కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయం
సాక్షి, కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపాలిటీలకు ఆస్తి పన్నులే ఆధారం.. మున్సిపాలిటీలకు అత్యంత ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరుల్లో ఇంటి పన్ను మొదటిస్థానంలో ఉంటుంది. సాధారణ ఖర్చులతో పాటు శానిటేషన్, పాలనా వ్యవహారాలు, అత్యవసర పనులన్నీ సాధారణ నిధులతోనే చేపడుతుంటారు. అయితే ఆస్తి పన్నులను సకాలంలో రాబట్టుకోవడంలో మున్సిపాలిటీలు విఫలమవుతున్నాయనే విమర్శలున్నాయి. ప్రతియేడు 95శాతం వసూలు చేస్తున్నామని చెబుతున్నా, కొత్త ఇళ్లకు నెంబర్లు వేయకుండా యేళ్ల తరబడి పెండింగ్‌లో పెడుతుండడంతో ఆ ఇళ్ల నుంచి ఆస్తి పన్నులు వసూలు చేసే మార్గమే లేకుండా పోతోంది. ఇలా వేల సంఖ్యలో కొత్తగా నిర్మించిన ఇళ్లు ఇంటి నెంబర్లు లేకుండానే ఉంటున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం, యజమాని పట్టింపులేని తనమో కాని ఆస్తి పన్నుల రూపంలో మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతోంది. ఈ విధానానికి చెక్ పెడుతూ భవనాలకు అనుమతి తీసుకోవడానికి వచ్చినప్పుడు పన్ను అసెస్‌మెంట్ చేసే ప్రక్రియకు పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీలు ఈ విధానాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేయాలని ఆదేశించింది. పురపాలక శాఖ ఆదేశాల మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థలో అధికారులు కొత్త విధానంపై కసరత్తు చేస్తూ ఆన్‌లైన్ ప్రక్రియకు అనుసంధానం చేసే పనిలో పడ్డారు. నూతన ఆర్థిక సంవత్సరంలో అనుమతితోనే పన్ను అసెస్‌మెంట్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు.
పక్కాగా ఆస్తిపన్ను వసూలు..
ఆస్తి పన్ను పక్కాగా వసూలు చేసేందుకు నగరపాలక సంస్థ కసరత్తు చేస్తోంది. ఇంటి అనుమతులకు వచ్చే సమయంలోనే వీటిని నమోదు చేసి పన్ను మదింపు చేసుకోవడం ద్వారా ఆదాయం పెంచుకునే పనిలో పడింది. ఇప్పటి వరకు ఇంటి నెంబర్ కేటాయిస్తే తప్ప పన్ను వసూలయ్యేది కాదు. అయితే ఈ పన్నుల వసూళ్లలో కొంతమేర అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. నిర్లక్ష్యానికి చెక్ పెడుతూ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న అవకాశాలన్నింటిని ఉపయోగించుకునే పనిలో మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలోనే ఆస్తి పన్నును ప్రాథమికంగా అంచనా వేసే విధానంపై దృష్టి సారించింది. భవన నిర్మాణాలు పూర్తయిన వెంటనే పన్ను వసూలు చేసే విధంగా కార్పొరేషన్‌లో నిబంధనలు అమలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇంటి నంబర్లు వేసుకోకపోవడం, పాత ఇంటి నంబర్ల మీదనే భవనాలు ఉండడంతో కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయం రాకుండా పోతోంది.
అక్రమాలకు పాల్పడితే జరిమానా..
భవన నిర్మాణాలు పూర్తయిన తర్వాత యజమానికి స్వాధీన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నారు. అయితే కొత్త విధానం ప్రకారం స్వాధీన ధ్రువీకరణ పత్రం తీసుకునే సమయంలోనే ఏ జోన్ పరిధిలో ఉంటే ఆ జోన్‌లో ఏ మేర ఆస్తిపన్ను ఉంటుందో దానిని లెక్క కట్టి పన్ను మదింపు చేస్తారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేసే వారికి మాత్రం రెండింతల పన్నును విధిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలు చేసుకుంటే జీవితకాలం రెండింతల పన్నును కట్టాల్సి ఉంటుంది.
ఏప్రిల్ నుంచి కొత్త విధానం అమలు..
భవన అనుమతులతో పాటు ఆస్తి పన్ను మదింపు విధానం ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీని కోసం కొత్త సాంకేతిక వ్యవస్థను కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు రూపొందిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన అనుమతులు తీసుకోవడం పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఇది అమలైతే ఆన్‌లైన్‌లోనే భవన అనుమతులు, ఆస్తి పన్ను మదింపు, ఇంటి నంబర్ల కేటాయింపు ఒకేసారి జరిగిపోతుంది. ప్రతీ ఒక్క భవనం ఆస్తి పన్ను పరిధిలోకి రావడంతో పాటు కార్పొరేషన్‌కు ఆదాయం కూడా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment