మీడియాతో కార్పొరేటర్ మొండి శ్రీలత, టీఆర్‌ఎస్ లోగో.
సాక్షి, కరీంనగర్ : అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కీలక నాయకురాలు, 12వ డివిజన్ కార్పొరేటర్ మొండి శ్రీలత టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఆమె భర్త చంద్రశేఖర్ కూడా గులాబీకి గుడ్‌బై చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన శ్రీలత దంపతులు.. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీరుతో విసిగిపోయి రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.
ఆత్మహత్య చేసుకుంటాం : రాజీనామాకు దారితీసిన కారణాలను వివరిస్తూ కార్పొరేటర్ శ్రీలత భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మమ్మల్ని అడుగడుగునా కించపరుస్తున్నారు. అభివృద్ధి పనులకు ఒక్కపైసా కేటాయించడంలేదు. ఇదేమని ప్రశ్నించినందుకు మా కుటుంబంపై కక్షగట్టారు. ఓ భూవివాదంలో నా భర్త(చంద్రశేఖర్)ను అన్యాయంగా ఇరికించారు. ఆయన వేధింపులు భరించలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఇప్పటికైనా గంగుల మాపై వేధింపులు ఆపకుంటే ఆయన ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటాం’’ అని శ్రీలత పేర్కొన్నారు.
కలకలం : సరిగ్గా ఇదే తరహాలో గత ఏడాది సెప్టెంబర్‌లో మరో కార్పొరేటర్ జయశ్రీ రాజీనామా అస్త్రాన్ని సంధించిన సంగతి తెలిసిందే. జయశ్రీ కూడా ఎమ్మెల్యే గంగులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజా రాజీనామాతో కరీంనగర్ టీఆర్‌ఎస్‌లో కలకలం రేగింది. నాయకులంతా గంగుల వ్యతిరేక, అనుకూల వర్గాలుగా చీలిపోయారు. ఎమ్మెల్యే బాధితులు ఇంకొందరు కూడా రాజీనామాలు చేస్తారనే ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment