Karimnagar Municipal Corporation
-
‘లింగ’మార్పిడి చేసి చంపారు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీకే) నుంచి జారీ అయిన దొంగ సర్టిఫికెట్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిక్షేపంగా.. గుండ్రాయిలా ఉన్న వ్యక్తి పేరిట డెత్ సర్టిఫికెట్ జారీ అయిన తతంగం బల్దియాలో భూకంపం పుట్టిస్తోంది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇందులో తమ డిపార్ట్మెంట్ ప్రమేయం కూడా ఉందని గుర్తించడం గమనార్హం. సంచలనం సృష్టించిన ఈ కేసులో బల్దియా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుండగాæ.. ఓ పోలీసు అధికారి పాత్రపైనా దర్యాప్తు ముమ్మురంగా సాగుతోంది. ఈ సర్టిఫికెట్ జారీ అయిన విధానాన్ని బట్టి చూస్తే నేర పరిశోధనలో అనుభవం ఉన్నవారే ఇది చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తానికి ఓ పోలీసు అధికారి, బల్దియా ఉద్యోగులు పథకం ప్రకారం ఈ పని చేశారని పోలీసులు అంచనాకు వచ్చారు.తొలుత స్త్రీగా చూపి.. తొలుత సునీల్ ఖీర్ పేరిట మిస్సింగ్ కేసులేమైనా నమోదయ్యాయా లేదా అని పోలీసులు రికార్డులు తనిఖీ చేశారు. లేవని తెలిశాక బల్దియాలోనే తప్పు జరిగిందన్న నిర్ధారణకు వచ్చారు. బతికి ఉన్న వ్యక్తిపై డెత్ సర్టిఫికెట్ జారీ అవడంపై బల్దియా ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా దృష్టి సారించారు. 12 ఏళ్ల క్రితం కేసు కావడంతో అప్పటి ఫైళ్ల బూజు దులిపి మరీ అధికారులు పరిశీలిస్తున్నారు. వాస్తవానికి 2012 జనవరి 29న సునీల్ ఖీర్ తల్లి మహాభిరీ మరణించింది. వారి బంధువుల్లోని ఓ పోలీసు అధికారి డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడే ఆయన తన తెలివితేటలు ప్రదర్శించారు. చనిపోయిన మహాభిరీ పేరును సునీల్ ఖీర్గా నమోదు చేయించారు. మరణించిన విషయమై బల్దియా సిబ్బంది వాల్మీకి నగర్‌లోని మహాభిరీ ఇంటికి వెళ్లి, వాకబు చేశారు. ఆ సమయంలో చనిపోయిన వృద్ధురాలి పేరు సునీల్ ఖీర్ అని కొందరు నమ్మబలికారని బల్దియా అధికారులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు మరణించిన మహాభిరీ ఆధార్‌కార్డును సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అందులో మహాభిరీతో పేరుతోనే ఉండటం గమనార్హం. అదే సమయంలో ఆమెకు రెండు పేర్లు కూడా లేవని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.జారీ సమయంలో పురుషుడిగా..విచారణ ముగిసిన తరువాత సర్టిఫికెట్ జారీ సమయంలో సునీల్ ఖీర్‌ను పురుషుడిగా పేర్కొనడం ఇష్యూ అయింది. ఇక్కడే బల్దియా అధికారుల నిర్లక్ష్యాన్ని పోలీసులు గుర్తించారు. వాస్తవానికి మరణించిన వ్యక్తి మహిళ అయినా, ఆమె పేరు సునీల్ ఖీర్ అయినా పొరపాటు పడ్డారని అనుకునేవారు. కానీ, సర్టిఫికెట్‌పై ఆకస్మికంగా పురుషుడిగా లింగమార్పిడి చేసి, జారీ చేయడాన్ని మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇది పొరపాటు కాదని, అసలు ఆ సమయంలో విచారణ సరిగా జరగలేదంటున్నారు. పథకం ప్రకారం.. పేరు, లింగం మార్చి బతికి ఉన్న మనిషిని డెత్ సర్టిఫికెట్‌పై చంపిన వ్యవహారంలో దరఖాస్తుదారుడితోపాటు బల్దియా ఉద్యోగులు కుమ్మక్కయ్యారని దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.సోదరుడి మృతిపైనా అనుమానాలు..2012లో జనవరిలో మరణించిన తన తల్లి పేరిట జారీ కావాల్సిన డెత్ సర్టిఫికెట్ తన పేరిట రావడంపై బాధితుడు సునీల్ కొత్త సందేహాలు లేవనెత్తుతున్నాడు. 2016లో తన మరో సోదరుడు సంజయ్ ఖీర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని, ఇప్పుడు అసలు అది రోడ్డు ప్రమాదమా లేక పథకం ప్రకారం హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని ‘సాక్షి’కి తెలిపాడు. తామిద్దరం అడ్డు లేకపోతే ఎవరికి లాభం కలుగుతుందో వారే ఈ పని చేశారని, పోలీసులు ఈ డెత్ సర్టిఫికెట్‌తోపాటు తన తమ్ముడి ఆకస్మిక మరణంపైనా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.లింగమార్పిడి కొత్తేమీ కాదు..కరీంనగర్ బల్దియాలో లింగమార్పిడి కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. రెండేళ్ల కింద పలువురు లబ్ధిదారుల పేరిట జారీ అయిన పింఛన్ల విషయంలోనూ పురుషులను స్త్రీలుగా, స్త్రీలను పురుషులుగా పేర్కొంటూ జారీ చేసిన రికార్డు కరీంనగర్ బల్దియాకు ఉంది. తాజాగా డెత్ సర్టిఫికెట్ విషయంలోనూ అదే మోడస్ ఒపెరండి అనుసరించడం గమనార్హం. -
బాహాబాహీ: బీజేపీ కార్పొరేటర్లపై మేయర్ దూషణ
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. బీజేపి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు బాహాబాహీకి దిగారు. నినాదాలు, ప్రతినినాదాలు వాగ్వివాదంతో సమావేశాన్ని గందరగోళంగా మార్చారు. మేయర్ సునీల్ రావు బీజేపీ కార్పొరేటర్లను యూజ్ లెస్ ఫెలో అని దూషించడం వివాదాస్పదంగా మారింది. మేయర్ అద్యక్షతన కౌన్సిల్ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రారంభం కాగానే బిజేపి కార్పొరేటర్లు ఎండిపోయిన హరితహారం మొక్కలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. హరిత హారం అక్రమాలకు నిలయంగా మారిందని, లక్షలు వెచ్చించి నాటిన మొక్కలను ఎందుకు రక్షించడంలేదని పోడియం వద్దకు దూసుకెళ్లి మేయర్‌ను నిలదీశారు. చదవండి: వ్యాక్సిన్‌కు జై కొట్టిన తెలుగు ప్రజలు దీంతో మేయర్‌కు అండగా నిలుస్తూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియం వద్దకు వచ్చి బీజేపీ కార్పొరేటర్లతో వాగ్వివాదానికి దిగారు. నినాదాలు, ప్రతి నినాదాలతో ఒకరినొకరు తోసుకుంటూ బాహాబాహీకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో మేయర్ సహనం కోల్పోయి బీజేపి కార్పొరేటర్ జితేందర్‌ను ఉద్దేశించి యూజ్ లెస్ ఫెలో అని దూషించడంతో బీజేపీ కార్పోరేటర్లు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. మేయర్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మేయర్ తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆధిపత్యం కోసం ఇరుపార్టీలు ప్రయత్నిస్తు ప్రజాసమస్యలను పక్కదారి పుట్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత సమావేశంలో సైతం ఇలానే బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ లు గొడవపడి సమావేశాన్ని రసాభాసగా మార్చారు. చదవండి: చచ్చినా ఇక్కడ నుంచి కదలను: భార్య గోడు -
కరీంనగర్ కార్పొరేషన్: తడబడ్డ కార్పొరేటర్లు...
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ కార్పొరేషన్ మేయర్‌గా 33వ డివిజన్ కార్పొరేటర్ యాదగిరి సునిల్‌రావును, డెప్యూటీ మేయర్‌గా 37వ డివిజన్ కార్పొరేటర్ చల్లా స్వరూపరాణిని ఎన్నుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో గెలిచిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ డెప్యూటీ మేయర్ ఎన్నికకు కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండురోజులక్రితం క్యాంపునకు వెళ్లిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు బుధవారం ఉదయమే కరీంనగర్ చేరుకుని శ్వేత హోటల్లో పార్టీ సమావేశం నిర్వహించారు. మేయర్ , డెప్యూటీ మేయర్ ఎన్నికపై అవగాహన కల్పించారు. ఉదయం 11 గంటల సమయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి తరలివచ్చారు. అనంతరం బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు సమావేశం మందిరానికి చేరుకున్నారు. కరీంనగర్ జేసీ శ్యాంప్రసాద్‌లాల్ తెలుగు అక్షరమాల ప్రకారం వరుస క్రమంలో కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం 11.55 గంటలకు ముగిసింది. అనంతరం జేసీ 12.30 గంటలకు మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నికను ప్రకటించారు. బీజేపీ కార్పొరేటర్లు సమావేశం నుంచి వెళ్లిపోయారు. టీఆర్ఎస్, ఇటీవల పార్టీలో చేరిన ఇండిపెండెంట్లు, ఏఐఎఫ్బీ, ఎంఐఎం కార్పొరేటర్లు హాల్లో ఉండిపోయారు. ఏకగ్రీవ ఎన్నిక... కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ 12.30 గంటలకు ఎన్నిక ప్రారంభించారు. ఎన్నికకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాశాఖ మంత్రి గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు. మేయర్ ఎన్నికకు టీఆర్ఎస్ కార్పొరేటర్లు 33 మంది, ఇండింపెండెట్లు, ఏఐఎఫ్బీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఏడుగురు, ఆరుగురు ఎంఐఎం కార్పొరేటర్లతో కలిపి 46 మందితోపాటు ఇద్దరు ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా మంత్రి గంగుల, ఎమ్మెల్యే రసమయి హాజరు కావడంతో సంఖ్య 48కు చేరింది. కోరం సరిపోవడంతో మేయర్ ఎన్నిక నిర్వహించారు. మేయర్ స్థానానికి యాదగిరి సునిల్‌రావును 3వ డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ ప్రతిపాదించగా 23వ డివిజన్ కార్పొరేటర్ ఆర్ష కిరణ్మయి బలపరిచారు. టీఆర్ఎస్ అధిష్టానం సునిల్రావుకు బీ–ఫాం ఇవ్వడంతోపాటు విప్ జారీ చేసింది. ఎవరూ కూడా పోటీలో లేకపోవడంతో సునిల్‌రావును మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకైనట్లు జేసీ శ్యాంప్రసాద్‌లాల్ ప్రకటించారు. అనంతరం డెప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూపరాణిని 9వ డివిజన్ కార్పొరేటర్ ఐలేందర్‌యాదవ్ ప్రతిపాదించగా,18వ డివిజన్ కార్పొరేటర్ సుదగోని మాధవి బలపరిచారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవం అయినట్లు జేసీ ప్రకటించారు. అనంతరం మేయర్, డెప్యూటీ మేయర్లను జేసీ, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా అభినందించారు. నీతివంతమైన పాలన అందించాలి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్లు, ప్రజలు ఎంతో నమ్మకంతో టీఆర్ఎస్కు పట్టంకట్టారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మేయర్, డెప్యూటీ మేయర్‌కు మంత్రి సూచించారు. నీతివంతమైన పాలన అందించాలని కోరారు. మేయర్, డెప్యూటీ మేయర్, 60 మంది కార్పొరేటర్ల వేర్వేరుకాదని అంతా ఒకటేనని సమన్వయంతో కరీంనగర్‌ను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఇంటింటింకీ మంచినీటిని అందించడానికి చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలిపారు. ప్రమాణ స్వీకార సమయంలో పలువురు కార్పొరేటర్లు తడబడ్డారు. ఆకుల పద్మ, కొలిపాక అంజయ్య ఇబ్బందిపడ్డారు. మూడుసార్లు ప్రమాణస్వీకారం చేసిన ఎడ్ల సరిత కూడా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ప్రమాణపత్రం చదువుతూ తడబడ్డారు. ఐదుసార్లు గెలిచిన నేతికుంట యాదయ్య, జయలక్ష్మి, రాపర్తి విజయ కూడా తడబడుతూ ప్రమాణపత్రాన్ని చదివారు. 38వ డివిజన్ కార్పొరేటర్ కచ్చు రవి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జై భారత్‌మాతా అంటూ, 49వ డివిజన్ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం ప్రజలు ఎంతో నమ్మకంతో పట్టం కట్టారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మేయర్ సునిల్‌రావు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని మేయర్‌గా తన ఎన్నికకు కృషి చేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, సహకరించిన కార్పొరేటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ : ప్రథమ పౌరుడి ఎంపికలో టీఆర్ఎస్ అధిష్టానం సీనియారిటీకే ప్రాధాన్యత ఇచ్చింది. కరీంనగర్ మేయర్‌గా యాదగిరి సునీల్‌రావును పార్టీ నిర్ణయించింది. కౌన్సిలర్, కార్పొరేటర్‌గా నాలుగుసార్లు ఎన్నికైన 33వ వార్డు కార్పొరేటర్ సునీల్రావుకే ప్రథమ పౌరుడి హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మేయర్ స్థానం కోసం పోటీ పడ్డ 56వ వార్డు కార్పొరేటర్ వంగపెల్లి రాజేందర్రావును అధిష్టానం బుజ్జగించింది. హైదరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం సాయంత్రం సునీల్‌రావు, రాజేందర్రావులతో సమావేశమై సీఎం కేసీఆర్ మేయర్‌గా సునీల్‌రావును ఎంపిక చేసిన విషయాన్ని వెల్లడించారు. రాజేందర్రావుకు భవిష్యత్తులో మంచి అవకాశం కల్పించే హామీ ఇచ్చినట్లు చెప్పారని సమాచారం. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజేందర్రావుతో ఫోన్లో మాట్లాడారు -
60 ఏళ్ల బల్దియా.. @కరీంగనర్
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపాలిటీకి ఘనమైన చరిత్రే ఉంది. 68 ఏళ్ల నుంచి మున్సిపాలిటీగా అటు నుంచి 2005లో కార్పొరేషన్‌గా మారి దేశంలోనే ఉత్తమ మున్సిపాలిటీల్లో ఒకటిగా నిలిచింది. ఎంతో మంది మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ సభ్యులుగా ఎన్నికై సత్తాచాటి ఎమ్మెల్యే, ఎంపీలుగా కూడా పోటీ చేసి ఘనవిజయం అందుకున్నారు. ఎందరో గొప్ప రాజకీయ నాయకుల పోరాటాలకు, ఉద్యమాలకు కేంద్రంగా నిలిచిన కరీంనగర్ బల్దియా ఒక ప్రత్యేకమైన స్థానం పొందింది. కార్పొరేషన్ పలువురు నాయకుల ఏలుబడిలో ఈస్థాయికి చేరుకుంది. చరిత్ర పుటల్లో కూడా తనస్థానాన్ని లికించుకున్న ఈ ఏనుగులు తిరిగే ప్రాంతమైన కరినగరము..కాలక్రమేణ కరీంనగర్‌గా మారింది. నాటి కుగ్రామమే... రాజుల పాలనలో ఈ ప్రాంతం క్రీస్తుశకం 973–1153లో మొదట కళ్యాణి చాళక్యుల ఏలుబడిలో ఆరిఫిరాల అనే కరీంనగర్ ప్రాభవం ప్రారంభమైంది. నాటి రాజులకు ఆయుధగారంగా ఉన్న ఎలగందులకు వెళ్లే దారిలో ఈ గ్రామం ఉండేది. 1159–1323 వరకు కాకతీయులు, 1518–1687 కుతుబుషాహిలు, 1687–1724 ఢిల్లీ మొగళాయిలు, 1724–1948 వరకూ ఆసఫ్‌జాహీల పాలనలో తన ప్రస్థానం ప్రారంభించింది. 16, 17 శతాబ్ధంలో కుతుబుషాహీలు గోల్గొండ నుంచి అరబ్బులు ఇక్కడికి వచ్చేవారు. నదులు ఎప్పుడు పొంగిపొర్లే సమయంలో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ముఖ్యంగా ఎలగందుల కోటకు వెళ్లేందుకు వచ్చే సమయంలో నదులు దాటడానికి ఎనుగులు(కరి) వినియోగించేవారు తర్వాత వాటిని ఇక్కడే ఉంచేవారు ఇలా నిత్యం ఎనుగుల సంచారంలో ఉండడంతో కరినగరముగా ప్రసిద్ధిచెందింది. కాలక్రమేణా కరీంనగర్‌గా మారిందని చెబుతారు. మరో కథనం ప్రకారం 19వ శతాబ్ధంలో కరీముల్లాషా అనే బాబా ఉండేవారు. వారి పేరు మీద కరీంనగర్‌గా ప్రసిద్ధి చెందిందని చరిత్ర చెబుతోంది. జిల్లా కేంద్రం నుంచి కార్పొరేషన్ దాకా... నిత్యం ఇటు రాజులు, వారి అనుచరుల రాకపోకలతో తర్వాత క్రమంలో పటేల్, పట్వారీ పాలనలో ఉన్న కరీంనగర్ 1905లో జిల్లా కేంద్రంగా ఏర్పడింది. 1948లో నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణ ఇండియన్ యూనియన్‌లో విలీనం అయిన తర్వాత 1952లో మొదటిసారి మున్సిప్(ముని్సపల్) వ్యవస్థ ఏర్పాటు కావడంతో 1952లో కరీంనగర్‌ను మున్సిపాలిటీగా మార్చారు. మొదటి మున్సిపల్ చైర్మన్‌గా ఖాజా బషీరుది్దన్ ఎంపికై 12 ఏళ్లపాటు చైర్మన్‌గా పని చేశారు. చివరి చైర్మన్‌గా వావిలాల హన్మంతరెడ్డి పని చేశారు. 2005లో కరీంనగర్‌ను కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. 2005లో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసిన తర్వాత మొదటి మేయర్‌గా డి.శంకర్ ఎన్నికయ్యారు. 1952 నుంచి 2005 వరకూ 12 మంది మున్సిపల్ చైర్మన్లుగా పని చేశారు. నాలుగుసార్లు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండిపోయింది. కరీంనగర్ దేశంలోని స్మార్ట్‌సిటీలో స్థానం పొంది అభివృద్ధివైపు వేగంగా అడుగులు వేస్తోంది. 1800 వందల కోట్ల పనులతో పలురకాల పనులు ప్రారంభమై స్మార్ట్‌సిటీగా మారుతోంది. స్మార్ట్‌సిటీగా... స్మార్ట్‌సిటీగా మారిన కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. 1872 కోట్ల రూపాయలతో స్మార్ట్‌సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశంలోనే మొట్టమొదటి తీగల వంతెన పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఒక పక్క రాష్ట్రంలోనే రెండోఅతిపెద్ద ఐటీటవర్ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. అటు తర్వాత మానేరు రివర్‌ఫ్రంట్ నిర్మాణానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఒక్క అతిపురాతనమైన క్లాక్‌టవర్, కమాన్ చౌరస్తా దేశంలోనే అత్యంత భద్రత ఉన్న 4వ నగరంగా సుమారు 28 కిలోమీటర్ల విస్తీర్ణంతో అభివృద్ధివైపు సాగిపోతోంది. ఎంతో మంది నాయకులు 1952 నుంచి 2005 వరకూ 8 మంది కరీంనగర్ చైర్మన్లుగా, ఐదుగురు ఇన్చార్జి చైర్మన్లుగా, నలుగురు ప్రత్యేక అధికారులు, ఇద్దరు మేయర్లుగా పని చేశారు. 2005లో కార్పొరేషన్ మారే సమయంలో 50 డివిజన్లు ఉండేవి. కరీంనగర్ జనాభా 2,72,194 మంది ఉండగా కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం 60 డివిజన్లుగా మారింది. ఏడాది చైర్మన్లు 1952–64 ఖాజా బషీరుది్దన్ 1964–64 శివనారాయణ ముందడా(ఇన్చార్జి) 1964–65 ప్రేమలత దేవి(ఇన్చార్జి) 1965–68 ప్రేమలత దేవి(ఇన్చార్జి) 1969–70 రాంపాల్ లావోటి 1970–74 జేఆర్ గోపాల్‌రావు 1975–81 ప్రత్యేకాధికారి 1981–85 నరహరి లక్ష్మన్ 1986–86 మహ్మద్‌బిన్ ఆలీ(ఇన్చార్జి) 1986–86 కఠారి దేవేందర్‌రావు 1986–87 ప్రత్యేకాధికారి 1987–92 కఠారి దేవేందర్‌రావు 1992–95 ప్రత్యేకాధికారి 1995–99 కఠారి దేవేందర్‌రావు 1999–2000 వావిలాల హన్మంతరెడ్డి(ఇన్చార్జి) 2000–2005 వావిలా హన్మంతరెడ్డి 2005–10 డి.శంకర్ (మేయర్) 2010–14 ప్రత్యేకాధికారి 2014–19 రవీందర్‌సింగ్ -
ఆ జాబితాపై భారీగా అభ్యంతరాలు
సాక్షి, కరీంనగర్ : మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు రూపొందించిన వార్డుల జాబితాపై ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ నెల 3న ప్రకటించిన ముసాయిదా వార్డుల జాబితాపై సూచనలు, అభ్యంతరాలు తెలిపేందుకు సోమవారంతో గడువు ముగిసింది. ఈ సందర్భంగా కరీంనగర్, రామగుండం మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 14 మునిసిపాలిటీల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు తమ అభ్యంతరాలను ఆయా మునిసిపల్ కమిషనర్లకు అందజేశాయి. ఈ అభ్యంతరాలను వారం రోజుల్లోగా పరిశీలించి, పరిష్కరించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. ఈ నెల 15లోగా కార్యక్రమం ముగించి 16న వార్డుల తుది జాబితాను తయారు చేసి, 17న ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపిస్తారు. ఒకవేళ అభ్యంతరాలను పరిష్కరించలేని పరిస్థితి ఉంటే అందుకు గల కారణాలతో పూర్తిస్థాయి నివేదికను కూడా ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. కరీంనగర్లో అత్యధికంగా 164 అభ్యంతరాలు కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని 60 వార్డుల(డివిజన్లు) నుంచి అత్యధికంగా 164 అభ్యంతరాలు రావడం గమనార్హం. ఇందులో అభ్యంతరాలకు చివరిరోజైన సోమవారం ఒక్కరోజే 100కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా కిసాన్‌నగర్, అంబేద్కర్‌నగర్ వార్డులకు సంబంధించి ఏకంగా 50 అభ్యంతరాలు రాగా, కనీసం 30 వార్డుల రూపురేఖలు మార్చాలని పలువురు దరఖాస్తులు అందజేశారు. వార్డుల భౌగోళిక స్వరూపంతోపాటు ఆయా వార్డుల్లోకి చేరిన ఓటర్లకు సంబంధించి వచ్చిన దరఖాస్తులే ఎక్కువ కావడం గమనార్హం. విలీన గ్రామాలను, ఇప్పటికే నగరపాలక సంస్థలో ఉన్న బస్తీలను కలుపుతూ ఏర్పాటు చేసిన వార్డుల విషయంలో కూడా భారీగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సదాశివపల్లి, అల్గునూరు, వావిలాలపల్లి తదితర గ్రామాలకు సంబంధించిన వార్డులపై అభ్యంతరాలు అధికంగా నమోదయ్యాయి. రామగుండంలో 64 అభ్యంతరాలు రామగుండం నగరపాలక సంస్థలో 50 డివిజన్లకు గాను 64 అభ్యంతరాలు వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. ఇందులో సోమవారం ముగింపు రోజునే 51 అభ్యంతరాలు రావడం గమనార్హం. గతంలో ఒక వార్డులో ఉన్న ఓట్లను ఈసారి మరో వార్డులోకి మార్చడంపైనే అధికంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 30వ వార్డును పునర్విభజించి 32, 33, 34, 44 వార్డులుగా మార్చడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఎన్టీపీసీ టీటీఎస్, టీటీఎస్‌లోని 47, 48 డివిజన్లను పునర్విభజనలో భాగంగా ఒకే వార్డుగా మార్చారని, అయితే రెండు వార్డులకు సరిపడా ఓటర్లు ఉన్నారని, పీటీఎస్, టీటీఎస్ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఖాజిపల్లి, మాతంగికాలనీలను కలిపి రెండు వార్డులుగా చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అలాగే 27వ వార్డును పునర్విభజనలో 38వ డివిజన్‌గా మార్చి 151 ఓట్లు 37వ డివిజన్లో కలిపారని, 38వ డివిజన్‌కు చెందిన ఓటర్లను అరకిలోవీుటర్ దూరంలో ఉన్న 37వ డివిజన్లో కలుపడంపై సంజయ్నగర్కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా ప్రతి వార్డులో ఓటర్ల కూర్పు, సరిహద్దుల మార్పుపైనే అభ్యంతరాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి. జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో 96 అభ్యంతరాలు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా అభ్యంతరాల స్వీకరణ అవకాశం ఇవ్వగా ఈ నెల 4 నుంచి 9వరకు తక్కువ సంఖ్యలోనే సంఖ్యలోనే అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఆయా మున్సిపాలిటిలకు వచ్చాయి. వాటిలోని చిన్నచిన్న మార్పులు, చేర్పులే అధికంగా ఉంటున్నాయి. ఈ నెల 9వరకు అభ్యంతరాల స్వీకరించగా జగిత్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా 53, కోరుట్లలో 18, మెట్పల్లిలో 18, రాయికల్‌లో ఏడు మాత్రమే విజ్ఞప్తులు అందగా ధర్మపురిలో ఇప్పటివరకు ఒక్కటి కూడా అభ్యర్థనలు రాలేదు. వస్తున్న అరకొర అభ్యంతరాలు, విజ్ఞప్తులు సైతం పరిష్కరించగలిగేవేనని అధికారులు చెబుతున్నారు. రాయికల్‌లో వార్డుల సంఖ్య పెంచాలని అఖిలపక్ష నాయకులు విజ్ఙప్తి చేశారు. నిబంధనలకు అనుగుణంగా వార్డుల భౌగోళిక, ఓటర్ల విభజన జరుగలేదంటూ, ఇష్టానుసారంగా ఇంటి నంబర్లు తొలగించడ, చేర్చడం జరిగిందంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హుజూరాబాద్‌లో 10, జమ్మికుంటలో 34 వార్డుల విభజనకు 9వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు తుది గడువు కావడంతో పలువురు ఆశావాహులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హుజూరాబాద్ పురపాలికలో ఆరు రోజుల్లో 10 అభ్యంతరాలు అందాయి, వార్డు 1, 2, 4, 14, 17, 19, 23, 25, 30 వార్డుల్లోని కొన్ని ఓట్ల మార్పు కోసం అభ్యంతరాలు అందగా, 3వ వార్డులో పోలింగ్ స్టేషన్ మార్పు చేయాలని అభ్యంతరాలు అందాయి. జమ్మికుంట పురపాలికలో 34 అభ్యంతరాలు అందగా, ఇందులో ప్రధానంగా గతంలో ఉన్న వార్డులో ఉన్న ఓట్లను అదే వార్డులో ఉంచేలా చూడాలని అభ్యంతరాలు అందాయి. వార్డుల విభజన ప్రక్రియలో భాగంగా వచ్చిన అభ్యంతరాలను 16వ తేదీ వరకు పరిశీలన చేసి, అవసరమనుకుంటే స్వల్ప మార్పులు, చేర్పులు చేసి 17న తుది వార్డుల జాబితాను ప్రకటించనున్నారు. సిరిసిల్లతోపాటు అన్ని మునిసిపాలిటీల్లో అభ్యంతరాలు సిరిసిల్ల మునిసిపాలిటీల్లో 39 వార్డులు ఉండగా, 42 అభ్యంతరాలు వచ్చాయి. వార్డుల విభజనకు సంబంధించిన అభ్యంతరాలే అధికంగా ఉన్నాయి. ఇవన్నీ చిన్నచిన్న అభ్యంతరాలే కావడంతో కమిషనర్ స్థాయిలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో 28 వార్డులకు గాను 27 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పెద్దపల్లి 11, సుల్తానాబాద్‌లో 4, మంథనిలో2 పెద్దపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపాలిటీల్లో వార్డుల రూపకల్పన, ఓటర్ల చేర్పులపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 27, 28వ వార్డుల ఖరారు అశాస్త్రీయంగా ఉందని, 25వార్డులో ఓటర్ల పునః పరిశీలన జరిపించాలి్సందిగా యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని నలుగురు తమ అభ్యంతరాలను తెలియపరుస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ నెల 16వరకు అభ్యంతరాలపై విచారణ జరిపి తగువిధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. మంథనిలో వార్డుల కూర్పుపై కేవలం 2 అభ్యంతరాలు మాత్రమే వ్యక్తమయ్యాయి. -
సగానికి సగం ఉద్యోగులు ఖాళీ !
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతోంది.. ప్రజలకు సైతం సకాలంలో సేవలు అందక కార్యాలయానికి వచ్చివెళ్లడం పరిపాటిగా మారింది.. పలు రకాల సేవలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఆధారపడడం.. వారు ఆడింది ఆట.. పాడింది పాటలా మారిందనే ఆరోపణలున్నాయి. కార్పొరేషన్‌లోని ముఖ్య మైన విభాగాల్లో కీలమైన పోస్టులు ఖాళీగా ఉండడంతో సరైన విధంగా సేవలు అందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. బల్దియాలోని వివిధ విభాగాలకు ప్రభుత్వం 497 పోస్టులు మంజూరు చేయగా.. ప్రస్తుతం 249 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా.. 248 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కూడా పది మంది సిబ్బంది డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. కొందరు కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయానికి రాగా మరికొందరిని ఇక్కడి నుంచి మరో చోటికి డిప్యూటేషన్‌పై పంపించారు. ప్రధాన విభాగంలో.. కార్పొరేషన్లో పాలన వ్యవహారాలు చూసే అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనే కీలకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విభాగాన్ని ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో నడిపిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్‌తో పాటు నాలుగు సూపరిటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇతర ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. పని భారం పెరిగిందని పేర్కొంటున్నారు. ఈ విభాగంలో 87 పోస్టులకు గాను 37 ఖాళీగా ఉన్నాయి. ప్రజారోగ్యంలో అధికంగా.. కార్పొరేషన్లో కీలకమైంది ప్రజారోగ్య విభాగం. నగరం పరిశుభ్రంగా, ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఈ విభాగమే కీలకం. చెత్తను సేకరించడం వాటిని డంప్‌యార్డ్‌కు తరలించడం, డ్రెయినేజీలు, రోడ్లను పరిశుభ్రంగా చేయడం లాంటి పనులు ఈ విభాగం నిర్వహిస్తోంది. కార్పొరేషన్‌కు గుండెకాయ లాంటి శానిటేషన్‌లో సగానికి సగం ఖాళీలున్నాయి. ఈ విభాగం నియంత్రణలోనే పారిశుధ్య కార్మికులు పని చేస్తారు. దీనికి మొత్తం 270 పోస్టులు కేటాయించగా 141 ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్ మెడికల్ అధికారి, మున్సిపల్ హెల్త్ అధికారి పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వీటితో పాటు శానిటేషన్ సూపర్వైజర్ పోస్టులు 5 ఉండగా నాలుగు ఖాళీగా ఉన్నాయి. ఉన్న ఒక్క శానిటరీ సూపర్వైజర్ రామగుండం మున్సిపాలిటీకి డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. కరీంనగర్లో జగిత్యాల మున్సిపాలిటీ నుంచి ఓ అధికారి డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. డిప్యూటేషన్ల వల్ల సకాలంలో పనులు పూర్తి చేయలేక ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. వీటితో పాటు ఈ విభాగంలో కీలక స్థానాల్లో ఔట్ సొర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. కరీంనగర్లో చెత్తను సేకరించే పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. కొద్దిరోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేయగా ఒక్క అధికారి కూడా వారికి కేటాయించిన డివిజన్లలో లేకపోవడంతో వారికి సంజాయిషీ మెమోలు జారీ చేశారు. వీరిలో ఔట్సొర్సింగ్ సిబ్బంది ఉన్నా చర్యలకు అధికారులు వెనుకంజ వేస్తున్నారని సమాచారం. ఆగమాగం.. అకౌంట్స్ విభాగం.. కార్పొరేషన్ లెక్క పద్దులు నమోదు చేసే అకౌంట్స్ విభాగం మొత్తానికి మొత్తం ఖాళీగా ఉంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈ విభాగంలో ఒక్క అధికారిని కూడా నియమించలేదు. ఇతర విభాగాల నుంచి ఈ విభాగానికి అటాచ్డ్ చేశారు. ఇందులో మొత్తం 11 పోస్టులు ఉండగా వాటిలో జూనియర్ అకౌంటెంట్ అధికారిని ఇతర విభాగం నుంచి తీసుకున్నారు. మరో జూనియర్ అసిస్టెంట్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. కాని ప్రత్యేకంగా ఎవరినీ కేటాయించలేదు. వీటితో పాటు రెవెన్యూ విభాగంలో 23 పోస్టులకు 11 ఖాళీగా ఉన్నాయి. ఆస్తిపన్నులు వసూలు చేసే విభాగంలో రెండు రెవెన్యూ అధికారి పోస్టులు ఖాళీగా ఉండగా ఉన్న ఒక్క అధికారి ఇన్‌చార్జీగా పని చేస్తున్నారు. ఈ విభాగానికి ప్రత్యేకంగా ఉద్యోగులు లేకపోవడంతో ఇతర విభాగాల నుంచి వస్తున్న వారికి దీనిపై అవగాహన ఉండడం లేదు. కనీసం ఏ విభాగానికి ఎంత ఖర్చు చేస్తున్నారో కూడా వీరి వద్ద సమాచారం ఉండడం లేదని తెలిసింది. కార్పొరేషన్ ఖర్చులు మొత్తం నమోదు చేయాల్సిన ఈ విభాగంలో పరిస్థితి ఇలా ఉండడంతో ఖర్చులు ఇష్టారాజ్యంగా నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఔట్సోర్సింగ్ హవా.. కరీంనగర్ బల్దియాలో రెగ్యులర్ కంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కీలకమైన విభాగాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకుంటున్నారని, వీరికి ముఖ్యమైన పనులు అప్పగించడం, వీరిపై ఆజామాయిషీ లేకపోవడం తదితర కారణాల వల్ల సకాలంలో ప్రజలకు సేవలందడం లేదనే ఆరోపణలున్నాయి. కొందరు ఔట్సోర్సింగ్ సిబ్బంది నాయకుల ద్వారా రిక్రూట్ కావడంతో వీరిపై చర్యలకు అధికారులు వెనకంజ వేస్తున్నారని, ఒక వేళ చర్యలకు ముందుకెళ్తే నాయకుల ఒత్తిడితో ఏమీ చేయలేకపోతున్నారని సమాచారం. దీంతో పలు విభాగాల్లో సిబ్బందిపై ఉన్నతాధికారుల నియంత్రణ లేకపోవడంతో సకాలంలో ప్రజలకు సేవలందడం లేదనే విమర్శలున్నాయి. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. -
సందిగ్ధం వీడేనా?
సాక్షి, కరీంనగర్ : మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపట్టిన డివిజన్ల పునర్విభజన, ఓటర్ల జాబితా, కుల గణన తదితర అంశాల్లో తప్పులు దొర్లాయంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. గత సోమవారమే హైకోర్టులో విచారణ జరపాల్సి ఉండగా పురపాలకశాఖ గడువు కోరింది. దీంతో హైకోర్టు వారం గడువు ఇచ్చిన విషయం విదితమే. అయితే అభియోగాలపై సోమవారం పురపాలక శాఖ కౌంటర్ దాఖలు చేయనుంది. అభియోగాలు, దాఖలు చేసిన కౌంటర్‌పై విచారణ జరిపి అదే రోజు తీర్పు వెలువరించే అవకాశం కూడా ఉంది. కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందనేదానిపైనే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంది. కోర్టు వెల్లడించే తీర్పు కోసం ఆశావహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లకు మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు తమ పనులు తాము చేసుకుపోతున్నారు. కోర్టు స్టేతో వారం రోజుల సమయం దొరకడంతో డివిజన్ల పునర్విభజన, ఓటర్ల జాబితా పునఃపరిశీలన సైతం చేసి తుది జాబితాను సిద్ధం చేశారు. ఆగస్టులోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కోర్టులో ఉన్న వివాదాలు ముగిసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్డుల్లో సందడి... జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణ కనిపిస్తోంది. నెల రోజులుగా ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేతలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ఆషాఢం కావడంతో బోనాల వేడుకలకు ఆశావహులు స్పాన్సర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీకెండ్లలో మహిళా సంఘాలను పిక్నిక్లకు తీసుకెళ్లడం, యువతను పోగుచేసి, బ్యాచ్‌లుగా విభజించి వేర్వేరు లొకేషన్లకు పంపించి విందులు వినోదాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమా లు జోరుగా నడుస్తున్నాయి. వివిధ కాలనీల పెద్ద మనుషులను, కుల పెద్దలను కలుస్తూ వారు కోరిన చోట నైట్‌సిట్టింగ్‌లు ఏర్పాటు చేసి డిన్నర్లు ఇవ్వడం వంటి ప్రలోబాలకు తెరలేపారు. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా తమ వార్డుకు ఏ రిజర్వేషన్ వస్తుందో ముందే అంచనా వేసుకుని తాను, లేక తన భార్య ఎవరం పోటీలో ఉన్నా మద్దతు తెలపాలని కోరుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజా మాజీలు ఓ అడుగు ముందుకేసి మద్యం డంపింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రిజర్వేషన్లు ఖరారైతే జోష్... కరీంనగర్ నగరపాలక సంస్థతోపాటు హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో ఆశావహులంతా రిజర్వేషన్ల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడంతో వ్యవహారం కోర్టుకెక్కింది. అప్పటి వరకు జోష్‌మీద ఉన్ననేతలు ఒక్కసారిగా ఢీలా పడ్డారు. హైకోర్టు తీర్పు వెలువడి ఎన్నికల రిజర్వేషన్లు ఖరారైతే వార్డుల్లో ఎన్నికల జోష్ పెరగనుంది. ఇదంతా నేటి హైకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉండనుంది. -
చెత్త కనబడకుండా ’స్మార్ట్’ ఐడియా!
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో చెత్త నిర్వహణలో కొత్త విధానం చేపట్టేందుకు కసరత్తు ప్రారంభమైంది. నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దడమే కాకుండా ఆ స్థాయికి తగ్గట్టుగా నగరంలో చెత్త నిర్వహణను చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రధాన రహదారులపై చెత్త కనబడకుండా ఉండేందుకు అండర్‌గ్రౌండ్ డస్ట్‌బిన్స్ ఏర్పాటుకు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు రోడ్లపై బహిరంగంగానే చెత్త డబ్బాలు ఏర్పాటు చేస్తుండగా... చెత్త డబ్బాలు నిండిపోయి రోడ్లపై ఇష్టానుసారంగా చెత్త వేస్తుండడంతో పరిసరాలన్నీ అధ్వానంగా మారుతున్నాయి. స్మార్ట్‌సిటీగా అవతరించి యేడాది గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది. దీంతో నగరపాలక సంస్థ చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. మొదటి విడతలో స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుని అభివృద్ది పథంలో నడుస్తున్న నగరాలకు ధీటుగా కరీంనగర్ స్మార్ట్‌సిటీని అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నరగపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య పనుల నిర్వహణను మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో నగరాన్ని పరిశుభ్రంగా మార్చడానికి నిదులు కేటాయిస్తున్నారు. ఇళ్ల నుంచి వచ్చే చెత్తను తగ్గించడం, తడి, పొడి, చెత్తను వేరు చేసి తీసుకెళ్లాలనే నిబంధనలు అమలుపై దృష్టిసారించారు. ఇప్పటికే వీధుల్లో సేకరించిన చెత్తను కుదించడం కోసం కొత్తగా కంప్యాక్టర్ డబ్బాలు, వాహనాలు కొనుగోలు చేశారు. వీటిని ప్రతి డివిజన్లో ఏర్పాటు చేయగా అందులో చెత్తను వేసి, ప్రత్యేక వాహనాల్లో డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. స్మార్ట్‌గా కనబడేందుకు... కరీంనగర్‌ను స్మార్ట్‌గా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. స్మార్ట్‌సిటీ నగరంలోని ప్రధాన రహదారులను, రద్దీ ప్రాంతాల రోడ్లను అందంగా తీర్చిదిద్దేందుకు అధికారులు టెండర్లు నిర్వహించే పనిలో ఉన్నారు. మూడు ప్యాకేజీల కింద రహదారుల నిర్మాణానికి టెండర్లు నిర్వహించగా వాటికి సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని తిరిగి టెండర్లు పిలిచారు. వాటిని కూడా త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. అదే విధంగా పేస్–2లో అంతర్గత రోడ్లను వేయనున్నారు. రోడ్డు వేయడానికంటే ముందే అండర్‌గ్రౌండ్ డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. చెత్త కనబడకుండా... నగర వీధుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనమిస్తోంది. దీంతో వీధులన్నీ అధ్వానంగా మారుతున్నాయి. ప్రధాన రహదారులపై చెత్త కనిపించకుండా అండర్ గ్రౌండ్లో స్మార్ట్ డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన రహదారులపై చెత్త బహిరంగంగా కన్పించకుండా నూతన విధానం వైపు అడుగులు వేస్తున్నారు. అండర్‌గ్రౌండ్ చెత్త డబ్బాలను 14 ప్రాంతాల్లో 20 డబ్బాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. వీటికి స్మార్ట్‌సిటీలో రూ.1.5 కోట్లతో కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. స్థలాల ఎంపిక.. స్మార్ట్‌బిన్స్ ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు స్థలాలను సైతం ఎంపిక చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక భాగంలో, ప్రభుత్వ ఆసుపత్రి వెనుకబాగంలో, ఎస్సారార్ కళాశాల వద్ద నున్న మార్కెట్లో, సర్కస్‌గ్రౌండ్‌లో, సాయినగర్‌లో, ఆదర్శనగర్‌లో, అన్నపూర్ణకాంప్లెక్స్ పార్కింగ్ స్థలంలో, వారసంతలో, మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో, మార్కెట్ రిజర్వాయర్ ఎదురుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక, ప్రభుత్వాసుపత్రి వెనుక భాగంలో మొదట వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ డస్ట్బిన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ డస్ట్బిన్ల ఏర్పాటు పూర్తయితే రోడ్ల వెంట చెత్త ఇక కనబడదని అధికారులు భావిస్తున్నారు. -
ఉపరాష్ట్రపతి, కేటీఆర్‌లు మెచ్చిన పథకం..
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక్క రూపాయికే దహన సంస్కారాలు చేసేందుకు శ్రీకారం చుట్టిన కరీంనగర్ నగరపాలక సంస్థపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్’అంటూ కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ ప్రవేశపెట్టిన పథకంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీఆర్ఎస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమసంస్కారాల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించిన కరీంనగర్ కార్పొరేషన్, మేయర్ రవీందర్‌సింగ్‌కు అభినందనలు’అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్లో పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లను ప్రశంసించారు. పేదలకు ఎంతగానో ఉపయోగపడే పథాకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. ఇక అన్ని ప్రాంతాల్లోనూ ఈ పథకం సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తామని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ తెలిపారు. ఇక సోమవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ రవీందర్ సింగ్ ఈ పథకం గురించి వివరించారు. శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అంత్యక్రియలను కూడా నగరపాలక సంస్థ బాధ్యతగా చేపడుతుందని చెప్పారు. నిరుపేద కుటుంబాల్లో అంత్యక్రియలకు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా అప్పుల కోసం కాళ్లావేళ్లా పడటం తనను కలిచివేసిందని పేర్కొన్నారు. అందుకే ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా వారి వారి సంప్రదాయాల ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం రూ.1.5 కోట్లు నిధులు మంజూరు చేశామని, రెండు వ్యాన్లు, ఫ్రీజర్లు కూడా కొనుగోలు చేస్తున్నామని, పార్థివదేహాలను కాల్చేవారికి కట్టెలు, కిరోసిన్, పూడ్చిపెట్టే వారికి గొయ్యి తవ్వడం వంటివి సమకూర్చుతామని వివరించారు. జూన్ 15వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. దాతలు కమిషనర్ అకౌంట్ ద్వారా ఆర్థిక సహాయం అందించవచ్చని, సీఎస్ఆర్ ద్వారా సేవ చేయాలనుకునే వారు తమతో కలసి పనిచేయాలని కోరారు. -
రూపాయికే అంత్యక్రియలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థలో నిరుపేదలకు అండగా నిలిచేందుకు వినూత్న పథకాన్ని చేపట్టారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక్క రూపాయికే దహన సంస్కారాలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు కూడా చేయలేని స్థితిలో ఉన్న వారికి భరోసా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ‘అంతిమయాత్ర.. ఆఖిరిసఫర్’ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు సోమవారం మేయర్ రవీందర్‌సింగ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అంత్యక్రియలను కూడా నగరపాలక సంస్థ బాధ్యతగా చేపడుతుందని చెప్పారు. నిరుపేద కుటుంబాల్లో అంత్యక్రియలకు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా అప్పుల కోసం కాళ్లావేళ్లా పడటం తనను కలిచివేసిందని పేర్కొన్నారు. అందుకే ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా వారి వారి సంప్రదాయాల ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం రూ.1.5 కోట్లు నిధులు మంజూరు చేశామని, రెండు వ్యాన్లు, ఫ్రీజర్లు కూడా కొనుగోలు చేస్తున్నామని, పార్థివదేహాలను కాల్చేవారికి కట్టెలు, కిరోసిన్, పూడ్చిపెట్టే వారికి గొయ్యి తవ్వడం వంటివి సమకూర్చుతామని వివరించారు. జూన్ 15వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. దాతలు కమిషనర్ అకౌంట్ ద్వారా ఆర్థిక సహాయం అందించవచ్చని, సీఎస్ఆర్ ద్వారా సేవ చేయాలనుకునే వారు తమతో కలసి పనిచేయాలని కోరారు. -
గ్రేటర్ దిశగా అడుగులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘గ్రేటర్ ’ హోదాకు కరీంనగర్ సిద్ధమవుతోంది. హైదరాబాద్, వరంగల్ తరువాత రాష్ట్రంలో వాటితో సమాన హోదా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్‌ను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పందన లభించింది. ఎమ్మెల్యే విన్నపాన్ని సీఎం కార్యాలయం మున్సిపల్ పరిపాలన విభాగానికి పంపించగా డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టికే.శ్రీదేవి తరఫున జాయింట్ డైరెక్టర్ వాణిశ్రీ కరీంనగర్ కమిషనర్‌కు లేఖ పంపారు. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో వార్డుల(డివిజన్ల) సంఖ్యను 50 నుంచి 60కి పెంచే అవకాశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అనుకూలిస్తే మూడో గ్రేటర్ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తొలిసారిగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గ్రేటర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్‌ను గ్రేటర్‌గా అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉండడంతో ఆ వెసులుబాటును ఉపయోగించుకుని ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే తెరపైకి తెచ్చారు. మార్చి 6న కరీంనగర్లో పార్లమెంటు ఎన్నికల సన్నాహాక సమావేశానికి హాజరైన మాజీ మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమై గ్రేటర్ కార్పొరేషన్ సాధ్యాసాధ్యాలపై కమలాకర్ చర్చించారు. ఇందులో భాగంగానే మార్చి 9న సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. మార్చి 12న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు గంగుల లేఖ చేరింది. మార్చి 22న ప్రభుత్వ మునిసిపల్ శాఖ సంయుక్త కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ఆ లేఖను డైరెక్టర్ ఆఫ్‌మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవికి పంపించారు. 2007 ఏప్రిల్‌లో ఎంసీహెచ్‌గా ఉన్న హైదరాబాద్ నగర పాలక సంస్థ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌గా మారగా, తెలంగాణ ఆవిర్భావం తరువాత కేసీఆర్ ప్రభుత్వం 2015 జనవరిలో వరంగల్ కార్పొరేషన్‌ను గ్రేటర్‌గా మార్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రెండు కార్పొరేషన్లే గ్రేటర్‌గా కొనసాగుతుండగా, అన్నీ అనుకూలిస్తే కరీంనగర్ కూడా ఆ హోదాను త్వరలోనే దక్కించుకోనుంది. గ్రేటర్ సాధ్యమేనా..? జనాభా ప్రాతిపదికన పట్టణం నగరంగానో, మహానగరంగానో ప్రభుత్వం గుర్తిస్తుంది. రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కరీంనగర్ ప్రథమ స్థానంలో ఉంది. జిల్లాల పునర్విభజన తరువాత కూడా కరీంనగర్ తన ప్రాభవాన్ని కోల్పోలేదు. 1958లోనే మున్సిపాలిటీగా మారిన కరీంనగర్ 1985లో గ్రేడ్–1 మున్సిపాలిటీగా మారింది. 2005లో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన నగరంలో 2011 లెక్కల ప్రకారం జనాభా 2.67 లక్షలు. ప్రస్తుతం నగరంలో 3.5 లక్షల జనాభా ఉంది. స్మార్ట్‌సిటీగా కరీంనగర్‌ను ప్రకటించిన తరువాత చుట్టుపక్కలున్న 8 గ్రామాలను విలీనం చేశారు. విలీన గ్రామాల జనాభా 32,216 గా ఉంది. ప్రస్తుతం నగరంలో ఉన్న 50 వార్డులను 60 వార్డులుగా విభజించి, జనాభాను లెక్కిస్తే 4 లక్షలు దాటుతుందని అంచనా. కరీంనగర్ గ్రేటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలంటే కనీసం 5 లక్షల జనాభా ఉండాలని భావిస్తున్నప్పటికీ, ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఈ నేపథ్యంలో గ్రేటర్ కరీంనగర్ కల వీలైనంత త్వరలో సాకారం కావచ్చనేది పురపాలక అధికారులు చెపుతున్న మాట. -
ఐదేళ్లు.. ఆరుగురు కమిషనర్లు
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్లకు శిక్షణ కేంద్రంలా మారింది. బదిలీపై వచ్చి ఇక్కడి పరిస్థితులు, పాలనపై పట్టు సాధించేలోపు పదోన్నతులు పొందడం, బదిలీ చేయించుకుని వెళ్లడం ఆనవాయితీగా తయారైంది. గత ఐదేళ్లలో ఆరుగురు కమిషనర్లు వచ్చి వెళ్లగా.. మరో నలుగురికి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) అప్పగించాల్సి వచ్చింది. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడలేకనా.. ఒత్తిడిని తట్టుకోలేకనా..! అనే సందేహం వ్యక్తమవుతోంది. మరోవైపు కమిషనర్ల బదిలీల కారణంగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోంది. ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్ ఏడాదిన్నర క్రితం స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుని వంద నగరాల సరసన చేరి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంతకుముందు అమృత్సిటీకి ఎంపికైంది. గత యేడాది అత్యంత నివాసయోగ్యమైన నగరంగా దేశంలో 11వ స్థానాన్ని సాధించింది. ప్రతీ యేడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన స్థానం సాధిస్తోంది. దేశంలోని స్మార్ట్‌సిటీ కార్పొరేషన్లలో అతి తక్కువ విస్తీర్ణం, అతి తక్కువ జనాభా కలిగి ఉండి రేపో మాపో మహానగర హోదా కూడా దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న నరగపాలక సంస్థలో కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించేందుకు వచ్చిన అధికారులు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఐదేళ్లలో ఆరుగురు కమిషనర్లు వచ్చి వెళ్లారు. ఆరుగురిలో ముగ్గురు ఐఏఎస్‌లు, ముగ్గురు నాన్ ఐఏఎస్‌లు ఉండడం గమనార్హం. ఐఏఎస్‌లు పదోన్నతులు పొంది వెళ్లగా, నాన్ ఐఏఎస్‌ల్లో ఒకరు డిప్యూటేషన్ ముగిసి, మరో ఇద్దరు యేడాది మధ్యలోనే బదిలీ చేయించుకొని మరీ వెళ్లారు. ఐఏఎస్‌లు వచ్చినా... ఐఏఎస్ అధికారులు నగరపాలక సంస్థ కమిషనర్లుగా వచ్చినా ప్రజలు ఆశించిన మేరకు పనిచేయలేదు. ఇద్దరు పరిస్థితులు అర్ధం చేసుకునేలోపే బదిలీ కాగా, ఒక్కరు ఏడాదిన్నరకు పైగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కరీంనగర్ తొలి పర్యటనలో ఐఏఎస్ అధికారి శ్రీకేష్లఠ్కర్ను కమిషనర్‌గా నియమించారు. 2014 ఆగస్టు 6న ఆయన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కార్పొరేషన్ వ్యవహారాలు అర్థం చేసుకోకముందే నాలుగు నెలలకే ఏపీ, తెలంగాణ ఐఏఎస్‌ల విభజనలో ఏపీకి వెళ్లారు. 2015 డిసెంబర్ 14న వచ్చిన దేవరకొండ కృష్ణభాస్కర్ 10 నెలలు పనిచేయగానే జిల్లాల విభజన సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. కార్పొరేషన్‌పై పట్టు సాధిస్తున్న సమయంలోనే వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చిన ఐఏఎస్ అధికారి కొండూరి శశాంక ఒక్కరే 21 నెలలపాటు కమిషనర్‌గా పనిచేసి తనదైన ముద్ర వేశారు. గద్వాల జిల్లా కలెక్టర్‌గా పదోన్నతితో బదిలీ అయ్యారు. వీరంతా జగిత్యాల సబ్ కలెక్టర్‌గా పనిచేసి ఇక్కడికి వచ్చిన వారే కావడం గమనార్హం. యేడాది పనిచేయని మాతృశాఖ కమిషనర్లు... ఐఏఎస్ అధికారులు పద్నోన్నతులతో వెళ్లగా, సెక్రటేరియట్లో పనిచేస్తూ కమిషనర్‌గా వచ్చిన కరోల్ రమేశ్ యేడాది డిప్యూటేషన్ ముగియగానే వెళ్లిపోయారు. ఐఏఎస్ అధికారి లఠ్కర్ బదిలీ తర్వాత 2015 జనవరిలో వచ్చిన మున్సిపల్ విభాగానికి చెందిన కేవీ రమణాచారి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన కేవలం 10 నెలలకే వివిధ కారణాలతో సెలవులో వెళ్లి అటు నుంచి అటే బదిలీ చేయించుకున్నారు. చివరగా 2018 అక్టోబర్‌లో జీహెచ్ఎంసీ నుంచి కమిషనర్‌గా బదిలీపై వచ్చిన కన్నం సత్యనారాయణ 6 నెలలు పనిచేసి ఎన్నికల కోడ్ ఉండగానే ఎక్సైజ్ శాఖమంత్రి పేషీలోకి కేటాయించడంతో వెళ్లిపోయారు. మున్సిపల్ విభాగానికి చెందిన వారు కూడా పూర్తిస్థాయిలో పనిచేయకుండా అర్ధంతరంగా బదిలీపై వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం... కరీంనగర్ నగరపాలక సంస్థ తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందు వరుసలో ఉంది. సీఎం హామీ నిధులు రూ.347 కోట్లు, ఎల్ఆర్ఎస్ నిధులు రూ.30 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నగరంలోని 50 డివిజన్లతో ఏ గల్లీలో చూసినా ఏదో ఒక పని జరుగుతూనే ఉంది. దీనికి తోడు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌కు సైతం కమిషనరే ఎండీగా వ్యవరిస్తారు. స్మార్ట్‌సిటీ పనులు సైతం కమిషనర్ కనుసన్నల్లోనే సాగుతున్నాయి. పూర్తిస్థాయిలో కమిషనర్లు పనిచేయకపోవడంతో అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. కొత్తగా కమిషనర్లు వచ్చిన ప్రతిసారి రెండు మూడు నెలలపాటు ఏరియాను అవగాహన చేసుకోవడం, పాలనపై పట్టు సాధించడానికే సరిపోతుంది. ఆ తర్వాత పనులు ప్రారంబించాలనుకునే సరికే బదిలీపై వెళ్లడం ఆనవాయితీగా మారింది. దీంతో అన్ని విభాగాలపై ప్రభావం పడుతోంది. శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాల పనితీరును మెరుగు పరచలేకపోతున్నారు. అడ్మినిస్ట్రేషన్‌పై కూడా పట్టుసాధించలేక పోవడంతో బల్దియాలో ఉద్యోగుల ఇష్టారాజ్యం నడుస్తోంది. అభివృద్ధి పనులు పూర్తయిన చోట బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరుగుతుండడంతో కాంట్రాక్టర్లు నిరాసక్తతోనే ఉన్నారు. పనులు ముందుకు కదలడం లేదు. యేడాది క్రితం టెండర్లు పూర్తయిన పనులు కూడా గ్రౌండింగ్ కాకుండా ఉండడం అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుకు నిదర్శనం. ఈసారైనా పూర్తిస్థాయి కమిషనర్ వచ్చేనా..? ఐదేళ్లుగా పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించకపోవడంతో కరీంనగర్లో అభివృద్ధి అధ్వానంగా తయారైంది. ఈసారైనా పూర్తిస్థాయి కమిషనర్‌ను నియామకం చేయాల్సిన అవసరం ఉంది. ఆరు నెలలకోసారి కమిషనర్లు మారుతుంటే కరీంనగర్ అభివృద్ధిలో వెనుకబడే అవకాశం ఉంది. జూలై 2తో పాలకవర్గం గడువు ముగుస్తుండడంతో నూతన పాలకవర్గానికి ఎన్నికల నిర్వహణ సవాలుగానే ఉంటుంది. ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న కమిషనర్ అవసరం ఎంతో ఉంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఐఏఎస్ అయినా... మున్సిపల్ విభాగానికి చెందిన అధికారినైనా పూర్తిస్థాయిలో పనిచేసే కమిషనర్‌గా నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
తడి, పొడిపై అవగాహన ఏది?
సాక్షి, కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరి« దిలో తడి, పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన కరువైంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్‌కు తరలించాలనే లక్ష్యం నీరుగారుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేసిన నగరపాలక సంస్థ ఆ తర్వాత పర్యవేక్షణ మరిచింది. తడిచెత్త, పొడి చెత్త రెండూ ఒకే డబ్బాల్లో వేసి రిక్షాలకు ఇస్తున్నారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా చెత్తను ఎక్కడికక్కడే తగ్గించడానికి అమల్లోకి తీసుకొచ్చిన విధానం స త్ఫలితాలివ్వడం లేదు. ప్రతీ ఇంటికి రెండు డబ్బాలు ఇ చ్చి తడి, పొడి చెత్తను వేరు చేసి రిక్షాలకు ఇవ్వాలని ప్రచా రం చేశారు. రిక్షాల ద్వారా కూడా తడి, పొడి వేరు చేసేం దుకు వాటికి కూడా డబ్బాలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వేరు చేయకపోవడంతో ఇబ్బందులు చెత్తను వేరు చేసేందుకు రెండు రకాల డబ్బాలు ఇచ్చినప్పటికీ ప్రజల నుంచి స్పందన రావడం లేదు. తడి, పొడి చెత్తను ఒకే డబ్బాలో వేసి రిక్షాలకు ఇస్తున్నారు. దీంతో గతంలో మాదిరిగానే చెత్త డంప్‌యార్డుకు చేరుతుంది. దీంతో డంపింగ్‌యార్డు పూర్తిగా నిండింది. ఇటీవల పలుమార్లు అగ్నిప్రమాదం జరిగి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తడి, పొడి చెత్తను వేరుచేయడం ద్వారా డంప్‌యార్డుకు చెత్తను తగ్గించే అవకాశం ఉంది. తడి చెత్తను వర్మీ కంపోస్టు యార్డుకు తరలించడం, పొడి చెత్తను పాత సామగ్రి కింద కా>ర్మికులు అమ్ముకునే అవకాశం కల్పించారు. ఇదంతా చెత్త సేకరణ సమయంలోనే చేయడం ద్వారా డంప్‌యార్డుకు చెత్త తగ్గుతోంది. తడి, పొడి ఒకే డబ్బాలో.. నగరంలోని కొన్ని డివిజన్లలో ప్రయోగాత్మకంగా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడానికి రిక్షాలకు డబ్బాలు అమర్చారు. ఇంటి యజమానుల దగ్గర ఉన్న వేర్వేరు డబ్బాల్లో తడి, పొడి చెత్తను వేసి రిక్షాల్లో ఉన్న డబ్బాలలోనే తడి, పొడి చెత్తను వేయాల్సి ఉంటుంది. తడి, పొడి చెత్త సేకరణకు నగరపాలక సంస్థ అన్ని డివిజన్లకు డబ్బాలు పంపిణీ చేశారు. ఒక్కొక్క డబ్బాకు రూ.120 ఖర్చుచేసి ఇస్తుండగా ఇంటి యజమానులు తడి, పొడి చెత్త వేరుచేసి ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో స్వచ్ఛసర్వేక్షణ్ లక్ష్యం నీరుగారిపోతుంది. ఇప్పటికైనా అధికారులు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించి వేర్వేరుగా సేకరిస్తే డంప్‌యార్డుకు చెత్తను తగ్గించే అవకాశం ఉంది. -
ముందస్తు ఇంటిపన్ను అంచనా..
సాక్షి, కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపాలిటీలకు ఆస్తి పన్నులే ఆధారం.. మున్సిపాలిటీలకు అత్యంత ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరుల్లో ఇంటి పన్ను మొదటిస్థానంలో ఉంటుంది. సాధారణ ఖర్చులతో పాటు శానిటేషన్, పాలనా వ్యవహారాలు, అత్యవసర పనులన్నీ సాధారణ నిధులతోనే చేపడుతుంటారు. అయితే ఆస్తి పన్నులను సకాలంలో రాబట్టుకోవడంలో మున్సిపాలిటీలు విఫలమవుతున్నాయనే విమర్శలున్నాయి. ప్రతియేడు 95శాతం వసూలు చేస్తున్నామని చెబుతున్నా, కొత్త ఇళ్లకు నెంబర్లు వేయకుండా యేళ్ల తరబడి పెండింగ్‌లో పెడుతుండడంతో ఆ ఇళ్ల నుంచి ఆస్తి పన్నులు వసూలు చేసే మార్గమే లేకుండా పోతోంది. ఇలా వేల సంఖ్యలో కొత్తగా నిర్మించిన ఇళ్లు ఇంటి నెంబర్లు లేకుండానే ఉంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, యజమాని పట్టింపులేని తనమో కాని ఆస్తి పన్నుల రూపంలో మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతోంది. ఈ విధానానికి చెక్ పెడుతూ భవనాలకు అనుమతి తీసుకోవడానికి వచ్చినప్పుడు పన్ను అసెస్మెంట్ చేసే ప్రక్రియకు పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీలు ఈ విధానాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేయాలని ఆదేశించింది. పురపాలక శాఖ ఆదేశాల మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థలో అధికారులు కొత్త విధానంపై కసరత్తు చేస్తూ ఆన్లైన్ ప్రక్రియకు అనుసంధానం చేసే పనిలో పడ్డారు. నూతన ఆర్థిక సంవత్సరంలో అనుమతితోనే పన్ను అసెస్మెంట్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. పక్కాగా ఆస్తిపన్ను వసూలు.. ఆస్తి పన్ను పక్కాగా వసూలు చేసేందుకు నగరపాలక సంస్థ కసరత్తు చేస్తోంది. ఇంటి అనుమతులకు వచ్చే సమయంలోనే వీటిని నమోదు చేసి పన్ను మదింపు చేసుకోవడం ద్వారా ఆదాయం పెంచుకునే పనిలో పడింది. ఇప్పటి వరకు ఇంటి నెంబర్ కేటాయిస్తే తప్ప పన్ను వసూలయ్యేది కాదు. అయితే ఈ పన్నుల వసూళ్లలో కొంతమేర అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. నిర్లక్ష్యానికి చెక్ పెడుతూ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న అవకాశాలన్నింటిని ఉపయోగించుకునే పనిలో మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలోనే ఆస్తి పన్నును ప్రాథమికంగా అంచనా వేసే విధానంపై దృష్టి సారించింది. భవన నిర్మాణాలు పూర్తయిన వెంటనే పన్ను వసూలు చేసే విధంగా కార్పొరేషన్లో నిబంధనలు అమలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇంటి నంబర్లు వేసుకోకపోవడం, పాత ఇంటి నంబర్ల మీదనే భవనాలు ఉండడంతో కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయం రాకుండా పోతోంది. అక్రమాలకు పాల్పడితే జరిమానా.. భవన నిర్మాణాలు పూర్తయిన తర్వాత యజమానికి స్వాధీన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నారు. అయితే కొత్త విధానం ప్రకారం స్వాధీన ధ్రువీకరణ పత్రం తీసుకునే సమయంలోనే ఏ జోన్ పరిధిలో ఉంటే ఆ జోన్లో ఏ మేర ఆస్తిపన్ను ఉంటుందో దానిని లెక్క కట్టి పన్ను మదింపు చేస్తారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేసే వారికి మాత్రం రెండింతల పన్నును విధిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలు చేసుకుంటే జీవితకాలం రెండింతల పన్నును కట్టాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి కొత్త విధానం అమలు.. భవన అనుమతులతో పాటు ఆస్తి పన్ను మదింపు విధానం ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీని కోసం కొత్త సాంకేతిక వ్యవస్థను కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు రూపొందిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన అనుమతులు తీసుకోవడం పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది. ఇది అమలైతే ఆన్లైన్లోనే భవన అనుమతులు, ఆస్తి పన్ను మదింపు, ఇంటి నంబర్ల కేటాయింపు ఒకేసారి జరిగిపోతుంది. ప్రతీ ఒక్క భవనం ఆస్తి పన్ను పరిధిలోకి రావడంతో పాటు కార్పొరేషన్‌కు ఆదాయం కూడా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
అద్దెలపై బల్దియా దృష్టి
సాక్షి, కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏళ్ల తరబడిగా ఖాళీగానే ఉంటున్న షట్లర్లను అద్దెలకు ఇచ్చేందుకు బల్దియా నడుం బిగించింది. ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఉన్న వనరులను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో ఉన్న రాజీవ్‌గాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న షట్టర్లను అద్దెలకు ఇచ్చేందుకు వేలం పాటకు సిద్ధపడుతున్నారు. వీటికి తోడు రెండేళ్ల క్రితం ఐడీఎస్ఎంటీ నిధులతో నిర్మించిన నూతన షాపింగ్ కాంప్లెక్స్‌లో కూడా షట్టర్లను అద్దెలకు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. అద్దెల ద్వారా రూ.లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇన్నాళ్లు వేలం పాటలో ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో ఒకటి రెండు సార్లు దుకాణాలకు వేలం పాట వేస్తున్నామని హడావిడి చేసినప్పటికీ వేలం వేయకుండానే చేతులు దులుపుకున్నారు. మున్సిపల్ ఆవరణలో ఉన్న షాపింగ్‌కాంప్లెక్స్‌లో దాదాపు నాలుగేళ్లుగా పైఅంతస్తులో 14 గదులు ఖాళీగా ఉంటున్నాయంటే అధికారులు ఏమేరకు శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతోంది. మున్సిపల్ పాత గెస్ట్‌హౌస్ స్థలంలో ఐడీఎస్‌ఎమ్‌టీ నిధులు రూ.3.5కోట్లతో 42 షెట్టర్లను నిర్మించారు. అద్దెలకు ఇస్తే వాటిపై కూడా ఆదాయం వస్తుంది. ఇప్పటికే కాంప్లెక్స్ సెల్లార్లో పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. గతంలో వేలం నిర్వహించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఎవరూ అద్దెలకు రాలేదు. అయితే ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ఎలాగైనా అద్దెలకు ఇవ్వాలని అధికారులు పట్టుదలతో ఉన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు నగరపాలక సంస్థ ఆవరణలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న దుకాణాలను కొంత మంది అద్దెలకు తీసుకుని ఇతరులకు ఎక్కువ కిరాయికి ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి వారిని గుర్తించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇలాంటి వారిపై ఉదాసీనంగా వ్యవహరించకుండా కఠినంగా ఉండి, అద్దె అగ్రిమెంట్ గడువు ముగియడంతోనే వారిని ఖాళీ చేయించేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. అద్దెలకు తీసుకున్న వారు తప్ప ఇతరులు ఎవరైనా ఆ దుకాణాల్లో వ్యాపారం నిర్వహిస్తే మున్సిపల్ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అద్దెలపై దృష్టి సారించాం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఖాళీగా ఉన్న షెట్టర్లతోపాటు ఐడీఎస్‌ఎమ్‌టీ నిధులతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లోనూ షెట్లర్లు అద్దెకు ఇచ్చేందుకు దృష్టిసారించాం. ప్రస్తుతం అద్దెలకు తీసుకున్న షెట్టర్లలో ఇతరులు వ్యాపారం చేస్తే ఖాళీ చేయిస్తాం. అదనపు అద్దెల కోసం అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి గడువు ముగిశాక ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చేపడతాం. – సత్యనారాయణ, కమిషనర్ -
స్వచ్ఛత సమరం
కరీంనగర్‌కార్పొరేషన్: పరిశుభ్ర భారతావని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ స్వచ్ఛత సమరం చేపట్టింది. దేశ వ్యాప్తంగా స్వచ్ఛతపై జరుగుతున్న పోటీలో పదిలోపు ర్యాంకు సాధించడమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. పరిశుభ్ర నగరాలను గుర్తించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్–2019 పేరుతో పారిశుధ్యంపై సర్వే చేపట్టి ర్యాంకులు నిర్వహించనుంది. కేంద్ర బృందం సర్వేలో ముఖ్యంగా వ్యక్తిగత మరుగుదొడ్లు, తడి, పొడి చెత్త వేరుచేయడం, జనావాసాల్లో చెత్త వేయడం, పబ్లిక్ టాయిలెట్లు, డంప్‌యార్డులు, నగర పరిశుభ్రతపై దృష్టిపెట్టే అవకాశం ఉంది. నగరంలో పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛభారత్ అమలు సక్రమంగా ఉంటేనే మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంది. కరీంనగర్‌కార్పొరేషన్: 2015వ సంవత్సరంలో క్లీన్‌సిటీగా గుర్తించబడ్డ కరీంనగర్ నగరపాలక సంస్థ 2016లో 259వ ర్యాంకు, 2017లో 201వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. అయితే.. 2018లో 4,041 నగరాలు స్వచ్ఛత ర్యాంకు కోసం పోటీపడగా 73వ ర్యాంకు సాధించి దేశ వ్యాప్తంగా కరీంనగర్ ఖ్యాతిని చాటిచెప్పింది. ఈ ఏడాది సైతం పోటీ తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. నగర పాలక సంస్థ లక్ష్యంగా పెట్టుకున్న 10లోపు ర్యాంకు సాధించాలంటే తీవ్రంగా శ్రమించాలనే ఉద్దేశంతోనే ముందుకు కదులుతున్నారు. అయితే.. వాడవాడలా ఇంటింటికీ స్వచ్ఛతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మహిళా సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, బేకరీలు, ఇతర వ్యాపారులకు స్వచ్ఛత ఆవశ్యకతను తెలుపుతూ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తే మంచి ఫలితం సాధించే అవకాశాలు ఉన్నాయి. పారిశుధ్యం మెరుగుపడాలి.. నగరంలోని 50 డివిజన్లలో 62 వేల నివాస గృహాలుండగా, సుమారు 72 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 200 టన్నుల చెత్త వెలువడుతోంది. అయితే.. చెత్తసేకరణ నుంచి డంపింగ్ వరకు అన్నీ అవాంతరాలే ఏర్పడుతున్నాయి. స్వచ్ఛభారత్ ఇచ్చిన మార్కులు సాధించాలంటే తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణ జరగాల్సి ఉంది. మురుగు కాలువల శుభ్రత రెగ్యులర్‌గా లేకపోవడం, పూడికను వెంటవెంటనే తొలగించకపోవడం, డంపింగ్ యార్డులో చెత్త పేరుకుపోవడం వంటి అంశాలు పోటీలో ఇబ్బంది పెట్టనున్నాయి. దీనికితోడు వీధుల్లో చెత్త ఎక్కడపడితే అక్కడ వేస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. ఇదంతా మార్కులపై ప్రభావం చూపనుంది. ప్రజల భాగస్వామ్యంతోనే.. నగరపాలక ఆధ్వర్యంలో అమలు చేస్తున్న విధానాలపై నగరవాసులు అవగాహన పెంచుకుంటే పరిశుభ్రత కష్టమేమీ కాదు. ఇంట్లోని చెత్తను వేర్వేరు డబ్బాల్లో నిల్వ చేసి పారిశుధ్య కార్మికులకు అప్పగించడం, తడి చెత్తను మురుగుకాల్వల్లో పడేయకుండా ఉంటే చాలు. దీంతో పందుల సంచారం, దుర్వాసన పూర్తిగా దూరమవుతుంది. అప్పుడే స్వచ్ఛ నగరంగా రూపుదిద్దుకుంటుంది. వంద రోజుల ప్రణాళిక.. కరీంనగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్ది స్వచ్ఛ సర్వేక్షణ్–2019లో మంచి ర్యాంకు సాధించాలంటే గతంలో కంటే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో పరిగణలోకి తీసుకునే తడి, పొడి చెత్త వేరు చేయడం, డీఆర్‌సీసీల మెయింటెనెన్స్, ఓడిఎఫ్, పబ్లిక్, కమ్యూనిటీ, షీ టాయిలెట్స్ శుద్ధి, తడి–పొడి చెత్తపై అవగాహన, శానిటేషన్ వాహనాల మెయింటెనెన్స్, వర్మికంపోస్టుల ఏర్పాటు, వాహనాల మెయింటెనెన్స్, డంప్‌యార్డు నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించారు. వంద రోజుల్లో వీటన్నింటిపై పట్టు సాధిస్తేనే స్వచ్ఛసర్వేక్షణ్‌లో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంది. 10 లోపు ర్యాంకే లక్ష్యం.. కరీంనగర్ నగరపాలక సంస్థ గతంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ చాలెంజ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే 2019లో 10లోపు ర్యాంకు సాధించేందుకు ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై కసరత్తు చేస్తున్నాం. ఫలితాన్ని రాబట్టేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. – రవీందర్‌సింగ్, మేయర్ -
కొండూర్ శశాంక బదిలీ
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ కొండూర్ శశాంక బదిలీ అయ్యారు. బుధవారం ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీల్లో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఇరవై నెలల పాటు ఇక్కడ సేవలందించిన శశాంక తన సహ జ స్వభావంతో ఐఏఎస్ మార్కు చూపారు. 2016 డిసెంబర్ 8న నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నగరపాలక సంస్థను అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో నిలిపేందుకు కృషిచేశారు. ముఖ్యంగా స్మార్ట్‌సిటీ సాధనలో కీలక పాత్ర పోషించారు. స్మార్ట్‌సిటీ రేసులో ఉన్నప్పుడు అధికారులను, పాలకులను, ప్రజలను పరుగులు పెట్టించారు. ఢిల్లీ స్థాయిలో స్మార్ట్‌సిటీ హోదా కోసం నిరంతరం శ్రమించారు. స్మార్ట్‌సిటీ పొందిన నగరాలను సందర్శిస్తూ ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుంటూ డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సమర్పించడంలో సఫలీకృతులయ్యారు. ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ నేతృత్వంలో 2017 జూన్ 23న స్మార్ట్‌సిటీ హోదాను సాధించడంలో కీలక భూమిక పోషించారు. స్మార్ట్‌సిటీ హోదాను దక్కించుకోవడంలో ప్రణాళికాబద్ధంగా సమయస్ఫూర్తితో ముందుకెళ్లడంలో శశాంక చేసిన కృషిని ప్రజాప్రతినిధులు సైతం ప్రశంసించారు. ఐఏఎస్ అధికారిగా ఎవరూ పనిచేయనంత కాలం ఇక్కడి పనిచేసి తన సమర్థతను నిరూపించుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో.. దేశవాప్తంగా 4 వేల పైచిలుకు నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొనగా, కరీంనగర్ మెరుగైన ర్యాంకు సాధించడంలో శశాంక కీలక పాత్ర పోషించారు. కరీంనగర్లో శానిటేషన్ వ్యవస ్థను మెరుగపరచడంలోనూ, ఇంటింటి చెత్త సేకరణ, డంప్‌యార్డుకు చెత్తను తరలించడం, వీ ధుల్లో చెత్త కనిపించకుండా చేయడం, ఓడీఎఫ్ సాధించడంలో, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, వాటి నిర్వహణలో మెరుగైన సేవలందించడంతో దేశంలో 73వ ర్యాంకు సాధించాం. అప్పటికే స్మార్ట్‌సిటీ సాధించుకున్న నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ ర్యాంకు రావడంతో దేశం చూపు ఒక్కసారిగా కరీంనగర్‌పై పడింది. జీవన ప్రమాణాల్లో 11వ ర్యాంకు.. జీవన ప్రమాణాల అంశంపై దేశవ్యాప్తంగా 111 నగరాల్లో జరిగిన సర్వేలో కరీంనగర్‌కు 11వ ర్యాంకు రావడంలో కమిషనర్ పాత్ర ఎంతో ఉంది. ఈ అంశంపై పోటీ జరుగుతుందనే విషయం కూడా తెలియని నగరాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక పద్ధతి ప్రకారంగా పనులు చేస్తూ ప్రజల మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడంతోపాటు నివేదికను సిద్ధం చేసి సమర్పించడంలో విజయం సాధించారు. తెలంగాణలోనే మొదటి స్థానంలో కరీంనగర్ నిలువగా, ఇక్కడి నుంచి పోటీ పడ్డ హైదరాబాద్‌కు 23, వరంగల్‌కు 61వ ర్యాంకు రావడం గమనార్హం. హరిత అవార్డు.. కరీంనగర్లో హరితహారంలో నాటిన మొక్కలను కాపాడడంలో సక్సెస్ సాధించారు. గతేడాది నాటిన మొక్కల్లో 80 శాతం మొక్కలను కాపాడి రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డుల్లో హరిత నగరం అవార్డు కరీంనగర్‌కు దక్కేలా కృషి చేశారు. విద్యార్థులకు సమ్మర్‌క్యాంపులు.. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎప్పుడూ లేని విధంగా విద్యార్థుల కోసం రెండు దఫాలుగా నిర్వహించిన సమ్మర్ క్యాంపుల్లో వేలాది మంది విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. వివిధ క్రీడాంశాల్లో నిర్వహించిన శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. 2017లో 1,300 మందికి, 2018లో 2,500 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో మెరుగైన పాత్ర పోషించారు. కలెక్టర్లుగా కమిషనర్లు.. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇప్పటివరకు ముగ్గురు ఐఏఎస్‌లు పనిచేశారు. వీరంతా జగిత్యాల సబ్‌కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ చేసి తర్వాత కమిషనర్లుగా కరీంనగర్ వచ్చారు. మొదటి శ్రీకేష్‌లఠ్కర్ కమిషనర్‌గా రాగా.. ఆయన 2014లో రాష్ట్ర విభజనతో ఆంధ్రా ప్రాంతానికి వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన కృష్ణభాస్కర్ జిల్లాల విభజనతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం పనిచేసిన శశాంక జోగులాంభగద్వాల జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్తున్నారు. మొత్తం మీద ఇద్దరు ఐఏఎస్‌లకు కరీంనగర్ కలిసివచ్చిందనే చెప్పవచ్చు. జేసీలుగా పనిచేయకుండానే డైరెక్ట్ కలెక్టర్లు కావడం గమనార్హం. -
ముంపు.. ముప్పు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది వాగులు, కాలువలు కాదు. నగరం నడిబొడ్డున ఉన్న జ్యోతినగర్లోనిది. ఇటీవల కురిసిన చిన్న వర్షాలకే డ్రెయినేజీలు నిండి రోడ్లన్నీ వాగులై ప్రవహిం చాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా కష్టపడి ఇళ్లలో చేరిన నీటిని బయట పారబోసేందుకు తిప్పలుపడ్డారు. నాలుగు డివిజన్ల వరద నీళ్లు చిన్న డ్రెయినేజీల నుంచి వెళ్లడం గగనంగా మారింది. ఇది ఈ ఒక్క రోజు సమస్య కాదు. 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. వర్షం కురిసిన ప్రతిరోజూ ప్రజలు జాగారం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో పేరు గడిస్తున్న కరీంనగర్‌ను నగర సమస్యలు వెక్కిరిస్తున్నా యి. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్న నగరం.. స్థానికంగా ప్రజలను మెప్పించలేకపోతోంది. చిన్నపాటి వర్షం వస్తే చాలు నగరమంతా అతలాకుతలమవుతోంది. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయం. ఇటీవలే కేరళ రాష్ట్రంలో వర్షం సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. పెద్దపాటి వర్షం కురిస్తే నగరం జలమయంలో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే దీనంతటికి కారణం. ప్రస్తుతం నగరంలో డ్రెయినేజీ నిర్మాణాలు నడుస్తున్నా.. ‘ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి’ అన్న చందంగా ఉంది పనుల ప్రగతి. – కరీంనగర్‌కార్పొరేషన్ కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థలో ఒక్క వానకే చాలా ప్రాంతాల్లోని వీధులు జలమయమవుతున్నాయి. డ్రెయినేజీలు పొంగి పొర్లుతూ మురుగునీరు ఇళ్లలోకి చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య 20 ఏళ్లుగా ఉన్నా.. శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. గతానుభవాలను పాఠాలుగా స్వీకరించాల్సిన అధికారులు ఎప్పటిలాగే హడావిడి చేసి వదిలేస్తున్నారు. పాలకులు సైతం హామీలకు పరిమితమై పనులను పక్కనబెడుతున్నారు. చిన్న వానలకే చెరువులను తలపిస్తున్న నగరంలో ఇక భారీ వర్షాలు, వరదలు వస్తే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. కేరళ తరహాలో వర్షాలు పడితే మన పరిస్థితేంటనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. నగరంలో అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా అవసరమైన పనులు జరగకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు వస్తే జరిగే నష్టం మామూలుగా ఉండదని తెలిసినప్పటికీ ఆ స్థాయిలో పనులు కాకపోవడం గమనార్హం. ముందుచూపు కరువాయె.. కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడం లేదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు కాలం వెల్లదీస్తున్నారు. బల్దియా ఇంజినీరింగ్ విభాగంలో ముందు చూపు కరువైంది. వరద నీటి ఉధృతిని బట్టి డ్రెయినేజీలు నిర్మించడం లేదు. ఏళ్లుగా సమస్య ఉన్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికీ నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రెయినేజీల నిర్మాణం అస్తవ్యస్తంగా తయారైంది. చిన్న వానకే డ్రెయినేజీలు పొంగిపొర్లుతూ మురుగునీరంతా ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. కేరళలో జరిగిన జలప్రళయాన్ని తలచుకుని నగర ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. 2016 సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురువగా లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో మునిగిపోయాయి. ఆ సమయంలో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ వరద ప్రాంతాల్లో సందర్శించి యుద్ధ ప్రాతిపదికన నూతన డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లు గడిచినా ఇప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న అధికారులు అవసరమైన చోట మాత్రం పనులు చేపట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లోతట్టు జలమయం.. పలు డివిజన్లలోని లోతట్టు ప్రాంతాలు వర్షాకాలంలో చెరువులను తలపిస్తున్నాయి. జ్యోతినగర్, కురుమవాడ, ముకరంపుర, హరిహరనగర్, రాంనగర్, కరీంనగర్ డైరీ వెనుక ప్రాంతం, కోతిరాంపూర్, లక్ష్మీనగర్, భగత్‌నగర్, రాంచంద్రాపూర్‌కాలనీ, ఇందిరానగర్, అశోక్‌నగర్, హౌజింగ్‌బోర్డుకాలనీ, హుస్సేన్పుర, ఆమెర్నగర్, కోతిరాంపూర్ తదితర ప్రాంతాలు చిన్న వర్షానికే జలమయమవుతున్నాయి. వరదనీటిని మళ్లించడానికి ప్రణాళికాబద్ధంగా డ్రెయినేజీలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు మురుగునీటి డ్రెయినేజీల ద్వారానే వరద నీరు వెళ్తోందని నిమ్మకుండి పోయారు. అయితే.. వరద నీటి తాకిడికి డ్రెయినేజీలన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద నీరు ఎక్కడికక్కడ నిలిచి చెరువులను తలపిస్తోంది. ప్రధాన రహదారుల పరిస్థితి కూడా ఇలాగే ఉండడంతో వర్షం పడే సమయంలో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. స్లమ్లకంటే అధ్వానం.. డ్రెయినేజీల నిర్మాణంలో ప్రణాళికాలోపంతో లోతట్టు ప్రాంతాలు ఉన్న డివిజన్లు స్లమ్ ఏరియాలుగా మారుతున్నాయి. కేవలం డ్రెయినేజీల లోపంతోనే ఈ సమస్య వస్తోంది. నీరు వెళ్లే మార్గాన్ని బట్టి డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. 15, 45 డివిజన్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అయితే.. 40, 43, 44వ డివిజన్ల నుంచి వరద నీరు ఈ ప్రాంతాల మీదుగానే వెళ్తుండడంతో సమస్య తీవ్రంగా మారింది. అదేవిధంగా 14వ డివిజన్ ఇందిరానగర్, 1వ డివిజన్ సుభాష్‌నగర్, 8వ డివిజన్ హుస్సేనిపుర, 25వ డివిజన్ కోతిరాంపూర్‌లలో సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. వరద నీటికి తగిన విధంగా డ్రెయినేజీలు లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. వర్షం వెలిసిన తర్వాత ఆ ప్రాంతాలన్నీ బురదమయంగా మారి స్లమ్ ఏరియాలను తలపిస్తున్నాయి. నడవడానికి కూడా వీలులేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద డ్రెయినేజీలే పరిష్కారం.. భారీ వర్షాలు పడితే కలిగే ముప్పు నుంచి బయటపడాలంటే వరద నీటితో మునుగుతున్న లోతట్టు ప్రాంతాల్లో పెద్ద పెద్ద డ్రెయినేజీలు కట్టడమే దీనికి పరిష్కారమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్రెయినేజీలు పెద్దగా చేపట్టాలంటే రోడ్డును తవ్వడం తప్ప వేరే మార్గం లేదు. రోడ్డు మధ్యలో పెద్ద డ్రెయినేజీ నిర్మాణం చేపట్టి దానిపై స్లాబు వేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. డ్రెయినేజీల నిర్మాణానికి రూ.20 కోట్లు.. లోతట్టు ప్రాంతాల్లో వరద ఉధృతిని తట్టుకునేలా డ్రెయినేజీల నిర్మాణానికి రూ.20 కోట్లతో పనులు చేపడుతున్నాం. నగరంలో ఎక్కడ ముంపు ప్రాంతముంటే అక్కడ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పూర్తిచేశాం. కొన్ని ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. త్వరలోనే కేటాయించిన నిధులు వెచ్చించి పనులన్నీ పూర్తిచేస్తాం. వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిత చర్యలు చేపడతాం. – రవీందర్‌సింగ్, మేయర్ -
శ్రీలత రాజీనామా.. టీఆర్ఎస్లో కలకలం
సాక్షి, కరీంనగర్ : అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కీలక నాయకురాలు, 12వ డివిజన్ కార్పొరేటర్ మొండి శ్రీలత టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆమె భర్త చంద్రశేఖర్ కూడా గులాబీకి గుడ్‌బై చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన శ్రీలత దంపతులు.. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీరుతో విసిగిపోయి రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటాం : రాజీనామాకు దారితీసిన కారణాలను వివరిస్తూ కార్పొరేటర్ శ్రీలత భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మమ్మల్ని అడుగడుగునా కించపరుస్తున్నారు. అభివృద్ధి పనులకు ఒక్కపైసా కేటాయించడంలేదు. ఇదేమని ప్రశ్నించినందుకు మా కుటుంబంపై కక్షగట్టారు. ఓ భూవివాదంలో నా భర్త(చంద్రశేఖర్)ను అన్యాయంగా ఇరికించారు. ఆయన వేధింపులు భరించలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఇప్పటికైనా గంగుల మాపై వేధింపులు ఆపకుంటే ఆయన ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటాం’’ అని శ్రీలత పేర్కొన్నారు. కలకలం : సరిగ్గా ఇదే తరహాలో గత ఏడాది సెప్టెంబర్‌లో మరో కార్పొరేటర్ జయశ్రీ రాజీనామా అస్త్రాన్ని సంధించిన సంగతి తెలిసిందే. జయశ్రీ కూడా ఎమ్మెల్యే గంగులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజా రాజీనామాతో కరీంనగర్ టీఆర్ఎస్లో కలకలం రేగింది. నాయకులంతా గంగుల వ్యతిరేక, అనుకూల వర్గాలుగా చీలిపోయారు. ఎమ్మెల్యే బాధితులు ఇంకొందరు కూడా రాజీనామాలు చేస్తారనే ప్రచారం సాగుతోంది. -
e టెండ'రింగ్'
* 66 పనుల్లో 46 పనులకు సింగిల్ టెండర్లు దాఖలు * మిగిలిన పనులకు ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్ల పోటీ * వారిని తప్పించేందుకు ముమ్మర యత్నాలు * బల్దియా ముఖ్య ప్రజాప్రతినిధులకు నజరానా! * కార్పొరేషన్ ఆదాయూనికి భారీ గండి సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో ‘ఆస్థాన’ కాంట్రాక్టర్లు మళ్లీ రింగయ్యారు. కాసుల పంపకాలతో పోటీ లేకుండా విజయవంతంగా టెండర్లు దాఖలు చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.6.95 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాల కోసం కార్పొరేషన్ అధికారులు టెండ ర్లు ఆహ్వానించారు. మొత్తం 66 పనులకు టెండర్లు దాఖలు కాగా, అందులో 46 పనులకు సింగిల్ షెడ్యూళ్లు మాత్రమే దాఖలయ్యాయంటే కాంట్రాక్టర్లు ఏ మేరకు రింగ్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 20 పనులకు మాత్రం రెండు, మూడు చొప్పున షెడ్యూళ్లు దాఖలైనప్పటికీ అందులో ముగ్గురు కాంట్రాక్టర్లు డీడీలు చెల్లించకపోవడంతో వారు అనర్హులయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. మిగిలిన 17 పనులను దక్కించుకున్న వారిని సైతం పోటీ నుంచి తప్పించేందుకు కాంట్రాక్టర్ల సిండికేట్ ముమ్మర యత్నాలు చేస్తోంది. అందుకోసం ఒకవైపు సయోధ్య యత్నాలు మొదలు పెట్టడంతోపాటు మరోవైపు అధికార బలాన్ని వినియోగించే పనిలో నిమగ్నమైంది. ప్రైస్ బిడ్లు తెరిచేందుకు గురువారం ఆఖరు తేదీ కావడంతో సామదాన దండోపాయాలను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. సయోధ్య కోసం ముమ్మర యత్నాలు వాస్తవానికి 14వ ఆర్థిక సంఘం పనుల్లో 66 పనులకు సింగిల్ టెండర్లే దాఖలయ్యేలా కాంట్రాక్టర్ల సిండికేట్ ప్రణాళిక రూపొందించింది. ఆన్లైన్ టెండర్లు కావడంతో అనూహ్యంగా 17 పనులకు సిద్దిపేట, ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు పోటీపడి షెడ్యూళ్లు దాఖలు చేశారు. కాంట్రాక్టర్ల అసోసియేషన్ నేతకు బద్దశత్రువుగా ఉన్న ఓ కార్పొరేటర్ సిద్దిపేట కాంట్రాక్టర్లను ప్రేరేపించి షెడ్యూళ్లు దాఖలు చేయించినట్లు తెలిసింది. వారు టెండర్ దాఖలు చేయడంతో ఆ పనులు దక్కేలా ముందుగా ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. ఒక్కో పనికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు చెల్లించి పనులు కొనుగోలు చేసిన సదరు కాంట్రాక్టర్లు ఇదేంటంటూ అసోసియేషన్‌పై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకుడు 17 పనుల్లో రాజీ కుదుర్చుకునేందుకు సయోధ్య యత్నాలు మొదలు పెట్టారు. సిద్దిపేటకు చెందిన కాంట్రాక్టర్‌తోపాటు నిర్మాణ సంస్థకు చెందిన ఓ కాంట్రాక్టర్, నగరానికి చెందిన మరో కాంట్రాక్టర్ పనులకు టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. వీరితో ఫోన్లో మాట్లాడి ప్రైస్‌బిడ్ ఓపెన్ చేయకముందే విత్‌డ్రా చేసుకునే విధంగా ముఖ్యనేతలతో ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్య ప్రజాప్రతినిధులకు నజరానా! 14వ ఆర్థిక సంఘం పనుల్లో కాంట్రాక్టర్లకు పూర్తిగా సహకరిస్తున్న నగర పాలక సంస్థకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులకు రూ.కోటి పనులను అప్పగించినట్లు తెలిసింది. అందులో ఒకరికి రూ.70 లక్షలు, మరొకరికి రూ.30 లక్షల విలువైన పనులను అప్పగించినట్లు సమాచారం. ఆయా పనులను సదరు ప్రజాప్రతినిధులు తమకు ఇష్టమొచ్చిన వారికి అప్పగించి వారి నుంచి నజరానా తీసుకునేందుకు సిద్ధమైనట్లు వినికిడి. మరోవైపు రేపు ప్రైస్‌బిడ్లు తెరవనుండటంతో ఎవరెవరు ఎంత లెస్‌కు టెండర్ దాఖలు చేశారనేది తెలిసిపోతోంది. టెండర్లకు పోటీ లేకపోవడంతో ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా పెద్దగా లెస్‌కు టెండర్ వేయలేదని తెలుస్తోంది. కొందరు ఎక్సెస్‌కు టెండర్ దాఖలు చేసినట్లు సమాచారం. ప్రైస్ బిడ్ తెరిస్తే కానీ అసలు సంగతి తేలనుంది. కుదిరితే పనులు.. లేదంటే పైసలు వాస్తవానికి ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లలో ఎవరు టెండర్లు వేస్తున్నారనే విషయం అప్లోడ్ చేసిన అధికారులు కూడా తెలియదు. టెక్నికల్ బిడ్ విప్పితేనే తెలిసే అవకాశముంటుంది. అలాంటి విధానానికి కూడా కాంట్రాక్టర్లు అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లు బాక్స్ టెండర్లయినా, ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లయినా సయోధ్యతోనే దక్కించుకుంటూ బల్దియాకే సవాలుగా మారుతున్నారు. కొంత మంది కాంట్రాక్టర్లు పనులు దక్కించుకుంటే, మరికొంత మందికి పగిడీలు దక్కుతున్నాయి. రోడ్లు, డ్రెయినేజీ పనులను అంచనాల కంటే ఎక్కువ రేట్లకు టెండర్లు వేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ఇటీవల బల్దియాకు ఇబ్బడిముబ్బడిగా నిధులు వస్తుండడంతో వారు ఆడింది ఆటగా మారుతోంది. దీనికి తోడు ఇంజనీరింగ్ విభాగంలో స్తబ్ధత నెలకొనడం, అధికారులు క్షేత్రస్థాయిలో పట్టించుకోకపోవడంతో పనుల్లో నాణ్యత కూడా కరువవుతుంది. వర్క్ ఇన్స్పెక్టర్లపై ఆధారపడుతూ కేవలం కమీషన్ల కోసమే కార్యాలయానికి వస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా కాంట్రాక్టర్లు ఏది చేసినా నడుస్తుందనే భావనతో పనులు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. -
కార్పొరేషన్ సమావేశం రచ్చ..రచ్చ
♦ మహిళా కార్పొరేటర్ల బాహాబాహీ ♦ చెప్పు తీసి.. తిట్ల దండకం ♦ ఓ కార్పొరేటర్ ఆత్మహత్యాయత్నం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చగా మారింది. ఇద్దరు మహిళా కార్పొరేటర్లు బాహాబాహీకి దిగారు. ఓ కార్పొరేటర్ ఏకంగా చెప్పు తీశారు. కార్పొరేటర్లు ఇరువురూ అధికార టీఆర్ఎస్ వారే కావడం విశేషం. కరీంనగర్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మేయర్ రవీందర్‌సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ప్రారంభంలోనే జీరో అవర్ కింద శానిటేషన్‌పై వాడీవేడిగా చర్చ జరిగింది. 23వ డివిజన్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని, ఇతర కార్పొరేటర్లు తన డివిజన్‌లోకి వచ్చి సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపిస్తూ కార్పొరేటర్ తాటి ప్రభావతి మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. తననే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నావంటూ 4వ డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల సరిత పోడియం వద్దకు వచ్చి ప్రభావతితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆవేశానికి లోనైన ప్రభావతి చెప్పు తీశారు. ఇద్దరూ వ్యక్తిగత దూషణలకు దిగారు. సరిత భర్త అశోక్ తన అనుచరులతో వచ్చి ప్రభావతిని దూషిస్తూ కౌన్సిల్ ప్రధాన ద్వారంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు యత్నించారు. అప్పటికే భోజన సమయం కావడంతో బ్రేక్ ఇచ్చారు. లంచ్ అనంతరం కార్పొరేటర్లతో మేయర్ సమావేశమై ఘటనపై చర్చించారు. తిరిగి సమావేశమయ్యాక క్షమాపణ చెప్పాలనడంతో ప్రభావతి కౌన్సిల్ హాల్లోకి వచ్చి చెప్పు తీయడం తప్పేనన్నారు. తనను దూషించినవారిని కూడా సస్పెండ్ చేయాలని, లేని యెడల ఆత్మహత్య చేసుకుంటానంటూ మైకు వైరును మెడకు బిగించుకునే ప్రయత్నం చేశారు. అయితే అత్యవసర అంశాలను ఆమోదించి సభను మేయర్ వాయిదా వేశారు. -
మా జీవితాలు ‘చెత్త' బతుకులేనా?
‘‘చెత్త తీసేందుకు మేము కావాలె... డ్రైనేజీ పనికి మేమే కావాలె... ఆఖరికి ఇంటిముందు కుక్కలు, పందులు చచ్చినా మేమే వచ్చి తీయాలె... కానీ గుక్కెడు నీళ్లడిగితే మాత్రం మీరియ్యరు. బుక్కెడు బువ్వ కూడా పెట్టరు. మమ్ముల్ని చూస్తే ఈసడించుకుంటరు. కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా సూత్తలేరు. మేమేం పాపం చేసినం సారూ... మేము మనుషలం కాదా?’’ పారిశుధ్య కార్మికురాలు యశోద గుండెల్లో నుంచి వచ్చిన మాటలివి. నిజానికి కార్మికులందరి గుండెల్లో ఉన్న వేదన ఇది. రోడ్లపై చెత్తను, డ్రైనేజీల్లో పేరుకుపోయిన అశుద్ధిని చిత్తశుద్ధితో ఏరిపారేస్తూ నగరాన్ని ఎప్పటికప్పుడు సుందరంగా ఉంచుతున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులు పడుతున్న బాధలను, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు బల్దియా మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారారు. శనివారం తెల్లవారుజామునే వీధుల్లోకి వచ్చి పారిశుధ్య కార్మికులను పలకించారు. సమస్యలను అడిగారు. వారి గుండెల్లో గూడుకట్టుకున్న బాధను, వేదనను పాఠకుల ముందు ఆవిష్కరించారు. మేయర్ హామీలివీ.. పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ వెంటనే మాస్కులు, గ్లౌజులు, బూట్లు అందిస్తామన్నారు. ఇప్పటికే 125 పర్మినెంట్, 681 కాంట్రాక్టు, 66 మంది గ్రూపు కార్మికుల కోసం వీటిని తెప్పించామన్నారు. వారం రోజుల్లోగా వీటిని కార్మికులకు పంపిణీ చేయాలని శానిటరీ సూపర్వైజర్ రాజమనోహర్‌కు సూచించారు. పదిహేను రోజులకోసారి చీపుర్లు అందించాలని శానిటరీ జవాన్‌ను ఆదేశించారు. పీఎఫ్ జమ చేయడంలో బల్దియా అధికారుల నిర్లక్ష్యం ఉంటే వెంటనే సమస్య పరిష్కరిస్తానని అన్నారు. కార్మికులకు వేతనాలు ప్రతి నెల పదో తేదీలోగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ‘‘మా నౌకర్లు పర్మెంటు గావాలె. తెలంగాణ అచ్చినంక జేత్తమన్నరు. ఈ కాంటాక్టు జీతాలద్దు మాకు. గౌర్మెంటు జీతాలే గావాలే. పక్క ఊర్లల్లకెల్లి అత్తన్నం. రోజుకు యాబై అటో కిరాయిలైతన్నయ్. మాకు ఇక్కన్నే ఇండ్ల స్థలాలియ్యాలె. - శంకరమ్మ రవీందర్‌సింగ్ : అందరూ బాగున్నారా? లక్ష్మి : అంతా మీ దయ సారూ.. ఇప్పుడైతే ఇట్టున్నం. రవీందర్‌సింగ్ : ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? శోభరాణి : 24 గంటలు దుమ్ముల, వాసనల బతికోటోళ్లం. రోగాలు, నొప్పులు వస్తన్నయ్. అన్ని భరించుకుంటున్నం. చాతగాని నాడు సెలవువెట్టుకుంటున్నం. మళ్ల తెల్లారి తప్పదన్నట్టు పనికత్తన్నం. రవీందర్‌సింగ్ : దవాఖానాకు పోతుండ్రా మరి? ప్రేమలత : జరమచ్చి, రోగమచ్చి సర్కారు దవఖానకెళ్తే ఎవ్వలు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీ డ్రెస్సేసుకొని పోయినా కానుతలేరు. మున్సిపలోల్లు అచ్చినప్పుడు పట్టించుకునేటట్లు చెయ్యాలె. జరాలు, రోగాలు అచ్చినప్పుడు ఇబ్బందయితంది. రవీందర్‌సింగ్ : పనికి తగ్గట్టు వసతులు మంచిగున్నయా? హన్మంతు : మోరీలల్ల దిగినప్పుడు గాజు వక్కలు, సూదులు గుచ్చుకపొయ్యి గాయాలైతన్నయ్. చెత్త తీసేటప్పుడు చేతులకు గుచ్చుకుంటన్నయ్. మోరీలు తీసేటప్పుడు, చచ్చిపోయిన పందులను, కుక్కలను తీసేటప్పుడు వాసన భరించలేకపోతున్నం. కక్కచ్చినట్లయితంది. మాకు మాస్కులు, చేతులకు గ్లౌజులు, బూట్లు ఇయ్యాలె. అవ్వి లేకపోతే పనిజేసేటప్పుడు చాన కట్టమైతంది. రవీందర్‌సింగ్ : ప్రైవేటు హాస్పిటల్స్‌లో వేస్టేజ్, చెత్త అన్నీ మీరే తీస్తున్నరా? అనిల్ : లైన్ ప్రకారం తీస్తన్నం. ఎసోంటి పనైనా మేమే చెయ్యాలెగదా. పని నచ్చినప్పుడు చాయమందం పైసలిత్తరు. ఒక్కొక్కలు ఇయ్యనే ఇయ్యరు. అయినా మాపని మేం జేసుకుంటనేపోతం. రవీందర్‌సింగ్ : మీకు ఏం కావాలనుకుంటున్నరు? యశోద : మమ్ములను మంచిగ జూసుకుంటే మేము రోడ్లను, వాడలను మంచిగ ఊడుత్తం. దోమలు పెరగకుండ జూత్తం. చీపుర్లు ఇస్తలేరు, మాస్కులు ఇత్తలేరు. నూనెలు, సబ్బులు, చెప్పులు ఇయ్యాలె. చీపుర్లు బయటకొంటె ఇరవై రూపాలు అయితన్నయ్. పదిగేను రోజులకోసారైనా చీపుర్లు ఇయ్యాలె. రవీందర్‌సింగ్ : జీతాలు నెలనెల వస్తున్నాయా? బాలవ్వ : జీతాలు రెన్నెళ్లకు, మూన్నెళ్లకు అత్తన్నయ్. ఏ నెల జీతం ఆనెల ఇత్తె మంచిగుంటది. ఇంటి ఖర్చులకు, పోరగాండ్ల చదువులకు తిప్పలైతాంది. రోజురోజుకు ఖర్చులు పెరుగుతన్నయ్. జీతాలు కూడా పెరుగాలె. రవీందర్‌సింగ్ : వేతనాలు రూ.6700 నుంచి ఆర్నెల్ల క్రితం రూ.8300 పెరిగినయి కదా.. పీఎఫ్ నెంబర్లు వచ్చినయా? అంజనేయులు : ఏమో సారూ... అందరికీ పీఎఫ్ నంబర్లు ఇచ్చినమని చిట్టీలైతే ఇచ్చిండ్రు. బుక్కులియ్యలే. మాకైతే నంబర్లు తెలువయిగని, కట్‌చేసిన పైసలు కడుతలేరని చెబుతుండ్రు. మాకు అన్యాయం కావద్దు. రవీందర్‌సింగ్ : మీకు ఇంకా ఏమేం కావాలో చెప్పండి? శంకరమ్మ : మా నౌకర్లు పర్మెంటు గావాలె. తెలంగాణ అచ్చినంక జేత్తమన్నరు. ఈ కాంటాక్టు జీతాలద్దు మాకు. గౌర్మెంటు జీతాలే గావాలే. పక్క ఊర్లల్లకెల్లి అత్తన్నం. రోజుకు యాబై అటో కిరాయిలైతన్నయ్. మాకు ఇక్కన్నే ఇండ్ల స్థలాలియ్యాలె. రవీందర్‌సింగ్ : తెల్లకార్డులున్నయా.. ఆహారభద్రతకు దరఖాస్తు చేసుకున్నరా? లక్ష్మి : అందరికీ తెల్లకార్డులున్నయ్. ఆహారభద్రత కార్డుల కోసం గూడ దరఖాస్తు పెట్టుకున్నం. ఎప్పుడిత్తరో ఏమో. మాకైతే పెద్ద దవఖాన్లకు సూపించుకునేతట్లు సౌకర్యం చెయ్యాలె. దవాఖాన కార్డులియ్యాలె. రవీందర్‌సింగ్ : పోచయ్య డల్లుగున్నవ్... జ్వరమొస్తందా? పోచయ్య : అవును సారూ.. నిన్న మొన్న జరముండే. ఇయ్యల్ల కొంచెం తగ్గింది. రెండు రోజులు సెలవుపెట్టిన. నాకు వయసైపోతంది. బాగ చాతకాకపోతే నా కొడుకును నౌకరికి ఎక్కిత్తననుకుంటన్న. ఇంకేంజెయ్యాలె. రవీందర్‌సింగ్ : ఎవ్వరైనా ఇబ్బంది పెడుతున్నారా? ప్రభాకర్ : చెప్పిన పని చేస్తన్నం. పనికాడ, ఆజిరికాడ మమ్ములను ఇబ్బందేం పెడుతలేరు. కానీ పనిభారం ఎక్కువైతాంది. ఇద్దరు చేసేకాడ ఒక్కరితోనే చేయిత్తాండ్రు. మనుషులు తక్కువైన కాడ జబ్బలు, కాల్లు పోతన్నయ్. ఇబ్బంది అయితంది. సిబ్బందిని పెంచితే ఇంకా మంచిగ పనిచేస్తం. రవీందర్‌సింగ్ : ట్రాక్టర్ డ్రైవర్‌గా ఎన్నాళ్ల నుంచి చేస్తున్నవ్, లెసైన్స్ ఉందా? వెంకటయ్య : సారు మొదట్ల లేబర్‌గానే పనికెక్కిన. డ్రైవింగ్ నేర్చుకున్నంక లెసైన్స్ తీసుకున్న. ఐదేండ్ల నుంచి డ్రైవర్‌గా జేత్తన్న. సందులల్లకు పోయినప్పుడు ట్రాక్టర్ తిరుగుటానికి కొద్దిగ ఇబ్బంది అయితది. మేన్రోడ్లమీద ఫర్వలేదు. రవీందర్‌సింగ్ : డివిజన్లకు వెళ్లినప్పుడు ఎలా ఉంటుంది? శోభారాణి : పనైతే చేయించుకుంటరు గని, మంచినీళ్లు అడిగినా శానిటేషనోల్లమని ఇయ్యడానికి ఎనుకముందు జేత్తండ్రు. కుక్కజచ్చినా, పిల్లిజచ్చినా పిలుత్తరు. పనిచేయడానికి మేం కావాలెగని, మమ్మల్ని పట్టిచ్చుకోరు. రవీందర్‌సింగ్ : రిక్షాలకు చెత్త ఇస్తుండ్రా? వెంకటేష్ : వాడలల్లకు పోయి విజిల్ వేస్తే ఇండ్లల్లకెళ్లి చెత్త తెచ్చి ఇస్తరు. రిక్షాలు రిపేరుకొస్తే పట్టిచ్చుకుంటలేరు. మేము రిపేరు చేయించుకుందామన్నా పైసలిత్తలేరు. పంచరైన రిక్షాలను గుంజుకపోతంటే చాతిల నొప్పత్తంది. రవీందర్‌సింగ్ : సీఎం కేసీఆర్ మన నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తానంటుండు. నగరాన్ని సుందరంగా ఉంచుటానికి ఏం చేస్తే బాగుంటది? యశోద : సార్... మేం లచ్చలు, కోట్లు అడగం. మమ్ముల్ని మనుషులుగా చూడాలని కోరుతున్నం. ఏం సార్... మేం మనుషులం కాదా? మీరు మాకు గౌరవం కల్పిస్తే కేసీఆర్ సార్ చెప్పినట్లు కరీంనగర్‌ను అందంగా ఉంచుతం. అందుకోసం ఎంత పనైనా చేస్తం. తెలంగాణలో మనమే ఫస్టుంటం. సార్... మేం లచ్చలు, కోట్లు అడగం. మమ్ముల్ని మనుషులుగా చూడాలని కోరుతున్నం. ఏం సార్... మేం మనుషులం కాదా? మీరు మాకు గౌరవం కల్పిస్తే కేసీఆర్ సార్ చెప్పినట్లు కరీంనగర్‌ను అందంగా ఉంచుతం. అందుకోసం ఎంత పనైనా చేస్తం. తెలంగాణలో మనమే ఫస్టుంటం. - యశోద