Single tenders
-
అవినీతి రహదారి
సాక్షి ప్రతినిధి – నెల్లూరు : దళిత వాడలకు మౌళిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను అధికార పార్టీ నేతలు, అధికారులు కలిపి కొల్లగొట్టేందుకు పథకం రచించారు. రూ.40 కోట్ల పనులకు 10 నుంచి 15 శాతం దాకా తక్కువ తో టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉన్నా, అంతా కూడబలుక్కుని 1.45 శాతానికి లోపే సింగిల్ టెండర్లు దాఖలయ్యేలా రాజకీయం నడిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.4 నుంచి రూ.4.5 కోట్ల నష్టం వాటిల్లనుంది. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దళిత వాడలకు రోడ్డు సౌకర్యాలు మెరుగు పరచడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. గత ఏడాది జూన్ నెలాఖరులో ఆన్లైన్ ద్వారా ఈ పనులకు టెండర్లు పిలిచారు. నిబంధనల ప్రకారం టెండర్ల దాఖలుకు గడువు ముగిసిన చివరి రోజే టెక్నికల్ బిడ్ తెరవాల్సి వుంది. అయితే ఏ పని ఎవరికి దక్కాలనే విషయం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు అధికారులకు ముందే ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఎలా మార్చుకున్నా, రూల్స్ ఎలా ఉన్నా తాము చెప్పిన వారికే పనులు దక్కాలని గట్టిగా చెప్పారు. అధికారులు ఇదే అదనుగా తీసుకుని స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా నెరవేర్చుకునేలా టెండర్లలో రింగ్ లీడర్ల పాత్ర పోషించారు. పోటీకి వస్తారని ఊహించిన కాంట్రాక్టర్లకు అధికారులే ఫోన్లు చేసి ఇది ఫలానా నాయకుడికి కేటాయించిన పననీ, పోటీగా టెండర్ దక్కించుకున్నా పని ఎలా చేయగలుగుతారని పరోక్షంగా బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మధ్యస్థాలను ఖాతరు చేయకుండా కొన్ని పనులకు ఎక్కువ మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. ఈ విషయం తెలిసి అధికారులు కంగుతిన్నారు. ఏదో ఒక కారణం చూపి తమకు గిట్టని వారిని అనర్హులుగా చేయడానికి ఉపాయాలు వెదికారు. ఇందుకోసం అనేక రాయబారాలు నడిపి నెలన్నర తర్వాత టెక్నికల్ బిడ్ తెరిచారు. ఇందులో కూడా అర్హులైన వారిని తప్పించడానికి వారితో రాజీ బేరాలు మాట్లాడినట్లు కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెబుతున్నారు. వీటికి తలవంచని కాంట్రాక్టర్లను తప్పించడం కోసం æ మరో నెల పాటు ప్రైస్ బిడ్ తెరవకుండా రాజకీయం నడిపారు. కాంట్రాక్టర్ ఆన్లైన్లో ఈ ఏంఐ చెల్లించకుండా డీడీ తీశారని, తాను చేస్తున్న ఇతర పనుల వివరాలు పొందుపరచలేదని, డిక్లరేషన్ లేదనే రకరకాల కారణాలతో చాలా మందిని తప్పించారు. అన్నీ సెటిల్మెంట్ లెస్లే ► ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల కింద పిలిచిన ఈ పనుల్లో కాంట్రాక్టర్ లాభం కూడా కలిపి పనుల అంచనా రూపొందిస్తారు. అందువల్ల ఈ పనులకు ఎక్కువతో టెండర్లు దాఖలు చేయడానికి వీలులేదు. దీంతో గతంలో ఈ తరహా పనులకు 10 నుంచి 15 శాతం తక్కువతో టెండర్లు దాఖలయ్యేవి. అయితే అధికారులు ఈ సారి మాత్రం కాంట్రాక్టర్లతో కూడబలుక్కుని ప్రతి పనికీ 1.45 శాతం లోపే తక్కువతో సింగిల్ టెండర్లే నిలిచేలా మంత్రాంగం చేశారు. నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్ నిలిస్తే తిరిగి టెండర్లు పిలవాలనే నిబంధనలను ఈ పనుల వ్యవహారంలో అటకెక్కించారు. ► సింగిల్ టెండర్‌ను ఆమోదింపచేసే ఉద్దేశంతో పంచాయతీ రాజ్ శాఖలోని జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులు చూస్తున్న చీఫ్ ఇంజనీర్‌కు ఫైలు పంపారు. తక్కువ ధరతో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు టీడీపీ ఇన్‌చార్జ్‌లు చెప్పిన వారు కాకపోతే ఆ పనులు రద్దు చేయాలని సీఈకి సిఫారసు చేశారు. తమను అనర్హులుగా చూపి టెండర్లు రద్దు చేయడానికి అధికారులు చేసిన ప్రయత్నాలపై ఇద్దరు కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ టెండర్ల వ్యవహారంపై కొందరు కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు చేశారు. ప్రతి పనికీ 1.45 శాతంలోపే తక్కువతో టెండర్లు దాఖలైన వ్యవహారం చూసి విజిలెన్స్ అధికారులు ఆశ్చర్య పోతున్నారు. ఇవీ పనులు ► విడవలూరు మండలం చౌకచర్ల నుంచి దంపూరు మీదుగా రామతీర్థం వరకు రోడ్డు నిర్మాణం. అంచనా వ్యయం రూ.2 కోట్లు. 27–6–2016న టెండర్లు పిలిచారు. 19–9–2016న టెక్నికల్ బిడ్ తెరిచారు. 14–10–2016వ తేదీ ప్రైస్ బిడ్ తెరిచారు. 1.45 శాతం తక్కువతో సింగిల్ టెండర్ దాఖలైన భవాని కన్స్ట్రక్షన్స్కు పని అప్పగించేలా ప్రతిపాదన చేశారు. ► సైదాపురం మండలం అన్నమరాజుపల్లి నుంచి వేముల చేడు దాకా మెటల్ రోడ్డు నిర్మాణానికి రూ.1.66 కోట్లతో 27–6–2016వ తేదీ టెండర్లు పిలిచారు. 12–8–2016వ తేదీ టెక్నికల్ బిడ్డు, 7–10–2016న ప్రైస్ బిడ్ తెరిచారు. 0.1 శాతం తక్కువతో సింగిల్ టెండర్ దాఖలు చేసిన వి.పి.రెడ్డికి పని అప్పగించడానికి ప్రతిపాదనలు పంపారు. ► డక్కిలి మండలం దగ్గవోలు ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి పాతనలపాడు ఎస్సీ కాలనీ దాకా రోడ్డు నిర్మాణానికి రూ 1.89 కోట్లతో 27–6–2016వ తేదీ టెండర్లు పిలిచారు. 12–8–2016వ తేదీ టెక్నికల్ బిడ్, 3–10–2016వ తేదీ ప్రైస్ బిడ్ తెరిచారు. 0.45 శాతం తక్కువతో టెండర్ దాఖలు చేసిన వి.పి.రెడ్డికి పని అప్పగించడానికి ప్రతిపాదించారు. ► ఏర్పేడు– గూడూరు ఆర్ అండ్‌బీ రోడ్డు నుంచి నాయుడుపేట మాటుమడుగు మీదుగా రాపూరు రోడ్డు వరకు రూ.3.40 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి 27–6–2016న టెండర్లు పిలిచారు. 12–8–2016న టెక్నికల్ బిడ్, 7–10–2016న ప్రైస్ బిడ్ తెరిచారు. 1.17 శాతం తక్కువతో సింగిల్ టెండర్ దాఖలు చేసిన ఎస్ ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్స్కు పని అప్పగించడానికి ప్రతిపాదించారు. ► గూడూరు ప్యాకేజీ కింద గొల్లపాలెం పంచాయతీ రాజ్ రోడ్డు నుంచి కోటిగుంటకు బీటీ సర్ఫేస్ రోడ్డు నిర్మాణానికి రూ.34 లక్షలు, నిడిగుర్తి నుంచి చిన్నతోట ఆర్ అండ్‌బీ రోడ్డు దాకా బీటీ సర్ఫేస్ రోడ్డు నిర్మాణానికి రూ 1.03 కోట్లతో 27–6–2016వ తేదీ టెండర్లు పిలిచారు. 7–9–2016న టెక్నికల్ బిడ్, 7–10–2016వ తేదీ ప్రైస్ బిడ్ తెరిచారు. 0.63 శాతం తక్కువతో సింగిల్ టెండర్ దాఖలైన ఎం.సెంథిల్ కుమార్ అనే కాంట్రాక్టరుకు ఈ పని అప్పగించే ఆలోచనతో సీఈకి ప్రతిపాదనలు పంపారు. -
e టెండ'రింగ్'
* 66 పనుల్లో 46 పనులకు సింగిల్ టెండర్లు దాఖలు * మిగిలిన పనులకు ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్ల పోటీ * వారిని తప్పించేందుకు ముమ్మర యత్నాలు * బల్దియా ముఖ్య ప్రజాప్రతినిధులకు నజరానా! * కార్పొరేషన్ ఆదాయూనికి భారీ గండి సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో ‘ఆస్థాన’ కాంట్రాక్టర్లు మళ్లీ రింగయ్యారు. కాసుల పంపకాలతో పోటీ లేకుండా విజయవంతంగా టెండర్లు దాఖలు చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.6.95 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాల కోసం కార్పొరేషన్ అధికారులు టెండ ర్లు ఆహ్వానించారు. మొత్తం 66 పనులకు టెండర్లు దాఖలు కాగా, అందులో 46 పనులకు సింగిల్ షెడ్యూళ్లు మాత్రమే దాఖలయ్యాయంటే కాంట్రాక్టర్లు ఏ మేరకు రింగ్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 20 పనులకు మాత్రం రెండు, మూడు చొప్పున షెడ్యూళ్లు దాఖలైనప్పటికీ అందులో ముగ్గురు కాంట్రాక్టర్లు డీడీలు చెల్లించకపోవడంతో వారు అనర్హులయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. మిగిలిన 17 పనులను దక్కించుకున్న వారిని సైతం పోటీ నుంచి తప్పించేందుకు కాంట్రాక్టర్ల సిండికేట్ ముమ్మర యత్నాలు చేస్తోంది. అందుకోసం ఒకవైపు సయోధ్య యత్నాలు మొదలు పెట్టడంతోపాటు మరోవైపు అధికార బలాన్ని వినియోగించే పనిలో నిమగ్నమైంది. ప్రైస్ బిడ్లు తెరిచేందుకు గురువారం ఆఖరు తేదీ కావడంతో సామదాన దండోపాయాలను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. సయోధ్య కోసం ముమ్మర యత్నాలు వాస్తవానికి 14వ ఆర్థిక సంఘం పనుల్లో 66 పనులకు సింగిల్ టెండర్లే దాఖలయ్యేలా కాంట్రాక్టర్ల సిండికేట్ ప్రణాళిక రూపొందించింది. ఆన్లైన్ టెండర్లు కావడంతో అనూహ్యంగా 17 పనులకు సిద్దిపేట, ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు పోటీపడి షెడ్యూళ్లు దాఖలు చేశారు. కాంట్రాక్టర్ల అసోసియేషన్ నేతకు బద్దశత్రువుగా ఉన్న ఓ కార్పొరేటర్ సిద్దిపేట కాంట్రాక్టర్లను ప్రేరేపించి షెడ్యూళ్లు దాఖలు చేయించినట్లు తెలిసింది. వారు టెండర్ దాఖలు చేయడంతో ఆ పనులు దక్కేలా ముందుగా ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. ఒక్కో పనికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు చెల్లించి పనులు కొనుగోలు చేసిన సదరు కాంట్రాక్టర్లు ఇదేంటంటూ అసోసియేషన్‌పై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకుడు 17 పనుల్లో రాజీ కుదుర్చుకునేందుకు సయోధ్య యత్నాలు మొదలు పెట్టారు. సిద్దిపేటకు చెందిన కాంట్రాక్టర్‌తోపాటు నిర్మాణ సంస్థకు చెందిన ఓ కాంట్రాక్టర్, నగరానికి చెందిన మరో కాంట్రాక్టర్ పనులకు టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. వీరితో ఫోన్లో మాట్లాడి ప్రైస్‌బిడ్ ఓపెన్ చేయకముందే విత్‌డ్రా చేసుకునే విధంగా ముఖ్యనేతలతో ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్య ప్రజాప్రతినిధులకు నజరానా! 14వ ఆర్థిక సంఘం పనుల్లో కాంట్రాక్టర్లకు పూర్తిగా సహకరిస్తున్న నగర పాలక సంస్థకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులకు రూ.కోటి పనులను అప్పగించినట్లు తెలిసింది. అందులో ఒకరికి రూ.70 లక్షలు, మరొకరికి రూ.30 లక్షల విలువైన పనులను అప్పగించినట్లు సమాచారం. ఆయా పనులను సదరు ప్రజాప్రతినిధులు తమకు ఇష్టమొచ్చిన వారికి అప్పగించి వారి నుంచి నజరానా తీసుకునేందుకు సిద్ధమైనట్లు వినికిడి. మరోవైపు రేపు ప్రైస్‌బిడ్లు తెరవనుండటంతో ఎవరెవరు ఎంత లెస్‌కు టెండర్ దాఖలు చేశారనేది తెలిసిపోతోంది. టెండర్లకు పోటీ లేకపోవడంతో ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా పెద్దగా లెస్‌కు టెండర్ వేయలేదని తెలుస్తోంది. కొందరు ఎక్సెస్‌కు టెండర్ దాఖలు చేసినట్లు సమాచారం. ప్రైస్ బిడ్ తెరిస్తే కానీ అసలు సంగతి తేలనుంది. కుదిరితే పనులు.. లేదంటే పైసలు వాస్తవానికి ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లలో ఎవరు టెండర్లు వేస్తున్నారనే విషయం అప్లోడ్ చేసిన అధికారులు కూడా తెలియదు. టెక్నికల్ బిడ్ విప్పితేనే తెలిసే అవకాశముంటుంది. అలాంటి విధానానికి కూడా కాంట్రాక్టర్లు అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లు బాక్స్ టెండర్లయినా, ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లయినా సయోధ్యతోనే దక్కించుకుంటూ బల్దియాకే సవాలుగా మారుతున్నారు. కొంత మంది కాంట్రాక్టర్లు పనులు దక్కించుకుంటే, మరికొంత మందికి పగిడీలు దక్కుతున్నాయి. రోడ్లు, డ్రెయినేజీ పనులను అంచనాల కంటే ఎక్కువ రేట్లకు టెండర్లు వేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ఇటీవల బల్దియాకు ఇబ్బడిముబ్బడిగా నిధులు వస్తుండడంతో వారు ఆడింది ఆటగా మారుతోంది. దీనికి తోడు ఇంజనీరింగ్ విభాగంలో స్తబ్ధత నెలకొనడం, అధికారులు క్షేత్రస్థాయిలో పట్టించుకోకపోవడంతో పనుల్లో నాణ్యత కూడా కరువవుతుంది. వర్క్ ఇన్స్పెక్టర్లపై ఆధారపడుతూ కేవలం కమీషన్ల కోసమే కార్యాలయానికి వస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా కాంట్రాక్టర్లు ఏది చేసినా నడుస్తుందనే భావనతో పనులు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. -
చెరువులకు లెస్ రహదారులకు ప్లస్
నల్లగొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చెరువుల పున రుద్ధరణ (మిషన్ కాకతీయ) పనులకు తీవ్ర పోటీ ఏర్పడింది. చాలాకాలం తర్వాత రహదారులు, చెరువుల పనులకు మోక్షం లభించడంతో కాంట్రాక్టర్లు సంబరపడ్డారు. అయితే రహదారుల పనులు దక్కించుకోవడంలో కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి సింగిల్ టెండర్లు దాఖలు చేశారు. అదే మిషన్ కాకతీయ విషయానికొస్తే కాంట్రాక్టర్లు పోటాపోటీగా టెండర్లు వేశారు. దీంతో చెరువుల పునరుద్ధరణ పనులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పనుల నాణ్యత సంబంధించి రాజీపడే ప్రసక్తే లేదని ఓ వైపు ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతూనే ఉంది. కానీ మరోవైపు స్థానిక రాజకీయ నాయకులు పోటీపడి మరీ బినామీ వ్యక్తులతో తక్కువ రేట్లకు టెండర్లు వేయించారు. ఇదిలాఉంటే పంచాయతీరాజ్ (పీఆర్), ఆర్ అండ్‌బీ పనులకు మాత్రం సింగిల్ టెండర్లు దాఖలయ్యాయి. పీఆర్ పనుల్లో కాంట్రాక్టర్ల మధ్య సయోధ్య కుదరగా...కొన్ని పనులకు ఎక్కువ (ఎక్సెస్) రేట్లను కూడా కోడ్ చేశారు. ఆర్అండ్బీ అధికారులు పనుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు పనుల వివ రాలు బయటకు పొక్కనీయకుండా అధికారులు జాగ్రత్తపడినట్లు తెలిసింది. లెస్..లెస్..లెస్... చెరువుల పునరుద్ధరణలో భాగంగా తొలి విడత జిల్లాలో 952 చెరువులు ఎంపిక చేశారు. దీంట్లో 119 చెరువుల్లో నీళ్లు ఉండడంతో వాటిని మినహాయించి మిగిలిన 833 చెరువులకు ప్రతిపాదనలు రూపొం దించి ప్రభుత్వానికి పంపారు. 609 చెరువుల పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటిలో 469 చెరువుల పనులకు టెండర్లు పిలిచారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.177 కోట్లు. ఈ మొత్తం 469 చెరువుల్లో 352 చెరువుల పనులు రూ.50 లక్షల లోపు అంచనా వ్యయంతో ఉన్నవి. ఈ చెరువుల పనులకే ఎక్కువ పో టీ ఎదురైంది. ఒక్కో చెరువుకు 6 నుంచి 14 మంది వరకు టెండర్లు వేశారు. ఈ-ప్రొక్యూర్మెంట్ టెండరు కావడంతో పనులు ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో 18 నుంచి 20 శాతం వరకు తక్కువ (లెస్) రే ట్లు కోడ్ చేశారు. ఇక రూ.50 లక్షల పైబడి ఉన్న 117 పనులకు కాంట్రాక్టర్లు సిండి కేట్ అయినట్లు తెలుస్తోంది. ఒక్కో పనికి ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే టెండర్లు వేశారు. 2-3 శాతానికే తక్కువ రేట్లు కోడ్ చేశారు. నల్లగొండ డివిజన్ పరిధిలో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి ఎక్సెస్ రేట్లను కూడా కోడ్ చేసినట్లు తెలిసింది. పనులు ఎలా సాధ్యం..? చెరువు పనులకు ప్రభుత్వం నిర్ధారించిన ధరలు మాత్రం లాభదాయకంగా లేవని అధికారులు చెబుతున్నారు. మిషన్ సహాయంతో చెరువుల్లో మట్టి తవ్వేందుకు మాత్రమే ధర నిర్ణయించారు. కానీ తవ్విన మట్టిన త రలించేందుకు ధర నిర్ణయించలేదు. ఈ మట్టిని వ్యవసాయ భూముల్లో చల్లేందుకు రైతులే స్వచ్ఛందంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం పేర్కొంది. కానీ రైతులు ముందుకు వచ్చినా కూలీలకు డబ్బులు ఎవరు చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకం. ఇక పనులు జరుగుతున్న తీరును ఎప్పటిక ప్పుడు ఫొటోల తీసి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి అప్లోడ్ చేయాలి. నాణ్యతలో రాజీపడకుండా పనులు జరగాలని ప్రభుత్వం చెబుతుంది కానీ..కాంట్రాక్టర్లు ఇంత భారీ స్థాయిలో లెస్‌లకు వెళ్లారు కాబట్టి పనులు చేయడం సాధ్యం కాదని అధికారులే అంటుండడం గమనార్హం. పీఆర్ కాంట్రాక్టర్లదే గుత్తాధిపత్యం... పంచాయతీరాజ్ శాఖ ఎం.ఆర్.ఆర్ (మెయింటెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్) గ్రాంట్ కింద జిల్లాకు 408 పనులు మంజూరు చేసింది. ఈ పనుల అంచనా వ్యయం రూ.207 కోట్లు. ఈ మొత్తం పనులను 59 ప్యాకేజీలు చేసి టెండర్లు పిలిచారు. గతేడాది నవంబర్లోనే టెండర్లు పిలవాల్సి ఉన్నప్పటికి కాంట్రాక్టర్లకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు సాగిన నేపథ్యంలో ఫిబ్రవరి వరకు టెండర్ల ప్రక్రియ కొనసాగించాల్సి వచ్చింది. ఈ పనులన్నీ హాట్ మిక్స్ ప్లాంట్ ఉన్న కాంట్రాక్టర్లు మాత్రమే చేపట్టాల్సి ఉండటంతో పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్ల మధ్య పోటీ లేకుండా పోయింది. జిల్లాలో హాట్ మిక్స్ ప్లాంట్ ఉన్న కాంట్రాక్టర్లు 38 మంది ఉన్నారు. దీంతో ఈ 38 కన్స్ట్రక్షన్ కంపెనీలకు చెందిన కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి ఎవరి పరిధిలోకి వచ్చే పనులకు మరొకరిని రానివ్వకుండా సింగిల్ టెండర్లు వేశారు. నిబంధనల ప్రకారం ఎక్కువ రేట్లు కోడ్ చేస్తే టెండర్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధార ణ రేట్ల ప్రకారం తక్కువ మోతాదులో ధరలు కోడ్ చేశారు. 0.01 శాతం నుంచి 6.66 శాతం వరకు లెస్ కోడ్ చేసి పనులు దక్కించుకున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న పనులకు మాత్రం ఎక్సెస్ రేట్లు కోడ్ చేశారు. ఇప్పటి వరకు 353 పనుల టెండర్లు పూర్తయ్యాయి. ఈ పనుల అంచనా వ్యయం రూ.184 కోట్లు. ఒకటి, రెండు ప్యాకేజీలు మినహా మిగిలిన వాటికి ఒకటే టెండరు దాఖలు కావడాన్ని బట్టి పరిశీలిస్తే...బడా కాంట్రాక్టర్లతో ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే టెండర్లు నోటిఫికేషన్ వెలువడగానే కాంట్రాక్టర్లు తొలుత ముందుకు రాలేదు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ సంస్థలను చర్చలకు రప్పించి..వారిని మెప్పించిన తర్వాతే టెండర్లు ప్రక్రియ వేగం పుంజుకుంది. నవంబర్‌లో టెండర్లు పూర్తయి డిసెంబర్లో పనులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికి ఇప్పటి వరకు ఇంకా టెండర్లు ప్రక్రియ కొనసాగుతుందంటే కాంట్రాక్టర్ల ప్రభావం ప్రభుత్వంపై బలంగానే పనిచేసినట్లు స్పష్టమవుతోంది. మిషన్ కాకతీయ పనుల్లో లెస్‌లు కోడ్ చేస్తుంటే...రహదారుల పనుల్లో మాత్రం కాంట్రాక్టర్లు సిండికేట్ కావడం...ఎక్సెస్ రేట్లు కోడ్ చేయడం...దానికి ప్రభుత్వం అండదండలు ఉండటం గమనార్హం. ఎక్సెస్ రేట్లతో పనులు దక్కించుకున్న సంస్థలు... మండలం కన్స్ట్రక్షన్ సంస్థ కోడ్ చేసింది పనివిలువ గుండాల జీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ 4.59 శాతం రూ. 3.23 కోట్లు మోతె ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ 4.59 శాతం రూ. 5.64 కోట్లు చింతపల్లి సుజనా కన్స్ట్రక్షన్స్ 0.00 శాతం రూ.4.02 కోట్లు మునగాల బీపీఎస్సీ ఇన్ఫ్రా ప్రాజెక్టు 3.75 శాతం రూ.95 లక్షలు నడిగూడెం సత్యనారాయణస్టోన్ అండ్క్రషర్స్ 4.99 శాతం రూ.2.24 కోట్లు నార్కట్‌పల్లి చల్లా ఇన్ఫ్రా ప్రాజెక్టు 0.8 శాతం రూ.4.71 కోట్లు పెన్‌పహాడ్ ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ 0.00శాతం రూ.92 లక్షలు ఆత్మకూరు(ఎస్) ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ 0 శాతం రూ.1.82 కోట్లు అర్వపల్లి బీపీఎస్సీ ఇన్ ఫ్రా ప్రాజెక్టు 3.14 శాతం రూ.2.85 కోట్లు మోత్కూరు జీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ 4.59 శాతం రూ.3.56 కోట్లు -
141 మద్యం షాపులు కేటాయింపు
29 షాపులకు సింగిల్ టెండర్లు దరఖాస్తులు రాని షాపులు 31 కలెక్టరేట్లో కోలాహలం కలెక్టరేట్(మచిలీపట్నం) : మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 141 మద్యం షాపులను కేటాయించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు, ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ జి జోసఫ్, అసిస్టెంట్ కమిషనర్ బాబుజీరావు, మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి.మురళీధర్, బందరు ఆర్డీవో పి.సాయిబాబు, ఏఈఎస్ ఎం.సునీతల పర్యవేక్షణలో సోమవారం లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. మచిలీపట్నం ఎక్సైజ్ ఈఎస్ పరిధిలో మొత్తం 173 షాపులు ఉండగా వీటిలో 31 మద్యం షాపులకు దరఖాస్తులు రాలేదు. 29 మద్యం దుకాణాలకు సింగిల్ దరఖాస్తులొచ్చాయి. ఈ మద్యం షాపుల కేటాయింపు జూన్ 28వ తేదీన జరగాల్సి ఉండగా హైకోర్టు ఉత్తర్వుల కారణంగా వాయిదా పడింది. హైకోర్టు సూచనల మేరకు అధికారులు మచిలీపట్నంలోని 15వ వార్డులోని 7వ నంబరు షాపు కేటాయింపు నిలిపివేశారు. తొలుత దరఖాస్తులు భద్రపరిచిన బాక్సుల సీళ్లను అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో తెరిచారు. ఆయా షాపులకు వచ్చిన దరఖాస్తులను వేరు చేసి కట్టలు కట్టారు. 29 షాపులకు సింగిల్ దరఖాస్తులొచ్చాయి. దీంతో వాటిని దరఖాస్తుదారులకు కేటాయించారు. అనంతరం మిగిలిన మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించారు. వరుస క్రమంలో ఆయా ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాల వారీగా షాపులను కేటాయించారు. మచిలీపట్నం 4వ నంబరు షాపు లాటరీ సమయంలో ఇద్దరు దరఖాస్తుదారులు బదులు వేరే వ్యక్తి హాజరుకావడంతో విషయాన్ని గమనించిన అధికారులు అతన్ని బయటకు పంపి ఆ దరఖాస్తులను తొలగించారు. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో అత్యధికంగా గన్నవరం మండలం పెదఅవుటపల్లి షాపునకు 71 దరఖాస్తులు దాఖలయ్యాయి. మచిలీపట్నంలోని బైపాస్‌రోడ్డులో ఉన్న షాపునకు 50 దరఖాస్తులు వచ్చాయి. షాపును దక్కించుకున్న దరఖాస్తుదారులు వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక కౌంటరును ఏర్పాటు చేశారు. డీఎస్పీ కెవి.శ్రీనివాసరావు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు.