చెరువులకు లెస్ రహదారులకు ప్లస్
నల్లగొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చెరువుల పున రుద్ధరణ (మిషన్ కాకతీయ) పనులకు తీవ్ర పోటీ ఏర్పడింది. చాలాకాలం తర్వాత రహదారులు, చెరువుల పనులకు మోక్షం లభించడంతో కాంట్రాక్టర్లు సంబరపడ్డారు. అయితే రహదారుల పనులు దక్కించుకోవడంలో కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి సింగిల్ టెండర్లు దాఖలు చేశారు. అదే మిషన్ కాకతీయ విషయానికొస్తే కాంట్రాక్టర్లు పోటాపోటీగా టెండర్లు వేశారు. దీంతో చెరువుల పునరుద్ధరణ పనులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పనుల నాణ్యత సంబంధించి రాజీపడే ప్రసక్తే లేదని ఓ వైపు ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతూనే ఉంది. కానీ మరోవైపు స్థానిక రాజకీయ నాయకులు పోటీపడి మరీ బినామీ వ్యక్తులతో తక్కువ రేట్లకు టెండర్లు వేయించారు. ఇదిలాఉంటే పంచాయతీరాజ్ (పీఆర్), ఆర్ అండ్‌బీ పనులకు మాత్రం సింగిల్ టెండర్లు దాఖలయ్యాయి. పీఆర్ పనుల్లో కాంట్రాక్టర్ల మధ్య సయోధ్య కుదరగా...కొన్ని పనులకు ఎక్కువ (ఎక్సెస్) రేట్లను కూడా కోడ్ చేశారు. ఆర్‌అండ్‌బీ అధికారులు పనుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు పనుల వివ రాలు బయటకు పొక్కనీయకుండా అధికారులు జాగ్రత్తపడినట్లు తెలిసింది.
లెస్..లెస్..లెస్...
చెరువుల పునరుద్ధరణలో భాగంగా తొలి విడత జిల్లాలో 952 చెరువులు ఎంపిక చేశారు. దీంట్లో 119 చెరువుల్లో నీళ్లు ఉండడంతో వాటిని మినహాయించి మిగిలిన 833 చెరువులకు ప్రతిపాదనలు రూపొం దించి ప్రభుత్వానికి పంపారు. 609 చెరువుల పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటిలో 469 చెరువుల పనులకు టెండర్లు పిలిచారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.177 కోట్లు. ఈ మొత్తం 469 చెరువుల్లో 352 చెరువుల పనులు రూ.50 లక్షల లోపు అంచనా వ్యయంతో ఉన్నవి. ఈ చెరువుల పనులకే ఎక్కువ పో టీ ఎదురైంది. ఒక్కో చెరువుకు 6 నుంచి 14 మంది వరకు టెండర్లు వేశారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండరు కావడంతో పనులు ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో 18 నుంచి 20 శాతం వరకు తక్కువ (లెస్) రే ట్లు కోడ్ చేశారు. ఇక రూ.50 లక్షల పైబడి ఉన్న 117 పనులకు కాంట్రాక్టర్లు సిండి కేట్ అయినట్లు తెలుస్తోంది. ఒక్కో పనికి ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే టెండర్లు వేశారు. 2-3 శాతానికే తక్కువ రేట్లు కోడ్ చేశారు. నల్లగొండ డివిజన్ పరిధిలో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి ఎక్సెస్ రేట్లను కూడా కోడ్ చేసినట్లు తెలిసింది.
పనులు ఎలా సాధ్యం..?
చెరువు పనులకు ప్రభుత్వం నిర్ధారించిన ధరలు మాత్రం లాభదాయకంగా లేవని అధికారులు చెబుతున్నారు. మిషన్ సహాయంతో చెరువుల్లో మట్టి తవ్వేందుకు మాత్రమే ధర నిర్ణయించారు. కానీ తవ్విన మట్టిన త రలించేందుకు ధర నిర్ణయించలేదు. ఈ మట్టిని వ్యవసాయ భూముల్లో చల్లేందుకు రైతులే స్వచ్ఛందంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం పేర్కొంది. కానీ రైతులు ముందుకు వచ్చినా కూలీలకు డబ్బులు ఎవరు చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకం. ఇక పనులు జరుగుతున్న తీరును ఎప్పటిక ప్పుడు ఫొటోల తీసి ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి అప్‌లోడ్ చేయాలి. నాణ్యతలో రాజీపడకుండా పనులు జరగాలని ప్రభుత్వం చెబుతుంది కానీ..కాంట్రాక్టర్లు ఇంత భారీ స్థాయిలో లెస్‌లకు వెళ్లారు కాబట్టి పనులు చేయడం సాధ్యం కాదని అధికారులే అంటుండడం గమనార్హం.
పీఆర్ కాంట్రాక్టర్లదే గుత్తాధిపత్యం...
పంచాయతీరాజ్ శాఖ ఎం.ఆర్.ఆర్ (మెయింటెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్) గ్రాంట్ కింద జిల్లాకు 408 పనులు మంజూరు చేసింది. ఈ పనుల అంచనా వ్యయం రూ.207 కోట్లు. ఈ మొత్తం పనులను 59 ప్యాకేజీలు చేసి టెండర్లు పిలిచారు. గతేడాది నవంబర్‌లోనే టెండర్లు పిలవాల్సి ఉన్నప్పటికి కాంట్రాక్టర్లకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు సాగిన నేపథ్యంలో ఫిబ్రవరి వరకు టెండర్ల ప్రక్రియ కొనసాగించాల్సి వచ్చింది. ఈ పనులన్నీ హాట్ మిక్స్ ప్లాంట్ ఉన్న కాంట్రాక్టర్లు మాత్రమే చేపట్టాల్సి ఉండటంతో పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్ల మధ్య పోటీ లేకుండా పోయింది. జిల్లాలో హాట్ మిక్స్ ప్లాంట్ ఉన్న కాంట్రాక్టర్లు 38 మంది ఉన్నారు. దీంతో ఈ 38 కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు చెందిన కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి ఎవరి పరిధిలోకి వచ్చే పనులకు మరొకరిని రానివ్వకుండా సింగిల్ టెండర్లు వేశారు. నిబంధనల ప్రకారం ఎక్కువ రేట్లు కోడ్ చేస్తే టెండర్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధార ణ రేట్ల ప్రకారం తక్కువ మోతాదులో ధరలు కోడ్ చేశారు. 0.01 శాతం నుంచి 6.66 శాతం వరకు లెస్ కోడ్ చేసి పనులు దక్కించుకున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న పనులకు మాత్రం ఎక్సెస్ రేట్లు కోడ్ చేశారు.
ఇప్పటి వరకు 353 పనుల టెండర్లు పూర్తయ్యాయి. ఈ పనుల అంచనా వ్యయం రూ.184 కోట్లు. ఒకటి, రెండు ప్యాకేజీలు మినహా మిగిలిన వాటికి ఒకటే టెండరు దాఖలు కావడాన్ని బట్టి పరిశీలిస్తే...బడా కాంట్రాక్టర్లతో ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే టెండర్లు నోటిఫికేషన్ వెలువడగానే కాంట్రాక్టర్లు తొలుత ముందుకు రాలేదు. ఆ తర్వాత కన్‌స్ట్రక్షన్ సంస్థలను చర్చలకు రప్పించి..వారిని మెప్పించిన తర్వాతే టెండర్లు ప్రక్రియ వేగం పుంజుకుంది. నవంబర్‌లో టెండర్లు పూర్తయి డిసెంబర్‌లో పనులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికి ఇప్పటి వరకు ఇంకా టెండర్లు ప్రక్రియ కొనసాగుతుందంటే కాంట్రాక్టర్ల ప్రభావం ప్రభుత్వంపై బలంగానే పనిచేసినట్లు స్పష్టమవుతోంది. మిషన్ కాకతీయ పనుల్లో లెస్‌లు కోడ్ చేస్తుంటే...రహదారుల పనుల్లో మాత్రం కాంట్రాక్టర్లు సిండికేట్ కావడం...ఎక్సెస్ రేట్లు కోడ్ చేయడం...దానికి ప్రభుత్వం అండదండలు ఉండటం గమనార్హం.
ఎక్సెస్ రేట్లతో పనులు దక్కించుకున్న సంస్థలు...
మండలం కన్‌స్ట్రక్షన్ సంస్థ కోడ్ చేసింది పనివిలువ
గుండాల జీఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ 4.59 శాతం రూ. 3.23 కోట్లు
మోతె ఎస్‌కేఆర్ కన్‌స్ట్రక్షన్స్ 4.59 శాతం రూ. 5.64 కోట్లు
చింతపల్లి సుజనా కన్‌స్ట్రక్షన్స్ 0.00 శాతం రూ.4.02 కోట్లు
మునగాల బీపీఎస్సీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు 3.75 శాతం రూ.95 లక్షలు
నడిగూడెం సత్యనారాయణస్టోన్ అండ్‌క్రషర్స్ 4.99 శాతం రూ.2.24 కోట్లు
నార్కట్‌పల్లి చల్లా ఇన్‌ఫ్రా ప్రాజెక్టు 0.8 శాతం రూ.4.71 కోట్లు
పెన్‌పహాడ్ ఎస్‌కేఆర్ కన్‌స్ట్రక్షన్స్ 0.00శాతం రూ.92 లక్షలు
ఆత్మకూరు(ఎస్) ఎస్‌కేఆర్ కన్‌స్ట్రక్షన్స్ 0 శాతం రూ.1.82 కోట్లు
అర్వపల్లి బీపీఎస్సీ ఇన్ ఫ్రా ప్రాజెక్టు 3.14 శాతం రూ.2.85 కోట్లు
మోత్కూరు జీఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ 4.59 శాతం రూ.3.56 కోట్లు