ఎన్‌ఐసీఎస్‌లో ఎంపానెల్ అయిన సంస్థలకే అప్పజెప్పాలన్న నిబంధన
అస్మదీయ కన్సల్టెన్సీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై గుత్తాధిపత్యం
కన్సల్టెన్సీల ఎంపిక మార్గదర్శకాల ముసుగులో కుట్ర
అందులో ఉన్నవి నాలుగు ఐటీ ఆధారిత సేవల సంస్థలే ఏ శాఖ అయినా.. ఏ పనికైనా వాటి సేవలను పొందాల్సిందే కొత్త మద్యం విధానం సహా అన్నింటికీ అవే వీటిద్వారా దోపిడీకి రాచబాట వేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ కోసం అధికారిక సిండికేట్‌కు తెరతీసింది. అస్మదీయ కన్సల్టెన్సీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై గుత్తాధిపత్యం కట్టబెట్టింది. టెండర్లు లేకుండానే ఏకపక్షంగా కన్సల్టెన్సీల నియామకానికి విధివిధానాలను ఖరారు చేసింది. ఇప్పటికే కొత్త మద్యం విధానం రూపకల్పనకు ఏకపక్షంగా కన్సల్టెన్సీ నియామకం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అన్ని శాఖలకూ వర్తింపజేస్తూ ఏకీకృత దోపిడీ వ్యవస్థను రూపొందిస్తోంది.
వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కన్సల్టెన్సీల నియామకానికి మార్గదర్శకాలతో ఇటీవల జారీ చేసిన జీవో–86 ప్రభుత్వ పెద్దల దోపిడీ పన్నాగానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వ శాఖలు ఏవైనా ప్రాజెక్టులు, ప్రొక్యూర్‌మెంట్, కొత్త విధానం, మాస్టర్‌ప్లాన్ రూపకల్పన, సాంకేతిక సేవలు, పౌర సేవలు వంటి వాటి కోసం కన్సల్టెన్సీల నియామకంలో పారదర్శక టెండర్లకు ఈ జీవో ద్వారా ప్రభుత్వం దారులు దాదాపుగా మూసివేసింది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సర్విసెస్ (ఎన్‌ఐసీఎస్‌ఐ)లో ఎంపానల్ అయిన కన్సల్టెన్సీలనే ఎంపిక చేయాలని షరతు విధించింది.
ఎన్‌ఐసీఎస్‌ఐ జాబితాలో ఈ అండ్ వై, కేపీఎంజీ, డెలాయిట్, పీడబ్ల్యూసీ అనే నాలుగు కంపెనీలే ఉన్నాయి. ఏ శాఖ అయినా ఈ సంస్థలకు తమ ప్రాజెక్టుకు అర్హత లేదని భావిస్తే టెండర్ల కోసం ప్రభుత్వ అనుమతి కోరాలి. అయితే, అసలు టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకే వీల్లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే.. ఏ శాఖ అయినా టెండర్లు పిలుస్తామని కోరినా ప్రభుత్వం తిరస్కరిస్తుందనే సంకేతాలిచ్చింది. మరోపక్క వివిధ శాఖలకు సేవలందిస్తున్న కన్సల్టెన్సీలను తక్షణం వైదొలగాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా అన్ని శాఖలు ఈ నాలుగు కంపెనీలతోనే సేవలు పొందేలా రాచబాట వేసింది.
పారదర్శకతకు పాతర
ఈ నాలుగూ ప్రధానంగా ఐటీ కంపెనీలు. ఐటీ ఆధారిత సేవలను మాత్రమే అందించగలవు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎక్సైజ్, పర్యాటక, పట్టణాభివృద్ధి, వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, వైద్యం.. ఇలా అన్ని శాఖల కన్సల్టెన్సీ సేవలను వీటికే కట్టబెట్టాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక శాఖ 2021లో జారీ చేసిన ప్రొక్యూర్‌మెంట్–ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే కన్సల్టెన్సీలకు సాంకేతిక అర్హతలు 30 శాతం మించకూడదు.
ఆర్థికపరమైన అర్హతలు ఎక్కువ ఉండాలి. బాబు ప్రభుత్వం ఈ నిబంధనను కూడా ఉల్లంఘించి, కన్సల్టెన్సీ సంస్థల సాంకేతిక అర్హతలు 70 శాతం లేదా 60 శాతం ఉండొచ్చని పేర్కొంది. అంటే ఆర్థిక అర్హతలు 30 లేదా 40 శాతం ఉంటే సరిపోతుందని చెప్పింది. సిండికేట్‌లోని నాలుగు కంపెనీలు ఐటీ ఆధారిత సేవల సంస్థలైనందున, వాటికి సాంకేతిక అర్హతలే ఎక్కువ ఉంటాయనే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధన విధించింది.
భారీ దోపిడీకి పక్కా పన్నాగం
ప్రభుత్వ విధానాలు, ప్రాజెక్టుల్లో భారీ దోపిడీకి మార్గం సుగమం చేసేందుకే కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ ఎత్తుగడ వేశారు. ప్రభుత్వ పెద్దలు ముందుగానే తమకు అనుకూలమైన విధివిధానాలను అనధికారికంగా రూపొందిస్తారు. అనంతరం అస్మదీయ కన్సల్టెన్సీ సంస్థను నియమించి, తాము రూపొందించిన విధానాన్నే దాని ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం దానిని ఆమోదిస్తుంది. తద్వారా యథేచ్చగా దోపిడీకి పాల్పడి ప్రజాధనాన్ని కొల్లగొడతారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు దోపిడీ తరహాలోనే..
రాష్ట్ర విభజన అనంతరం 2014–19లో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో దోపిడీకి పన్నిన వ్యూహాన్నే ఇప్పుడు ఏకంగా అన్ని శాఖలకు వర్తింపజేస్తోంది. అప్పట్లో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి ప్రభుత్వ పెద్దలు వేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు స్కెచ్ పెను సంచలనం సృష్టించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఠా ముందుగానే ఓ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను అనధికారికంగా ఖరారు చేసింది.
చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు అప్పటికే భారీగా కొన్న భూములను ఆనుకుని ఆ రోడ్డు నిర్మించేలా అలైన్‌మెంట్ రూపొందించారు. తరువాత ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ రూపకల్పనకు ఓ అస్మదీయ కన్సల్టెన్సీని నియమించారు. తాము రూపొందించిన అలైన్‌మెంట్‌నే ఆ కన్సల్టెన్సీ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు ఆ అలైన్‌మెంట్‌కు అటూ ఇటూ కొన్న భూముల విలువ అమాంతం పెరిగింది. తద్వారా ఏకంగా రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. అదే దోపిడీ విధానాన్ని ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా పన్నిన వ్యూహమే ఈ కన్సల్టెన్సీల సిండికేట్ జీవో అనేది స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment