సగానికి సగం ఉద్యోగులు ఖాళీ ! | Staff Vacancy In karimnagar Municipal Corporation | Sakshi
Sakshi News home page

ఖాళీల కార్పొరేషన్‌!

Published Wed, Nov 27 2019 10:29 AM | Last Updated on Wed, Nov 27 2019 10:56 AM

Staff Vacancy In karimnagar Municipal Corporation - Sakshi

కరీంనగర్‌ నగరపాలక సంస్థ

సాక్షి, కరీంనగర్‌ : కరీంనగర్‌ నగరపాలక సంస్థ సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతోంది.. ప్రజలకు సైతం సకాలంలో సేవలు అందక కార్యాలయానికి వచ్చివెళ్లడం పరిపాటిగా మారింది.. పలు రకాల సేవలకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై ఆధారపడడం.. వారు ఆడింది ఆట.. పాడింది పాటలా మారిందనే ఆరోపణలున్నాయి. కార్పొరేషన్‌లోని ముఖ్య మైన విభాగాల్లో కీలమైన పోస్టులు ఖాళీగా ఉండడంతో సరైన విధంగా సేవలు అందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. బల్దియాలోని వివిధ విభాగాలకు ప్రభుత్వం 497 పోస్టులు మంజూరు చేయగా.. ప్రస్తుతం 249 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా.. 248 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కూడా పది మంది సిబ్బంది డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. కొందరు కరీంనగర్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి రాగా మరికొందరిని ఇక్కడి నుంచి మరో చోటికి డిప్యూటేషన్‌పై పంపించారు. 

ప్రధాన విభాగంలో..
కార్పొరేషన్‌లో పాలన వ్యవహారాలు చూసే అడ్మినిస్ట్రేషన్‌  విభాగంలోనే కీలకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విభాగాన్ని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో నడిపిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్‌ కమిషనర్‌తో పాటు నాలుగు సూపరిటెండెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇతర ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. పని భారం పెరిగిందని పేర్కొంటున్నారు. ఈ విభాగంలో 87 పోస్టులకు గాను 37 ఖాళీగా ఉన్నాయి. 

ప్రజారోగ్యంలో అధికంగా..
కార్పొరేషన్‌లో కీలకమైంది ప్రజారోగ్య విభాగం. నగరం పరిశుభ్రంగా, ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఈ విభాగమే కీలకం. చెత్తను సేకరించడం వాటిని డంప్‌యార్డ్‌కు తరలించడం, డ్రెయినేజీలు,  రోడ్లను పరిశుభ్రంగా చేయడం లాంటి పనులు ఈ విభాగం నిర్వహిస్తోంది. కార్పొరేషన్‌కు గుండెకాయ లాంటి శానిటేషన్‌లో సగానికి సగం ఖాళీలున్నాయి. ఈ విభాగం నియంత్రణలోనే పారిశుధ్య కార్మికులు పని చేస్తారు. దీనికి మొత్తం 270 పోస్టులు కేటాయించగా 141 ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్‌ మెడికల్‌ అధికారి, మున్సిపల్‌ హెల్త్‌ అధికారి పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వీటితో పాటు శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు 5 ఉండగా నాలుగు ఖాళీగా ఉన్నాయి. ఉన్న ఒక్క శానిటరీ సూపర్‌వైజర్‌ రామగుండం మున్సిపాలిటీకి డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. కరీంనగర్‌లో జగిత్యాల మున్సిపాలిటీ నుంచి ఓ అధికారి డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు.

డిప్యూటేషన్ల వల్ల సకాలంలో పనులు పూర్తి చేయలేక ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. వీటితో పాటు ఈ విభాగంలో కీలక స్థానాల్లో ఔట్‌ సొర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నారు. కరీంనగర్‌లో చెత్తను సేకరించే పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. కొద్దిరోజుల క్రితం మున్సిపల్‌ కమిషనర్‌ ఆకస్మికంగా తనిఖీ చేయగా ఒక్క అధికారి కూడా వారికి కేటాయించిన డివిజన్లలో లేకపోవడంతో వారికి సంజాయిషీ మెమోలు జారీ చేశారు. వీరిలో ఔట్‌సొర్సింగ్‌ సిబ్బంది ఉన్నా చర్యలకు అధికారులు వెనుకంజ వేస్తున్నారని సమాచారం. 

ఆగమాగం.. అకౌంట్స్‌ విభాగం.. 
కార్పొరేషన్‌ లెక్క పద్దులు నమోదు చేసే అకౌంట్స్‌ విభాగం మొత్తానికి మొత్తం ఖాళీగా ఉంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈ విభాగంలో ఒక్క అధికారిని కూడా నియమించలేదు. ఇతర విభాగాల నుంచి ఈ విభాగానికి అటాచ్డ్‌ చేశారు. ఇందులో మొత్తం 11 పోస్టులు ఉండగా వాటిలో జూనియర్‌ అకౌంటెంట్‌ అధికారిని ఇతర విభాగం నుంచి తీసుకున్నారు. మరో జూనియర్‌ అసిస్టెంట్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. కాని ప్రత్యేకంగా ఎవరినీ కేటాయించలేదు. వీటితో పాటు రెవెన్యూ విభాగంలో 23 పోస్టులకు 11 ఖాళీగా ఉన్నాయి. ఆస్తిపన్నులు వసూలు చేసే విభాగంలో రెండు రెవెన్యూ అధికారి పోస్టులు ఖాళీగా ఉండగా ఉన్న ఒక్క అధికారి ఇన్‌చార్జీగా పని చేస్తున్నారు. ఈ విభాగానికి ప్రత్యేకంగా ఉద్యోగులు లేకపోవడంతో ఇతర విభాగాల నుంచి వస్తున్న వారికి దీనిపై అవగాహన ఉండడం లేదు. కనీసం ఏ విభాగానికి ఎంత ఖర్చు చేస్తున్నారో కూడా వీరి వద్ద సమాచారం ఉండడం లేదని తెలిసింది. కార్పొరేషన్‌ ఖర్చులు మొత్తం నమోదు చేయాల్సిన ఈ విభాగంలో పరిస్థితి ఇలా ఉండడంతో ఖర్చులు ఇష్టారాజ్యంగా నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

ఔట్‌సోర్సింగ్‌ హవా..
కరీంనగర్‌ బల్దియాలో రెగ్యులర్‌ కంటే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కీలకమైన విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించుకుంటున్నారని, వీరికి ముఖ్యమైన పనులు అప్పగించడం, వీరిపై ఆజామాయిషీ లేకపోవడం తదితర కారణాల వల్ల సకాలంలో ప్రజలకు సేవలందడం లేదనే ఆరోపణలున్నాయి. కొందరు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నాయకుల ద్వారా రిక్రూట్‌ కావడంతో వీరిపై చర్యలకు అధికారులు వెనకంజ వేస్తున్నారని, ఒక వేళ చర్యలకు ముందుకెళ్తే నాయకుల ఒత్తిడితో ఏమీ చేయలేకపోతున్నారని సమాచారం. దీంతో పలు విభాగాల్లో సిబ్బందిపై ఉన్నతాధికారుల నియంత్రణ లేకపోవడంతో సకాలంలో ప్రజలకు సేవలందడం లేదనే విమర్శలున్నాయి. త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement