మేమొస్తే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తాం
అప్రెంటిస్‌షిప్ హక్కు చట్టం తెచ్చి యువతకు శిక్షణనిచ్చి ఉద్యోగాలిస్తాం
శిక్షణలో రూ.1 లక్ష వార్షిక స్టైపండ్
రాహుల్ గాంధీ హామీల వర్షం
జైపూర్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పలు నూతన హామీలను ప్రకటించారు. గురువారం భారత్ జోడో న్యాయ్ యాత్ర మధ్యప్రదేశ్‌లో పూర్తిచేసుకుని రాజస్థాన్‌లో అడుగుపెట్టిన సందర్భంగా బాంసవాడా పట్టణంలో ఏర్పాటుచేసిన సభలో రాహుల్ హామీల జల్లు కురిపించారు. ‘‘మేం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను మొట్టమొదట భర్తీచేస్తాం.
డిగ్రీ, డిప్లొమా చేసి ఖాళీగా ఉన్న పాతికేళ్లలోపు యువతకు అప్రెంటిస్‌షిప్ కింద శిక్షణ ఇప్పించి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేలా చూస్తాం. అప్రెంటిస్ కాలంలో వారికి సంవత్సరానికి రూ.1 లక్ష స్టైపండ్ అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ పరీక్షా పేపర్ల లీకేజీ ఉదంతాలు పునరావృతంకాకుండా కఠిన చట్టం తీసుకొస్తాం. తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తాం. యువత ఏర్పాటుచేసే అంకుర సంస్థల తోడ్పాటు కోసం రూ.5,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటుచేస్తాం’’ అని రాహుల్ అన్నారు.
యువతకు ఇచ్చిన ఈ ఐదు హామీలకు రాహుల్ ‘యువ న్యాయ్’గా అభివరి్ణంచారు. ‘‘ డ్రైవర్, గార్డ్, డెలివరీ బాయ్ ఉద్యోగాలు చేసే గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కలి్పస్తూ రాజస్థాన్‌లో ఇప్పటికే చట్టం తెచ్చారు. ఇదే తరహా చట్టాన్ని దేశమంతటా అమలుచేస్తాం. ఔట్‌సోర్సింగ్ విధానానికి స్వస్తిపలికి ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్ష విధానంలో ప్రమాణాలను పటిష్టంచేస్తాం.
లీకేజీలకు తావులేకుండా కఠిన చట్టం తెస్తాం’ అని అన్నారు. ‘‘ ఢిల్లీ చలో ఉద్యమబాటలో పయనిస్తున్న రైతాంగానికి మేలు చేకూర్చేలా పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. కులగణన చేపడతాం’’ అని రాహుల్ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల నుంచి న్యాయం కోరడం కూడా నేరమేనని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో మహిళల రేప్, ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ రాహుల్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment