బల్దియా–పోలీసు ‘సంయుక్త ఆపరేషన్’
దొంగ డెత్ సర్టిఫికెట్ కేసులో కొత్త కోణం
2012లో తల్లి చనిపోయిన తేదీతో తొలుత స్త్రీగా నమోదు
విచారణ అనంతరం పురుషుడిగా మార్చి సర్టిఫికెట్ జారీ
2016లో మూడో సోదరుడి మరణంపైనా అనుమానాలు!
అతని మృతిపైనా విచారణ జరపాలని సునీల్ డిమాండ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీకే) నుంచి జారీ అయిన దొంగ సర్టిఫికెట్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిక్షేపంగా.. గుండ్రాయిలా ఉన్న వ్యక్తి పేరిట డెత్ సర్టిఫికెట్ జారీ అయిన తతంగం బల్దియాలో భూకంపం పుట్టిస్తోంది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇందులో తమ డిపార్ట్‌మెంట్ ప్రమేయం కూడా ఉందని గుర్తించడం గమనార్హం. సంచలనం సృష్టించిన ఈ కేసులో బల్దియా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుండగాæ.. ఓ పోలీసు అధికారి పాత్రపైనా దర్యాప్తు ముమ్మురంగా సాగుతోంది. ఈ సర్టిఫికెట్ జారీ అయిన విధానాన్ని బట్టి చూస్తే నేర పరిశోధనలో అనుభవం ఉన్నవారే ఇది చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తానికి ఓ పోలీసు అధికారి, బల్దియా ఉద్యోగులు పథకం ప్రకారం ఈ పని చేశారని పోలీసులు అంచనాకు వచ్చారు.
తొలుత స్త్రీగా చూపి..
తొలుత సునీల్ ఖీర్ పేరిట మిస్సింగ్ కేసులేమైనా నమోదయ్యాయా లేదా అని పోలీసులు రికార్డులు తనిఖీ చేశారు. లేవని తెలిశాక బల్దియాలోనే తప్పు జరిగిందన్న నిర్ధారణకు వచ్చారు. బతికి ఉన్న వ్యక్తిపై డెత్ సర్టిఫికెట్ జారీ అవడంపై బల్దియా ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా దృష్టి సారించారు. 12 ఏళ్ల క్రితం కేసు కావడంతో అప్పటి ఫైళ్ల బూజు దులిపి మరీ అధికారులు పరిశీలిస్తున్నారు. వాస్తవానికి 2012 జనవరి 29న సునీల్ ఖీర్ తల్లి మహాభిరీ మరణించింది. వారి బంధువుల్లోని ఓ పోలీసు అధికారి డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడే ఆయన తన తెలివితేటలు ప్రదర్శించారు. చనిపోయిన మహాభిరీ పేరును సునీల్ ఖీర్‌గా నమోదు చేయించారు. మరణించిన విషయమై బల్దియా సిబ్బంది వాల్మీకి నగర్‌లోని మహాభిరీ ఇంటికి వెళ్లి, వాకబు చేశారు. ఆ సమయంలో చనిపోయిన వృద్ధురాలి పేరు సునీల్ ఖీర్ అని కొందరు నమ్మబలికారని బల్దియా అధికారులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు మరణించిన మహాభిరీ ఆధార్‌కార్డును సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అందులో మహాభిరీతో పేరుతోనే ఉండటం గమనార్హం. అదే సమయంలో ఆమెకు రెండు పేర్లు కూడా లేవని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
జారీ సమయంలో పురుషుడిగా..
విచారణ ముగిసిన తరువాత సర్టిఫికెట్ జారీ సమయంలో సునీల్ ఖీర్‌ను పురుషుడిగా పేర్కొనడం ఇష్యూ అయింది. ఇక్కడే బల్దియా అధికారుల నిర్లక్ష్యాన్ని పోలీసులు గుర్తించారు. వాస్తవానికి మరణించిన వ్యక్తి మహిళ అయినా, ఆమె పేరు సునీల్ ఖీర్ అయినా పొరపాటు పడ్డారని అనుకునేవారు. కానీ, సర్టిఫికెట్‌పై ఆకస్మికంగా పురుషుడిగా లింగమార్పిడి చేసి, జారీ చేయడాన్ని మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇది పొరపాటు కాదని, అసలు ఆ సమయంలో విచారణ సరిగా జరగలేదంటున్నారు. పథకం ప్రకారం.. పేరు, లింగం మార్చి బతికి ఉన్న మనిషిని డెత్ సర్టిఫికెట్‌పై చంపిన వ్యవహారంలో దరఖాస్తుదారుడితోపాటు బల్దియా ఉద్యోగులు కుమ్మక్కయ్యారని దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
సోదరుడి మృతిపైనా అనుమానాలు..
2012లో జనవరిలో మరణించిన తన తల్లి పేరిట జారీ కావాల్సిన డెత్ సర్టిఫికెట్ తన పేరిట రావడంపై బాధితుడు సునీల్ కొత్త సందేహాలు లేవనెత్తుతున్నాడు. 2016లో తన మరో సోదరుడు సంజయ్ ఖీర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని, ఇప్పుడు అసలు అది రోడ్డు ప్రమాదమా లేక పథకం ప్రకారం హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని ‘సాక్షి’కి తెలిపాడు. తామిద్దరం అడ్డు లేకపోతే ఎవరికి లాభం కలుగుతుందో వారే ఈ పని చేశారని, పోలీసులు ఈ డెత్ సర్టిఫికెట్‌తోపాటు తన తమ్ముడి ఆకస్మిక మరణంపైనా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.
లింగమార్పిడి కొత్తేమీ కాదు..
కరీంనగర్ బల్దియాలో లింగమార్పిడి కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. రెండేళ్ల కింద పలువురు లబ్ధిదారుల పేరిట జారీ అయిన పింఛన్ల విషయంలోనూ పురుషులను స్త్రీలుగా, స్త్రీలను పురుషులుగా పేర్కొంటూ జారీ చేసిన రికార్డు కరీంనగర్ బల్దియాకు ఉంది. తాజాగా డెత్ సర్టిఫికెట్ విషయంలోనూ అదే మోడస్ ఒపెరండి అనుసరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment