అవినీతి రహదారి | Corruption Highway | Sakshi
Sakshi News home page

అవినీతి రహదారి

Published Fri, Jan 6 2017 10:30 PM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

అవినీతి రహదారి - Sakshi

అవినీతి రహదారి

సాక్షి ప్రతినిధి – నెల్లూరు :  దళిత వాడలకు మౌళిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులను అధికార పార్టీ నేతలు, అధికారులు కలిపి కొల్లగొట్టేందుకు పథకం రచించారు. రూ.40 కోట్ల పనులకు 10 నుంచి 15 శాతం దాకా తక్కువ తో టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉన్నా, అంతా కూడబలుక్కుని 1.45 శాతానికి లోపే సింగిల్‌ టెండర్లు దాఖలయ్యేలా రాజకీయం నడిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.4 నుంచి రూ.4.5 కోట్ల నష్టం వాటిల్లనుంది.  

ఎస్సీ సబ్‌ప్లాన్‌  నిధులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దళిత వాడలకు రోడ్డు సౌకర్యాలు మెరుగు పరచడానికి పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. గత ఏడాది జూన్‌ నెలాఖరులో ఆన్‌లైన్‌ ద్వారా  ఈ పనులకు టెండర్లు పిలిచారు. నిబంధనల ప్రకారం టెండర్ల దాఖలుకు గడువు ముగిసిన చివరి రోజే టెక్నికల్‌ బిడ్‌ తెరవాల్సి వుంది. అయితే ఏ పని ఎవరికి దక్కాలనే   విషయం  అధికార పార్టీ  ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు అధికారులకు ముందే ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఎలా మార్చుకున్నా, రూల్స్‌ ఎలా ఉన్నా తాము చెప్పిన వారికే పనులు దక్కాలని గట్టిగా చెప్పారు. అధికారులు ఇదే అదనుగా తీసుకుని స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా నెరవేర్చుకునేలా టెండర్లలో రింగ్‌ లీడర్ల పాత్ర పోషించారు.

పోటీకి వస్తారని ఊహించిన కాంట్రాక్టర్లకు అధికారులే ఫోన్లు చేసి ఇది ఫలానా నాయకుడికి కేటాయించిన పననీ, పోటీగా టెండర్‌ దక్కించుకున్నా పని ఎలా  చేయగలుగుతారని పరోక్షంగా బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మధ్యస్థాలను ఖాతరు చేయకుండా  కొన్ని పనులకు ఎక్కువ మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. ఈ విషయం తెలిసి అధికారులు కంగుతిన్నారు. ఏదో ఒక కారణం చూపి తమకు గిట్టని వారిని అనర్హులుగా చేయడానికి ఉపాయాలు వెదికారు. ఇందుకోసం అనేక రాయబారాలు నడిపి నెలన్నర తర్వాత  టెక్నికల్‌ బిడ్‌ తెరిచారు. ఇందులో కూడా అర్హులైన వారిని తప్పించడానికి వారితో రాజీ బేరాలు మాట్లాడినట్లు కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెబుతున్నారు. వీటికి తలవంచని కాంట్రాక్టర్లను తప్పించడం కోసం æ మరో నెల పాటు ప్రైస్‌ బిడ్‌ తెరవకుండా రాజకీయం నడిపారు.  కాంట్రాక్టర్‌ ఆన్‌లైన్‌లో ఈ ఏంఐ చెల్లించకుండా డీడీ తీశారని, తాను చేస్తున్న ఇతర పనుల వివరాలు పొందుపరచలేదని, డిక్లరేషన్‌ లేదనే రకరకాల కారణాలతో చాలా మందిని తప్పించారు.

అన్నీ సెటిల్‌మెంట్‌ లెస్‌లే
► ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల కింద పిలిచిన ఈ పనుల్లో  కాంట్రాక్టర్‌ లాభం కూడా కలిపి పనుల అంచనా రూపొందిస్తారు. అందువల్ల ఈ పనులకు ఎక్కువతో టెండర్లు దాఖలు చేయడానికి వీలులేదు. దీంతో గతంలో ఈ తరహా పనులకు 10 నుంచి 15 శాతం తక్కువతో టెండర్లు దాఖలయ్యేవి. అయితే అధికారులు ఈ సారి మాత్రం కాంట్రాక్టర్లతో కూడబలుక్కుని ప్రతి పనికీ 1.45 శాతం లోపే తక్కువతో సింగిల్‌  టెండర్లే నిలిచేలా మంత్రాంగం చేశారు. నిబంధనల ప్రకారం సింగిల్‌ టెండర్‌ నిలిస్తే తిరిగి టెండర్లు పిలవాలనే నిబంధనలను ఈ పనుల వ్యవహారంలో అటకెక్కించారు.
► సింగిల్‌ టెండర్‌ను ఆమోదింపచేసే ఉద్దేశంతో పంచాయతీ రాజ్‌ శాఖలోని   జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులు చూస్తున్న చీఫ్‌ ఇంజనీర్‌కు ఫైలు పంపారు. తక్కువ ధరతో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు టీడీపీ ఇన్‌చార్జ్‌లు చెప్పిన వారు కాకపోతే ఆ పనులు రద్దు చేయాలని సీఈకి సిఫారసు చేశారు. తమను అనర్హులుగా చూపి  టెండర్లు రద్దు చేయడానికి అధికారులు చేసిన ప్రయత్నాలపై ఇద్దరు కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు.  ఈ టెండర్ల వ్యవహారంపై కొందరు కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. ప్రతి పనికీ 1.45 శాతంలోపే తక్కువతో టెండర్లు దాఖలైన వ్యవహారం చూసి విజిలెన్స్‌ అధికారులు ఆశ్చర్య పోతున్నారు.
ఇవీ పనులు
► విడవలూరు మండలం చౌకచర్ల నుంచి దంపూరు మీదుగా రామతీర్థం వరకు రోడ్డు నిర్మాణం. అంచనా వ్యయం రూ.2 కోట్లు.  27–6–2016న టెండర్లు పిలిచారు. 19–9–2016న టెక్నికల్‌ బిడ్‌ తెరిచారు.  14–10–2016వ తేదీ ప్రైస్‌ బిడ్‌ తెరిచారు. 1.45 శాతం తక్కువతో సింగిల్‌ టెండర్‌ దాఖలైన భవాని కన్‌స్ట్రక్షన్స్‌కు పని అప్పగించేలా ప్రతిపాదన చేశారు.
► సైదాపురం  మండలం అన్నమరాజుపల్లి నుంచి వేముల చేడు దాకా మెటల్‌ రోడ్డు నిర్మాణానికి రూ.1.66 కోట్లతో 27–6–2016వ తేదీ టెండర్లు పిలిచారు.  12–8–2016వ తేదీ టెక్నికల్‌ బిడ్డు,  7–10–2016న ప్రైస్‌ బిడ్‌ తెరిచారు. 0.1 శాతం తక్కువతో సింగిల్‌ టెండర్‌ దాఖలు చేసిన వి.పి.రెడ్డికి పని అప్పగించడానికి ప్రతిపాదనలు పంపారు.
► డక్కిలి మండలం దగ్గవోలు ఆర్‌ అండ్‌ బీ రోడ్డు నుంచి పాతనలపాడు ఎస్సీ కాలనీ దాకా రోడ్డు నిర్మాణానికి రూ 1.89 కోట్లతో 27–6–2016వ తేదీ టెండర్లు పిలిచారు. 12–8–2016వ తేదీ టెక్నికల్‌ బిడ్, 3–10–2016వ తేదీ ప్రైస్‌ బిడ్‌ తెరిచారు. 0.45 శాతం తక్కువతో టెండర్‌ దాఖలు చేసిన వి.పి.రెడ్డికి పని అప్పగించడానికి ప్రతిపాదించారు.
► ఏర్పేడు– గూడూరు ఆర్‌ అండ్‌బీ రోడ్డు నుంచి నాయుడుపేట  మాటుమడుగు మీదుగా రాపూరు రోడ్డు వరకు రూ.3.40 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి 27–6–2016న టెండర్లు పిలిచారు. 12–8–2016న టెక్నికల్‌ బిడ్, 7–10–2016న ప్రైస్‌ బిడ్‌ తెరిచారు. 1.17 శాతం తక్కువతో సింగిల్‌ టెండర్‌ దాఖలు చేసిన ఎస్‌ ఎస్‌ ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు పని అప్పగించడానికి ప్రతిపాదించారు.
► గూడూరు ప్యాకేజీ కింద గొల్లపాలెం పంచాయతీ రాజ్‌ రోడ్డు నుంచి కోటిగుంటకు బీటీ సర్ఫేస్‌ రోడ్డు నిర్మాణానికి రూ.34 లక్షలు, నిడిగుర్తి నుంచి చిన్నతోట ఆర్‌ అండ్‌బీ రోడ్డు దాకా బీటీ సర్ఫేస్‌ రోడ్డు నిర్మాణానికి రూ 1.03 కోట్లతో  27–6–2016వ తేదీ టెండర్లు పిలిచారు. 7–9–2016న టెక్నికల్‌ బిడ్, 7–10–2016వ తేదీ ప్రైస్‌ బిడ్‌ తెరిచారు. 0.63 శాతం తక్కువతో సింగిల్‌ టెండర్‌ దాఖలైన ఎం.సెంథిల్‌ కుమార్‌ అనే కాంట్రాక్టరుకు ఈ పని అప్పగించే ఆలోచనతో సీఈకి ప్రతిపాదనలు పంపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement