చెత్త కనబడకుండా ’స్మార్ట్‌’ ఐడియా! | Karimnagar Corporation Innovative Idea For Waste Management | Sakshi
Sakshi News home page

చెత్త కనబడకుండా ’స్మార్ట్‌’ ఐడియా!

Published Thu, May 30 2019 8:27 AM | Last Updated on Thu, May 30 2019 8:29 AM

Karimnagar Corporation Innovative Idea For Waste Management - Sakshi

సాక్షి, కరీంనగర్‌ ‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థలో చెత్త నిర్వహణలో కొత్త విధానం చేపట్టేందుకు కసరత్తు ప్రారంభమైంది. నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దడమే కాకుండా ఆ స్థాయికి తగ్గట్టుగా నగరంలో చెత్త నిర్వహణను చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రధాన రహదారులపై చెత్త కనబడకుండా ఉండేందుకు అండర్‌గ్రౌండ్‌ డస్ట్‌బిన్స్‌ ఏర్పాటుకు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు రోడ్లపై బహిరంగంగానే చెత్త డబ్బాలు ఏర్పాటు చేస్తుండగా... చెత్త డబ్బాలు నిండిపోయి రోడ్లపై ఇష్టానుసారంగా చెత్త వేస్తుండడంతో పరిసరాలన్నీ అధ్వానంగా మారుతున్నాయి. స్మార్ట్‌సిటీగా అవతరించి యేడాది గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది. దీంతో నగరపాలక సంస్థ చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది.

మొదటి విడతలో స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుని అభివృద్ది పథంలో నడుస్తున్న నగరాలకు ధీటుగా కరీంనగర్‌ స్మార్ట్‌సిటీని అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నరగపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య పనుల నిర్వహణను మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో నగరాన్ని పరిశుభ్రంగా మార్చడానికి నిదులు కేటాయిస్తున్నారు. ఇళ్ల నుంచి వచ్చే చెత్తను తగ్గించడం, తడి, పొడి, చెత్తను వేరు చేసి తీసుకెళ్లాలనే నిబంధనలు అమలుపై దృష్టిసారించారు. ఇప్పటికే వీధుల్లో సేకరించిన చెత్తను కుదించడం కోసం కొత్తగా కంప్యాక్టర్‌ డబ్బాలు, వాహనాలు కొనుగోలు చేశారు. వీటిని ప్రతి డివిజన్‌లో ఏర్పాటు చేయగా అందులో చెత్తను వేసి, ప్రత్యేక వాహనాల్లో డంప్‌యార్డుకు తరలిస్తున్నారు.

స్మార్ట్‌గా కనబడేందుకు...
కరీంనగర్‌ను స్మార్ట్‌గా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. స్మార్ట్‌సిటీ నగరంలోని ప్రధాన రహదారులను, రద్దీ ప్రాంతాల రోడ్లను అందంగా తీర్చిదిద్దేందుకు అధికారులు టెండర్లు నిర్వహించే పనిలో ఉన్నారు. మూడు ప్యాకేజీల కింద రహదారుల నిర్మాణానికి టెండర్లు నిర్వహించగా వాటికి సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని తిరిగి టెండర్లు పిలిచారు. వాటిని కూడా త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. అదే విధంగా పేస్‌–2లో అంతర్గత రోడ్లను వేయనున్నారు. రోడ్డు వేయడానికంటే ముందే అండర్‌గ్రౌండ్‌ డస్ట్‌బిన్స్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.

చెత్త కనబడకుండా...
నగర వీధుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనమిస్తోంది. దీంతో వీధులన్నీ అధ్వానంగా మారుతున్నాయి. ప్రధాన రహదారులపై చెత్త కనిపించకుండా అండర్‌ గ్రౌండ్‌లో స్మార్ట్‌ డస్ట్‌బిన్స్‌ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన రహదారులపై చెత్త బహిరంగంగా కన్పించకుండా నూతన విధానం వైపు అడుగులు వేస్తున్నారు. అండర్‌గ్రౌండ్‌ చెత్త డబ్బాలను 14 ప్రాంతాల్లో 20 డబ్బాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. వీటికి స్మార్ట్‌సిటీలో రూ.1.5 కోట్లతో కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు.

స్థలాల ఎంపిక..
స్మార్ట్‌బిన్స్‌ ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు స్థలాలను సైతం ఎంపిక చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక భాగంలో, ప్రభుత్వ ఆసుపత్రి వెనుకబాగంలో, ఎస్సారార్‌ కళాశాల వద్ద నున్న మార్కెట్‌లో, సర్కస్‌గ్రౌండ్‌లో, సాయినగర్‌లో, ఆదర్శనగర్‌లో, అన్నపూర్ణకాంప్లెక్స్‌ పార్కింగ్‌ స్థలంలో, వారసంతలో, మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో, మార్కెట్‌ రిజర్వాయర్‌ ఎదురుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక, ప్రభుత్వాసుపత్రి వెనుక భాగంలో మొదట వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్‌ డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ డస్ట్‌బిన్‌ల ఏర్పాటు పూర్తయితే రోడ్ల వెంట చెత్త ఇక కనబడదని అధికారులు భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement