జరిగే స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్–2021లో విశాఖ ఒక కేటగిరీలో అయినా మొదటి స్థానంలో నిలిచి అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకుంటుంది. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
మరింత స్మార్ట్‌గా..
స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తూ పేద విద్యార్థులకు సరికొత్త విద్యాబోధన అందిస్తున్న మహా విశాఖ నగర పాలక సంస్థ.. మరిన్ని స్కూళ్లలో సేవలు విస్తృతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. స్మార్ట్ క్లాస్ రూమ్‌లు, డిజిటల్ ల్యాబ్‌లు, ప్రొజెక్షన్ యూనిట్లు.. ఇలా స్మార్ట్ పాఠశాలలుగా అభివృద్ధి చేసేందుకు రూ.28.77 కోట్లతో పనులు చేపట్టింది. లాక్డౌన్ కారణంగా పనులు ఆలస్యం కావడంతో.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పేద విద్యార్థులకు స్మార్ట్ పాఠాలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం : మున్సిపల్ బడి అంటే.. దుంపల బడి అనే ఆలోచన నుంచి.. డిజిటల్ బడి అనేలా తీర్చిదిద్దుతున్నారు మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు. కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు అందే ప్రతి సౌకర్యం పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందాలనే లక్ష్యంతో జీవీఎంసీ వినూత్నంగా ఆలోచనలు చేస్తోంది. విద్యార్థుల్లో ఆవిష్కరణ, పరిశోధన నైపుణ్యం, సామర్థ్యం పెరగాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయిలోనే వారికి సాంకేతికతను పరిచయం చేయాలని జీవీఎంసీ నిర్దేశించుకుంది. ఇందుకు అనుగుణంగానే స్మార్ట్ క్లాసులను 2017 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించింది. మొదటి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ డిజిటల్ క్లాస్ రూమ్‌లు, స్మార్ట్ క్లాస్‌లు పరిచయం చేసిన జీవీఎంసీ ఇప్పుడు ఒకటి నుంచి 8 వరకూ స్మార్ట్ క్లాస్లనూ, 10వ తరగతి వరకూ డిజిటల్ తరగతులను బోధిస్తోంది. దీని ద్వారా పిల్లల్లో నేర్చుకోవాలనే తపన, పాఠ్యాంశాలపై అవగాహన, ఆసక్తి, ఉత్సాహం పెరుగుతోంది. మూడు విభాగాలుగా తరగతులు స్మార్ట్ క్లాస్ రూమ్ అనేది మూడూ విభాగాలుగా అమలు చేస్తున్నారు. మొదటిది ప్రతి క్లాస్‌కు డిజిటల్ బోర్డును అమర్చుతారు. ఈ డిజిటల్ బోర్డును టీచర్స్ వినియోగించి.. పాఠాలను బోధిస్తారు. ఇలా బోధించడం వల్ల విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవుతాయి. గణితం, సైన్స్ డయాగ్రామ్స్ విద్యార్థులు స్పష్టంగా 3డిలో వివరిస్తే ఆసక్తిగా ఉంటుంది. రెండో దశలో విద్యార్థులకు క్రోమ్ బుక్స్ (మినీ ల్యాప్టాప్స్) ఇచ్చి వారికి కంప్యూటర్ పరిజ్ఞానం నేర్పుతారు. ఇందులో ప్రత్యేకం గూగుల్ క్లాస్ రూమ్. ఇది విద్యా రంగంలో డిజిటల్ క్లాస్‌లకు ముఖ్య భూమిక పోషిస్తోంది. దీని గురించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నేర్పిస్తారు. మూడో దశలో గూగుల్ క్లాస్ రూమ్ గురించి నేర్చుకున్న తరువాత ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్లైన్లో హోమ్ వర్క్స్ ఇవ్వడం, పరీక్షలు నిర్వహిస్తారు. వారు చేసిన హోమ్ వర్క్స్, పరీక్షలకు ఫలితాలను వెంటనే వెల్లడవుతాయి. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమయం ఆదాతో పాటు, బుక్స్‌లో లేని విషయాలను సైతం తెలుసుకునే అవకాశం ఏర్పడుతోంది. స్మార్ట్ ల్యాబ్‌లు.. డిజిటల్ క్లాసులు విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు చెప్పడమే కాదు.. ఆన్లైన్లోనే పరీక్షలూ నిర్వహించేలా 2019–20 విద్యా సంవత్సరంలో యూనిట్ పరీక్షలు పైలట్‌గా చేపట్టి సఫలీకృతులయ్యారు. ఆన్లైన్ ద్వారా రివిజన్ ఎగ్జామ్స్ సైతం నిర్వహించారు. ఇలా ప్రతి అడుగూ స్మార్ట్‌గా వేస్తున్న జీవీఎంసీ మిగిలిన స్కూళ్లలోనూ ప్రాజెక్టు విస్తరిస్తోంది. రూ.28.27 కోట్లతో స్మార్ట్ స్కూళ్లు పనులు చేపడుతోంది. హైస్కూళ్లలో స్మార్ట్ క్లాస్ రూమ్‌లు, ప్రొజెక్షన్ యూనిట్లుతో పాటు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో పనులు ఆలస్యమయ్యాయి. వీటన్నింటినీ ఈ విద్యా సంవత్సరంలో పూర్తి చేసి, 2021–22 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీవీఎంసీ ప్రయత్నిస్తోంది. జీవీఎంసీ పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్‌లో నాలెడ్జ్ యంత్ర (కెయాన్) అప్లికేషన్ ద్వారా క్లాస్ వివరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో కెయాన్ వినియోగిస్తున్నారు. కంప్యూటర్‌కు ప్రొజెక్టర్ అనుసంధానించి. ప్రొజెక్టర్ ఆన్ చేసి ఇంటెల్ స్పేస్ అనే స్మార్ట్ బోర్డును ఉపాధ్యాయులు వినియోగిస్తున్నారు. సుద్ద ముక్క లేకుండానే బోర్డుపై క్లాసులు చెప్పే సౌకర్యం ఉంది. అదే విధంగా ల్యాబ్‌లో కెయాన్తో పాటు 40 క్రోమ్‌బుక్స్‌ను విద్యార్థులకు ఇస్తారు. ఈ క్రోమ్బుక్స్లోనే పెన్ను పుస్తకాలతో సంబంధం లేకుండా విద్యార్థులు నోట్స్ ప్రిపేర్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. చురుగ్గా స్మార్ట్ స్కూళ్ల పనులు జీవీఎంసీ విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ స్మార్ట్ క్లాసులు మంచి మార్పులు తీసుకొచ్చింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ వల్ల విద్యార్థులు రివిజన్ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సైన్స్ వీడియోస్ ద్వారా విద్యార్థులకు పాఠాలపై పూర్తి అవగాహన కలుగుతోంది. స్మార్ట్ క్లాస్ రూమ్స్ వల్ల పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులకు మంచి సహకారం లభిస్తోంది. పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా అమలు చేస్తున్న స్మార్ట్ క్లాసులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. దీనికి తోడు విద్యార్థుల్ని ఆన్లైన్ ఎగ్జామ్స్‌ను ఎదుర్కొనేలా సంసిద్ధుల్ని చేస్తే భవిష్యత్తులో అన్ని పోటీ పరీక్షల్నీ సులువుగా అందిపుచ్చుకోగలరు. అందుకే పరీక్షలు కూడా ఆన్లైన్లో నిర్వహించే విషయంపై కసరత్తు చేస్తున్నాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
త్రీస్టార్.. తిరుపతి వన్
స్మార్ట్ తిరుపతి మెరిసింది. త్రీస్టార్ రేటింగ్‌లో జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. స్వచ్ఛత, పరిశుభ్రత నెలకొల్పడంలో అత్యున్నత ప్రమాణాలు అమలు చేస్తున్నందుకు అత్యున్నత గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో స్వచ్ఛత, పరిశుభ్రత అమలు విధానంపై కేంద్ర ప్రభుత్వ మినిస్టరీ ఆఫ్ అర్బన్ హౌసింగ్ అఫైర్స్‌శాఖ పర్యవేక్షణలో ఫైవ్, త్రీస్టార్ ర్యాంకింగ్‌లను మంగళవారం ప్రకటించారు. ఆశాఖ మంత్రి హర్దీప్సింగ్పూరీ ర్యాంకుల వివరాలను ఢిల్లీ కేంద్రంగా ప్రకటించారు. త్రీస్టార్ రేటింగ్‌లో పోటీపడ్డ తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. సాక్షి, తిరుపతి: గార్బేజ్ ఫ్రీసిటీ స్టార్ రేటింగ్‌లో తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. 2019లో నిర్వహించి రేటింగ్స్‌లో 51వ స్థానంలో ఉన్న తిరుపతి నగరం 2020 పోటీల్లో టాప్–1 ర్యాంకులో నిలిచి తన సత్తాను చాటుకుంది. గత ఏడాది విజయవాడ నగరం 50వ స్థానంలో ఉండగా ఈ సారి జాతీయ స్థాయిలో 2వ స్థానానికి చేరింది. త్రీస్టార్ రేటింగ్‌లో టాప్–10లో ఉన్న నగరాలు మాత్రమే టాప్ 5 ర్యాంకింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. త్రీస్టార్ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన తిరుపతి వచ్చే ఏడాది ఫైవ్ స్టార్ ర్యాంకింగ్‌లో పోటీపడనుంది. 1,435 నగరాలు పోటీ స్వచ్ఛతను పాటించే నగరాలకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ స్టార్ రేటింగ్స్ పోటీ నిర్వహించింది. నిపుణులు నగరాల్లో అమలవుతున్న స్వచ్ఛత, పరిశుభ్రత, ప్రజలకు మౌలిక వసతులు, వాటి నిర్వహణకు ఉపయోగిస్తున్న అత్యున్నత ప్రమాణాలు, ప్రజల అభిప్రాయాల సేకరణ ఆధారంగా ర్యాంకింగ్‌ను కేటాయించారు. దేశంలోని 1,435 నగరాలు పోటీడ్డాయి. ఫైవ్ స్టార్ రేటింగ్‌లో ఆరు నగరాలు సొంతం చేసుకోగా 63 నగరాలకు త్రీస్టార్, 70 నగరాలు ఒక స్టార్ రేటింగ్‌ను కేంద్రం ప్రకటించింది. మెరిసిన తిరుపతి కీర్తి పతాకం తిరుపతిలో స్వచ్ఛత, పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. చెత్తను వంద శాతం సది్వనియోగం చేస్తున్నారు. ఇందుకోసం పీపీపీ పద్ధతిన కార్పొరేషన్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఇంటింటా తడి, పొడి చెత్తను స్వీకరిస్తున్నారు. రూ.15 కోట్ల వ్యయంతో తూకివాకంలో నిర్మించిన బయో మెథనైజేషన్ ప్లాంట్‌కు తరలించి గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. రూ.19 కోట్ల వ్యయంతో రామాపురం డంపింగ్ యార్డులో బయో మైనింగ్ ద్వారా 5 లక్షల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారు. రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను తూకివాకంలో నిర్వహిస్తున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో పొడిచెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టారు. ఇలా శాశ్వత ప్రతిపాదికన చెత్త నిర్వహణను నిర్వహిస్తున్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తుండడంతో తిరుపతి ఈ ఘనతను సొంతం చేసుకుంది. సమష్టి కృషితోనే సాధ్యం నగర ప్రజలకు పరిశుభ్రత, స్వచ్ఛతను అందించేందుకు కృషి చేస్తున్నాం. మౌలిక వసతులు కలి్పస్తున్నాం. చెత్త నిర్వహణ కోసం కోట్లు వె చ్చించి పలు ప్లాంట్లు నిర్వహిస్తున్నాం. ప్రజల సహకారం, పారిశుద్ధ్య కార్మికుల కష్టం, అధికారుల సమష్టి కృషితోనే ఈ ఘనత సాధించాం. – పీఎస్ గిరీషా, కమిషనర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
‘స్మార్ట్’ విశాఖ: 24 గంటలు డేగకన్నుతో..
సాక్షి, విశాఖపట్నం: మహమ్మారి కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని మహానగరం విశాఖపట్నం దేశంలోని అన్ని నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన వెంటనే అప్రమత్తమైన అధికార బృందం యుద్దప్రాతిపదకన అనేక చర్యలు చేపట్టింది. నగరాన్ని 24 గంటలు డేగకన్నుతో పరిశీలిస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా కరోనా కట్టడిలో యంత్రాంగం పనితీరుకు కితాబు ఇచ్చింది. మహమ్మారి కరోనాపై నగర ప్రజల్లో అవగాహన పెంపొందించే విధంగా 90 ప్రాంతాల్లో బహిరంగ ప్రకటన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా విశాఖ మొత్తం 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతీ ఒక్కరి కదలికలపై దృష్టి సారించారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్లలో కరోనా గురించి తెలిపే 10 డిజిటల్ సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. వీటన్నింటిని అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. విశాఖ స్మార్ట్ సిటీ కార్యాలయంలో 24గంటలూ పనిచేసేలా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. 24 గంటలు షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తూ నిరంతరం అప్రమత్తతో ఉంటున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థతో ఇంటింటి సర్వే చేపట్టి కరోనా పాజిటివ్/అనుమానితులను వేగంగా గుర్తించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను హాట్‌స్పాట్ జోన్లుగా ప్రకటించి అంక్షలు విధించి అక్కడ వారిని బయటకు రానీయకుండా అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారితోపాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితులను క్వారంటైన్ చేశారు. దీంతో స్మార్ట్ సిటీ విశాఖలో కరోనా కొంత నియంత్రణలోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు కూడా చైతన్యంతో వ్యవహరించడంతో విశాఖలో కరోనా వ్యాప్తి కొంత ఆగినట్లయింది. చదవండి: మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్లు ఇవే -
కరోనా నియంత్రణ చర్యలు చాలా 'స్మార్ట్'!
సాక్షి, అమరావతి: స్మార్ట్ సిటీల్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు బాగున్నాయ్.. మిగతా పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయ్.. అంటూ స్మార్ట్ సిటీ మిషన్ కితాబిచ్చింది. ఈ మేరకు ఓ నివేదిక ఇచ్చింది. తిరుపతిలో కరోనా నియంత్రణ చర్యలు అద్భుతంగా ఉన్నట్టు పేర్కొంది. స్మార్ట్ నగరాల పనితీరును బట్టి సాధారణం, బాగా చే స్తున్నవి, అద్భుతంగా చేస్తున్నవి.. ఇలా మూడు గ్రేడ్లుగా విభజించి, అక్కడి సేవలను పరిశీలించి స్మార్ట్‌సిటీ మిషన్ ర్యాంకులిచ్చింది. మన రాష్ట్రంలో విశాఖ, అమరావతి, కాకినాడ, తిరుపతిలు స్మార్ట్ నగరాలు. ఈ నాలుగింటిలో తిరుపతికి మొదటి ర్యాంకు వచ్చింది. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు ఇక్కడ బాగున్నట్టు తన నివేదికలో తేల్చింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. - తిరుపతికి సంబంధించి విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ఇళ్ల వద్ద మార్కింగ్ వేశారు. క్వారంటైన్ పర్యవేక్షణ బాగుంది. - ఇంటింటికీ వెళ్లి నిత్యావసరాలు, కిరాణా సరుకులు అందజేస్తున్నారు - వార్డు సెక్రటరీలు, సిబ్బంది ఆయా వార్డుల్లో పటిష్టంగా, ప్రజలను నొప్పించకుండా సేవలందిస్తున్నారు. - విశాఖపట్నంలో పబ్లిక్ అనౌన్స్మెంట్ విధానం చాలా బావుంది - అంతర్జాతీయ ప్రయాణికులను గుర్తించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ చక్కగా పనిచేస్తోంది - కాకినాడలో 24 గంటల హెల్ప్ డెస్క్‌లు, ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు - అమరావతిలో పబ్లిక్ అవేర్నెస్ బ్యానర్లు విరివిగా ఏర్పాటు చేయడంతో పాటు హోమియో మందులు సరఫరా చేస్తున్నారు. -
ఏపీలో మరో 13 స్మార్ట్ సిటీల అభివృద్ధిపై దృష్టి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సిటీ కార్యక్రమానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరులతో కలిపి మొత్తం 13 పట్టణాలను ఎంపిక చేసుకుంది. వచ్చే పదేళ్లలో ఈ పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మార్చాలని నిర్ణయించింది. మొదటి దశలో ఆరు పట్టణాలను అభివృద్ధి చేయనుంది. ఇందు కోసం సుమారుగా రూ. 5,183 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖ, కాకినాడ, అమరావతి, తిరుపతిలను స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో చేర్చి అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా రాష్ట్రంలో 17 పట్టణాలు స్మార్ట్‌గా మారనున్నాయి. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి.. రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో 30 శాతం పట్టణాల్లో నివసిస్తుండగా పదేళ్లలో ఇది 50 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు వచ్చే పదేళ్లలో రూ. 3.55 లక్షల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఒక్క పట్టణ రవాణా రంగంలోనే రూ. 89,034 కోట్లు అవసరమవుతాయని లెక్కకట్టింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రైలు, రహదారులు, పోర్టుల అభివృద్ధి వంటి రంగాల్లో బీవోటీ, పీపీపీ విధానాల్లో విదేశీ పెట్టుబడులకు ఆహా్వనం పలుకుతోంది. ఈ మధ్య రాష్ట్ర పర్యటనకు వచి్చన కొరియా, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తల బృందాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులు మౌలిక వసతుల కల్పనలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. విశాఖ మెట్రో రైలు, బకింగ్‌హాం కెనాల్ పునరుద్ధరణ, అభివృద్ధి, వ్యర్థాల నిర్వహణలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రెండు దేశాల ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. వచ్చే పదేళ్లలో రాష్ట్ర జీడీపీలో 75 శాతం పట్టణాల నుంచే వస్తుందని అంచనా వేస్తున్నట్లు బుగ్గన పేర్కొంటున్నారు. స్మార్ట్ సిటీల అభివృద్ధి ఇలా... 1రాష్ట్రం మొదటి దశలో చేపట్టేవి శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు 2రెండో దశలో చేపట్టేవి విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం గుంటూరు, కడప, చిత్తూరు కేంద్రం అభివృద్ధి చేస్తున్న స్మార్ట్ సిటీలు విశాఖ, కాకినాడ, అమరావతి, తిరుపతి -
చెత్త కనబడకుండా ’స్మార్ట్’ ఐడియా!
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో చెత్త నిర్వహణలో కొత్త విధానం చేపట్టేందుకు కసరత్తు ప్రారంభమైంది. నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దడమే కాకుండా ఆ స్థాయికి తగ్గట్టుగా నగరంలో చెత్త నిర్వహణను చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రధాన రహదారులపై చెత్త కనబడకుండా ఉండేందుకు అండర్‌గ్రౌండ్ డస్ట్‌బిన్స్ ఏర్పాటుకు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు రోడ్లపై బహిరంగంగానే చెత్త డబ్బాలు ఏర్పాటు చేస్తుండగా... చెత్త డబ్బాలు నిండిపోయి రోడ్లపై ఇష్టానుసారంగా చెత్త వేస్తుండడంతో పరిసరాలన్నీ అధ్వానంగా మారుతున్నాయి. స్మార్ట్‌సిటీగా అవతరించి యేడాది గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది. దీంతో నగరపాలక సంస్థ చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. మొదటి విడతలో స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుని అభివృద్ది పథంలో నడుస్తున్న నగరాలకు ధీటుగా కరీంనగర్ స్మార్ట్‌సిటీని అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నరగపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య పనుల నిర్వహణను మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో నగరాన్ని పరిశుభ్రంగా మార్చడానికి నిదులు కేటాయిస్తున్నారు. ఇళ్ల నుంచి వచ్చే చెత్తను తగ్గించడం, తడి, పొడి, చెత్తను వేరు చేసి తీసుకెళ్లాలనే నిబంధనలు అమలుపై దృష్టిసారించారు. ఇప్పటికే వీధుల్లో సేకరించిన చెత్తను కుదించడం కోసం కొత్తగా కంప్యాక్టర్ డబ్బాలు, వాహనాలు కొనుగోలు చేశారు. వీటిని ప్రతి డివిజన్లో ఏర్పాటు చేయగా అందులో చెత్తను వేసి, ప్రత్యేక వాహనాల్లో డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. స్మార్ట్‌గా కనబడేందుకు... కరీంనగర్‌ను స్మార్ట్‌గా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. స్మార్ట్‌సిటీ నగరంలోని ప్రధాన రహదారులను, రద్దీ ప్రాంతాల రోడ్లను అందంగా తీర్చిదిద్దేందుకు అధికారులు టెండర్లు నిర్వహించే పనిలో ఉన్నారు. మూడు ప్యాకేజీల కింద రహదారుల నిర్మాణానికి టెండర్లు నిర్వహించగా వాటికి సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని తిరిగి టెండర్లు పిలిచారు. వాటిని కూడా త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. అదే విధంగా పేస్–2లో అంతర్గత రోడ్లను వేయనున్నారు. రోడ్డు వేయడానికంటే ముందే అండర్‌గ్రౌండ్ డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. చెత్త కనబడకుండా... నగర వీధుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనమిస్తోంది. దీంతో వీధులన్నీ అధ్వానంగా మారుతున్నాయి. ప్రధాన రహదారులపై చెత్త కనిపించకుండా అండర్ గ్రౌండ్లో స్మార్ట్ డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన రహదారులపై చెత్త బహిరంగంగా కన్పించకుండా నూతన విధానం వైపు అడుగులు వేస్తున్నారు. అండర్‌గ్రౌండ్ చెత్త డబ్బాలను 14 ప్రాంతాల్లో 20 డబ్బాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. వీటికి స్మార్ట్‌సిటీలో రూ.1.5 కోట్లతో కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. స్థలాల ఎంపిక.. స్మార్ట్‌బిన్స్ ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు స్థలాలను సైతం ఎంపిక చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక భాగంలో, ప్రభుత్వ ఆసుపత్రి వెనుకబాగంలో, ఎస్సారార్ కళాశాల వద్ద నున్న మార్కెట్లో, సర్కస్‌గ్రౌండ్‌లో, సాయినగర్‌లో, ఆదర్శనగర్‌లో, అన్నపూర్ణకాంప్లెక్స్ పార్కింగ్ స్థలంలో, వారసంతలో, మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో, మార్కెట్ రిజర్వాయర్ ఎదురుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక, ప్రభుత్వాసుపత్రి వెనుక భాగంలో మొదట వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ డస్ట్బిన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ డస్ట్బిన్ల ఏర్పాటు పూర్తయితే రోడ్ల వెంట చెత్త ఇక కనబడదని అధికారులు భావిస్తున్నారు. -
స్మార్ట్ స్ట్రీట్
నగరంలో ఓ మార్గం. వినోద్ రోడ్డు మీద నడుస్తున్నాడు. రోడ్డంటే రోడ్డనుకునేరు.. ఇప్పటి ఫుట్‌పాత్‌కు భిన్నంగా భేషుగ్గా ఉన్న పాదచారుల మార్గంలో అతడు అడుగేస్తున్నాడు. గమ్యానికి వేగంగా చేరాలనిపించింది. బస్టాప్‌లో నిల్చున్నాడు.. అది కూడా మామూలుగా లేదు. వైఫై ఈజీగా అందుబాటులో ఉంది. హంగు చాలానే ఉంది. జీపీఎస్ కారణంగా ఆ దారిలో బస్సులు ఏవేవి ఎక్కడున్నాయో కళ్లెదురుగా స్క్రీన్ మీద కనిపిస్తోంది. దాన్ని చూస్తే బస్సులు దరిదాపుల్లో లేవని అర్థమైపోయంది. ఇంకెందుకు ఆలస్యం? అని వినోద్ రెండడుగులు వేసి అక్కడే ఉన్న బైక్ షేరింగ్ ఐలండ్‌కు వెళ్లి వివరాలు తెలిపి స్మార్ట్‌గా ఉన్న సైకిల్ తీసుకున్నాడు. సైక్లింగ్ ట్రాక్‌లో హుషారుగా సైకిల్ తొక్కుతూ గమ్యానికి ముందే చేరుకున్నాడు. సైకిల్ అక్కడే వదిలేసి నాలుగడుగుల్లో ఆఫీసుకు ఎంచక్కా వెళ్లాడు. దారంతా పచ్చని మొక్కల మధ్యలో ప్రయాణించి, కనువిందైన హరిత ఐలెండ్లు దాటుకుంటూ రావడంతో విసుగన్నదే లేకుండా హుషారుగా పనిలో మునిగిపోయాడు... ఇదంతా ఏ దేశంలోనో అనుకుని నిట్టూరుస్తున్నారా.. ఆగండాగండి.. ఈ హంగులన్నీ వేరే చోట కాదు.. మన వైజాగ్‌లోనే. దాదాపు రెండేళ్ల వ్యవధిలో ఇవన్నీ మన వీధుల్లోనే వాస్తవాలు కాబోతున్నాయి. ఈ స్మార్ట్ స్ట్రీట్స్ కోసం జీవీఎంసీ ఉత్తుత్తి మాటలు చెప్పడం లేదు. గట్టి ప్రయత్నాలే చేస్తోంది. విశాఖసిటీ: మహా నగరం మరింతగా స్మార్ట్ హంగుల్ని సంతరించుకోబోతోంది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా వీధుల్ని ఆకర్షణీయంగా మార్చేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ సమాయత్తమవుతోంది. నాలుగు ప్రాజెక్టులుగా విభజించి 19.43 కిలోమీటర్ల మేర వీధుల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆకట్టుకునే ఐలాండ్స్, సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు వైఫై స్పాట్లతో కూడిన అనేక మౌలిక సదుపాయాలతో ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. విశాల విశాఖ నగర వీధులు జిగేల్మననున్నాయి. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.400 కోట్లు మాత్రమే విడుదల చేశాయి. ఈ నిధులకు సంబంధించిన పనులు పూర్తయిన వెంటనే.. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు మంజూరు చేయించుకునేందుకు జీవీఎంసీ చకచకా ప్రణాళికలు సిద్ధం చేసేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 23నæ 9 స్మార్ట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది. ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యమైనది స్మార్ట్ స్ట్రీట్స్ పథకం. మహా నగరంలో వీధులు తళుక్కుమనేలా.. రూపొందించేందుకు డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు ఆకట్టుకునేలా ఉంది. దీనికోసం ఆయా శాఖల సమన్వయం అవసరమైనందున ఇప్పటికే వీఎంఆర్డీఏ, ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు, ఈపీడీసీఎల్ సిబ్బంది, బీఎస్ఎన్ఎల్ అధికారులతో జీవీఎంసీ పలు దఫాలుగా సమావేశం నిర్వహించింది. రూ.164 కోట్లతో ఏబీడీ ప్రాంతంలో 19.43 కిలోమీటర్ల విస్తీర్ణంలో 20 రహదారుల్ని స్మార్ట్ స్ట్రీట్స్‌గా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. షాపూర్జీ పల్లాన్జీ సంస్థ ఈ పనుల టెండర్‌ను దక్కించుకుంది. రూపాంతరమిలా.. ♦ స్మార్ట్ వీధుల్ని రహదారులకు ఇరువైపులా అభివృద్ధి చేస్తారు. సుమారు 6.4 మీటర్ల వెడల్పు వంతున వీటిని తీర్చిదిద్దుతారు. ♦ రోడ్డుకు ఇరువైపులా సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ ట్రాక్‌లు వేర్వేరుగా ఏర్పాటు చేస్తారు. ♦ 1.5 మీటర్ల సైకిల్ ట్రాక్, 2.5 మీటర్ల వాకింగ్ ట్రాక్ ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ♦ పాదచారులకు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు కానుంది. ♦ రహదారికి ఇరువైపులా వాకింగ్ ట్రాక్‌లలో బఫర్ ప్రాంతాల్లో పచ్చదనం పరచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ♦ అక్కడక్కడా వైఫై స్పాట్లను ఏర్పాటు చేయనున్నారు. ♦ బీచ్‌రోడ్డులో ప్రస్తుతం ఉన్న పబ్లిక్ బైక్ షేరింగ్ ప్రాజెక్టును స్మార్ట్ స్ట్రీట్స్‌కు విస్తరించనున్నారు. మొత్తం 80 పబ్లిక్ బైక్ షేరింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ♦ ఈ ప్రాజెక్టులో మొత్తం 8 జంక్షన్లు వస్తాయి. ప్రతి జంక్షన్‌లోనూ స్మార్ట్ ఐలాండ్ ఏర్పాటు కానుంది. ♦ ఈ ఐలాండ్స్‌లో ల్యాండ్ స్కేపింగ్ చేసి, మొక్కలు, రంగులు వేసి ఆకర్షణీయంగా మారుస్తారు. మరికొన్ని ఐలాండ్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయనున్నారు. ♦ హరిత రహదారి విస్తరణకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయనున్నారు. ♦ వాణిజ్య ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ♦ బస్టాపులో భద్రత, సౌకర్యం, పూర్తిస్థాయి బస్సు సమాచారం ఎప్పటికప్పుడు అందించే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ♦ ఈ బస్టాపులు సోలార్ వ్యవస్థతో రూపుదిద్దుకోనున్నాయి. ♦ రహదారి మధ్యలో సేదతీరేందుకు వసతి స్థలాలు, విశ్రాంతి తీసుకునే షెడ్లు ఏర్పాటు చేయనున్నారు. 20 రహదారులు.. 19.43 కి.మీ. నగరంలోని 20 రహదారుల్ని స్మార్ట్ వీధులుగా అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 19.43 కిలోమీటర్ల పరిధిలో ఈ వీధులు స్మార్ట్ కానున్నాయి. కేజీహెచ్ డౌన్రోడ్లో 1.08 కిలోమీటర్లు, కేజీహెచ్ అప్‌లో 0.45 కి.మీ. జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి నోవాటెల్ డౌన్ వరకూ 1.96 కి.మీ., కలెక్టర్ ఆఫీస్ నుంచి నౌరోజీ రోడ్ వరకూ 0.93 కి.మీ., నౌరోజీ రోడ్లో 1.37 కి.మీ., హార్బర్రోడ్లో 3.2 కి.మీ., వాల్తేర్ మెయిన్రోడ్లో 4.91 కి.మీ., చినవాల్తేర్ రోడ్లో 2.07 కి.మీ., నౌరోజీ రోడ్ నుంచి ఆలిండియా రేడియో దారిలో 0.98 కి.మీ., దసపల్లా హిల్స్ రెసిడెన్షియల్ రోడ్లో 0.87 కి.మీ. మేర స్మార్ట్ స్ట్రీట్స్‌గా అభివృద్ధి చెందనున్నాయి. రెండేళ్లలో పూర్తి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా విశాఖ నగర వీధుల్ని ఆకర్షణీయమైన వీధులుగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నాం. స్మార్ట్ స్ట్రీట్స్‌కు సంబంధించిన డిజైన్ల రూపకల్పన ప్రారంభించారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. 18 నుంచి 24 నెలల్లో పనులు పూర్తి చేసి స్మార్ట్ వీధుల్ని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. జీవనశైలి సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య నగరంలో పెరుగుతున్న నేపథ్యంలో.. వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ తరహా స్మార్ట్ స్ట్రీట్స్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాం. – హరినారాయణన్, జీవీఎంసీ కమిషనర్. -
ప్రధాని మోదీ సభకు రూ.7.23 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు జైపూర్‌లో పాల్గొననున్న సభకు కేవలం జనాన్ని సమీకరించడం కోసమే రాజస్థాన్ ప్రభుత్వం 7.23 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తున్నది. ఆహారం, వసతి ఏర్పాటు చేయడానికి ఇంతకన్నా ఎక్కువ సొమ్మును వెచ్చించనున్నట్లు తెల్సింది. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పాలనా విభాగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి మీడియాకు చిక్కడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. పలు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందిన దాదాపు రెండున్నర లక్షల మంది ప్రజలను ప్రధాని సభకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. వీరందరికి రవాణా సౌకర్యంతోపాటు ఆహారం, వసతి సౌకర్యాలు జైపూర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకరావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5,579 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పథకాల లబ్ధిదారులతో నేరుగా ముచ్చటించడంతోపాటు స్మార్ట్‌సిటీ కార్యక్రమం పేరట ఓ ర్యాలీని కూడా ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి సభకు మరో ఐదువేల మంది లబ్ధిదారులను పంపించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను కోరుతూ బర్మర్ జిల్లా యంత్రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 24 లక్షల రూపాయల చెక్కును పంపించింది. ఇక ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మహిళలను ఎంపిక చేసి వారికి తర్ఫీదు ఇచ్చింది. ప్రధానితోని ప్రశాంతంగా సానుకూలంగా మాట్లాడాలని కోరారు. వారిలో మంజూదేవి కూడా ఉన్నారు. ‘నాకు కూతురు పుట్టినందుకు రాజ్శ్రీ యోజన కింద రెండున్నర వేల రూపాయల చొప్పున రెండు వాయిదాలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఐదు వేల రూపాయలు మాత్రమే తీసుకున్న నేను 50 వేల రూపాయలు తీసుకున్నానని ఎలా చెబుతాన’ని ఆమె స్పష్టం చేయడంతో గురువారం నాడు ఆమెను ప్రధానితో మాట్లాడే వారి జాబితా నుంచి తొలగించారు. ప్రధానితో మాట్లాడే ఐదుగురికి తర్ఫీదు ఇచ్చినట్లు రాజస్థాన్ సమాచార శాఖ డిప్యూటి డైరెక్టర్ సత్యనారాయణ చౌహాన్ అంగీకరించారు. ప్రధానితో మాట్లాడేందుకు వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి కూడా విద్యార్థినులను ఎంపిక చేస్తున్నామని ఆయన తెలిపారు. వివిధ కేంద్ర పథకాల కింద లబ్ధి పొందిన రాజస్థాన్ వాసుల్లో 90 శాతం మంది బీజేపీ కార్యకర్తలే ఉన్నారని, రానున్న రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రధాని సభకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
సుందర నగరానికి సహకరించాలి
కరీంనగర్‌కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో నూతనంగా కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్‌ను సోమవారం కోర్టు చౌరస్తాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకున్న కరీంనగర్ పరిశుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే నగరానికి స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేయడం ద్వారా నైట్ స్వీపింగ్ కార్మికులకు భారం తగ్గుతుందని, ప్రధాన రహదారుల్లో ప్రమాదాలను నియంత్రించొచ్చని పేర్కొన్నారు. రహదారులు పరిశుభ్రంగా ఉంటే నగరం సుందరంగా మారుతుందని, ప్రతి ఒక్కరూ సుందర నగరం కోసం సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభం నగరంలోని 35వ డివిజన్ సప్తగిరికాలనీలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి చేపట్టనున్న రూ.2.4కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత చిన్న సుందర నగరంగా కరీంనగర్‌కు గుర్తింపు ఉందని, కరీంనగర్‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, కార్పొరేటర్ కవితబుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిరాశ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లావాసులకు నిరాశ కలిగించింది. సాధారణ ఎన్నికలకుముందు ఈ దఫా చివరి బడ్జెట్‌గా జనరంజకంగా ఉంటుందని, జిల్లాలవారీగా కూ డా ప్రాధాన్యత దక్కుతుందని ఆందరూ ఆశించినా.. ఆ మేరకు కేటా యింపులు జరగలేదన్న అభిప్రాయం అన్నివర్గాల నుంచి వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులపై వరాల జల్లు... ఉద్యోగాలు, ప్రైవేట్ పెట్టుబడుల వృద్ధికి పేద్దపీట వేసినట్లు కనిస్తుండగా.. అత్యధిక శాతం ప్రజలకు లాభం చేకూరే ఆదాయ పరిమితి పెంపును విస్మరించడంపై పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక సాగునీటి వనరు.. తెలంగాణలోని ఏడు జిల్లాలకు ప్రయోజనం కలిగించే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈసారి కూడా జాతీయ హోదా దక్కలేదు. మెడికల్ కాలేజ్‌తోపాటు జిల్లాలో రైల్వేస్టేషన్లు, రైల్వేలైన్లకు అంతగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించ లేదు. గత బడ్జెట్లో పేర్కొన్న బల్లార్షా – కాజీపేట మార్గంలో మూడో రైల్వేలైన్‌కు మాత్రం రూ.100 కోట్లు అదనంగా కేటాయించారు. కొత్తపల్లి–మనోహర్‌బాద్ రైల్వేలైన్‌ను గత బడ్జెట్లోనే ఆమోదించగా.. నిధులు వెచ్చించి శరవేగంగా పనులు పూర్తి చేస్తామంటూ.. పెద్దపల్లి–నిజామాబాద్ రైలుమార్గంలో పెద్దపల్లి నుంచి లింగంపేట వరకు 83 కిలోమీటర్లు రైల్వేలైన్‌ను విద్యుద్దీకరించనున్నట్లు ప్రకటించారు. ‘స్మార్ట్ సిటీ’గా కరీంనగర్‌కు నిధులు రైతుల సంక్షేమం, వ్యవసాయానికి ఎన్నడూ లేనివిధంగా ఈసారి రూ.11లక్షల కోట్లు కేటాయించారు. నాబార్డుతో సహకార బ్యాంకులను అనుసంధానం చేసి రైతులకు రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 12,00,781 కుటుంబాలు ఉంటే 4,32,189 రైతు కుటుంబాలు ఉన్నాయి. పంటల బీమా లెక్కల ప్రకారం 7.33 లక్షల మంది రైతులుండగా వీరికి రుణ సౌకర్యం కలిగే అవకాశం ఉంది. జాతీయ ఉపాధి హామీ పథకానికి కూడా భారీ నిధులు కేటాయించిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాబ్‌కార్డులు పొందిన 6,59,173 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇదివరకే దేశంలోని 99 నగరాలను స్మార్ట్‌సిటీలుగా ఎంపిక చేసిన ప్రభుత్వం ఈబడ్జెట్లో రూ.2.04 లక్షల కోట్లు కేటాయించింది. దీంతో స్మార్ట్‌సిటీ జాబితాలో ఉన్న కరీంనగర్ నగర అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులు విడుదల కానున్నాయి. సుమారు 3.50 లక్షల మంది నివసించే నగరానికి మహర్దశ రానుంది. పరిశ్రమలకు దక్కని ప్రోత్సాహం.. రైల్వే కేటాయింపులు పాతవే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం చేసిన సాయం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, జగి త్యాల, తిమ్మాపూర్ ప్రాంతాల్లో గతంలో చేసిన ప్రతిపాదనల ఊసే లేదు. మెగా ఫుడ్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు సుముఖత తెలిపిన కేంద్రం.. ఈసారి కూడా మొండిచేయి చూపింది. ఇవేకాక ఇతర ఏ ఒక్క కొత్త పరిశ్రమ జిల్లాలో ఏర్పాటుకు కేంద్రం మొగ్గుచూపలేదు. దేశానికే తలమానికంగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏటా రూ.2500కోట్ల పన్నులు కేంద్రానికి చెల్లిస్తుండగా.. ఈ బడ్జెట్లో రూ.2000కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందులో పనిచేస్తున్న వేలాది మంది సింగరేణి సంస్థ కార్మికులకు ఆదాయపన్ను మినహాయిస్తారని భావించినా కేంద్రం దానిపై దృష్టి సారించలేదు. ఈ బడ్జెట్లో రైల్వేకోసం రూ.1,74,000 కోట్లు కేటాయించగా.. స్టేషన్ల పునరుద్ధరణ, హైటెక్ హంగులు కల్పించడం కోసం పెద్దపల్లి, రామగుండం, కరీంనగర్‌కు స్థానం దక్కనుంది. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ వేగం పెంచడంతోపా టు పెద్దపల్లి–లింగంపేట మధ్య 83 కిలోమీటర్ల రైల్వేలైన్ విద్యుద్ధీకరణ, కాజీపేట–బల్లార్షా మధ్య మూడో రైల్వేలైన్ ప్రకటించారు. రైల్వేస్టేషన్లు, రైళ్లలో పూర్తిగా భద్రతను పెంచేందుకు సీసీ కెమెరాల నిఘాకు నిధులు కేటాయించగా పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట, జగిత్యాల తదితర రైల్వేస్టేషన్లకు స్థానం దక్కనుంది. బడ్జెట్ నేపథ్యంలో జిల్లా గణాంకాలు ఉమ్మడి జిల్లాలో కుటుంబాలు 927865 గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు 751791 నగర/పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలు 176074 భూమిలేని నిరుపేద కుటుంబాలు 468950 ఉద్యోగం చేస్తున్న కుటుంబాలు 31531 రోజుకూలీపై ఆధారపడుతున్న కుటుంబాలు 467959 మొబైల్ఫోన్లు వాడుతున్న కుటుంబాలు 630619 ల్యాండ్‌లైన్ ఫోన్ వాడుతున్న కుటుంబాలు 6476 మొబైల్ ఫోన్లు లేని కుటుంబాల సంఖ్య 108451 వాహనాలు వాడుతున్న కుటుంబాలు 177052 ధూమపానం, సెల్ఫోన్లు ప్రియం బడ్జెట్లో ఆదాయ పరిమితిని పెంచుతారని ఆందరూ భావించినా.. ప్రభుత్వం ఆ అంశాన్నే ప్రస్తావించలేదు. బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపు పరిమితి పెంచుతారని ఆశించిన వారికి ఆశాభంగం కలగింది. నిరుద్యోగులను ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్లలో పెరిగిన వేతనాలను పరిశీ లిస్తే అంతకంటే ఎక్కువగా ధరలు పెరిగాయి. పరోక్షపన్నులు భారీగానే చెల్లిస్తున్న ఉద్యోగులపై ప్రత్యక్ష పన్ను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆదాయం రూ.5 లక్షల వర కు పన్ను పూర్తిగా మినహాయించాలన్న వాదన వేతనజీవుల నుంచి వినిపిస్తోంది. రూ.5లక్షలు పైబడి రూ.10 లక్షల వరకు 10 శాతం పన్నురేటు నిర్ణయించాలని, పొదుపు మొత్తాలపై పన్నురాయితీని రూ.3 లక్షలకు పెంచాలని ఉద్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బడ్జెట్ ధూమపానప్రియులు, సెల్‌ఫోన్ వాడకందారులకు షాక్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్ పరికరాలు, పాదరక్షలు, పాన్‌మసాల, టూత్‌పేస్టులు, బంగా>రం, వెండి, సిల్క్వస్త్రాలు సహా దిగుమతి చేసుకున్న కూరగాయలపైనా పన్నులు విధించారు. దేశీయ కంపెనీలు మినహా ఇతర కంపెనీలకు చెందిన సెల్ఫోన్లపై కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచడంతో మొబైల్ ఫోన్ల కొనుగోలుదార్లపై భారం పడనుంది. కార్లు, బైక్‌లతోపాటు టైర్లపైనా ధరలు పెరిగాయి. ఆశించిన రీతిలో లేదు కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం మిగతా విషయాల్లో ఆశించిన రీతిలో మోడీ ప్రభుత్వం స్పందించలేదు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించే క్రమంలో ఆర్థిక కేటాయింపులు చేయకపోవడం బాధాకరం. ఎలక్షన్‌కు పోయేముందు అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టే బడ్జెట్ జనరంజకంగా లేదు. మోడీకేర్ పేరుతో ప్రవేశపెట్టనున్న ఆరోగ్యభద్రతను 10 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తామని చెప్పి రూ.2 లక్షల కోట్లు ఖర్చయ్యే స్కీంకు, రూ.20 వేల కోట్లు కేటాయించడం చూస్తే అమలు ప్రశ్నార్థకంగా ఉంది. రైల్వేలు, భారత్‌మాల జాతీయ రహదారులపై దష్టిపెట్టలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు బడ్జెట్లో కేటాయింపులు లేవు. ప్రభుత్వ రంగ సంస్థలను డిజిన్వెస్ట్‌మెంట్ పేరుతో నిర్వీర్యం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం.– బోయినపల్లి వినోద్‌కుమార్, ఎంపీ పేదల పక్షం ఉంటే బాగుండేది బడ్జెట్లో కనీస మద్దతు ధర పెంపు ప్రకటన లేకపోవడం బాధాకరం. కనీస మద్దతు ధరలను 50 శాతం పెంచుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయింది. బడ్జెట్ పేదల పక్షాన ఉండి ఉంటే బాగుండేది. గ్రామీణ ప్రజల అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టామని చెప్పినా పెద్దగా కేటాయింపులు లేవు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విషయంలో మొదటి నుంచి ప్రభుత్వ వైఖరి విచిత్రంగా ఉంది. మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం బాధాకరం. పెద్దపెద్ద కంపెనీలను వదిలి, మధ్య, చిన్న తరహా పరిశ్రమలపై ట్యాక్స్ వేయడం సరికాదు.– కల్వకుంట్ల కవిత, ఎంపీ -
‘స్మార్ట్’ వైపు.. దేశాల చూపు
కరీంనగర్‌కార్పొరేషన్/కరీంనగర్‌సిటీ: ప్రపంచస్థాయి నగరాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన స్మార్ట్ సిటీలపై ఇతర దేశాల దృష్టి పడింది. దేశంలోని వంద నగరాల జాబితాలో తెలంగాణ నుంచి స్మార్ట్ సిటీ హోదా దక్కించుకున్న కరీంనగర్లో శనివారం బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ పర్యటించారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన ఫ్లెమింగ్‌కు మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ శశాంక స్వాగతం పలికారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. నగరపాలక సంస్థలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నగర అభివృద్ధి, స్మార్ట్ సిటీ ప్రణాళికలపై వివరించారు. కమిషనర్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన నగరాల నుంచి ఎంతో నేర్చుకునేది ఉంటుందని, కరీంనగర్‌ను సిస్టర్సిటీగా భావించి ఎక్స్చేంజ్ ప్రోగ్రాంల నిర్వహణకు సహకరించాలని ఫ్లెమింగ్‌ను కోరారు. కమిషనర్ ప్రజెంటేషన్‌తో సంతృప్తి చెందిన ఫ్లెమింగ్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. నగర పరిసరాలు, అభివృద్ధిని బట్టి చూస్తే కరీంనగర్ అందమైన నగరంగా త్వరలోనే అవతరించబోతోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కమలాకర్, సతీష్‌బాబు, ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ రమేశ్, కమిషనర్ శశాంక, ట్రేడ్ కోఆర్డినేటర్ ప్రవళిక, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కలెక్టర్‌ను కలిసిన అండ్రూ ఫ్లెమింగ్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యేలు కమలాకర్, సతీష్బాబును ఫ్లెమింగ్ కలిశా రు. స్మార్ట్ సిటీ ఉద్దేశాలు, కరీంనగర్ వనరులు, వాణిజ్య పెట్టుబడుల అవకాశాల పై అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ కార్యాలయానికి చేరుకొని మహిళా రాజకీయ నా యకుల ప్రాతినిథ్యం, చదువుకు దూరంగా ఉన్న పిల్లలు, బాల్య వి వాహాల గురిం చి జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమను అడిగి తెలుసుకున్నారు. జెడ్పీటీసీ లు శరత్‌రావు, అన్నపూర్ణ, కోఆప్షన్ సభ్యుడు జమీలొద్దీన్, సీఈవో పద్మజారాణి పాల్గొన్నారు. -
స్మార్ట్‌సిటీ పథకంతో పర్యావరణానికి ముప్పు
లండన్: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్మార్ట్‌సిటీ’ పథకం పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2015లో భారత ప్రభుత్వం ‘స్మార్ట్‌సిటీ’పథకానికి సంబంధించి విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావాన్ని అంచనా వేసేందుకు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లింకోల్న్కు చెందిన పరిశో ధకులు ఈ అధ్యయనం చేపట్టారు. స్మార్ట్‌సిటీ పథకంలో ప్రస్తుతం పట్టణ ప్రాంతంలో ఉన్న మూడు నుంచి ఐదంతస్తుల భవనాల స్థానంలో 40 అంతస్తులకు మించి భవన నిర్మాణాలు చేపడతామని భారత ప్రభుత్వం పేర్కొందని పరిశోధకుల తెలిపారు. -
టీఆర్ఎస్తోనే సర్వతోముఖాభివృద్ధి
-టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మెల్ బోర్న్ : దేశవ్యాప్తంగా ఎంపికైన 30 ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీంనగర్ కు స్థానం దక్కడం పట్ల టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ మెల్ బోర్న్లో సమావేశమై హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్ కు చోటు దక్కడానికి మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. రెండేళ్లుగా కరీంనగర్‌ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చడానికి చేపడుతున్న అనేక కార్యక్రమాలు, కేంద్రానికి చేసిన విజ్ఞప్తులకు నేడు ఫలితం దక్కిందన్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వినోద్ తమను కలిసినప్పడు స్మార్ట్ సిటీ దిశగా అడుగులు వేస్తున్నప్పటి నుండి చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి తమతో చర్చించారని నాగేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ ఆండ్ అర్బన్ డెవలప్మెంట్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి కరీంనగర్ నగరాన్ని ఇందులో చేర్చడానికి ఎంపీ వినోద్ ఎంతో శ్రమించారని దీనికి అనుగుణంగానే నగర పాలక సంస్థలో సాంకేతిక విజ్ఞానాన్ని అనుసంధానం చేశారన్నారు. బంగారు తెలంగాణ సాధించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న వినూత్న పథకాలతో జరుగుతున్న అభివృద్ధిని ప్రతిబింబిస్తూ తెలంగాణలోని జిల్లాలు ఆకర్షణీయ నగరాలుగా ఎంపికవ్వడం ఎంతో గర్వకారణమని తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు డా అనిల్ రావు చీటీ, విక్టోరియా ఇంచార్జి సాయి రామ్ ఉప్పు , యూత్ వింగ్ ఇంచార్జి సనీల్ రెడ్డి బాసిరెడ్డి, అధికార ప్రతినిధి రాకేష్ లక్కారసులతోపాటూ వేణునాథ్, సాయి యాదవ్, అరవింద్ ,శరన్, ప్రశాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్మార్ట్’ కరీంనగర్
మూడో దశలో దక్కిన ‘స్మార్ట్’హోదా - తెలంగాణలో కరీంనగర్‌కు దక్కిన స్థానం - హైదరాబాద్ స్థానంలో కరీంనగర్.. - స్మార్ట్ సిటీలను ప్రకటించిన కేంద్రం - రూ.1,852 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలు సాక్షి, కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీల జాబితాలో ఎట్టకేలకు కరీంనగర్ చోటు దక్కించుకుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్మార్ట్‌సిటీ మిషన్ శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన స్మార్ట్ సదస్సులో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదాను ప్రకటించారు. స్మార్ట్ సిటీ ప్రకటనతో కరీంనగర్‌కు అరుదైన గౌరవం దక్కినట్లు అయ్యి ంది. అంతేకాకుండా రెండేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. హైదరాబాద్ స్థానంలో కరీంనగర్.. తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాలను రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల కోసం ప్రమోట్ చేసింది. అయితే.. తెలంగాణ రెండింటిని మాత్రమే ఎంపిక చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు స్మార్ట్‌సిటీ హోదా ద్వారా వచ్చే రూ.500 కోట్లు ఏ మూలన సరిపోవని భావించి హైదరాబాద్ స్థానంలో కరీంనగర్‌ను స్మార్ట్ జాబితాలోకి తీసుకోవాలని స్మార్ట్ సిటీ మిషన్‌కు లేఖ రాశారు. అలాగే, 2017 మార్చి 31న ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ శశాంక స్మార్ట్‌సిటీ మిషన్‌కు డీపీఆర్‌ను సమర్పించారు. సుమారు 10 నుంచి 50 లక్షల జనాభా ఉన్న నగరాలకే ‘స్మార్ట్’హోదా దక్కగా, 3.15 లక్షల జనాభా ఉన్న కరీంనగర్‌ను ఆ స్థానంలో నిలబెట్టేందుకు ఎంపీ వినోద్‌కుమార్ చేసిన లాబీయింగ్ ఫలించింది. టవర్‌సర్కిల్ కేంద్రంగా అభివృద్ధి స్మార్ట్‌సిటీ కేంద్రంగా కరీంనగర్‌కు చారిత్రాత్మకమైన టవర్‌సర్కిల్‌ను ఎంపిక చేశారు. టవర్‌సర్కిల్ చుట్టూ సుమారు 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. సుమారు 60 శాతం నగరం రిట్రోఫిటింగ్ కిందకు రానుంది. ఇందులో 29 డివిజన్లు వస్తున్నట్లు తెలిసింది. 2వ డివిజన్ నుంచి 24వ డివిజన్ వరకు, 28, 29, 31, 38, 39, 45 డివిజన్లు ఇందులో చేరగా, మిగతా డివిజన్లను పాన్‌సిటీ కింద అభివృద్ధి చేయనున్నారు. దీనికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు. అభివృద్ధి జరిగే ముఖ్య ప్రాంతాలు.. టవర్‌సర్కిల్‌లోని ప్రధాన వ్యాపార కూడలి, ప్రధాన కూరగాయల మార్కెట్, కోల్డ్‌స్టోరేజీ, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు, వీధి వ్యాపారులకు ప్రత్యేక స్థలాలు, పార్కులు, బస్టాండ్, కలెక్టరేట్, మున్సిపల్ కార్పొరేషన్, అంబేడ్కర్ స్టేడియం, పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, పాత బజార్ కూడలి, సర్కస్ గ్రౌండ్, సైన్స్‌వింగ్ కాలేజ్, రైల్వే స్టేషన్, జిల్లా జైలు, మ్యూజియం, తెలంగాణచౌక్, సీఎస్ఐ చర్చి ఉన్నాయి. వీటితో పాటు పర్యాటక సమాచార కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. స్మార్ హోదా దక్కితే వచ్చే నిధులు స్మార్ట్ సిటీ మిషన్ కింద రూ. 1,000 కోట్లు రూ. కోట్లలో రాష్ట్ర వాటా 500 కేంద్ర వాటా 500 విస్తీర్ణం : 24 చ. కిలోమీటర్లు మున్సిపాలిటీగా : 1958 గ్రేడ్–1 మున్సిపల్‌గా : 1985 కార్పొరేషన్‌గా : 2005 నివాసగృహాలు : 53,000 నగర జనాభా : 3,15,000 నగర ఓటర్లు : 2,26,000 అమృత్ హోదా : 2015 కుటుంబాలు : 79,000 నగర డివిజన్లు : 50 స్లమ్‌లు : 41 రూ. కోట్లలో మొత్తం ప్రతిపాదనలు 1,852 రిట్రోఫిటింగ్ 267 వినోదం, పర్యాటకం 76 ప్రజా రవాణా 337 సదుపాయాలు 540 కరెంట్ కోసం 83 ఇతర అవసరాలకు 132 రవాణాకు 226 నీటి సరఫరాకు 140 విద్యావిధానానికి 15 స్మార్ట్ గవర్నెన్స్‌కు 36 -
గృహ, స్మార్ట్ సిటీల నిర్మాణానికి దన్ను
హడ్కో సీఎండీ మేడిది రవికాంత్ • మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వస్తున్నాయి • మా నికర ఎన్పీఏ కేవలం 1.51 శాతమే • ప్రభుత్వ రుణాల్లో కేవలం 0.75% ఎన్పీఏ • తెలుగు వ్యక్తి సారథ్యంలో హడ్కో కాంతులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు 2022 నాటికి అందరికీ ఇళ్లు, 100 స్మార్ట్ సిటీల నిర్మాణం.. ఈ రెండు లక్ష్యాలను సాధించేందుకు చేయూతనిస్తానంటోంది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో). ఇటీవలే స్టాక్మార్కెట్లో లిస్టయిన హడ్కో బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందంటున్నారు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మేడిది రవికాంత్. కేరళ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అయిన రవికాంత్ తెలుగు వారే కావడం విశేషం. మూడేళ్లుగా హడ్కోకు సారథ్యం వహిస్తున్న రవికాంత్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆ సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణను పంచుకున్నారు. ముఖ్యాంశాలు... ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర్రు రెవెన్యూ పరిధిలోని మైజారుగుంట అనే ఓ కుగ్రామం మాది. విద్యాభ్యాసం అంతా పంచాయతీ పాఠశాలల్లోనే సాగింది. ఆ తరువాత నర్సాపూర్‌లో చదువుకున్నా. ఆంధ్రాయూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో పీజీ, పీహెచ్డీ చదివా. ఆ తరువాత 1986లో ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యా. కేరళ క్యాడర్లో పనిచేశా. ఆ తరువాత ఢిల్లీలో ఎక్కువ కాలం ఉన్నాను. ఆటమిక్ ఎనర్జీ, కార్మిక శాఖ, అపెడా, విద్యుత్తు శాఖ, సామాజిక న్యాయ శాఖ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేశా. సాక్షి, న్యూఢిల్లీ హడ్కో ఇటీవలే స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. హడ్కో ఐపీవో దాదాపు 80 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. ఈ స్పందన మీపై మరింత బాధ్యతను పెంచిందనొచ్చా? ధన్యవాదాలు. హడ్కో పనితీరుకు ఇది అద్దంపడుతుంది. ఐపీఓ చాలా గొప్ప విజయం. దీని కోసం చాలా శ్రమించాం. 2016 మధ్యకాలంలో సీసీఈఏ అనుమతి లభించినప్పటి నుంచి మా కృషి ప్రారంభించాం. మదుపరుల విశ్వాసం చూరగలిగాం. మరింత బాధ్యతగా భావించి ముందు ముందు మరింత కృషితో సంస్థను ముందుకు తీసుకెళతాం. ఇంత స్పందనకు కారణమేంటి? గృహ నిర్మాణ రంగానికి, పట్టణ మౌలిక సదుపాయాల కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది. గృహ నిర్మాణానికి 35 శాతం, మిగిలినది పట్టణాభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల కల్పనలో భాగంగా విద్యుత్తు సరఫరా, మంచి నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాజెక్టులకు రుణాలు ఇస్తాం. అలాగే నీటి సరఫరా ప్రాజెక్టులకు, పాఠశాలలు, వైద్య కళాశాలలు, రహదారులు, వంతెనలకు కూడా రుణాలు ఇస్తున్నాం. మిషన్ భగీరథ, సీఆర్డీఏ వంటి ప్రాజెక్టులకు ఇచ్చాం. ఇచ్చిన రుణం తిరిగి రావడం కూడా మా విజయానికి కారణంగా చెప్పొచ్చు. రూ. 11 లక్షల లాభంతో ప్రారంభమైన హడ్కో ఇప్పుడు రూ. 1000 కోట్ల లాభాలు ప్రకటించింది. ఈ స్పందనను నిలబెట్టుకోవడానికి మీ ప్రణాళికలు ఏంటి? మాకు ఆథరైజ్ క్యాపిటల్ రూ. 2,500 కోట్లు ఉంది. పెయిడ్ అప్ క్యాపిటల్ రూ. 2,002 కోట్లు ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ కంపెనీ. వాటాలో పట్టణ పేదరిక నిర్మూలన శాఖ(హుపా) 70 శాతం, గ్రామీణాభివృద్ధి శాఖ 20 శాతం, పట్టణాభివృద్ధి శాఖ 10 శాతం చొప్పున కలిగి ఉన్నాయి. హుపాకు చెందిన 70 శాతం నుంచి 10 శాతం ఉపసంహరించుకోవడం ద్వారా రూ. 1,200 కోట్ల సమీకరణకు ఐపీఓకు వెళ్లాం. ఈ నిధులు కేంద్రానికి సమకూరుతాయి. మా కంపెనీకి తగినంత ఈక్విటీ ఉంది. ఆ నిధులు మాకు అవసరం లేదు. అయితే తాజా స్పందన చూసిన తరువాత మాపై బాధ్యత పెరిగినట్టయింది. ఈ బాధ్యతను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు.. రుణ మంజూరు, బట్వాడా వేగం పెంచుతాం. ఫలానా రంగానికే రుణాలు ఇవ్వాలన్న ఆంక్షలు లేవు. పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన, గృహ నిర్మాణ రంగానికి సంబంధించి ఏ అంశానిౖ కైనా ప్రాధాన్యత ఇస్తాం. సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చడంలో హడ్కో పాత్ర ఎలా ఉండబోతోంది? 2022 నాటికి అందరికీ గృహాలు సమకూర్చాలన్న మిషన్ ఊపందుకుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం, క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్, అఫర్డబుల్ హౌసింగ్ యూనిట్లకు సబ్సిడీ, వ్యక్తిగతంగా ఇంటి నిర్మాణం లేదా అభివృద్ధి తదితర విభాగాల్లో కేంద్రం లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తోంది. వీటిల్లో రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.3 లక్షల వరకు సబ్సిడీ అందుతుంది. సొంతింటి కలను నెరవేర్చడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. దీనికి నోడల్ ఏజెన్సీగా ఉన్న మేం ఈ సబ్సిడీ లబ్ధిదారుకు అందేలా చూస్తాం. రాష్ట్రాల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రుణాలు అందిస్తాం. 2022 నాటికి అందరికీ ఇల్లు మిషన్ విజయవంతానికి ఉన్న ప్రతిబంధకాలు ఏంటి? ఏపీ, తెలంగాణలో ప్రగతి ఎలా ఉంది? ఏ విధానంలోనైనా నిబంధనలకు లోబడి పనిచేయాలి. ఆయా పథకాల్లో లబ్ధి పొందాలంటే సంబంధిత రుణం మహిళ పేరు మీదగానీ, జాయింట్‌గా గానీ తీసుకోవాలి. భూమి టైటిల్ క్లియర్‌గా ఉండాలి. కొన్ని నిబంధనలకు లోబడి నిర్మాణాలు ఉండాలి. టైటిల్ డీడ్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకం అమలులో చొరవ తీసుకుంటున్నాయి. తెలంగాణలో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఈ దిశగా చర్యలు ఊపందుకున్నాయి. హడ్కో నేరుగా ప్రజలకు హౌసింగ్ లోన్లు ఇస్తుందా? అవును. దానికి మావద్ద హడ్కో నివాస్ అనే ఒక పథకం ఉంది. ఈ పేరు మీద రిటైల్ హౌసింగ్ లోన్లు ఇస్తాం. రీచింగ్ అన్రీచ్డ్ అన్న నినాదంతో షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, మైనారిటీలు ఉన్న ఆవాసాలకు చేరడానికి ఈ రిటైల్ హౌసింగ్ ఫైనాన్స్ చేస్తున్నాం. హడ్కో నివాస్ విస్తరణకు కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనలను సరళీకృతం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు వడ్డీ తక్కువగా ఉండేలా చూస్తున్నాం. మా రుణాల్లో 96 శాతం తక్కువ ఆదాయం కలిగిన వారికే ప్రయోజనం చేకూరుస్తున్నాయి. పట్టణ వసతుల అభివృద్ధిలో, స్మార్ట్ సిటీస్ మిషన్‌లో మీ పాత్ర ఏంటి? ఒకరకంగా మాది టెక్నో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సివిల్ ఇంజనీరింగ్ తదితర అన్ని బ్రాంచీల్లో మాకు నిపుణులు ఉన్నారు. 47 ఏళ్ల అనుభవం ఉంది. మేం రుణ వితరణ పెంచుకునేందుకు స్మార్ట్ సిటీస్ మిషన్ దోహదపడుతుంది. ఈ మిషన్‌లో ఏర్పాటయ్యే స్పెషల్ పర్పస్ వెహికల్స్‌తో మేం ఒప్పందాలు కుదుర్చుకుంటాం. తద్వారా వాటిలో మేం భాగం తీసుకుంటాం. గృహ నిర్మాణానికి, పట్టణాభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంది. నీటి సరఫరా, రహదారుల అభివృద్ధికి రుణాలిస్తాం. ఇప్పటికే కొచ్చిన్ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి రుణం ఇచ్చాం. కాలికట్ ఎయిర్‌పోర్టుకు ఇచ్చాం. హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలతో పోటీని ఎలా ఎదుర్కొంటున్నారు? హడ్కో మొదట్లో ఒకటే ఉండేది. ఇప్పుడు గృహ నిర్మాణాలకు రుణాలు ఇచ్చే సంస్థలు దాదాపు 70 ఉన్నాయి. పోటీ ఎక్కువగా ఉంది. బ్యాంకులు కూడా మాకు పోటీయే. డీమానిటైజేషన్ వల్ల వాళ్లకు డిపాజిట్లు ఉన్నాయి. వాళ్లు కూడా చౌకగా రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మేం మరింత కష్టపడాలి. అయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల చొరవ మాకు కలిసొస్తుంది. హడ్కోకు వాటితో ఉన్న సత్సంబంధాలు కలిసొస్తాయి. భవిష్యత్తు ప్రాజెక్టులు ఏంటి? ప్రత్యేకించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏవైనా ప్రతిపాదనలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా భోగాపురం తదితర విమానాశ్రయాలు రానున్నాయి. అలాగే అమరావతి ప్రాజెక్టు రానుంది. వాటికి రుణాలు అవసరం. అలాగే ఏపీలో టూరిజం ప్రాజెక్టులకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మౌలికవసతుల స్థాపనకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో మిషన్ భగీరథకు గణనీయమైన స్థాయిలో రుణం ఇచ్చాం. హైదరాబాద్‌లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకాలకు ప్రతిపాదనలు వచ్చాయి. దేశంలో మొండి బకాయిలు పేరుకుపోయిన పరిస్థితిలో బ్యాంకులు ఇబ్బందులు పడుతున్నాయి. హడ్కో పరిస్థితి ఏంటి? బ్యాంకులతో పోలిస్తే హడ్కో పరిస్థితి బాధాకరంగా ఏమీ లేదు. 6.8% స్థూల ఎన్పీఏ ఉండగా.. 1.51% నికర ఎన్పీఏ ఉంది. ప్రభుత్వంతో చేసిన బిజినెస్‌లో 0.75% ఎన్పీఏ. ఇది చాలా తక్కువనే చెప్పాలి. గత దశాబ్దంలో పవర్‌ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు 5–10% వాటిలో పెట్టుబడి పెట్టాం. రకరకాల కారణాల వల్ల ఆలస్యం కావడంతో అవి ఎన్పీఏలుగా పరిగణనలోకి వచ్చాయి. అది సాంకేతికమే. అంతేతప్ప అవి రావని కాదు. అప్పటివే ఇప్పుడు బాధించాయి. 2013 నుంచి మాత్రం ప్రైవేటు సంస్థలకు రుణాలు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు, వాటి ఏజెన్సీలకు మాత్రమే ఇస్తూ వచ్చాం. సామాజిక బాధ్యత కింద హడ్కో చేస్తున్న పథకాలు ఏంటి? విశాఖలో నైట్ షెల్టర్లు నిర్మించేందుకు సాయం చేశాం. ఒక పూట భోజన వసతికి సాయం చేశాం. సిక్కింలో ఎయిడ్స్ బాధిత చిన్నారులకు భవనాలు నిర్మించాం. అనేక ప్రాంతాల్లో స్వచ్ఛభారత్, డిజిటల్ లిటరసీ తదితర పథకాలకు సాయం చేశాం. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు డ్రైవింగ్, టైలరింగ్, స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇస్తున్నాం. -
గొంతెండుతున్నా.. పట్టించుకోరా!
– ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు – కర్నూలులో నీటి ఎద్దడిపై కలెక్టరేట్ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన – ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతోనే కర్నూలులో తాగునీటి సంక్షోభం – హెచ్ఎన్ఎస్ఎస్ నీటిని అనంతపురానికి తరలించడంపై మండిపాటు – తాగునీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలును స్మార్ట్ సిటీగా మార్చుతామని ప్రగల్బాలు పలికిన టీడీపీ నాయకులు...వేసవిలో మాత్రం ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు లేకుండా చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య మండిపడ్డారు. కర్నూలు నగరంలోని 51 డివిజన్లతోపాటు జిల్లా వ్యాప్తంగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్నా ప్రజాప్రతినిధులు, అధికారుల్లో చలనం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. నీటి ఎద్దడిపై సోమవారం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ప పార్టీ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలతు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కార్యాలయం నుంచి గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో గౌరు, బీవై రామయ్య మాట్లాడుతూ..కర్నూలులో చాలా వార్డుల్లో రాత్రి పూట వచ్చే నీళ్ల కోసం మహిళలు జాగారం చేయాల్సి వస్తోందన్నారు. కనీసం పది బిందెలు కూడా నిండకుండానే నీటి సరఫరా బంద్ అవుతుండడంతో వారి బాధలు వర్ణనాతీతమన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఒట్టి పోయిందన్నారు. హంద్రీనీవా నీటిని జీడీపీ ద్వారా కర్నూలుకు తీసుకువస్తే జిల్లావ్యాప్తంగా తాగునీటి ఎద్దడిని నివారించవచ్చన్నారు. అయితే అధికారులకు ఇక్కడ ముందుచూపు లేకపోవడంతో హెచ్ఎన్ఎస్ఎస్కు కేటాయించిన 37 టీఎంసీల నీటిలో అనంతపురం జిల్లాకు 30 టీఎంసీలను తరలించుకుపోతున్నారన్నారు. దీంతో ఏడు టీఎంసీల నీటిలో జీడీపీకి కేవలం 0.7 టీఎంసీల నీటినే కేటాయించారన్నారు. జీడీపీ కనీస నీటి మట్టం 4.5 టీఎంసీలు కాగా కనీసం 2.5 టీఎంసీల నీటితో నింపి ఉంటే కర్నూలుకు నీటి ముప్పు తప్పేదన్నారు. జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితోపాటు మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నా తాగునీటి ఎద్డడి నివారణ కోసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారన్నారు. సమస్య పరిష్కరించడం చేతకాకపోతే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జీ మురళీకృష్ణ, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పది రోజులకొకసారి నీళ్లు వదులుతున్నారు: గౌరు చరితారెడ్డి కర్నూలు కార్పొరేషన్ పరిధిలో పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి 14 డివిజన్లలో పది రోజలకొకసారి నీళ్లు వదులుతున్నారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. ట్యాంకర్లు పంపాలని అడిగినా మునిసిపల్ అధికారులు కనీసం స్పందించడం లేదన్నారు. ఇక్కడి ప్రజలు ఇంటి పన్నులు కట్టడం లేదా? నీటి పన్ను కట్టడంలేదా అంటూ అధికారులను ప్రశ్నించారు. కర్నూలుతో పోల్చుకుంటే పాణ్యం వార్డుల్లో ఎక్కువ నీటి ఎద్దడి ఉందన్నారు. అంతేకాక వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. దోమలపై దండయాత్ర పేరుతో కోట్లాది రూపాయలను వృథా చేశారని ఆరోపించారు. బుదర నీటిని సరఫరా చేస్తున్నారు: హఫీజ్‌ఖాన్ ఎస్ఎస్ ట్యాంకు ఒట్టిపోవడంతో నగర ప్రజలకు బుదర నీటిని సరఫరా చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్ మండిపడ్డారు. కనీసం నీటిని క్లోరినేషన్ చేయకుండా వదులుతుండడంతో వాటినే తాగిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ఏ ఆసుపత్రిలో చూసిన పచ్చ, తెల్ల కామెర్లతో బాధపడుతున్నా చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఉన్నారన్నారు. కర్నూలు నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు.. మినరల్ వాటర్ పేరుతో వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. కర్నూలులో నాలుగైదు రోజులకు ఒకసారి కూడా సక్రమంగా నీళ్లు వచ్చే దాఖలాలు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఎస్ఎస్ ట్యాంక్ అవసరం కర్నూలులో నీటి ఎద్దడి నివారణ కోసం మునగాలపాడు సమీపంలో మరో ఎస్ఎస్ ట్యాంకు నిర్మాణానికి కావాల్సిన 200 ఎకరాల భూమి ఉన్నా పాలకులు ఆ ఊసే మరచారని నగర కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్ విమర్శించారు. ఈ విషయం మునిసిపల్ ఇంజినీర్లకు తెలిసినా దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం సమర్పించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణారెడ్డి, నాగరాజుయాదవ్, సురేందర్‌రెడ్డి, సీహెచ్ మద్దయ్య, అబ్దుల్ రెహ్మన్, రాజా విష్ణువర్దన్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, సలోమి, ఉమాభాయ్, కటారిసురేష్, రవిబాబు, సాంబా, జాన్, మాలిక్, కిశోర్, మంగప్ప, విజయలక్ష్మి, చెన్నమ్మ, వెంకటేశ్వరమ్మ, ఖాదామియా, రిజ్వాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణుడు కరుణించలేదు
► సిక్కోలుపై శీతకన్ను! ► నదుల అనుసంధానం, ఆఫ్‌షోర్ ప్రాజెక్టుల ఊసే లేదు ► చంద్రబాబు హామీలకూ బడ్జెట్లో దక్కని నిధులు ► పారిశ్రామిక అభివృద్ధికి కేటాయింపుల కొరత ► వంశధార ప్రాజెక్టుకు అరకొర నిధులే ► రిమ్స్‌కు మొండిచేయి... ► ఈసారైనాగూడు దక్కేనా? ► ఎన్నికల హామీలు నెరవేరేనా? ►4వ బడ్జెట్లోనూ జిల్లాకు చోటు కరువు వెనుకబడిన జిల్లాగా గుర్తించామని ప్రభుత్వం చెబుతుంటే నిధుల కేటాయింపులో పెద్దపీట వేస్తారని జిల్లాప్రజలు ఆశించారు. కానీ అది ప్రకటనలకే పరిమితమని రాష్ట్ర బడ్జెట్ మరోసారి రుజువు చేసింది. గత మూడు బడ్జెట్ల్లోనూ జిల్లాకు మొండిచేయి ఎదురైనా కనీసం నాలుగో బడ్జెట్లోనైనా జిల్లాకు మేలు జరుగుతుందనుకుంటే... ప్రజల ఆశలు అడియాశలే అయ్యాయి. బుధవారం శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశలే మిగిల్చింది. సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: జిల్లాలో అత్యంత ప్రధానమైన వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని, వంశధార–నాగావళి నదులను అనుసంధానం చేస్తామని, ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తామని జనచైతన్య సదస్సు (10.12.2015)లో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వంశధార నిర్వాసితులకు రూ.5 లక్షల చొప్పున యూత్ ప్యాకేజీ ఇవ్వడానికి ఇటీవల ప్రభుత్వం రూ.421.80 కోట్లు కేటాయించింది. హిరమండలం రిజర్వాయర్ పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని సీఎం, మంత్రి అచ్చెన్న ఇస్తున్న వాగ్దానాలు కార్యారూపం దాల్చాలంటే నిర్వాసితుల సమస్య పరిష్కారానికి అవసరమైన నిధులు పూర్తిస్థాయిలో కేటాయింపులు జరగాలి. కానీ వంశధార స్టేజీ–1కు 2014–15 బడ్జెట్లో రూ.3 కోట్లు, 2015–16లో రూ.18 కోట్లు, 2016–17లో రూ.9.57 కోట్లు కేటాయించారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా పెంచుతారనుకుంటే మళ్లీ రూ.9.57 కోట్లతోనే సరిపెట్టారు. ప్రాజెక్టు స్టేజీ–2కి 2014–15 బడ్జెట్లో రూ.32.93 కోట్లు, 2014–15లో రూ.32.81 కోట్లు, 2016–17లో రూ.56.77 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో మాత్రం రూ.54.82 కోట్లు మాత్రమే విదిల్చారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం రైతుల డిమాండ్లను పరిష్కరించాలంటే ఈ నిధులు ఏమూలకూ సరిపోవు. అలాగే టెక్కలి డివిజన్లోని ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు కానీ, నాగావళి–వంశధాన నదుల అనుసంధానం గురించి కానీ ఈ బడ్జెట్లో ప్రస్తావన లేదు. ట్రిఫుల్ ఐటీ అంతేసంగతులా...: శ్రీకాకుళం ట్రిఫుల్ఐటీ వచ్చే విద్యాసంవత్సరానికి కూడా జిల్లాకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎం పురంలో తొలుత 340 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం తర్వాత ఆ జీవోను ఉపసంహరించుకుంది. ఈ బడ్జెట్లోనైనా స్పష్టత వస్తుందేమో ఆశించినా నిధుల కేటాయింపే జరగలేదు. కవిటి మండలంలో ఉద్యాన కళాశాల, ఎచ్చెర్లలో వరి పరిశోధన కేంద్రం, మెరైన్ యూనివర్సిటీ, పొందూరు డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం గతంలో సీఎం హామీలిచ్చినా ఈ బడ్జెట్లోనూ వాటి ప్రస్తావన లేదు. మరోవైపు సంక్షేమ శాఖ హాస్టళ్లను ఎత్తివేసి గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అందుకు తగిన నిధులు కేటాయించలేదు. ‘స్మార్ట్’ ఎప్పటికో...: శ్రీకాకుళం సహా రాష్ట్రంలో మరో పది నగరాలకు కలిపి స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద కేవలం రూ.450 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయించారు. వాటిని పంచితే శ్రీకాకుళానికి దక్కేది నాలుగైదు కోట్లకు మించవు. ఇక శ్రీకాకుళం నగరంలో వరద ముంపు సమస్య ఏర్పడకుండా రూ.119 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ, నగరం చుట్టూ 19.20 కి.మీ. పొడవున రూ.150 కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని రెండేళ్ల క్రితమే సీఎం హామీ ఇచ్చినా ఈ బడ్జెట్లోనూ వాటి ఊసు లేదు. పారిశ్రామిక ప్రగతి అథోగతే...: జిల్లాలోని కళింగపట్నం, భావనపాడు రేవుల్లో ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తామని రైతు సదస్సు (14.02.2015)లో సీఎం ప్రకటించారు. భావనపాడు పోర్టును ఆదానీ గ్రూపుకు అప్పగించామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదు. పారిశ్రామిక రంగానికి రూ.2086 కోట్లు కేటాయించినప్పటికీ ఈ నిధుల్లో జిల్లా వాటా ఎంతో స్పష్టం చేయలేదు. ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణ అని పేర్కొన్నప్పటికీ అందుకు తగిన నిధులు కేటాయించలేదు. జిల్లాలో ఫుడ్‌పార్కు ఏర్పాటుచేస్తామని ప్రకటించినా అది ఎప్పటి నుంచో నలుగుతోంది. చెన్నై–విశాఖ పారిశ్రామిక కారిడార్‌ను శ్రీకాకుళం వరకూ పొడిగింపు ప్రస్తావనే లేదు. ఈసారైనా గూడు దక్కేనా?: నియోజకవర్గానికి 1200 చొప్పున పక్కాఇళ్లు నిర్మిస్తామన్న సీఎం హామీ నెరవేర్చేందుకు 2016–17 బడ్జెట్లో కేటాయింపులు జరిగినా జిల్లాకు మాత్రం నిధులు రాలేదు. ఈ బడ్జెట్లో రూ.1456 కోట్లు కేటాయించినా అందులో రెవెన్యూ వ్యయం పోతే మిగిలేది రూ.200 కోట్లు మాత్రమే. దీన్ని అన్ని జిల్లాలకు పంచితే వచ్చే నిధులు కేవలం పునాదుల నిర్మాణానికే సరిపోతాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలు నెరవేరేనా?: రైతురుణ మాఫీకి ఈ బడ్జెట్లో రూ.11వేల కోట్లు కేటాయించినా ఇప్పటికే రైతులకు అందజేసిన రుణవిముక్తి పత్రాల మేరకు మాఫీ చేయడానికే ఆ నిధులు సరిపోవు. తదుపరి వాయిదాల రుణమాఫీకి రూ.3,600 కోట్లు కేటాయించారు. కానీ ఇది కూడా రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సగం మంది రైతులకు కూడా సరిపోని పరిస్థితి. డ్వాక్రా రుణాల మాఫీ విషయానికొస్తే ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. జిల్లాలో మూడు లక్షలకు పైగా నిరుద్యోగ యువత ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఆ సంఖ్య కోటి వరకూ ఉండవచ్చు. మూడేళ్ల తర్వాత కొత్తగా ఈ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ అవి ఏ మూలకు సరిపోతాయని నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు. రిమ్స్‌కు మొండిచేయి...: జిల్లాకు ఆరోగ్య ప్రదాయిని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)లో అసంపూర్తిగానున్న బ్లాక్‌ల నిర్మాణానికి రూ.20 కోట్లు, పీజీ కోర్సుల నిర్వహణకు రూ.10 కోట్లు కేటాయిస్తామని సీఎం రైతుసదస్సు (14.02.2015)లో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ వాటికి నిధుల కేటాయింపు జరగలేదు. ఇక ఎన్టీఆర్ వైద్యసేవకు ఈ బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బకాయిల చెల్లింపునకే సరిపోవనే వాదనలు వినిపిస్తున్నాయి. నరసన్నపేటలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా గాలిలో కలిసిపోయినట్లే. వరుసగా మరణాలు చోటుచేసుకుంటున్న ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ బడ్జెట్లో ఎలాంటి భరోసా దక్కలేదు. ప్రజలపై బాదుడు బడ్జెట్: బడ్జెట్ ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా బాదుడు వేసేలా ఉంది. లోటు బడ్జెట్ విడుదల చేసినప్పటికీ లోటును పూడ్చే మార్గాలు ఎక్కడా ప్రస్తావించలేదు. స్వాతంత్య్ర భారత దేశం వచ్చిన తరువాత ఇంత లోటు బడ్జెట్ ఎన్నడూ చూడలేదు. నిరుద్యోగలుకు మరోసారి వెన్ను పోటు పొడిచారు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకుండా నిరుద్యోగులకు ఆర్ధిక సహాయం అనిప్రస్తావించారు. ఎన్నికల హామీలో ఏడాదికి లక్ష ఇళ్లు చొప్పున దు లక్షల గృహాలు నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం గృహ నిర్మాణశాఖకు విడుదల చేసిన బడ్జెట్ పాత ఇళ్ల బిల్లులు చెల్లించేందుకు చాలవు. ఆరోగ్యశ్రీని మంట కలిపేందుకు మరో మారు శ్రీకారం చుట్టారు. వైద్య రంగాన్ని విస్మరించారు. పాత హామీలు విడిచారు. కొత్త పథకాలు ఊసేలేదు. – తమ్మినేని సీతారాం, వైఎస్ఆర్సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు -
స్మార్ట్ సిటీలకు రూ.198 కోట్లు విడుదల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న 6 స్మార్ట్ సిటీలకు నిధులు విడుదలయ్యాయి. మంగళవారం ప్రభుత్వం రూ.198 కోట్లు విడుదల చేసింది. ఒక్కో నగరానికి రూ. 33 కోట్ల చొప్పున విడుదల చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం లను ప్రభుత్వం స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. వీటికి గాను ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది. -
‘స్మార్ట్’ సూచనలకు ఆహ్వానం
– కర్నూలు అభివృద్ధికి ప్రతి ఏటా రూ.33 కోట్లు విడుదల – ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కో–ఆర్డినేటర్ స్మిత కర్నూలు(టౌన్): కర్నూలు స్మార్ట్ సిటీగా ఎంపికైనందున..నగర అభివృద్ధికి పౌరులు, బిల్డర్లు తగిన సూచనలు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల సంస్థ కోఆర్డినేటర్ స్మిత పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక నగరపాలక సంస్థ సమావేశ భవనంలో బిల్డర్లు, వివిధ సంస్థల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలన్నారు. ప్రతి ఏడాది కర్నూలు నగరపాలక సంస్థకు స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా రూ.33 కోట్లు నిధులు విడుదలవుతాయన్నారు. ఈ నిధులను వెచ్చించి ప్రాధాన్య క్రమంలో మురుగుకాల్వలు, సీసీ రోడ్లు, తాగునీరు, పార్కులు వంటి సౌకర్యాలు కల్పించేందుకు వీలు ఉంటుందన్నారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సూపరింటెండెంట్ ఇంజనీర్ శివరామిరెడ్డి, బిల్డర్లు ఎంఎస్–9 మధుసూదన్‌రెడ్డి, సోమిశెట్టి వెంకటరామయ్య, గోరంట్ల రమణయ్య, కృష్ణకాంత్ బిల్డర్స్ వెంకటసుబ్బయ్య, సూపరింటెండెంట్లు ఇశ్రాయేల్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సొమ్మే పెట్టుబడిగా
నిధుల సమీకరణకు కొత్త ప్రతిపాదన ప్రభుత్వ హామీతో బాండ్లు జారీ స్మార్ట్ కాకినాడకు ట్రిఫుల్–బి గ్రేడ్ విధి విధానాలపై అధికారుల అధ్యయనం కాకినాడ : ప్రజల సొమ్మే పెట్టుబడిగా నిధుల సమీకరణకు ప్రతిపాదన సిద్ధమవుతోంది. ఇందుకోసం స్మార్ట్‌సిటీ కాకినాడలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి బాండ్లు ఇచ్చే దిశగా కార్పొరేష¯ŒS కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి గతవారం ఢిల్లీలో జరిగిన స్మార్ట్‌సిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు గ్రీ¯ŒSసిగ్నల్ ఇచ్చారు. దీంతో డిపాజిట్ల సేకరణ, బాండ్లు జారీ విధివిధానాలపై కార్పొరేష¯ŒS యంత్రాంగం దృష్టి సారించింది. స్మార్ట్‌సిటీగా ఎంపికైన కాకినాడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏటా రూ.300–400 కోట్లు వరకు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు వేగవంతం చేశారు. మరో వైపు స్మార్ట్‌సిటీ పరిధిలో లేదా, జిల్లా కేంద్రంలో ఏమైనా కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదిస్తే వాటికి అవసరమయ్యే రూ.కోట్ల నిధులను ప్రజల నుంచి సేకరించే దిశగా ఆలోచన చేశారు. అయితే ప్రజల నుంచి ఈ తరహాలో సొమ్ములురాబట్టి బాండ్లు జారీ చేయాలంటే కొన్ని అర్హతలు అవసరం కావడంతో ప్రస్తుతం ఆ దిశగా దృష్టి సారించారు. కాకినాడకు అర్హత... బాండ్లు జారీ ద్వారా నిధులు సేకరించే విధానానికి కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాథమికంగా అర్హత సాధించింది. దేశ వ్యాప్తంగా ఈ విధానంలో ఎనిమిది నగరాలకు అవకాశం ఉందని కేంద్ర స్థాయిలో నిర్ధారణకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడ, విశాఖ నగరాల్లో ఈ విధానం ద్వారా నిధులు సమీకరించనున్నారు. రేటింగ్‌లో ట్రిఫుల్–బి... స్మార్ట్‌సిటీ కార్పొరేష¯ŒS తరుపున ప్రజల నుంచి నిధులు సేకరించాలంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ద్వారా గ్రేడింగ్‌ను నిర్ణయిస్తారు. కాకినాడకు వచ్చే ఆదాయం, ఖర్చు, ఆడిటింగ్ ద్వారా ఈ రేటింగ్‌ను నిర్ధారిస్తారు. అర్హత కలిగిన ఎంపేనల్ ఏజెన్సీ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. కార్పొరేష¯ŒS అధికారుల సమాచారం మేరకు విశాఖకు ట్రిఫుల్–ఎ, కాకినాడకు ట్రిఫుల్–బి రేటింగ్ వచ్చింది. ఈ రేటింగ్ మరింత పెంచడం ద్వారా నూరుశాతం అర్హత సాధించే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు నుంచి వచ్చే నిధులకు పూర్తి సెక్యూరిటీ ఉండే విధంగా ప్రభుత్వం మధ్యలో హమీగా ఉండి ఈ బాండ్లను జారీ చేస్తారు. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో వచ్చిన నిధులను వినియోగంలోకి తెస్తారు. విధి విధానాలపై కసరత్తు... బాండ్లు జారీకి విధానాలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. వచ్చే డిపాజిట్లకు బాండ్లు జారీ చేసి ఆ సొమ్ముకు ప్రాజెక్టులో వచ్చే వాటా? లేదా వడ్డీ రూపంలో ఇవ్వాలా? తదితర అంశాలపై కూడా కేంద్రం నుంచి వచ్చే సూచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. కసరత్తు చేస్తున్నాం... స్మార్ట్‌సిటీ సమావేశంలో బాండ్లు జారీ ద్వారా నిధులు సమీకరణ అంశంపై సూచనలిచ్చారు. అయితే క్రెడిట్‌రేటింగ్ ఏజెన్సీ ద్వారా కాకినాడకు ట్రిఫుల్–బి వచ్చి కొంత మేరకు అర్హత సాధించగలిగాం. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేశాక విధివిధానాలు ప్రకటిస్తాం. – ఎస్.అలీమ్‌భాషా, కాకినాడ కార్పొరేష¯ŒS కమిషనర్ -
’స్మార్ట్ ఏలూరు’కు ఓకే
స్విస్ చాలెంజ్ తరహాలోనే పనులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, ఏలూరు : స్విస్ చాలెంజ్ తరహాలోనే ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికరవలన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం ’ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్’ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ కార్పొరేషన్ పేరుతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల స్ఫూర్తితో రాష్ట్ర్ర ప్రభుత్వం దీనిని చేపట్టిందన్నారు. ఏలూరు నగరపాలక సంస్థను ఆర్థికంగా పరిపుష్టం చేయడంతోపాటు నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం లక్ష్యంగా పేర్కొన్నారు. 2029కి మన రాష్ట్రాన్ని దేశంలో అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఒకటిగా చేయడంలో భాగంగా ఈ స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ఆ ఉత్తర్వుల్లో వివరించారు. నగరపాలక సంస్థ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాజెక్టులను రూపొందించి అమలు చేయడం, సమగ్ర అభివృద్ధి దిశగా నడపడం లక్ష్యమని తెలిపారు. ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకుని అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఆదాయమంతా స్మార్ట్‌కే.. ఈ ఉత్తర్వుల ప్రకారం చూస్తే.. స్మార్ట్ సిటీ పేరిట ప్రైవేటుపబ్లిక్ పార్టనర్ షిప్ పద్ధతిలో నగరంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. నగరపాలక సంస్థకు వచ్చే అద్దెలు, పన్నులు, లైసెన్స్ ఫీజులు, యూజర్ చార్జీలు, ప్రభుత్వం నుంచి వివిధ పథకాల ద్వారా వచ్చే గ్రాంట్లు, రుణాలను పూర్తిగా ఇందుకే వినియోగిస్తారు. ఇంకా అవసరమైతే అప్పులు తెస్తారు. బయటి నుంచి తెచ్చిన రుణాలను 1015 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అమృత్, స్వచ్ఛభారత్ మిషన్, సోలార్ సిటీ మిషన్, డిజిటల్ ఇండియా, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, ఐపీడీఎస్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, స్కిల్ ఇండియా తదితర ప్రాజెక్టుల ద్వారా వచ్చే నిధులను సైతం దీనికి మళ్లిస్తారు. దీని కోసం స్విస్ చాలెంజ్ తరహా విధానాన్ని అవలంబించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో ఏలూరు అభివృద్ధి కోసం డీపీఆర్ తయారు చేసిన షాపూర్జీ పల్లంజీ కంపెనీ లిమిటెడ్ పరిస్థితిని పరిశీలించి ఆమోదించాలని కోరింది. ఇప్పటికే ఎస్పీవీ ఒప్పందం కోసం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా ఎస్పీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నగరపాలక సంస్థ ప్రతిపాదించిన ముగ్గురు వ్యక్తులు డైరెక్టర్లుగా ఉంటారు. -
నగరాల రూపురేఖలు మార్చేస్తున్నాం
జియో స్పేషియల్ వరల్డ్ ఫోరమ్ సదస్సులో వెంకయ్యనాయుడు భవిష్యత్తుకు స్పేషియల్ టెక్నాలజీలే దన్ను నిర్మాణ అనుమతుల జారీ సరళతరం జియో ట్యాగింగ్‌తో వృథాకు అడ్డుకట్ట పడుతుందని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ నేతృత్వం లో దేశంలోని నగర ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నా యని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మొద లుకొని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, అమృత్ వంటి అనేక పథకాలు నగర ప్రాంతా ల రూపురేఖలను మార్చేస్తున్నా యన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జియోస్పేషియ ల్ వరల్డ్ ఫోరమ్ అంతర్జా తీయ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ప్రతి నగరం స్మార్ట్ సిటీగా మారేందుకు పోటీపడుతోం దని.. పట్టణ, నగర ప్రాంతాల్లో తిష్టవేసిన అనేక సమస్యలకు జియోస్పేషియల్ టెక్నాల జీలు వేగంగా పరిష్కారం చూపగలవని ఆయన చెప్పారు. ఈ రంగంలో దేశానికి రూ.50 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు జియోట్యాగింగ్.. మున్సిపాలిటీలు తమ ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు గమనించేందుకు జియో ట్యాగింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని, తద్వారా సిబ్బంది పనిచేస్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని వెంకయ్యనాయుడు సూచించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా కేంద్రం స్పాట్ యువర్ టాయిలెట్ పేరుతో ఓ యాప్‌ను అందుబాటు లోకి తేనుందని, దాని ద్వారా నగర ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఎక్కడెక్కడ అందు బాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చని తెలిపా రు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించే ఇళ్లకు జియోట్యాగింగ్ చేస్తున్నామని, తద్వారా ఇంటి నిర్మాణం నిజంగా జరిగిందీ లేనిదీ స్పష్టమవుతుందని చెప్పారు. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా కొత్త ఇళ్ల ఫొటోలను భువన్ సర్వర్‌తో అనుసం ధానించామని, తద్వారా ఎక్కడ ఏ ఇల్లు ఉందో స్పష్టంగా తెలిసిపోతుందని పేర్కొన్నా రు. నగరాల్లో భవన నిర్మాణాలు, ఇతర పనులకు అనుమతుల ప్రక్రియను సరళతరం చేసేందుకు పౌర విమానయాన, రైల్వే, పర్యావరణ తదితర ఏడు శాఖలతో సంప్రదింపులు జరిపి ఏకీకృత విధానాన్ని తీసుకువస్తున్నామని వెంకయ్య వెల్లడించారు. నగరాల మ్యాపుల్లోనే నిర్మాణానికి అనుమ తుల అవసరం లేని ప్రాంతాలను స్పష్టంగా గుర్తిస్తామని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని నిర్ణీత సమయం తరువాత అనుమతి పొందినట్టుగానే భావించి నిర్మాణాలు చేపట్టవచ్చునని వివరించారు. రైతులకు తోడ్పాటు అవసరం.. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, ప్రజలకు తమ భూములున్న సర్వే నంబర్లు కూడా తెలియవని, ఈ పరిస్థితి మారాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నామమాత్ర రుసు ము, ఆన్లైన్ దరఖాస్తుల తోనే భూమి రికార్డు లు రైతులకు అందు బాటులో ఉండేలా చేసేలా, వాటి ఆధారంగా బ్యాంకులు రుణా లు మంజూరు చేసేలా ప్రధాని మోదీ ప్రయ త్నం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ స్వర్ణ సుబ్బా రావు, ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం అధ్యక్షుడు స్టీఫెన్ ష్వెనిఫెస్ట్ పాల్గొన్నారు. -
కర్నూలు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు
– చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ – ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్ కర్నూలు (టౌన్): స్మార్ట్‌సిటీ పేరుతో కర్నూలు నగరంలో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కర్నూలు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. విధి విధానాలు రూపొందించి కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్‌ను నియమిస్తూ సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు నగర పరిధిలో ప్రజల జీవన పరిస్థితుల్లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు వచ్చే మూడేళ్ల వ్యవధిలో రూ. 33 కోట్లు మంజూరు చేయనుంది. చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరించే ఈ కార్పొరేషన్ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా నగరపాలక కమిషనర్, జిల్లా ఎస్పీ ఉంటారు. షేర్‌హోల్డర్లుగా ప్రిన్సిపల్ ప్రత్యేక కార్యదర్శి, మున్సిపల్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ సీఈ టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్, అడిషనల్ కమిషనర్, ఎగ్జామినర్, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఎస్ఈలు వ్యవహరిస్తారు. రూ. 5 లక్షలు విలువ చేసే షేర్లను రూ. 10 ప్రకారం 50 వేల షేర్లను రూపొందించారు. -
సామాజిక శక్తులు ఏకం కావాలి: సీపీఎం
మానకొండూర్: సీఎం కేసీఆర్ నియం తృత్వ, అప్రజాస్వామిక పాలనను ప్రజల్లో ఎండగట్టడానికి సామాజిక శక్తులన్నీ ఏకం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజక వర్గంలో కొనసాగింది. అల్గునూరు, మానకొండూర్, అన్నారం, దేవంపల్లి, కొండపల్కలల్లో ఆయన మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి కేసీఆర్ చట్టవిరుద్ధంగా పాలన కొనసా గిస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రలో కాంగ్రెస్ ఎస్సీసెల్ రాష్ట్ర చైర్మన్ ఆరెపల్లి మోహన్ పాల్గొని మద్దతు తెలిపారు. కనీస సదుపాయాలు కల్పించాలి సాక్షి, హైదరాబాద్: కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ అర్హతకు కావాల్సిన అర్హతల విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కరీంనగర్‌కు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. -
జనవరి 27,28న స్మార్ట్ సిటీస్‌పై జాతీయ సదస్సు
స్మార్ట్ సిటీల ఆవశ్యకత, వాటి నిర్మాణంలో తీసుకోవాల్సిన మెలకువలు, అభివృద్ధి చెందిన దేశాల్లో స్మార్ట్‌సిటీల పాత్ర, తదితర అంశాలపై చర్చిచేందుకు ’స్మార్ట్ సిటీస్ ఫర్ స్మార్ట్ పీపుల్’ అనే పేరుతో సంస్కృతీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కళాశాలలో జనవరి 27, 28న జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కళాశాలలో డైరెక్టర్ డాక్టర్ నారాయణరెడ్డి తో కలసి సదస్సు బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సదస్సుకు జపాన్ కు చెందిన ప్రఖ్యాత నిర్మాణ రంగ నిపుణుడు అజీబ్రౌన్, వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన క్లోయి జిమ్మర్మన్, ఆస్ట్రియాకు చెందిన శ్రీపాల్ అతిథులుగా, దేశీయంగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థల నుంచి వంద మందికిపైగా ప్రతినిధులు హాజరవుతారన్నారు. వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు కూడా సదస్సుకు హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సెంథిల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధి జాడేది?
ప్రచార ఆర్భాటంగానే స్మార్ట్ సిటీ ప్రజలపై దండయాత్ర చేస్తున్న దోమలు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ అవసరం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కమిషనర్‌కు పార్టీ నేతల వినతి పత్రం కాకినాడ : స్మార్ట్ సిటీగా ఎంపికయిందన్న ప్రచారమే తప్ప ఎక్కడా అభివృద్ధి జాడ కనిపించడంలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ఆకర్షణీయ నగరంగా ఎంపికయ్యాక ఏడాది ఉత్సవాలు కూడా పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు తీరు కేవలం ప్రచార ఆర్భాటంగానే కనిపిస్తోందన్నారు. భూగర్భ డ్రెయినేజీ, స్మార్ట్ సిటీ, నగరంలోని ప్రధాన సమస్యలపై వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సోమవారం కమిషనర్ అలీమ్‌బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నేతలంతా సమావేశమై సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రణాళిక లేకుండా నిర్మిస్తున్న డ్రెయినేజీ వ్యవస్థ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రణాళిక బద్ధంగా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్‌సిటీని కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయడం సరికాదన్నారు. నగరంలో అభివృద్ధి కుంటుపడింది, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో హంగామా చేస్తున్నప్పటికీ వాస్తవానికి దోమలే ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయన్నారు. ఎక్కడా ఫ్యాగింగ్ జరుగుతున్న దాఖలాలు కనిపించడంలేదన్నారు. సిటీ కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని ప్రాతిపదికగా తీసుకుని అభివృద్ధి చేయడంలేదని విమర్శించారు. కేవలం మెయిన్‌రోడ్డు, సినిమారోడ్డు వంటి ప్రధాన ప్రాంతాల్లోనే పనులు చేపట్టడం ద్వారా మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న డ్రెయినేజీ రోడ్డుకన్నా ఎత్తులో చేపట్టారని, దీనివల్ల ముంపు సమస్య యథావిధిగానే కొనసాగుతుందన్నారు. సరైన ప్రణాళికతో డ్రెయినేజీ పనులు చేపట్టాలని సూచించారు. వైఎస్సార్ సీపీ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కొరవడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ర్యాలి రాంబాబు, మాజీ కౌన్సిలర్ బొట్టా కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు చాట్ల చైతన్య, బెజవాడ బాబి, చిలుకూరి మనోజ్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ప్రసాదరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
స్వరాజ్య మైదానం ప్రైవేట్‌కు
►పీపీపీ విధానంలో సిటీ స్క్వేర్ ప్రాజెక్టుకు అనుమతి ►స్మార్ట్ సిటీలుగా ఆరు నగరాలు ►జక్కంపూడిలో ఎకనామిక్ సిటీ ►విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ►రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు సాక్షి, అమరావతి: విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానంలో సిటీ స్క్వేర్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందులో ఉన్న రైతు బజార్, ప్రభుత్వ కార్యాలయాలు, క్వార్టర్లను తొలగించి మిగిలిన గ్రౌండ్‌తో కలిపి పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో మల్టీ పర్పస్ రిక్రియేషన్ అండ్ కమర్షియల్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే చైనాకు చెందిన జీఐఐసీ కంపెనీతో ఈ సిటీ స్క్వేర్ డిజైన్ తయారు చేయించిన ప్రభుత్వం దాన్ని ఆమోదించనుంది. దీనికి సంబంధించిన డీపీఆర్ (సవివర నివేదిక)ను ఆమోదించే బాధ్యతను పట్టణీకరణపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీపీపీ విధానంలో వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతోపాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, నారాయణ మీడియాకు వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి... ♦ విజయవాడ స్వరాజ్య మైదానం, దానికి ఆనుకుని ఉన్న 27.5 ఎకరాల విస్తీర్ణంలో పీపీపీ విధానంలో విజయవాడ సిటీ స్క్వేర్ ఏర్పాటుకు అనుమతి. అందులో షాపింగ్ కాంప్లెక్స్, థీమ్ పార్క్, ఎగ్జిబిషన్ కాంప్లెక్స్, మినీ ఇండోర్ స్టేడియం, పబ్లిక్ ప్లేస్ తదితరాలు ఏర్పాటు. ♦ విశాఖపట్నంలో 11 ఎకరాల్లో పీపీపీ విధానంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం. ♦ విజయవాడ, గుంటూరు నగరాల పరిధిలో మౌలిక వసతుల ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు గుంటూరు–విజయవాడ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్) ఏర్పాటుకు ఆమోదం. ♦ కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన మూడు స్మార్ట్ సిటీలు కాకుండా కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం, ఒంగోలు నగరాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం. ♦ విజయవాడలోని జక్కంపూడిలో 256 ఎకరాల్లో పీపీపీ విధానంలో ఎకానమిక్ టౌన్షిప్ ఏర్పాటుకు అనుమతి. ♦ మున్సిపల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల సర్వీసు నిబంధలను క్రమబద్ధీకరించేందుకు ఆమోదం. ♦ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 35 శాతం వేతనాల పెంపునకు ఆమోదం. ఉద్యోగుల ప్రతిభ ఆధారంగా మరో పది శాతం ప్రోత్సాహకం అదనంగా చెల్లింపు. భారీగా భూకేటాయింపులు ♦ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం సర్వే నెంబర్ 1604లోని 9.74 ఎకరాలను ఎకరం రూ.8 లక్షల చొప్పున ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి కేటాయింపు. ♦ అగ్రిగోల్డ్‌కు సంబంధించి విజయవాడలో రూ.90 కోట్ల విలువైన 13 ఆస్తులు, కృష్ణాజిల్లా కీసరలో రూ.200 కోట్ల విలువైన 341 ఎకరాల వేలానికి 26వ తేదీ వరకూ బిడ్ల స్వీకరణ. 27వ తేదీన బిడ్లు తెరవాలని నిర్ణయం. బ్యాంకులపై నెట్టేయండి... పెద్ద నోట్ల రద్దు అంశం మంత్రివర్గ , తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఓ కుదుపు కుదిపింది. ఇప్పటివరకూ పెద్ద నోట్ల రద్దుకు కర్త, కర్మ, క్రియ తానేనని చెప్తూ వచ్చిన సీఎం చంద్రబాబు ఇక నుంచి ఆ అంశంపై సాధ్యమైనంత తక్కువగా మాట్లాడటంతో పాటు ప్రస్తావించకూడదని నిర్ణయించారు. గురువారం బాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం ఉండవల్లిలోని నివాసంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా బాబు నోట్ల రద్దు పరిణామాల తప్పిదాన్ని బ్యాంకులపై నెట్టేయాలని సూచించారు. ♦ కేబినెట్ భేటీకి సెల్ఫోన్లు తీసుకురావొద్దు సీఎంవో కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టింది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనే మంత్రులు తమ సెల్ఫోన్లను బయటే డిపాజిట్ చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
స్మార్ట్ సిటీ ‘పీఎంసీ’ టెండర్ల రద్దు
కొత్త టెండర్లు పిలిచిన కార్పొరేషన్ కాకినాడ : వివాదానికి దారితీసిన కాకినాడ స్మార్ట్ సిటీ పనుల పర్యవేక్షణకు సంబంధించి గతంలో పిలిచిన ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ (పీఎంసీ) టెండర్లను రద్దు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు మూడు రోజుల క్రితం జరిగిన స్మార్ట్ సిటీ ఎవాల్యుయేష¯ŒS కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఆర్వీ అసోసియేట్స్‌కు టెండర్ ఖరారు కాగా, రెండో స్థానంలో నిలిచిన వాడియా సంస్థ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు పీఎంసీ నియామకంపై స్టే ఇచ్చింది.అనంతరం వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా కోర్టు ఆదేశించడంతో ఎవాల్యుయేష¯ŒS కమిటీ మూడు రోజుల క్రితం సమావేశమై ఇరువర్గాల వాదనలు, ఆయా సంస్థలు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించింది. అనంతరం స్మార్ట్ సిటీ ఎండీ, కమిషనర్ అలీమ్‌బాషా, కలెక్టర్ అరుణ్‌కుమార్, ఇతర కమిటీ సభ్యులు ఈ అంశంపై చర్చించి చివరకు టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొత్త టెండర్లను కూడా పిలిచారు. ఇందుకు సంబంధించి బుధవారం ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ నియామకానికి సంబంధించి టెండర్ ప్రకటన కూడా ప్రచురితమైంది. దీంతో దాదాపు 4, 5 నెలలుగా స్తంభించిన పనులకు మళ్ళీ కదలిక వచ్చినట్లయింది. -
చతుర్ముఖుడు!
బాబూరావునాయుడుకు తాత్కాలికంగా మూడు కీలక బాధ్యతలు వుడా వీసీతో పాటు కలెక్టర్, జేసీ, జీవీఎంసీ కమిషనర్‌గా ఇన్చార్జి కిరీటాలు పది రోజులపాటు అన్నీ ఆయనే విశాఖపట్నం : ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఒక బాధ్యత నిర్వహించడమే కత్తి మీద సాములా ఉంటుంది.. అలాంటిది ఏకంగా నాలుగు బాధ్యతలు.. అవి కూడా అత్యంత కీలకమైనవే అయితే ఇంకెలా ఉంటుందో ఊహించండి.. ఇప్పుడు అదే పరిస్థితి జిల్లాలో ఓ ఉన్నతాధికారికి ఎదురైంది.. ఆ ఒక్కడు.. వుడా వైస్ చైర్మన్ బాబూరావునాయుడు. జిల్లా పాలనాపగ్గాలతోపాటు మరో మూడు కీలక బాధ్యతలను నెత్తికెత్తుకున్న ఆయన సుమారు పది రోజులపాటు ఆయన చతుర్ముఖ పాలన సాగించనున్నారు. అయ్యవార్లెవరూ లేకపోవడంతో ప్రభుత్వం ఆ బాధ్యతలన్నింటినీ ఆయనకు కట్టబెట్టింది. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్‌లు స్మార్ట్‌సిటీ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. మరోపక్క జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒక్కటై రాజకీయ పైరవీలతో జిల్లా జాయింట్ కలెక్టర్ జే.నివాస్‌ను బదిలీ పేరుతో సాగనంపారు. దీంతో కీలకమైన మూడు పోస్టులు ఒకేసారి ఖాళీ అయ్యాయి. మూడో తేదీ వరకు స్మార్ట్ సిటీ సదస్సులో పాల్గొననున్న కలెక్టర్, కమిషనర్లు.. అనంతరం ఈ నెల 10వ తేదీ వరకు సెలవు పెట్టారు. దీంతో సీనియర్ ఐఏఎస్‌గా ఉన్న వుడా ఉపాధ్యక్షుడు బాబూరావు నాయుడుకు ఈ బాధ్యతలన్నీ చుట్టుకున్నాయి. కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌తోపాటు జిల్లా జాయింట్ కలెక్టర్ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. ఈ నెల 10వ తేదీ వరకు ఇన్ చార్జి కలెక్టర్, కమిషనర్‌గా వ్యవహరించనున్న బాబూరావునాయుడు.. ఆ తర్వాత కొత్త జేసీ వచ్చే వరకు ఇన్చార్జి జేసీ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ జీవోఆర్టీ నెం.2231ను జారీ చేశారు. దీంతో వుడా వీసీతో పాటు కీలకమైన కలెక్టర్, జేసీ, జీవీఎంసీ కమిషనర్‌గా చతుర్ముఖ పాలన సాగించనున్నారు. సోమవారం ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన గ్రీవెన్స్‌ను నిర్వహించారు. -
కార్పొరేషన్ దిశగా పాలమూరు
వడివడిగా పడుతున్న అడుగులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ అధికారులు ఇప్పటికే కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం..ప్రభుత్వానికి నివేదిక కార్యరూపం దాల్చిన ఔటర్‌రింగ్‌రోడ్డు అన్నీ సక్రమంగా జరిగితే స్మార్ట్ సిటీగా మహబూబ్‌నగర్ సాక్షి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ పట్టణం కొత్తరూపు సంతరించుకోనుంది. ప్రస్తుతం గ్రేడ్–1 మున్సిపాలిటీగా, దాదాపు 3లక్షల జనాభాతో కొనసాగుతున్న పాలమూరు మున్సిపాలిటీ త్వరలో కార్పొరేషన్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. గతంలో కేవలం 28 చ.కి.మీ మాత్రమే ఉన్న మహబూబ్‌నగర్ పట్టణం ప్రస్తుతం 98.82 చ.కి.మీలకు విస్తరించింది. రోజు రోజుకూ జనాభా విస్తరిస్తుండటంతో మెరుగైన సేవలు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. పట్టణాలను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు బృహత్ ప్రణాళిక రూపొందించాలన్నా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు.. కార్పొరేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. 2011 జనగణన ప్రకారం 2.53 లక్షలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో 41వార్డులు ఉండగా... గతేడాది పది గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. దీంతో పట్టణ విస్తీర్ణం పెరగడంతోపాటు జనాభా కూడా మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీని.. కార్పొరేషన్ చేయాలంటూ రెండు నెలల క్రితమే మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. స్మార్ట్‌సిటీగా వడివడి అడుగులు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌పై ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు సమీప పట్టణాలను మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు అనుగుణంగా రాజధానికి అత్యంత చేరువలో పాలమూరు ఉండడం... సీఎం కేసీఆర్‌కు ఈ పట్టణంపై ప్రత్యేక అభిమానం ఉంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరినందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అంతేకాదు కేవలం గంట వ్యవధిలో హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. జిల్లా కేంద్రం నుంచి రవాణాకు డోకాలేదు. ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు 24 గంటలపాటు బస్సు, రైళ్లు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. మణిహారంగా ఔటర్ రింగ్‌రోడ్డు రాయిచూరు రహదారి కారణంగా పట్టణంలో ట్రాఫిక్‌కు తీవ్ర అటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో పట్టణం చుట్టూ మణిహారంలా ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అందుకు రూ.96 కోట్లు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. స్వయంగా ముఖ్యమంత్రి సంక్షేమనిధి నుంచి రహదారి నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో దాదాపు దశాబ్ధకాలంగా మాటలకే పరిమితమవుతూ ఔటర్ రింగ్‌రోడ్డు ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఈ రహదారి వల్ల ముఖ్యంగా జడ్చర్ల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే మార్గంలో అప్పనపల్లికి ముందు హౌసింగ్‌బోర్డు నుంచి ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేయనున్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి బండమీదపల్లి వెనక నుంచి అలీపూర్ రోడ్డును తాకుతూ పాలమూరు విశ్వవిద్యాలయం వెనకనుంచి రాయిచూరు ప్రధాన రహదారికి అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రాయిచూరుకు వెళ్లే వాహనాలు పట్టణం మీదుగా వెళ్తుండడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం భారీ వాహనాలు రాత్రివేళ పట్టణం మధ్యలోనుంచి వెళ్తుండగా... ఉదయం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పక్కనుంచి భూత్పూరు జాతీయరహదారి గుండా వెళ్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఇరుకుగా మారిపోయిన రహదారులకు... ఔటర్ రింగ్‌రోడ్డు వల్ల వాహనదారులకు ఉపశమనం చేకూరనుంది. పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే, మున్సిపల్‌చైర్‌పర్సన్ ప్రత్యేక దృష్టి.. మహబూబ్‌నగర్ పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. దశాబ్ధ కాలంగా ఎదురు చూస్తున్న ఔటర్ రింగ్‌రోడ్డును సీఎం కేసీఆర్ వద్ద గట్టిగా ప్రస్తావించి రహదారికి గ్రీన్‌సిగ్నల్ ఇప్పించగలిగారు. అంతేకాదు సీఎం ప్రత్యేక సంక్షేమనిధి నుంచి నిధులు కూడా మంజూరు చేయించారు. రహదారి కోసం భూసర్వే పనులు శరవేగంగా చేయిస్తున్నారు. అదే విధంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్ తనదైన వ్యూహ రచనతో అభివృద్ధి పట్ల ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన మహబూబ్‌నగర్ కార్పొరేషన్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నట్లు పేర్కొంటూ ఏకంగా కౌన్సిల్ చేత ఏకగ్రీవ తీర్మాణం చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఔటర్‌రింగ్‌రోడ్డు ఇలా.. జడ్చర్లనుంచి జిల్లా కేంద్రానికి వచ్చే మార్గంలో అప్పన్నపల్లికి ముందు హౌసింగ్బోర్డునుంచి ప్రత్యేక రహదారిని నిర్మిస్తారు. ఈ రోడ్డును హౌసింగ్‌బోర్డు కాలనీ మీదుగా బండమీదిపల్లి.. అల్లీపూర్ రోడ్డును తాకుతూ పాలమూరు విశ్వవిద్యాలయం వెనుకనుంచి రాయిచూరు ప్రధాన రహదారికి అనుసంధానం చేస్తారు. రింగ్‌రోడ్డుకు ప్రభుత్వం రూ.96కోట్లు నిధులు కూడా ఇచ్చింది. -
స్మార్ట్‌గా రూ.9 కోట్లకు ఎసరు
రూ.2000 కోట్లపై ‘దేశం’ పెద్దల కన్ను వ్యూహాత్మకంగా చక్రం తిప్పిన అధికార పార్టీ నేతలు కోర్టు స్టేతో బెడిసికొట్టిన వైనం అవినీతి మరకలతో స్మార్ట్సిటీపై నీలినీడలు గొడ్డు పడిందంటే రాబందులకు సందడే సందడి. ఆ రాబందులు తపనలో ఓ అర్థం ఉంది . కానీ ఈ ‘పచ్చ’ రాబందులకు మాత్రం కాసులు గలగలలు వినిపిస్తే చాలు రెక్కలను విదిల్చుకుంటూ వాలిపోతాయి. తుని నియోజకవర్గంలో పనులు చేపట్టాలంటే కమీషన్ కింద రూ.9 కోట్లు ఇస్తేనే అని అక్కడి టీడీపీ బడా నేతలు ‘పంచాయితీ’ పెట్టడంతో కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోయిన విషయం ‘సాక్షి’ బయటపెట్టింది. ఇక కాకినాడ కార్పొరేషన్ విషయానికి వద్దాం. దీన్ని స్మార్ట్ సిటీగా గుర్తించి అభివృద్ధి పనుల కోసం రూ.2 వేల కోట్లను ప్రకటించగానే అభివృద్ధి ముసుగులో తలో కొంత పంచుకోడానికి సమాయత్తమవుతున్నారు. ఓ వైపు తామంతా ‘నిప్పు’లమంటూనే వాటాలేసుకోవడానికి ప్రయత్ని స్తున్నారు. ఇలాంటి వారికి కార్పొరేషన్ పీఠం అప్పగిస్తే సర్వం స్వాహా చేసేస్తారని నగర ప్రజలు మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ స్మార్ట్ సిటీకి వచ్చే రూ.2 వేల కోట్లపై అధికార పార్టీ పెద్దల కన్నుపడింది. రాబోయే నాలుగేళ్లలో ఈ నిధులతో చేపట్టే పనులపై పెత్తనం కోసం ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు స్మార్ట్ సిటీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేసింది. స్మార్ట్ సిటీలో చేపట్టే పనులన్నీ తమ గుప్పెట్లోకి రావాలంటే కీలకమైన ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ (పీఎంసీ)ని తమ వారికి కట్టబెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తక్కువ మొత్తానికి కోడ్‌చేసిన కంపెనీని పక్కనబెట్టి అయినవాళ్ల కోసం ఖజానాకు రూ.9 కోట్లు నష్టం తెచ్చేందుకు కూడా వారు వెనుకాడటం లేదు. ఇందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా వత్తాసు పలకడం వివాదాస్పదమై చివరకు న్యాయస్థానం గడపతొక్కింది. ఈ కన్సల్టెన్సీ టెండర్ల బాగోతానికి సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ ఎంపికలో భాగంగా మొదటి విడతలో కాకినాడ ఎంపికైంది. ఎంపికైన వెంటనే తొలి విడతగా కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో రూ.382 కోట్లు విడుదలయ్యాయి. నిధులు విడుదలకావడంతో పనులు, డిజైనింగ్, పర్యవేక్షణ, బిల్లులు మంజూరు తదితర అంశాల పర్యవేక్షణకు పీఎంసీ ఎంపిక కోసం టెండర్లు పిలిచారు. జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. కన్సల్టెన్సీ హక్కుల కోసం దేశంలో పలు ప్రాంతాల నుంచి వాడియా టెక్నాలజీస్, ఆర్వీ అసోసియేట్స్, ఎపిటీసా, లీ అసోసియేట్స్, రామబల్, ఫీడ్‌బ్యాక్ తదితర ఆరు కంపెనీలు పోటీపడ్డాయి. వీటిలో నాలుగు కంపెనీలను పలు కారణాలతో తిరస్కరించారు. చివరకు ఆర్వీ అసోసియేట్స్, వాడియా సంస్థల మధ్య పోటీ నెలకొంది. చక్రం తిప్పిన టీడీపీ ముఖ్యనేతలు... పీఎంసీ కోసం ప్రధాన పోటీదారులైన వాడియా టెక్నాలజీస్ రూ.19 కోట్లకు, ఆర్వీ అసోసియేట్స్ రూ.28 కోట్లకు కోడ్ చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలుండి తక్కువకు కోడ్‌చేసిన కంపెనీకే కాంట్రాక్టు ఖరారు చేయాలి. కానీ కాకినాడ స్మార్ట్ సిటీలో మాత్రం అందుకు భిన్నంగా ఎక్కువకు కోడ్ చేసిన కంపెనీని ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. ఈ రెండు కంపెనీల్లో తమకు అనుకూలురైన ఆర్వీ అసోసియేట్స్‌కు కట్టబెట్టేందుకు అధికార పార్టీ పెద్దలు చక్రం తిప్పారు. పీఎంసీ ఎంపిక తుది దశకు చేరిన సమయంలో తూర్పు గోదావరి నుంచి ప్రాతినిధ్యంవహిస్తున్న ఒక మంత్రి, ఒక పార్లమెంటు సభ్యుడు ఈ వ్యవహారంలో తెరవెనుక చక్రం తిప్పారు. ఫలితంగా రూ.9 కోట్లు ప్రజాధనం అదనంగా ఎందుకు వెచ్చించాల్సి వస్తుందోనని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పలు విమర్శలు వస్తున్నా ఆర్వీ అసోసియేట్స్‌కు కట్టబెట్టేలా అధికార పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చి ఒప్పించగలిగారు. పీఎంసీని దక్కించుకునేందుకు ఆర్వీ అసోసియేట్స్ నగరపాలక సంస్థకు తప్పుడు డాక్యుమెంట్లు దాఖలు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్వీ అసోసియేట్స్‌కు టీమ్ లీడర్ పునీత్‌సేథీ టెండర్ఫారంలో జతచేసిన సమాచారమంతా మోసపూరితమైందంటూ పలు ఫిర్యాదులు కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్‌గా ఉన్న నగరపాలక సంస్థ కమిషనర్ అలీంభాషాకు వెళ్లాయి. అడుగడుగునా తప్పతోవే.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలోని ‘భూమి ఫోర్‌లైన్ హైవే సంస్థ’ ద్వారా 1994–2000 మధ్యలో జలంధర్ నుంచి పఠాన్ కోట్ హైవే పనులను పునీత్‌సేథీ పర్యవేక్షించినట్టు టెండర్ ఫారంలో అనుభవ పత్రాన్ని జత చేశారు. వాస్తవానికి ఆ హైవే పనులను 2001–2003 మధ్యన ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో జరిగాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కార్పొరేషన్ దృష్టికి వాడియా టెక్నాలజీస్ తీసుకువెళ్లింది. ఇదే పునీత్ సేథీ దుబాయ్ టవర్స్ నిర్మాణం 2003లోనే పూర్తయ్యాయి. అటువంటి టవర్స్ పనులను 2004–2008 మధ్యలో ఇదే పునీత్సేధీ చేసినట్టు ఇచ్చిన సమాచారం కూడా పూర్తిగా అవాస్త విరుద్ధమని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఏ సంస్థ టెండర్ దాఖలు చేసినా ఆయా సంస్థల టీమ్ లీడర్‌కు ఉండే అనుభవం ఆధారంగానే మార్కులు వేస్తారు. కోడ్ చేసిన మెుత్తం, సాంకేతిక పరిజ్ఞానం, టర్నోవర్ ఇలా అన్ని అంశాలకూ కలిపి 100 మార్కులు నిర్ణయించారు. అందులో భాగంగా వేసిన మార్కుల్లో ఎపిటీసాకు 80,వాడియా టెక్నాలజీస్ 81, ఆర్వీ అసోసియేట్స్‌కు 82, ఫీడ్‌బ్యాక్ 78 లీ అసోసియేట్స్‌కు 71, రామబల్కు 65 మార్కులు వేశారు. పాయింట్ల ప్రకారం చూసుకుంటే వాడియా టెక్నాలజీస్ కంటే ఆర్వీ అసోసియేట్స్‌కు ఒక మార్కు అదనంగా వేశారు. కానీ ఇక్కడకొచ్చే సరికి ఇన్ని అసత్యపు అనుభవ పత్రాలు దాఖలు చేసిన పునీత్‌సేథీ వాస్తవ పరిస్థితిని ఎంపిక కమిటీ కనీసం పరిశీలించ లేదు. పైపెచ్చు వాటి ఆధారంగానే ఆర్వీ అసోసియేట్స్‌కు ఒక మార్కు ఎక్కువ వేసిన అధికారుల అత్యు త్సాహం తేటతెల్లమవుతోంది. అధికారపార్టీ పెద్దల జోక్యంతో తొమ్మిది కోట్లు అదనంగా కోడ్ చేసినప్పటికీ ఆర్వీ అసోసియేట్స్‌కు పీఎంసీ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు... అధికారపార్టీ పెద్దలు ఆ సంస్థ ఎంపిక చేయడం వెనుక పెద్ద వ్యూహమే నడిచింది. ఈ మొత్తం వ్యవహారంలో సీఆర్డీఏకు చెందిన ఒక ముఖ్యమైన అధికారితోపాటు మంత్రితో సాన్నిహిత్యం ఉన్న కాకినాడ కార్పొరేషన్లో ఓ ఇంజినీరింగ్ అధికారి అధికార పార్టీ పెద్దలు చెప్పినట్టుగా చక్రం తిప్పి ఆర్వీ అసోసియేట్స్‌ను ఎంపిక చేశారనే విమర్శలున్నాయి. ఈ విషయాలన్నీ స్మార్ట్ సిటీ కమిటీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో వాడియా టెక్నాలజీస్ హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. ఫలితంగా కాకినాడ స్మార్ట్‌సిటీకి పీఎంసీ ఎంపిక నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. వచ్చే ఐదేళ్లలో స్మార్ట్ సిటీ అభివృద్ధికి వందల కోట్లు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితిని కాసుల వేటలోపడి అధికారపార్టీ ముఖ్యనేతలు ఆదిలోనే మోకాలడ్డుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. -
స్మార్ట్‌సిటీల్లో ఆర్కిటెక్చర్లదే కీలకపాత్ర
– కేంద్రమంత్రి సుజన పిలుపు – దేశానికి ప్రపంచస్థాయి నగరాలు కావాలి – ఘనంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ స్నాతకోత్సవం పెనమలూరు: అంతర్జాతీయ ప్రమాణాలతో భారతదేశంలో స్మార్ట్ సిటీలు నిర్మించటానికి ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించాలని కేంద్ర సైన్స్ ఆండ్ టెక్నాలజీ మంత్రి వై.సుజనా చౌదరి అన్నారు. శుక్రవారం కానూరు అన్నే కల్యాణమండపంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ విద్యార్థుల 2వ స్నాత్సకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాలు, పట్టణాల రూపకల్పన జరిగి నిర్మాణాలు చేయాల్సి ఉందన్నారు. స్మార్టు సిటీలతో మెరుగైన మౌలిక సదుసాయాలు, చెత్త నిర్వహణ, ఆరోగ్య భద్రత కల్పించవచ్చని అన్నారు. చెన్నై నగరం గత ఏడాది విపరీతమైన వర్షాల వల్ల మునిగిపోయిందని అన్నారు. భవిష్యత్తులో విపత్తులు ఎదురైనప్పుడు నగరాల్లో, పట్టణాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది రాకుండా నగరాలకు రూపకల్పన చేయాలని ఆయన సూచించారు. అర్బన్ గ్రోత్ సెంటర్లుగా ఆ నగరాలు అమరావతి గ్రీన్ ఫీల్డు రాజధాని నిర్మాణంలో విద్యార్థులు తమ వంతు పాత్ర పోషించి సత్తాచాటాలని సుజన అన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హిందూపురంలను అర్బన్ గ్రోత్ సెంటర్లుగా అభివృద్ది చేయనున్నామన్నారు. నగరాల అభివృద్దిలో విద్యార్థులు భవిష్యత్తులో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు. 138 మంది విద్యార్థులకు పట్టాలు స్నాత్సకోత్సవంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆండ్ ఆర్క్టెక్చర్లో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పొందిన 138 మంది విద్యార్థులకు మంత్రి సుజనాచౌదరి పట్టాలు ప్రధానం చేశారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఎన్ఎస్.గాయత్రీ,ఎం.మిచలీ, ఎస్.గణేష్, ఆశనా జైన్, గరీమాలకు బంగరు పతకాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బోడెప్రసాద్, స్కూల్ డెరెక్టర్లు రాజీవ్‌మిశ్రా, డాక్టర్ రమేష్, రోహిత్‌జైన్ తదితరులు పాల్గొన్నారు. మిన్నంటిన సందోహం ఈ సందర్భంగా విద్యార్థుల సందడి మిన్నంటింది. తలపై ఉన్న టోపీలు గాలిలోకి ఎగురవేసి కేరింతలు కొట్టారు. ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థులు గ్రూప్ ఫోటోలు దిగారు. -
తిరుపతికి.. స్మార్ట్ కిరీటం
– 62.63 పాయింట్లతో నాలుగో స్థానం –రెండో జాబితాలో ఏపీలో దక్కిన ఏకైక నగరం – మారనున్న ఆధ్యాత్మిక నగర రూపురేఖలు – రూ.1,610 కోట్లతో ప్రణాళికలు – ఇంటర్నేషనల్ ఏజెన్సీల సహకారం తిరుపతి తుడా : స్మార్ట్ సిటీ జాబితాలో తిరుపతి ఎట్టకేలకు చోటుదక్కింది. మంగళవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ రెండో జాబితాలో 62.63 పాయింట్లతో ఈ ఆధ్యాత్మిక నగరం టాప్–4లో నిలిచింది. స్మార్ట్‌సిటీ దక్కడంతో తిరుపతిలో సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా పేలుళ్లు, నత్యాలతో కార్పొరేషన్ సిబ్బంది సందడి చేశారు. కమిషనర్ భారీ కేక్ కట్‌చేసి ఉద్యోగులకు పంచిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ రెండో జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం ఢిల్లీలో ప్రకటించారు. ఆయా నగరాల డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఆధారంగా ర్యాంకింగ్‌లను కేటాయించారు. టాప్‌లో నిలిచిన 27 నగరాలను వరుసక్రమంలో ప్రకటించారు. మొత్తం 66 నగరాలు పోటీపడ్డ ఈ రౌండ్లో తిరుపతి నగరం 62.63 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకుంది. ముందే ఊహించిన కమిషనర్ ఈ ఏడాది జనవరిలో స్మార్ట్ సిటీ తొలి జాబితాను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ, కాకినాడ నగరాలు మాత్రమే ఎంపికయ్యాయి. తిరుపతి స్మార్ట్ కిరీటం కోల్పోయింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ కమిషనర్ ప్రణాళికా బద్ధంగా డీపీఆర్‌ను తయారు చేసి కేంద్రానికి సమర్పించారు. అనంతరం తిరుపతి టాప్ 5లో నిలుస్తుందని ముందే ఊహించారు. ఆయన చెప్పినట్టే తిరుపతి టాప్–4లో నిలిచింది. నిధుల వరద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 నగరాలను అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని భావించింది. అందులో భాగంగానే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. స్మార్ట్ సిటీగా ఎంపికైన ఒక్కో నగరానికి రూ.500 కోట్లు కేటాయిస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతే స్థాయిలో మరో రూ.500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో స్మార్ట్ సిటీకి రూ.వెయ్యి కోట్లు సమకూరుతాయి. అయితే తిరుపతి నగరపాకల అధికారులు రూ.1,610 కోట్లతో భారీ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.1000 కోట్లతో పాటు మరికొన్ని పథకాల ద్వారా రూ.280 కోట్లు రాబట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే పబ్లిక్, ప్రై యివేట్ భాగస్వామ్యం నుంచి మరో రూ.330 కోట్లు వచ్చేవిధంగా డీపీఆర్‌ను రూపొందించారు. ఈ నేపథ్యంలో తిరుపతికి నిధుల వరద పారడం, భారీ ప్రాజెక్టు చేజిక్కించుకోడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు. ఇక స్మార్ట్‌గా.. స్మార్ట్ సిటీ మిషన్‌తో తిరుపతి రూపురేఖలు మారనున్నాయి. రూ.1,610 కోట్ల భారీ ప్రాజెక్టుతో నగరాన్ని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నారు. రెట్రోఫిటింగ్ (ఇప్పుడున్న నిర్మాణాలు ఉన్నచోటనే) అభివృద్ధి చేసేలా డీపీఆర్‌ను రూపొందించారు. రైల్వే స్టేషన్, గోవిందరాజస్వామి ఆలయం, బస్టాండు ప్రాంతం నుంచి తిరుమల బైపాస్ రోడ్డు మీదుగా నందీ సర్కిల్ వరకు ఉన్న 700 ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలు, వసతులు, ప్రభుత్వ, ప్రయివేట్ భవనాల ఆధునికీకరణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, గ్రీనరీ, ఆధునిక అండర్ డ్రై నేజీ, కేబుల్ సిస్టమ్, రవాణా, 24 గంటలూ తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఇది ప్రజల విజయం నగర ప్రజల విజయం. సహకరించిన అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు. నగర అభివృద్ధికి అంతర్జాతీయ సహకారం తీసుకుంటాం. ఇప్పటికే ఫ్రాన్స్ సహకారం కోరాం. స్మార్ట్ సిటీ ప్రణాళికలను నగరంలో అమలు చేస్తున్నాం. ఈ–స్కూల్స్, పార్కుల అభివృద్ధి, సిటీ బ్యూటిఫికేషన్, హౌసింగ్, జియోగ్రఫీ ఇన్ఫర్మేషన్ సిస్టం, స్కోడా, ఇజ్రాయిల్ టెక్నాలజీ నీటి సరఫరా వంటి వాటిని అమలు చేస్తున్నాం. స్మార్ట్‌సిటీ రూ.1,610 కోట్లు, స్కోడా ప్రాజెక్టు రూ.1,500 కోట్లు, జనరల్ ఫండ్, అమృత్ పథకం, 14, 15 ఆర్థిక సంఘాల నుంచి మరో రూ.211 కోట్లతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. – వాడరేపు వినయ్‌చంద్, కమిషనర్, తిరుపతి నగరపాలక సంస్థ -
స్మార్ట్‌సిటీకి ‘బ్రేక్’
కన్సల్టెన్సీ నియామకంపై హైకోర్టు స్టే కాకినాడలో ఎక్కడిపనులు అక్కడే కాకినాడ: స్మార్ట్‌సిటీ పనులకు బ్రేక్ పడింది. కన్సల్టెన్సీ నియామకంలో ఎదురైన అభ్యంతరాలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో కాకినాడ స్మార్ట్‌సిటీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముంబాయికి చెందిన వాడియా టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ పరిస్థితి ఎదురైంది. రానున్న నాలుగేళ్ళలో రూ.1500 కోట్ల విలువైన పనులకు సంబంధించి అన్ని ప్రక్రియలకు అవాంతరం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే... స్మార్ట్‌సిటీ నిధులతో జరిగే పనులకు సంబంధించి పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టు, అంచనాల తయారీ, పనుల్లో లోటుపాట్లు, సాంకేతికపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు కావాల్సి ఉంది. ఇందుకు ఆర్థిక, సాంకేతిక పరమైన అంశాల్లో అనుభవం కలిగిన సంస్థలను ఆహ్వానిస్తూ కొద్ది రోజుల క్రితం స్మార్ట్‌సిటీ పేరిట టెండర్ పిలిచారు. సుమారు ఏడు సంస్థలు టెండర్లలో పాల్గొన్నాయి. వీటిలో ఆరు సంస్థలు అర్హత కలిగినవిగా గుర్తించి ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థను పరిగణనలోకి తీసుకోవాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం కలెక్టర్ అధ్యక్షతన కార్పొరేషన్ కమిషనర్‌తోపాటు వివిధశాఖలకు చెందిన తొమ్మిది మంది సీనియర్ అధికారులతో కూడిన కమిటీ ముందు ప్రతిపాదనలు ఉంచారు. కన్సల్టెన్సీ నియామకంపై తుది నిర్ణయం తీసుకునేలోపు వాడియా సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతం కన్సల్టెన్సీ నియామకానికి ఖరారవుతున్న ఆర్వీ అసోసియేట్స్‌పై సాంకేతికపరమైన అభ్యంతరాలను లేవనెత్తింది. దీంతో కన్సల్టెన్సీ నియామకంపై స్టే ఇస్తూ రాష్ట్ర హైకోర్టు కాకినాడ నగరపాలక సంస్థకు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తొలి విడతగా విడుదలైన రూ.382 కోట్లతో వివిధ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న తరుణంలో కోర్టు ఉత్తర్వులు అందడంతో ప్రస్తుతం స్మార్ట్‌సిటీ పనులకు బ్రేక్ పడింది. స్మార్ట్‌సిటీ పనులు ముందుకు సాగాలంటే ప్రతిపాదిత పనులన్నీ కన్సల్టెన్సీ ద్వారా మాత్రమే జరగాల్సి ఉంది. ఈ నియామకానికి బ్రేక్ పడడంతో స్మార్ట్‌సిటీ పనులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే దీనిపై నగరపాలక సంస్థ రాష్ట్ర హైకోర్టుకు తన వాదనను వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఇవన్నీ క్లియర్ అయితే తప్ప స్మార్ట్‌సిటీ పనులు ముందుకు సాగే పరిస్థితి కనిపించడంలేదు. -
పాలకులు ‘స్మార్ట్’గా ఉంటేనే అభివృద్ధి: వెంకయ్య
- స్మార్ట్ సిటీల్లో పెట్టబడులు పెట్టేందుకు 34 దేశాల ఆసక్తి - తెలుగు రాష్ట్రాల్లో ఎంపికైన స్మార్ట్ నగరాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలకు సూత్రప్రాయ అనుమతి - ముగిసిన మీడియా సంపాదకుల ప్రాంతీయ సదస్సు చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ‘స్మార్ట్ సిటీల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాల కింద లభించే నిధులతో సమీకృతం చేసుకుంటే, ఆ తరువాత వాటి ప్రగతికి అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి 34 దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తొలి విడతలో పెట్టుబడుల ఆమోదానికి ఎంపికైన 20 నగరాలకుతోడు మరో 40 నగరాల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ జాబితా త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ నగరాలకు ఒక్కొక్కదానికి కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్ల చొప్పున ఇవ్వనుంది. మొదట 200 కోట్లు, వాటిని సవ్యంగా వినియోగించి రాష్ట్రాలు చేసే పనితీరును బట్టి మిగతా నిధుల్ని విడుదల చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలివిడతలో ఎంపికైన నగరాల్లో పెట్టుబడులకై వచ్చిన ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా కేంద్రం అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు రూ.1,602 కోట్లకు, కాకినాడకు రూ.1,993 కోట్లకు, తెలంగాణలోని వరంగల్‌కు రూ. 2,860 కోట్ల పెట్టుబడులకు కేంద్రం అనుమతించింది. అటల్ మిషన్ (ఏఎమ్ఆర్యూటీ), స్వచ్ఛభారత్ మిషన్, హెరిటేజ్ డెవలప్మెంట్ (హృదయ్), పీఎం ఆవాస్ యోజన తదితర పథకాల కింద లభించే నిధుల్ని సవ్యంగా వినియోగించుకొని దేశంలోని నగరాల్ని స్థానిక-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పరచుకోవాలి’అని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. చెన్నైలో రెండు రోజుల పాటు జరిగిన మీడియా సంపాదకుల ప్రాంతీయ సదస్సు సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ పలు విషయాలు ఆయన వెల్లడించారు. స్మార్ట్‌సిటీలు సుందర, ఆవాసయోగ్య నగరాలుగా అభివృద్ధి చెందాలంటే స్థానిక, రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీలంగా ఉండటంతో పాటు వాటి పాలకులైన కమిషనర్లు, మేయర్లు కూడా స్మార్ట్‌గా ఉండాలన్నారు. నగరాల్లో ముఖ్యంగా గృహనిర్మాణం, డిజిటలైజేషన్, తాగునీరు-మురుగునీటి నిర్వహణ, తడి-పొడి చెత్త తొలగింపు, రవాణా ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. ఆయా అంశాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతికి ఆస్కారముందని చెప్పారు. ఒక దశ దాటిన తర్వాత సౌకర్యాలు కల్పించి, అందులోంచే వనరులు సమీకరించుకోవడం పెద్ద కష్టం కాదన్నారు. నగరాల్లో చెత్త తొలగింపు (వేస్ట్ మేనేజ్మెంట్) విషయంలో నిర్మాణాత్మక ప్రత్యామ్నాయాలు సూచించాలని మద్రాస్ ఐఐటీని కోరానన్నారు. ముగిసిన రెండు రోజుల సదస్సు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు కేంద్ర సమాచార-ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిర్వహించిన ‘సంపాదకుల ప్రాంతీయ సదస్సు‘ శుక్రవారం ముగిసింది. మొదటి సదస్సు జైపూర్‌లో నిర్వహించగా రెండోది చెన్నైలో జరిగింది. ఐదు దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు లక్షద్వీప్‌కు చెందిన మీడియా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్‌తోపాటు రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన, విపత్తుల నివారణ, తీర రక్షణ తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానంగా ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాల కింద గడిచిన రెండున్నరేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వెల్లడించడంతో పాటు ప్రశ్నోత్తరాల ప్రక్రియ ద్వారా మీడియా ప్రతినిధుల నుంచి స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ఈ సదస్సు నిర్వహించినట్టు చెప్పారు. -
1200 ఉచిత వై-ఫై స్పాట్లు
దేశానికి వాణిజ్యనగరంగా పేరున్న ముంబాయి ఇక స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకోనుంది. ముంబాయి నగరంలో 1200 ఉచిత వై-ఫై హాట్స్పాట్లు ఏర్పాటుచేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రముఖ ప్రదేశాల్లో 2017 మే కల్లా 1200 ఉచిత వై-ఫై హాట్స్పాట్లను ఏర్పాటుచేసి, ముంబాయిని వై-ఫై నగరంగా మార్చుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం తెలిపారు. అర్బన్ డెవలప్మెంట్పై జరిగిన చర్చలో కూడా ఫడ్నవీస్ ఈ విషయాన్ని స్పష్టంచేశారు. సీసీటీవీ ప్రాజెక్టు అనంతరం ముంబాయిని స్మార్ట్‌సిటీగా రూపొందించడంలో ఇది మరో కీలక అడుగని పేర్కొన్నారు. మొదటి దశలో భాగంగా 500 హాట్స్పాట్లను 2016 నవంబర్ కల్లా కల్పిస్తామని వెల్లడించారు. అయితే దీనికి సంబంధించిన ఆక్షన్ తేదీలను ఇంకా తెలుపలేదు. ఉచిత వై-ఫై హాట్స్పాట్లను ప్రజలకు అందించడంలో ఢిల్లీ మొదటి నగరంగా ఉంటోంది. మెట్రో నగరాల్లో ప్రజలు ఫీచర్ ఫోన్లకంటే స్మార్ట్ఫోన్ల వాడకంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే డేటా ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ఇంటర్నెట్ వినియోగానికి ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉచిత వై-ఫై స్పాట్లను ఏర్పాటుచేయడం ప్రజలకు ఉపయుక్తమని ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. మెట్రో నగరాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మరోవైపు టెక్ కంపెనీలు సైతం ఉచిత వై-ఫై సౌకర్యాలు అందించడంలో భాగస్వాములుగా మారుతున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్, దేశమంతటా గల ఇండియన్ రైల్వే ప్లాట్‌ఫామ్స్‌లో ఉచిత వై-ఫై సౌకర్యాన్ని ప్యాసెంజర్లకు అందిస్తుండగా.. మైక్రోసాప్ట్ 5 లక్షల గ్రామాలకు తక్కువ ధరకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందించాలని ప్లాన్ చేస్తోంది. వైట్ స్పేస్ టెక్నాలజీతో గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అందించడంలో మైక్రోసాప్టే మొదటి కంపెనీ. -
స్మార్ట్ సిటీలకు ఎంతో దూరంలో ఉన్నాం
♦ ఇంజనీర్లు పెద్ద పట్టణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు ♦ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ముంబై: స్మార్ట్‌సిటీల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం ఓ పక్క ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో... ప్రతిష్టాత్మక స్మార్ట్ సిటీలను కలిగి ఉండే స్థితికి మనం (దేశం) చాలా, చాలా దూరంలో ఉన్నామని ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఐటీ ఇంజనీర్లు టైర్ 1 పట్టణాలకే ప్రాధాన్యమిస్తున్నారని పట్టణీకరణపై ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మూర్తి వెల్లడించారు. స్మార్ట్‌సిటీలకు ఆమడ దూరంలో ఉన్నందున దీనిపై తాను మాట్లాడబోనన్నారు. ‘ఇంజనీర్లు పెద్ద పట్టణాల్లోనే పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇన్ఫోసిస్ మైసూరు, భువనేశ్వర్, తిరువనంతపురంలో అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ, 50 శాతం సీట్లు కూడా నిండలేదు. అక్కడికి వెళ్లాలని ఎవరూ అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ ముంబై, పుణె, బెంగళూరు హైదరాబాద్, నోయిడాల్లోనే ఉండాలనుకుంటున్నారు’ అని మూర్తి వివరించారు. జీవిత భాగస్వామికి ఉద్యోగం, పిల్లల విద్య, నాణ్యమైన వైద్య సౌకర్యాలు ఈ పరిస్థితికి కారణాలుగా పేర్కొన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు దేశంలోని మారుమూల పట్టణాలకు విస్తరించడం ద్వారా ఉద్యోగావకాశాలను విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండగా... ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ అయిన నారాయణమూర్తి ఇలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సామూహిక వలసలు ఇకముందూ కొనసాగుతాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీలపై పనిచేయాలని మూర్తి సూచించారు. అధిక ఆదాయం గల దేశాల్లో ఏదీ కూడా పట్టణీకరణ లేకుండా ప్రగతి సాధించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం వీటిపై దృష్టి సారిస్తే సేవలు, తయారీ రంగాల్లో ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుందన్నారు. స్మార్ట్‌సిటీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మైసూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను ఒకసారి సందర్శించాలని సభికులకు నారాయణమూర్తి సూచించారు. -
‘స్మార్ట్ సిటీలకు చాలా దూరంలో ఉన్నాం’
స్మార్ట్‌సిటీల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం ఓ పక్క ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో... ప్రతిష్టాత్మక స్మార్ట్ సిటీలను కలిగి ఉండే స్థితికి మనం (దేశం) చాలా, చాలా దూరంలో ఉన్నామని ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఐటీ ఇంజనీర్లు టైర్ 1 పట్టణాలకే ప్రాధాన్యమిస్తున్నారని పట్టణీకరణపై ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మూర్తి వెల్లడించారు. స్మార్ట్‌సిటీలకు ఆమడ దూరంలో ఉన్నందున దీనిపై తాను మాట్లాడబోనన్నారు. ‘ఇంజనీర్లు పెద్ద పట్టణాల్లోనే పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇన్ఫోసిస్ మైసూరు, భువనేశ్వర్, తిరువనంతపురంలో అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ, 50 శాతం సీట్లు కూడా నిండలేదు. అక్కడికి వెళ్లాలని ఎవరూ అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ ముంబై, పుణె, బెంగళూరు హైదరాబాద్, నోయిడాల్లోనే ఉండాలనుకుంటున్నారు’ అని మూర్తి వివరించారు. జీవిత భాగస్వామికి ఉద్యోగం, పిల్లల విద్య, నాణ్యమైన వైద్య సౌకర్యాలు ఈ పరిస్థితికి కారణాలుగా పేర్కొన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు దేశంలోని మారుమూల పట్టణాలకు విస్తరించడం ద్వారా ఉద్యోగావకాశాలను విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండగా... ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ అయినా నారాయణమూర్తి ఇలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సామూహిక వలసలు ఇకముందూ కొనసాగుతాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీలపై పనిచేయాలని మూర్తి సూచించారు. అధిక ఆదాయం గల దేశాల్లో ఏదీ కూడా పట్టణీకరణ లేకుండా ప్రగతి సాధించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం వీటిపై దృష్టి సారిస్తే సేవలు, తయారీ రంగాల్లో ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుందన్నారు. స్మార్ట్‌సిటీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మైసూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను ఒకసారి సందర్శించాలని సభికులకు నారాయణమూర్తి సూచించారు. -
పందులను తరలించాల్సిందే
స్మార్ట్‌సిటీకి అవరోధం కలిగించొద్దు పందుల పెంపకందార్లతో మేయర్ కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలోని పందులను తరలించాల్సిందేనని నగర మేయర్ రవీందర్‌సింగ్ పందుల పెంపకందారులకు సూచించారు. తన కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ పందులను రోడ్లపై వదలడం సరికాదని, గొర్రెలు, ఆవులు, కోళ్లకు ఏర్పాటు చేసినట్లే ఫాంలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకోవాలంటే పందుల తరిలింపు ఒక్కటే మార్గమన్నారు. పందులు సంరక్షణకు ఇతర మార్గాలను ఆలోచించుకోవాలని తెలిపారు. ఊరిబయటకు పందులను తరలించాలని సూచించారు. పందులను తీసివేయాలంటే తమకు ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే ఊరు బయట స్థలాలు చూపించి షెడ్లు వేసివ్వాలని పందుల పెంపకందారులు కోరారు. స్థలం కోసం ఎమ్మెల్యే, కలెక్టర్‌తో మాట్లాడతామని మేయర్ వెల్లడించారు. కార్పొరేటర్లు ఆరిఫ్, పిట్టల శ్రీనివాస్, కంసాల శ్రీనివాస్, వై.సునీల్‌రావు, నాయకులు కట్ల సతీష్, ఎడ్ల అశోక్, సాదవేని శ్రీనివాస్, అదనపు కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు. పారిశుధ్య పనులు పరిశీలన 5వ డివిజన్లో పారిశుధ్య పనులను శుక్రవారం మేయర్ రవీందర్‌సింగ్, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. పనులను గ్యాంగ్‌లుగా విడిపోయి చేయాలని సిబ్బందికి సూచించారు. ఒక్కో ఏరియాను శుభ్రం చేసి మళ్లీ అక్కడ పని ఉండకుండా చూసుకోవాలన్నారు. -
వెంకయ్యా..దయచూపయ్యా!
స్మార్ట్ సిటీ పోటీలో తిరుపతి 15లోపు రెండో జాబితా ప్రకటన 27 నగరాలను ప్రకటించనున్న కేంద్రం ఉత్కంఠంగా నగర వాసులు స్మార్ట్ సిటీ కోసం ఎదురు చూపులు ఎక్కువయ్యాయి. మొదటి దఫాలో తిరుపతికి చోటు దక్కకపోవడంతో రెండో జాబితాలోనైనా అవకాశం వస్తుందోలేదోనని నగర వాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వెంకయ్యా..దయచూపయ్యా అంటూ పలువురు వేడుకునే పనిలో నిమగ్నమయ్యారు. తిరుపతి తుడా : రెండో దఫా స్మార్ట్ సిటీలో తిరుపతికి చోటుదక్కుతుందోలేదోనన్న ఎదురుచూపులు ఎక్కువవుతున్నాయి. కేంద్రమంత్రి పదవిలో కొలువుదీరిన వెంకయ్యనాయుడు ఈ సారైనా కరుణిస్తారోలేదోనని నగరవాసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘స్మార్ట్’గా ప్రతిపాదనలు వంద నగరాల్లో మొదటి దఫా 20 నగరాలను ఎంపికచేసినా.. అందులో తిరుపతికి చోటుదక్కని సంగతి తెలిసిందే. 40 నగరాలతో రెండో జాబితాను ప్రకటించాల్సి ఉండగా కొన్ని కారణాలచేత 13 నగరాలను ఎలాంటి ఎంపిక ప్రతిపాదనలు లేకుండానే ఈ ఏడాది మేలో ప్రకటించారు. మిగిలిన 27 నగరాలను ఆగస్టు 15లోపు ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ కమిషనర్ వినయ్‌చంద్ రెండో జాబితాలో టాప్–1లో నిలబెట్టేందుకు సర్వం సిద్ధం చేసి నివేదికను కేంద్రానికి అందజేశారు. గత లోపాలను సరిదిద్ది భారీ మార్పులతో స్మార్ట్ ప్రణాళికలను రూపొందించారు. రూ.1,610 కోట్లతో స్మార్ట్ ప్రణాళిక రెండో జాబితాలో తిరుపతిని స్మార్ట్ సిటీగా నిలబెట్టేందుకు కార్పొరేషన్ కమిషనర్ తీవ్రంగానే శ్రమించారు. ఇందులో భాగంగా ఇప్పుడున్న నిర్మాణాలను ఉన్నచోటే(వెట్రోఫిట్టింగ్) అభివృద్ధిచేసేలా తీర్మాణం చేశారు. అందుకనుగుణంగా డీపీఆర్‌ను సిద్ధం చేశారు. తొలి విడత పోటీలో రూ.2,650 కోట్ల వ్యయంతో ప్రణాళికలను రూపొందించారు. దీనిపై కేంద్రం నుంచి నిధులు ఎలా సమకూర్చుకుంటారనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలాంటి లోపాలు లేకుండా రెండు డీపీఆర్‌లో మార్పుచేస్తూ రూ.1,610 కోట్లకు పరిమితం చేశారు. స్మార్ట్ సిటీమిషన్ నుంచి రూ.1,010 కోట్లు, కేంద్ర, రాష్ట్ర పథకాల నుంచి మరో రూ.300 కోట్లు, పీపీపీ పద్ధతిన చేపట్టనున్న మరో 300 కోట్లు వెరసి రూ.1,610 కోట్లు సమకూర్చుకుంటాయనే అంచనాతో డీపీఆర్‌ను సిద్ధం చేశారు. –ఫ్రాన్స్ సహకారంతో ఫ్రాన్స్‌లో అద్భుతమైన టౌన్‌ప్లానింగ్, శానిటేషన్, టెక్నాలజీ అమల్లో ఉంది. ఆ టెక్నాలజీ, ప్లానింగ్‌ను తిరుపతికి అనుకరిస్తూ అభివృద్ధి చేసేలా అక్కడి ఓ సంస్థతో కార్పొరేషన్ అధికారులు సంప్రదింపులు జరిపారు. స్మార్ట్ కిరీటం దక్కించుకొని అభివృద్ధికి అడుగులు పడితే తిరుపతికి ఫ్రాన్స్ టెక్నాలజీ దోహదపడనుంది. -
ఇండోర్ ‘స్మార్ట్’ టూర్
కరీంనగర్ కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీల అభివృద్ధి పథకంలో ప్రథమ స్థానంలో నిలిచి మొదటి విడతలోనే స్మార్ట్ సిటీ హోదా దక్కించుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర సందర్శనకు ప్రజాప్రతినిధులు Ðð ళ్లనున్నారు. ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేశ్, కమిషనర్ కష్ణభాస్కర్తో కూడిన బృందం శుక్రవారం బయలుదేరి వెళ్లనుంది. శని, ఆదివారాలలో అక్కడ పర్యటించి స్మార్ట్ సిటీ సాధన కోసం వారు చేపట్టిన డీపీఆర్‌ను పరిశీలించనున్నారు. అక్కడ జరుగుతున్న అభివద్ధిని పర్యవేక్షించనున్నారు. కరీంనగర్ స్మార్ట్‌సిటీల జాబితాలో చోటు సంపాదించుకున్నప్పటికీ డీపీఆర్ తయారీలో ఇప్పటికీ ఒక స్పష్టతరాలేదు. స్మార్ట్‌సిటీ జాబితాలో స్కోరుబోర్డును పెంచుకుని మూడో జాబితాలో చోటు దక్కించుకోవాలంటే ఇండోర్ అవలంబించిన విధానాలను అధ్యయనం చేయాల్సిన అవసరముఉంది. కాగా ఇండోర్ జిల్లా కలెక్టర్‌గా కరీంనగర్ జిల్లాకు చెందిన నరహరి ఉండడం.. ఇప్పటికే ఆయన పలుమార్లు వీరిని ఆహ్వానించారు. ఇండోర్ పర్యటన నగరం స్మార్ట్ హోదా దక్కించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
స్మార్ట్‌సిటీ లపై దిశానిర్దేశం చేసిన ప్రధాని
వెబ్‌కాస్టింగ్ ద్వారా బల్దియాలో ప్రసారం కరీంనగర్‌కార్పొరేషన్ : పట్టణ ప్రజల జీవన విధానంలో మార్పు తేవడమే స్మార్ట్‌సిటీల ల క్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శని వారం మహారాష్ట్రలోని పుణే స్మార్ట్‌సిటీ ప్రా రంభోత్సవం, అమృత్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రసారం చేశారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వెబ్‌స్క్రీన్ ఏ ర్పాటుచేసి పాలకవర్గ సభ్యులు, అధికారు లు వీక్షించారు. స్మార్ట్‌సిటీ, అమృత్ పథకంలో చేరిన నగరాల పాలకవర్గాలు, అధికారులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్ సాధ్యమన్నారు. 24 గంటల నీటిసరఫరా, విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వే యాలని సూచించారు. ఈ-ఆఫీస్‌ల ద్వారా అన్ని సేవలు అందేలా చర్యలు చేపట్టాల న్నారు. మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ కృష్ణభాస్కర్, కార్పొరేటర్లు, అధికారులు పా ల్గొన్నారు. కాగా ఇంటర్నెట్లో ఏర్పడ్డ సాంకేతికలోపంతో కొంత నిరాశకు గురయ్యూరు. కార్యక్రమానికి ముందే అన్ని సరిచూసుకోవాల్సిన సిబ్బంది తీరా సమయానికి హడావిడి పడడం కనిపించింది. -
సమగ్ర అభివృద్ధి మా బాధ్యత
► యజ్ఞంలా పనిచేస్తేనే స్మార్ట్ సాధ్యం ► యూజీడీ పనిచేయకపోతే మూసేయండి ► మహిళల హక్కులు కాలరాయొద్దు ► మంత్రి ఈటల, ఎంపీ వినోద్ కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ అభివృద్ధి ప్రజల ఆకాంక్ష అయితే.. సమగ్ర అభివృద్ధి మా బాధ్యతని.. స్మార్ట్‌తో నగరం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్మార్ట్‌సిటీ సాధన, డీపీఆర్ తయారీపై మేయర్ రవీందర్‌సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నగర అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నగరంపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఉందని, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఈ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారని, వడ్డించే ఆర్థిక మంత్రిగా నేనే ఉన్నప్పుడు నిధుల గురించి బెంగపడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయమంటే ధర్మంగా, న్యాయంగా ప్రజల జఠిల సమస్యలు పరిష్కరిస్తూ, సమాజ అభివృద్ధి, క్షేమమే ఎజెండాగా బతకడమన్నారు. నగరంలో యూజీడీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పనికి రాదనిపిస్తే మూసివేయాలని మేయర్‌కు సూచించారు. రోడ్లు తవ్వడం, వేయడం ద్వారా జేబులు నింపుకునే పనిగా ప్రజలు అభివర్ణిస్తున్నారని, రోడ్లు వేస్తే 40 నుంచి 50 ఏళ్ల వరకు తవ్వకుండా ఉండాలన్నారు. నగరాన్ని హైదరాబాద్ కంటే ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్నారు. కౌన్సిల్లో సగానికి పైగా మహిళా కార్పొరేటర్లు ఉండగా పది మంది మాత్రమే హాజరవడాన్ని చూసిన మంత్రి మహిళా కార్పొరేటర్ల హక్కులు హరించొద్దని, కనీసం సమావేశాల్లోనైనా పాల్గొనేలా చూడాలని వారి కుటుంబికులకు చురకలంటించారు. యజ్ఞంలా పనిచేస్తేనే స్మార్ట్ : ఎంపీ స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చే వరకు మా బాద్యత తీరిందని, పాలక వర్గం, అధికారులు రానున్న 45 రోజుల పాటు యజ్ఞంలా పనిచేస్తేనే స్మార్ట్‌సిటీ సాధ్యమని ఎంపీ వినోద్‌కుమార్ సూచించారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను మెట్రోస్మార్ట్ సిటీగా మార్చాలని, దానికి బదులుగా కరీంనగర్‌ను చేర్చాలని లేఖ రాసినప్పుడు మళ్లీ కే ంద్ర కేబినేట్ ఆమోదం కావాలని చెప్పినట్లు తెలిపారు. ఐదేళ్లలో రూ.500 కోట్లే కాదు రూ.5వేల కోట్లయినా తీసుకునే అవకాశముందన్నారు. జిల్లాకు చెందిన ఇండోర్ కలెక్టర్ నరహరితో సమావేశమై డీపీఆర్ తయారీకి సలహాలు తీసుకుంటామని తెలిపారు. తిమ్మాపూర్‌లో 300 ఎకరాల్లో హైటెక్ సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేషన్‌కు ముగ్గురు గ్రూప్-1 ఆఫీసర్లను కేటాయించాలని మంత్రిని కోరారు. మొదటి మెట్టులోఉన్నాం : ఎమ్మెల్యే స్మార్ట్ జాబితా మొదటి మెట్టులోనే ఉన్నామని, మెరుగైన సౌకర్యాలు, ఆర్థిక పరమైన సంస్కరణలతో వచ్చే విడతలో స్మార్ట్ సాధించుకోవాలన్నారు. స్మార్ట్ సిటీల్లో ముందు వరుసలో ఉన్న ఇండోర్, పుణే నగరాలను సందర్శించి డీపీఆర్‌ను తయారు చేయూలన్నారు. ధృడచిత్తంతో పనిచేయాలి : ఎమ్మెల్సీ స్మార్ట్ సాధించాలంటే పాలకవర్గం, అధికారులు ధృఢచిత్తంతో పనిచేయాలని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్, ఎంపీ వినోద్ చొరవతో స్మార్ట్ జాబితాలో చేరిందని, దాన్ని సాధించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సర్వాంగ సుందరంగా అభివృద్ధి : కలెక్టర్ స్మార్ట్‌సిటీతో నగరం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. డీపీఆర్ బాగా తయారు చేయాలని తెలిపారు. స్మార్ట్ డీపీఆర్ పనుల కోసం డ్వామా ఏపీడీ శ్రీనివాస్‌ను డెప్యూటేషన్‌పై పంపిస్తామని, అనుమతి ఇప్పించాలని మంత్రిని కోరారు. లక్ష గొంతులను ఢిల్లీదాకా తీసుకెళ్లాలి: కమిషనర్ స్మార్ట్‌సిటీ ప్రజలు భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని, ప్రతి కార్పొరేటర్ సహకారంతో మీడియా, మెస్సేజ్, మెయిల్స్, వాట్సాప్ ఎలా వీలైతే అలా లక్ష గొంతులను ఢిల్లీదాకా తీసుకెళ్లాలని కమిషనర్ కృష్ణభాస్కర్ కోరారు. డీపీఆర్ గ్రౌండ్ నుంచే మొదలు పెట్టాలని, 67 సిటీలకు 73 నగరాలు పోటీపడుతున్నాయని, ఒక్క సారి ఫెయిల్ అయితే మళ్లీ మొదటికి వస్తామన్నారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరముందన్నారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఘన సన్మానం నగరం స్మార్ట్‌సిటీ జాబితాలో నగరం చేరడంపై మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారులు ఘనంగా సన్మానించారు. స్మార్ట్ కోసం శ్రమిస్తున్న కమిషనర్ కృష్ణభాస్కర్‌ను ఎంపీ వినోద్ శాలువాతో సత్కరించారు. అంతకు ముందు కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇలాగైతే స్మార్ట్ సిటీ సాధ్యమేనా
► పందుల సమస్య తీవ్రం అంతటా పారిశుద్ధ్య లోపం ► కల్లూరును విస్మరిస్తున్నారు మున్సిపల్ అధికారులపై ► ఎంపీ బుట్టా, ఎమ్మెల్యే గౌరు చరిత ఆగ్రహం కర్నూలు(టౌన్): ‘కర్నూలు నగరంలో పందుల సమస్య తీవ్రంగా ఉంది.. పందుల నిర్మూలన అధికార యంత్రాంగానికి పట్టడం లేదు.. ఎక్కడా చూసినా పారిశుద్ధ్య లోపమే.. ఇక స్మార్ట్ సిటీ ఎలా సాధ్యం’ అంటూ కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక నగరపాలక కమిషనర్ చాంబర్ లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డితో కలిసి మున్సిపల్ అధికారులు, వివిధ విభాగాల సెక్షన్ సూపరింటెండెంట్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో బుట్టా అధికారుల తీరును ఎండగ్టారు. ‘కర్నూలు నగరంలో పందుల సమస్య తీవ్రంగా ఉంది. మనుషుల ప్రాణాలు ముఖ్యం. సమస్యను లైట్‌గా తీసుకున్నారు. నేను ఉన్న ప్రాంతంలో వాణిజ్య నగర్ పార్కు అభివృద్ధి చేయాలని ఒకటిన్నర సంవత్సరం క్రితం చెప్పా.. అయినా పట్టించుకోలేదు. ఎంపీ చెప్పినా పనులు కాకపోతే ఇక ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి’ అంటూ మండిపడ్డారు. వివిధ పథకాలు, స్కీమ్‌ల ద్వారా నగరపాలక సంస్థకు రూ. 200 కోట్లు వచ్చాయని, ఈ నిధులతో చేస్తున్న అభివృద్ధి వివరాలను తెలియజేయాలన్నారు. పనులు వేగవంతం చేయాలని, జాప్యం తగదన్నారు. -
స్మార్ట్ సిటీల జాబితాలో కరీంనగర్‌కు చోటు
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి కరీంనగర్‌కు చోటు దక్కింది.ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైదరాబాద్ స్థానంలో కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కేంద్రాన్ని కోరారు. దీంతో కేసీఆర్ ప్రతిపాదనను పరిశీలించిన కేంద్రం అందుకు అంగీకారం తెలిపింది. కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సుముఖత వ్యక్తం చేసింది. దీంతో స్మార్ట్ సిటీల జాబితా నుంచి హైదరాబాదును తొలగించి ఆ స్థానంలో కరీంనగర్ ను చేర్చింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 స్మార్ట్ సిటీల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు ఉన్నాయి. అయితే రూ.100 కోట్ల నిధులు హైదరాబాద్‌కు సరిపోవని, స్మార్ట్ సిటీ బదులు హైదరాబాద్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
స్మార్ట్ కు సన్నద్దం
► కరీంనగర్‌కు అన్ని అర్హతలున్నారుు ► కేంద్రం సూచన మేరకు సంస్కరణలు చేపడుతున్నాం.. ► మూడో విడతలో మన కల నెరవేరుతుంది.. ► కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ కరీంనగర్ కార్పొరేషన్ : స్మార్ట్‌సిటీ కరీంనగర్ ప్రజల కల.. ఆ కలను నెరవేర్చేందుకు, జిల్లా కేంద్రానికి స్మార్ట్‌హోదా సాధించి పెట్టేందుకు అధికార యంత్రాంగం, పాలకవర్గం తీవ్రం గా శ్రమించింది. తెలంగాణలో మూడు పట్టణాలను స్మార్ట్‌సిటీలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించింది. అప్పటి నుంచి కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం నిర్విరామ కృషిచేసి నివేదిక తయారుచేసి కేంద్రానికి అందజేశారు. 87మార్కులు సాధించినా రాజకీయ సమీకరణాలు వరంగల్ వైపే మొగ్గుచూపాయి. అయినా నిరాశ చెందకుండా ప్రతి అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి స్మార్ట్ హోదాకు తమ ప్రయత్నాలను కొనసాగించారు. అరుుతే రెండు సిటీలకే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్‌కు బదులుగా కరీంనగర్ పేరును జాబితాలో చేర్చడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ మూడో జాబితాలో స్మార్ట్ సిటీని కచ్చితంగా సాధించి తీరుతామని మేయర్ రవీందర్‌సింగ్ చెబుతున్నారు. స్మార్ట్ సిటీ హోదా కోసం బల్దియా చేసిన ప్రయత్నాలు, చేయబోయే కార్యక్రమాలు ఆయన మాటల్లోనే... ముందు వరుసలో ఉన్నాం.. ఇప్పటివరకు రెండు విడతల్లో 33నగరాలు స్మార్ట్ హోదా దక్కించుకున్నారుు. వాటికి కరీంనగర్ ఏ మాత్రం తీసిపోదు. ఏడాదిన్నరగా స్మార్ట్‌హోదా దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతం మార్కుల పట్టికలో ముందువరుసలో ఉన్నాం. తెలంగాణకు రెండు స్మార్ట్ నగరాలకే పరిమితం చేయడంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు బదులు కరీంనగర్‌ను జాబితాలో చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేశారు. అప్పటినుంచి ఎంపీ వినోద్‌కుమార్ స్మార్ట్ హోదా కల్పించేందుకు కృషిచేస్తున్నారు. అన్ని అర్హతలున్నాయి.. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్తర్వాత అన్ని అర్హతలు కలిగిన మూడో పెద్ద నగరం కరీంనగరే. వరంగల్‌కు స్మార్ట్ హోదా దక్కడంతో మిగిలింది కరీంనగరం మాత్రమే. పోటీకి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. మార్కుల పట్టికలో ఏడాదిన్నర క్రితం తొలి ప్రయత్నంలోనే 85 మార్కులు సాధించాం. ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి. హోదాకు సరిపడా 90మార్కులు ఇప్పుడు ఉన్నాయి. సాంకేతిక అంశాల విషయంలో కొంత ముందుకు వెళ్లాల్సి ఉంది. కేంద్ర మంత్రి సూచనతో.. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్మార్ట్ హోదా ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. చిన్నచిన్న మార్పులు చేసుకోవాలని ఫోన్లో సూచించారు. ఆయన సూచనల మేరకు పనిచేస్తున్నాం. ఆదాయ వనరుల పెంపు, ప్రజలకు జవాబుదారీతనం, స్వచ్ఛభారత్ వంటి అంశాల్లో మెరుగుపరుచుకున్నాం. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్ స్మార్ట్ హోదా కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆదాయ వనరుల పెంపునకు చర్యలు ఆదాయ వనరుల పెంపు కోసం ఒక్క రూపాయికే నల్లాను ప్రవేశపెట్టాం. ఇప్పటివరకు వెరుు్య కనె ్షకన్లు ఇచ్చాం. నల్లాపన్ను ద్వారా నెలకు రూ.10లక్షల ఆదాయం పెరిగింది. రోజు 50నల్లాకనెక్షన్లకు దరఖాస్తులు వస్తున్నాయి. ప్రజలపై భారం పడకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టిసారించాం. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఒక్క రోజే 50వేల మందితో నగరాన్ని శుభ్రం చేశాం. స్వచ్ఛ కరీంనగర్ కోసం కృషిచేస్తాం. సింగిల్‌విండో విధానం పౌరసేవలు పకడ్బందీగా అమలు చేసి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నాం. పూర్తిగా ఆన్లైన్ ద్వారా పనులు జరుగుతున్నాయి. దరఖాస్తుదారుడు పౌరసేవా కేంద్రంలో దరఖాస్తు చేసి అక్కడి నుంచే ధ్రువీకరణ పొందేలా ఏర్పాట్లు చేశాం. మూడో విడతలో ఖాయం కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా మూడో విడతలో రావడం ఖాయం. కేంద్ర ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది. గత నెలలో కమిషనర్‌కు కృష్ణభాస్కర్ ఢిల్లీలో జరిగిన స్మార్ట్ సిటీల సమావేశానికి ఆహ్వానం అందుకుని హాజరయ్యారు. కేంద్ర కేబినెట్ ప్రొసీడింగ్ ఇస్తే స్మార్ట్ హోదా వచ్చినట్లే. -
కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయండి
వెంకయ్యనాయుడుకు ఎంపీ వినోద్‌కుమార్ వినతి కరీంనగర్ : కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలోకి చేర్చాలని ఎంపీ బి.వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి బుధవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడును ఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చాలని సీఎం కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్, మేయర్ రవీందర్‌సింగ్‌తోపాటు బీజేపీ నాయకులు పూర్తి వివరాలతో తనకు నివేదిక అందజేశారన్నారు. దేశావ్యాప్తంగా ఎంపిక చేసిన వంద స్మార్ట్‌సిటీల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు ఉన్నాయని, కేసీఆర్ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ స్థానంలో కరీంనగర్‌ను ఎంపిక చేయనున్నామని తెలిపారు. మార్గదర్శకాల్లో స్వల్పమైన మార్పులు చేసి, విధానపరమైన నిర్ణయం తీసుకొని, త్వరలోనే కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా.. కరీంనగర్ స్మార్ట్‌సిటీగా ఎంపిక అయిపోయినట్లేనని, విధానపరమైన ప్రకటన వెలువడడానికి కొంత సమయం పడుతుందని ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిని, అదనపు కార్యదర్శిని, స్మార్ట్‌సిటీస్ మిషన్ డెరైక్టర్‌ను కలిసి అవసరమైన నివేదిక అందజేశామన్నారు. -
మళ్లీ నిరాశే
స్మార్ట్‌గా వెనుకడుగు రెండో జాబితాలోనూ తిరుపతికి దక్కని చోటు తిరుపతితుడా : స్మార్ట్ జాబితాలో తిరుపతికి మళ్లీ నిరాశే ఎదురైంది. గత ఏడాది జనవరిలో విడుదల చేసిన టాప్-20 స్మార్ట్ సిటీ జాబితాలో తిరుపతికి చోటు దక్కలేదు. తాజాగా మంగళవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విడుదల చేసిన రెండో విడత స్మార్ట్ జాబితాలోనూ నిరాశే ఎదురైంది. రెండో జాబితాలో 40 నగరాలను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం 13 నగరాలను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వరంగల్ నగరం మాత్రమే స్మార్ట్ సిటీలో చోటుదక్కించుకుంది. మరో 27 నగరాలను జూలైలో ప్రకటించనున్నారు. ఇందులో అయినా చోటు దక్కుతుందేమోనని నగర వాసులు మరింత ఆశగా చూస్తున్నారు. అయితే తిరుపతి కార్పొరేషన్ యంత్రాంగం మలివిడత జాబితాకు ఇంకా సిద్ధం కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. రెండు రోజల క్రితం స్మార్ట్‌సిటీ మాస్టర్ ప్లాన్ ఖరారు కోసం కన్సల్టెన్సీకి అప్పగించింది. అభిప్రాయ సేకరణలోను కార్పొరేషన్ యంత్రాంగం వెనుకంజలో ఉంది. మహానాడుకు తిరుపతి వేదిక కావడంతో నగరాన్ని త్వరితగతిన ముస్తాబు చేసేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటి వరకు చేపట్టిన అభిప్రాయసేకరణలో కమిషనర్ వినయ్‌చంద్ ఒక్కరోజు మాత్రమే పాల్గొనడం గమనార్హం. కింది స్థాయి అధికారులు అడపాదడపా అభిప్రాయ సేకరణ చేపట్టారు. పదిరోజులుగా నగరంలో అభివృద్ధిపనులపై దృష్టిపెట్టిన అధికారులు స్మార్ట్ సిటీ మాస్టర్‌ప్లాన్ రూపొందించడంలో నిర్లక్ష్యం వహించారు. మరో జాబితా ప్రకటనముందే మేల్కొని తగిన అభిప్రాయ సేకరణ చేసి మాస్టర్‌ప్లాన్ రూపొందించాల్సి ఉంది. -
ఇక 'స్మార్ట్' గా రాష్ట్రపతి భవనం
న్యూఢిల్లీ : ప్రకృతి రమణీయతకు మారుపేరుగా, అందమైన ఉద్యానవనాలతో ప్రధాన ఆకర్షణగా ఉండే అద్భుతమైన రాష్ట్రపతి భవనం, ఐబీఎమ్ స్మార్ట్ సిటీ సొల్యూషన్ సహకారంతో స్మార్ట్ టౌన్ షిప్ గా రూపొందనుంది. స్మార్ట్ సిటీ సొల్యూషన్ లో భాగంగా ప్రెసిడెన్సియల్ ఎస్టేట్ లో డిజిటల్ ట్రాన్సపర్ మేషన్ ను చేపట్టనున్నట్టు ఐబీఎమ్ గురువారం ప్రకటించింది. 330 ఎకరాల విస్తీర్ణాన్ని, 5వేల పైగా రెసిడెంట్లను, అధ్యక్ష ఎస్టేట్ ను భవిష్యత్తులో స్మార్ట్ గా రూపుదిద్దడానికి ఐబీఎమ్ టెక్నాలజీ సహాయపడనుంది. నీళ్ల సరఫరా, భద్రతా, విద్యుత్ అవస్థాపన, ఘన వ్యర్థాల నిర్వహణను సవాళ్లగా తీసుకుంటూ టౌన్ షిప్ ను అభివృద్ధి చేస్తామని ఐబీఎమ్ పేర్కొంది. ఇప్పటికే ఐబీఎమ్ ఇంటిలిజెన్స్ ఆపరేషన్ సెంటర్(ఐఓఎస్) సిటిజన్స్ మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది. వెబ్, మొబైల్ ద్వారా సమస్యలను తెలియజేసేలా దీన్ని రూపొందించింది. డిజిటల్ యుగంలో రాష్ట్రపతి భవన్ కూడా భాగస్వామ్యం అవుతున్నట్టు అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఓ ఈవెంట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత స్మార్ట్ సిటీ విజన్ కు రాష్ట్రపతి భవనం సారుప్యంగా మారుస్తామని, ఈ స్మార్ట్ టౌన్ షిప్ గ్రేట్ జర్నీలో తాము భాగస్వామ్యమైనందుకు చాలా గర్వంగా భావిస్తున్నామని భారత ఐబీఎమ్ ఎండీ వనిత నారాయణన్ అన్నారు. -
అన్నీ కోతలే!
► వదలని విద్యుత్ కోతలు ► నీటి మూటలైన పాలకుల మాటలు ► కనీసం కోతల వేళలు తెలియక జనం ఇబ్బందులు వేసవిలో విద్యుత్ కోతలు ఉండవని, 24 గంటలూ సరఫరా ఇస్తామని చెప్పిన పాలకులు, అధికారుల మాటలు వట్టి ‘కోత’లేనని తేలిపోయింది. నాలుగు రోజులుగా జిల్లా ప్రజలు విద్యుత్ కోతలతో ఇబ్బందులకు గురవుతున్నా పరిస్థితిని ఇప్పటికీ సాధారణ స్థితికి తీసుకురాలేకపోయారు. కనీసం కోతల వేళలను కూడా ప్రకటించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: జిల్లా ప్రజలను విద్యుత కష్టాలు వీడటం లేదు. నాలుగు రోజుల క్రితం కలపాకలోని 400 కేవీ ట్రాన్స్‌కో విద్యుత్ ఉప కేంద్రంలో బస్ బార్ దెబ్బతినడంతో మొదలైన విద్యుత్ కష్టాలు బుధవారం కూడా కొనసాగాయి. రెండో రోజు 220 కేవీ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. మూడో రోజు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన 220 కేవీ సబ్‌స్టేషన్ పాడయింది. నాలుగో రోజు అదే సబ్‌స్టేషన్‌లో మెయింటెనెన్స్ కోసం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ సరఫరా నిలిపివేశారు. దీంతో ఈ నాలుగు రోజులు విశాఖ, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధి వరకూ అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో విద్యుత్ కోతలు అమలు చేశారు. కనీస సమాచారం కరువు నాలుగు రోజుల్లో దాదాపు 2 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇంత జరుగుతున్నా ప్రజలకు ఒక్క మాట చెప్పడం లేదు. వేళాపాళా లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. దీంతో జనం రాత్రి పగలూ విద్యుత్ కోతలతో విసిగిపోతున్నారు. అర్ధరాత్రి తమ దగ్గర్లోని విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి విచారిస్తే తమకేమీ తెలియదని, గాజువాక వెళ్లి ట్రాన్స్‌కో వాళ్లని అడగండని ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది బదులిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పవర్‌గ్రిడ్ నిరా్వాహకులు ఎలాంటి సమాచారం ఇవ్వనందువల్ల తామేమీ చెప్పలేమని ఏపీ ట్రాన్స్‌కో అధికారులు అంటున్నారు. దీంతో ఎక్కడా ప్రజలకు కోతలకు సంబంధించినసమాచారం రావడం లేదు. ఎప్పటికి తీరేను? దేశంలోనే అత్యంత తక్కువగా 1.75 శాతం ట్రాన్స్మిషన్ నష్టాలు కలిగిన విశాఖ ఏపీ ట్రాన్స్‌కోను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లాలో దీనికి ప్రస్తుతం 52 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లున్నాయి. కానీ స్మార్ట్ సిటీగా, పారిశ్రామిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖ జిల్లాకు ఇవేమీ సరిపోవు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులో భాగంగా కాపులుప్పాడలో 132 కేవీ, ఓజోన్వేలి, అచ్యుతాపురంలో 220 కేవీ, నక్కపల్లిలో 400 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) కూడా సిద్ధమైంది. కానీ దీనికి ఏషియన్ బ్యాంకు నుంచి నిధులు రావాల్సి ఉంది. అవి ఎప్పుడు వస్తాయో, పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో పాలకులకు, అధికారులకే అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందా. ట్రాన్స్మిషన్ నెట్‌వర్క్‌ను పెంచుకుంటే తప్ప విద్యుత్ కోతల నుంచి శాశ్వత విముక్తి దొరకదు. -
స్మార్ట్ డివిజన్లు... మళ్లీ తెరపైకి
► అధికారుల కసరత్తు ► టక్కర్ ఆదేశాలతో హైరానా ► తొలి విడత నాలుగు డివిజన్ల ఎంపిక! ► వెంటాడుతున్న నిధుల కొరత విజయవాడ సెంట్రల్ : రాజధాని నగరంలో స్మార్ట్ డివిజన్ల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందుకోసం నగరపాలక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెలైట్ ప్రాజెక్ట్‌గా నాలుగు డివిజన్లను ఎంపిక చేయాలనే యోచనలో ఉన్నారు. స్మార్ట్ సిటీల్లో స్థానం దక్కించుకోలేని విజయవాడపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గతేడాది అక్టోబర్ 15న నగరంలో స్మార్ట్ డివిజన్లను ఎంపిక చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్ర టరీ టక్కర్ ఆదేశాలు జారీ చేశారు. నగ రపాలక సంస్థ అధికారులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం స్మార్ట్ డివిజన్ల ఏర్పాటుపై ఎందుకు దృష్టిపెట్టలేదంటూ టక్కర్ సర్క్యులర్ జారీ చేశారు. దీంతో అధికారుల్లో హైరానా మొదలైంది. కమిషనర్ జి.వీరపాండియన్ స్మార్ట్ డివిజన్ల ఎంపిక బాధ్యతను సంబంధిత అధికారులకు అప్పగించారు. స్మార్ట్ డివిజన్లు అంటే... ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలి. తడి, పొడి చెత్త విభజన చేయాలి. ఆధునిక హంగులతో పార్కులను తీర్చిదిద్దాలి. పచ్చదనాన్ని పెంపొందించాలి. నిరంతర నీటి సరఫరా జరగాలి. కుళాయిలకు నీటి మీటర్లు అమర్చాలి. రహదారులు అభివృద్ధి చేయాలి. విద్యుత్ దీపాల వెలుగులు సక్రమంగా ఉండాలి. అప్పుడే ఆ డివిజన్‌ను స్మార్ట్ (ఆకర్షణీయమైనది)గా గుర్తిస్తారు. దీనిని సాధించేందుకు ప్రజారోగ్య, ఇంజనీరింగ్, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా పనిచేయాల్సి ఉంటుంది. కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో స్మార్ట్ డివిజన్ల ఎంపిక బాధ్యతను చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, చీఫ్ ఇంజనీర్ ఎం.ఏ.షుకూర్, ఏడీహెచ్ జీపీ ఆనంద్ పర్యవేక్షిస్తున్నారు. తొలి విడతగా సర్కిల్-3లో రెండు, సర్కిల్-1, 2లలో ఒక్కోటి చొప్పున మొత్తం నాలుగు డివిజన్లను ఎంపిక చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. అమలు సాధ్యమేనా! తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న నగరపాలక సంస్థలో ప్రతినెలా జీతాల కోసం వెతుకులాట సాగించాల్సిన దుస్థితి నెలకొంది. 59 డివిజన్ల పరిధిలో సుమారు 132 పార్కులు ఉన్నాయి. నిధుల లేమి కారణంగా 70 శాతం పార్కులు కళావిహీనంగా తయారయ్యాయి. రాజీవ్‌గాంధీ, కేఎల్‌రావు, రాఘవయ్య పార్కుల అభివృద్ధికి కోటి రూపాయల హడ్కో నిధులు ఇచ్చింది. డివిజన్లలో చిన్న పార్కుల అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరినప్పటికీ స్పందన రాలేదు. ఇక పారిశుధ్య విషయానికి వస్తే ఇంటింటి చెత్త సేకరణ 70 శాతం మించి జరగడం లేదు. చెత్త విభజన కొన్ని డివిజన్లకే పరిమితమైంది. కృష్ణమ్మ చెంతనే ఉన్న నగరవాసులకు దాహం కేకలు తప్పడం లేదు. సర్కిల్-3 పరిధిలోని రామలింగేశ్వర నగర్ 10 ఎంజీడీ ప్లాంట్ సక్రమంగా పనిచేయకపోవడంతో సర్కిల్-3లో అత్యధిక డివిజన్లలో మురుగునీరు సరఫరా అవుతోంది. కొండ, శివారు ప్రాంతాల్లో నీరు సక్రమంగా అందడం లేదు. కుళాయిలకు నీటి మీటర్లు ఏర్పాటు చేయలన్న ప్రతిపాదనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో స్మార్ట్ డివిజన్ల ఏర్పాటు సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
కేంద్రం పరిశీలనలో ‘స్మార్ట్’
► మరోసారి పోటీలో వరంగల్ ► మే 15లోపు ఫలితాల వెల్లడి ► రూ.2861 కోట్లతో సమగ్ర నివేదిక ► మొత్తం ఏడు థీమ్‌లు, 20 ప్రాజెక్టులు ► పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం స్మార్ట్‌సిటీ పథకం రెండో దశ అమలులో చోటు దక్కించుకునేందుకు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గతంలో సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో లోపాలను సవరించి.. తాజా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీనిపై ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. సాక్షి, హన్మకొండ: నగరాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో 2015లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఈ వంద నగరాలకు సంబంధించి సమగ్ర నివేదిక (డీపీఆర్)లతో స్మార్ట్‌సిటీ చాలెంజ్ కాంపిటీషన్లో పాల్గొనాలి. ఈ కాంపిటీషన్లో వచ్చిన డీపీఆర్‌ల ఆధారంగా తొలి విడతలో 20 నగరాలను ఎంపిక చేశారు. వరంగల్‌తో పాటు మరో 23 నగరాలు తృటిలో ఈ అవకాశాన్ని చే జార్చుకున్నాయి.దీంతో ఈ 23 నగరాలకు మరో అవకాశాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కల్పించింది. వీటికోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కాంపిటీషన్ ఏర్పాటుచేసి,ఈ ఏడాది ఏప్రిల్ 21 లోగా డీపీఆర్‌లను సమర్పించాల్సిం దిగా ఆదేశించింది. గ్రేటర్ వరంగల్ కొత్త కార్యవర్గం ఎ న్నికైన వెంటనే మేయర్ నన్నపునేని నరేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సవరించిన డీ పీఆర్‌ను ఆమోదించారు. ఈ నివేదికను ఈ నెల 20న న్యూఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించారు.ఫాస్ట్‌ట్రాక్ కాం పిటీషన్లో వచ్చిన నివేదికలను మే 15లోగా పరిశీలించి, ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. 86 ప్రాజెక్టులు.. స్మార్ట్‌సిటీ ఫాస్ట్‌ట్రాక్ కాంపిటీషన్ కోసం సమర్పించిన నివేదికలో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. స్మార్ట్‌సిటీ పథకం నిబంధనల ప్రకారం గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాన్ని (సెంట్రల్ సిటీ) అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం ప్రధానం. దీనికి అదనంగా నగరం మొత్తానికి పనికి వచ్చేలా (పాన్‌సిటీ) ఎంపిక చేసిన విభాగాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయొచ్చు. సెంట్రల్‌సిటీ, పాన్సిటీల ద్వారా గ్రేటర్ వరంగల్‌లో రూ.2861 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు. సెంట్రల్ సిటీ ద్వారా చేపట్టబోయే పనులను ఏడు థీమ్‌లుగా విభజంచారు. ఈ ఏడు థీమ్‌ల ద్వారా మొత్తం 86 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో 20 మేజర్ ప్రాజెక్టులు, 66 సబ్ మేజర్ ప్రాజెక్టులుగా విభజించారు. భద్రకాళీ చెరువును పర్యాటక ప్రాంతంగా మా ర్చడం, ఎంపిక చేసిన మురికి వాడల్లో మౌలిక సదుపాయలు మెరుగుపరచడం, నగరంలో వాణిజ్యరంగం అభివృద్ధి చెందేలా మౌలిక సదుపాయల కల్పన, రవాణ వ్యవస్థ ఆధునీకరణ, పట్టణంలో పచ్చదనం పెంచడం, పర్యావరణ పరిరక్షణ, నగరం మధ్యలో ఎంపిక చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వంటి పనులను ప్రధాన కార్యక్రమంగా సమగ్ర నివేదికలో పే ర్కొన్నారు. ఈ పనులు చేపట్టేందుకు రూ. 2707 కోట్లు ఖర్చు అవుతాయని కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. పాన్‌సిటీ పథకం ద్వారా భద్రత, రవాణ వ్యవస్థ, సమాచార వ్యవస్థలను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టేందుకు రూ.153 కోట్ల వ్యయం అవుతుందని ప్రణాళికలో పేర్కొన్నారు. నగర అభివృద్ధి నమూనాలో తొలిసారిగా పర్యావరణానికి పెద్దపీఠ వేశారు. సెంట్రల్ సిటీ అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో పచ్చదనం పెంచేందుకు రూ.163 కోట్లు కేటాయించారు. స్మార్ట్‌సిటీ ద్వారా రూ.989 కోట్లు స్మార్ట్‌సిటీ పథకం ద్వారా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.2861 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.989 కో ట్ల నిధులు మంజూరు కానున్నాయి. దీని తర్వా త ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా రూ.906 కోట్లు సమీకరించాలని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా రూ.393,కేంద్ర ప్రా యోజిత కార్యక్రమాల ద్వారా రూ.370 కోట్లు, రుణాల ద్వారా రూ.203 కోట్లు సమీకరిస్తారించాలని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు. -
రూ.2681 కోట్లతో ‘స్మార్ట్’
సాంస్కృతిక రాజధానిగా ఓరుగల్లు పర్యాటకులను ఆకర్షించేలా పనులు పట్టణంలో పచ్చదనానికి ప్రాధాన్యం మారనున్న నగరం రూపురేఖలు స్మార్ట్‌సిటీ డీపీఆర్ లక్ష్యాలు ఇవే.. వరంగల్ నగరాన్ని రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్మార్ట్‌సిటీ సమగ్ర ప్రణాళిక రూపొందించారు. నగరానికి ఉన్న చారిత్రక ప్రాశస్త్యాన్ని ఉపయోగించుకుని పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కేలా పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా భద్రకాళి, పద్మాక్షి ఆలయాల కేంద్రంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధమైంది. దీంతో పాటు నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అదేవిధంగా బస్‌స్టేషన్, డ్రెరుునేజీల నిర్మాణం, సోలార్ విద్యుత్ దీపాలు, వర్షపు నీరు ఒడిసి పట్టడం వంటి పనులు ఉన్నాయి. ఈ పనులకు రూ.2681 కోట్లతో సిద్ధం చేసిన స్మార్ట్‌సిటీ ప్రతిపాదనల్లో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.. హన్మకొండ: నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్మార్ట్‌సిటీ పథకం తొలి దశ అమలులో వరంగల్ నగరానికి అవకాశం త్రుటిలో చేజారిపోయింది. మలిదశ అమలులో చోటు దక్కించుకునేందుకు లీ కంపెనీ నేతృత్వంలో సమగ్ర నివేదికను రూపొందించారు. మొత్తం రూ.2,681 కోట్ల వ్యయంతో నగరం రూపురేఖలు మార్చే విధంగా పనులు చేపట్టాలని ఈ ప్రణాళికలో పేర్కొన్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్ భాగస్వామ్యంలో ఏర్పాటయ్యే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ద్వారా రూ.1686 కోట్ల నిధులు సమీకరించాలని సూచించారు. మిగిలిన రూ.995 కోట్లను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా సేకరించాలని డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఇలా సేకరించిన నిధులతో ఐదేళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యవిభాగాలు స్మార్ట్‌సిటీ ద్వారా చేపట్టబోయే పనులను ప్రాంతాల వారీగా వర్గీకరించారు. ఇందులో రెట్రోఫిట్టింగ్ పేరుతో భద్రకాళీ చెరువు చుట్టూ 500 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తారు. రీడెవలప్మెంట్ స్కీం కింద 50 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి, ఆ ప్రాంతాన్ని అన్ని రకలా అధునాతన సదుపాయాలు ఉండేలా అభివృద్ధి పరుస్తారు. దీని తర్వాత 250 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి దీన్ని గ్రీన్‌ఫీల్డ్ సిటీగా రూపాంతరం చెందేలా పనులు చేపడుతారు. వీటితో పాటు నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేలా మరికొన్ని కార్యక్రమాలు చేపడుతారు. ఈ విభాగంలో ఈ గవర్నెన్స్ సిటిజన్ సర్వీసెస్, వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనే జ్మెంట్, అర్బన్ మొబిలిటీ వంటి పనులు నిర్వహిస్తారు. -
అసెంబ్లీలో అరకు కాఫీ
ఎమ్మెల్యేలకు పంపిణీ సాక్షి, విశాఖపట్నం : ఇప్పటికే పలు ప్రత్యేకతలు చాటుకుంటున్న అరకు వేలీ కాఫీ తాజాగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) తయారు చేస్తున్న ఈ కాఫీ అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ ప్రత్యేకతను సాధించింది. విశాఖ ఏజెన్సీలో సహజసిద్ధంగా పండిన సేంద్రియ కాఫీ రుచిలో పెట్టింది పేరు. ఈ కాఫీ గింజలను పౌడరుగా చేసి జీసీసీ మార్కెట్లో విక్రయిస్తోంది. దీనికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల విశాఖలో జరిగిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు విదేశీ ప్రతినిధులు అరు కాఫీని రుచి చూసి మంత్రముగ్ధులయ్యారు. గత నెలలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లలో దీని పేరు మరింత ఇనుమడించింది. ఐఎఫ్ఆర్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అరకు కాఫీని సేవించి రుచి అమోఘంగా ఉందని కితాబు నిచ్చారు. స్మార్ట్ సిటీలో భాగంగా అమెరికా నుంచి విశాఖ వచ్చిన ప్రతినిధుల బృందం కూడా అరకు కాఫీ తాగడమే కాదు.. రుచిని మెచ్చుకుని తమ వెంట తీసుకెళ్లారు కూడా. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు ఈ కాఫీని గిఫ్ట్‌గానూ ఇస్తున్నారు. ఇలావుండగా ఈ అరకు కాఫీని మన ప్రజాప్రతినిధులకు ఇవ్వాలన్న ఆలోచన ఆ శాఖ ఉన్నతాధికారులకు వచ్చింది. దీంతో జీసీసీ ఉన్నతాధికారులు సుమారు 200 కాఫీ ప్యాకెట్లను (200 గ్రాముల ప్యాక్) గిఫ్ట్ ప్యాక్ చేసి బుధవారం అసెంబ్లీకి, శాసనమండలికి పంపించారు. వీటిని బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు పంపిణీ చేశారు. నేడో రేపో శాసనమండలిలో ఎమ్మెల్సీలకు అందజేయనున్నారు. అరకు కాఫీకి అనతికాలంలోనే అత్యంత ఆదరణ రావడం ఆనందంగా ఉందని జీసీసీ ఎండీ ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్ ‘సాక్షి’కి తెలిపారు. -
‘స్మార్ట్’పై ఆశలు
► రెండో జాబితాలో కరీంనగర్‌కు అవకాశం..! ► నేడు ఢిల్లీలో స్మార్ట్‌సిటీల సదస్సు ► హాజరవుతున్న కమిషనర్ కృష్ణభాస్కర్ కరీంనగర్ కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వం దేశంలోని వంద నగరాలను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన స్మార్ట్‌సిటీల రెండో జాబితాపై ఆశలు రేకెత్తుతున్నాయి. మొదటి జాబితాలో 20 నగరాలను ప్రకటించగా... అందులో కరీంనగర్ కార్పొరేషన్‌కు అవకాశం తృటిలో చేజారిన విషయం తెలిసిందే. రెండో విడతలో మరో 20 నగరాలకు చోటు కల్పించేందుకు స్మార్ట్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో స్మార్ట్‌సిటీల జాబితాకు ఎంపికై పోటీలో ముందు వరుసలో ఉన్న నగరాల కమిషనర్లతో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్ హాజరవుతున్నారు. స్మార్ట్ సిటీ హోదా కోసం చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష ఉంటుందని సమాచారం. వడివడిగా అడుగులు తెలంగాణలో వరంగల్‌తోపాటు కరీంనగర్ స్మార్ట్‌సిటీ రేసులో వడివడిగా అడుగులు వేస్తోంది. స్మార్ట్‌సిటీకి కావాల్సిన హంగులు, ఆర్భాటాలను ఇప్పటికే సమకూర్చుకున్న నగరం ఆన్‌లైన్‌పై దృష్టి సారించింది. ప్రతీ అంశాన్ని ఆన్లైన్ చేయడం ద్వారా మరిన్ని మార్కులు సాధించే అవకాశముంది. దీంతో రెండో జాబితాలో 20 సిటీల్లో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. రెండో జాబితాతోనే మూడో జాబితాను కూడా ప్రకటించేందుకు కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఎలా చూసినా కరీంనగర్‌కు స్మార్ట్ కిరీటం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క యూజీడీ మాత్రం మార్కుల జాబితాలో నగరాన్ని కాస్త వెనక్కి నెడుతోంది. మార్కుల్లో ముందు వరుసలో... కేంద్రం స్మార్ట్‌సిటీలుగా వంద నగరాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన నాటి నుంచే కరీంనగర్ నగరపాలక సంస్థ యంత్రాంగం, పాలకవర్గం చోటు దక్కించుకునేందుకు కృషిచేస్తోంది. తెలంగాణకు రెండు సిటీలను మాత్రమే కేటాయించడంతో.. మొదట హైదరాబాద్, వరంగల్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే హైదరాబాద్‌కు స్మార్ట్ హోదాతో పెద్దగా ఒరిగేదేమీ లేదని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను తప్పించింది. ఆ స్థానంలో 100 మార్కులకు గాను 87.5 మార్కులతో ఉన్న కరీంనగర్ పేరును ప్రతిపాదించింది. మొదటి దశలో చోటు దక్కకపోవడంతో రెండో దశలోనైనా కచ్చితంగా చోటు దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమిషనర్ సదస్సుకు హాజరవుతుండడంతో తప్పకుండా ఫలితం కనబడుతుందనే ఆశ ప్రజలు, అధికారుల్లో ఉంది. నగర అభివృద్ధిపై ప్రజెంటేషన్ స్మార్ట్ సిటీకి కావాల్సిన అర్హతలన్నింటినీ సదస్సులో కమిషనర్ ప్రజెంటేషన్ చేయనున్నారు. కొత్తగా చేపట్టనున్న వెహికిల్ ట్రాకింగ్ సిస్టం(జీపీఆర్ఎస్), సీసీ కెమెరాల ఏర్పాటు, ఈ-ఆఫీస్, ఆన్లైన్ కంప్లయింట్ సిస్టం తదితర అంశాలను వివరించనున్నారు. ఇప్పటికే అమలవుతున్న డోర్ టు డోర్ చెత్త సేకరణ, పిన్‌పాయింట్ చెత్త సేకరణ, చెత్త రీసైక్లింగ్, చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ(వర్మీ కంపోస్ట్), ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ వంటి పనులపై ప్రజెంటేషన్ చేయనున్నారు. -
స్మార్ట్ సిటీకి నిధులేవి..?
విశాఖపట్నం: హుద్‌హుద్‌ను జయించాం...విశాఖను పునర్నిర్మించాం..స్మార్ట్ సిటీగా ఎంపికైన విశాఖ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో మాత్రం విశాఖకు దక్కింది శూన్యహస్తమే. నిన్నటి కేంద్రబడ్జెట్లో స్మార్ట్ సిటీకి ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపు లభించక తీరని అన్యాయం జరగగా, నేటి రాష్ర్ట బడ్జెట్లో కూడా విశాఖకు నిరాశే ఎదురైంది. టాప్-20 స్మార్ట్‌సిటీల జాబితాలో జీవీఎంసీ టాప్-8లో నిలిచిన విశాఖ ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షణన్ సర్వేలో ఐదో స్థానంలో నిలిచింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా 700 చదరపు కిలోమీటర్ల పరిధిలోని జోన్-1 ప్రాంతమైన ఆర్కే బీచ్, రుషి కొండ తదితర ప్రాంతాలను రూ.1430 కోట్లతో అభివృద్ధి చేయాలని సంకల్పించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏటా రూ.వంద కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు సమకూర్చనుండగా..మిగిలిన మొత్తాన్ని ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి రుణ సాయం సమకూర్చుకోవల్సి ఉంది. గడిచిన రెండేళ్లకుగాను కేంద్రం నుంచి రూ. 200 కోట్లు, రాష్ర్టం నుంచి రూ.200 కోట్లు సమకూర్చాల్సి ఉంది. కానీ కేంద్ర బడ్జెట్లో స్మార్ట్ సిటీలన్నింటికి రూ.250 కోట్ల వరకు కేటాయింపులు జరపగా దీంట్లో జీవీఎంసీకి దక్కే మొత్తం అరకొరగానే ఉంటుంది. కాగా మంగళవారం రాష్ర్ట అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన ప్రసంగంలో విశాఖ, కాకినాడలు స్మార్ట్ సిటీగా ఎంపికయ్యాయంటూ ప్రకటనకే పరిమితమయ్యారే తప్ప బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన జీవీఎంసీ బృందం ప్రస్తుతం డీపీఆర్ తయారు చేసే పనిలో నిమగ్నమైన అధికారులు నిధుల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నారు. విస్కో ప్రాజెక్టుకు మాత్రం లక్ష రూపాయలు విదిలించారు. -
ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కులేదు
► స్మార్ట్ సిటీలో వరంగల్‌ను చేర్పించాం ► డీపీఆర్‌లో లోపాలతో ఎంపిక కాలేదు ► అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే మాపై నిందలు ► బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు హన్మకొండ : డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీఆర్పీ) తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వానికి ఓటు అడిగే నైతిక హక్కు లేదని బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు టీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. సోమవారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని నెక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో ఎంపిక చేయలేదని, బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని వ్యాఖానించే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలన్నారు. స్మార్ట్ సిటీగా ఎంపిక చేయడానికి తయారు చేయాల్సిన నివేదికను ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు సక్రమం గా తయారు చేయకపోవడంతోనే రావాల్సిన పాయింట్లు రాక స్మార్ట్ సిటీలో ఎంపిక కాలేదన్నారు. ఇదీ తెలిసి టీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి టీఆర్ఎస్ మం త్రులు, నాయకులు బీజేపీపై నిందలు వేస్తుం దని ధ్వజమెత్తారు. జిల్లాలో బీజేపీ నుంచి ప్రజాప్రతినిధి లేకున్నా జిల్లా నాయకులం ఢిల్లీకి వెళ్లి వరంగల్‌ను స్మార్ట్ సిటీ జాబితాలో పెట్టించామన్నారు. దీంతో పాటు హెరిటేజీ సిటీ, అమృత్ పథకాలు, ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు మంజూరు చేయించామన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతుంటే వాటిని తమ గొప్పగా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటుందని దుయ్యబట్టారు. ఆహార భద్రతా పథకం, వృద్ధాప్య, వితంతు పింఛన్లకు కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. కేంద్రం ఇళ్లు మంజూరు చేయిస్తే తామే నిర్మిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు వరంగల్ ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో ఆస్తి, నల్లా, విద్యుత్ పన్నులు మాఫీ చేసి, వరంగల్‌లో మాత్రం మాఫీ చేయలేదని విమర్శించారు. సమావేశంలో నాయకులు వన్నాల శ్రీరాములు, కాసం వెంకటేశ్వర్లు, రావు పద్మ, ఓంటేరు జయపాల్, రావు అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
స్మార్ట్ సిటీగా నెల్లూరు
ఆస్ట్రేలియా కాన్సులేట్ బృందంతో మంత్రి నారాయణ చర్చలు విజయవాడ బ్యూరో : నెల్లూరు నగరాన్ని స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేసేందుకు ఆ స్ట్రేలియా ప్రభుత్వం ముందుకొచ్చినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ చెప్పారు. చెన్నయ్‌లోని ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సీన్ కెల్లీ బృందంతో ఆయన మంగళవారం సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారాయణ నెల్లూరు నగరం ప్రత్యేకతలను వారికి వివరించారు. సముద్రానికి దగ్గరగా ఉండడం, కృష్ణపట్నరం పోర్టు, సమీపంలోనే చెన్నయ్ ఎయిర్‌పోర్టు ఉండడం, కావాల్సినంత భూమి కూడా అందుబాటులో ఉండడం వల్ల ఈ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని తెలిపారు. ఇందుకు ఆస్ట్రేలియా బృందం సమ్మతించింది. తిరుపతి నగరాన్ని కూడా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారు. వీటితోపాటు రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో మాస్టర్‌ప్లాన్, సిటీ ప్లానులు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్తమ నమూనాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు మున్సిపల్ శాఖ, ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం అంగీకరించాయి. విద్య, పర్యాటకం ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో తాము ఏపీకి మద్ధతు ఇస్తామని కెల్లీ తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా బృందాన్ని నారాయణ ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి పరిచయం చేసి వివరాలు తెలిపారు. -
అద్భుత అవకాశంగా భావిస్తున్నా: చంద్రబాబు
విశాఖపట్నం : అమెరికా ప్రభుత్వంతోపాటు ఆ దేశ సంస్థలతో కలసి పని చేయడం అద్భుత అవకాశంగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విశాఖపట్నం నగరంలోని గేట్ వే హోటల్లో యూఎస్ ప్రతినిధులతో జరిగిన యూఎస్ఐడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... హుద్‌హుద్ తుపాన్ నుంచి కోలుకున్న విశాఖ నగరంలో రెండు కీలక సదస్సులు జరగడం విశేషమని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 20 స్మార్ట్ సిటీల తొలి జాబితాను విడుదల చేసిందని... అందులో విశాఖ నగరం ఆ జాబితాలో చోటు దక్కించుకుందని తెలిపారు. భారత్‌లో తొలిసారి ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఐఎఫ్ఆర్లో 50 దేశాలు పాల్గొన్నాయన్నారు. ఈసందర్భంగా ఆయాదేశాల ప్రతినిధులు విశాఖ నగరాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. విశాఖపట్నం నుంచి ముంబయి ఎక్స్‌ప్రెస్ వేపై కేంద్ర రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడినట్లు చంద్రబాబు వెల్లడించారు. తీర ప్రాంత అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. చెన్నై నుంచి బెంగళూరుకు కృష్ణపట్నం పోర్ట్ మీదుగా జైకా పని చేస్తుందని... అలాగే విశాఖ నుంచి చెన్నై పారిశ్రామిక కారిడార్‌పై ఏడీబీ పని చేస్తోందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశామని... అలాగే త్వరలో గోదావరి, పెన్నా నదులను కూడా అనుసంధానం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. చంద్రబాబు సమక్షంలో పలు కీలక ఒప్పందాలపై యూఎస్ అధికారులు, ఏపీ అధికారులు సంతకాలు చేశారు. -
సీమకు అన్యాయం చేస్తే సహించం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం సాధన కోసం విద్యార్థి సంఘాలు గర్జించాయి. సీమకు అన్యాయం చేస్తే సహించమంటూ నినాదాలు చేశాయి. రాయలసీమ రాష్ట్ర సాధనే ధ్యేయమని ప్రకటించాయి. సీమపై పాలకులు చూపుతున్న వివక్షపై దండెత్తాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోస్తా జపం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి పరిషత్, ఇంజినీరింగ్ స్టూడెంట్ ఫెడరేషన్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు మూడు వేల మంది విద్యార్థులు హాజరై సీమ సమస్యలపై గళమెత్తారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు వీవీనాయుడు అధ్యక్షతన మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో నిర్వహించిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నక్కలమిట్ల శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 20 స్మార్ట్ సిటీలను ప్రకటించగా వెనుకబడిన రాయలసీమలో ఒక్కటి లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర విభజనతో రాళ్ల సీమగా మారిన రాయలసీకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలుకు రావాల్సిన రాజాధాని అమరావతికి తరలించారని, హైకోర్టును అక్కడే స్థాపించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీంతో సీమకు రావాల్సిన పరిశ్రమలు కోస్తాకు తరలిపోతున్నాయని, అక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుతుందన్నారు. అంతకుముందు రాజవిహార్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు 3000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణారావు, బాలసుందరం, అరుణ్‌శర్మ, రవికుమార్, నాగేశ్వరరెడ్డి, సుహాన్బాష, రాజునాయుడు, శివకుమార్, క్రాంతికుమార్, రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
పేదలకు రూ. 5లక్షల లోపే ఇళ్లు!
కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ♦ దేశంలో రూ. 10 లక్షల కన్నా ఎక్కువకు ఇల్లు కొనుక్కునేవారు ఒక్కశాతమే ♦ రూ. 5 లక్షలలోపు అందిస్తే 30 శాతం మందికి ఇళ్లు న్యూఢిల్లీ: పేదలకు తక్కువ ధరలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఉపరితల రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. రూ.5 లక్షల కంటే తక్కువ ధరకే ఇళ్లను అందిస్తామని చెప్పారు. ‘తక్కువ ధరకు ఇళ్లు నిర్మించడం చాలా ముఖ్యమైన అంశం. మనదేశంలో రూ.10 లక్షల కన్నా ఎక్కువ వెచ్చించి ఇల్లు కొనుక్కునేవారు కేవలం ఒక్క శాతమే ఉన్నారు. రూ.5 లక్షల లోపు ఇళ్లను అందించగలిగితే దాదాపు 30 శాతం మంది వాటిని కొనుక్కోగలుగుతారు’ అని ఆయన చెప్పారు. బుధవారమిక్కడ ‘స్మార్ట్ సిటీ’పై అసోచామ్ నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడారు. స్మార్ట్‌సిటీల నిర్మాణంతోపాటు పేదలకు తక్కువ ధరలో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కేంద్రం అధికార ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నాగ్‌పూర్‌లో ప్రయోగ ప్రాతిపదికన ఇలాంటి వెంచర్ ఒకటి చేపట్టినట్టు వివరించారు. నిర్మాణానికి ఒక చదరపు అడుగుకు రూ.వెయ్యి వెచ్చించినట్టు వివరించారు. ఈ లెక్కన 450 చదరపు అడుగుల ఇంటిని రూ.5 లక్షలలోపే నిర్మించవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 20న ఈ ఇళ్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. -
తిరుపతి.. లేదు పరపతి
టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎదు గోడు వెళ్లబోసుకున్న తమ్ముళ్ల సమస్య ఇన్చార్జ్ మంత్రి నారాయణ దృష్టిక ఢిల్లీ నుంచి సీఎం వచ్చా మాట్లాడదామంటూ ఆయన దాటవేత‘అధికారులు మా మాట వినడంలేదు. చిన్నపని చెప్పినా చేయడంలేదు. ఇలాగే ఉంటే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా పనిచేసేది’ అంటూ తిరుపతి నగరంలోని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వెళ్లగక్కారు. అధికారుల తీరు మార్చాల్సిందేనంటూ సోమవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంట్లో ప్రత్యేకంగా సమావేశమై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన విషయాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. సీఎం ఢిల్లీలో ఉన్నారని.. ఆయన వచ్చాక మాట్లాడదామంటూ మంత్రి మాట దాట వేసినట్లు తెలిసింది. తిరుపతి: తిరుమల కొండపైన గదుల వేలం విషయమై టీటీడీ ఈవో తమను లెక్క చేయలేదంటూ పలువురు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. చర్చల కోసం వెళ్లిన తమను లోపలి నుంచి బయటకు వెళ్లమని అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేకు కూడా తగిన గౌరవం లభించలేదని సమావేశంలో పలువురు నేతలు వాపోయినట్లు తెలిసింది. నగరపాలక సంస్థలో రూ.5 లక్షల లోపు పనులను నామినేషన్‌పైన కేటాయించడంలేదంటూ కార్యకర్తలు పేర్కొన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. జన్మభూమి కమిటీలను పటిష్టంచేసి కార్యకర్తలకు పనులు అప్పగించకపోతే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని వాపోయినట్లు తెలిసింది. క్లబ్బులపై పోలీసుల దాడిని సైతం టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలిసింది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే బార్ల నిర్వహణ జరుగుతున్నా ఇబ్బడిముబ్బడిగా దాడులు చేయడం ఏమిటని కొందరు నేతలు వాపోయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైతం తీవ్ర మనస్తాపం చెందినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన భర్త ఈ పదవిని కానుకగా ఇచ్చినట్టుందని,నా మాట ఎవ్వరూ వినడం లేదని మంత్రి బొజ్జల, నారాయణతో పాటు పార్టీ అధ్యక్షుని ఎదుట వాపోయినట్లు దేశం వర్గాల్లో చర్చ సాగుతోంది. ముక్కు సూటిగా వ్యవహరించడమే తప్పా? తిరుమల కొండపై గదుల వేలం విషయంలో టీటీడీ ఈవో ముక్కుసూటిగా వ్యవహరించినట్టు సమాచారం. బాధితులెవ్వరికీ అన్యాయం జరగనివ్వననని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. అయితే రాజకీయ నాయకుల ప్రయేయం లేకుండా బాధితులు ఎవరైనా ఉంటే తనను నేరుగా కలవాలంటూ.. ఈవో చెప్పిన విషయాన్ని అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నట్లు సమాచారం. ఏడు ఏళ్లుగా గదులు ఖాళీగా ఉన్నాయని, వేలం వేయకపోతే ఎలా అని ఈవో తమను కలిసిన నేతలను సైతం ప్రశ్నించినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉండి ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే విషయం తన దృష్టికి తేవాలని.. వెంటనే విచారించి వారికి న్యాయం చేస్తామని తెలిపినట్లు సమాచారం. రాజకీయ జోక్యాన్ని టీటీడీ ఈవో అంగీకరించక పోవడంపై నగరంలోని నేతలు కలత చెందినట్లు తెలిసింది. నగరపాలక కమిషనర్ సైతం రాత్రింబవళ్లు కష్టపడుతూ, స్మార్ట్ సిటీ పోటీకి అన్నీ సిద్ధం చేసుకుంటూనే, ఓ వైపు తుడా పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారు. ఆయన నిబంధనల మేరకు నిక్కచ్చిగా వ్యవహారించడం పార్టీ నేతలకు మింగుడు పడనట్లు చర్చసాగుతోంది. అసాంఘిక కర్యకలాపాలపై ఎస్పీ దృష్టి సారించడాన్ని సైతం అధికార పార్టీనేతలకు ఇబ్బందికరంగా మారినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
‘స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయ వివక్ష లేదు’
న్యూఢిల్లీ : దేశంలో తొలి 20 స్మార్ట్ సిటీల ఎంపికలో ఎలాంటి రాజకీయ వివక్షా లేదని కేంద్రం స్పష్టం చేసింది. స్మార్ట్ సిటీల ఎంపిక ప్రక్రియలో బిహార్ పట్ల వివక్ష ప్రదర్శించారని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఇటీవల ప్రకటించిన జాబితా కేవలం తొలి దశకు సంబంధించినవేనని గురువారం ఇక్కడ ఇండియా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌కు హాజరైన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య తెలిపారు. కొంతమంది ఇతర నగరాలను తొలగించినట్లు భావిస్తున్నారని అది నిజం కాదన్నారు. -
స్మార్ట్ సిటీలకు 10 లక్షల కోట్లు అవసరం: నివేదిక
ముంబై: కేంద్రం చేపట్టిన 100 స్మార్ట్ సిటీల నిర్మాణానికి వచ్చే ఐదేళ్లలో 150 బిలియన్ డాలర్లు (రూ.10లక్షల కోట్లు) అవసరమవుతాయని ఓ నివేదిక తెలిపింది. ఇందుకోసం ప్రైవేటు రంగం ప్రధాన భాగస్వామిగా మారాల్సిందేనంది. డెలాయిట్ సంస్థ విశ్లేషణ ప్రకారం 120 బిలియన్ డాలర్లు ప్రైవేటు రంగం నుంచి రానున్నట్లు అంచనా. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులోభాగంగా నగరమంతా వై-ఫై సర్వీసులు అందించేందుకు సర్వీసు ప్రొవైడర్లు, కంటెంట్ ప్రొవైడర్లదే కీలక పాత్ర అని నివేదిక పేర్కొంది. అయితే 50 స్మార్ట్ సిటీల్లో వై-ఫై సేవలందించేందుకు రిలయన్స్ జియో ముందుకు రాగా, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలు సంయుక్తంగా సేవలందించాలని భావిస్తున్నాయి. కాగా.. 100 స్మార్ట్‌సిటీలు, 500 అమృత్ నగరాలకోసం కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా 7.513 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.50 వేల కోట్లు) ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. -
పాయింట్ తేడాతో వరంగల్ మిస్
* ఏప్రిల్ 15 వరకు సవరించిన ప్రతిపాదనలిస్తే పరిశీలిస్తాం: వెంకయ్య * రూ. 50,802 కోట్లతో ఐదేళ్లలో స్మార్ట్ సిటీలు రెడీ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘స్మార్ట్ సిటీ’లకు మరో అడుగు పడింది. తొలివిడతలో స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దనున్న 20 నగరాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం విడుదల చేశారు. ఈ జాబితాలో.. ఏపీ నుంచి విశాఖ, కాకినాడ నగరాలకు స్థానం దక్కింది. తెలంగాణాలోని నగరాలకు అవకాశం దక్కలేదు. ఒక్క పాయింట్ తేడాతో వరంగల్ టాప్-20 జాబితాలో స్థానం కోల్పోయింది. ‘ప్రతి రాష్ట్రం, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఒక్కో నగరానికి తొలి జాబితాలో స్థానం కల్పించాలనేది మా ఉద్దేశం. ఈ జాబితాలో అవకాశం దక్కని రాష్ట్రాలకు ఫాస్ట్ ట్రాక్ పోటీలో పాల్గొనడానికి మరొక అవకాశం ఇస్తాం. ఆయా రాష్ట్రాలు టాప్ ర్యాంకింగ్ నగరాల స్మార్ట్ సిటీ ప్రతిపాదనలను ఆధునీకరించి ఏప్రిల్ 15 లోగా పంపిస్తే ఈ మిషన్‌లో చేరుస్తాం’ అని వెంకయ్యనాయుడు తెలిపారు. తొలిజాబితాలోని 20 నగరాలను రూ. 50,802 కోట్లతో ఐదేళ్ల లోపు స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దుతామన్నారు. స్మార్ట్ సిటీల తొలి జాబితాలో విశాఖకు 8వ స్థానం, కాకినాడకు 14వ స్థానం దక్కింది. స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చాలని వివిధ రాష్ట్రాలనుంచి 97 ప్రతిపాదనలు అందాయన్న కేంద్ర మంత్రి ఈ జాబితా ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగిందని వెల్లడించారు. నగరాల్లో సమీకృత పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, సరైన రవాణా వ్యవస్ధ, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక సదుపాయాలు, చెత్త నిర్వహణ, స్వచ్ఛమైన నీరు, అందరకీ ఇళ్లు, పరిపాలనా సౌలభ్యంపైనే దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. ఈ పోటీయుత వాతావరణంలో గెలిచి.. టాప్-20లో స్థానం సంపాదించిన నగరాలకు ప్రధాని మోదీ, వెంకయ్య శుభాకాంక్షలు తెలిపారు. సివిల్ సర్వీస్ పరీక్షలకున్నంత పోటీ ఈ తొలి జాబి తాలో చోటు దక్కించుకునేందుకు నగరాలు, రాష్ట్రాల మధ్య కనిపించిందని.. మోదీ అన్నారు. రెండో విడతలో 54 నగరాల ఎంపిక కోసం ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి పోటీ మొదలవుతుందని వెంకయ్య తెలిపారు. ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసితోపాటు ఉత్తరప్రదేశ్‌నుంచి ఒక్క నగరానికి కూడా తొలి జాబితాలో చోటు దక్కలేదు. అయితే డెహ్రాడూన్‌ను ఈ జాబితాలో చేర్చకపోవటం కేంద్రం వివక్షకు అద్దం పడుతుందని కాంగ్రెస్ విమర్శించింది. కాగా, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఈ పథకం కోసం ప్రతిపాదనలు పంపకపోవటాన్ని ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆక్షేపించారు. ఎంపిక విధానం రాష్ట్రాలు పంపిన స్మార్ట్ సిటీల ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం.. వివిధ ప్రామాణికాల ఆధారంగా తొలిజాబితాను రూపొందించారు. వ్యయ సాధ్యతతో కూడిన అమలు విధానానికి 30 శాతం, ఫలితాల లక్ష్యానికి 20 శాతం, ప్రజల భాగస్వామ్యానికి 16 శాతం, వినూత్నమైన ప్రతిపాదనలకు 10 శాతం, వ్యూహాత్మక ప్రణాళికకు 10 శాతం, విజన్, లక్ష్యాలకు 5 శాతం, సాక్షాధాన ప్రొఫైలింగ్, కీలక పనితీరు సూచికలకు 5 శాతం, అనుసరించిన విధానాలకు 4 శాతం మార్కులు వేశారు. రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలతోపాటు.. కేంద్రం, విదేశీ ప్రతినిధులు వచ్చి ఆయా నగరాలను పరిశీలించి నివేదికలు సమర్పించారు. వీటి ఆధారంగానే తొలిజాబితా రూపొందింది. తొలి జాబితాలోని స్మార్ట్ సిటీలు భువనేశ్వర్ (ఒడిశా), పుణే, షోలాపూర్ (మహారాష్ట్ర), జైపూర్, ఉదయపూర్ (రాజస్తాన్), అహ్మదాబాద్, సూరత్ (గుజరాత్), కొచ్చి( కేరళ), జబల్పూర్, ఇండోర్, భోపాల్ (మధ్యప్రదేశ్), విశాఖపట్నం, కాకినాడ (ఏపీ), దావణగెరే, బెల్గావి (కర్ణాటక), న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, కోయంబత్తూర్, చెన్నై (తమిళనాడు), గువాహటి (అసోం), లూథియానా (పంజాబ్) -
రెండు స్మార్ట్‌సిటీలు మన అదృష్టం
మంత్రి నారాయణ విజయవాడ బ్యూరో: ఐదేళ్లలో అభివృద్ధి చేసేలా దేశంలో 92 స్మార్ట్ సిటీలు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీలో మూడు నగరాలకే అవకాశం ఇచ్చిందని అప్పట్లో బాధపడ్డానని, ఇప్పుడు తొలి దశలోని 20 స్మార్ట్ సిటీల్లో ఏపీకి రెండు ఇవ్వడం ఆనందంగా ఉందని మంత్రి నారాయణ చెప్పారు. విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో మూడు స్మార్ట్ సిటీలను ఎంపికచేయగా తొలిదశలో తిరుపతిని మినహాయించి విశాఖ, కాకినాడలను అభివృద్ధి చేయనున్నట్టు గురువారం కేంద్రంప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని అన్నారు. విశాఖలో 1,620 ఎకరాల్లో విస్తరించిన రుషికొండ, ఆర్కే బీచ్, కైలాసగిరి ప్రాంతాల్లో రూ.1,602 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కాకినాడలో 1,375 ఎకరాల్లో విస్తరించిన గాంధీనగర్, రామారావుపేట, రామకృష్ణారావుపేట, సూర్యారావుపేట, ఎల్వీన్పేట, మెయిన్‌రోడ్డు, బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్, పోర్టు, కచేరినగర్, ఏటిమొగ, వెంకటేశ్వరకాలనీలను రూ.1,993 కోట్లతో అభివృద్ధి చేస్తారన్నారు. వీటి అభివృద్ధికి కేంద్రం రూ.500, రాష్ట్రం రూ.500కోట్లు కేటాయిస్తుందని, మిగిలిన మొత్తాన్ని ప్రైయివేటు, పబ్లిక్ పార్టనర్షిప్(పీపీపీ) పద్దతిలో సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన రెండు స్మార్ట్ సిటీలతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలను స్మార్ట్ సిటీలుగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. మూడు నెలల్లో వాటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించాలని సీఎం చెప్పారన్నారు. -
సమష్టి కృషితో నగరం అభివృద్ధి : కలెక్టర్
కాకినాడ కలెక్టరేట్ : స్మార్ట్ సిటీగా ఎంపికైన కాకినాడను సమష్టి కృషితో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరాభివృద్ధికి అన్ని రంగాల అవసరాలను నివేదికలో పొందుపరచడం వల్లే కాకినాడకు జాబితాలో చోటు దక్కిందన్నారు. మంచినీరు, మురుగు వ్యవస్థతో పాటు మౌలిక, పౌర సదుపాయాల మెరుగుదల, సోలార్ విద్యుత్ వినియోగం, రైల్వే అభివృద్ధి, ఈఎస్ఐ ఆస్పత్రులు, విద్య, వైద్య రంగాలను కూడా నివేదికలో ప్రస్తావించినట్లు వివరించారు. తొలి జాబితాలో స్థానం దక్కడానికి పట్టణ పౌరులు, అనుభవజ్ఞులు, సోషల్ మీడియా ద్వారా అభిప్రాయ సేకరణ కూడా ఎంతో ఉపకరించినట్టు చెప్పారు. ఈ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ అలీం బాషాల కృషి అభినందనీయమన్నారు. -
జీవీఎంసీ బడ్జెట్.. సైజ్ భారీ!
2016-17 బడ్జెట్ రూ.2500-రూ.3000 కోట్లమధ్య ఉండే అవకాశం కనీసం 20 శాతం వృద్ధి అంచనాతో అధికారుల కసరత్తు కేంద్ర పథకాలు, పన్ను ఆదాయం పెరుగుతుందని అంచనా తుదిరూపు ఇచ్చేందుకు నేడు కీ లక భేటీ ఎన్నికల దృష్ట్యా టీడీపీకి మేలు చేకూర్చేలా కేటాయింపులు? విశాఖపట్నం : స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) వార్షిక బడ్జెట్‌ను కూడా అదేస్థాయిలో రూపొందించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ కోణం కూడా అంతర్లీనంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి రాష్ట్రానికి అనధికార రాజధానిగా ఉన్న విశాఖలో పాగా వేయాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఈ ఏడాదిలోనే జీవీఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతోంది. ఈ లోగా భారీ బడ్జెట్ కేటాయింపులతో ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకు అనుగణంగానే 20 శాతం పెంపుదలతో సుమారు రూ.2700 కోట్లతో అంచనా బడ్జెట్ ప్రవేశపెట్టాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు జీవీఎంసీలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం కీలక భేటీ జరగనుంది. 20 శాతం వృద్ధి అంచనా ఆదాయం వృద్ధి రేటు 20 శాతం ఉందని చెబుతున్న అధికారులు ఆ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సరానికి జీవీఎంసీ బడ్జెట్‌ను పెంచాలని దాదాపు నిర్ణయించారు. 2014-15లో రూ. 1701 కోట్లుగా ఉన్న నగరపాలక సంస్థ ఆదాయం 2015-16లో రూ.2194 కోట్లకు పెరిగింది. 2016-17లో ఈ మొత్తం రూ.2700 కోట్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం వృద్ధి రేటు కనీసం 20 శాతం(రూ.600 కోట్ల మేరకు) పెరగవచ్చని అంటున్నారు. కాగా గత ఏడాది రూ.200 కోట్ల మిగులు బడ్జెట్ ఆమోదించగా.. ఈ ఏడాది కనీసం రూ.300 కోట్ల మిగులు ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కలకు కేంద్ర పథకాల ద్వారా అందే నిధులు ఊతమిస్తున్నాయి. స్మార్ట్ సిటీ కింద కేంద్రం నుంచి తొలి ఏడాది రూ.100 కోట్లు వస్తాయని, అలాగే అమృత్ పథకం కింద రూ.139 కోట్లు, స్వచ్ఛ భారత్‌కు రూ.140 కోట్లు, ఐఎఫ్ఆర్కు రూ.90 కోట్లు, విపత్తుల నిర్వహణ కింద మరో రూ.100 కోట్లు అందుతాయని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. ఇతర ఆదాయాల్లోనూ వృద్ధి కొత్త పన్నుల అసెస్మెంట్, నాన్అసెస్మెంట్, అనధికార నిర్మాణాలు, నీటి పన్ను, అడ్వర్టైజ్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కల్యాణ మండపాలు, లీజు రెన్యువల్స్, ట్రేడ్ లెసైన్సుల ద్వారా గత ఏడాది కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంటింటి సర్వే ద్వారా అండర్ అసెస్మెంట్, నాన్అసెస్మెంట్ భవనాలు, నిర్మాణాలను గుర్తించి పన్నులు విధించడం ద్వారా అదనపు ఆదాయం సమకూరినట్టుగా చెబుతున్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ , ప్రభుత్వ స్థలాలల్లోని కట్టడాల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీవో 296 ద్వారా భారీగా ఆదాయం ఆర్జించవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే శాఖలవారీగా అందిన అంచనాలకు తుదిమెరుగులు దిద్దేందుకు జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం కీలక సమావేశం జరుగనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శాఖల వారీగా ఆదాయ అంచనాలపై ఈ సమావేశంలో చర్చించి బడ్జెట్ అంచనాలు ఖరారు చేస్తారు. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పనలో జాప్యం జరిగినట్టుగా చెబతున్నారు. సాధారణంగా నవంబర్ 10లోగా స్టాండింగ్ కమిటీకి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది. డిసెంబర్ 10 నాటికి జీవీఎంసీ ఆమోదం పొందిన తర్వాత కౌన్సిల్ లేదా స్పెషల్ ఆఫీసర్ ఆమోదంతో ప్రభుత్వానికి ఫిబ్రవరి 25 కల్లా సమర్పించాలి. మార్చి 1లోగా రాష్ర్ట ప్రభుత్వంతో ఆమోదింపజేయాలి. ఇలా అయితేనే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు అందుతాయి. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు రూ.2500 కోట్ల నుంచి రూ.3వేల కోట్ల మధ్య ఉంటాయని, మంగళవారంనాటి భేటీలో తుదిరూపునిచ్చి ప్రభుత్వామోదానికి పంపిస్తామని జీవీఎంసీ ఏడీసీ(ఫైనాన్స్) వర్మ ‘సాక్షి’కి తెలిపారు. -
సెలెక్ట్ స్మార్ట్
స్మార్ట్ సిటీ..విశ్వనగరం...లివబుల్ సిటీ ఇప్పుడు ప్రభుత్వ పెద్దలతోపాటు అందరి నోటా ఇదే మంత్రం. డల్లాస్, న్యూయార్క్.. వంటి విశ్వ నగరాల సరసన భాగ్యనగరిని నిలపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆశయం నెరవేరాలంటే త్వరలో గ్రేటర్ పాలకమండలికి ఎన్నికవనున్న కార్పొరేటర్లు ‘హైటెక్ గురూ’ల అవతారం ఎత్తాల్సిందే అంటున్నారు సిటీజనులు. వాట్సప్.. ఫేస్బుక్.. ట్విట్టర్ వంటి సోషల్ మీడియాను, ఆన్లైన్, ఇంటర్నెట్ మాధ్యమాలను వినియోగించుకొని స్థానిక సమస్యలను గుర్తించడం మొదలు... అది పరిష్కారం అయ్యే వరకు స్మార్ట్‌గా పనిచేసే నవతరం కార్పొరేటర్లు సిటీకి అవసరం అంటున్నాయి మెజార్టీ వర్గాలు. - సాక్షి, సిటీబ్యూరో * హై‘టెక్’ కార్పొరేటర్లతోనే విశ్వనగరానికి బాటలు.. * విద్యావంతులైన అభ్యర్థులకే ప్రాధాన్యం * ఆ దిశగా పార్టీలూ ఆలోచించాలి: మేధావి వర్గాలు నాలుగు వందల ఏళ్ల చారిత్రక హైదరాబాద్ సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే మహానగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులు కూడా పరిపాలనలో కొత్త ఒరవడిని సష్టించే దిశగా..పౌరులకు సత్వర సేవలందించేందుకు సాంకేతికంగా పట్టు సాధించాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రస్తుతం మారుతున్న కాలమాన పరిస్థితుల్లో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వినియోగం తప్పనిసరి. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకునేందుకు ఇంటర్నెట్ మాధ్యమం ఇప్పుడు కీలకంగా మారింది. ఈనేపథ్యంలో కంప్యూటర్, పీసీ, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వినియోగించుకోవడంతోపాటు, కనీస విద్యార్హతలుండి ప్రజలకు అవసరమైన దరఖాస్తులు, వారికి అవసరమైన సమాచారం చేరవేసే సామర్థ్యాలున్న వారికి టిక్కెట్లిస్తే మేలన్న వాదన వినిపిస్తోంది. గతమంతా అంతంతే.. బల్దియా ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్లకు కనీస విద్యార్హతలుండాలన్న నిబంధన తెరమీదకు వస్తోంది. గత బల్దియా పాలకమండలిని(2009) పరిశీలిస్తే మొత్తం 150 మంది కార్పొరేటర్లలో పీజీ వంటి ఉన్నత విద్య చదివినవారు కేవలం ముగ్గురే ఉన్నారు. ఈసారైన ఆయా పార్టీల నేతలు ఆలోచించి ఉన్నత విద్య, ఉరిమే ఉత్సాహం, సేవాతత్పరత కలిగిన యువతీ యువకులకు సీట్లు కేటాయించాలని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని పౌరులకు జాప్యం లేకుండా స్మార్ట్‌సేవలు అందించాల్సిన పాలకమండలి సభ్యులకు కనీస విద్యార్హతలుండాలన్న వాదనలు జోరందుకున్నాయి. డివిజన్ స్థాయిలో స్థానికంగా నివాసం ఉండి త్వరితగతిన ప్రజలకు సేవచేసేవారికే ప్రధాన రాజకీయ పక్షాలు ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం కల్పించాలని సర్వత్రా కోరుతున్నారు. చదువులో రంగ హరి... 2009లో మహానగరపాలక సంస్థలో 150 మంది కార్పొరేటర్లు ప్రజల నుంచి ప్రత్యక్షంగా ఎన్నికయ్యారు. వీరిలో నిరక్షరాస్యులు ఒక్కరు, పదోతరగతి లోపు చదివినవారు 18 మంది ఉన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైనవారు 41 మంది, ఇంటర్మీడియట్ తత్సమాన విద్యనభ్యసించినవారు 30 మంది, డిగ్రీ పూర్తిచేసిన వారు 57 మంది ఉన్నారు. ఇక పీజీ పూర్తిచేసినవారు కేవలం ముగ్గురు మాత్రమే ఉండడం విశే షం. కాగా ఇందులో బీటెక్ పూర్తిచేసినవారు ఒక్కరు,న్యాయశాస్త్రం చదివినవారు 6 గురు,ఎంబీఏ చేసినవారు ఒక్కరు,పాలిటెక్నిక్ డిప్లమో పూర్తిచేసినవారు ఒక్కరు,బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తిచేసినవారు ఒక్కరు, బీఎంఎస్ చేసినవారు ఒక్కరు కాగా..ఐటీఐ చదివినవారు ఒక్కరుండడం గమనార్హం. ఈసారైనా విద్యావంతుల సంఖ్య పెరిగేనా..? ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బల్దియా ఎన్నికల్లో ఈసారైనా నేరచరిత్ర లేని, ఉన్నత విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తటస్థులకు టిక్కెట్లివ్వాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీలు బల్దియా బరిలో నిలిచే అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తును త్వరలో పూర్తిచేయనున్నాయి. నేడోరేపో అభ్యర్థులను ఖరారు చేయనున్నాయి. కానీ ఈసారి కూడా ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో యధావిధిగా అంగబలం, అర్థబలం, కులం, మతం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటాయా..లేక అభ్యర్థుల గుణగణాలు, విద్యార్హతలు,సేవాదక్పథం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటాయా అన్నది ప్రశ్న. పట్టభద్రులకు టికెట్లివ్వాలి బల్దియా ఎన్నికల్లో డిగ్రీ విద్యార్హతలున్న వారు, నేరచరిత్ర లేనివారికి టిక్కెట్లు ఇవ్వాలని మా సుపరిపాలన వేదిక తరఫున అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశాం. ఇంటర్మీడియెట్ విద్యార్హత ఉంటేనే బల్దియా బడ్జెట్, నగరపాలక సంస్థ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన ఉంటుంది. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో స్థానికసంస్థలకు పోటీచేస్తున్న అభ్యర్థులకు పదోతరగతి విద్యార్హత ఉండాలన్న నిబంధనను గతంలో సుప్రీంకోర్టు కూడా సమ ర్థించింది. స్వాతంత్రం సిద్ధించి 65 ఏళ్లయిన నేపథ్యంలో నగరంలో నిరక్షరాస్యులకు టికెట్లు కేటాయించడం అవివేకమే అవుతుంది. - పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి విద్య, సామాజిక స్పృహ అవసరం ఎప్పటి నుంచో హైదరాబాద్‌ని అభివద్ధి చెందుతున్న నగరంగా అనుకుంటున్నాం. అయితే నగరం బహుముఖ అభివృద్ధి సాధించాలంటే.. రాబోయే పాలకులు ఉన్నత విద్యావంతులై, సామాజిక స్పహ ఉంటే బాగుంటుంది. మారుతున్న అవసరాలు, కొత్త కొత్త మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఎన్నికయ్యే కార్పొరేటర్లు కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఉత్తమం. ప్రపంచంతో నగరం పోటీ పడాలంటే ఎలక్ట్రానిక్ (ఈ) వ్యవస్థపై వారికి అవగాహన అవసరం. - బి.సంజీవరావు, ఉపాధ్యాయుడు ఉన్నత చదువు అదనపు అర్హత... ఉన్నత చదువు ఉన్నంత మాత్రాన ఉత్తమ పాలకులుగా మారుతారన్న నియమం ఏమీ లేదు. నామమాత్రంగా చదువుకున్న వారు కూడా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. కాకపోతే ఇతర మెట్రో నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలంటే కార్పొరేటర్లు డిగ్రీ చేసి ఉంటే కొంత అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సులువుగా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. ఉన్నత చదువును ప్రజా సేవ కార్యక్రమాల్లో మిళితం చేస్తే.. కార్పొరేటర్లకు ఎదురే ఉండదు. - డా. జీబీ రెడ్డి, యూఎఫ్‌ఆర్‌ఓ జేడీ, ఓయూ నిస్వార్థ నాయకులే కావాలి కార్పొరేటర్లుగా ఎన్నికయ్యే వారు నిస్వార్థ నాయకులై ఉండాలి. కబ్జాకోర్లు, నేరచరిత్రులకు టికెట్లు ఇవ్వకూడదు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవాభావం ఉన్నవారికే నా ఓటు. నగరాభివద్ధికి నిస్వార్థ నేతలే పాటుపడతారన్నది నా న మ్మకం. ఇక చదువుకు అన్ని పార్టీలు ప్రాముఖ్యత ఇవ్వాలి. విద్యావంతులు ఎన్నికైతే ప్రజల సమస్యలు త్వరితగతిన అర్ధం చేసుకోగలుగుతారు. అందుకనుగుణంగా ఉత్తమ సేవలు అందే అవకాశం ఉంటుంది. - సుమశ్రీ, సాఫ్ట్వేర్ ఇంజినీర్ -
క‘న్నీటి’ కుళాయి!
పబ్లిక్ కుళాయిలకు త్వరలో మంగళం వ్యక్తిగత కుళాయి కనెక్షన్ తప్పనిసరి సామాన్యులకు పెను భారం {పజల నెత్తిన రూ.30 కోట్ల భారం {పతి నెలా పన్నుపోటు స్మార్ట్ మంత్రం సంక్షేమాన్ని మాయం చేస్తోంది. ప్రజోపయోగ సేవలకు మంగళం పాడేస్తోంది. విశాఖ మహానగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేస్తామని చెబుతున్న పాలకులు.. అభివృద్ధి మాటేమోగానీ.. ఉన్న సౌకర్యాలను ఊడగొడుతూ సామాన్యుల జీవితాలను దుర్భరం చేస్తున్నారు. వ్యక్తిగత కుళాయిలను తప్పనిసరి చేయాలన్న జీవీఎంసీ ్డనిర్ణయం అటువంటిదే. దీనివల్ల నగరంలోని లక్షలాది కుటుంబాలు తాగునీరు గగనమవుతుంది. సాక్షి, విశాఖపట్నం : వ్యక్తిగత కుళాయిల పేరుతోసామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపేందుకు జీవీఎంసీ(మహావిశాఖ నగరపాలక సంస్థ) రంగం సిద్ధం చేస్తోంది. ఫలితంగా ఇప్పటివరకు ట్యాంకర్లు, పబ్లిక్ కుళాయిలపై ఆధారపడుతున్న సామాన్య ప్రజలు గొంతు తడుపుకోవడానికి కాసులు వెచ్చించక తప్పదు. విలీన మున్సిపాల్టీలు, పంచాయతీలు కలుపుకొని జీవీఎంసీ పరిధిలో 22 లక్షల జనాభా ఉంది. జనాభా లెక్కల ప్రకారం ఐదున్నర లక్షల కుటుంబాలు ఉండగా.. ఆస్తి పన్ను రికార్డుల ప్రకారం 4.22 లక్షల ఇళ్లు ఉన్నాయి. వీటిలో 1.60 లక్షల ఇళ్లకు మాత్రమే వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. 4వేల అపార్ట్మెంట్లకు సెమీ బల్క్ కనెక్షన్లు ఉన్నాయి. నగర పరిధిలో 7,500 పబ్లిక్ కుళాయిలు ఉన్నాయి. వీటిపై ఆధారపడుతున్న కుటుంబాలు 2.50 లక్షల వరకు ఉంటాయని అంచనా. వ్యక్తిగత కనెక్షన్లు తప్పనిసరి చేస్తే వీరంతా కుళాయిలు వేయించుకోవాల్సిందే. సామాన్యులకు ఆర్థిక భారం కుళాయి కనెక్షన్ వేయించుకోవాలంటే ఇన్స్టలేషన్ చార్జీల కింద బీపీఎల్ కుటుంబాలకు రూ. 1200, ఏపీఎల్ కుటుంబాలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. మెటీరియల్ ఖర్చులను పూర్తిగా ఎవరికి వారే భరించాలి. ప్రధాన పైపులైన్‌కు ఇంటికి మధ్య ఉన్న దూరాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు మెటీరియల్ ఖర్చు వస్తుంది. పబ్లిక్ కుళాయి వినియోగించుకుంటున్న కుటుంబాలు లక్షకుపైగా ఉంటే..వారిలో సొంత ఇళ్లు ఉన్న వారు 70వేలకుపైగా ఉంటారని అంచనా. ఇక వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు కలిగిన వారిని మినహాయిస్తే ఆస్తిపన్ను అసెస్మెంట్ ప్రకారం మరో 2 లక్షల ఇళ్ల యజమానులు వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు వేయించుకోవల్సి ఉంటుందని లెక్కలేస్తున్నారు. వీరిలో లక్షన్నరకు పైగా బీపీఎల్ పరిధిలోనే ఉంటారని చెబుతున్నారు. ఈ లెక్కన సరాసరిన 2లక్షలకు పైగా బీపీఎల్ కుటుంబాలు విధిగా వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు వేయించుకోవల్సిన పరి స్థితి ఏర్పడింది. వీరు కనెక్షన్‌కు రూ.1200 చొప్పున చెల్లించడంతో పాటు మరో రూ.వెయ్యికి పైగా మెటీరియల్ చార్జి కింద భరించాలి. అంటే మొత్తం 2లక్షల బీపీఎల్ కుటుంబాలపై ఎంత తక్కువ లెక్కేసుకున్నా రూ.30 కోట్ల మేర భారం పడనుంది. అంతేకాకుండా ప్రతి నెలా రూ.60 చొప్పున కుళాయి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారం ఏటా కోటిన్నర పైమాటే. ఇక ఇన్స్టలేషన్, మెటిరీయల్ చార్జీలు కలిపి ఏపీఎల్ కుటుంబాలపై రూ.10 కోట్ల వరకు భారం పడనుండగా. వీరు ప్రతి నెలా రూ.120 చొప్పున పన్నుల రూపంలో రూ.2కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. శివార ప్రాంతాల పరిస్థితి దారుణం పబ్లిక్ కుళాయి కనెక్షన్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో విధిగా ప్రతి ఇంటికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్ వేయాలని జీవీఎంసీ భావిస్తోంది. ఇటీవల కేంద్రం మంజూరు చేసిన ‘అవృత్’ నిధులు రూ.130 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా జీవీఎంసీలో విలీనమైన శివారు గ్రామాల కు నేటికీనగర మంచినీటి పథకంతో కనెక్టవిటీ లేదు. వాటర్‌ట్యాంక్‌ల ద్వారానే ఆయా గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలైన గాజువాక, ఎండాడ, మధురవాడ, మారికవలస, బోయపాలెం, కొమ్మాది,పెందుర్తి, చినముషిడివాడ, అడవివరం, సింహాచలం దువ్వాడ, లంకెలపాలెం, దేవాడ, అప్పికొండ, అగనంపూడి, ఐటీ సెజ్, 58, 60, 69 వార్డులకు టౌన్ సప్లయి రిజర్వాయర్ నుంచి ట్యాంకర్ల ద్వారా రోజుకు 367 ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. 189 ఆటోల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జీవీఎంసీకి నీటిసరఫరా లారీలు 4 ఉండగా, మరో 50 ట్యాంకర్లను అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. ఈ గ్రామాలకు ఒకపూట నీరు రావడం కూడా కష్టంగా ఉంది. వేసవిలో అయితే వీరి పాట్లు వర్ణనాతీతం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఆయా గ్రామాలకు అవృత్ పథకం నిధులతో పూర్తి స్థాయిలో పైపులైన్లు వేయాలని నిర్ణయించారు. వ్యక్తిగత కుళాయిల ఏర్పాటు పూర్తి కాగానే పబ్లిక్ కుళాయిలను తొలగించాలని భావిస్తున్నారు. 2017 నాటికి నగరంలో ఎక్కడా పబ్లిక కుళాయినేది కన్పించని పరిస్థితి ఏర్పడనుంది. -
టెక్నాలజీ, స్మార్ట్‌సిటీలపై స్కాట్లాండ్ ఆసక్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలపై స్కాట్లాండ్ ఆసక్తి కనపర్చింది. ‘గ్లాస్గో’ స్మార్ట్ సిటీని నిర్మించిన అనుభవాన్ని దేశంలో అభివృద్ధి చేయనున్న స్మార్ట్‌సిటీలకు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్కాటిష్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ సెక్టర్ హెడ్ మార్క్ న్యూలాండ్స్ తెలిపారు. ముఖ్యంగా టెక్నాలజీ, ఎనలిటిక్స్, బిగ్‌డేటా, సెన్సర్స్లతో పాటు డిజిటల్ హెల్త్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో ఉన్న అవకాశాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడుల అవకాశాలపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు స్థానిక కంపెనీలతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్క్ మాట్లాడుతూ టీహబ్, ఐటీ, స్మార్ట్ సిటీలో పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. స్కాట్లాండ్లో విప్రో, టీసీఎస్, పిరమాళ్ వంటి పది ఇండియన్ కాంపెనీలుండగా, ఇక్కడ 11 కంపెనీలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇవి కాకుండా ఏటా 20 నుంచి 25 కంపెనీలు ఇండియాతో వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇండియా, స్కాట్లాండ్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ఏటా 20 శాతం వృద్ధితో ప్రస్తుతం 40 కోట్ల పౌండ్లను దాటిందన్నారు. వ్యాపార అవకాశాలను అందిపుచ్చకోవడానికి ఇండియాలో మూడు చోట్ల స్కాటిష్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
'హైదరాబాద్ స్థానంలో కరీంనగర్‌ను చేర్చాలి'
హైదరాబాద్: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం లేఖ రాశారు. కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో హైదరాబాద్ స్థానంలో కరీంనగర్‌ను చేర్చాలని లేఖలో కేసీఆర్ కోరారు. స్మార్ట్ సిటీ పథకం కింద హైదరాబాద్‌కు కేవలం 100 కోట్లను కెటాయించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని కేసీఆర్ పేర్కొన్నారు. అందువల్ల హైదరాబాద్ స్థానంలో కరీంనగర్‌ను ఈ జాబితాలో చేర్చి, హైదరాబాద్‌కు విడిగా నిధులు మంజూరు చేయాలని వెంకయ్యనాయుడుని కేసీఆర్ కోరారు. -
85 స్మార్ట్‌సిటీల ప్రతిపాదనలు సిద్ధం
తెలంగాణలో హైదరాబాద్ బదులు మరో నగరం న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల నిర్మాణం కోసం ప్రతిపాదిన 98 నగరాల్లో 85 మాత్రమే ఇంతవరకు నగరస్థాయి నివేదికలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు ప్రతిపాదలను పంపించాయి. ప్రతిపాదనలు పంపేందుకు చివరిరోజైన మంగళవారం 68 నగరాలు నివేదికలు అందించగా.. సోమవారం 17 సిటీలు ప్రపోజల్స్ పంపించాయి. వరదల కారణంగా తమిళనాడు ప్రతిపాదనలు పంపలేదు. కాగా, హైదరాబాద్ స్థానంలో మరో నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని తెలంగాణ సర్కారు కోరింది. ఆ నగరం పేరును త్వరలోనే వెల్లడిస్తామని కేంద్రానికి తెలిపింది. ప్రతిపాదనలు వచ్చిన వాటిలో 20 నగరాలను ఎంపికచేసి జనవరి మూడోవారం కల్లా ‘స్మార్ట్ సిటీ ప్రాజెక్టు’ పనులు ప్రారంభించేందుకు నిధులు ఇస్తారు. ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు రాష్ట్రాలకు మూడు వర్క్‌షాప్‌లు, ఓ స్మార్ట్‌సిటీ ఐడియా క్యాంపు, ఐదు రౌండ్ల వెబినార్లు, ప్రతిపాదనల అభివృద్ధికి మరో వర్క్‌షాప్ నిర్వహించింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో 20 దేశాలనుంచి 30 విదేశీ కంపెనీలు భాగస్వామ్యం కానున్నాయి. కాగా, దేశవ్యాప్తంగా 474 పట్టణాల్లో మౌలికవసతుల అభివృద్ధి కోసం రూపొం దించిన అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్)పథకానికి రూ.19వేల కోట్లు బడ్జెట్ కేటాయింపులకు రంగం సిద్ధమైంది. -
ఇక ‘స్మార్ట్’గా ప్రయాణం
- సిటీ బస్సుల్లో స్మార్టకార్డులు - ప్రయోగాత్మకంగా రెండు ప్రధాన రూట్లలో అమలు - ప్రయోగం విజయవంతమైతే అన్ని రూట్లలో విస్తరణ సాక్షి,సిటీబ్యూరో: జేబులో డబ్బులు లేవా. ఏటీఎం కార్డు కూడా వెంట తెచ్చుకోవడం మరిచిపోయి బస్సెక్కేశారా...మరేం ఫర్లేదు. స్మార్ట్‌కార్డు ఉంటే చాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా నిశ్చింతంగా పయనించవచ్చు. ఈ తరహా సదుపాయాన్ని త్వరలో నగరంలో ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. ఒకటి, రెండు ప్రధాన రూట్లలో ఈ ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించిన తరువాత ఫలితాలను బట్టి మిగతా రూట్లకు విస్తరిస్తారు. సిటీ బస్సుల్లో టిక్కెట్ లెస్, క్యాష్‌లెస్ ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు నెల రోజుల క్రితం ఆర్టీసీ స్మార్ట్‌కార్డుల కోసం ప్రణాళికలను రూపొందించిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై తాజాగా మరో అడుగు ముందుకు పడింది. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు ముందుకు వచ్చిన బాష్ కంపెనీ స్మార్ట్‌కార్డుల పనితీరు, వాటిని ఉపయోగించే విధానంపై ఇటీవల బస్‌భవన్‌లో ఆర్టీసీ అధికారులకు నమూనా ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. త్వరలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేపట్టారు. మొదట దిల్సుఖ్నగర్-పటాన్చెరు, సికింద్రాబాద్-కొండాపూర్, ఉప్పల్-హైటెక్‌సిటీ, సికింద్రాబాద్-శంషాబాద్ వంటి ఎక్కువ దూరం ఉన్న రూట్లలో రెండింటిని ఎంపిక చేసి మెట్రో లగ్జరీ, పుష్పక్ బస్సుల్లో ప్రవేశపెడతారు. ఆ తరువాత వాటి పనితీరు, ప్రయాణికులు స్మార్ట్‌కార్డులు వినియోగించే తీరును గమనంలోకి తీసుకొని ప్రాజెక్టు అమలుకు చర్యలు తీసుకుంటారు. ప్రీపెయిడ్ తరహాలో.... ప్రస్తుతం ముంబయిలో కేవలం బస్‌పాస్‌లకే పరిమితమైన స్మార్ట్‌కార్డులను హైదరాబాద్‌లో బస్‌పాస్‌లతో పాటు, రోజువారి టిక్కెట్లకు కూడా వర్తింప చేస్తారు. ఈ స్మార్ట్‌కార్డులు ప్రీపెయిడ్ తరహాలో ఉపయోగపడుతాయి. ప్రస్తుతం రైల్వేలో ఏటీవీఎంల ద్వారా ఇలాంటి ప్రీపెయిడ్ కార్డులను విక్రయిస్తున్నారు. ప్రయాణికులు తమ రోజువారి ప్రయాణాన్ని, అందుకయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకొని రూ.50,రూ.100 నుంచి రూ.500, రూ.1000 వరకు తమ అవసరాన్ని బట్టి స్మార్ట్‌కార్డులను కొనుగోలు చేయవచ్చు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీ, మాధాపూర్, గచ్చిబౌలీ, తదితర ప్రాంతాల్లోని ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ నిపుణులు, ఉద్యోగులకు స్మార్ట్‌కార్డులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే నగరానికి వచ్చే పర్యాటకులు, సందర్శకులకు ఈ స్మార్ట్‌కార్డులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక్కసారి కార్డు కొనుగోలు చేసి నగరమంతా పర్యటించేందుకు అవకాశం ఉంటుంది. టిమ్స్‌తో అనుసంధానం... రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే స్మార్ట్‌కార్డులలో మైక్రో చిప్‌లు ఏర్పాటు చేస్తారు. ఆ కార్డు విలువ అందులో నమోదై ఉంటుంది. కండక్టర్ల వద్ద ఉండే టిక్కెట్ ఇష్యూయింగ్ (టిమ్స్) మిషన్లకు స్మార్ట్‌కార్డులను కూడా స్వీకరించే మరో ఆప్షన్‌ను ఇస్తారు. ప్రయాణికులు తాము పయనించిన దూరానికి చెల్లించవలసిన చార్జీలు స్మార్ట్‌కార్డు నుంచి నేరుగా ఆర్టీసీ ఖాతాలో జమ అయ్యే విధంగా ఈ టిమ్స్ యంత్రాలను అనుసంధానం చేస్తారు. బస్‌పాస్ కౌంటర్లతో పాటు, కండక్టర్ల వద్ద కూడా స్మార్ట్‌కార్డులు లభిస్తాయి.స్మార్ట్‌కార్డులు వద్దనుకున్నవాళ్లు సాధారణ టిక్కెట్లపైన ప్రయాణం చేయవచ్చు.స్మార్ట్‌కార్డులు అందుబాటులోకి వస్తే క్షణాల్లో డబ్బులు చెల్లించి కార్డులు కొనుగోలు చేయవచ్చు. ఉదయం ఆఫీసులకు వెళ్లి సాయంత్రం ఇళ్లకు చేరుకొనే ఉద్యోగులకు, చిరువ్యాపారులకు, విద్యార్ధులకు ఈ స్మార్ట్‌కార్డుల వల్ల ప్రయోజనం కలుగుతుంది. -
స్మార్ట్ ప్రణాళిక రూ. 3025 కోట్లు
నగర అభివృద్ధిలో కేంద్ర పథకాల సమ్మిళితం పీపీపీ పద్ధతి ద్వారా పెట్టుబడుల సేకరణ రాష్ట్ర ప్రభుత్వానికీ భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పణ హన్మకొండ : స్మార్ట్‌సిటీ ద్వారా రాబోయే ఐదేళ్లలో వరంగల్ నగరంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సేకరణకు సంబంధించి ప్రాథమిక అంచనాలను గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు రూపొందిం చారు. మొత్తంగా రూ.3025 కోట్ల వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ నివేదికను కేంద్రానికి పంపడం ద్వారా స్మార్ట్‌సిటీ పథకం రెండో అంచెలో పోటీ పడేందుకు గ్రేటర్ వరంగల్ రంగం సిద్ధం చేసుకున్నట్లరుుంది. ఎస్పీవీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీ పథకంలో వరంగల్ నగరం ఎంపికైంది. అంతకుముందే అమృత్, హృదయ్ పథకాలకు సైతం అర్హత సాధించింది. స్మార్ట్‌సిటీ పథకం ద్వారా నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల వ్యవధిలో నేరుగా రూ.500 కోట్లు కేటాయిస్తుంది. ఈ నిధులకు తోడు వివిధ మార్గాల ద్వారా మరిన్ని నిధులను జత చేసి నగరంలో కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహరాలన్నీ నిర్వర్తించేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ని ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేసే ఎస్పీవీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పోరేషన్ సిబ్బంది సభ్యులుగా ఉంటారు. స్మార్ట్‌సిటీ పథకం ద్వారా చేపట్టబోయే ప్రాజెక్టు/పథకాలకు సంబంధించిన ప్రణాళిక, అనుమతులు, నిధులు, రుణసేకరణ, నిధులను ఖర్చుచేయడం తదితర వ్యవహారాలను ఎస్పీవీ చేపడుతుంది. రూ. 3025 కోట్లతో.. వరంగల్ స్మార్ట్‌సిటీ ప్రణాళికకు సంబంధించి ఎస్పీవీ ద్వారా రూ.2022 కోట్లు సేకరించాలని నిర్ణయించారు. ఇందులో స్మార్ట్‌సిటీ పథకం నుంచి రూ.500 కోట్లు, అమృత్ పథకం నుంచి రూ.41 కోట్లు, హృదయ్ నుంచి రూ.39 కోట్లు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) నుంచి రూ.104 కోట్లు, రహదారులు, భవనాల శాఖ నుంచి రూ.774 కోట్లు, రైల్వేశాఖ నుంచి రూ.47 కోట్లు ప్రధానంగా సేకరిస్తారు. మిగిలిన నిధులను పధ్నాలుగో ప్రణాళిక సంఘం నిధులతో పాటు, ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి సేకరిస్తారు. ఇవి కాకుండా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో రూ.1003 కోట్లు సేకరిస్తారు. ఇలా ఎస్పీవీ, పీపీపీ పద్దతిలో సమకూరిన రూ.3025 కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. స్మార్ట్‌సిటీ ద్వారా చేపట్టబోయే పనుల్లో రూ.1772 కోట్లను రెట్రో ఫిట్టింగ్(పూర్తిగా కొత్త ప్రాజెక్టు) పనులకు కేటాయిస్తారు. మిగిలిన రూ. 1253 కోట్లను ప్రస్తుతం నగరంలో ఉన్న వనరులు మరింత మెరుగుపరిచేందుకు వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక ఆదాయ వనరులకు సంబంధించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటామని కేంద్రానికి పంపిన నివేదికలో గ్రేటర్ అధికారులు స్పష్టం చేశారు. -
‘డబుల్’ ధమాకా!
స్లమ్స్‌లో బహుళ అంతస్తుల భవనాలు ఎక్కువ మందికి ప్రయోజనమే లక్ష్యం ఇటు స్లమ్‌ఫ్రీ.. అటు స్మార్ట్‌సిటీ అమలు దిశగా జీహెచ్ఎంసీ ‘సార్ .. మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా..?’ ... జీహెచ్ఎంసీలోని కొందరు ఉద్యోగుల ఆరా. ‘సార్ .. మేం పేదోళ్లం. మాకు ఎక్కడా ఇల్లు లేదు. సీఎం సార్ చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తుందా?’.... సచివాలయంలోని ఓ చిరుద్యోగి ఆశ. ...ఇలా చిరుద్యోగులే కాదు. నెలకు రూ.30 వేల వేతనం పొందుతున్న ఉద్యోగులు సైతం తమకు ఎక్కడా ఇల్లు లేదని... డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందాలంటే ఏం చేయాలో చెప్పాలని తెలిసిన వారినల్లా అడుగుతున్నారు. ఇదీ ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభానంతర పరిణామం. సిటీబ్యూరో: గవర్నర్ సైతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బాగున్నాయని ప్రశంసించడంతో వాటి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. పేదలు, సంపన్నులు అనే తేడా లేకుండా అందరూ ఆ ఇళ్లపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు తమకూ అలాంటి ఇళ్లే కావాలని వివిధ బస్తీల్లోని పేదలు కూడా కోరుతున్నారు. దీంతో ఎక్కువ మందికి వీటిని అందజేసేందుకు ఇకపై అపార్టుమెంట్ల తరహాలో నిర్మించాలని జీహెచ్ఎంసీ అధికారులు యోచిస్తున్నారు. స్థల లభ్యతను బట్టి కనీసం ఐదంతస్తులకు తగ్గకుండా... తొమ్మిది అంతస్తుల వరకు అపార్టుమెంట్లు నిర్మిస్తే ఎక్కువ మంది లబ్ధిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరేడు బస్తీలను ఎంపిక చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని దోబీఘాట్లో ఏకంగా తొమ్మిది అంతస్తుల అపార్ట్‌మెంట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్, మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు, గోషామహల్ నియోజకవర్గంలోని గోడేకిఖబర్, లంగర్‌హౌస్ సమీపంలోని అంబేద్కర్‌నగర్, సనత్‌నగర్ నియోజకవర్గంలోని హమాలీబస్తీ తదితర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు నిర్మించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా వీటిని నిర్మించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కొన్ని స్థలాలను తాత్కాలికంగా ఎంపిక చేసినప్పటికీ ఖరారు కాలేదు. ఐడీహెచ్ కాలనీ ఆదర్శంగా... ఐడీహెచ్ కాలనీలోని లబ్ధిదారులు, స్థల లభ్యతను బట్టి జీప్లస్ టూలో అందరికీ ఇళ్లు అందించే అవకాశం ఉండటంతో అక్కడ దాన్ని ఎంచుకున్నారు. ఇకపై గుడిసెలు, ఇరుకు గదుల్లో ఉంటున్న వారితో పాటు ఇతరత్రా ప్రాంతాల్లోని అత్యవసరమైన వారికీ ఇళ్ల సదుపాయం కల్పించేందుకు ఎక్కువ అంతస్తుల్లో నిర్మించాలని భావిస్తున్నారు. నగరంలో స్థలం దొరకడమే బంగారంగా మారడంతో ఉన్న చోటులో ఎక్కువ మందికి ప్రయోజనం కల్పించేందుకు డబుల్ బెడ్రూమ్లతో కూడిన అపార్ట్మెంట్లను నిర్మించాలని యోచిస్తున్నారు. స్థల విస్తీర్ణం, నిబంధనల మేరకు రహదారులు, ఇతర సౌకర్యాలను పరిగణనలోకి తీసుకొని ఎన్ని అంతస్తుల్లో నిర్మించవచ్చుననేది నిర్ణయిస్తారు.కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ క్రాస్ రోడ్స్ దగ్గరి చిత్తారమ్మ బస్తీ, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ దగ్గరి ఎరుకల నాం చారమ్మ నగర్లో సైతం ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అవగాహన కల్పిస్తూ... గుడిసెలు, ఇరుకు గదుల్లో ఉంటున్న వారి నుంచి బహుళ అంతస్తులకు ఇప్పటి వరకు పెద్దగా స్పందన లేకపోవడంతో అధికారులు ముందడుగు వేయలేకపోయారు. తక్కువ స్థలమైనా సరే వ్యక్తిగతంగా తమ ఒక్కరికే ఉంటేనే మేలనే భావనతో ఎవరూ ముందుకు రాలేదు. ఐడీహెచ్లోని ఇళ్లు చూశాక ఎక్కువ అంతస్తులున్నా ఒప్పుకుంటారనే నమ్మకంలో అధికారులు ఉన్నారు. రోజుకో బస్తీ వాసులను ఐడీహెచ్ కాలనీకి తీసుకు వెళ్లి అక్కడి సదుపాయాలు చూపిస్తున్నారు. బహుళ అంతస్తుల ఇళ్లయినా రోడ్డు, పార్కింగ్, తాగునీరు, డ్రైనేజీ తదితర సదుపాయాలు ఉండటం వల్ల ఇంటి విలువ తగ్గదని నచ్చజెప్పుతున్నారు. అప్పటికీ వినని వారికి ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో కౌన్సెలింగ్ చేయిస్తున్నారు. చాలామంది దీనికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చెప్పారు. ఇటు స్లమ్ ఫ్రీ.. అటు స్మార్ట్ ఈ విధానం వల్ల అపార్ట్మెంట్లతో పేదల బస్తీల రూపురేఖలు పూర్తిగా మారిపోయి స్లమ్ ఫ్రీగా మారుతాయని అధికారులు భావిస్తున్నారు. స్మార్ట్‌సిటీగా ఎంపికయ్యే నగరాల్లో పేదలకు గృహ సదుపాయం కూడా ఒక అంశంగా ఉండటంతో అందుకూ ఇది ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు. -
స్మార్ట్ వ్యూహం
ఆర్‌డబ్ల్యూఏలతో ప్రత్యేక సదస్సు నలుగురు మంత్రులు హాజరు గ్రేటర్ ఎన్నికల కోసమేనా? సిటీబ్యూరో: ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అటు స్మార్ట్‌సిటీ గా తొలి జాబితాలో ఎంపికకు.. ఇటు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఉపకరించేందుకు అవసరమైన చర్యలను జీహెచ్ఎంసీ చేపట్టింది. ఇందులో భాగంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (ఆర్డబ్ల్యూఏ)తో సోమవారం కూకట్‌పల్లిలో భారీ స్థాయిలో సదస్సు నిర్వహించింది. జీహెచ్ఎంసీ చేపట్టబోయే అన్ని పనుల్లో (ఇంటింటికీ చెత్త డబ్బాలు, మల్టీలెవెల్ ఫంక్షన్‌హాళ్లు, ఫ్లై ఓవర్లు తదితరమైనవి) ఆర్డబ్ల్యూఏలు ముఖ్య భూమిక పోషించాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్అలీతో పాటు మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో క్యాడర్ బలం లేకపోవడంతో ఆర్‌డబ్ల్యూఏల సహకారంతో ఎన్నికల్లో నెగ్గాలనేది సర్కారు యోచనగా కనిపిస్తోంది. ముఖ్యంగా కూకట్పల్లి ప్రాంతంలో సెటిలర్స్ ఎక్కువ కావడంతో తొలుత అక్కడ దృష్టి కేంద్రీకరించింది. ఆర్డబ్ల్యూయేల సహకారంతో ఏదైనా సాధించవచ్చునని చెబుతూ పరోక్షంగా అన్ని పనుల బాధ్యతలను వారికే అప్పగిస్తామనే సంకేతాలు పంపింది. హైదరాబాద్‌లో ఉంటున్న వారంతా తమవారేనని, ఎవరిపైనా పక్షపాతం లేదని హోం మంత్రి నాయిని చెప్పడాన్ని బట్టి అందరి మద్దతు కూడగట్టేందుకు దీన్ని వేదికగా చేసుకున్నట్లు రాజకీయ పరిశీలకుల అంచనా. మరోవైపు స్మార్ట్‌సిటీలలో తొలిస్థానాలు దక్కేందుకు స్థానిక సంఘాల భాగస్వామ్యం అవసరం. అందులో భాగంగా ప్రాధాన్య క్రమంలో చేపట్టాల్సిన పనులు తెలియజేయాల్సిందిగా సంబంధిత ఫారాలను వారికి అందజేశారు. ఇలా.. ఇటు స్మార్ట్‌సిటీ, అటు జీహెచ్ఎంసీ ఎన్నికలు లక్ష్యంగా ఈ సభ జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొందరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయనే అభిప్రాయాలకు ఈ వేదిక బలం చేకూర్చింది. అయితే ఇంకా డీలిమిటేషన్ ముసాయిదా ప్రజల ముందుకు రాకపోవం సందేహాలకు తావిస్తోంది. సభలో రభస కూకట్పల్లి: ఈ సదస్సులో పాల్గొన్నశేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అభివృద్ధి పనులపై విమర్శలు సంధిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమావేశం రసాభాసగా మారింది. ఆ సమయంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కల్పించుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే అంశంపై ప్రసంగించాలేగానీ గొడవలకు దిగొద్దన్నారు. అసోసియేషన్ల పాత్రపై సూచనలు చేయాలని ఆయన ఎమ్మెల్యేకు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమైన లోటుపాట్లు ఉంటే మంత్రులు, ప్రజా ప్రతిధులు కలిసి మాట్లాడుకోవాలని తెలిపారు. ఆర్డబ్ల్యూఏ ప్రతినిధుల నిరసన సమావేశానికి పిలిపించి కనీసం తమ అభిప్రాయాలను తెలుసుకునేందుకు సమయం కేటాయించకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వారి ప్రసంగాలే వినిపించారని వెల్ఫేర్ అసోసియేషన్ల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ఏ మాత్రం తెలుసుకోకుండా ప్రసంగించి వె ళ్లడం వల్ల ఒరిగేదేమిటని ప్రశ్నించారు. -
డిసెంబర్ 15 నాటికి తొలి ‘స్మార్ట్’ఎంపిక
త్వరలోనే స్మార్ట్ విలేజ్ పథకం: వెంకయ్య న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల పథకం తొలి విడతలో అభివృద్ధి చేయనున్న అలాంటి 20 నగరాలను ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ నాటికి ఎంపిక చేయనున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. గురువారమిక్కడ ఫిక్కీ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీల అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎంపికైన నగరాల్లో జనవరి నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయన్నారు. ప్రజలు మెరుగైన వసతులను కోరుకుంటున్నారని, ఆ మేరకు నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు. త్వరలోనే స్మార్ట్ విలేజ్ పథకాన్ని తీసుకురావదానికి కసరత్తు చేస్తున్నామన్నారు. -
15 నెలల్లో విశాఖపై డీపీఆర్ ఇవ్వండి
- సీఎం చంద్రబాబు ఆదేశం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి సంబంధించిన సమగ్ర ప్రాజె క్టు నివేదిక(డీపీఆర్)ను 15 నెలల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత బాధ్యుల(కస్టోడియన్)ను ఆదేశించారు. తిరుపతి, విజయవాడ, విశాఖ స్మార్ట్ సిటీ బాధ్యతలు తీసుకున్న అయికాం, కేపీఎంజీ, ఐబీఎం ప్రతినిధులతో మంగళవారమిక్కడ సీఎం సమీక్ష జరిపారు. డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు వీలుగా విశాఖ స్మార్ట్ సిటీ ప్రాథమిక ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. నగరంలో ఉన్న భూములను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని చెప్పారు. స్వచ్ఛభారత్‌లో భాగస్వాములుకండి సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అక్టోబర్ 2న గుంటూరులో ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ గ్రామాలు, పట్టణాల్లో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతోపాటు అందరూ తమ గ్రామం కోసం కేటాయించాలన్నారు. ప్రతినెలా రెండో శనివారం నిర్వహించాలన్నారు. బాగా చేసిన మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులు కూడా ఇస్తామన్నారు. స్కూల్ సిలబస్‌లోనూ స్వచ్ఛ భారత్ ఒక సబ్జక్టుగా పెడతామన్నారు. పీపీపీ పద్ధతిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తిచేసే ప్లాంట్లు ఏర్పాటుచేస్తామన్నారు. -
ప్రతి గ్రామం సింగపూర్‌లా ఉండాలి
గుంటూరు వెస్ట్ : రానున్న నాలుగేళ్లలో జిల్లాలోని ప్రతిగ్రామాన్ని స్మార్ట్సిటీలా తయారు చేయాలని, ఆ గ్రామాలు సింగపూర్‌లా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు ఆదేశించారు. అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలుచేయాలని సూచించారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాలులో శుక్రవారం స్మార్ట్ విలేజ్‌లు, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, పారిశుధ్యం, ఎన్ఆర్ఇజిఎస్ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్విలేజ్లు అంటే గ్రామాల్లోని అన్నివర్గాల వారి జీవనవిధానాలు మెరుగుపడాలని, ప్రతిఒక్కరూ అందమైన గ్రామంలో నివసిస్తున్నామనే భావన కలిగేలా స్మార్ట్విలేజ్లను తీర్చిదిద్దాలన్నారు. గ్రామాలలో అందమైన రోడ్లు, పరిశుభ్రమైన నీరు తదితర సౌకర్యాలను కల్పించాలని, గ్రామాలను గ్రీనరీగా మార్చాలని కోరారు. ప్రతి అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, తన సొంతగ్రామంగా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. కొంతమంది అధికారులలో అలసత్వం కనిపిస్తున్నదని, అలసత్వాన్ని వీడి ప్రభుత్వ పథకాలను సమర్ధంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఉపాధి హామీలో పనిదినాలు పెంచాలి... ఎన్ఆర్ఇజిఎస్ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జాబ్‌కార్డుదారులకు పనులు కల్పించాలన్నారు. నిరుద్యోగులు, గర్భిణులు, వికలాంగులతో పనులు చేయించాలని సూచించారు. వారు పనులు చేయలేని పరిస్థితులు ఉంటే వారి తరపువారు పనులు చేసినా సదరు గర్భిణుల ఖాతాలోకి నగదును జమ చేయాలని, పనిదినాలను పెంచాలని ఆదేశించారు. ఇప్పటివరకు కమర్షియల్ భవనాలకు ఇంకుడు గుంతలు తీసుకునే అవకాశం ఉందని, ఇళ్లలో కూడా ఇంకుడుగుంతలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెనాలి ఎంపీడీవో సమావేశం దృష్టికి తీసుకురాగా కమిషనర్ అందుకు అనుమతులు జారీచేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో డిసెంబర్ నెలాఖరు నాటికి 188 గ్రామాలను బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా రూపొందించాలని రామాంజనేయులు సూచించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ జిల్లాలో రూ.70 కోట్లతో 838 గ్రామాలలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీతో నిర్మించేలా పంచాయతీల నుంచి తీర్మానాలు అందాయని తెలిపారు. ఆయా గ్రామాలలో వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. జెడ్పీ సీఈఓ బి.సుబ్బారావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఇ గోపాలకృష్ణ, పీఆర్ ఎస్ఈ జయరాజ్, డీపీవో వీరయ్య, డ్వామా పీడీ కె.బాలాజీనాయక్, వివిధ మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలో, ఆర్‌డబ్య్లూఎస్ ఏఈలు పాల్గొన్నారు. -
‘స్మార్ట్’ గేమ్ షురూ!
తిరుపతి తుడా : స్మార్ట్ సిటీల ఎంపిక ప్రక్రియలో ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలు ఒక ఎత్తు. అయితే కేంద్రం విధించిన నిబంధనలను తట్టుకుని మహా నగరాలతో కుస్తీపడి టాప్ 20 జాబితాలో నిలబడడం ఇంకో ఎత్తు అవుతోంది. తొలి ఏడాదిలో ఎంపికైన 98 నగరాల్లో 20 నగరాలను మాత్రమే అభివృద్ధి చేయనున్నారు. వీటి ఎంపికకు కేంద్రం కఠిన నిబంధనలను విధించింది. ఇందులో మహా నగరాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ పోటీని తట్టుకుని తిరుపతి టాప్‌లో నిలవాల్సి ఉంది. ఎంపిక ప్రక్రియ ఇక కేంద్రం చేతుల్లో.. దేశ వ్యాప్తంగా స్మార్ట్ సిటీల జాబితా ఖరారైంది. వంద నగరాలను ఎంపిక చేయాల్సి ఉండగా, రెండు నగరాలు ప్రాథమికంగా అర్హత సాధించకపోవడంతో 98 నగరాలతో తుది జాబితాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గత వారం విడుదల చేశారు. ఈ జాబితాలో తిరుపతి నగరం స్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకు ఆయా నగర పనితీరుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఎంపిక ప్రక్రియ జరిగింది. రెండో దశ ఎంపిక ప్రక్రియ పూర్తిగా కేంద్రం చేతిలో ఉంటుంది. కేంద్రం ప్రతిపాదించిన ప్రతి అంశంలోనూ పోటీపడి అర్హత సాధిస్తేనే తొలి 20 నగరాల్లో తిరుపతి నిలుస్తుంది. మహానగరాలతో పోటీ.. కేంద్రం ప్రకటించిన 98 స్మార్ట్ సిటీల జాబితా ల్లో దేశ వ్యాప్తంగా 24 రాష్ట్ర రాజధానులు, ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక నగరాలు మరో 24, సాంస్కృతిక, పర్యాటక ప్రాధాన్య నగరాలు 18 ఉన్నాయి. రాజధాని, ప్రముఖ, వ్యాపార, పర్యాటక నగరాలతో తిరుపతి పోటీని ఎదుర్కోవాల్సి ఉంది. రాష్ట్రాల రాజధాని నగరాలే 24 ఉండటంతో టాప్ 20లో పోటీ ఏ స్థాయిలో ఉంటుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు మరో 24 ప్రముఖ నగరాలు టాప్ 20 జాబితా కోసం పోటీ పడుతున్నాయి. ఈ 48 నగరాల నుంచి పోటీ పడి తిరుపతి తొలి 20 స్మార్ట్ జాబితాలో నిల వాల్సి ఉంటుంది. ఇందుకోసం కార్పొరేషన్ కమిషన్ మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ చివరికల్లా తొలి ఏడాది అభివృద్ధికి ఎంపికైన 20 నగరాలను కేంద్రం ప్రకటించనుంది. ప్రారంభమైన వర్క్‌షాపు టాప్ 20 సిటీల జాబితాల్లో నిలవాలంటే అర్హ త సాధించాల్సిన అంశాలపై ఆయా నగరాల మేయర్లు, కమిషనర్లకు అవగాహన కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. మూడు దఫాలుగా వర్క్‌షాపులను నిర్విహ స్తారు. బుధ, గురువారాల్లో ఢిల్లీలో నిర్వహించిన వర్క్ షాప్‌నకు స్మార్ట్ నగరాలకు ఎంపికైన నగరాల ప్రతినిధులు హా జరయ్యారు. మలి దశ వర్క్‌షాపును సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. అనేక అంశాల్లో పోటీ ఆయా నగరాలకు అందుబాటులో ఉన్న సేవ లు, అర్థిక వరనరులు, అభివృద్ధి, ఆదాయ వనరులు, సంస్కరణల అమలు, జనాభా, మురికివాడల స్థితిగతులు, పన్నుల చెల్లింపు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థల పనితీరు ఇలా కేంద్రం విధించిన అనేక అంశాల్లో ఆయా సిటీలు పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
స్మార్ట్‌సిటీ ప్రణాళికకు రూ.192 కోట్లు విడుదల
ప్రతి నగరానికీ రూ.2 కోట్లు ► మూడు నెలల్లో ప్రతి నగరం నుంచీ ప్రణాళికలు సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీస్ మిషన్ కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 96 నగరాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ.192 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో ప్రతి నగరానికి రూ.2 కోట్ల రూపాయలు స్మార్ట్‌సిటీ ప్రణాళిక రూపకల్పనకు అందిస్తారు. ప్రతి నగర పాలక సంస్థలు సాంకేతిక పరిజ్ఞాన సంస్థల సహాయంతో తమ తమ నగరాలను ఏవిధంగా స్మార్సిటీలుగా రూపుదిద్దుతామో సమగ్రమైన ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మూడు నెలల గడువును విధించారు. మూడు నెలల తరువాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చేరిన ప్రణాళికల్లోంచి అత్యుత్తమంగా ఉన్న 20 ప్రణాళికలను ఎంపిక చేసి ఈ ఆర్థిక సంవత్సరానికి ఆ 20 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి కోసం ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీ మిషన్‌లో వంద నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటిలో 98 నగరాలను ఇప్పటికే ఎంపిక చేసింది. ఈ 98 నగరాల్లో న్యూఢిల్లీ, చండీగఢ్‌లకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ త్వరలోనే నిధులను విడుదల చేయనుంది. మిగతా 96 నగరాలకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నిధులను సమకూరుస్తుంది. జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి మరో రెండు నగరాల పేర్లు రావలసి ఉంది. మరోవైపు న్యూఢిల్లీలో గురువారం స్మార్ట్‌సిటీలపై ఓ వర్క్‌షాప్ జరిగింది. 11 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. స్మార్ట్‌సిటీ ప్రణాళిక నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఇందులో పాల్గొన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. 38 నగరాలకు సంబంధిత నిధుల మంజూరు ఉత్తర్వులను ఈ వర్క్ షాపులో మంత్రి అందజేశారు. -
రాత్రికి రాత్రే.. పెరగవు ధరలు!
♦ స్మార్ట్ సిటీ.. మెట్రో రైలంటూ ధరలు పెంచుతున్న బిల్డర్లు ♦ ఆచితూచి అడుగు ముందుకు వేయాలంటున్న నిపుణులు హైదరాబాద్ స్మార్ట్ సిటీగా ఎంపికైందనో.. మెట్రో రైలు ప్రారంభం కానుందనో.. ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందనో.. బడా పారిశ్రామిక సంస్థలు వస్తున్నాయనో.. కొందరు బిల్డర్లు నగరంలో స్థిరాస్తి ధరలను ఒక్కసారిగా పెంచేస్తున్నారు. కొంతకాలం నుంచి ఫ్లాట్ల ధ రలు పెరగకపోయినా.. ప్లాట్ల రేట్లు అనూహ్యంగా పెరగడానికి కారణమిదే. కృత్రిమంగా రేట్లు పెంచి దళారుల మాయలో పడి అధిక సొమ్ము పెట్టి స్థిరాస్తులను కొనుగోలు చేయకూడదని, కష్టార్జితాన్నంతా బూడిదపాలు చేసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. - సాక్షి, హైదరాబాద్ స్మార్ట్ సిటీ నగర ముఖచిత్రాన్ని మార్చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కాకపోతే ఇది పూర్తికావడానికి ఎంతలేదన్నా పదేళ్ల సమయం పడుతుంది. రవాణా ఆధారిత అభివృద్ధి జరగడానికి మరికొంత కాలం పడుతుంది. భవిష్యత్తులో చోటుచేసుకునే అభివృద్ధిని ఇప్పుడే ఊహించి ఐదేళ్ల తర్వాత పెరగాల్సిన స్థలాల ధరల్ని కొందరు బిల్డర్లు నేడే పెంచేస్తున్నారు. మార్కెట్లో కృత్రిమ గిరాకీ, పోటీతత్వాన్ని సృష్టించి సామాన్యులకు స్థలాలు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. నగరం అభివృద్ధి దిశలో స్థిరంగా పయనించడానికిది సరైన సంకేతం కాదు. ధరలు క్రమక్రమంగా పెరగాలే తప్ప.. రాత్రికి రాత్రే ధరలు వంద శాతం పెంచడం సరైంది కాదు. బూమ్ సమయంలో విమానాశ్రయాన్ని చూపెట్టి మహేశ్వరంలో గజం ధర రూ.8,000 వరకూ పలికిన లే-అవుట్లున్నాయి. కానీ, నేడో ఇంత ధర పెట్టడానికి ఎవరూ ముందుకురాని పరిస్థితి. మరి అంతకు ముందే కొనుగోలు చేసిన వారి పరిస్థితి.. అటు అమ్ముకోలేక.. ఇటు అట్టే స్థలాన్ని అట్టిపెట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండదంటే.. కొనుగోలుదారులు వాస్తవాన్ని అర్థం చేసుకుని అడుగుముందుకేయాలి. ►ఏడాదిన్నర క్రితం మియాపూర్‌లో ప్రతిపాదిత మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గజం స్థలం ధర రూ.13,000కు అటు ఇటుగా ఉండేది. ఈ రేటును బిల్డర్లు రూ.30 వేలు దాటించేశారు. పోనీ ఇక్కడ అనూహ్య రీతిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయా అంటే అదీ లేదు. ప్రధాన రహదారిలో రోడ్లు వెడల్పు చేశారే తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మంచినీటి సరఫరా పెరగలేదు. కాలనీల్లో అంతర్గత రోడ్లూ వేయలేదు. మరి ఎందుకు అంత హఠాత్తుగా రేట్లు పెరిగాయంటే.. మెట్రో స్టేషన్ వస్తుంది సార్ అందుకే రేట్లు పెరిగాయని రియల్టర్లు సమాధానమిస్తున్నారు. మెట్రో పనులు జరిగినంత మాత్రాన ఇక్కడ నివసించే ప్రజల జీవితాల్లో సమూల మార్పులేమైనా జరిగాయా? ఉద్యోగావకాశాల్ని కల్పించే సంస్థలేమైనా పుట్టుకొచ్చాయా సమాధానం లేదు. అలాఅని భవిష్యత్తులో జరగదని కొట్టిపారేయ్యలేం. కాకపోతే ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసుకొని కొనుగోలుదారులెవరైనా ధరల విషయంలో లోతుగా అధ్యయనం చేశాలి. లేకపోతే గతంలో శంషాబాద్ విమానాశ్రయం అనుభవమే పునరావృతం కావొచ్చు. ►ఆదిభట్ల వద్ద సాఫ్ట్వేర్ సంస్థ లు వస్తున్నాయన్న కారణంగా బిల్డర్లు ప్లాట్ల అమ్మకానికి పోటీపడుతున్నారు. ధరలనూ అమాంతం పెంచేస్తున్నారు. కొనుగోలుదారులు గుర్తించాల్సిన అంశమేమిటంటే.. నివాసయోగ్యమైన ప్రాంంతాల్లోనే స్థలాల ధరలు పెరుగుతాయి. అదికూడా ఉద్యోగావకాశాల్ని కల్పించే సంస్థలు పుట్టుకొస్తేనే సాధ్యమవుతుంది. మాదాపూర్‌లో ఐటీ పరిశ్రమ ఏర్పాటైన నాలుగైదేళ్ల తర్వాత కానీ ఇక్కడి చుట్టుపక్కల స్థిరాస్తుల రేట్లు పెరగలేదు. 2003 వరకూ మాదాపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో గజం ధర రూ.5 వేల లోపే ఉండేదన్న విషయం మరవకూడదు. కాబట్టి అభివృద్ధి అనేది రాత్రికి రాత్రే జరగదన్న విషయం గుర్తుంచుకోవాలి. -
కాకినాడ.. ఇక సోకువాడ
స్మార్ట్‌సిటీ జాబితాలో చోటు జిల్లా కేంద్రానికి మహర్దశ ఏటా రూ.200 కోట్ల నిధులు కాకినాడ: దేశంలోని దాదాపు 100 నగరాలను ఆకర్షణీయనగరాలు (స్మార్ట్‌సిటీలు)గా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి, కాకినాడ, విశాఖపట్నంలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి కేంద్రానికి సిఫార్సు చేయగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం వాటిని ఎంపిక చేసినట్టు అధికారిక ప్రకటన చేశారు. స్మార్ట్‌సిటీగా ఎంపికైన కాకినాడకు ఏటా రూ.200 కోట్ల వరకు నిధులు సమకూరే అవకాశం ఉందని కార్పొరేషన్ వర్గాల సమాచారం. అలా ఐదేళ్ళపాటు ఈ ప్రాంతానికి కేంద్రం నుంచి ఆర్థిక తోడ్పాటు లభించనుందని చెబుతున్నారు. ఈ మొత్తం నిధులు పూర్తి గ్రాంటుగా వస్తాయని చెబుతున్నప్పటికీ వాస్తవానికి అవి గ్రాంటా, కొంత నగరపాలక సంస్థ భాగస్వామ్యం కూడా ఉండాలా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదంటున్నారు. ప్రతిపాదనల్ని నివేదించే టాస్క్‌ఫోర్స్ కమిటీ కాగా స్మార్ట్‌సిటీగా రూపొందించే క్రమంలో చేయూల్సిన మార్పులు, చేపట్టాల్సిన పనుల్ని పర్యవేక్షించేందుకు ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే, ట్రాన్స్‌కో, విద్యుత్, రవాణా, ఆర్టీసీ తదితర 11 శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీనికూడా ఏర్పాటు చేసింది. కలెక్టర్ చైర్మన్‌గా, కార్పొరేషన్ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీ తరచూ సమావేశమై స్మార్ట్‌సిటీకి అవసరమైన ప్రతిపాదనలపై చర్చించి ప్రభుత్వానికి నివేదించనుంది. ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి ప్లాన్డ్ సిటీగా పేరున్న కాకినాడను స్మార్ట్ సిటీకి ఎంపిక చేయడం సంతోషదాయకం. అయితే దీంతో కాకినాడను అభివృద్ధి చేయాలంటే అది కేవలం అధికారులు, రాజకీయనేతలవల్లే సాధ్యం కాదు. ప్రజాహిత సంఘాలను కూడా భాగస్వాముల్ని చేయూలి. ముఖ్యంగా పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయూలి. - వైడీ రామారావు, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నిజంగానే మహర్దశ స్మార్ట్‌సిటీగా ఎంపిక కావడంతో కాకినాడ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే సంకేతాలు అందడంతో అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాం. ఇటీవలే టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం కూడా జరిగింది. శాఖల వారీగా ఆకర్షణీయ నగరానికి అవసరమైన ప్రతిపాదనలను ఆయా అధికారులు ఇప్పటికే నివేదించారు. పథకం అమలులోకి వస్తే ఆ నిధులతో నగరానికి నిజంగానే మహర్దశ పడుతుంది. - ఎస్.గోవిందస్వామి, కమిషనర్, కాకినాడ కార్పొరేషన్ ఇలా ‘స్మార్ట్’ అవుతుంది.. కాకినాడ నగరాన్ని స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయడంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. ఇందులో భాగంగా ఇక్కడ 24 గంటలూ నీరు, విద్యుత్ సరఫరాతోపాటు పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను సమకూర్చాలి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కొన్ని ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి అక్కడ మాత్రమే వాహనాలను నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసే క్రమంలో కొత్తగా ఆర్టీసీ బస్సుల నిలుపుదల, ఇతర కార్యకలాపాల కోసం కొత్త బస్టాండ్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ ఇక్కట్లను తప్పించేందుకు అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్ల నిర్మాణాలను కూడా చేపడతారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ప్రకటన బోర్డులను ఏర్పాటు చేయకుండా నియంత్రించి, పరిమిత ప్రాంతాల్లో హోర్డింగ్జోన్స్ను ఏర్పాటు చేస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ విధానంలోని బోర్డులను మాత్రమే భవిష్యత్‌లో ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ ఆదా కోసం నగరం అంతా ఎల్ఈడీ లైట్లతో నింపుతారు. నగరాన్ని గ్రీన్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు అన్ని మున్సిపల్ భవనాలు, పాఠశాలలు, సామాజిక స్థలాలు, ముఖ్య కూడళ్ళను అభివృద్ధి చేయడంతోపాటు మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపడతారు. -
స్మార్ట్ కళ వచ్చేసింది
సుందర నగరంగా తిరుపతి ఏటా రూ.500 కోట్లు సమకూరే అవకాశం పరిష్కారం కానున్న తాగునీటి సమస్య ఆనందంలో స్థానిక ప్రజానీకం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తిరునగరికి కొత్త యోగం దక్కింది. అత్యాధునిక హంగులతో.. వడివడిగా అభివృద్ధి చెందనున్న స్మార్ట్ సిటీ జాబితాల్లో చోటు సంపాదించింది. ఇక తమ సమస్యలు పరిష్కారమవుతాయని తిరుపతి వాసులు ఊహాలోకాల్లో తేలిపోతున్నారు. తిరుపతి : కేంద్ర పట్టణాభివృద్ధిశాఖా మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఢిల్లీలో గురువారం సహచర మంత్రి అనంతకుమార్‌తో కలసి స్మార్ట్ సిటీల జాబితా ప్రకటించారు. అందులో తిరుపతి నగ రం ఉండడం స్థానికులను ఆనందంలో ముంచెత్తింది. స్మార్ట్ ప్రకటనతో నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. నిధుల వరద పారనుంది. ‘అమృత’ హరివిల్లు! ఇప్పటికే అమృత్ పథకం కింద తిరుపతి నగరం ఎంపికైంది. ప్రభుత్వం రూ.25 లక్షల వరకు నిధులు విడుదల చేసింది. తిరుపతి నగరం అన్ని హంగులతో అభివృద్ధి చెంది కొత్త శోభ సంతరించుకోనుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో సహా ఎలాంటి పథకానికైనా నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటు అందే అవకాశం ఉంది. ‘స్మార్ట్’ఎంపికతో లాభాలివి {పతి ఏడాదీ కేంద్రం నుంచి రూ. 500 కోట్ల నిధులు నీటి సమస్య పరిష్కారం నిరంతర విద్యుత్ సరఫరా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం {పజారవాణా వ్యవస్థకు పెద్ద పీఠ పేదలకు గృహ వసతి ఐటీ కనెక్టివిటీ సుపరిపాలనతో పాటు అన్ని రంగాల్లో ప్రజల భాగస్వామ్యం నగరపాలక మ్యాచింగ్ గ్రాంట్లతో అభివృద్ధి ఎంపికకు కొలమానం స్మార్ట్ సిటీ ఎంపికకు సంబంధించి సుమారు 15 అంశాలను కొలమానంగా తీసుకున్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు, ఇ- గవర్నర్స్, గ్రీవెన్స్ పరిష్కారం, ఆదాయ వ్యయాలు, ఖర్చుకు తగ్గ ఆదాయం అంశాలను ఇందులో పొందుపరిచారు. ప్రధానంగా 90 శాతం పైగా ఆడిట్ సకాలంలో జీతాల చెల్లింపులను పరిగణనలోనికి తీసుకున్నారు. టాస్క్ఫోర్సు కమిటీ ఏర్పాటు స్మార్ట్‌సిటీ ఎంపికకు ముందే టాస్క్ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్ చైర్మన్‌గా నగరపాలక సంస్థ కమిషనర్ మెంబర్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఎస్పీ జాతీయ రహదారుల భవనాల శాఖ, ట్రాన్స్‌కో, రైల్వే, ఆర్టీసీ, రవాణా, రహదారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే తిరుపతి నగరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశమయ్యింది. -
'స్మార్ట్ సీటీల ఎంపికలో అన్యాయం'
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్‌సిటీల ఎంపికలో తెలంగాణకు అన్యాయం జరిగిందని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ స్మార్ట్‌సిటీలను ఎంపిక చేసి అటు ఆంధ్రప్రదేశ్‌కు, ఇటు తెలంగాణకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నా ఏపీకి న్యాయం చేయించుకోవడంలో చంద్రబాబు విఫలమైనాడని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు తప్ప చేతల్లో ఏమీ సాధించుకోలేకపోతున్నాడన్నారు. కేసీఆర్ వ్యక్తిగత పనులను మాత్రమే చక్కదిద్దుకుంటున్నాడని షబ్బీర్ అలీ ఆరోపించారు. స్మార్ట్‌సిటీల ఎంపికకోసం టీఆర్ఎస్ ఎంపీలను సరైన మార్గంలో కేసీఆర్ నడిపించలేకపోయాడని ఆరోపించారు. కేసీఆర్ చేతకాని తనాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని షబ్బీర్ ఎద్దేవా చేశారు. -
కౌన్ బనేగా స్మార్ట్ సిటీ?
న్యూఢిల్లీ: అభిమాన హీరో సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు ...ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న స్మార్ట్ సిటీల జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. దేశంలో ఉన్న 100 పట్టణాలు, నగరాలను స్మార్ట్ వేదిక మీదకు తీసుకురావడానికి ముహూర్తం ఖరారైంది. కౌన్ బనేగా స్మార్ట్ సిటీ అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది. భారత్ లోని వివిధ రాష్ట్రాల్లో పోటీలో ఉన్న స్మార్ట్ సిటీల పేర్లను గురువారం కేంద్ర ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వంద ‘స్మార్ట్’ నగరాల అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన జాబితాలో రాష్ట్రాల రాజధానులను తోసిరాజని పలు చిన్న నగరాలు చోటు పొందడం విశేషం. ప్రతీ రాష్ట్రంలో కనీసం ఒక స్మార్ట్ సిటీ ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని ప్రధాన నగరాలకు చోటు దక్కలేనట్లు తెలుస్తోంది. వీటిలో బీహార్ రాజధాని పాట్నాతో పాటు, బెంగళూరు, కోల్ కతా, తిరువనంతపురం తదితర నగరాలున్నట్లు సమాచారం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన నామినేషన్లలో.. హిమాచల్‌ప్రదేశ్‌లో సిమ్లాను తోసిరాజని ధర్మశాల చోటుపొందింది. కర్ణాటకలో శివమొగ్గకూ చోటు దక్కింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 13 నగరాలకు చోటు లభించింది.జాబితాలో చేరిన వాటిలో ఇంకా రాయ్‌పూర్, గువాహటితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఉంది. ఢిల్లీతోపాటు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకూ చోటు లభించింది. ముంబై, కోల్‌కతా, లక్నో, జైపూర్, రాంచీ, భువనేశ్వర్లూ ఇందులో ఉన్నాయి.వీటిపై విశ్లేషించి తొలి విడతలో 20 నగరాలను ఎంపిక చేసి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కోదానికి రూ.200 కోట్ల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. మరి ఆ 100 స్మార్ట్ సిటీలు ఏమిటనేది మరికాసేపట్లో వెల్లడి కానుంది. -
స్మార్ట్ సిటీ స్థాయికి ఏలూరు
ఏలూరు (టూటౌన్) : ఏలూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం ఏలూరు నగర మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ ఏలూరును స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు సీఎం చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. నగరం మాస్టర్ ప్లాన్ రూపకల్పన, అభివృద్ధిపై తీసుకోవలసిన చర్యలపై అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధుల, అధికారుల అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలన్నారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అంతర్జాతీయ స్థారుు కన్సల్టెన్సీ సేవలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేసేందుకు సీఎం అంగీకరించారన్నారు. జిల్లా ప్రధాన కేంద్రం కన్నా తక్కువగా ఏలూరులో అభివృద్ధి ఉందన్నారు. సీఆర్డీఏ పరిధికి దగ్గరగా ఉండడం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నగరం అభివృద్ధితో పాటు, దానిని విస్తరింపచేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ కేవలం 11.58 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏలూరు నగరం ఉందన్నారు. ఈ పరిధిని మరింత విస్తరించి విశాల నగరంగా రూపొందించేందుకు మాస్టర్ ప్లాన్‌ను తయారు చేస్తున్నామన్నారు. దీనికి గతంలో నాలుగైదేళ్లు పట్టేదని, సాంకేతికత అభివృద్ధితో ఏడాదిలోపే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించవచ్చన్నారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ అవసరమైన టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు 4 వేల ఎకరాలను గుర్తించామన్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, నగర మేయర్ షేక్ నూర్జహాన్, డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కమిషనర్ వై.సాయిశ్రీకాంత్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రతి జిల్లాకు శిక్షణ భవనం ఏలూరు(ఆర్ఆర్ పేట) : ప్రతి జిల్లాలో పంచాయతీ శిక్షణ భవనం నిర్మిస్తున్నట్టు మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. స్థానిక గ్జేవియర్ నగర్లో జిల్లా పంచాయతీ శిక్షణ కేంద్రం భవన నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో రూ. 2 కోట్ల వ్యయంతో ఈ భవనాలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ వివిధ మతాలకు సంబంధించిన శ్మశాన వాటికల ఏర్పాటుపై అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వీటికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. ఎంపీ మాగంటి బాబు, కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, గన్ని వీరాంజనేయులు, వి.శివరామరాజు, కేఎస్ జవహర్, మేయర్ నూర్జహాన్, జెడ్పీ సీఈవో కె.సత్యనారాయణ, డీపీవో డీ.శ్రీధర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావు, కార్పొరేషన్ విప్ గూడవల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అంతా టూ లేట్... ఇదేనా స్మార్ట్
భూములు, ఆస్తులకు పాత మార్కెట్ ధరలే కొనసాగింపు ధరలు అప్డేట్ చేయని రిజిస్ట్రేషన్ల శాఖ అయోమయంలో రియల్ వ్యాపారులు స్మార్ట్ వార్డు, స్మార్ట్ సిటీ.. స్మార్ట్ పాలన.. అంతా స్మార్ట్. పాలకులు ఏమి మాట్లాడినా స్మార్ట్ గురించే. ఈ-ఆఫీస్, ఈ-పోస్, ట్యాబ్లెట్ల వాడకం ఇలా పాలన అంతా ఆన్లైన్లోనే. మరి ఎంతో ముఖ్యమైన సమాచారం మాత్రం సంబంధిత వెబ్సైట్లలో అప్డేట్ కావడం లేదు. ఇదీ మన స్మార్ట్ సార్ల తీరు. గాంధీనగర్: ప్రభుత్వం స్మార్ట్పాలనకు తెరతీసింది. ఈ- ఆఫీస్ పేరుతో ఓ వైపు పేపర్ వాడకానికి స్వస్తి పలుకుతున్నారు. వీఆర్వో స్థాయినుంచి ఉన్నతాధికారుల వరకు ట్యాబ్‌లు అందిస్తోంది. పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేసి మొబైల్లోనే భూముల వివరాలు తెలుసుకునే విధంగా ‘మీ భూమి పోర్టల్‌ను రూపొందించింది. చివరికి భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు డాక్యుమెంట్ రైటర్స్‌పై ఆధారపడకుండా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టింది. ఇంటి వద్దనుంచే ప్రభుత్వ సేవలన్నీ పొందవచ్చని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేదని ప్రజలు సంబరపడ్డారు. కాని కొన్ని వెబ్సైట్లలో సమాచారం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. నిరంతరం మార్పులు జరుగుతున్నప్పటికీ పాత డేటా ఆప్డేట్ చేయకుండా అలానే కొనసాగిస్తున్నారు. ఆ కోవకు చెందిందే రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. ప్రభుత్వం భూములు, ఆస్తుల మార్కెట్ ధరలను అమాంతం పెంచేసింది. రాజధాని నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో అరవై నుంచి వంద శాతం వరకూ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ధరలను పెంచి అమలు చేస్తున్న ప్రభుత్వం అధికారక వెబ్సైట్లో మాత్రం పాత మార్కెట్ ధరలను కొనసాగిస్తోంది. వెబ్సైట్లో భూ ముల మార్కెట్ ధరలు అప్డేట్ చేయలేదు. 1 ఏప్రిల్, 2013న పెంచిన ధరలే ఇప్పటికీ ఉన్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను, డాక్యుమెంట్ రైటర్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. భూముల కొనుగోలుదారులు మండలాలు,గ్రామాల వారి మార్కెట్ ధరలు, సర్వే నంబర్వారీ మార్కెట్ ధర ఎంత? అనే వివరాలను తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్‌పై ఆధారపడతారు. ఉదాహరణకు వీరులుపాడు మండలంలోని జయంతి గ్రామంలో గతంలో ఎకరం మార్కెట్ ధర రూ. 2.50లక్షలుగా ఉంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి మార్కెట్ ధర రూ. 5లక్షలు అయింది. వైబ్సైట్లో మాత్రం మార్కెట్ ధర రూ. 2.50లక్షలుగానే ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీ, స్టాంప్‌డ్యూటీ ఎంత చెల్లించాలో వెబ్‌సైట్‌లోని మార్కెట్ ధరల క్యాలిక్యులేటర్ వినియోగిస్తే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు వివరాలు వస్తాయి. ధరలు మార్చకపోవడం క్యాలిక్యులేటర్ వినియోగించిన వారికి పాత ధరల ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీల వివరాలు అందుబాటులోకి వస్తున్నాయి. వైబ్‌సైట్‌ను నేషనల్ ఇన్‌ఫార్మటిక్ సెంటర్ వారు డిజైన్ చేసి డెవలప్ చేస్తారు. ధరలు పెరిగి పదిరోజులు కావస్తున్నా కొత్త ధరలు అందుబాటులోకి రాలేదు. పట్టణాల్లో సమస్య తీవ్రం పట్టణ ప్రాంత వ్యాపారులు వైబ్‌సైట్ అప్డేట్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణాల్లో వీధి వీధికి మార్కెట్ ధరలలో వ్యత్యాసం ఉం టుంది. ఒకే వీధిలో డోర్ నంబర్ల వారీగా ధరల్లో తేడాలున్నాయి. పెరిగిన మార్కెట్ ధరల వివరాలను సకాలంలో అప్డేట్ చేయకపోవడంతో వ్యాపారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వెబ్‌సైట్‌ను అప్డేట్ చేసి సమాచారం అందించాలని వ్యాపారులు కోరుతున్నారు. -
రంగంపేటకు స్మార్ట్ కిరీటం?
తిరుపతి నగరం స్మార్ట్ సిటీ కిరీటం దక్కించుకోవడం దాదాపుగా ఖరారైనట్టే కనిపిస్తోంది. రెవెన్యూ అధికారులు ఇందుకు కావాల్సిన భూమిని సైతం సిద్ధం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు సూచనల మేరకు చంద్రగిరి మండలం ఏ.రంగంపేట అటవీ ప్రాంతంలో స్మార్ట్ సిటీ నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు ఎస్వీ జూ పార్క్ దాటిన తరువాత కల్యాణి డ్యాం వరకు ఉన్న అటవీ ప్రాంతంలో స్మార్ట్ సిటీ నిర్మాణం జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తుడా, రెవెన్యూ విభాగాల్లోని కీలక అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నారు. - అన్ని అర్హతలతో నివేదికలు రెడీ 50 బ్లాకులు.. - 500 ఎకరాల భూముల గుర్తింపు తిరుపతి తుడా : తిరుపతి నగరం ఎస్వీ జూ పార్కు వరకు విస్తరించడం, అక్కడి నుంచి కల్యాణి డ్యాం వరకు ప్రభుత్వ, అటవీ భూములు పుష్కలంగా ఉండటం స్మార్ట్ సిటీకి అనుకూలం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్మార్ట్ సిటీకి రంగంపేట పరిసర ప్రాంతం అన్ని విధాల అనుకూలంగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ఈ క్రమంలో అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. స్మార్ట్ సిటీ అభివృద్ధికి కావాల్సిన 500 ఎకరాల భూమితో పాటు అదనంగా మరో 2 వేల ఎకరాల వరకు ఇక్కడ అటవీ భూమి ఉంది. నీటి వనరులకు కల్యాణి డ్యాం, మరో పక్క గాలేరు- నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఎస్వీ జూ పార్కు వరకు వస్తుంది. దీంతో నీటి వనరు సమస్య ఉండదు. అటవీ ప్రాంతం కావడంతో భూములన్నీ ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు వాలుగా ఉంటాయి. డ్రైనేజీ వ్యవస్థకు ఇవి అనుకూలంగా ఉంటాయి. అనంతపురం- నాయుడుపేట రహదారికి ఇదే మార్గం మీదుగా వెళతాయి. మరో పక్క ఎస్వీ జూ పార్కు మీదుగా అలిపిరి బైపాస్ రోడ్డు ఇలా ఏ రంగ ంపేట పరిసర ప్రాంతం స్మార్ట్ సిటీకి అర్హతలు ఉన్నాయని రెవెన్యూ, తుడా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే ప్రభుత్వం ఎక్కడ నిర్మిస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. సొంత మండలానికి ఏమి చేయలేదని అపవాదు నుంచి బయటపడేందుకు ఇక్కడే స్మార్ట్ సిటీ నిర్మించాలనేది సీఎం చంద్రబాబు కోరికగా కనిపిస్తోంది. ఆ మేరకు అనధికారికంగా ఆయన ఇక్కడే స్మార్ట్ సిటీ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని జిలా ఉన్నతాధికారికి చెప్పినట్టు మరో అధికారి చెప్పారు. భూముల గుర్తింపు స్మార్ట్ సిటీకి అవసరమయ్యే భూముల వివరాలను రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే అందజేశారు. రంగంపేట, ఏర్పేడు, రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో బ్లాకులుగా భూములను గుర్తించి నివేదికను అందజేశారు. అయితే ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాలు కేంద్రం విధించిన నిబంధనలకు విరుద్ధంగా నగరానికి చాలా దూరంగా ఉన్నాయి. ఇప్పటికే ఐఐటీ ఇతర ప్రాజెక్టులన్నీ ఈ ప్రాంతాలకే రాబోతున్నాయి. దీంతో ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాలు స్మార్ట్‌కు అనుకూలంగా లేవని అధికారులు చెబుతున్నారు. ఇక రేణిగుంట మండలం విషయానికి వస్తే తాత్కాలికంగా అభివృద్ధికి భూములు ఉన్నా భవిష్యత్ అవసరాలకు ఇక్కడ భూములు లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఇక మిగిలింది ఏ.రంగంపేట మాత్రమే కావడం ఇక్కడ కలిసివచ్చే అంశం. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఎస్వీ జూ పార్కుకు ఆనుకుని సుమారుగా కల్యాణి డ్యాం వరకు ప్రభుత్వ, ఫారెస్టు, డీకేటీ భూములను గుర్తించారు. 50 ఎకరాలను ఒక బ్లాకుగా విభజించారు. ఇలా మొత్తం 50 బ్లాకులను సిద్ధం చేశారు. ఒక్కో బ్లాకులో ఎలాంటి మౌలిక వసతులు లభ్యమవుతున్నాయో నివేదికలో పొందుపరిచారు. స్మార్ట్ సిటీకి అర్హత సాధించేం దుకు పక్కా ప్రణాళికతో కలెక్టర్ నివేదికను సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పరిశీలిస్తే... స్మార్ట్ సిటీకి నగరాన్ని ఎంపిక చేయాలంటే ఆ నగరానికి దరిదాపుల్లో 500 ఎకరాల భూములు ఉండాలి. ఆ భూముల్లో అవసరమయ్యే మౌలిక వసతు లు, బ్లాక్‌లుగా విభజించి అభివృద్ధి చేయడానికి అనువైన పరిస్థితులు ఉండాలి. స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేయడం కోసం ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఉండటంతోపాటు వాటిల్లో పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉండాలి. స్మార్ట సిటీగా ఎంపికైన ప్రాంతంలో విద్యుత్, డ్రైనే జీ, టెలిఫోన్, నీరు తదితర సౌకర్యాలు భూగర్భ విధానంతో కల్పిస్తారు. ఇందుకు అనుగుణంగా ఆప్రాంతం ఉండాలి. నీటి వసతి ఉండే ప్రాంతంగా ఉంటేనే స్మార్ట్ సిటీ ఎంపికకు అర్హత పొందుతుంది. -
ఈ మౌనం ఖరీదు రూ.2000 కోట్లు
పార్టీకి, ప్రభుత్వానికి ప్లస్ అవుతుందనుకుంటే ఎంతసేపైనా మాట్లాడతారు.. ప్రజలకు మైనస్ అవుతోందని తెలిసినా పాలకులు మౌనంగా ఉంటున్నారు. మేధావుల మౌనంతో సమాజంలో చైతన్యం చిన్నబోతుంది... అదే పాలకులు మౌనంగా ఉంటే అభివృద్ధే ఆగిపోతుంది. అభివృద్ధిలో అగ్రగాములుగా నిలిచేందుకు సున్నా నుంచి మొదలుపెట్టామని చెబుతున్నా ఆ దిశగా సాగేందుకు అందివచ్చిన అవకాశాలను జారవిడుచుకుంటూ మౌనంగా ఉంటున్నారెందుకు? ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అధికారాన్ని చేపట్టిన తర్వాత, ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన మాటలకు.. చేతలకు పొంతనే లేకపోతే ఎలా? స్మార్ట్ సిటీల విషయంలో చంద్రబాబు చెప్పిన మాటలన్నీ ప్రగల్భాలే అనుకోవాల్సి వస్తోంది. రాష్ట్రానికి 14 స్మార్ట్ సిటీలను తెస్తామన్నారు. అంత కాకపోయినా మన జనాభా ప్రాతిపదికన కనీసం 7 స్మార్ట్ సిటీలు రావాలి. అయితే కేంద్రం 4 స్మార్ట్ సిటీలను ఇచ్చేందుకు ముందు సిద్ధమైంది. తీరా ప్రకటించే నాటికి 3 మాత్రమే దక్కాయి. కార్యరూపం దాలిస్తే కనీసం ఒక్కటైనా మిగులుతుందో? లేదో? సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర, పట్ణణ జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనిష్ఠంగా 12 స్మార్ట్ సిటీలను కేటాయించాలి. వాటిల్లో నవ్యాంధ్రకు కనీసం ఏడింటిని మంజూరు చేయాలి. కానీ.. రాష్ట్రానికి కేంద్రం మూడింటిని మాత్రమే కేటాయించింది. స్మార్ట్ సిటీల కేటాయింపులో రాష్ట్రానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉలకడం లేదు.. పలకడం లేదు. మొదట్లో స్మార్ట్ సిటీలపై ఊదరగొట్టిన చంద్రబాబు ప్రస్తుతం వాటి ఊసేత్తడం లేదు. కేంద్రం వివక్ష వల్ల రాష్ట్రం కనిష్ఠంగా రూ.2వేల కోట్లకు పైగా నష్టపోతోంది. రాష్ట్రంఎలా నష్టపోయిందంటే? స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు కేంద్రం 50 శాతం, రాష్ట్రం 25 శాతం, సంబంధిత నగర, పురపాలక సంస్థ 25 శాతం నిధులను వెచ్చించాలి. కేంద్రం తొలి ఏడాది రూ.200 కోట్లు.. ఆ తర్వాత మూడేళ్లపాటూ ఒక్కో స్మార్ట్ సిటీకి ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున విడుదల చేస్తుంది. అంటే ఒక్కో స్మార్ట్ సిటీకి నాలుగేళ్లలో రూ.500 కోట్లను కేంద్రం విడుదల చేస్తుందన్న మాట! ఈ లెక్కన కేంద్రం నుంచి రాష్ట్రం రూ.రెండు వేల కోట్లకుపైగా నిధులను కోల్పోవడమే కాకుండా అనేక నగరాలు అభివృద్ధికి దూరమవుతాయి. ముందుగా తెలిసే దాటవేత! దేశవ్యాప్తంగా వంద స్మార్ట్‌సిటీలను ఎంపిక చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఏపీకి మూడు మెగా సిటీలతోపాటు 14 స్మార్ట్ సిటీలను సాధిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో విజయవాడ, కర్నూలు, గుంటూరు, చిత్తూరులను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిందంటూ తొమ్మిది నెలల క్రితమే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందింది. అప్పటి నుంచే స్మార్ట్ సిటీ, మెగా సిటీ జపాన్ని ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా పక్కన పెట్టారని చెబుతున్నారు. అయితే ‘స్మార్ట్ సిటీ మిషన్’ప్రారంభించే సమయానికి నాలుగు కాదు కదా.. మూడింటినే కేటాయించి, కేంద్రం చేతులు దులుపుకుంది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా... కేంద్రంలో భాగస్వామి పార్టీగా కొనసాగుతూ కూడా స్మార్ట సిటీల విషయంలో ఏపీ ప్రజలకు నష్టం కలుగుతున్నా చూస్తూ ఉండిపోయింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నీరుగార్చిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక చేసిన వాగ్దానాలనూ పక్కన పెట్టారనడానికి ఇదో ఉదాహరణ. ‘స్మార్ట్’కు పది ప్రమాణాలు 1. ప్రజలకు అవసరమైన మేరకు నీటి సరఫరా 2. నిరంతర విద్యుత్ సరఫరా 3. ఘన వ్యర్థాల నిర్వహణతో కూడిన పారిశుద్ధ్యం 4. ట్రా‘ఫికర్’లేని రవాణా వ్యవస్థ 5. అందరికీ పక్కా ఇళ్లు 6. డిజిటలైజేషన్, వంద శాతం ఐటీ కనెక్టవిటీ 7.ప్రజల భాగస్వామ్యంతో ఈ-గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ 8. పరిశుభ్రమైన వాతావారణం 9. ప్రజలకు ప్రధానంగా మహిళలు, పిల్లలకు భద్రత 10. మెరుగైన విద్య, వైద్యం -
హడావుడి ఫుల్.. అభివృద్ధి నిల్
సాక్షి ప్రతినిది, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పడి నేటికి ఏడాది పూర్తయింది. అయితే ఎక్కడా అభివృద్ధి పనులు జరిగిన దాఖలాలు కనిపించలేదు. కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. అయితే పాలకపక్షం అనుకున్న పనుల్లో ఒక్కటైతే సాధించగలిగారని... అది కమిషనర్ చక్రధర్బాబుని బదిలీ చేయించడమంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యధిక డివిజన్లను దక్కించుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీడీపీ దొడ్డిదారిన మేయర్, మరికొందరు కార్పొరేటర్లను లాక్కుని పీఠం మాదేనని చెప్పుకున్నారు. ఇదేమి అన్యాయం అని పలువురు ప్రశ్నిస్తే.. నగర అభివద్ధి కోసమే పార్టీ మారానని మేయర్ అజీజ్ సాకులు చెప్పుకొచ్చారు. అదేవిధంగా టీడీపీ నేతలు సైతం అదే చెప్పి అపవాదు నుంచి బయటపడేందుకు యత్నించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది.. అదేవిధంగా సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉన్నారని.. ఈ దెబ్బతో నెల్లూరు రూపురేఖలు మారిపోతాయని అంతా భావించారు. ఇదే క్రమంలో అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రకటనలతో హడావుడి చేస్తూ జనాన్ని మభ్యపెట్టారు. ఏదీ స్మార్ట్‌సిటీ..? భారత దేశంలోనే నెల్లూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.. ఇటు రాష్ట్రమంత్రి నారాయణతో పాటు సాక్షాత్తు సీఎం చంద్రబాబే ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. అందులోభాగంగా నెల్లూరును ‘స్మార్ట్ సిటీ’ చేస్తామన్నారు. అదే విధంగా ‘నుడా’గా మారుస్తామన్నారు. ఇకపోతే దర్గామిట్టలోని స్వర్ణాల చెరువు చుట్టూ ‘నెక్లెస్ రోడ్డు’ను నిర్మిస్తామని ప్రకటనలు చేశారు. వీటిలో ఇప్పటివరకు ఏ ఒక్కటీ తెరపైకి రాలేదు. స్మార్ట్‌సిటీ లేదని తేలిపోయింది. నుడా ప్రతిపాదన కూడా అదేదారిలో దాటవేస్తారా?లేదా? అనేది తెలియాల్సి ఉంది. నెక్లెస్ రోడ్డు ప్రతిపాదనలకే పరిమితమైంది. అదేవిధంగా నగరంలో పారిశుధ్యం గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. స్వచ్ఛనెల్లూరును ప్రారంభించినా ఆ దిశగా పాలకవర్గం కృషిచేసిన దాఖలాలు లేవు. ఎక్కడ వేసిన చెత్త అక్కడే నిల్వ ఉంది. అదేవిధంగా మురికి కాలువల్లో పూడికతీతను పట్టించుకోలేదు. అరకొరగా తీసి.. పూర్తిస్థాయిలో పూడిక తీస్తున్నట్లు లెక్కలు చూపి నిధులు నొక్కేస్తున్నట్లు విమర్శలున్నాయి. నగరమంతా దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో దోమల ఉత్పత్తి పెరిగిపోయింది. వాటి నివారణకు ఫాగింగ్ చేయాల్సి ఉన్నా.. పాలకవర్గం పట్టించుకోలేదు. దీంతో సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ సొంత నిధులతో నగరంలో పలుచోట్ల ఫాగింగ్ చేయిస్తున్నారు. అధికారపార్టీ నేతల్లో మాత్రం చలనలేకపోవటం గమనార్హం. పడకేసిన పాలన కార్పొరేషన్లో పాలన సైతం పడకేసింది. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి మూడునెలలకొకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉంది. తమ తప్పులను ప్రతిపక్ష పార్టీ నేతలు ఎక్కడ నిలదీస్తారోనని భయంతో కౌన్సిల్ సమావేశాలు పెట్టేందుకు భయపడుతున్నారు. ఇప్పటివరకు నాలుగు సమావేశాలు నిర్వహించాల్సి ఉంటే.. కేవలం రెండింటికే పరమితమయ్యారు. అదేవిధంగా కీలకమైన స్టాండింగ్ కమిటీ ఎన్నికైనా.. ఇప్పటివరకు ఎటువంటి సమావేశాలు నిర్వహించకపోవటం గమనార్హం. దీంతో నగర అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. ఇకనైనా నగర అభివృద్ధిపై దృష్టిసారించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
3 ప్రాజెక్టులు.. 4 లక్షల కోట్లు
స్మార్ట్ సిటీలు, అమృత్, అందరికీ ఇళ్ల ప్రాజెక్టులకు నేడు శ్రీకారం ♦ మూడు మెగా ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించనున్న మోదీ ♦ హౌసింగ్ మిషన్ లోగోను ఆవిష్కరించనున్న ప్రధాని ♦ ఇది కొత్త పట్టణ శకానికి నాంది: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ♦ మూడు పథకాలపై రెండు రోజుల వర్క్‌షాపు న్యూఢిల్లీ: నగర భారతాన్ని సమూలంగా మార్చే దిశగా స్మార్ట్ సిటీలు సహా మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. వంద స్మార్ట్ నగరాలు, అటల్ మిషన్ ఫర్ రిజెనువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్(అమృత్), పట్టణ ప్రాంతాల్లో 2022 నాటికి అందరికీ ఇళ్లు పథకాలకు సంబంధించి మార్గదర్శకాలను ప్రధాని విడుదల చేయనున్నారు. అలాగే హౌసింగ్ మిషన్‌కు సంబంధించిన లోగోను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ మూడు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 4 లక్షల కోట్లను ఖర్చుచేయనుంది. ఈ పథకాల మార్గదర్శకాలను రూపొందించడానికి కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థలతో ఏడాదికిపైగా చర్చలు జరిపింది. వీటిపై ప్రధాని మోదీ పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ.. అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారని పట్టణాభివృద్ధి శాఖ వర్గాలు తెలిపాయి. వంద స్మార్ట్ సిటీల ప్రాజెక్టు కోసం రూ. 48 వేల కోట్లు, అమృత్ కోసం రూ.50 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ గ్రాంటుగా ఐదేళ్ల పాటు అందజేయనున్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుకు వచ్చే ఏడేళ్లలో సుమారు రూ.3 లక్షల కోట్ల ఖర్చుతో మురికివాడల్లో నివసించేవారు, ఆర్థికంగా బలహీనవర్గాలవారు, అల్పాదాయ వర్గాల వారికి సుమారు 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. వీరికి ఒక్కొక్కరికీ రూ.2.3 లక్షల చొప్పున సబ్సిడీగా అందించనున్నారు. ఈ మూడు పథకాలు కొత్త పట్టణ శకానికి నాంది అని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ పథకాలను అమలు చేయడంలో రాష్ట్రాలు, స్థానిక సంస్థలు కీలక భూమిక పోషించనున్నాయన్నారు. స్మార్ట్ సిటీల పథకంలో భాగంగా ఎంపిక చేసిన వంద నగరాల్లో 24 గంటలు నీరు, విద్యుత్, ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థల ఏర్పాటు, మెరుగైన విద్యా వ్యవస్థ, వినోద సౌకర్యాలు, ఈ గవర్నెన్స్, పర్యావరణహిత వాతావరణ మొదలైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టును పీపీపీ మోడల్లో చేపడతామన్నారు. అమృత్ పథకం ద్వారా లక్ష జనాభా దాటిన 500 నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికీ నీటి సౌకర్యం, మెరుగైన వ్యర్థాల నిర్వహణ, మెరుగైన రవాణా సదుపాయం మొదలైన అంశాలపై దృష్టి పెడతామన్నారు. ఈ మూడు పథకాల మార్గదర్శకాల విడుదల అనంతరం రెండు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌లో సుమారు వెయ్యి మంది వివిధ రాష్ట్రాల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ దేశాల ప్రతినిధులు పాలుపంచుకుంటారని చెప్పారు. -
నగరాలకు మంచి రోజులు
ఈ నెల 25న స్మార్ట్ సిటీ, అమృత్ ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ * 98 వేల కోట్లతో 100 స్మార్ట్ సిటీలు, 500 అమృత్ నగరాల అభివృద్ధి న్యూఢిల్లీ: పెరుగుపోతున్న జనాభాతో సరైన సౌకర్యాలు లేక అల్లాడుతున్న నగరాల రూపురేఖలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. దీనికోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రూ.98 వేల కోట్లతో స్మార్ట్ సిటీ, అమృత్ ప్రాజెక్టు పథకాలను ఈనెల 25న ప్రారంభించనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ రెండు భారీ ప్రాజెక్టుల అమలు కోసం మార్గదర్శకాలనూ మోదీ ప్రకటించనున్నారు. స్మార్ట్ సిటీ కింద 100 నగరాలను, అమృత్ ప్రాజెక్టు కింద 500 నగరాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర కేబినెట్ గతంలోనే ఆమోదం తెలపడం తెలిసిందే. స్మార్ట్ సిటీ, అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) ప్రాజెక్టులను విజ్ఞాన్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, మేయర్ల సమక్షంలో మోదీ ఆవిష్కరిస్తారు. ‘నగరాభివృద్ధిలో జూన్ 25 చాలా ముఖ్యమైన దినం. ఆ రోజు నుంచి కేంద్రం, ఇతర మార్గాల నుంచి భారీగా వచ్చే పెట్టుబడులను సక్రమంగా వినియోగించడం రాష్ర్ట ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు సవాల్‌గా మారనుంది’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పీటీఐతో చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల ముఖ్యాంశాలు... * 100 స్మార్ట్ సిటీలకు రూ.48 వేల కోట్లు, 500 అమృత్ నగరాలకు రూ.50 వేల కోట్లు కేటాయిస్తారు. స్మార్ట్ సిటీల్లో తొలిదశలో 20, రెండో దశలో 40, మూడో దశలో 40 నగరాలను చేపడతారు. ఏ రాష్ట్రంలో ఎన్ని నగరాలను ఎంపిక చేస్తారో, ఎన్ని నిధులను కేటాయిస్తారో 25న మోదీ చెబుతారు. స్మార్ట్ సిటీ లక్ష్యం: పరిశుభ్ర, ఆహ్లాదకర నగర జీవనం. 24 గంటల నీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, ప్రజారవాణా, పేదలకు అందుబాటు ధరలో ఇళ్లు తదితరాలు. అమృత్ ప్రాజెక్టు లక్ష్యం: మౌలిక అవసరాలైన నీటిసరఫరా, మురుగునీటి వ్యవస్థ, వరద నీటి ప్రవాహం, రవాణా, పార్కుల అభివృద్ధి, చిన్నారుల అవసరాలను తీర్చడం. జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఉన్న పథకాన్ని మాజీ ప్రధాని వాజ్‌పేయి (అమృత్) పేరుతో తీసుకొస్తున్నారు. -
ఆ ప్రాజెక్టులన్నీ ‘స్విస్ చాలెంజ్’లోనే
9 రంగాల్లో ‘ప్రైవేటు’ పెత్తనం మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులన్నీ అయినవాళ్లకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం సర్కారు తాజా జీవో జారీ హైదరాబాద్: రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రాజెక్టులన్నింటినీ అయినవాళ్లకే కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొత్త రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్ధి చట్టం-2001 పరిధిలో ఉన్న స్విస్ చాలెంజ్ పద్ధతిని ఎంపిక చేసిన రాష్ట్రప్రభుత్వం ఆ చట్టం పరిధిలో అత్యంత కీలకమైన మరో తొమ్మిది రంగాలను కూడా చేర్చింది. తద్వారా ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న కీలకమైన ఈ తొమ్మిది రంగాల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను సైతం స్విస్ చాలెంజ్ పద్ధతిలోనే ఎంపిక చేయడానికి సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు తొమ్మిది రంగాలను చట్టం పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. కొత్త రాజధాని నిర్మాణంలో మాస్టర్ డెవలపర్‌గా అయినవాళ్లను ఎంపిక చేయడానికి స్విస్ చాలెంజ్ విధానాన్ని తెరమీదకు తేవడం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అతి ముఖ్యమైన ప్రాజెక్టులను సైతం దీనిపరిధిలోకి చేర్చడంద్వారా అడ్డగోలు దోపిడీకి చట్టబద్ధత కల్పించినట్లయింది. అన్నింటికీ అధికారిక ముద్ర... స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు మొత్తం తొమ్మిది రంగాలను ఎంచుకున్నారు. టెలికమ్యూనికేషన్స్, బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్ సేవలతోపాటు కొత్తగా రాష్ట్రంలో పెద్దఎత్తున వేసే ఫైబర్‌గ్రిడ్, వైఫై సర్వీసు ఏర్పాటు పనులనూ, అలాగే విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్‌తోపాటు సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టులన్నింటినీ ఈ చట్టం పరిధిలోకి చేర్చారు. అదేవిధంగా జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా నిర్వాసితులకు గృహాల నిర్మాణం, రవాణా డిపోలు, పట్టణ ప్రాంతాల్లో అంతర్గత రైల్వే ప్రాజెక్టులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనులు, స్మార్ట్‌సిటీలు, విద్యాసంస్థల ఏర్పాటు తదితర రంగాల్లో చేపట్టబోయే అన్ని ప్రాజెక్టులనూ దీనిపరిధిలోకి తీసుకొచ్చారు. అంటే ఈ రంగాల్లో ఏ ప్రాజెక్టు చేపట్టినా ఇకనుంచీ స్విస్ చాలెంజ్ పద్ధతిలోనే కట్టబెట్టడానికి రంగం సిద్ధమైనట్టే. కొత్త రాజధానిలో వివిధ ప్రాజెక్టులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు చేపట్టబోతున్న తరుణంలో అన్నింటినీ స్విస్‌చాలెంజ్ విధానంలో అప్పగించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తాజా జీవోతో విదితమవుతోంది. -
అన్ని ప్రాంతాలూ ‘మెట్రో’తో అనుసంధానం
సాక్షి,సిటీబ్యూరో: నగర సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా మెట్రో స్టేషన్లను తీర్చిదిద్దనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్లను బస్టాపులు, రైల్వే, ఎంఎంటీఎస్ స్టేషన్లతోపాటు సమీప కార్యాలయాలు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్‌కు సైడ్‌వాక్స్, స్కైవాక్స్ (నడిచే దారులు,ఆకాశ వంతెనలు)తో అనుసంధానిస్తామన్నారు. నూతన తరం స్మార్ట్‌సిటీస్ అన్న అం శంపై నగరంలోని మారియట్ హోటల్లో బుధవారం నిర్వహించిన ఓ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు చేరుకునేందుకు వీలుగా మెర్రీ గో అరౌండ్ బస్సులను నడపనున్నామని చెప్పారు. ప్రధాన రహదారులపై 8 అడుగుల విస్తీర్ణంలో స్థలాన్ని వినియోగించుకొని అదే స్థలంలో పిల్లర్లు, వయాడక్ట్ సెగ్మెంట్లు, మెట్రో కారిడార్లు, స్టేషన్లు ఏర్పాటు చేయడం ఇంజినీరింగ్ అద్భుతమన్నారు. ఒక్కో మెట్రో ట్రాక్ ఏడు బస్సు మార్గాలు, 24 కారు మార్గాలతో సమానమన్నారు. నిత్యం 35 లక్షల వాహనాలు నగర రహదారులను ముంచెత్తుతున్నాయని, ఏటా మరో నాలుగు లక్షల వాహనాలు ఈ జాబితాలో చేరుతుండడంతో ట్రాఫిక్ నరకంతో నగరవాసులు విలవిల్లాడుతున్నారన్నారు. మెట్రో ప్రాజెక్టుతో ట్రాఫిక్ ఇక్కట్లు సమూలంగా తీరనున్నాయని తెలిపారు. -
నిత్యనూతన కెరీర్ ‘నిర్మాణం’.. ఆర్కిటెక్చర్
ఇంజనీరింగ్.. ఎన్నో కోర్సులు.. మరెన్నో బ్రాంచ్‌లు, స్పెషలైజేషన్లకు నెలవు! అయితే.. వినూత్నంగా, విభిన్నంగా, శతాబ్దాలుగా నిత్యనూతనంగా వెలుగులీనుతూ.. సమున్నత కెరీర్ అవకాశాలను అందిస్తోంది ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్! వాస్తవ అవసరాలతో పోల్చితే ప్రస్తుతం ఆర్కిటెక్చర్ ఇంజనీర్ల కొరత భారీగా ఉంది. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్న సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే నాటా-2015; అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సు, ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలపై విశ్లేషణ.. స్మార్ట్ సిటీలు, అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ప్రగతి కార ణంగా ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ నిపుణులకు డిమాండ్ ఏర్పడింది. మన దేశంలో ఏటా మూడు లక్షల మందికిపైగా ఆర్కిటెక్చర్ నిపుణులు అవసరమని అంచనా. కానీ, ఈ కోర్సు అందుబాటులో ఉన్న కాలేజీల సంఖ్య నాలుగు వందలు. వీటి నుంచి ఏటా పట్టాలతో బయటికివచ్చే వారి సంఖ్య నాలుగు వేలకు మించడం లేదు. నిపుణుల డిమాండ్-సప్లయ్‌లో తేడా దృష్ట్యా కోర్సు పూర్తిచేస్తూనే కలల కెరీర్ సౌధాలు నిర్మించుకోవడానికి ఆస్కారం కల్పిస్తోంది.. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్! ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అంటే: సింగిల్ బెడ్రూం ఇల్లు.. బహుళ అంతస్తుల నిర్మాణం.. బ్రిడ్జ్‌లు.. రహదారులు.. వేటికైనా అందుబాటులో ఉన్న వనరులతో అందమైన రీతిలో డిజైన్లు రూపొందించి నిర్మాణాలు చేపట్టేది ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్. భవంతుల డిజైన్లు, ఇంటీరియర్ డిజైన్లు, నగర నిర్మాణాలు చేపట్టడంలో ఆర్కిటెక్చర్ ఇంజనీర్లది ప్రధాన పాత్ర. వారిచ్చిన బ్లూ ప్రింట్స్ ఆధారంగానే ఆయా నిర్మాణాలు ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటాయి. దీనికి అవసరమైన నైపుణ్యాలు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ద్వారా లభిస్తాయి. బీఆర్క్.. కెరీర్ దిశగా తొలి అడుగు: ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో కెరీర్ కోరుకునే వారికి తొలి అడుగు.. అయిదేళ్ల బీటెక్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్. ప్రస్తుతం మన దేశంలో ఐఐటీలు, ఎన్ఐటీలు సహా దాదాపు నాలుగు వందల ఇన్స్టిట్యూట్లలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఐఐటీలు, ఎన్ఐటీలు జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇతర ఇన్స్టిట్యూట్లు నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్- నాటాలో ర్యాంకు ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నాయి. దేశంలోని ఆర్కిటెక్చర్ కళాశాలలను పర్యవేక్షించే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతుంది. ఎన్ఐటీలు, ఐఐటీల్లో ఇలా: దేశంలో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ; ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలలో అందుబాటులో ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో ప్రవేశించడానికి ప్రత్యేక విధానం అమలవుతోంది. ఎన్ఐటీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ రెండో పేపర్‌కు హాజరై ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఐఐటీల్లోని బీ.ఆర్క్ కోర్సులో ప్రవేశించాలంటే జేఈఈ అడ్వాన్స్డ్ తర్వాత ప్రత్యేకంగా నిర్వహించే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు హాజరు కావాలి. ఈ ఏడాది ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ జూన్ 21న జరగనుంది. దీనికి అభ్యర్థులు నిర్దేశ తేదీల్లో ప్రత్యేకంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వివరాలకు వెబ్సైట్: jeeadv.iitm.ac.in స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (్కఅ) ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సుల విషయంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూట్లు ప్రత్యేకం గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ, భోపాల్, విజయవాడలలో ఉన్న ఈ క్యాంపస్‌లలో బీఆర్క్ కోర్సులలో ప్రవేశాల ను జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు. ్కఅ.. పీజీ కోర్సులు కూడా: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ క్యాంపస్‌లలో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2015-16 పీజీ కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్; అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్; సస్టెయినబుల్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లు ఎస్పీఏ విజయవాడ క్యాంపస్‌లో అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, భోపాల్ క్యాంపస్‌లలో ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్, అర్బన్ డిజైన్; ఇండస్ట్రియల్ డిజైన్; బిల్డింగ్ ఇం జనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ల్యాండ్ స్పేస్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ్కఅ విజయవాడ ప్రవేశాల వివరాలు: ఈ క్యాంపస్‌లో ప్రతి స్పెషలైజేషన్‌లో 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పది సీట్లను నిట్- రూర్కెలా నిర్వహించే సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ విధానం ద్వారా భర్తీ చేస్తారు. మిగతా పది సీట్ల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ప్రవేశార్హత వివరాలు.. ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, అర్బన్ ప్లానింగ్ అర్హత: సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ఫర్ ఎంటెక్/ ఎం.ప్లాన్/ఎం.ఆర్క(సీసీఎంటీ) ద్వారా ప్రవేశం కోరుకుం టే బీఆర్క్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్, బీఈ (సివిల్) ఇంజనీరింగ్‌లలో ఉత్తీర్ణతతోపాటు గేట్ స్కోర్ తప్పనిసరి. ఈ టెక్నికల్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు నేరుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రెండు స్పెషలైజేషన్లకు జాగ్రఫీ, ఎకనామిక్స్, సోషియాలజీలలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు కూడా అర్హులే. సస్టెయినబుల్ ఆర్కిటెక్చర్: ఈ స్పెషలైజేషన్‌లో కూడా పది సీట్లను సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ విధానం ద్వారా భర్తీ చేస్తారు. మిగతా పది సీట్లకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలంటే.. 60 శాతం మార్కుల తో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ పరిధిలోలేని సీట్లకు గేట్ స్కోర్ లేని విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.spav.ac.in ప్రామాణికం.. నాటా స్కోర్ ఎన్ఐటీలు, ఐఐటీలు మినహాయిస్తే దేశంలోని మిగతా అన్ని ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నాటాలో పొందిన స్కోర్ ప్రామాణికంగా నిలుస్తోంది. ఈ టెస్ట్‌ను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహిస్తుంది. 2015-16 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించినాటా నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత: ఎంపీసీ గ్రూప్‌లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. పరీక్ష స్వరూపం: నాటా రెండు విభాగాలుగా ఉంటుంది. అవి.. పేపర్ బేస్డ్ విధానంలో డ్రాయింగ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈస్థటిక్ సెన్సిటివిటీ టెస్ట్. రెండు గంటల వ్యవధిలో ఉండే డ్రాయింగ్ టెస్ట్‌లో అభ్యర్థిలోని సృజనాత్మక నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఏదైనా ఒక అంశాన్ని లేదా సందర్భాన్ని పేర్కొని, దానికి అనుగుణంగా చిత్రాన్ని రూపొందించమంటారు. ఈస్థటిక్ సెన్సిటివిటీ టెస్ట్‌లో అభ్యర్థుల్లోని పరిశీలనాత్మక దృక్పథం, సృజనాత్మకత, ఆర్కిటెక్చర్ అవేర్నెస్, ఇమాజినేషన్ వంటి నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందులో మొత్తం 40 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఇలా మొత్తం రెండు వందల మార్కులకు ఉండే ఈ పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు పొందితేనే కౌన్సెలింగ్/ప్రవేశ ప్రక్రియకు పరిగణనలోకి తీసుకుంటారు. పరీక్ష తేదీలు: నాటా పరీక్ష ఏప్రిల్ 1, 2015 నుంచి మే 25, 2015 వర కు అదే విధంగా జూన్ 1, 2015 నుంచి ఆగస్ట్ 21, 2015 వరకు రెండుసార్లు నిర్ణీత స్లాట్లలో జరుగుతుంది. అభ్యర్థులు తమకు అందుబాటులోని స్లాట్లలో పరీక్షకు ఎన్నిసార్లయినా హాజరు కావచ్చు. నాటా విషయంలో విద్యార్థులకు ఉన్న ప్రత్యేక వెసులుబాటు ఇది. ఒక స్లాట్‌లో తక్కువ స్కోర్ వచ్చినా మరో స్లాట్‌ను ఎంపిక చేసుకుని మెరుగైన స్కోర్ పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. నాటా టెస్ట్ సెంటర్లు: ఆంధ్రప్రదేశ్‌లో భీమవరం, విశాఖపట్నంలలో; తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో టెస్ట్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమకు నచ్చిన టెస్ట్ సెంటర్లో పరీక్షకు హాజరు కావచ్చు. వివరాలకు వెబ్సైట్: ఠీఠీఠీ.్చ్ట్చ.జీ ‘ఉన్నత విద్య’తో మరింత ఉన్నతంగా ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వెంటనే కార్పొరేట్ కొలువులు స్వాగతం పలకడం ఖాయంగా మారింది. అయితే పీజీ చేస్తే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. పీజీ స్థాయిలో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో అందుబాటులో ఉన్న ముఖ్య స్పెషలైజేషన్లు - ఆర్కిటెక్చర్; అర్బన్ డిజైన్; ల్యాండ్ స్కేప్ ఇంజనీరింగ్; ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్; బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్; అర్బన్ అండ్ రీజనల్/సిటీ ప్లానింగ్; ఇండస్ట్రియల్ డిజైన్/ప్రొడక్ట్ డిజైన్; అర్బన్ డిజైన్. ప్రారంభంలోనే లక్షల వార్షిక ప్యాకేజీలు ఆర్కిటెక్చర్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ప్రారంభంలోనే రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వార్షిక ప్యాకేజీలతో ఆఫర్లు అందుతున్నాయి. మౌలిక సదుపాయాల సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు, కార్పొరేట్ కాంట్రాక్ట్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అదే విధంగా ప్రభుత్వ రంగంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్; పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, రైల్వేస్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ తదితర శాఖల్లో సులువుగా కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అర్హతతో స్వయం ఉపాధికి కూడా విస్తృత ఆస్కారం ఉంది. సొంతంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే స్వయం ఉపాధిలో రాణించాలంటే.. సబ్జెక్ట్ నైపుణ్యంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎంతో అవసరం. కొంత పని అనుభవం గడించాక స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడం మంచిదని నిపుణుల అభిప్రాయం. -
స్మార్ట్ సిటీలతో 40 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్మార్ట్ సిటీస్‌తో ఐటీ రంగానికి వచ్చే 5-10 ఏళ్లలో 30-40 బిలియన్ డాలర్ల మేర వ్యాపార అవకాశాలు లభించగలవని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తెలిపింది. స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం కేంద్రం రూ. 48,000 కోట్లు కేటాయించింది. ప్రతిపాదిత 100 స్మార్ట్ సిటీల్లో ఒక్కొక్క దానికి వార్షికంగా అయిదేళ్ల పాటు రూ. 100 కోట్ల మేర కేంద్ర నిధులు లభించనున్నాయి. స్మార్ట్ సిటీలకు లభించే నిధుల్లో కనీసం 10-15 శాతాన్ని ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై (ఐసీటీ) వెచ్చించిన పక్షంలో ఐటీ కంపెనీలకు కనీసం 30-40 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు లభించగలవని అంచనా వేస్తున్నట్లు నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. స్మార్ట్ సిటీల నిర్మాణంలో ఐసీటీ పాత్ర గురించి నాస్కామ్ రూపొందించిన నివేదికను మే 21న ఢిల్లీలో జరిగే స్మార్ట్ సిటీ ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్నట్లు ఆయన వివరించారు. -
‘స్మార్ట్ సిటీ’లకు సహకరించండి
ఏడీబీకి అరుణ్ జైట్లీ విజ్ఞప్తి బకూ/న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్ సిటీలు, పారిశ్రామిక కారిడార్లు, రైల్వేలు, మౌలిక రంగాల అభివృద్ధికి తద్వారా ఉపాధి కల్పనకు సన్నిహిత సహకారం అందించాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)కు విజ్ఞప్తి చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్కిల్ డెవలప్మెంట్’ కార్యక్రమాల ద్వారా ఆయా రంగాల అభివృద్ధికి భారత్ గట్టి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా అన్నా రు. అజర్బైజాన్ రాజధాని బకూలో శనివారం ప్రారంభమైన నాలుగు రోజుల 48వ ఏడీబీ వార్షిక సమావేశాల్లో పాల్గొంటున్న జైట్లీ, ఈ సందర్భంగా ‘ఫస్ట్ బిజినెస్ సెషన్’లో మాట్లాడారు. ముఖ్యాంశాలు... ⇒ 2015, 2016ల్లో 7.5 శాతం నుంచి 8 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందని భారత్ భావిస్తోంది. భారత్ పటిష్ట వృద్ధిలో పయనిస్తోందనడానికి ఇది సంకేతం. అధికారంలోకి వచ్చిన కేవలం సంవత్సరం లోపే ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు మా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ⇒ భారత్ వృద్ధి రేటును పటిష్టంగా, స్థిరంగా కొనసాగించడం మా ప్రధాన లక్ష్యం. మౌలిక వృద్ధి, నైపుణ్యం పెంపుదల, వ్యాపార అవకాశాల మెరుగుదలకు చర్యలు, ఆర్థిక సంస్కరణల ద్వారా పటిష్ట వృద్ధి లక్ష్యాన్ని భారత్ కోరుకుంటోంది. ⇒ 2020 నాటికి ఏడీబీ వార్షిక వ్యాపారం 20 బిలియన్ డాలర్లకు పెరగాలి. ఇది ఏడీబీకి ఒక కార్పొరేట్ లక్ష్యం కావాలి. ఏడీబీ కార్యకలాపాలు పెరగడమేకాదు, ఆయా కార్యకలాపాల ద్వారా ఒనగూడే ప్రయోజనాలు సైతం పెరగాలి. 2014లో ఏడీబీ మొత్తం రుణాలు, గ్రాంట్స్ విలువ 13.5 బిలియన్లు. ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌ను చూస్తే... ఈ పరిమాణం 9 బిలియన్ డాలర్లు. ⇒ ఏడీబీకి భారత్ అతిపెద్ద భాగస్వామి. ఈ భాగస్వామ్యం మరింత ముందుకు సాగాలి. -
స్మార్ట్ సిటీ@నీలగిరి..!
నల్లగొండ మున్సిపాలిటీకి మహర్దశ ఐదేళ్ల పాటు ఏటా రూ.100 కోట్లు వచ్చే అవకాశం ఇక నూరు శాతం మౌలిక సదుపాయాలు సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగ్ కమిటీ ద్వారా అభివృద్ధి పనులు నల్లగొండ: జిల్లా కేంద్ర మున్సిపాలిటీకి మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయనున్న స్మార్ట్ సిటీలలో నీలగిరి మున్సిపాలిటీ ముందంజలో ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే నీలగిరి మున్సిపాలిటీని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ఎంపిక చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన జీఓ అధికారికంగా వెలువడడమే తరువాయిగా మిగిలింది. ఇటీవల కాలంలో జిల్లాలోనే ఈ మున్సిపాలిటీ అత్యంత వేగంగా విస్తరించింది. నల్లగొండ మున్సిపాలిటీ మొత్తం 105 స్క్వైర్ కిలోమీటర్ల వరకు విస్తరించింది. ప్రతి ఏడాది రూ.100 కోట్లు విడుదల నీలగిరి మున్సిపాలిటీ స్మార్ట్ సిటీగా ఎంపికైతే దీని రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం అన్ని రకాల మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక కార్యచరణ తయారు చేయనున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఏడాది పాటు సర్వే చేసి పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలు తయారు చేయనున్నారు. పట్టణంలో ఏఏ అభివృద్ధి పనులు చేపట్టాలనే దానిపై పూర్తి నివేదిక రూపొందించుకుని దాని ప్రకారం ముందుకు సాగే అవకాశం ఉంది. పట్టణంలో ఎక్కడ ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించాలి ... 24 గంటల పాటు తాగునీరు ఎలా అందించాలి ... రోడ్లు, పట్టణ శివారు నుంచి ఔటర్ రింగ్ రోడ్ లాంటి పనులు చేపట్టడానికి కార్యచరణ తయారు చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది. ఐదేళ్ల పాటు ఈ నిధులు విడుదల చేసి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు వంద శాతం మౌలిక వసతులు కల్పించనున్నారు. అక్రమాలకు చెక్ ... స్మార్ట్ సిటీగా మారగానే మున్సిపాలిటీ కార్యాలయంలో కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు చెక్ పడనుంది. ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేసి మున్సిపాలిటీ ఆదాయం పెంచడంతో పాటు పారదర్శకతకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నల్లా కనెక్షన్లు, ఆస్తిపన్నుల రికార్డులు, పన్నుల వసూళ్లు, ఇంజనీరింగ్ విభాగం పనుల వివరాలు ఇలా అన్ని ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే కోట్ల రూపాయల నిధులు పారదర్శకతతో చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీ అంతా రాష్ట్ర ప్రభుత్వ కో ఆర్డినేషన్‌తో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేయనున్నట్లు సమాచారం. -
స్మార్ట్ కరీంనగర్
టవర్‌సర్కిల్ : ఎన్టీయే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత దేశంలోని వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి, ఆ దిశగా అడుగులేస్తోంది. గతేడాది జూలైలో కేంద్రం స్మార్ట్‌సిటీల సన్నాహక జాబితా విడుదల చేసింది. జాబితాలో తెలంగాణలోని ఐదు సిటీలుండగా అందులో కరీంనగర్ పేరును పొందుపరిచారు. అయితే తెలంగాణలోని రెండు సిటీలను మాత్రమే స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడి ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నగరానికి స్మార్ట్‌సిటీ హోదా తీసుకురావడం కోసం ప్రయత్నిస్తామని చెప్పడంతో నగర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్మార్ట్‌సిటీల జాబితాల్లో కరీంనగర్‌ను కూడా ఎంపిక చేశా రు. కరీంనగర్‌తోపాటు హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, ని జామాబాద్ కూడా స్మార్ట్ సిటీ జాబితాలో చోటు దక్కించుకున్నారుు. నిధుల వరద స్మార్ట్‌సిటీగా ఎంపికైతే నగరం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ప్రఖ్యాత నగరాలకు దీటుగా తీర్చిదిద్దుతారు. నగరం మొత్తం శాటిలైట్ అనుసంధానంగా, వైఫై నగరంగా మారుతుంది. ఇంటి పన్నులు రెండిం తలుగా పెరుగుతాయి. అన్ని రంగాల్లో నగరం అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పెరుగుతాయి. ఇందుకోసం కేంద్రం నుం చి దశల వారీగా రూ.వెయ్యి కోట్ల వరకు నిధులు వస్తాయని తెలుస్తోంది. పారి శుధ్యం, రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినే జీ, నిరంతర నీటి సరఫరా వంటి మౌ లిక సదుపాయాలు మెరుగుపడతాయి. నెరవేరనున్న కల స్మార్ట్‌సిటీ హోదా దక్కుతుందనే నమ్మకంతోనే అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీని పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖత చూపించినట్లు తెలుస్తోంది. గతంలో మంజూరు చేసిన రూ.77 కోట్లకు మరో రూ.50 కోట్లు అదనంగా నిధులను మంజూరు చేసి యూజీడీని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. అందుకు తగ్గట్టుగానే పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్అండ్బీ రోడ్ల పునర్నిర్మాణం కోసం రూ.46 కోట్ల నిధులను సీఎం మంజూరు చేశారు. ఇక స్మార్ట్‌సిటీ హోదా దక్కితే నగరం రూపురేఖలు మారనున్నాయి. స్మార్ట్ సిటీ హోదా విషయమై స్థానిక కార్పొరేషన్ అధికారులకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిసింది. -
ఓరుగల్లు సిగలో స్మార్ట్ కిరీటం
ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ నగరాల సరసన వరంగల్ కేంద్ర నిధులు రూ.70 కోట్లు వచ్చే అవకాశం మారనున్న నగర రూపరేఖలు {sాఫిక్, విద్యుత్ కష్టాలకు చెక్ ఎకోఫ్రెండ్లీ సిటీగా రూపాంతరం {పజాప్రతినిధులు, నగర వాసుల హర్షం ఓరుగల్లుకు అరుదైన గౌరవం దక్కింది. స్మార్ట్ సిటీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 నగరాల్లో తొలి విడత జాబితాలో చోటు సంపాదించింది. ఇక ఓరుగల్లు రూపు రేఖలు.. దిశదశ మారనుంది. అద్దం వంటి రహదారులు, ఆహ్లాదాన్నిచ్చే పచ్చదనం, నగరమంతా వైఫై సౌకర్యం, అవాంతరాల్లేని విద్యుత్ సరఫరా, వేగవంతమైన ప్రజా రవాణా, ప్రత్యేక ప్రాంతాల్లో చిరు వ్యాపారులు, ఈ-విధానంలో కార్యకలాపాలు, కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్, మళ్లింపునకు రింగ్ రోడ్లు, వినోదానికి పార్కులు, మల్టీలెవల్ పార్కింగ్, జీపీఎస్ ట్రాకింగ్, గ్రీన్ బిల్డింగ్‌లకు ప్రోత్సాహం, కాలుష్యం లేని వాతావరణం ఇలా మన నగరం స్మార్ట్‌సిటీగా అభివృద్ధి వైపు పురోగమించనుంది. - వరంగల్ అర్బన్ వరంగల్ అర్బన్ : హృదయ్ పథకంలో చోటు దక్కించుకోవడంతోపాటు గ్రేటర్ హోదా పొందిన వరంగల్ నగరం సిగలో మరో మణిహారం చేరింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకానికి ఎంపికైంది. తొలివిడతలో దేశవ్యాప్తంగా వంద నగరాలతో పోటీపడి స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొద్ది నెలలుగా స్మార్ట్‌సిటీలపై ముమ్మరమైన కసరత్తు చేపట్టింది. ఓరుగల్లుకు స్మార్ట్ అర్హతలపై మహా నగర పాలక సంస్థ అధికారులు పలుమార్లు నివేదికలు సమర్పించారు. ఓరుగల్లు విశిష్టతలు, నగరానికి ఉన్న అర్హతలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. ఎట్టకేలకు కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో ఐదు స్మార్ట్ సిటీలను ఎంపిక చేయగా... ఇందులో వరంగల్ నగరం స్మార్ట్ సిటీ హోదా ఖరారైంది. దీంతో ప్రజాప్రతినిధులు,అధికారులు, నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారనున్న ఓరుగల్లు దశాదిశ స్మార్ట్‌సిటీతో ఓరుగల్లు దశాదిశ మారనుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఆధునిక నగర నిర్మాణానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లభించనున్నాయి. ప్రజల విద్య, వైద్య, ఆరోగ్య జీవన ప్రమాణాలు సహా పరిపాలన పరమైన సేవలన్నీ జాతీయ స్థాయిలో ఉండేలా నగరాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు కేంద్రం రూ.70 కోట్ల నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ట్రాఫిక్, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, బిల్డింగ్స్, కమ్యూనికేషన్స్, ట్రాన్పొర్టేషన్ విభాగాల్లో మార్పులు సంభవించనున్నారుు. వీటికి అనుబంధంగా ఇతర అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపట్టే అవకాశం ఉంది. స్మార్ట్‌సిటీ ప్రణాళిక రూపకల్పనలో నగర మేయర్, కమిషనర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)లు కీలక పాత్ర పోషిస్తాయి. నగరం మొత్తం వైఫై.. ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి సంబంధిత సంస్థలకు డబ్బులు చెల్లించాలి. స్మార్ట్ సిటీలోఆ బాధ ఉండదు. నగరం మొత్తం వైఫై వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. ప్రతిఒక్కరూ సెల్ఫోన్లు, ల్యాప్ టాప్ల ద్వారా నగరంలో ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ను ఉపయోగించుకునే సదుపాయం సమకూరనుంది. కాలుష్యానికి చెక్.. నగర ప్రజలు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య కాలుష్యం. స్మార్ట్‌సిటీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రీన్ బిల్డింగ్ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఈ విధానంలో భవనాలపై మొక్కలు పెంచేలా ప్రోత్సాహకాలు అందిస్తారు. కొత్తగా నిర్మించనున్న భవనాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అనువుగా ఉండాలి. అదేవిధంగా ఇంకుడుగుంతలు నిర్మించిన తర్వాతే భవనం నిర్మించేలా నిబంధనలు కఠినతరం చేస్తారు. వీటితో పాటు పగటి వేళ భవనంలోకి గాలి, వెళుతురు వచ్చే బిల్డింగ్ డిజైన్ల వైపు ప్రజలు మొగ్గు చూపేలా ప్రణాళిక రూపొందిస్తారు. నగర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, పార్కులను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తారు. ఈ పరిపాలన.. మహా నగర పాలక సంస్థ పరిధిలో పౌరసేవలు మరింత సులభమవుతాయి. పన్నుల చెల్లింపు, అనుమతులు త్వరతగతిన అందే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. స్మార్ట్ఫోన్లలో ప్రత్యేక అప్లికేషన్లు, ఫేస్బుక్, ట్విటర్, వాట్సప్ వంటి సామాజిక సైట్ల ద్వారా కూడా పౌరసేవలు పొందవచ్చు. ఇదేసమయంలో ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంపొదిస్తారు. వినియోగదారుడు బల్దియాలో పెట్టుకున్న ఆర్జీ ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా కార్పోరేషన్ ద్వారా అందుతున్న సేవలు సంతృప్తికంగా ఉన్నాయా ? లేదా ? అనే అంశాన్ని నేరుగా ఉన్నతాధికారులకు తెలియజేసే అవకాశం ఉంటుంది. ప్రజారవాణా సులభం, వేగవంతం.. నగరంలో ప్రజా రవాణా కీలకం. ఈ మేరకు వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేసేలా నిబంధనలుంటాయి. ఫలితంగా ఆయా వాహనాల గమన సమాచారం ప్రభుత్వ అధికారుల వద్ద నిక్షిప్తమవుతుంది. తద్వారా సులభంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. గ్రీన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేస్తారు. వాతావరణం ఏ మాత్రం కలుషిత ం కాకుండా చర్యలు తీసుకుంటారు. నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు. నగరంలోని ముఖ్య కూడళ్లు, రహదారుల్లో సీసీ కెమెరాలు, మైక్‌లు అమరుస్తారు. వీటి సాయం... సెంట్రల్ కంట్రోల్ స్టేషన్ ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు. ఒక పాయింట్లో ట్రాఫిక్ రద్ధీ ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించిన సమాచారాన్ని ఆ దారిలో వెళ్లే వాహనదారులకు ఎప్పటికప్పుడు చేరవేస్తారు. అంతేకాదు స్మార్ట్ఫోన్ల ద్వారా ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాహనదారులు తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఎలక్ట్రికల్ చార్జింగ్, బ్యాటరీ అధారిత వాహనాలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తారు. పెట్రోల్‌బంక్‌ల తరహాలో వెహికల్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. రహదారుల వెంట పాదచారులు నడిచేందుకు, సైకిళ్లు వెళ్లేందుకు ప్రత్యేక మార్కింగ్ వేస్తారు. నగర జీవనంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు పెద్దపీట వేస్తారు. మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అవసరం లేని వాహనాల రాకపోకలను నియంత్రించడానికి రింగు రోడ్లను అభివృద్ధి చేస్తారు. 24 గంటల పాటు విద్యుత్ నగరంలో వీధిదీపాల నిర్వహణ, విద్యుత్ సరఫరాలో పెనుమార్పులు సంభవిస్తాయి. నగరంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థను ప్రత్యేక గ్రిడ్ పరిధిలోకీ తీసుకొస్తారు. ఏ ప్రాంతంలోనైనా విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఎదురైతే తక్షణమే స్పందించే వీలుంటుంది. తక్కువ విద్యుత్‌తో ఎక్కువ వెలుగునిచ్చే అధునాతన బల్బులను వీధిదీపాలుగా ఉపయోగిస్తారు. సరఫరా నష్టాలను నివారించేందుకు స్మార్ట్ విద్యుత్ మీటర్లను బిగిస్తారు. దీని ద్వారా విద్యుత్ వినియోగాన్ని కచ్చితంగా లెక్కించే వీలుంటుంది. మెరుగైన డ్రెరుునేజీ వ్యవస్థ మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల నగరంలో చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరి రోడ్లు చెడిపోవడం, గోతులు పడడం వంటివి జరుగుతుంటాయి. స్మార్ట్‌సిటీగా ఎంపికైన తర్వాత ఇటువంటి అగచాట్లు కానరావు. నగరం పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చ ర్యల్లో భాగంగా సీనరేజీ ప్లాంట్లు నెలకొల్పే అవకాశం ఉంది. ఇలా శుద్ధి చేసిన నీటిని పార్కులు, రోడ్ల పక్కన చెట్ల నిర్వహణకు ఉపయోగిస్తారు. అదేవిధంగా క్లీన్‌సిటీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారు. తడి, పొడి చెత్తను రోడ్లపై పారబోయడం కాకుండా వీటి నుంచి విద్యుత్ ఉత్పత్తితో పాటు కార్పొరేషన్‌కు ఆదాయం సమకూర్చుకునేలా ప్రణాళిక రూపొందిస్తారు. -
మహా స్మార్ట్ సిటీగా..
♦ వేగవంతంగా ప్రాజెక్టులకు అనుమతి ♦ త్వరలో 2 వేల కొత్త బస్సులు ♦ రహదారుల అభివృద్ధికి చర్యలు ♦ అమెరికన్, నేషనల్ పెట్రోలియం యూనివర్సిటీలు రాక ♦ స్మార్ట్ సిటీ సదస్సులో ఎంఏయూడీపీఎస్ గిరిధర్ విశాఖపట్నం సిటీ : విశాఖ మహా నగరం మరి కొద్దిరోజుల్లోనే నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్లతో అభివృద్ధి చెందనుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎ.గిరిధర్ అన్నారు. నగరంలోని ఓ హోటల్ లో శుక్రవారం కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసి న స్మార్ట్ సిటీ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఓ చిన్న మత్స్యకార పల్లెగా ఉన్న విశాఖ ఇప్పుడు సకల రవాణా మార్గాలతో అధునాతన నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటైన తర్వాత నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. స్నేహపూర్వకంగా, సంప్రదాయబద్ధంగా ఎంతో హుందాగా ఇక్కడి ప్రజలు వ్యవహరిస్తుంటారని చెప్పారు. నగరంలో త్వరలోనే 24 గంటలూ నీరు, విద్యుత్, సివరేజ్ ట్రీట్మెంట్, ఇతర సదుపాయాలన్ని రానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాజెక్టులకు అనుమతిలిచ్చే ప్రక్రియను వేగవంతం చేసినట్టు వెల్లడించారు. గతంలో 21 రోజులు సమయం పడితే ఇప్పుడు కేవలం ఏడు రోజుల్లోనే అనుమతిస్తున్నట్టు స్పష్టం చేశారు. మెట్రో, బీఆర్‌టీఎస్‌తో రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. త్వరలోనే విశాఖకు 1800 నుంచి 2 వేల కొత్త బస్సులు రానున్నాయని చెప్పారు. నాణ్యమైన రోడ్లు, అమెరికన్ యూనివర్సిటీలు, నేషనల్ పెట్రోలియం యూనివర్సిటీలు రానున్నాయని చెప్పారు. కలెక్టర్ యువరాజ్ మాట్లాడుతూ విశాఖను స్మార్ట్ సిటీ చేసేందుకు అవసరమైన అనుమతులను త్వరితగతిన ఇస్తున్నట్టు చెప్పారు. అందమైన ఈ నగరం మరింత స్మార్ట్ కాబోతుందన్నారు. సీఐఐ ఏపీ చైర్మన్ చిట్టూరి సురేష్ మాట్లాడుతూ అన్ని స్మార్ట్ గ్రామాలయితే, త్వరలోనే స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అవుతుందన్నారు. స్థానిక నైపుణ్యతకు మెరుగుపెడితే మరిన్ని ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. యుఎస్ ఎంబసీ కమర్షియల్ కౌన్సిలర్ దిల్లాన్ బెనర్జీ మాట్లాడుతూ విశాఖలో ఉత్తమమైన పారిశ్రామిక సంస్థలే మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే రెండు మూడు రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయన్నారు. యుఎస్ ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాంతీయ సంచాలకుడు ెహ న్రీ స్టియంగాస్ మాట్లాడుతూ మొదటి సారి వైజాగ్‌కు వచ్చానని, నగరం చాలా బాగుందన్నారు. ఏయే సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయో వివరించారు. యుఎస్ కంపెనీస్ కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అజయ్సింఘా, సీఐఐ వైస్ చైర్మన్ జీఎస్ శివకుమార్, ఐబీఎం ప్రతినిధి డాక్టర్ ప్రశాంత్ప్రధాన్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా వైస్ చైర్మన్ డాక్టర్ టి.బాబూరావు నాయుడు ప్రసంగించారు. -
కనుల పండువగా వైజాగ్ ఫెస్ట్
విశాఖపట్నం సిటీ : విశాఖ మహా నగరం మరి కొద్దిరోజుల్లోనే నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్లతో అభివృద్ధి చెందనుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎ.గిరిధర్ అన్నారు. నగరంలోని ఓ హోటల్ లో శుక్రవారం కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ సిటీ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఓ చిన్న మత్స్యకార పల్లెగా ఉన్న విశాఖ ఇప్పుడు సకల సాంస్కృతిక, సాహిత్య, చారిత్రక వారసత్వాన్ని నేటి తరానికి తెలియజేసే ఒక బృహత్ ప్రయత్నానికి విశాఖ వేదికైంది. వైజాగ్ ఫెస్ట్-2015కు శుక్రవారం సాయంత్రం తెర లేచింది. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ భారీ ప్రదర్శనకు భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చారు. మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనిని ప్రారంభించారు. బుక్స్ బుక్స్ లవ్లీ బుక్స్ వైజాగ్ ఫెస్ట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన చదువరులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ చరిత్రకారుడు బిపిన్‌చంద్ర పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 200 వరకూ బుక్ స్టాల్స్ నెలకొల్పారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, కేంద్ర సాహిత్య అకాడమీ, ప్రజాశక్తి బుక్‌హౌస్, వి శాలాంధ్ర ప్రచురణ సంస్థ, పీకాక్ క్లాసిక్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, ఓరియంట్ బ్లా క్స్వాన్, జనవిజ్ఞాన వేదిక, ఎమెస్కో, బుక్స్వాలా, సైన్స్ యూనివర్సల్ వంటి 115 పబ్లిషింగ్ సంస్థల ప్రచురణలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గొల్లపూడి వీరాస్వామి సన్స్, అనల్ప బుక్స్, నీల్కమల్ పబ్లికేషన్స్, జ్యోతి, హిమాంశు, గుప్తా తదితర బుక్ పబ్లిషర్స్ కూడా స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. కంప్రింట్, ఆపిల్ ట్రీ సంస్థలు పిల్లల విజ్ఞానానికి సంబంధించిన రూపొందించిన సీడీలు, డీవీడీలు కూడా ప్రదర్శనలో ఉంచారు. వామపక్ష సాహిత్యం... అరుదైన వామపక్ష సాహిత్యాన్ని ఈ ప్రదర్శనలో ఉంచారు. ఇరిక్ హాఫ్జ్బామ్ ‘హౌ టు చేంజ్ ది వరల్డ్’, మార్తా హర్ణేకర్ ‘రీ బిల్డింగ్ ది లెఫ్ట్’, విజయ్ ప్రసాద్ ‘నో ఫ్రీ లెఫ్ట్’, ‘ది పూరర్ నేషన్స్’ వంటివి ఉన్నాయి. ఆకార్, లెఫ్ట్ వరల్డ్, నేషనల్ బుక్ ఏజెన్సీ, వర్షా బుక్స్, సంస్కృతి, పీపుల్స్ పబ్లికేషన్స్ హౌస్ తదితర సంస్థల ప్రచురణలు ఉన్నాయి. అరుంధతి రాయ్ రచన ‘అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్’, అమితా కనేకర్ రచన ‘ఎ స్పోక్ ఇన్ ది వీల్’ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల సందడి... సర్ సీవీ రామన్ పేరుతో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లో పలు నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. మెడికల్ కాలేజీ విద్యార్థులు 80 వరకూ ఎగ్జిబిట్స్ను ఏర్పాటు చేశారు. పలు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు తాము రూపొందించిన పలు మోడల్స్‌ను ఇక్కడ ప్రదర్శించారు. ప్రముఖ ఆటోమొబైల్స్ సంస్థలు, హ్యాండీక్రాఫ్ట్, చేనేత సహకార సొసైటీలు తమ ఉత్పత్తులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ సంస్థలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ప్రదర్శనకు జవహర్లాల్ నెహ్రూ వేదికగా పేరు పెట్టారు. వాటిలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్లాంట్ నమూనా ప్రత్యేకంగా నిలిచింది. ఫుడ్ ఫెస్టివల్... ఆరోగ్యానికి మేలు చేసే సంప్రదాయ ఆహార పంటల ఆవశ్యకతను వివరించేందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేకంగా నిలిచింది. అలాగే ఆత్రేయపురం పూతరేకులు, మాడుగుల హల్వా స్టాల్స్ సందర్శకులకు నోరూరిస్తున్నాయి. ‘నిర్భయ’ కళారూపం వాయిదా ఢిల్లీలో జరిగిన సంచలన ‘నిర్భయ’ ఘటనపై రూపొందించిన భారీ కళారూపం ఆవిష్కరణ వాయిదా పడింది. వైజాగ్ ఫెస్ట్ వేదిక వద్ద దీన్ని గురువారమే ఆవిష్కరించాల్సి ఉంది. అయితే కళాఖండాల ఏర్పాటు ఆలస్యమవడం తో శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే శుక్రవారం ఉదయం క్రేన్‌తో పైకి లేపినప్పుడు బొమ్మ కింద పడిపోయింది. దీన్ని పునఃప్రతిష్టించేందుకు సాయంత్రం వరకూ కళాకారులు ప్రయత్నించారు. శనివారం ఉదయం దీన్ని ఆవిష్కరించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. సాహిత్యం, సంస్కృతి, భాషా వికాసం, వర్తమాన సాహిత్యం-సవాళ్లు, మీడి యా తదితర అంశాలపై చర్చా కార్యక్రమాలు శనివారం నుంచే ప్రారంభం కానున్నాయి. -
అంతర్జాతీయ నగరంగా విశాఖ
స్మార్ట్ సిటీ రూపకల్పనకు ప్రజలు సహకరించాలి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విశాఖపట్నం సిటీ : అంతర్జాతీయ నౌకాయాన ముఖద్వారంగా వెలుగొందుతున్న విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. వైజాగ్ పటం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, స్మార్ట్ విశాఖ ఫోరం సంయుక్తంగా ఓ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన సిటిజన్ కనెక్ట్ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే స్మార్ట్ సిటీగా విశాఖ అభివృద్ధి చెందే అవకాశం లేదని చెప్పారు. అల్లా ఉద్దీన్ అద్భుత దీపంలా క్షణాల్లో స్మార్ట సిటీ రూపుదాల్చుకోదని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలంటే ఎంతో శ్రమించాల్సి ఉందన్నారు. విశాఖను సుందర నగరంగా తీర్చి దిద్దడానికి ఎంతో మంచి ఆలోచన, ఉద్దేశం, కోరిక ఉన్నప్పటికీ కొంత సమయం పడుతుందన్నారు. త్వరలో మెట్రో పరుగులు నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలో త్వరలోనే మెట్రో రైలు పరుగులు తీయనుందని చెప్పారు. నిన్ననే మెట్రో అధినేత శ్రీధరన్ కలిసి విజయవాడ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ఇచ్చారని చెప్పారు. విశాఖ డీపీఆర్ కూడా త్వరలోనే ఇస్తామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గుతుందన్నారు. సామాన్యులు కూడా మెట్రోలో హాయి గా ప్రయాణించే వీలుంటుందని చెప్పారు. హౌసింగ్‌లో పేదలకు స్థానం హౌసింగ్ ప్రాజెక్టుల్లో పేదలకు సముచిత స్థానం కల్పించాలని అధికారులకు సూచించారు. పేదలు లేకుండా హౌసింగ్ ప్రాజెక్టులు ఉండకూడదన్నారు. ఈ ఊరిపై మొదటి హక్కు పేదలదేనని స్పష్టం చేశారు. పేదలు లేకుండా ధనికులుండగలరా అని ప్రశ్నించారు. పురాతన నాగరికతను మర్చిపోకూడదన్నారు. క్రీస్తుపూర్వం నాటి హరప్పా, మొహంజదారో నగరాల అభివృద్ధితో పోల్చుకుని పయనించాలని సూచించారు. రాష్ట్రంలో 12 ప్రఖ్యాత విద్యా సంస్థలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ఈ నెల 11న హిందూపురంలో కస్టమ్స్ ట్రైనింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపూర్‌లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విశాఖలోని ఐఐఎంకు, తిరుపతిలోని ఐఐటీ, ఐఈఎస్ఆర్లకు రూ.2300 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హరిబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా వీసీ బాబూరావు నాయుడు, విశాఖ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కె.రామబ్రహ్మం, స్మార్ట్ విశాఖ ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు. -
వచ్చే నెలలో ‘స్మార్ట్ సిటీ’: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం చేపట్టనున్న ‘స్మార్ట్ సిటీస్’ ప్రాజెక్టును వచ్చే నెలలో ప్రారంభించే అవకాశముందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రాలు, ఇతర భాగస్వాములతో సంప్రదింపులు పూర్తయ్యాయని వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో స్మార్ట్ సిటీల అంశంపై నిర్వహించిన ఒక సెమినార్లో వెంకయ్యనాయుడు మాట్లాడారు. దేశంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సమ్మిళిత వృద్ధే మార్గమన్నారు. స్మార్ట్ సిటీల ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన అనుమతులను ఈ నెల చివరిలోగా పొందుతామని... వచ్చే నెలలో ప్రాజెక్టును అమల్లోకి తెస్తామని వెంకయ్య తెలిపారు. -
సిటీ.. స్మార్టీ
ఐ.ఎఫ్.సి. సహకారం పి.పి.పి.పద్ధతిలో అభివృద్ధి అవకాశాలు పుష్కలం ఢిల్లీ తర్వాత తొలి నగరం స్వాగ తిస్తున్న నగరవాసులు విజయవాడ : విజయవాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు వరల్డ్ బ్యాంకుకు చెందిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐ.ఎఫ్.సి) ఆసక్తిచూపడంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బుధవారం ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమైనప్పుడు విజయవాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసే అంశం చర్చకు వచ్చింది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో నగరాభివృద్ధికి ఐ.ఎఫ్.సి. ముందుకు వచ్చింది. దీనికి సీఎం కొంత సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గురువారం రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో విజయవాడను స్మార్ట్ సిటీగా మార్చేం దుకు నిధులు కేటాయిస్తామని ప్రకటించడం గమనార్హం. ఢిల్లీ తర్వాత తొలి స్మార్ట్ నగరం ఐ.ఎఫ్.సి. విజయవాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అంగీకరిస్తే.. దేశంలో ఢిల్లీ తర్వాత తొలి స్మార్ట్ సిటీ విజయవాడ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ కావడంతో దీన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపుతున్నారు. అదే జరిగితే నగర రూపురేఖలే మారిపోతాయి. స్మార్ట్ సిటీలో మెట్రో రైలు, విశాలమైన రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి శానిటేషన్ అభివృద్ధి, 24 గంటల విద్యుత్ సౌకర్యం, రోజంతా నగర ప్రజలకు శుద్ధమైన మంచినీరు అందుబాటులో ఉంటాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్, విమానాశ్రయం, నగరమంతా వైఫై సౌకర్యం, డిస్నీల్యాండ్, కాల్వల్లో బోటింగ్‌లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వర్షం నీటిని వడిసిపట్టి భూగర్భ జలవనరులను పెంచుకునే సౌకర్యాలు ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు. కాగా ఈ ప్రాజెక్టులో కొన్నింటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో సమకూర్చితే, మరికొన్ని పి.పి.పి. పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ఐ.ఎఫ్.సి నిధులు కేటాయిస్తుంది. అభివృద్ధికి అన్ని హంగులూ.. విజయవాడను స్మార్ట్ సిటీగా మార్చేందుకు నిధులు కేటాయిస్తే ఇక్కడ అన్ని రకాల వనరులు ఉన్నాయని నగర ప్రముఖులు చెబుతున్నారు. 113 ఎకరాల్లో విస్తరించి ఉన్న భవానీ ద్వీపాన్ని గ్రీన్ ఫీల్డ్ జోన్‌గా అభివృద్ధి చేయడమే కాకుండా డిస్నీల్యాండ్‌ను ఏర్పాటు చేస్తే వాటర్ బోటింగ్ సౌకర్యం పర్యాటకులకు అందుబాటులోకి వస్తుంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ దేవాలయాన్ని అభివృద్ధి పరిచి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చివచ్చు. నగరం మధ్య నుంచి వెళుతున్న మూడు కాల్వలను రవాణా సౌకర్యాలు, బోటింగ్‌కు ఉపయోగించుకోవచ్చు. శివారు ప్రాంతాల్లో అత్యాధునిక టెక్నాలజీతో శానిటేషన్ మిషన్లు ఏర్పాటు చేసి చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దవచ్చు. ఇప్పటికే ఆసియాలోనే పెద్దదైన బస్‌స్టేషన్, పది ప్లాట్‌ఫారాలు ఉన్న రైల్వేస్టేషన్ ఉన్నాయి. వీటిని మరికాస్త అభివృద్ధి చేస్తే దేశంలో ఇతర బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లను తలదన్నేలా నిలుస్తాయి. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు ఇప్పటికే మంజూరైన మెట్రో రైలు నిర్మాణం పూర్తయితే నగరాభివృద్ధి దూసుకుపోతుంది. ఇప్పటికే నగరంలో కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లు, ఐనాక్స్ థియేటర్లు వచ్చేశాయి. రాబోయే రోజుల్లో మెట్రో నగరాలకు దీటుగా ఇవి అభివృద్ధి చెందుతాయి. పోలీసులు కృషితో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, నేరాలను అదుపులో ఉంచితే రాబోయే రోజుల్లో స్మార్ట్ సిటీగా విజయవాడ అభివృద్ధి చెందడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. -
స్మార్ట సిటీ సాధనే లక్ష్యం
టవర్‌సర్కిల్ : కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో శాస్త్రీయ విజ్ఞానంతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పనులు చేపట్టేందుకు ఆదివారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన స్వచ్ఛభారత్‌లో ప్రతీ పౌరుడు పాల్గొనాలని సూచించారు. కేంద్రబడ్జెట్లో కూడా స్వచ్ఛభారత్‌కు పెద్దపీట వేసినట్లు తెలిపారు. స్వచ్ఛభారత్‌కు శాస్త్రీయ విజ్ఞానం జోడించి టాయిలెట్స్ నిర్మాణం, శుభ్రత చేపట్టాలని పిలుపునిచ్చారు. శుభ్రతంగా ఉంటే 60 శాతం రోగాలు దూరమవుతాయని తెలిపారు. నగరంలో శానిటేషన్‌పై లోతుగా పరిశీలించి ఐటీని ఉపయోగించేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నామన్నారు. చెత్తను ఏలా నియంత్రించవచ్చు, చెత్త తొలగింపు ఎలా జరుగుతుందనే విషయాలపై అధికార యంత్రాంగానిదే బాధ్యత కాదని, ట్రాకింగ్సిస్టంతో ప్రజలకు తెలియజేసి అందరినీ భాగస్వాములను చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీల ఎంపికకు గట్టి పోటీ ఉందని, స్మార్ట్ హోదా దక్కాలంటే మనం స్వచ్ఛతలో ముందుండాలని సూచించారు. కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి వెంకయ్యనాయుడును నగరానికి తీసుకువస్తామని, అప్పటిలోగా కరీంనగర్ స్మార్ట్ అనిపించేలా తీర్చిదిద్దాలని కోరారు. మేయర్, డెప్యూటీ మేయర్‌తోపాటు కార్పొరేటర్లు వారి ఆలోచనలకు పదును పెట్టి క్లీన్‌సిటీగా మార్చాలన్నారు. ఆధునికీకరణతో ముందుకు : మేయర్ పారిశుధ్య వాహనాలు, డీజిల్ వాడకం, కార్మికుల పనితీరు అంతా అత్యాధునిక ట్రాకింగ్ సిస్టం ద్వారా ముందుకు వెళతామని మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. రాష్ట్రంలోనే ఈ సిస్టం అములు చేస్తున్న మొట్టమొదటి కార్పొరేషన్‌గా కరీంనగర్ పేరు నిలుస్తుందన్నారు. చెత్తను తొలగించాలంటే చిత్తశుద్ధి అవసరమన్నారు. ట్రాకింగ్సిస్టంతో మరింత మెరుగైన పారిశుధ్య సేవలు అందిస్తామని తెలిపారు. అనంతరం ట్రాకింగ్ సిస్టంపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ ఆరిఫ్, కార్పొరేటర్ రూప్సింగ్, కమిషనర్ రమణాచారి, ఈఈ భద్రయ్య, డీఈ శంకర్, ఆర్వో మక్సూద్మీర్జా, శానిటరీ సూపర్వైజర్ రాజమనోహర్, అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థ ఉపయోగం ఇదీ... శానిటేషన్ విభాగంలో చెత్తను ఎత్తుకుపోయే ట్రాక్టర్లకు ఎలక్ట్రానిక్సెన్సార్లు అమర్చుతారు. వాటిని ఒక కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తారు. కార్యాలయంలో ఉండే ఈ కంప్యూటర్లో సెన్సార్ఉన్న వాహనం ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఉందో గుర్తించవచ్చు. వాహనం తిరుగుతున్నంత సేపు వాటికి సంబంధించిన సమాచారం అధికారులకు అందుబాటులో ఉంటుంది. దీనివలన వాహనాలు, వాటిపై పనిచేస్తున్న కార్మికులు అనుకున్న విధంగా చెత్తను లిప్టు చేస్తున్నారా లేదా అనేది తెలుసుకునే వీలుంటుంది. -
స్మార్ట్ సిటీలకోసం టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు
న్యూఢిల్లీ: విశాఖపట్నం, అజ్మీర్, అలహాబాద్‌లను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధిచేయడం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు మూడు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. ఇవి ఈ మూడు నగరాల అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తాయి. పట్టణాభివృద్ధి, విదేశాంగశాఖలతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు బీటిలో సభ్యులుగా ఉంటారు. వీరేకాక అమెరికా వాణిజ్య అభివృద్ధి మండలి సభ్యులూ ఉంటారు. ఇటీవల మంత్రి వెంకయ్య, అమెరికా వాణిజ్యశాఖ మంత్రి పెన్నీ ప్రిజ్కర్ మధ్య జరిగిన భేటీలో అవగాహన ఒప్పందం కుదరడంతో టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు నగరాల అభివృద్ధిలో అమెరికా సహకారం అందిస్తుంది. -
ఆశల బండి వస్తోందండి...
కొత్త రైళ్ల కోసం నిరీక్షణ విశాఖ జోన్ రావాలని ఆకాంక్ష సమస్యల కూత కూస్తున్నా చలనం లేని పాలకులు నేటి రైల్వే బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నువ్వు ఎక్కాల్సిన రైలు ఓ జీవిత కాలం లేటు అన్నారో కవి. స్మార్ట్ సిటీగా ఎదుగుతున్నా విశాఖ రైల్వే ఇంకా ఒడిదుడుకుల్లోనే ఉంది. గుండెల్లో ఆశల కూత వినిపిస్తున్నా వరాల బండి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడాల్సి వస్తోంది. ఈసారైనా నిరీక్షణ ఫలించేనా... కల నెరవేరేనా అని ఉత్తరాంధ్రవాసులు ఎదురుచూస్తున్నారు. విశాఖపట్నం సిటీ: రైల్వే బడ్జెట్ రాబోతుంది. కొత్త రైళ్లు వస్తాయా...వచ్చే రైళ్లు తమ స్టేషన్లో ఆగుతాయా...ఆ రైల్లో ఏయే ఊళ్లకు వెళ్లవచ్చు. టికెట్ ధరలు ఏమైనా పెంచుతారా...ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ చేస్తారా...ఇలా అనేక ఆశలతో ప్రయాణికులు ఆశగా బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. గురువారం రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు పార్లమెంట్లో బడ్జెట్ ప్రకటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉద్యోగుల్లోనూ తీవ్ర ఉత్కంఠ ఆవహించింది. ఉద్యోగులపై ఏమైనా ‘ప్రభు’ కనికరం చూపుతారేమోనని చూస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో 1100 కిలోమీటర్ల మేర విస్తరించి వున్న వాల్తేరు డివిజన్ రైల్వే బడ్జెట్ కోసం ఆశగా ఎదురు చూస్తోంది. 2015 బడ్జెట్లో నైనా కొత్త జోన్ప్రతిపాదన వుంటుందేమోనని కలలుగంటోంది. ఏళ్ల తరబడి నానుతున్న ప్రత్యేక జోన్ డిమాండ్ ఏటా మాదిరి గానే ఈ కొత్త ఏడాదీ ప్రతిధ్వనిస్తోంది. తాము అధికారంలోకి వ స్తే క చ్చితంగా రైల్వే జోన్ సాధిస్తామంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ ఇప్పుడు ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతుండడం తో ఈ ఆశలకు మరింత బలం చేకూర్చుతోం ది. ప్రత్యేక జోన్ లేకపోయినా కనీసం ప్రస్తావ న అయినా వుంటుందని వాల్తేరు ఆశిస్తోంది. ఈ బడ్జెట్లో జోన్ లేనట్టే..! రైల్వే జోన్ కోసం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నప్పటికీ జోన్ ప్రకటన వుండకపోవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు స్పష్టం చేయడంతో ఆ ఆశ లు సన్నగిల్లాయి. ఎంపీ హరిబాబు సైతం జోన్ వస్తుంది కానీ ఎప్పుడనేది ఇప్పట్లో కాదని తేల్చేయడంతో ఆశలు పూర్తిగా అడుగంటాయి. కావాల్సిన రైళ్లు..! విశాఖపట్నం-అలహాబాద్, విశాఖ-అహ్మదాబాద్, విశాఖ-లక్నో, విశాఖ-పాట్నా, విశాఖ -చండీగఢ్, విశాఖ-రామేశ్వరం, విశాఖ-వారణాసి, విశాఖ-మైసూర్, విశాఖ-బెంగళూ ర్, విశాఖ-గోవా, విశాఖ-పుట్టపర్తి, విశాఖ- తిరుపతి, విశాఖ-షిర్డీ, విశాఖ-సికింద్రాబాద్ (శతాబ్ది), విశాఖ-ఢిల్లీ (దురంతో), విశాఖ- ముంబాయి(దురంతో) వంటి రైళ్ల ఆవశ్యకత వుంది. ఈ రైళ్లు కావాలంటూ గత బడ్జెట్ల స మయాల్లో వాల్తేరు డివిజన్ నుంచి ప్రతిపాదనలు వెళ్లినా అవన్నీ ఆచ రణ సాధ్యం కాలేదు. ఫ్రీక్వెన్సీ పెంచే రైళ్లు..! వారానికి మూడు రోజులపాటు నడుస్తున్న విశాఖ-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్‌ను వారానికి అయిదు రోజులు గానీ, లేదా రోజూ నడిచేలా ప్రకటించే అవకాశాలున్నాయి. వారానికి అయిదు రోజులు నడుస్తున్న విశాఖ-నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్‌ను ప్రతి రోజూ నడిచేలా ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.వారానికి మూడు రోజులు నడుస్తున్న విశాఖ-అమృత్సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌ను వారానికి అయిదు రోజులు పెంచే చాన్స్ వుంది. గత బడ్జెట్లో మంజూరై వారానికి ఒక రోజు మాత్రమే నడుస్తున్న విశాఖ-గాంధీధాం, విశాఖ-జోధ్‌పూర్, విశాఖ-కొల్లాం, విశాఖ-షిర్డీ, విశాఖ-చెన్నై, విశాఖ-పారాదీప్ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లను వారానికి మూడు రోజులు పెంచే చాన్స్‌లు వున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులకు జెండా ఊపుతారా..! తూర్పు కోస్తా రైల్వే ఆరంభం నుంచీ వాల్తేరు డివిజన్ రైల్వే ఎలా వుందో గత పుష్కర కాలంలో ఆదాయాన్ని అయితే గణనీయంగా పెంచగలుగుతోంది. కానీ కొత్త ప్రాజెక్టులను మాత్రం సాధించలేకపోతోంది. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ఎంపీలంతా ఉత్త చేతుల్తోనే తిరిగొస్తుండడంతో కొత్త ప్రాజెక్టులనేవి లేకుండా పోయాయి. బ్రిటిష్ కాలం నాటి ప్రాజెక్టులే తప్పితే గత 25 ఏళ్లలో సాధించిన చె ప్పుకోదగ్గ ప్రాజెక్టు ఒక్కటీ లేదనే చెప్పాలి. వ్యాగన్ వర్క్‌షాప్‌కు అన్నీ అనుకూలమనే అంటున్నారు గానీ టెంకాయ కొట్టిన పాపాన పోలేదు. కొత్తవలస-కిరండూల్ (కెకె) రైల్వే లైన్‌ను డబులింగ్ చేసే ప్రయత్నమే చేయడం లేదు. ఏటా రూ. 5 వేల కోట్ల పైబడి ఆదాయం ఈ ఒక్క మార్గం గుండానే రైల్వేకి చేరుతున్నా ఆంధ్రలో ఈ లైన్ వుందని అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీసం రెండు ప్యాసింజర్ రైళ్లయినా నడిపే సాహసం చేయడం లేదు. కొత్తవలస-రాయగడ (కేఆర్) రైల్వే లైన్లో విద్యుదీకరణ పనులు చేపట్టే ప్రాజెక్టు సైతం మంజూరు కావడం లేదు. ఈ మార్గం తెలుగు ప్రజలతో మమేకమై వుంటుంది. నర్సీపట్నం-పలాస (వయా రాజాం) కొత్త రైల్వే లైన్ సర్వేకి గత బడ్జెట్లో ప్రకటించినా అతీగతీ లేదు. కేవలం ఏరియల్ సర్వేతో సరిపెట్టేశారు. ఈ మార్గం వేస్తే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని గిరిజన, గ్రామీణ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి. 2012 రైల్వే బడ్జెట్లో విశాఖ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ శ్రేణి రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయడంతో బాటు మల్టీ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ఎస్కలేటర్, సీసీ కెమేరాలు అయితే వచ్చాయి గానీ వీఐపీ లాంజ్, ఫుడ్ కోర్టులు, మల్టీప్లెక్స్ నిర్మాణాలు రాలేదు. ఇప్పటికీ ఆ ప్రాజెక్టులు పెండింగ్‌లోనే వున్నాయి. కనీసం ఈ బడ్జెట్లోనైనా నిధులు మంజూరు చేస్తారేమోనని ఆశగా నిరీక్షిస్తున్నారు. జనసాధారణ్ రావొచ్చు..! ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనసాధారణ్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రాధాన్యమిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విశాఖకు ఈ రైళ్లు రెండు వరకు కేటాయించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కొత్తరాజధాని విజయవాడ రాకపోకలకు సాధారణ కోచ్‌లతో కూడిన ఇంటర్సిటీ రైలును మంజూరు చేసేందుకు అవకాశాలున్నాయని రైల్వే వర్గాలంటున్నాయి. ప్రయత్న లోపం సుస్పష్టం రైల్వే బడ్జెట్‌కు ముందు అన్ని రాష్ట్రాల్లో నూ ఎంపీలంతా తమతమ జోనల్ మేనేజర్ల ను కలిసి కొత్త రైళ్లు, కొత్త ప్రాజెక్టులపై చర్చిస్తా రు. ఆయా ప్రతిపాదనలను రైల్వే జీఎంల ద్వా రా రైల్వే బోర్డుకు చేరేలా ప్రయత్నిస్తారు. రైల్వే బోర్డులో తమ పలుకుబడిని ఉపయోగించి కొ త్త రైళ్లను సాధిస్తారు. ఆ విధంగా తమ ప్రాం తీయుల కోసం కొత్త రైళ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ తమను గెలిపించినందుకు రుణం తీర్చుకుంటారు. రైల్వే మంత్రిత్వ శాఖ, ైరె ల్వే బోర్డు ఆలోచనలు ఎలావున్నా ఉత్తరాంధ్ర ప్ర జాప్రతినిధుల ప్రయత్నలోపం స్పష్టంగా కని పిస్తోంది. రైల్వే కాలపట్టిక సమావేశానికి ముం దు తెలంగాణ రాష్ట్ర ఎంపీలతోబాటు ఆంధ్రాలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు దక్షిణ మ ద్య రైల్వే జనరల్ మేనేజర్‌తో భేటీ అయి కావాల్సిన రైళ్లను, ప్రాజెక్ట్‌లపై చర్చించి ప్రతిపాదనలిచ్చారు. అలాగే ఒడిశాలోని ప్రజాప్రతినిధు లు కూడా తూర్పుకోస్తా రైల్వే జీఎం ను కలిసి ప్రతిపాదనలు అందజేశారు. అక్కడితో ఆగకుండా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయ క్ నేరుగా ప్రధానమంత్రి, రైల్వే మంత్రిని కలి సి ఆ రాష్ట్రానికి కావలసిన కొత్త రైళ్లు, ప్రాజెక్ట్‌లపై వివరించి ప్రతిపాదనలు అందజేశారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు మాత్రం రై ల్వే అవసరాల కోసం తూర్పుకోస్తా రైల్వే జీ ఎంను కలిసిన సందర్భమే లేదు. గత సెప్టెం బర్లో తూర్పుకోస్తా పరిధిలోని పార్లమెంట్ సభ్యులతో జరిగిన సమావేశంలో జీ ఎంను కలిసి కోరిన విజ్ఞప్తులే కొత్తగా చెప్పుకుంటున్నారు. ప్రజలను మభ్యపెడుతున్నారు. -
మళ్లీ అపార్ట్మెంట్ల జోరు
‘స్మార్ట్’గా పరుగులు బహుళ అంతస్తుల పై నగర ప్రజల మోజు స్మార్ట్ సిటీ ప్రకటన తో ఊపందుకున్న లావాదేవీలు విశాఖపట్నం : రాష్ట్ర విభజనతో విశాఖలో మందగించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం స్మార్ట్‌సిటీ ప్రకటనతో మళ్లీ జోరందుకుంది. అమెరికా సాయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ ప్రకటనతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోవాలన్న కోరిక పెరిగింది. దీంతో అందరూ ఫ్లాట్లు కొనాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో వ్యక్తిగత ఇళ్లన్నీ అపార్ట్మెంట్ రూపంలోకి దూసుకుపోతున్నాయి. ఈ వరసలో నగర శివారు మధురవాడ, ఎండాడ, విశాలాక్షినగర్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి తదితర ప్రాంతాలు ముందున్నాయి. మధురవాడ, ఎండాడ ప్రాంతాల్లో వ్యక్తిగత ఇళ్లకంటే అపార్ట్మెంట్ల నిర్మాణాలే అధికంగా కన్పిస్తున్నాయి. ఇక్కడ అపార్ట్మెంట్ సంస్కృతి కొంతకాలం నుంచి అనూహ్యరీతిలో అభివృద్ధి సాధిస్తోంది. పూర్వం మొత్తం వందలోపే అపార్ట్మెంట్లు ఉండేవి. ప్రస్తుతం నగరం విస్తరించడంతో ఆ సంఖ్య 20 వేలు దాటింది. మరో పది వేలకుపైగా నిర్మాణంలో ఉన్నాయి. పిండి కొద్దీ రొట్టె అన్న చందంగా అతి సాధారణ స్థాయి నుంచి ఆధునిక సదుపాయాలతో కూడిన ఫ్లాట్లు నిర్మించి ఖాతాదారుల అభిరుచి మేరకు అందిస్తున్నారు. ఇదీ కారణం... నగరం ‘స్మార్ట్’గా పరుగులు పెడుతోంది. ఐటీ సిగ్నేచర్ టవర్లు, నిరంతర వైఫై సౌకర్యం.. ఇలా అత్యాధునికమైన సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. కన్వెన్షన్ సెంటర్, హైదరాబాద్ హైటెక్ సిటీని తలదన్నే రీతిలో నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం ఏమూల చూసినా చదరపు గజం రూ.25 వేలకు తక్కువ లేదు. వంద గజాలు కొని ఇల్లు నిర్మించుకోవాలంటే కనీసం రూ.40 లక్షల మంచి రూ.50 లక్షలకు తక్కువ ఖర్చుకావడం లేదు. అంతేకాకుండా కార్మికుల కొరత, భవన నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్లాన్, మంచినీటి కనెక్షన్, విద్యుత్తు ఇలా అనేక సమస్యలతోపాటు సమయం కూడా ఆదా అవడంతో ప్రజలు ఫ్లాట్ల వైపు మక్కువ చూపుతున్నారు. మరో ముఖ్యమైన కారణమేమిటంటే భద్రత. పట్టపగలే నగరంలో చోరీలు అధికమవడం, నేరస్తులు ఎంతటి దారుణాలకైనా తెగబడడంతో ఫ్లాట్లు అన్ని విధాలా మేలనే భావన పెరగడంతో వీటికి డిమాండ్ అధికమైంది. దీంతోపాటు బిల్డర్లే బ్యాంకు రుణాలు ఏర్పాటు చేయడంతో కొనుగోలుకు మరింత సౌలభ్యం ఏర్పడుతోంది. ఆధునిక వసతులు నిర్మాణ రంగంలో ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒకప్పడు కేవలం స్థానికంగా లభించే మెటీరియల్స్తోనే అపార్ట్మెంట్లు నిర్మించేవారు. ఇప్పుడు విదేశీ సామగ్రి, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారు. అపార్ట్మెంట్ భద్రత కోసం విద్యుత్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ, జిమ్, స్టీమ్ ఫంక్షన్ హాలు, వాకింగ్ ట్రాక్, మహిళలకు లేడీ క్లబ్‌లు... ఇలా ఎన్నో ఆధునిక సదుపాయాలతో ఫ్లాట్స్ అందుబాటులో లభిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో గ్రూప్ హౌసెస్, విల్లాలు నిర్మిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణంలో కొందరు బిల్లర్లు ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఖాతాదారుడికి ఏం చెబుతారో అదే చేయుడంతో ఇటువంటి వారు కట్టే అపార్ట్మెంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వ్యాపారమంటేనే నమ్మకం, దాన్ని పోగొట్టుకుంటే దేనికి పనికిరామనే నినాదంతో నడుస్తున్న బిల్లర్లను మనం చూడొచ్చు. కొనేటప్పుడు జాగ్రత్తలు... ఎంతో కష్టపడితేగాని చాలామంది జీవితకాలంలో సొంత గృహాన్ని సొంతం చేసుకోలేరు. మరి ఫ్లాట్ కొనేటపుపడు కొన్ని జాగ్రత్తలు తప్పవు. స్థలం యజమానికి, బిల్డర్‌కు మధ్య ఒప్పంద పత్రాలను చూసుకోవాలి. ఎన్కంబరెంట్ సర్టిఫికేట్ (ఈసీ) తీసుకోవాలి. క్లియర్ టైటిల్, దానికి సంబంధించిన లింక్ దస్తావేజులు చూసుకోవాలి. తెలీకపోతే న్యాయవాదిని, అనుభవజ్ఞుడైన దస్తావేజు లేఖరిని సంప్రదించాలి. మనం కొనే ఫ్లాట్ నిర్మాణంలో ఉంటే నెలకొకసారైనా వెళ్లి చూసుకోవాలి. దీంతోపాటు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాల్లో అన్నీ సదుపాయాలు ఉన్నాయా లేదా.. అనేది పరిశీలించాలి. భూగర్భ నీటి నిల్వ పైపు కనెక్షన్, ఫైరింజన్, నియంత్రణ పరికరాలు, ఫైర్పంపులు, హోజ్రీలు, తదితర అంశాలు ఏర్పాటు చేశారా లేదా..? అనేది పర్యవేక్షించాలి. మరో ముఖ్యమైన విషయం... బిల్డర్ నుంచి ఏమి కోరుకుంటున్నామో అవి రాతపూర్వకంగా ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు స్వర్గసీమగా మారుతుంది. -
నాథులు నాస్తి
►జిల్లాలో ‘స్మార్ట’కు ఎంపికైన 1,069 గ్రామాలు,364 వార్డులు ►దత్తతకు ముందుకు రాని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,అధికారులు ►ప్రచారంలో చూపిన ఉత్సాహం అమలులో చూపని ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, కాకినాడ :స్మార్ట్ సిటీ.. స్మార్ట్ విలేజ్.. స్మార్ట్ వార్డు.. కొంత కాలంగా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారుల నోట ఈ పదమే వినిపిస్తోంది. సర్కార్ కూడా ‘స్మార్ట్...స్మార్ట్’ అన్న ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. గ్రామాలు, వార్డులన్న తేడా లేకుండా అన్నింటినీ స్మార్ట్‌గా చేయాలని ఆదేశించింది. గత నెల 18న స్మార్ట్ విలేజ్‌లో పాదయాత్ర చేపట్టాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరిలో తనవంతు పాదయాత్ర చేశారు. అదే రోజు ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గం జె.తిమ్మాపురంలో స్మార్ట్ యాత్ర చేశారు. ప్రారంభం రోజు జిల్లాలో ప్రజాప్రతినిధులు మరీ ముఖ్యంగా అధికారపార్టీ వారు.. ఖర్చు లేదు కదా అని పాదయాత్రలు చేసేశారు. అంతటితో పని అయిపోయిందనుకున్నారో ఏమో కాని ఆ తరువాత స్మార్ట్‌కు ఎంపికైన గ్రామాలు, వార్డులను దత్తత తీసుకుని అభివృద్ది చేయాలన్న సర్కార్ లక్ష్యాన్ని గాలికొదిలేశారు. జిల్లాలో ఎంపిక చేసిన 1,069 గ్రామాలు, అర్బన్ ప్రాంతాల్లో 364 వార్డుల్లో ప్రజలు ఎవరు ముందుకు వచ్చి దత్తత తీసుకుంటారా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. సర్కారు సంకల్పం ప్రకారం వాటిని ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేట్ సంస్థలు, అధికారులు, ఇతర ప్రముఖులు దత్తత తీసుకుని సమగ్రాభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. ఐదువేల జనాభా ఉన్న గ్రామాలను అధికారులు,5 వేల నుంచి 10 వేల జనాభా కలిగిన వాటిని ఎంపీలు, ఎమ్మెల్యేలు, 10 వేలపై బడి జనాభా ఉన్న వాటిని కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి స్మార్ట్ గ్రామం, వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆరుబయట మలవిసర్జన అరికట్టడం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఆస్పత్రుల్లో నూరుశాతం ప్రసవాలు, తల్లీ, పిల్లల మరణాలను, డ్రాప్ అవుట్లను తగ్గించడం, అందరికీ విద్యుచ్ఛక్తి, ఫిర్యాదుల పరిష్కార మార్గాలు, అందుబాటులోకి క్షేత్రస్థాయి సమాచారం, టెలికం, ఇంటర్నెట్, ప్రజల జీవనప్రమాణాల పెంపు తదితర 20 అంశాల్లో ప్రగతికి బాట వేయాలనేది స్మార్ట్ లక్ష్యం. దీనిని సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, సీపీఓ కన్వీనర్‌గా, పలు శాఖల అధికారులు సభ్యులుగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలన్నారు. దత్తత తీసుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 54 మంది మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అంటే జిల్లాలో స్మార్ట్‌కు ఎంపికైన సంఖ్య, ఇంతవరకు ఆన్లైన్లో నమోదుచేసుకున్న వారి సంఖ్య మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఎంపీల దత్తతా మొక్కుబడే.. ఇంతవరకు జిల్లాలోని ముగ్గురు ఎంపీలు మూడేసి గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తీరా తొలి దశలో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుంటామని దరఖాస్తు చేయడం గమనార్హం. కాకినాడ ఎంపీ తోట నరసింహం తొలుత గొర్రిపూడి, రాయభూపాలపట్నం, బూరుగుపూడిలను దత్తత తీసుకుంటున్నట్టు చెప్పారు. కానీ మొదటి విడతలో సొంత నియోజకవర్గంలోని బూరుగుపూడిని ఎంపిక చేసుకున్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పుల్లేటికుర్రు, కందికుప్ప గ్రామాలను ఎంపిక చేసుకున్నా చివరకు పుల్లేటికుర్రుకే పరిమితమయ్యారు. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తొలివిడత జిల్లాలో ఒక్క గ్రామాన్నీ దత్తత తీసుకోలేదు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత మారేడుమిల్లిని ఎంపిక చేసుకున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం అసలు స్మార్ట్ వైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. ఆ విషయం ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలనలో స్పష్టమవుతోంది. దరఖాస్తు చేసుకున్న 54 మంది కూడా జిల్లాకు చెంది పలు ప్రాంతాల్లో ఉన్న ఎన్జీఓలు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు తమ ప్రాంతంపై అభిమానంతో ముందుకొచ్చిన వారే. తొండంగిని దత్తత తీసుకున్న కలెక్టర్.. అధికారుల విషయానికి వచ్చేసరికి ప్రగతి మరీ నిరాశాజనంగా ఉంది. జిల్లాకు ఇటీవలే వచ్చినా కలెక్టర్ అరుణ్‌కుమార్ తొండంగి మండలంలో మత్స్యకార గ్రామం దానవాయిపేటను దత్తత తీసుకున్నారు. ఆ విషయాన్ని స్మార్ట్ విలేజెస్‌పై కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రకటించారు. అధికారులంతా విధిగా గ్రామాల్ని దత్తత తీసుకోవాలని నొక్కి చెప్పారు.వారానికి రెండు, మూడుసార్లు జిల్లాస్థాయిలో స్మార్ట్ విలేజెస్‌పై సమీక్షలు నిర్వహిస్తున్నా స్పందన అంతంత మాత్ర మే. ‘ఎంపీలకైతే ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయి, మాకు వచ్చే ఏసీడీపీ నిధులూ లేకుండా చేసిన ప్రభుత్వం ఇప్పుడు దత్తత తీసుకోమంటే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు ఇవ్వకుండా పోతుందా అని ఎదురుచూస్తున్నారు. అధికారులు మాత్రం స్మార్ట్‌పై అవగాహన కార్యక్రమాల ఏర్పాట్లలో ఉన్నారు. ఈ నెల 13న కాకినాడలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. స్మార్ట్ ప్రచారంలో ఉన్న ఉత్సాహం అమలులో కూడా చూపించాల్సిన బాధ్యత సర్కార్‌పై ఉంది. -
జీహెచ్ఎంసీ ‘చెత్త’ యోచన
ఇళ్లు, షాపుల ముందు చెత్త డబ్బాలు ఆస్తి పన్ను బకాయిలు చెల్లించనందుకేనట స్మార్ట్ సిటీ అంటే ఇదేనా? ఓవైపు ‘స్వచ్ఛ భారత్ ’ అంటూ ప్రభుత్వ ప్రచారం... ప్రభుత్వ శాఖల అధికారులు... స్వచ్ఛంద సంస్థలు... ప్రజల భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేసేందుకు యత్నం. మరోవైపు పారిశుద్ధ్య నిర్వహణలో... ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ శాఖల వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ స్వైన్ ఫ్లూ పరిహాసం. ఈ మహమ్మారి కళ్ల ముందే ప్రజల ప్రాణాలు హరిస్తున్నా... చేష్టలుడిగి చూస్తున్న యంత్రాంగం. ఆ నడుమ ‘ఈ లోకం ఏమైపోతే మాకేం’ అన్నట్టుగా జీహెచ్ఎంసీ అధికారుల నిర్వాకం. నరక లోకపు శిక్షలు ఇక్కడే అమలు చేసేందుకు ‘చెత్త’ ప్రయత్నం. పన్నులు కట్టని వారి ఇళ్ల ముంద ర చెత్త పోసి... శిక్షించే ‘మహా’ ఘన కార్యం... అడుగడుగునా విమర్శలు మూటగట్టుకుంటోంది. గురువారం ఉదయం.. సోమాజిగూడలోని ఓ వ్యాపారి షాపు తెరవడానికి వెళ్లాడు.. షాపు ఎదుట చెత్త డబ్బా (డంపర్ బిన్) దర్శనమిచ్చింది. ఆరా తీస్తే... ఆ పని జీహెచ్ఎంసీ చేసినట్టు తెలిసింది. గత రెండేళ్లుగా ఆస్తిపన్ను బకాయిలు చెల్లించకపోవడంతో వారు ఆ పని చేసినట్లు తెలిసి ఘొల్లుమన్నాడు. ఎస్బీఐ కార్వాన్ శాఖ కార్యాలయం ముందు రెండు డంపర్ బిన్లు ఉన్నాయి. బ్యాంకులోకి ఎవరూ వెళ్లకుండా తాళం వేశారు. బ్యాంకు ఉన్న భవన యజమాని దాదాపు రూ.5.40 లక్షల ఆస్తిపన్ను బకాయి చెల్లించనందుకే ఈ‘శిక్ష’ట. కొద్ది రోజులుగా ఆస్తిపన్ను వసూళ్లకు జీహెచ్ఎంసీ సిబ్బంది ఇలాంటి పనులకు తెగబడుతున్నారు. అబిడ్స్లోనిబిజినెస్ టవర్స్‌లో మొత్తం 80 దుకాణాలు ఉన్నాయి. అందులో 15 దుకాణాలను సీజ్ చేశారు. దాదాపు రూ.1.29 కోట్ల బకాయిల వసూళ్ల కోసం ఈ మార్గం ఎంచుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.36, రోడ్ నెం. 45లలో మూడు చోట్ల ఇలాగే చెత్తకుండీలు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం ఉప్పల్ స్టేడియంలో సామగ్రి జప్తు చేశారు. అక్కడ రూ.12 కోట్ల బకాయిల కోసం ఈ చర్యలకు సిద్ధమయ్యారు. ఇంకో చోట సుమారు రూ.6 లక్షల ఆస్తిపన్ను బకాయి పడిన భవన యజమాని కారును సీజ్ చే శారు. సిగ్గు పడాలని.. ఆస్తిపన్ను వసూలుకు జీహెచ్ఎంసీ అధికారులు చేస్తున్న పనులు విమర్శలకు తావిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం దాదాపు రూ. 1050 కోట్లు ఆస్తిపన్నును వసూలు చేసిన అధికారులు ఈసారి రూ.1464 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. చాలా భవనాల యజమానులు ఏళ్ల తరబడి ఆస్తిపన్ను చెల్లించకపోవడం.. ఎక్కువ విస్తీర్ణంలోని వాటిని తక్కువ గాచూపుతూ కొద్ది మొత్తంలో చెల్లిస్తుండడం వంటి అంశాలు అధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో లెక్క తేల్చేందుకు తిరిగి సర్వే చేయించారు. నివాస గృహంగా చూపుతూ.. వ్యాపారాలు నిర్వహిస్తున్న భవనాలను గుర్తించారు. దాంతో కొందరి ఆస్తిపన్ను రెట్టింపు కంటే మించిపోయింది. మరోవైపు పాత బకాయిలే రూ. వెయ్యి కోట్లకు పైగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో రూ. 1464 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేం కాదని భావించారు. వివిధ విభాగాల అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి..రంగంలోకి దిగారు. అయినా పెద్దగా ఫలితం కనిపించలేదు. దీంతో షాపులు, భవనాల ముందు డంపర్ బిన్లు పెట్టడం... భవనాలు, వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలకు దిగారు. సంబంధిత యజమానులు సిగ్గుతోనైనా ఆస్తిపన్ను చెల్లించకపోతారా అనేది వారి ఆలోచన. అనుకున్నట్టుగానే.. సీజ్ చేసిన భవనాల యజమానులు ఆస్తిపన్ను చెల్లించేందుకు ఒప్పకోవడం.. ఒకటి, రెండు రోజుల గడువు కావాలని కోరుతుండడంతో ఈ పద్ధతిని కొనసాగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. సగం కూడా పూర్తి కాని లక్ష్యం గత ఏడాది ఇదే రోజుకు ఆస్తిపన్ను రూ.559 కోట్లు వసూలు కాగా... ప్రస్తుతం రూ.630 కోట్లుగా ఉంది. గతానికి భిన్నంగా ఈసారి ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఫలితం లేకపోవడంతో ఇళ్ల ముందు చెత్త డబ్బాలు.. కార్యాలయాల సీజ్ వంటి కార్యక్రమాలకు దిగారు. గతంలోనూ ఒకటి, రెండు చోట్ల ఇలాంటి సంఘటనలు ఉన్నా...ఈసారి ఎక్కువ కావడం విమర్శలకు దారి తీస్తోంది. సేవల స్తంభన అప్పటికీ దారికి రాకపోతే విద్యుత్, తాగునీటి సరఫరా వంటి సేవలను స్తంభింపజేసేందుకు బడాబాబులే అధికం జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న నివాస, వాణిజ్య భవనాలు మొత్తం 13,63,607 ఉండగా... వీటిలో రూ.4వేల లోపు ఆస్తిపన్ను చెల్లించే ఇళ్లు సుమారు 10 లక్షల 10వేలుగా గుర్తించారు. వీరు మొత్తం రూ.150 కోట్లు ఉంటుందని అంచనా. మిగతా మొత్తం చెల్లించాల్సింది, బకాయిలున్నది బడాబాబులే కావడం గమనార్హం. బకాయిలపై వడ్డీని ప్రభుత్వం రద్దు చేయడంతో ఆస్తిపన్ను డిమాండ్‌లో దాదాపు రూ.130 కోట్లు తగ్గాయి. మరికొందరికి పన్ను రద్దు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అది ఎంతనే విషయంలో స్పష్టత లేదు. ఈ కారణంతోనూ వసూళ్లు తగ్గాయి. మరోవైపు ఎఫ్ఎం రేడియో సహా వివిధ మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చినా ఉపయోగం లేకుండాపోయింది. -
తెలంగాణలో నాలుగు స్మార్ట్ సిటీలు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించనుందని అధికారుల్లో చర్చ సాగుతోంది. ఇందుకు కేంద్రం నిర్వహించే సదస్సుకు ఆ జిల్లాల కమిషనర్లను పంపాలని నిర్ణయించడమే కారణం. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు మార్గదర్శకాలపై కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ నెల 30, 31 తేదీల్లో ఢిల్లీలో సదస్సును నిర్వహిస్తోంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్, పురపాలకశాఖ సంచాలకులు బి.జనార్దన్ రెడ్డి, సహాయ సంచాలకులు ఎస్. బాలకృష్ణ సదస్సుకు హాజరై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సమర్పించనున్నారు. వీరితోపాటు జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్ నగరాల మునిసిపల్ కమిషనర్లు సోమేశ్ కుమార్, సర్ఫరాజ్, శ్రీనివాస్, కేవీ రమణాచారిలను పంపాలని పురపాలక శాఖ నిర్ణయించడంతో ప్రాధాన్యం ఏర్పడింది. -
స్మార్ట్ సిటీల నిర్మాణానికి జర్మనీ సహకారం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలు మార్చేందుకు సాయం చేస్తామని జర్మనీ పర్యావరణ, భవనాల మంత్రి బార్బరా హెండ్రిక్స్ తెలిపారు. ఆమె బుధవారమిక్కడ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. ఈ మూడు నగరాలను గుర్తించేందుకు ఆరుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు వెంకయ్య తెలిపారు. హెండ్రిక్స్ కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతితో కూడా భేటీ అయ్యారు. గంగానది ప్రక్షాళనకు రూ. 21 కోట్ల సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని జర్మనీ ప్రభుత్వం పేర్కొన్నట్లు ఓ అధికార ప్రకటన తెలిపింది. -
స్మార్ట్ సిటీ
⇒ నగర శివార్లలో ఏర్పాటుకు సన్నాహాలు ⇒ ఐటీ కంపెనీలు సహా రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్సులు ⇒ సర్వ హంగులతో నిర్మించేందుకు ముందుకొచ్చిన దుబాయ్ సంస్థ ⇒ 300 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖత ⇒ త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో అందమైన, అధునాతన నగర (స్మార్ట్ సిటీ) నిర్మాణానికి దుబాయ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇటీవల ఆ దేశ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో త్వరలోనే ‘స్మార్ట్‌సిటీ’ కార్యరూపం దాల్చే అవకాశముంది. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) పరిధిలో ఈ సిటీని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర సర్కారు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. సకల హంగులతో నిర్మించే స్మార్ట్ సిటీలో ఐటీ కంపెనీలు సహా వాణిజ్య, నివాస సముదాయాలుంటాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవడమేకాకుండా.. అధునాతన జీవనశైలికి అనుగుణంగా ఈ సిటీలో సకల సౌకర్యాలు అందుబాటులోకి తెస్తారు. పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి తారక రామారావు కొన్నాళ్ల క్రితం దుబాయ్‌లో పర్యటనలో భాగంగా అక్కడి ‘స్మార్ట్ సిటీ’ని సందర్శించారు. ఈ నిర్మాణ శైలిని చూసి ముచ్చటపడ్డ మంత్రి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. దీనికి కొనసాగింపుగా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రతినిధి బృందం నగర శివార్లలో స్మార్ట్ సిటీ నిర్మాణానికి ఆసక్తి చూపింది. ఈ క్రమంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(టీఐఐసీ) ఐటీఐఆర్ పరిధిలోని కోహెడ, రావిర్యాల, శంషాబాద్ ప్రాంతాల్లోని భూములను చూపింది. ఈ మూడు స్థలాల పట్ల మొగ్గు చూపిన స్మార్ట్‌సిటీ నిర్మాణ సంస్థ.. కనిష్టంగా వేయి ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించింది. అయితే, భారీ విస్తీర్ణంలో భూమి కావాలని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేయడంతో డైల మాలో పడ్డ టీఐఐసీ 300 ఎకరాల మేర తక్షణమే కేటాయిస్తామని సెలవిచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనకు నో చెప్పని స్మార్ట్ సిటీ ప్రతినిధులు.. యాజమాన్యంతో సంప్రదించి తుది నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్ కృతనిశ్చయంతో ఉండడంతోపాటు అధునిక నగరానికి ప్రతీకగా ఈ ప్రాజెక్టు ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టీఐఐసీ కూడా స్థలాల గుర్తింపుపై దృష్టి సారించింది. శంషాబాద్ మండలం ‘111’ జీఓ పరిధిలో ఉన్నందున.. రావిర్యాల లేదా కోహెడలో స్మార్ట్ సిటీకి భూములు కేటాయించేదిశగా ఆలోచన చేస్తోంది. ఇప్పటికే కేరళ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఈ నిర్మాణ సంస్థ కొచ్చి నగర శివార్లలో స్మార్ట్‌సిటీని అభివృద్ధి చేస్తోంది. దుబాయ్ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంస్థ కావడం.. నిర్మాణరంగంలో విశేష అనుభవం ఉన్న దృష్ట్యా ఈ సంస్థ ప్రతిపాదనలకు అంగీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. -
ప్రజా సహకారంతోనే స్మార్ట్ సిటీ
త్వరలో స్మార్ట్ సిటీ గెడైన్స్ చిన్నాపురం దత్తత తీసుకున్నా.. మంత్రి గంటా శ్రీనివాసరావు పెదవాల్తేరు : ప్రజా సహకారం ఉంటేనే విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దగలమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బీచ్ రోడ్డులోని అంబికా సీ గ్రీన్ హోటల్లో ఫియోనిక్స్ సంస్థ నిర్వహించిన లెట్స్ గెట్ స్మార్ట్ కిర్లంపూడి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ అంటే అద్దంలాంటి రోడ్లు, విద్యుద్దీపాలు కాదని, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడమేనన్నారు. ఇప్పటికి స్మార్ట్ సిటీపై సరైన ప్రతిపాదనలు లేవని, ప్రాంతాన్ని బట్టి ప్రభుత్వం స్మార్ట్ సిటీ గెడైన్స్ రూపొందించడానికి సమాయత్తమవుతోందన్నారు. వేల కిలో మీటర్లు నడవాలన్నా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందన్నారు. విశాఖ అభివృద్ధికి అడుగులు పడ్డాయని, స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో భాగంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఇంటిగ్రేటెడ్ స్టేడియం, రింగ్ రోడ్లు నగరానికి రానున్నాయన్నారు. పద్మనాభ మండలంలోని చిన్నాపురాన్ని దత్తత తీసుకున్నానని చెప్పారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించి స్మార్ట్ చిన్నాపురంగా తీర్చిదిద్దుతామన్నారు. కిర్లంపూడి లేఅవుట్‌ని స్మార్ట్ సొసైటీగా తయారు చేయడానికి ఫియోనిక్స్ సొల్యూషన్స్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎంపీ హరిబాబు మాట్లాడుతూ సమస్యలు లేని దేశంగా రూపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమం అమలు చేశారన్నారు. మన స్థాయిలో నగరాన్ని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఫియోనిక్స్ ప్రతినిధి మురళి మాట్లాడుతూ కిర్లంపూడి లేఅవుట్‌ను స్మార్ట్ సొసైటీగా మార్చడానికి ఒప్పందం చేసుకున్నామన్నారు. క్లీన్ వైజాగ్, గ్రీన్ వైజాగ్, హెల్దీ వైజాగ్ థీమ్స్‌తో మూడు ప్రాజెక్టులను అమలు చేస్తామన్నారు. తర్వాత సేఫ్ వైజాగ్, డిజిటల్ వైజాగ్ రూపాంతరానికి ప్రతిపాదనలు చేస్తామన్నారు. కిర్లంపూడిలో పారిశుద్ధ్యం, తాగునీరు, వైఫే టెక్నాలజీ, గార్డు సిస్టం, రక్షణ వ్యవస్థలు అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఠీఠీఠీ.ౌ్ఛ ఠిజ్డ్చీజ.ౌటజ వెబ్సైట్ ప్రారంభించారు. కిర్లంపూడిలో సమస్యలను ఈ వెబ్సైట్లో నమోదు చేస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీకుంటామని తెలిపారు. పోర్టు చైర్మన్ కృష్ణబాబు, జీవీఎంసీ కమిషనర్ ప్రవీన్‌కుమార్ మాట్లాడుతూ ఫియోనిక్స్ సంస్థ ఒక కాలనీ దత్తతకు తీసుకుని స్మార్ట్ కిర్లంపూడిగా తయారు చేయడానికి సన్నద్ధం కావడం నగరాభివృద్ధికి శుభపరిణామమన్నారు. తమ శాఖపరంగా వారికి పూర్తి సహాయసహకారాలందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఫియోనిక్స్ప్రతినిధులు వాణి, సంధ్య, కిర్లంపూడి అసోసియేషన్ అధ్యక్షుడు సోమయాజులు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ ‘స్మార్ట్’ పట్నం
స్మార్ట్ సిటీపై అమెరికాతో ఏపీ ఎంవోయూ ఒప్పందంపై ఏపీ, అమెరికా అధికారుల సంతకాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దేశంలో ఎంపిక చేసిన పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మార్చే కార్యాచరణలో సాధ్యాసాధ్యాల అధ్యయనం, సలహా సంప్రదింపులు, వనరుల సమీకరణ అంశాల్లో ఆర్థిక సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. విశాఖపట్నం(ఏపీ), అలహాబాద్(యూపీ), అజ్మీర్(రాజస్థాన్)లను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసే అంశంపై ఆయా రాష్ట్రాలు, అమెరికా మధ్య ఆదివారం ఒప్పందం కుదిరింది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు ఒబామాతో జరిపిన చర్చల్లో ఈ సిటీల అభివృద్ధిపై కుదిరిన అవగాహన మేరకు.. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఒబామా కార్యరూపం ఇచ్చారు. దీని ప్రకారం స్థానిక ప్రభుత్వాలు అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ(యూఎస్టీడీఏ)కు అవసరమైన సమన్వయం, సాంకేతిక సమాచారం, పథక రచన సమాచారం, సిబ్బందిని, పరికరాలను సమకూర్చాల్సి ఉంటుంది. ఆదివారం ఢిల్లీలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అమెరికా, భారత అధికారుల సమక్షంలో యూఎస్టీడీఏ డెరైక్టర్ లియోకాడియా ఐజ్యాక్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు పరస్పరం విశాఖ స్మార్ట్ సిటీకి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ మేరకు యూఎస్టీడీఏ.. స్మార్ట్‌సిటీ సాధ్యాసాధ్యాల అధ్యయనం, స్టడీ టూర్స్, వర్క్‌షాపులు, శిక్షణ నిర్వహించేందుకు ఆర్థిక వనరులను ఏపీకి అందజేస్తుంది. అమెరికా ప్రభుత్వ వాణిజ్య శాఖ, యూఎస్ ఎగ్జిమ్ బ్యాంక్, ట్రేడ్ అండ్ ఎకనమిక్ సంస్థలు సైతం ఈ ఒప్పందం బలోపేతం చేయడానికి సహకరిస్తాయి. యూఎస్ పారిశ్రామిక సంస్థ కూడా.. ఈ సందర్భంగా.. వైజాగ్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు అమెరికా పారిశ్రామిక సంస్థ కూడా ముందుకు వచ్చింది. ఇది.. కొత్త మలుపు: వెంకయ్యనాయుడు భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కొత్త మలుపని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అభివృద్ధి సూచిక: మంత్రి నారాయణ విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థతో కుదిరిన ఒప్పందం ఏపీ అభివృద్ధికి సూచికని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
కొత్త ప్రాజెక్టులకు ప్రాధాన్యం
జీవీఎంసీ బడ్జెట్ తయారు ఖర్చు రూ. 2010 కోట్లు మిగులు బడ్జెట్ రూ. 100 కోట్లు ఇంజినీరింగ్‌కే అగ్రస్థానం విశాఖపట్నం సిటీ : మహా విశాఖ నగర పాలక సంస్థ భారీ అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించింది. రూ. 2110 కోట్ల మొత్తంతో 2015-16 సంవత్సర బడ్జెట్‌ను తయారు చేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు రూ.174 కోట్ల అంచనాలను పెంచింది. అందులోనూ రూ. 100 కోట్ల మిగులు బడ్జెట్‌తో జీవీఎంసీ పనులు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. గతంతో పోల్చుకుంటే కొత్త ఇంజనీరింగ్ ప్రాజెక్టులకే పెద్ద పీట వేస్తోంది. స్మార్ట్ సిటీ అభివృద్దికి తగ్గట్టుగానే కొత్త బడ్జెట్ రూపకల్పన చేశారు. ప్రాజెక్టుల కోసం రూ. 15 కోట్లే కేటాయించినా నాలుగో వంతు ఇంజినీరింగ్ పనులకే కేటాయించారు. వర్కింగ్ బ్యాలెన్స్‌గా రూ. 100 కోట్ల నికర మొత్తాన్ని వుంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. రూ. 2110 కోట్ల ఆదాయం వస్తుంటే అందులో రూ.2010 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేసింది. ఇంజనీరింగ్ విభాగానికి కేటాయించిన రూ. 570 కోట్లలో కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు రూ.415 కోట్లు కేటాయించారు. పాత ఇంజనీరింగ్ పనుల నిర్వహణకు రూ. 154 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. కొత్త పన్నులు లేనట్టే..! ఏప్రిల్ నుంచీ అమల్లోకి వచ్చే బడ్జెట్లో కొత్త పన్నుల భారం వుండకపోవచ్చని తెలిసింది. కొత్త ప్రాజెక్టులు వస్తున్నందున ఆదాయం కాస్త పెరిగే ఛాన్స్ వుందంటున్నారు. కౌన్సెల్ లేనందున ఈ బడ్జెట్ నివేదిక పట్టుకుని పట్టణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎ. గిరధర్ వద్దకు వెళ్లి బడ్జెట్‌ను ఆమోదించుకుని తేవడం ఒక్కటే మిగిలి వుంది. జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్కుమార్తోబాటు ఫైనాన్స్ అధికారుల బృందం ఈ మేరకు హైదరాబాద్ వెళ్లి ఆమోదింపజేసుకుని రావాల్సి వుంది. -
చంద్రన్నా.. ఇటు చూడన్నా!
‘మాటలు కోటలు దాటుతాయి.. పనులు మాత్రం గడప దాటవు’ అన్న సామెతను గుర్తు తెస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘పశ్చిమ’ వాసులకు ఇచ్చిన హామీలు. జిల్లాలో నాలుగుసార్లు పర్యటించిన చంద్రబాబు 21 హామీలు ఇచ్చారు. వాటిలో నేటికీ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయ్యూక తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ‘ఎన్నికల వేళ అప్పటి పరిస్థితులను బట్టి చాలా హామీలిచ్చాను. ఇప్పుడు వాటిని నెరవేర్చాలంటే వేలాది కోట్ల రూపాయలు అవసరం. ఇప్పుడు అంత డబ్బు లేదు. డబ్బు సృష్టించే మంత్రదండమూ లేదు’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం ఇచ్చిన చిన్నపాటి హామీల విషయంలోనూ ఆయన ఇవే మాటలు చెప్పి తప్పించుకుంటారా లేక ఇప్పుడైనా వాటిపై దృష్టి సారిస్తారా అనేది తేటతెల్లం కావాల్సి ఉంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు :మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాల్లో పర్యటనలకు సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. ‘ఎన్నికల్లో అన్ని స్థానాలూ కట్టబెట్టిన ‘పశ్చిమ’కే తొలి ప్రాధాన్యమిస్తా. ఈ జిల్లా తర్వాతే నాకు ఏ జిల్లా అయినా...’ అని బీరాలు పలికారు. జిల్లా రూపురేఖలు మార్చే వందలాది కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఇప్పటివరకు అతీగతీ లేకపోయినా స్వయానా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆయూ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన ప్రతిపాదనలూ అమలుకు నోచుకోలేదు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో బుధవారం విజయవాడలో సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంలో అరుునా జిల్లా ప్రజలకు ఇచ్చిన 17 హామీలను నెరవేరుస్తారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయూంశమవుతోంది. జిల్లా పర్యటనల్లో చంద్రబాబు ఎప్పుడు.. ఎక్కడ ఏయే హామీలిచ్చారు.. ఎంతవరకు అమలుకు నోచుకున్నాయో ఒక్కసారి పరికిస్తే... ద్వారకాతిరుమల టౌన్షిప్ గుర్తుందా: జూలై 16, 2014 సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లా పర్యటనలకు పశ్చిమగోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుట్టిన చంద్రబాబు గత ఏడాది జూలై 16న ద్వారకాతిరుమల చిన వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న తిరుపతిని పెద్దతిరుపతికి దీటుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ద్వారకాతిరుమలను టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దుతానన్నారు. 500 పడకలతో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. ద్వారకాతిరుమలను జాతీయ రహదారికి అనుసంధానం చేస్తామని, ఈ ప్రాంతంలో డ్వాక్రా శిక్షణా కేంద్రాన్ని, షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తామని, అవసరమైతే ఇంజనీరింగ్ కళాశాలను కూడా నెలకొల్పాలని యోచిస్తున్నట్టు చెప్పారు. ద్వారకాతిరుమలను పూర్తిగా మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ వాటిలో ఒక్క హామీనైనా అమలు చేసేందుకు కనీస కార్యాచరణ కూడా రూపొందించలేదు. విశేషమేమిటంటే ఆ రోజు ఇచ్చిన ఈ హామీలను మళ్లీ ఎక్కడా ప్రస్తావించలేదు. పొగాకు, ఆయిల్‌పామ్ రైతులకిచ్చిన హామీలు గాలికేజూలై 17, 2014 గత ఏడాది జూలై 16న రాత్రి జంగారెడ్డిగూడెంలో బస చేసిన సీఎం చంద్రబాబు మరుసటి రోజున చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. జంగారెడ్డిగూడెంలోని పొగాకు బోర్డు కార్యాలయంలో రైతులతో మాట్లాడారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధరను కల్పించడంతో పొగాకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు కృషి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అక్కడే ఆయిల్‌పామ్ రైతులను కలుసుకుని గిట్టుబాటు ధర సమస్య మొదలుకుని ఇతరత్రా సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని వాగ్దానం చేశారు. ఈ హామీలు నేటికీ నెరవేరలేదు. తర్వాత కనీసం వాటి ఊసెత్తిన పాపాన కూడా పోలేదు. అటకెక్కిన ఆదర్శ గ్రామం : నవంబర్ 1, 2014 జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా గత ఏడాది నవంబర్ 1న కాళ్ల మండలం కలవపూడిలో చంద్రబాబు పర్యటించారు. అక్కడి సభలో ప్రాతాళ్లమెరక గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు దాత వేగిరాజు శివవర్మ ముందుకు వచ్చారు. గ్రామాన్ని రూ.2 కోట్లతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, తాను రూ.కోటి సమీకరిస్తానని, మిగిలిన రూ.కోటి కేటాయించాలని కోరడంతో ముఖ్యమంత్రి ఆ నిధులు వెంటనే విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. మత్స్యకారుల జీవనోపాధికి డ్రెయిన్లలో చేపల ఉత్పత్తిని పెంపొందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో 2,200 కిలోమీటర్ల మేర డ్రెయిన్లలో చేప పిల్లలను వదిలి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఇది కూడా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. అక్కడి రైతులు కిక్కిస సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే తొలగింపు చర్యలకు శ్రీకారం చుడతానని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆ ఊసే ఎక్కడా లేదు. మాటలకే పరిమితమైన రోడ్లు : డిసెంబర్ 12, 2014 ఉంగుటూరు మండలం కైకరంలో జరిగిన రైతు సాధికార సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సీఎం ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అడిగిందే తడవుగా వరాల జల్లు కురిపిం చారు. నల్లజర్ల మండలం దూబచర్ల నుంచి గణపవరం మండలం మొయ్యేరు వరకు 40 గ్రామ పంచాయతీలకు లబ్ధి కలిగేలా రోడ్డును మంజూరు చేస్తానని ప్రకటించారు. కైకరం గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్‌తోపాటు కైకరం-వెంకటకృష్ణాపురం-రామన్నగూడెం రోడ్డు, గుండుగొలను-పెద్దింట్లమ్మ ఆలయం వరకు రోడ్లు వేయిస్తామని ప్రకటిం చారు. ఈ హామీలకూ షరా మామూలుగానే ఆ తర్వాత అతీగతీ లేకుండా పోయింది. ఈ ఏడాది జనవరి 1న జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో పర్యటించారు. చాటపర్రు గ్రామాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు రూ.కోటి వెంటనే విడుదల చేయిస్తామని ప్రకటించారు. ఏడు గ్రామాలకు సాగునీరు, 14 గ్రామాలకు తాగునీరు అందించే పోణంగిపుంత అభివృద్ధికి రూ.9 కోట్లు విడుదల చేయిస్తానని స్పష్టం చేశారు. దాదాపు ఆరు నెలల కిందట ప్రకటించిన వాటికే దిక్కు లేదు కేవలం వారం రోజుల కిందట ఇచ్చిన ఈ హామీలపై ఎలా ఆశలు పెట్టుకుంటామంటూ స్వయంగా టీడీపీ నేతలే మాట్లాడుతున్నారంటే చంద్రబాబు హామీలపై ప్రజలకే కాదు తెలుగు తమ్ముళ్లకూ ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన సీఎం జిల్లా పర్యటనల్లో ప్రకటించిన వరాలు ఎప్పటికి కార్యరూపం దాలుస్తాయో చూడాల్సిందే. -
ఢిల్లీలోనే మొదటి స్మార్ట్‌సిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దేశంలోనే మొదటి స్మార్ట్‌సిటీని ఏర్పాటుచేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. లండన్, శాన్ఫ్రాన్సిస్కో వంటి గ్లోబల్ సిటీల్లో ఉన్న అన్ని అత్యాధునిక సదుపాయాలతో ఢిల్లీని నిజమైన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలని తాము ఆశిస్తున్నట్లు వెంయ్యనాయుడు చెప్పారు. డిస్నీ లాండ్, యూనివర్సల్ స్టూడియోస్ వంటి ప్రపంచస్థాయి వినోదప్రదేశాలు ఢిల్లీలోనూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. దేశంలో 100 స్మార్ట్ సిటీలు ఏర్పాటుచేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిందని అందులో మొట్టమొదటి స్మార్ట్ సిటీ ఢిల్లీలోనే ఏర్పాటుచేస్తామని నాయుడు తెలిపారు. ఢిల్లీ దేశానికి గుండెకాయవంటిదని, అందుకే మొట్టమొదటి స్మార్ట్ సిటీ కూడా ఇక్కడే ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు. ఈ దిశలో భారత్‌కు సాంకేతిక సహాయమందిస్తానని స్పెయిన్‌లోని బార్సిలోనా నగర అధికారులు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. తాను ఇటీవల బార్సిలోనా నగరాన్నిసందర్శించానని, ఆధునిక భవనాలను కలిగి ఉన్న ఆ నగరం పురాతన భవనాలను కూడా పరిరక్షించుకుంటోందన్నారు. ఘనమైన సంప్రదాయ నిర్మాణాలు కలిగిన మనదేశంలో కూడా అటువంటి వాతావరణాన్ని కొనసాగించేందుకు తమ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. స్మార్ట్ సిటీ ఏర్పాటు కోసం ‘లాండ్ పూలింగ్’ విధానం ద్వారా భూసేకరణ జరుగుతుందని, ఈ విషయాన్ని ప్రస్తుతం పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, డీడీఏ పరిశీలిస్తున్నాయని వివరించారు. ఢిల్లీలో జనాభాతో వాహనాల సంఖ్య కూడా ఎక్కువ అని ఆయన అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించాలని ఆయన చెప్పారు. నగరంలో ప్రస్తుతం 85 లక్షల వాహనాలు ఉన్నాయని, రద్దీని త్గగించడం కోసం సర్క్యులర్ రైల్వే, మాస్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలను తేవడంతో పాటు బీఆర్టీ కారిడార్‌ను పునరుద్ధరించడం, మెట్రో నెట్వ ర్క్ను విస్తరించడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. నగరంలో స్మార్ట్ సిటీ ఏర్పాటుచేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు డీడీఏ వైస్‌చైర్మన్ బల్విందర్ కుమార్ తెలిపారు. స్మార్ట్ సిటీని పూర్తి ఉపనగరంగా నిర్మించనున్నట్లు ఆయన వివరించారు. ద్వారకా, రోహిణీ, నరేలాలకు చెందిన 20 -24 ఎకరాల్లో స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తారని ఆయన చెప్పారు. పూర్తి వైఫై కనెక్టివిటీ కలిగిన ఈ స్మార్ట్ సిటీ హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందని, వర్షపునీటి సేకరణ, వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టం వంటి సదుపాయాలతో పాటు ఇతర అత్యాధునిక సదుపాయాలను కలిగి ఉంటుందని ఆయన చెప్పారు. ప్లాట్ల అలాట్మెంట్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి డీడీఏ హౌజింగ్ స్కీమ్- 2014 కింద ఫ్లాట్లు అలాట్ అయినవారికి వాటిని లాంఛనంగా అందించే ప్రక్రియను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు. డీడీఏ ప్రధాన కార్యాలయం వికాస్ సదన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన లక్కీ డ్రాలో ఫ్లాట్లు గెలుచుకున్న కొంతమంది దరఖాస్తుదారులకు అలాట్మెంట్ లెటర్లను అందచేశారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ విధానాన్ని కూడా ప్రభుత్వం సరళీకరించనుందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తెలిపారు. పారిశ్రామిక ప్రదేశంలో ఫ్యాక్టరీలతో పాటు షోరూములు కూడా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని పరిశీలించడం కోసం త్వరలో ఓ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన చెప్పారు. -
కొత్త ఆశల వైపు..
సాగర సోయగాలను అణువణువునా సింగారించుకున్న సుందర నగరం మనది. ఉజ్వల భవిష్యత్తు దిశగా పరుగులు తీసే అద్భుత ప్రదేశం మనది. అయితే అనుకోని విపత్తు ఈ సౌందర్యాన్ని చిందరవందర చేసింది. అనూహ్యంగా ఎదురైన అవాంతరం ఈ ప్రయాణానికి అవరోధం సృష్టించింది. నిజమే.. ప్రకృతి మునుపెన్నడూ లేని రీతిలో విశాఖపై పగబట్టింది. అంతమాత్రాన ఈ పయనం ఆగదు కదా.. ఉరకలేసే జలపాతాన్ని గండశిల అడ్డుకుంటే ప్రవాహం దానిపై నుంచి పొంగిపొర్లక తప్పదు కదా! దీపశిఖ వంటి విశాఖను సుడిగాలి చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నించినంత మాత్రాన వెలుగుల వెల్లువ నిలిచిపోదుగా! సంకల్పబలం ముందు ప్రకృతి సైతం తలదించక తప్పదని విశాఖ ఇప్పటికే నిరూపించింది. ఆ మనోబలంతోనే ఈ మహానగరం పురోగమిస్తుంది. రాష్ట్ర ముఖచిత్రం మారిన నేపథ్యంలో విశాఖ ప్రాధాన్యం ఇంతింతై పెరుగుతోంది. స్మార్ట్ సిటీ చాన్స్, ఐటీఐఆర్ ఇంపార్టెన్స్ విశాఖ భవిష్యత్తుకు ఆలంబనగా నిలిస్తే, సహజసిద్ధమైన సౌందర్యం కారణంగా లభించబోయే పర్యాటక మహర్దశ విశాఖ స్వరూపాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతుంది. అందుకు ఈ కొత్త సంవత్సరమే ఆలంబన కానుంది. విశాఖ వాకిట మళ్లీ కళకళలాడనున్న మామిడాకుల తోరణం ఉజ్వల భవితకు సంకేతం కాకుంది. నేటి సూరీడి సాక్షిగా రేపటి వెలుగు కాంతులీనబోతోంది. -
స్మార్ట్‌గా అడుగులు
కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం హుద్‌హుద్ వంటి విషాదాలకు వీడ్కోలు విశాఖ నగరంలో నింగినంటిన వేడుకలు సాక్షి, విశాఖపట్నం: ఎన్నో కష్టాలు.. మరెన్నో కన్నీళ్లు.. ఆటుపోట్ల నడుమ 2014లో నలిగిపోయిన నగరవాసులు.. కోటి ఆశలతో 2015కి స్వాగతం పలికారు.. పగబట్టిన ప్రకృతిని ఎదిరించి, పాలకుల వంచనను భరించి గతించిన కాలాన్ని చేదు జ్ఞాపకంలా, రానున్న రోజులను అందంగా భావించి వేడుకలు జరుపుకున్నారు. నగరం నడిబొడ్డు నుంచి శివారు గ్రామాల వరకూ నూతన సంవత్సర సంబరాలు హోరెత్తించారు. ప్రశాంత విశాఖలో భారీ సంచలనాలు, పెను సవాళ్లు కొత్త కాదు. గడిచిన ఏడాదిలోనూ అలాంటివి ఎన్నో ఎదురయ్యాయి. వాటిని అధిగమించి నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్ధిక రాజధానిగా విరాజిల్లడంతోపాటు రానున్న రోజుల్లో స్మార్ట్ సిటీగా నగరం మారబోతోందనే సంతోషం నగరవాసుల్లో తొణికిసలాడింది. 2014లో భారీ విషాదం హుద్‌హుద్ రూపంలో వచ్చింది. ప్రాణాలు తీసింది. ఆస్తులను ధ్వంసం చేసింది. ప్రకృతి విపత్తు ఎంత భయంకరంగా ఉంటుందో రుచి చూపించింది. అయినా నగరం వణికిపోలేదు. నిలువెల్లా గాయాలైనా బెదిరిపోలేదు. జనం మనోధైర్యం ముందు విపత్తు చిన్నబోయింది. తలలు తెగిపడ్డ వృక్షాలు కొత్త చిగుళ్లు తొడిగాయి. అదే స్ఫూర్తి నూతన సంవత్సర వేడుకల్లో ఆవిష్కృతమైంది. కెవ్వు కేక నూతనోత్సాహంతో నగరవాసులు 2015కు స్వాగతం పలికారు. హ్యాపీ న్యూ ఇయర్ నివాదాలతో నగరం మారుమోగింది. చలిని లెక్క చేయక, ముసురును పట్టించుకోక, చిరుజల్లుల్లో తడుస్తూనే జనం సంబరాల్లో మునిగితేలారు. ప్రముఖ హోటళ్లు, రిసార్ట్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆటలు, పాటలకు విదేశీ స్వదేశీ కళాకారులను రప్పించారు. సినీ, టీవీ రంగాలకు చెందిన నటీనటులు, యాంకర్లు నూతన సంవత్సర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నగర శివారులోని ఓ రిసార్ట్‌లో దర్శకుడు కె.రాఘవేంద్రంరావు, సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో ‘సాగర సంగమం’ అనే పేరుతో నిర్వహించిన సంగీవ విభావరి యువతను ఉర్రూతలూగించింది. పాత కొత్త పాటల మేలు కలయికతో నిర్వహించిన ఈ కార్యక్రమం న్యూ ఇయర్ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచింది. బీచ్ రోడ్డులో అర్ధరాత్రి 12 గంటలకు వేడుకలు మిన్నంటాయి. కేకులు కట్ చేసి బాణసంచా కాల్చి న్యూ ఇయర్‌కి స్వాగతం పలికారు. పోలీసు శాఖ ముందుగానే ఆంక్షలు విధించడంతో ఆకతాయిలకు కళ్లెం పడింది. వాహనాలు అనుమతించిన మార్గాల్లోనే నడవాలని చెప్పినప్పటికీ అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. దేవాలయాల్లోనూ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, భక్తి గీతాలతో భక్తులు పండుగ జరుపుకున్నారు. ఇక ఫుడ్ కోర్టులకు, రెస్టారెంట్లు భారీ అమ్మకాలు జరిపాయి. ఆఫర్లతో ఆకర్షించి బిర్యానీ, ఫాస్ట్ఫుడ్లను నగరవాసులకు అందించాయి. బేకరీల్లో కేకులకు కొరత ఏర్పడింది. చేదును మర్చిపోయి, తీపిని ఆస్వాదిస్తూ చిన్నా, పెద్ద తేడా లేకుండా నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్నారు. అధిక శాతం జనం వీధుల్లోకి వచ్చి వేడుకలు జరుపుకున్నారు. కొందరు ఇళ్లల్లోనే బంధుమిత్రులతో కేకులు కోసి సంతోషాలు పంచుకున్నారు. యువతరం చిందులతో కొత్త ఏడాది సంబరాలకు కళ తెచ్చారు. -
6 లక్షల కోట్లకు వీడియో విశ్లేషణ రంగం
‘సాక్షి’ ఇంటర్వ్యూ: వీడియోనెటిక్స్ సీఎండీ టింకూ ఆచార్య 2025 నాటికి అంచనా... * వచ్చే మూడేళ్లలో వీడియోట్రాఫిక్దే పైచేయి * రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడుల దన్ను సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: స్మార్ట్సిటీలంటే వైఫై, 3జీ,4జీ నెట్‌వర్క్‌లు, సైబర్హైవేలు, కంప్యూటర్ ఆధారిత అధునాతన వసతుల కల్పనే కాదు. కంప్యూటర్ సిస్టమ్‌ల ద్వారా ఉత్పిత్తి అయిన డేటాను విశ్లేషించి, అర్థవంతమైన పరిష్కారాలను సూచించినప్పుడే ఆయా నగరాల్లో జీవించే పౌరులకు ఉత్తమమైన సేవలందుతాయంటున్నారు వీడియోనెటిక్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ టింకూ ఆచార్య. స్మార్ట్‌సిటీల నిర్మాణాలతో వీడియో విశ్లేషణ పరిశ్రమ స్థాయిని అందుకుంటోంది. 2025 నాటికి 100 బిలియన్ డాలర్ల (రూ.6 లక్షల కోట్లు) స్థాయికి వీడియో విశ్లేషణ పరిశ్రమ చేరుకోనుందని ఆచార్య తెలిపారు. 2017 నాటికి మొబైల్ డేటా ట్రాఫిక్‌లో రెండింట మూడొంతులు వీడియోల కేంద్రంగానే జరగనుందంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జెన్నెక్ట్స్ వెంచర్స్ పెట్టుబడులతో వీడియో పర్యవేక్షణ టెక్నాలజీ ఉత్పత్తుల రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఈ సంస్థకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా,రైల్వేలు, రక్షణశాఖ, పలు రాష్ర్టల్లోని పోలీస్ డిపార్ట్మెంట్లు, కువాయిత్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ, అబుధాబీలోని ముష్రిఫ్మాల్, క్యాపిటల్ ప్లాజా మాల్ లాంటి సంస్థలు క్లయింట్లుగా ఉన్నారు. బహుళ ప్రజాదరణ పొందిన వెబ్‌క్యామ్ టెక్నాలజీ (ఇంటెల్ సంస్థ) రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించిన డాక్టర్ ఆచార్య సాక్షి ప్రతినిధికిచ్చిన ఇం టర్వ్యూలో స్మార్ట్‌సిటీల కోసం తమ సంస్థ అభివృద్ధిచేస్తున్న పలు సాఫ్ట్వేర్ ఉత్పత్తుల గురించి తెలిపారు. ఆ వివరాలు ఇవీ... స్మార్ట్‌సిటీ అంటే... స్మార్ట్‌సిటీ అంటే భౌతికంగా అందమైన కట్టడాలను, రోడ్లను నిర్మించడం మాత్రమే కాదు. టెక్నాలజీ పరంగా ఆయా నగరాల్లో జీవించే పౌరులకు సురక్షితమైన, బాదరబందీలేని జీవన విధానాన్ని అందించేవిధంగా సౌకర్యాలను రూపొందించాలి. కంప్యూటింగ్,వీడియోగ్రఫీ ఆధారంగా నిర్మితమయ్యే స్మార్ట్‌సిటీలలో రక్షణలేకపోతే అర్ధం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఇంటెలిజంట్ వీడియో ద్వారా సాధ్యమవుతోంది. ఇంటెలిజెంట్ వీడియో అంటే... దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణ,రోడ్డు సేవలకై లక్షలాది కెమెరాలను వినియోగిస్తున్నారని, అయితే అవి ఉత్పత్తి చేసే దృశ్యాలను విశ్లేషించి చర్యలు తీసుకునే వ్యవస్థ లేకపోవడంతో అక్కడ ఇంకా క్రైమ్ రేటు అధికంగానే ఉంటోందన్నారు. వీడియో దృశ్యాలను ఆటోమేటిక్‌గా విశ్లేషించి నియంత్రణ సంస్థలు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేందుకు వీలుగా వీడియోనెటిక్స్ సంస్థ 70కిపైగా పేటెంట్ కలిగిన సాఫ్ట్వేర్లను అభివృద్ధి పరిచిందని ఆయన చెప్పారు. ఉత్పత్తుల వివరాలు... ఆటోమేటెడ్ నంబర్‌ప్లేట్ రికగ్నిషన్, రెడ్‌లైట్ అతిక్రమణ గుర్తింపు, వ్యక్తుల ముఖాలను గుర్తించే ఉత్పత్తులు ప్రస్తుతం హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రిటైల్ బిజినెస్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్ వీడియో అనలిటిక్స్, స్మార్ట్వ్యాన్,వీడియో మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లు మా ప్రధానమైన ఉత్పత్తులు. ఇండియా కోసం ప్రత్యేకంగా 20 పేటెంట్లను పొందాం. మార్కెట్‌పై అంచనాలు? భవిష్యత్తు ఇంటెలిజెంట్ వీడియోదే. మా పరిశోధన, అభివృద్ధి అంతా కొత్త కొత్త సాఫ్ట్వేర్ ఉత్పత్తుల కేంద్రంగానే కొనసాగుతోంది. దేశంలో 100 స్మార్ట్‌సిటీలు ఏర్పాటుకానున్నాయి. పూర్తి స్థాయిలో ఈ మార్కెట్‌పైనే దృష్టి పెడుతున్నాం. కొన్ని విదేశీ సంస్థలు ముఖ్యంగా మైల్స్టోన్ సిస్టమ్స్, ఏజెంట్6 లాంటివి ఈ రంగంలో మాతో పోటీకి రాగలవు. అయితే స్మార్ట్‌సిటీల సెక్యూరిటీ దృష్ట్యా దేశీయ సంస్థలనే ఈ రంగంలో ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరాం. పెట్టుబడుల సేకరణ... ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జెన్నెక్స్ట్ వెంచర్స్ రెండు రౌండ్లలో పెట్టుబడులు పెట్టింది. అవసరమైతే మరిన్ని నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది మా టర్నోవర్ రూ. 25 కోట్లు దాటనుంది. -
21వ శతాబ్దికి అనుగుణంగా..
స్మార్ట్ సిటీలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం న్యూఢిల్లీ: దేశంలో ఏర్పాటు చేయదలచిన స్మార్ట్ సిటీలు 21వ శతాబ్దపు అవసరాలకు తగినట్లుగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పట్టణాల పరిపాలనను మెరుగుపరచడం ఈ సిటీల పథకం లక్ష్యం కావాలని... పట్టణ ప్రజలతో పాటు పట్టణాలపై ఆధారపడిన ప్రజానీకాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. సోమవారం ఢిల్లీలో స్మార్ట్ సిటీల అంశంపై జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘స్మార్ట్ సిటీ’లపై కేంద్ర, రాష్ట్రాల పట్టణాభివృద్ధి సంస్థలతో త్వరలో ఒక వర్క్‌షాప్ నిర్వహించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను ఆదేశించారు. పట్టణాల్లో మెరుగైన పరిపాలన దేశ పరిపాలన బలోపేతం కావడానికి తోడ్పడుతుందన్నారు. ఈ స్మార్ట్ సిటీలు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉండాలని చెప్పారు. 21వ శతాబ్ధంలో పట్టణాలు, నగరాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవితం, పౌర కేంద్రీకృత సేవలు వంటివాటిని గుర్తించాలని అధికారులకు సూచిం చారు. ఘనవ్యర్థాల నిర్వహణ, వృథానీటి పునర్వినియోగం వంటి వాటితో వృథా నుంచి సంపదను సృష్టించే చర్యలు చేపట్టాలన్నారు. -
రూపురేఖలు మారుస్తా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కొండపిలో సోమవారం జరిగిన రైతు సాధికారత సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేస్తానని, దొనకొండ, కనిగిరిలను పారిశ్రామికవాడలుగా, కనిగిరిలో సోలార్ విద్యుత్తు తయారు చేసే ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. తాను ముందుగా ప్రకటించిన విధంగా విమానాశ్రయం, వెటర్నరీ యూనివర్శిటీ వచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఒంగోలు స్మార్ట్ సిటీ అంశాన్ని ప్రస్తావించ లేదు. పాలేరు రిజర్వాయర్ అడిగారని, దీనికి రూ. 65 కోట్లు ఖర్చవుతుందని చెప్పారని, దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత మంజూరు చేస్తానని చెప్పారు. మూలపాడు, మర్రిపాడు రిజర్వాయర్‌కు రూ.20 కోట్లు ఖర్చవుతుందని, దీనివల్ల టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమిల్లి మండలాలకు తాగునీటి సమస్య తీరుతుందని, దీన్ని మంజూరు చేస్తానని చెప్పారు. కొండపి చుట్టూ రింగ్ రోడ్డు కావాలని అడిగారని, దీన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తానని చెప్పారు. టంగుటూరు నుంచి పొదిలికి, కొండపి నుంచి కమ్మపాలెం వరకూ రెండులైన్ల రోడ్డు అడిగారని దీన్ని కూడా మంజూరు చేస్తానని చెప్పారు. సాగు నీటి కోసం వెలుగొండ ప్రాజెక్టు నుంచి 40 టీఎంసీల నీటిని విడుదల చేస్తే జిల్లా మెట్ట ప్రాంతం సస్య శ్యామలమవుతుంది. నాగార్జున సాగర్ ఫేజ్ -2 ద్వారా కందుకూరు, కొండపి, ఉదయగిరికి నీరు అందిస్తాం... జిల్లాలో ఫ్లోరైడు అధికంగా ఉంది. భూగర్భ జలాలుపైకి వస్తే దీన్ని అరికట్టగలం, నీరు - చెట్టు కార్యక్రమానికి అందరూ సహకరించాలని అన్నారు. ఆ తర్వాత రైతు ప్రతినిధులు కలిసి కౌలు రైతులకు రుణమాఫీ, శనగల కొనుగోలు, సుబాబుల్ కొనుగోలుకు సంబంధించి విజ్ఞాపనలు అందజేశారు. కౌలు రైతుల విషయంలో సానుకూలంగా స్పందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్బీఐ అంగీకరించకపోయినా, రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ముఖ్యమంత్రి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేశారని కొనియాడారు. తొలుత ఆయన జిల్లా పరిషత్ హైస్కూల్లో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సందర్శించారు. మీ సేవా విభాగం ఏర్పాటు చేసిన స్టాల్ దగ్గరికి వెళ్లి రైతు రుణమాఫీకి సంబంధించి అందిస్తున్న సర్వీసు వివరాలను, జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఒక్కో గ్రూపునకు ఐదుగురు చొప్పున ఏర్పాటు చేసిన మూడు గ్రూపులకు ట్రాక్టర్లు, దుక్కి యంత్రాలు, విత్తనాలు నాటే పరికరాలు పంపిణీ చేశారు. హెలీఫ్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి ఎద్దుల బండిపై ముఖ్యమంత్రి వచ్చారు. హుద్‌హుద్ తుపాను బాధితులకు పలువురు విరాళాలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు రూ.68 లక్షలు విరాళం అందజేయగా, మార్కాపురం జర్నలిస్టులు రెండు లక్షల రూపాయల విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఈ సభకు డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున స్కూల్ బస్సుల్లో తరలించారు. ఈ సదస్సు అనంతరం ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉన్నా, తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి చెందడంతో సమీక్షా సమావేశం రద్దు చేసుకుని ముఖ్యమంత్రి తిరుపతి బయలుదేరి వెళ్లారు. జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు ఇవ్వరూ ఒంగోలు సబర్బన్: కొండపిలో రైతు సాధికారత సదస్సుకు విచ్చేసిన చంద్రబాబు నాయుడుకు ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు తదితరులు రూ. 2 లక్షల చెక్కును అందిస్తూ ఆరోగ్య బీమా కార్డుల విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్య బీమా కింద ఇచ్చే హెల్త్ కార్డులను త్వరితగతిన విలేకరులకు అందేవిధంగా చర్యలు చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు ఐవీ సుబ్బారావు వివరించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట శంకర్ హత్యకు సంబంధించి విచారణ ముమ్మరం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. శంకర్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందించాలని కూడా కోరారు. సీఎంను కలిసిన వారిలో జిల్లా కార్యదర్శి వేటపాలెం శ్రీనివాస్, కోశాధికారి డి.కనకయ్యతోపాటు పలువురు ఉన్నారు. -
స్మార్ట్ సిటీ లక్ష్యంగా మౌలిక సదుపాయాలు
విజన్-2030కి తగ్గట్టుగా ప్రణాళికలు ఏడీబీ బృందానికి వివరించిన జిల్లా అధికారులు విశాఖపట్నం : విశాఖపట్నంలో స్మార్ట్ సిటీకు తగ్గ మౌలిక సదుపాయాల కల్పనపై జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. విశాఖ-చెన్నై కారిడార్ అధ్యయనం కోసం జిల్లాకు వచ్చిన ఏడీబీ బృందం సభ్యులకు స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయనున్న విశాఖపట్నంలో కల్పించనున్న మౌలిక సదుపాయలను కలెక్టర్ యువరాజ్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌లు వివరించారు. అమెరికా సౌజన్యంతో దేశంలో అలహాబాద్, అజ్మీర్లతో పాటు విశాఖపట్నం స్మార్ట్ సిటీలుగా ఎంపికైన విషయం తెలిసిందే. విజన్-2030 తగ్గట్టుగా విశాఖలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ యువరాజ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఏడీబీ బృందం సభ్యులకు వివరించారు. ప్రస్తుతం 18 లక్షలుగా ఉన్న నగర జనాభా 2030 నాటికి కనీసం 30 లక్షలకు పైగా చేరుకుంటుందని అంచనాతో ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. స్మార్ట్‌సిటీ ప్రాధాన్యతను వివరిస్తూ తొలుత 24ఇన్‌టూ 7 విద్యుత్ సరఫరా చేయాలని, ప్రతి మనిషికి రోజూ 130 గ్యాలెన్ల నీటిని సరఫరా చేయాలని, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని పెంపొందించాలని, పుట్పాత్స్ను కనీసం రెండు మీటర్లు వెడల్పుతో ఉండాలని, డెడికేటెడ్ బైస్కిల్ ట్రాక్స్‌తో పాటు ఏ మూల నుంచైనా 45 నిమిషాల వ్యవధిలోనే వర్క్ ప్లేస్‌కు చేరుకునేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏడీబీ బృందం సభ్యులు సూచించారు. కలెక్టర్ యువరాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ వేసవిలో కోతలు విధించకతప్పడం లేదని వివరించారు. ఈ పరిస్థితిని రానున్న వేసవిలో అధిగమించేందుకు వీలుగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏలేరు నుంచి రోజూ 30 మిలియన్ గ్యాలెన్స్ నీరు తరలిస్తున్నామని, ఈ నీటితో ప్రజల మంచినీటిఅవసరాలు తీరుస్తూనే విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు ఇతర పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగిస్తున్నామన్నారు. గోదావరిలో సర్ప్లస్ వాటర్‌ను ప్రత్యేక పైపులైన్ ద్వారా విశాఖకు మళ్లించేందుకు రూ.2వేల కోట్లతో ఓ ప్రాజెక్టు రూపకల్పన చేశామన్నారు. 24 గంటలూ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాన్ని ప్రతిపాదిస్తున్నామన్నారు. ఇందుకోసం 917 ఎకరాల భూములను కూడా గుర్తించామన్నారు. రానున్న ఐదేళ్లలో 4 వేల మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు, డీఆర్వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు మార్గాల్లో ఎక్స్‌ప్రెస్-వే
ఈ రూట్లలో... అల్వాల్ - బేగంపేట- మాదాపూర్ ఎల్బీనగర్ - ఆరాంఘర్ - గచ్చిబౌలి కొంపల్లి - బోయిన్పల్లి - ప్యారడైజ్ మాదాపూర్ - గచ్చిబౌలి - బీహెచ్ఈఎల్ - పటాన్చెరు సిటీబ్యూరో: విశ్వ ఖ్యాతి... చూడచక్కని ఆకాశహర్మ్యాలు.. మురికివాడలు లేకుండా వంటి చర్యలతో హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలనుకుంటున్న సీఎం కేసీఆర్ ఆలోచనలకనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా ట్రాఫిక్ సమస్యపైనా దృష్టి సారించారు. తొలిదశలో నాలుగు కారిడార్లను ఎక్స్‌ప్రెస్ వేలుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఎక్కడా రెడ్ సిగ్నల్ పడకుండా వీటిని తీర్చిదిద్దనున్నారు. ఇందుకుగాను అవసరమైన మేర ఫ్లైఓవర్లు.. స్పైరల్ మార్గాలను నిర్మించనున్నారు. వరదనీటి పారుదల, డక్టింగ్ తదితర ఏర్పాట్లు చేయనున్నారు. ఇలాంటి సదుపాయాలతో రహదారులను తీర్చిదిద్దేందుకు దిగువ మార్గాలపై దృష్టి సారించారు. ఎంపిక చేసిన ఈ నాలుగు మార్గాల్లో అడ్డంకులు, సిగ్నలింగ్ ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై నివేదికలు రూపొందించాలని కన్సల్టెంట్లను ఆహ్వానించనున్నారు. అందుకనుగుణంగా అవసరమైన చర్యల కోసం ప్రభుత్వంతో సమావేశం జరుపనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషన ర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఎక్స్‌ప్రెస్ కారిడార్లపై ఇంజినీరింగ్ అధికారులు, ట్రాఫిక్ విభాగం సీనియర్ అధికారులతో సోమేశ్‌కుమార్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పైమార్గాలను ఎక్స్‌ప్రెస్‌వేలుగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. వీటి ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపించనున్నారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నందునే పై నాలుగు మార్గాలను ఎంపిక చేశామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫి క్ ఇబ్బందులు లేకుండా చేయాలని భావిస్తున్నామన్నారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని కన్సల్టెంట్లను కోరనున్నామని, వారి నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
రైల్వే జోన్‌కు పచ్చజెండా
స్మార్టు సిటీగా ప్రకటించిన నేపథ్యంలో విశాఖకు మరింత బలం రైల్వేమంత్రి సానుకూల స్పందన పార్లమెంటు సమావేశాల్లోనే నిర్ణయముంటుందా.. విశాఖపట్నం సిటీ: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కసరత్తు తొందర్లోనే ముగియనుంది. రైల్వే జోన్ ఏర్పాటు అంశం పూర్తిగా రాజకీయ నిర్ణయమే అయినా ఎలా వెలువడుతుందోననే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే జోన్ భవిష్యత్ ఓ కొలిక్కి రానుందని రైల్వే వర్గాలంటున్నాయి. జోన్ కమిటీ రైల్వే బోర్డుకు ఇప్పటికే తమ నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే. కానీ రైల్వే బోర్డు దాన్ని గోప్యంగా వుంచింది. నివేదిక ముఖ్యాంశాలు బయటకు పొక్కకమునుపే రైల్వే మంత్రి సదానంద గౌడ స్థానంలో సురేష్ ప్రభాకర్ ప్రభును రైల్వే మంత్రిగా నియమించి బాధ్యతలు అప్పగించింది. ఆయన రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రతీ కార్మికునికీ ఓ లేఖ రాసి ఆకట్టుకుంటున్నారు. సురేష్ప్రభాకర్ను కొందరు ఎంపీలు శుక్రవారం పార్లమెంట్లో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విశాఖ కేందంగా జోన్‌పై సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. రైల్వే సహాయ మంత్రి సిన్హా కూడా సానుకూలంగా వుండడంతో విశాఖకు రైల్వే జోన్ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. అమెరికా అభివృద్ది చేయనున్న మూడు స్మార్ట్ సిటీల్లో అహ్మదాబాద్, విశాఖలు వుండడంతో జోన్ కేంద్రం కూడా విశాఖకే అన్న భావన వ్యక్తమవుతోంది. డిసెంబర్ మొదటి వారంలోగా కేంద్రం దీనిపై ఓ ప్రకటన చేయొచ్చని అంచనా. ఇదిలా వుండగా రైల్వే బోర్డులో గానీ,రైల్వే జోనల్ కేంద్రమైన భువనేశ్వర్‌లో గానీ కొత్త రైల్వే జోన్ అంశంపై ఎలాంటి సమాచారం లేదని అధికారిక వర్గాలు అంటున్నాయి. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు నివేదిక ఇచ్చిన కమిటీ ఎలాంటి బలమైన సాంకేతిక అడ్డంకులను ప్రస్తావించలేదని భోగట్టా. జోన్ కేంద్రం విశాఖలో ఏర్పాటుకు అవసరమైన సాంకే తిక అడ్డంకులు లేకపోవడంతో నివేదికను మరోసారి లోతుగా పరిశీలించి నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. జోన్ మాటెలాఉన్నా కనీసం వాల్తేరును దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేసినా ఫర్వాలేదని కొందరంటున్నారు. -
ఖమ్మంను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి ఎంపీ పొంగులేటి వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఐదు లక్షలకుపైగా జనాభా ఉన్న ఖమ్మంను స్మార్ట్ సిటీగా ప్రకటించి అభివృద్ధి చేయాలని వైఎస్సార్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు వినతి పత్రాన్ని అందజేశారు. అర్బన్ మండలంలోని 9 గ్రామాలను విలీనంచేస్తూ ఖమ్మం కార్పొరేషన్‌గా ప్రకటించారని, అయితే కనీస వసతులు కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఖమ్మం నగరానికి పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో సమస్యలు తీవ్రమయ్యాయని, పారిశుధ్య నిర్వహణ లోపించిందని, తక్షణమే ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించాలని కోరారు. ఖమ్మంలో లక్షకు పైగా ఇళ్లుండగా 25వేల లోపే నల్లా కనెక్షన్లు ఉన్నాయని, దీంతో తాగునీటి సమస్య ఎక్కువైందని నివేదించారు. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీలైనంత త్వరగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. గాలి దుమారాలకు చెట్లు విరిగి విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైను ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఖమ్మం కార్పొరేషన్లో వీధిదీపాల స్థానంలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, కొత్తగూడెంను కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించాలని కోరారు. -
అభివృద్ధి దివిటీ స్మార్ట్ సిటీ
యావద్భారతావని ఇప్పుడు స్మార్ట్ జపం చేస్తోంది. నరేంద్ర మోదీ కొలువు దీరిన వేళ స్మార్ట్ సిటీల ఏర్పాటును ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తావించింది.తొలి దశగా వంద స్మార్ట్ నగరాలను నెలకొల్పేందుకు సంకల్పించింది. ప్రాంతాల వారీ ప్రాధాన్యమిస్తూ నగరీ కరణ బాట పట్టడం శుభసూచికమే అని చెప్పాలి. అయితే శతకోటి జన భారతంలో ఈ స్మార్ట్‌సిటీలు ప్రాథమిక అవసరాల లోటును తీరుస్తాయా? ఆర్థిక అసమానతలను రూపు మాపి అసలు సిసలైన అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తాయా? స్మార్ట్ సిటీ-ఆవశ్యకత: దేశంలో సహజంగా పట్టణ ప్రాంతాల్లో జనాభా వృద్ధి రేటు అధికం. దీనికి తోడు గ్రామీణులు పట్టణాలకు వలస బాట పట్టడంతో అక్కడ జనాభాలో పెరుగుదల ఏర్పడింది. 2011 గణాంకాల ప్రకారం... గుజరాత్లో 42.6 శాతం, మహారాష్ట్రలో 45.2 శాతం ప్రజలు పట్టణాల్లోనే నివశిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ (విభజనకు ముందు) మినహా మిగతా రాష్ట్రాల్లోని జనాభాలో 35 శాతానికి పైగా పట్టణ జనాభా నమోదయింది. తమిళనాడు మొత్తం జనాభాలో 48.5 శాతం, కేరళలో 47.7 శాతం, కర్ణాటకలో 38.6 శాతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 33.5 శాతం పట్టణ ప్రాంతాల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పట్టణాలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పట్టణీకరణ ప్రక్రియ పెద్ద నగరాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాలలోనే కేంద్రీకృతమైనందువల్లవాటి వృద్ధిలో వ్యత్యాసాలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలతో పెద్ద నగరాల్లో స్వాతంత్య్రానంతరం జనాభా వృద్ధి అధికమైంది. 1971-81 మధ్య కాలంలో బెంగళూరు జనాభా 75.6 శాతం పెరిగింది. 1981-1991 కాలంలో పశ్చిమబెంగాల్లోని అజాన్సోల్ పట్టణంలో జనాభా పెరుగుదల ఏకంగా 108.7 శాతం కాగా ఫరీదాబాద్ (హర్యానా)లో 85.5 శాతం, గౌహాతి(అసోం)లో 188.3 శాతం, థానే (మహారాష్ట్ర)లో 105.9 శాతం, విశాఖపట్టణం (ఆంధ్రప్రదేశ్)లో 75 శాతం, భువనేశ్వర్ (ఒడిశా) లో 87.7 శాతం నమోదైంది. 1991-2001 మధ్య కాలంలో సూరత్ (గుజరాత్)లో 85.1 శాతం, నాసిక్ (మహారాష్ట్ర)లో 58.9 శాతం జనాభా పెరిగింది. 2001-2011 మధ్యలో ఢిల్లీ, గ్రేటర్ ముంబయి, కోల్‌కత నగరాల్లో జనాభా పెరుగుదల అధికంగా నమోదైంది. గత రెండు దశాబ్దాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో వృద్ధి స్తంభించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. ఐరోపా సమాఖ్య వ్యూహాల బాటలో: 1991-2001 కాలంలో వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్న 70 లక్షల మంది ఆ రంగానికి దూరమయ్యారు. పెరిగిన వలసలతో పట్టణ ప్రాంతాల్లో పలు సమస్యలు చుట్టుముట్టాయి. నిరుద్యోగితా రేటు అధికమైంది. భౌతిక , సాంఘిక అవస్థాపనల విషయంలో పట్టణ ప్రాంతాల పురోగతి మందగించింది. ఈ నేపథ్యంలో 2014 మేలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) ప్రభుత్వం స్మార్ట్ సిటీలు అనే అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా దేశంలో తొలి దశగా 100 స్మార్ట్ సిటీలు నెలకొల్పడానికి సంకల్పించింది. ఇందుకు అభివృద్ధి చెందిన దేశాలు తమ వంతు సహకారం అందించడానికి ముందుకొచ్చాయి. దీంతో స్మార్ట్ సిటీల ఏర్పాటు భారత్‌లో ప్రధాన చర్చనీయాంశం అయింది. మెట్రో పాలిటన్ నగరాల్లో స్మార్ట్ అర్బన్ గ్రోత్ సాధించడానికి యూరోపియన్ యూనియన్ అనుసరించే వ్యూహాలను రూపొందించడంపై దృష్టి సారించింది. స్మార్ట్ సిటీ-నిర్వచనాలు: స్మార్ట్ సిటీని నిర్వచించడానికి ఫ్రాస్ట్ అండ్ సులిబాన్‌లు ప్రధానంగా ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. 1. స్మార్ట్ గవర్నెన్స్ 2. స్మార్ట్ ఎనర్జీ 3. స్మార్ట్ బిల్డింగ్ 4. స్మార్ట్ మొబిలిటీ 5. స్మార్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ 6. స్మార్ట్ టెక్నాలజీ 7. స్మార్ట్ హెల్త్ కేర్ 8. స్మార్ట్ సిటిజన్ స్మార్ట్ సిటీస్ కౌన్సిల్ నిర్వచనం ప్రకారం.. నగరాలకు సంబంధించి అన్ని ప్రధాన కార్యక్రమాల్లో డిజిటల్ టెక్నాలజీ అనుసంధానించినట్లయితే ఆ నగరమే స్మార్ట్ సిటీ. ఐఈఈఈ స్మార్ట్ సిటీస్ వివరణ: స్మార్ట్ ఎకానమీ, స్మార్ట్ మొబిలిటీ, స్మార్ట్ ఎన్విరాన్మెంట్, స్మార్ట్ పీపుల్, స్మార్ట్ లివింగ్, స్మార్ట్ గవర్నెన్స్ అనే లక్ష్యాలను సాధించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, ప్రభుత్వం, సమాజాన్ని ఒకే చోటకు చేర్చడం బిజినెస్ డెరైక్టరీ మాటల్లో: సుస్థిర వృద్ధి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ముఖ్యమైంది ఆర్థిక వ్యవస్థ స్థాయి పెంపు. ఈ విషయం లో ప్రగతి సాధించిన పట్టణ ప్రాంతమే స్మార్ట్ సిటీ. స్మార్ట్‌సిటీ ప్రస్థానం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో స్మార్ట్ సిటీ అనే పేరు ఆవిర్భవించింది. 2008లో ఐ.బి.ఎం స్మార్టర్ ప్లానెట్ ఇనీషియేటివ్ (I.B.M smarter planet initiative)లో భాగంగా స్మార్టర్ సిటీస్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. 2009 ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు స్మార్ట్ సిటీలపై ఆసక్తి కనబరిచాయి. దక్షిణ కొరియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, చైనాలు స్మార్ట్ సిటీల ఏర్పాటు, పరిశోధనపై అధిక పెట్టుబడులు పెట్టాయి. ఇదివరకే అంతర్జాతీయ వాణిజ్య జిల్లా వెరోనాలో ఈ సిటీలు ప్రాచుర్యం పొందాయి. ఇక మనదేశం విషయానికి వస్తే.. కోచి, అహ్మదాబాద్, ఔరంగాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్లోని మనేసర్, ఖుష్‌కెరా (రాజస్థాన్), కృష్ణపట్నం, పొన్నే (తమిళనాడు), తుంకూరు (కర్ణాటక) ప్రాంతాల్లో స్మార్ట్ సిటీలు నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో ప్రత్యేక పెట్టుబడి ప్రాంతాలు లేదా ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటవుతాయి. ఆయా ప్రాంతాలలో పన్ను నిర్మాణతలో నియంత్రణల సడలింపు ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆశయం అభినందనీయం: భారత ప్రభుత్వం 2020 నాటికి 100 స్మార్ట్‌సిటీల అభివృద్ధి లక్ష్యాన్ని చేపట్టింది. భారత్‌లో స్మార్ట్‌సిటీల ఏర్పాటు ప్రపంచ బ్యాంకు సమ్మిళిత గ్రీన్ గోల్‌కు అనుగుణంగా ఉంది. శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుస్థిర వృద్ధి సాధనకు స్మార్ట్‌సిటీల ఏర్పాటు దోహదపడగలదని పలువురి నిపుణుల అభిప్రాయం. మధ్య తరహా నగరాలను ఆధునికీ కరించడం ద్వారా 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 2014-15 కేంద్ర బడ్జెట్లో వీటి కోసం రూ. 7060 కోట్లను కేటాయించారు. దీర్ఘకాలంగా విఫలమైన ప్రాంతీయ ప్రణాళికకు ఉప ఉత్పత్తిగా భారత్‌లో పట్టణీకరణను భావించారు. పట్టణాల్లో జరుగుతున్న వ్యయాన్ని మించి లబ్ధిచేకూరేలా ప్రయత్నించినపుడే అధికవృద్ధి సాధ్యమవుతుంది. పట్టణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించడంతోపాటు అధిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా స్మార్ట్ సిటీల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం అభినందనీయం. అమెరికా, సింగపూర్ సహకారం: జపాన్, సింగపూర్, అమెరికా, గ్లోబల్ పెన్షన్ ఫండ్లు భారత్‌లో 100 స్మార్ట్‌సిటీల అభివృద్ధికి తమ సహకారం అందించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. గ్రేటర్ నొయిడాలో రూ.30వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాగలవని అంచనా. స్మార్ట్ సిటీల ఏర్పాటులో భారతీయ సంస్థలతో కలిసి పనిచేయడానికి అమెరికా ఆసక్తి కనబరు స్తోంది. భారత్‌లో రైల్వే వ్యవస్థ, పరికరాల అభివృద్ధి, విమానాశ్రయాలు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ, ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణ, వాటి మరమ్మతు, భద్రతా వ్యవస్థను ఆధునికీకరించడం, రక్షిత నగరాల ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ, నౌకాశ్రయాల అభివృద్ధికి భారత్‌కు అమెరికా సహకారం ఎంతో అవసరం. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిలో భారత్, అమెరికాలు పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకున్నప్పుడే స్మార్ట్‌సిటీల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది. అటు సింగపూర్ కూడా స్మార్ట్‌సిటీల నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు సన్నద్ధంగా ఉంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అభివృద్ధిలోనూ పాలుపంచుకోవాలని అభిలషిస్తోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, సింగపూర్ ప్రధాని లీ సియెన్ లుంగ్‌ల మధ్య జరిగిన సంభాషణలలో ఆయా రంగాలలో సహకారానికి సంబంధించి కమిటీలను ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. స్మార్ట్‌సిటీల అభివృద్ధితో పాటు 500 పట్టణాలు, నగరాల్లో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, పట్టణ గృహనిర్మాణ కార్యక్రమం, చారిత్రక, వారసత్వ నగరాల అభివృద్ధికి సంబంధించి అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. అత్యాధునిక రవాణా వ్యవస్థ, వివిధ సేవల బట్వాడాలో భాగంగా ఈ-అర్బన్ గవర్నెన్స్, ఘన వ్యర్థాల నిర్వహణ- నీటి యాజమాన్యంలో సహకరించాలని సింగపూర్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. కోచి స్మార్ట్‌సిటీగా రూపుదాల్చితే: ప్రతిపాదిత కోచి స్మార్ట్‌సిటీగా రూపుదాల్చితే... లక్షమంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. కేరళ రాష్ట్రం ఉత్తమ ఐటీ హబ్‌గా అవతరిస్తుంది. విద్యావంతులైన మహిళా ఐటీ నిపుణులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు లభిస్తాయి. కేరళ ప్రజల జీవన ప్రమాణాల పెరుగుతాయి. పేపర్, మీడియా పరిశ్రమ వృద్ధి చెందుతుంది. 20 ఏళ్లలో 500 నగరాలు: సగటున ప్రతి నిమిషానికి గ్రామీణ ప్రాంతాల నుంచి 30 మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. 2050 నాటికి అదనంగా 700 మిలియన్ల వలస ప్రజల అవసరాలు తీర్చాలంటే రాబోయే 20 ఏళ్లలో 500 కొత్త నగరాలను దేశంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 2050 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభాలో నగర జనాభా వాటా 70 శాతంగా ఉంటుందని అం చనా. భారత్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించే అవకాశాలు ఉ న్నాయి. పెరుగుతున్న పట్టణ జనాభాకు సకల సౌకర్యాలు కల్పించాలంటే దేశంలో 500 నగరాల ఏర్పాటు అవసరం. సుస్థిర వృద్ధి: పట్టణాల్లోని ప్రజలు నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు తక్షణ పరిష్కారంలో భాగంగా స్మార్ట్‌సిటీల ఏర్పాటు వెలుగులోకి వచ్చింది. వనరులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా స్మార్ట్‌సిటీలు నవకల్పనకు ఊతమిస్తాయి. తద్వారా ఆరోగ్యకరమైన పోటీతత్వం, సమ్మిళిత ఆర్థికవృద్ధి సాధ్యమవుతుంది. విధానాలే ప్రామాణికం: అవస్థాపనా సౌకర్యాల కల్పనతో పాటు అధిక పెట్టుబడుల్ని ఆకర్షించేలా స్మార్ట్‌సిటీల ఏర్పాటు అభినందనీయం. అయితే ఈ సుందర నగరాలు మౌలిక వసతులతో విరాజిల్లేలా రూపుదిద్దుకోవాలి. ఇందుకోసం నియంత్రణల సడలింపు, పన్ను నిర్మాణతలో మార్పులతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలి. స్మార్ట్‌సిటీల ఏర్పాటులో పక్షపాత ధోరణికి పాల్పడకుండా, పాలక ప్రభుత్వాలు పట్టణాభివృద్ధికి పాటుపడాలి. అలా జరిగినప్పుడే స్మార్ట సిటీలు అభివృద్ధి దివిటీలుగా ఆవిర్భవిస్తాయి. ప్రయోజనాలు అవస్థాపనా సౌకర్యాల కల్పనతోపాటు సుస్థిర రియల్ ఎస్టేట్, సమాచారం, మార్కెట్ సౌకర్యాలు ఉన్న పట్టణ ప్రాంతంగా స్మార్ట్ సిటీలు ఆవిర్భవించాలి. స్మార్ట్ టెక్నాలజీని అమలు చేయడం ద్వారా కింది ప్రయోజనాలు చేకూరుతాయి. 1. సమర్థవంతమైన పబ్లిక్ రవాణా వ్యవస్థ 2. వ్యర్థ నీటి రీసైక్లింగ్ (Sewage Water Recycling) 3. నీటి వృథాను అరికట్టే సెన్సార్స్, యాజమాన్యం. 4. {Xన్ స్పేసెస్ 5. భౌతిక, సాంఘిక అవస్థాపనా సౌకర్యాల కల్పన 6. {పత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో ఉపాధి 7. వస్తు, సేవల లభ్యత 8. {పజల జీవన ప్రమాణాల్లో పెరుగుదల 9. సహజ వనరుల సమర్థ వినియోగం 10. గవర్నెన్స్‌లో పౌరుల భాగస్వామ్యం 11. పర్యావరణ పరిరక్షణ - యాజమాన్యం 12. స్మార్ట్ పట్టణాభివృద్ధి సాధన 13. సుస్థిర వృద్ధి 14. గ్లోబల్ నెట్ వర్కింగ్ 15. సృజనాత్మక పరిశ్రమ 16. ఆధునిక సమాచార వ్యవస్థ అందుబాటు 17. ఈ-అర్బన్ గవర్నెన్స్ 18. పారిశ్రామికీకరణ 19. భద్రతా వ్యవస్థ ఆధునికీకరణ