141 మద్యం షాపులు కేటాయింపు
- 29 షాపులకు సింగిల్ టెండర్లు
- దరఖాస్తులు రాని షాపులు 31
- కలెక్టరేట్‌లో కోలాహలం
కలెక్టరేట్(మచిలీపట్నం) : మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 141 మద్యం షాపులను కేటాయించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు, ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ జి జోసఫ్, అసిస్టెంట్ కమిషనర్ బాబుజీరావు, మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి.మురళీధర్, బందరు ఆర్డీవో పి.సాయిబాబు, ఏఈఎస్ ఎం.సునీతల పర్యవేక్షణలో సోమవారం లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. మచిలీపట్నం ఎక్సైజ్ ఈఎస్ పరిధిలో మొత్తం 173 షాపులు ఉండగా వీటిలో 31 మద్యం షాపులకు దరఖాస్తులు రాలేదు. 29 మద్యం దుకాణాలకు సింగిల్ దరఖాస్తులొచ్చాయి.
ఈ మద్యం షాపుల కేటాయింపు జూన్ 28వ తేదీన జరగాల్సి ఉండగా హైకోర్టు ఉత్తర్వుల కారణంగా వాయిదా పడింది. హైకోర్టు సూచనల మేరకు అధికారులు మచిలీపట్నంలోని 15వ వార్డులోని 7వ నంబరు షాపు కేటాయింపు నిలిపివేశారు. తొలుత దరఖాస్తులు భద్రపరిచిన బాక్సుల సీళ్లను అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో తెరిచారు. ఆయా షాపులకు వచ్చిన దరఖాస్తులను వేరు చేసి కట్టలు కట్టారు. 29 షాపులకు సింగిల్ దరఖాస్తులొచ్చాయి. దీంతో వాటిని దరఖాస్తుదారులకు కేటాయించారు.
అనంతరం మిగిలిన మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించారు. వరుస క్రమంలో ఆయా ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాల వారీగా షాపులను కేటాయించారు. మచిలీపట్నం 4వ నంబరు షాపు లాటరీ సమయంలో ఇద్దరు దరఖాస్తుదారులు బదులు వేరే వ్యక్తి హాజరుకావడంతో విషయాన్ని గమనించిన అధికారులు అతన్ని బయటకు పంపి ఆ దరఖాస్తులను తొలగించారు.
మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో అత్యధికంగా గన్నవరం మండలం పెదఅవుటపల్లి షాపునకు 71 దరఖాస్తులు దాఖలయ్యాయి. మచిలీపట్నంలోని బైపాస్‌రోడ్డులో ఉన్న షాపునకు 50 దరఖాస్తులు వచ్చాయి. షాపును దక్కించుకున్న దరఖాస్తుదారులు వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక కౌంటరును ఏర్పాటు చేశారు. డీఎస్పీ కెవి.శ్రీనివాసరావు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు.