గ్రేటర్‌ దిశగా అడుగులు  | Gangula Kamalakar Talking Karimnagar Municipal Corporation | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ దిశగా అడుగులు 

Published Thu, May 9 2019 9:20 AM | Last Updated on Thu, May 9 2019 9:20 AM

Gangula Kamalakar Talking Karimnagar Municipal Corporation - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ‘గ్రేటర్‌ ’ హోదాకు కరీంనగర్‌ సిద్ధమవుతోంది. హైదరాబాద్, వరంగల్‌ తరువాత రాష్ట్రంలో వాటితో సమాన హోదా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్‌ను గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పందన లభించింది. ఎమ్మెల్యే విన్నపాన్ని సీఎం కార్యాలయం మున్సిపల్‌ పరిపాలన విభాగానికి పంపించగా డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ టికే.శ్రీదేవి తరఫున జాయింట్‌ డైరెక్టర్‌ వాణిశ్రీ కరీంనగర్‌ కమిషనర్‌కు లేఖ పంపారు. కరీంనగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో వార్డుల(డివిజన్‌ల) సంఖ్యను 50 నుంచి 60కి పెంచే అవకాశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

అనుకూలిస్తే మూడో గ్రేటర్‌
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తొలిసారిగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ గ్రేటర్‌ కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్‌ను గ్రేటర్‌గా అప్‌గ్రేడ్‌ చేసే అవకాశం ఉండడంతో ఆ వెసులుబాటును ఉపయోగించుకుని ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే తెరపైకి తెచ్చారు. మార్చి 6న కరీంనగర్‌లో పార్లమెంటు ఎన్నికల సన్నాహాక సమావేశానికి హాజరైన మాజీ మున్సిపల్‌ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ ప్రస్తుత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సమావేశమై గ్రేటర్‌ కార్పొరేషన్‌ సాధ్యాసాధ్యాలపై కమలాకర్‌ చర్చించారు.

ఇందులో భాగంగానే మార్చి 9న సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. మార్చి 12న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు గంగుల లేఖ చేరింది. మార్చి 22న ప్రభుత్వ మునిసిపల్‌ శాఖ సంయుక్త కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ఆ లేఖను డైరెక్టర్‌ ఆఫ్‌మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శ్రీదేవికి పంపించారు. 2007 ఏప్రిల్‌లో ఎంసీహెచ్‌గా ఉన్న హైదరాబాద్‌ నగర పాలక సంస్థ గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌గా మారగా, తెలంగాణ ఆవిర్భావం తరువాత కేసీఆర్‌ ప్రభుత్వం 2015 జనవరిలో వరంగల్‌ కార్పొరేషన్‌ను గ్రేటర్‌గా మార్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రెండు  కార్పొరేషన్లే గ్రేటర్‌గా కొనసాగుతుండగా, అన్నీ అనుకూలిస్తే కరీంనగర్‌ కూడా ఆ హోదాను త్వరలోనే దక్కించుకోనుంది.

గ్రేటర్‌ సాధ్యమేనా..?
జనాభా ప్రాతిపదికన పట్టణం నగరంగానో, మహానగరంగానో ప్రభుత్వం గుర్తిస్తుంది. రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కరీంనగర్‌ ప్రథమ స్థానంలో ఉంది. జిల్లాల పునర్విభజన తరువాత కూడా కరీంనగర్‌ తన ప్రాభవాన్ని కోల్పోలేదు. 1958లోనే మున్సిపాలిటీగా మారిన కరీంనగర్‌ 1985లో గ్రేడ్‌–1 మున్సిపాలిటీగా మారింది. 2005లో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయిన నగరంలో 2011 లెక్కల ప్రకారం జనాభా 2.67 లక్షలు. ప్రస్తుతం నగరంలో 3.5 లక్షల జనాభా ఉంది.

స్మార్ట్‌సిటీగా కరీంనగర్‌ను ప్రకటించిన తరువాత చుట్టుపక్కలున్న 8 గ్రామాలను విలీనం చేశారు. విలీన గ్రామాల జనాభా 32,216 గా ఉంది. ప్రస్తుతం నగరంలో ఉన్న 50 వార్డులను 60 వార్డులుగా విభజించి, జనాభాను లెక్కిస్తే 4 లక్షలు దాటుతుందని అంచనా. కరీంనగర్‌ గ్రేటర్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలంటే కనీసం 5 లక్షల జనాభా ఉండాలని భావిస్తున్నప్పటికీ, ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ కరీంనగర్‌ కల వీలైనంత త్వరలో సాకారం కావచ్చనేది పురపాలక అధికారులు చెపుతున్న మాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement