e టెండ'రింగ్' | 66 works in 46 actions filed by single tender! | Sakshi
Sakshi News home page

e టెండ'రింగ్'

Published Wed, Jun 22 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

e టెండ'రింగ్'

e టెండ'రింగ్'

* 66 పనుల్లో 46 పనులకు సింగిల్ టెండర్లు దాఖలు
* మిగిలిన పనులకు ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్ల పోటీ
* వారిని తప్పించేందుకు ముమ్మర యత్నాలు
* బల్దియా ముఖ్య ప్రజాప్రతినిధులకు నజరానా!
* కార్పొరేషన్ ఆదాయూనికి భారీ గండి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో ‘ఆస్థాన’ కాంట్రాక్టర్లు మళ్లీ రింగయ్యారు. కాసుల పంపకాలతో పోటీ లేకుండా విజయవంతంగా టెండర్లు దాఖలు చేశారు.

14వ ఆర్థిక సంఘం నిధులు రూ.6.95 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాల కోసం కార్పొరేషన్ అధికారులు టెండ ర్లు ఆహ్వానించారు.  మొత్తం 66 పనులకు టెండర్లు దాఖలు కాగా, అందులో 46 పనులకు సింగిల్ షెడ్యూళ్లు మాత్రమే దాఖలయ్యాయంటే కాంట్రాక్టర్లు ఏ మేరకు రింగ్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 20 పనులకు మాత్రం రెండు, మూడు చొప్పున షెడ్యూళ్లు దాఖలైనప్పటికీ అందులో ముగ్గురు కాంట్రాక్టర్లు డీడీలు చెల్లించకపోవడంతో వారు అనర్హులయ్యే అవకాశమున్నట్లు తెలిసింది.

మిగిలిన 17 పనులను దక్కించుకున్న వారిని సైతం పోటీ నుంచి తప్పించేందుకు కాంట్రాక్టర్ల సిండికేట్ ముమ్మర యత్నాలు చేస్తోంది. అందుకోసం ఒకవైపు సయోధ్య యత్నాలు మొదలు పెట్టడంతోపాటు మరోవైపు అధికార బలాన్ని వినియోగించే పనిలో నిమగ్నమైంది. ప్రైస్ బిడ్లు తెరిచేందుకు గురువారం ఆఖరు తేదీ కావడంతో సామదాన దండోపాయాలను ప్రయోగిస్తున్నట్లు సమాచారం.
 
సయోధ్య కోసం ముమ్మర యత్నాలు
వాస్తవానికి 14వ ఆర్థిక సంఘం పనుల్లో 66 పనులకు సింగిల్ టెండర్లే దాఖలయ్యేలా కాంట్రాక్టర్ల సిండికేట్ ప్రణాళిక రూపొందించింది. ఆన్‌లైన్ టెండర్లు కావడంతో అనూహ్యంగా 17 పనులకు సిద్దిపేట, ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు పోటీపడి షెడ్యూళ్లు దాఖలు చేశారు. కాంట్రాక్టర్ల అసోసియేషన్ నేతకు బద్దశత్రువుగా ఉన్న ఓ కార్పొరేటర్ సిద్దిపేట కాంట్రాక్టర్లను ప్రేరేపించి షెడ్యూళ్లు దాఖలు చేయించినట్లు తెలిసింది.

వారు టెండర్ దాఖలు చేయడంతో ఆ పనులు దక్కేలా ముందుగా ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. ఒక్కో పనికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు చెల్లించి పనులు కొనుగోలు చేసిన సదరు కాంట్రాక్టర్లు ఇదేంటంటూ అసోసియేషన్‌పై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకుడు 17 పనుల్లో రాజీ కుదుర్చుకునేందుకు సయోధ్య యత్నాలు మొదలు పెట్టారు.

సిద్దిపేటకు చెందిన కాంట్రాక్టర్‌తోపాటు నిర్మాణ సంస్థకు చెందిన ఓ కాంట్రాక్టర్, నగరానికి చెందిన మరో కాంట్రాక్టర్ పనులకు టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. వీరితో ఫోన్‌లో మాట్లాడి ప్రైస్‌బిడ్ ఓపెన్ చేయకముందే విత్‌డ్రా చేసుకునే విధంగా ముఖ్యనేతలతో ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
 
ముఖ్య ప్రజాప్రతినిధులకు నజరానా!
14వ ఆర్థిక సంఘం పనుల్లో కాంట్రాక్టర్లకు పూర్తిగా సహకరిస్తున్న నగర పాలక సంస్థకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులకు రూ.కోటి పనులను అప్పగించినట్లు తెలిసింది. అందులో ఒకరికి రూ.70 లక్షలు, మరొకరికి రూ.30 లక్షల విలువైన పనులను అప్పగించినట్లు సమాచారం. ఆయా పనులను సదరు ప్రజాప్రతినిధులు తమకు ఇష్టమొచ్చిన వారికి అప్పగించి వారి నుంచి నజరానా తీసుకునేందుకు సిద్ధమైనట్లు వినికిడి.

మరోవైపు రేపు ప్రైస్‌బిడ్లు తెరవనుండటంతో ఎవరెవరు ఎంత లెస్‌కు టెండర్ దాఖలు చేశారనేది తెలిసిపోతోంది. టెండర్లకు పోటీ లేకపోవడంతో ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా పెద్దగా లెస్‌కు టెండర్ వేయలేదని తెలుస్తోంది. కొందరు ఎక్సెస్‌కు టెండర్ దాఖలు చేసినట్లు సమాచారం. ప్రైస్ బిడ్ తెరిస్తే కానీ అసలు సంగతి తేలనుంది.
 
కుదిరితే పనులు.. లేదంటే పైసలు
వాస్తవానికి ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్లలో ఎవరు టెండర్లు వేస్తున్నారనే విషయం అప్‌లోడ్ చేసిన అధికారులు కూడా తెలియదు. టెక్నికల్ బిడ్ విప్పితేనే తెలిసే అవకాశముంటుంది. అలాంటి విధానానికి కూడా కాంట్రాక్టర్లు అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లు బాక్స్ టెండర్లయినా, ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్లయినా సయోధ్యతోనే దక్కించుకుంటూ బల్దియాకే సవాలుగా మారుతున్నారు.

కొంత మంది కాంట్రాక్టర్లు పనులు దక్కించుకుంటే, మరికొంత మందికి పగిడీలు దక్కుతున్నాయి. రోడ్లు, డ్రెయినేజీ పనులను అంచనాల కంటే ఎక్కువ రేట్లకు టెండర్లు వేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ఇటీవల బల్దియాకు ఇబ్బడిముబ్బడిగా నిధులు వస్తుండడంతో వారు ఆడింది ఆటగా మారుతోంది. దీనికి తోడు ఇంజనీరింగ్ విభాగంలో స్తబ్ధత నెలకొనడం, అధికారులు  క్షేత్రస్థాయిలో పట్టించుకోకపోవడంతో పనుల్లో నాణ్యత కూడా కరువవుతుంది. వర్క్ ఇన్స్‌పెక్టర్లపై ఆధారపడుతూ కేవలం కమీషన్ల కోసమే కార్యాలయానికి వస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా కాంట్రాక్టర్లు ఏది చేసినా నడుస్తుందనే భావనతో పనులు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement