సందిగ్ధం వీడేనా?  | Irregularities In Karimnagar Municipal corporation | Sakshi
Sakshi News home page

సందిగ్ధం వీడేనా? 

Published Mon, Jul 29 2019 11:41 AM | Last Updated on Mon, Jul 29 2019 11:41 AM

Irregularities In Karimnagar Municipal corporation - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపట్టిన డివిజన్ల పునర్విభజన, ఓటర్ల జాబితా, కుల గణన తదితర అంశాల్లో తప్పులు దొర్లాయంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. గత సోమవారమే హైకోర్టులో విచారణ జరపాల్సి ఉండగా పురపాలకశాఖ గడువు కోరింది. దీంతో హైకోర్టు వారం గడువు ఇచ్చిన విషయం విదితమే. అయితే అభియోగాలపై సోమవారం పురపాలక శాఖ కౌంటర్‌ దాఖలు చేయనుంది. అభియోగాలు, దాఖలు చేసిన కౌంటర్‌పై విచారణ జరిపి అదే రోజు తీర్పు వెలువరించే అవకాశం కూడా ఉంది. కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందనేదానిపైనే మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంది. కోర్టు వెల్లడించే తీర్పు కోసం ఆశావహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లకు మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు తమ పనులు తాము చేసుకుపోతున్నారు. కోర్టు స్టేతో వారం రోజుల సమయం దొరకడంతో డివిజన్ల పునర్విభజన, ఓటర్ల జాబితా పునఃపరిశీలన సైతం చేసి తుది జాబితాను సిద్ధం చేశారు. ఆగస్టులోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కోర్టులో ఉన్న వివాదాలు ముగిసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

వార్డుల్లో సందడి... 
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణ కనిపిస్తోంది. నెల రోజులుగా ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేతలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ఆషాఢం కావడంతో బోనాల వేడుకలకు ఆశావహులు స్పాన్సర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీకెండ్‌లలో మహిళా సంఘాలను పిక్‌నిక్‌లకు తీసుకెళ్లడం, యువతను పోగుచేసి, బ్యాచ్‌లుగా విభజించి వేర్వేరు లొకేషన్లకు పంపించి విందులు వినోదాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమా లు జోరుగా నడుస్తున్నాయి. వివిధ కాలనీల పెద్ద మనుషులను, కుల పెద్దలను కలుస్తూ వారు కోరిన చోట నైట్‌సిట్టింగ్‌లు ఏర్పాటు చేసి డిన్నర్లు ఇవ్వడం వంటి ప్రలోబాలకు తెరలేపారు. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా తమ వార్డుకు ఏ రిజర్వేషన్‌ వస్తుందో ముందే అంచనా వేసుకుని తాను, లేక తన భార్య ఎవరం పోటీలో ఉన్నా మద్దతు తెలపాలని కోరుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజా మాజీలు ఓ అడుగు ముందుకేసి మద్యం డంపింగ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రిజర్వేషన్లు ఖరారైతే జోష్‌... 
కరీంనగర్‌ నగరపాలక సంస్థతోపాటు హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో ఆశావహులంతా రిజర్వేషన్ల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడంతో వ్యవహారం కోర్టుకెక్కింది. అప్పటి వరకు జోష్‌మీద ఉన్ననేతలు ఒక్కసారిగా ఢీలా పడ్డారు. హైకోర్టు తీర్పు వెలువడి ఎన్నికల రిజర్వేషన్లు ఖరారైతే వార్డుల్లో ఎన్నికల జోష్‌ పెరగనుంది. ఇదంతా నేటి హైకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉండనుంది.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement